Wednesday, January 27, 2010

ఎంత హాయి...ఎంత మధురం...టీ.వీ.లేని జీవితం

కాస్తో కూస్తో చదువుకుని...ఆలోచనా శక్తి ఉండి...పిల్లల భవిత మీద భయమున్న మధ్య తరగతి తల్లిదండ్రులను ఈ మధ్య ఒక పెద్ద ప్రశ్న వేధిస్తున్నది. ఆ ప్రశ్న: అసలు ఈ కేబుల్ టీ.వీ.కనెక్షన్ అవసరమా?

ఒక పదిహేను రోజుల పాటు టీ.వీ.ఛానెల్స్ కు సెలవు ఇప్పించాలని లోక్ సత్తా అధినేత జే.పీ.గారు ప్రకటించడం... అది నిజంగా మంచి పని అని నేను కలిసిన, నాకు తెలిసిన వారిలో 90% మంది అనడంతో నేను ఆలోచనలో పడ్డాను. ఇన్నాళ్ళు "information is power" అని అనుకున్నవాడిని కాస్తా...అసలు టీవీ లేని జీవితం ఎలా వుంటుందో పరీక్షించదలుచుకున్నాను. సంక్రాంతి కి మా ఊరు వెళ్ళినప్పుడు టీవీ అవాయిడ్ చేసాక...మనం కూడా టీవీ లేకుండా బతక వచ్చని కొద్దిగా అవగతం అయ్యింది. 


ఈ లోగా...హైదరాబాద్ లో మా ఇంటి పక్క గుజరాతీ ఫ్యామిలీ ఇల్లు ఖాళీ చేసింది. కేబుల్ వాడు...వాళ్ళ టీ.వీ.కనెక్షన్ కట్ చేయబోయి మా కనక్షన్ తీసిపారేసాడు. నేను వెళ్లి చెబితే...కేబుల్ కనెక్షన్ వెంటనే ఇస్తారు...కానీ...మరి కొన్ని రోజులు టీ.వీ.లేకుండా బతికి చూద్దాం...అని గమ్మున కూర్చున్నాను. ఈ ధోరణిపై మొదటిరోజు ఇంట్లో కొద్దిగా అప్రకటిత నిరసన ఎదురైనా...పరిస్థితి అదుపులోనే ఉంది. ఇవ్వాల్టికి టీ.వీ.లేకుండా మూడో రోజు. ఆ ఆదివారం ఆలుగడ్డలు తరుగుతూ..'కలర్స్' ఛానల్ లో 'గజని' సినిమా పాక్షికంగా చూడడమే ఆఖరు. 


టీ.వీ.లేకపోవడం వల్ల పగలంతా...ఎంతో టైం దొరుకుతున్నది. సాయంత్రం కుటుంబంతో కూర్చుని నాలుగు మాటలు...మంచీ చెడూ మాట్లాడుకునే అవకాశం కలుగుతున్నది. బుర్ర కూడా ఫ్రెష్ గా అనిపించింది. గతంలో ఆ పిచ్చి క్రికెట్ టెస్ట్ మ్యాచ్ కూడా వీలు దొరికినప్పుడల్లా చూసి టైం ఆగం చేసుకునే వాడిని. ఇప్పుడు ఆ టైం వేరే పనులకో, వాకింగ్ కో బదలాయించాను.


జనవరి 26 న రోజంతా...హాయిగా...టీ.టీ.అకాడమిలో స్కూల్ పిల్లల టేబుల్ టెన్నిస్ మ్యాచులు చూస్తూ గడిపాను. ఆ రోజు గుమ్మడి గారు చనిపోయారని ఈ ఉదయం పేపర్స్ లో చూసే దాక తెలియలేదు. అదొక్కటి మినహా...మనం చూడకపోతే...కొంపలు కాలిపోయే వార్తలు ఏమీ లేవు- మనకున్న ఈ డజను ఛానెల్స్ లో. ఇది ప్రాథమిక అవగాహన, అభిప్రాయం మాత్రమే సుమా!
"నేను కావాలనే ఇంట్లో టీ.వీ.లేకుండా చేశా. మేము చాలా హాయిగా బతుకుతున్నాం. ఎందుకండీ...ప్రపంచంలో బాధలన్నీ అప్పటికప్పుడు తెలుసుకుని  బీ.పీ. పెంచుకోవడం," అని మా అబ్బాయితో కలిసి టీ.టీ. ఆడే విష్ణు ఫాదర్ రావు గారు ఒక ఐదు నెలల కిందట పిచ్చాపాటీగా చెబితే...ఆశ్చర్య పోయాను. ఇప్పుడు ప్రయోగం మొదలు  పెట్టాను.  


టీ.వీ.చూడకపోవడం వల్ల వచ్చే లాభ నష్టాల లిస్టు ఒకటి తయారు చేస్తున్నాను. అది పోస్ట్ చేసాక దానిపై మంచి చర్చ జరుపుకుందాం. అంతవరకూ సెలవ్.

Tuesday, January 26, 2010

రుగ్మతల గణతంత్రం...మేడిపండు ప్రజాస్వామ్యం

"భారతదేశ ప్రజలమగు మేము..." అని రాసుకున్న రాజ్యాంగం, చేసుకున్న అధిశాసనం అమల్లోకి వచ్చి నేటికి అరవై ఏళ్ళు నిండాయి. "కేవలం ప్రజాభిప్రాయం మాత్రమే సమాజాన్ని పరిశుద్ధంగా, ఆరోగ్యవంతంగా ఉంచుతుంది," అని జాతిపిత మహాత్మా గాంధీ ప్రవచించారు. బ్రిటిష్ వాడి దాస్యంలో మగ్గి వీరోచిత పోరాటం, త్యాగాలతో స్వాతంత్ర్యం సాధించుకున్న మనం..అంటే జనం..నిజంగా దేశం కోసం ఏమి చేస్తున్నాం? 

ఈ ప్రశ్నకు సమాధానం కోసం విశ్లేషణలో భాగంగా ప్రజలను మూడు తరగతులుగా విభజించాను. వారు: 1) బడుగులు 2) ఉద్యోగులు 3) మేథావులు
బడుగుల బతుకు పోరాటం..అరణ్య రోదనే
సమాజ నిర్మితి, ఉన్నతి లో...70 శాతానికి పైగా ఉన్న ఈ తరగతిది కీలక భూమిక. రైతులు, చేతి వృత్తుల వారు, బడుగు బలహీన వర్గాల వారు ...అందరూ ఇందులో భాగస్వాములు. ఏ రాజకీయ పార్టీ కైనా, ఏ ఉద్యమానికైనా వీరే అండాదండా. ఈ గ్రూపును ఆకర్షిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన 'అధికారం' చేతికొస్తుంది. అది బాగా తెలిసిన పాలకులు...వీరికి జోకొట్టడంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. 
ఆదుకునే పేరిట అందించిన...రెండు రూపాయల బియ్యం, ఉచిత కరెంటు, పనికి ఆహారం...గ్రామీణ ఉపాథి హామీ పథకం...వంటి నానా రకాల పేర్లతో ఈ వర్గాలను బుట్టలో వేసుకునే ప్రయత్నం నిరంతరాయంగా జరుగుతుంది. రిజర్వేషన్ తాయిలాలు కూడా అందులో భాగమే. ఈ వర్గానికి మౌలిక వసతులు, సరైన విద్య అందించకుండా రాజకీయ వ్యవస్థ పైపై లేపనాలతో ఉపశమనం కలిగిస్తున్నది. 
ఇందులో సామాజిక వర్గాలు గళమెత్తకుండా ప్రభుత్వాలు ఏర్పాట్లు చేసాయి. రైతు భూమిని నమ్ముకోవడం కన్నా చెడ్డ పని లేదన్నట్లు కొందరు అపోహలు సృష్టించారు. గ్రామం నివాసయోగ్యం కాని ప్రాంతం అన్న చిత్రీకరణ కూడా జరిగింది. అన్ని కులాల మధ్య చిచ్చు రాజుకుంది. మనిషికి ఉండే "ఆధిపత్య భావన" అనే జబ్బును అనుకూలంగా మలుచుకుని నాయకులు ఈ వర్గాలతో ఆడుకుంటున్నారు. ST నేతలు ఇప్పటికీ గొంతు ఎత్తలేని పరిస్థితిలో ఉన్నారు. నేతల ట్రాప్ లో పడి SC లు రెండుగా చీలి రాజకీయుల అడుగులకు మడుగు లొత్తుతున్నారు. అణగారిన ముస్లింల ప్రతినిధులే లేరు. BC ల పరిస్థితి దారుణంగా ఉంది. సో కాల్డ్ అగ్రవర్ణాలలోని నిరు పేదలు అవకాశాలు లేక, చీత్కారానికి గురై కునారిల్లుతున్నారు.  



నిరాస నిస్పృహలతో ఉన్న ఈ వర్గ ప్రజలు ఈ వ్యవస్థలో సమిధలవుతున్నారు. నక్సలైట్ పోరాటంలోగానీ, ఇతరేతర ఏ ఉద్యమంలో గానీ అసువులు బాసేది ఈ బడుగు సామాజిక వర్గానికి చెందిన జనమే. ఆత్మహత్యలు చేసుకునేదీ వీరే. ప్రకృతి అనుకూలించక, ప్రభుత్వం సరిగా ఆదుకోక...కులాలకు అతీతంగా గ్రామాలలో జనం చావలేక బతుకుతున్నారు. 


ఒక పక్క సారా, మరొకపక్క మీడియా (సినిమా, టీ.వీ.)...దేన్నైనా...తేలిగ్గా నమ్మే ఈ బడుగు జనం జీవితాలను ఛిద్రం చేస్తున్నాయి. సారా ప్యాక్, ఒక పచ్చ నోటుతో అందలం ఎక్కేలా అన్ని పార్టీలు పటిష్టమైన వ్యవస్థలను ఏర్పరుచుకుని...మేడి పండు ప్రజాస్వామ్యాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ఇది చూసి మనం చంకలు గుద్దుకుంటూ గడుపుతున్నాం.


ఉద్యోగులకు...చిన్ని నా పొట్ట శ్రీ రామ రక్ష
ఇప్పుడు వ్యవస్థను శాసిస్తున్నది...ఈ వర్గం. బాధ్యతారాహిత్యానికి నిలువెత్తు సాక్షం ఇది. దేశభక్తి దీనికి శూన్యం. అవినీతి దీని మంత్రం. అవకాశం అందుకున్న వాడు, కాలం కలిసి వచ్చిన వాడు ప్రభుత్వ ఉద్యోగి అయ్యాడు. ఇంకాస్త బాగా చదివిన వాడు మంచి ప్రైవేటు జాబ్ కొట్టాడు. ఉదయం ఆఫీసు కు వెళ్లి...సాయంత్రం రావడం...బ్యాంక్ బ్యాలన్సును, పై చదువులకు వెళుతున్న పిల్లలను చూసి మురవడం ఈ వర్గీయుల పని. పోలీసు రౌడీలా  వ్యవహరిస్తాడు. క్లర్కు బల్లకింద చెయ్యి పెడతాడు. టీచర్లు..మనం భావి భారత పౌరులను తయారు చేస్తున్నాం...అన్న ఒక గొప్ప భావంతో పనిచేయరు. ఇలా ఉద్యోగులు వ్యవస్తను యథేచ్ఛగా గుల్ల చేస్తున్నారు. ఇక ప్రైవేటు జాబ్స్ లో జనానికి దేశం పై కన్నా, రెస్టు పై, ఇంకా ఎక్కువ జీతం తెచ్చే మరొక అవకాశంపై మాత్రమే ధ్యాస. పోలింగు రోజు హాలిడే ఇస్తే....ఒక ఆదివారం కలిసివచ్చేలా సెలవు పెట్టి...ఊరికో, విహారానికో వెళ్ళే జనం వీళ్ళు.
 మొదటి వర్గపు ప్రజలు తమ దుర్భర జీవితాలకు విధిని దూషిస్తే...ఈ సెకండ్ గ్రూప్ వారు...తాము ఇంకా సుఖంగా ఉండలేకపోవడానికి ప్రతి రోజు ప్రభుత్వాన్ని తిడుతూ కాలక్షేపం చేస్తుంటారు. సమాజానికి మనం ఏమి చేస్తున్నాం? అని ఒక్క రోజైనా ఆత్మ పరిశీలన చేసుకోకుండా బతికే తరగతి ఇది. ధరలు పెరిగినా...పాలకులు అన్యాయం చేసినా...దేశం గంగలో కలుస్తున్నా...పట్టదు దీనికి.
ఒక రౌడీని, దోచుకునే కాంట్రాక్టర్లను..ఈ తరగతి ఆదరించి అక్కున చేర్చుకుంటుంది. పటాటోపానికి పెద్ద పీట వేస్తుంది. ప్రభుత్వాలు పథకం ప్రకారం అన్ని వ్యవస్థలను  ప్రైవేటీకరిస్తున్నా...ఇది బడుగులను దారుణంగా  దెబ్బతీస్తున్నా...ఈ ఉజ్జోగస్వామ్యం కిమ్మనకుండా కూర్చుంటుంది. వారి జీతలకోసం, పే రివిజన్ల కోసం మాత్రం ఉద్యమిస్తూ...ఇతరుల గురించి పిచ్చాపాటి చర్చలతో కాలక్షేపం చేస్తుంది. మంచిని ప్రోత్సహించకుండా...వ్యవస్థను తిడుతూ కూర్చుంటుంది కానీ...దిద్దుబాటుకు ఉపక్రమించదు.  ఒలంపిక్స్ లో భారత్ కు పతకం రాలేదని గుండెలు బాదుకునే ఈ వర్గం...అందుకోసం చేయాల్సిన పని చేయదు. 


మేథావులు...మేతావులు...నిరాశాజీవులు 
స్వాతంత్రోద్యమ కాలంలో మేథావి వర్గం పాత్ర శ్లాఘనీయమైనది. కానీ..అన్నింటికీ పెదవి విరుస్తూ చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం... విశ్లేషణలతో కాలక్షేపం చేయడం....ఇప్పుడు దీనికి అలవాటుగా మారింది. పాత చింతకాయ పచ్చడి థియరీలు...పిచ్చి లాజిక్కులు...కర్మ సిద్ధాంతాలు వల్లిస్తూ కాలక్షేపం చేయడం ఈ వర్గం పని. సమాజంలో పలుకుబడి కోసం ఈ వర్గం సమాజం పడైపోతున్నాడని సుదీర్ఘ లెక్చర్స్ ఇస్తుంది కానీ...కార్యాచరణకు నడుం కట్టదు. 
సమాజం కోసం ఏదైనా చేయాలన్న విపరీతమైన తపనతో బైటికి వచ్చిన మేథావి మనకు లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ్ ఒక్కరే కనిపిస్తారు. ఆయన ఉద్యమం, పార్టీ...రాజకీయ నేతలు అల్లిన పద్మవ్యూహంలో పడి కుదేలు కాక తప్పలేదు. దేశం గురించి అంతగా బాధపడే ఉజ్జోగులు, మేథావులు ఆయన పార్టీకి ఎందుకు అందలం అందించలేదు? దీని అర్థం...వీరికి నిజమైన దేశభక్తి లేదనేగా?
చట్టాలు చట్టు బండలవుతున్నాయి. పసి పిల్లలు కార్ఖానాలలో ఉన్నారు. స్త్రీకి భద్రతా లేదు. యువత భవితకు భరోసా లేదు. పాశ్చాత్య విసృంఖల సంస్కృతి దేశాన్ని బ్రష్టు పట్టిస్తున్నది. మత మౌడ్యం పెరిగింది. ఇన్ని సమస్యలు ఉన్నా....ఘనత వహించిన కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం ముసుగులో అప్పటి రాచరిక వ్యవస్థను పునర్నిర్మిస్తున్నది. అది సోనియా భజన మండలి అయ్యింది...రేపు రాహుల్ సేవా సంఘంగా మారుతుంది. అన్ని పార్టీలు కుటుంబం, కులం కేంద్రంగా జనాలను మోసం చేస్తుంటే....మేథావులు బాధ్యతతో జన జాగృతికి ఎందుకు ముందుకు రారు?  ఉజ్జోగులు, మేథావులు నిర్లిప్తతతో ఉండబట్టే...కబ్జాకోర్లు, రౌడీలు, రేపిస్టులు, అవినీతిపరులు...చట్ట సభల్లోకి దర్జాగా అడుగుపెడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని నిడు సభలో పరిహసిస్తున్నారు. 


సదాలోచానపరులారా...మనం ఉపక్రమిద్దాం...
ప్రజాస్వామ్యం, గణతంత్రం అని ఘనమైన మాటలు చెప్పుకుంటున్న మనం ఒక సంకట స్థితిలో ఉన్నామన్నది సత్యం. నాలుగు పిల్లర్స్-- Legislature, Executive,Judiciary, Media-- దారుణంగా విఫలమయ్యాయి. చివరి రెండు వ్యవస్థలు మాత్రం మనలో ఆశను కొద్దిగా మిగిల్చాయని కొందరి భావన. మొత్తం మీద ఇప్పుడు ఐదో పిల్లర్ అవసరం ఎంతైనా ఉంది. అది...సమాజ హితం కోరే...సదాలోచానపరుల వర్గం. ఇజాల కంపు, కులం కుళ్ళు, మతం మత్తు, ప్రాంతీయ దురభిమానం, అవినీతి జాడ్యం...వదిలి మనం మన సుందర భారతం కోసం ఉపక్రమిద్దాం. నిజాయితీతో నవ భారతం నిర్మిద్దాం. జై హింద్...హమారా భారత్ మహాన్.

Monday, January 25, 2010

'జెమిని'లో పర్వతనేని కిరణ్ శకం ముగిసిందా?

'జెమిని' ఛానెల్స్ లో గత పదేళ్లుగా చక్రం తిప్పుతున్న పర్వతనేని కిరణ్ ప్రభ క్రమంగా తగ్గిపోతున్నట్లు కనిపిస్తున్నది. జీ-నెట్ వర్క్ నుంచి 'జెమిని' చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ గా సంజయ్ రెడ్డి నియమితులయ్యాక...కిరణ్ ప్రాభవం తగ్గిపోవడం ఆరంభించిందని, కిరణ్ (కింది ఫోటో) కుడి, ఎడమ భుజాల లాంటి సీనియర్లకు కొత్త బాస్ పొగ సెగలు తగులుతున్నాయని సమాచారం. 


లాభార్జనలో దక్షిణ భారత దేశంలోనే ప్రముఖ స్థానంలో ఉన్న 'జెమిని' లో ఈ పరిణామాలు దాదాపు మూడొందల మంది ఉద్యోగులపై ప్రభావం చూపుతున్నాయి. సాత్వికుడిగా పేరున్న సంజయ్ మార్కెట్ పై తనకున్న అవగాహన, పట్టుతో చెన్నై లోని సన్ నెట్ వర్క్ అధిపతుల మనసు చూరగొనడం...కిరణ్ బృందంపై అక్కడి వారిలో తలెత్తిన కొన్ని అనుమానాలు ఈ పరిణామాలకు కారణాలని తెలుస్తున్నది. కిరణ్--జే.కే.మోహన్ ల సన్నిహిత సంబంధాలు, లావాదేవీలు సన్ యాజమాన్యానికి నచ్చకనే కొత్త మార్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తున్నది కానీ ఈ మాట ధ్రువ పడలేదు. 


సన్ నెట్ వర్క్ ఆంధ్రలో నిర్వహిస్తున్న జెమిని ఛానల్, తేజ, జెమిని మ్యూజిక్, జెమిని న్యూస్ లో విజయవాడకు చెందిన పర్వతనేని కిరణ్ హవా ఇన్ని రోజులు కొనసాగింది. ఇప్పటికీ ఆయన మాటే చెల్లుబాటు అవుతున్నట్లు అతని వర్గం భావిస్తున్నది కానీ...అంతర్గతంగా కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. జెమిని న్యూస్ కు 'సాక్షి' ఛానల్ నుంచి ఒక చాకు లాంటి సీనియర్ ను తీసుకు రావాలని సంజయ్ రెడ్డి (ఈ పక్క ఫోటో) కృతనిశ్చయంతో ఉన్నట్లు సమాచారం.

అన్ని ఛానెల్స్ కన్నా హడావుడి లేకుండా...ఉద్యోగులకు కొద్దిపాటి జీతాలు ఇస్తూ జెమిని ఆంధ్రలో బండి లాగిస్తున్నది. సినిమా ల కొనుగోలు, సీరియళ్ళ ఎంపిక లో కిరణ్ మాట వేద వాక్కు గా సాగింది. ఇప్పుడు దీనికి బ్రేక్ పడుతున్నది. 

Sunday, January 24, 2010

ఆలూ వేపుడు సైడ్ డిష్ గా...పండుమిర్చి+ఉల్లిగడ్డ పచ్చడి...

మీడియాకు సంబంధించిన విషయాలు మాత్రమే రాయాలని ఇన్నాళ్ళు అనుకోవడం నా పొరపాటని అర్థం అయ్యింది....సంక్రాంతి టూర్ పోస్టుకు వచ్చిన రెస్పాన్స్ చూశాక. నేను నిక్కర్లు వేసుకోవడం మొదలెట్టకముందు నుంచీ పరిచయం ఉన్న శీనన్న ప్రత్యేకంగా ఫోన్ చేసి సంక్రాంతి పోస్ట్ గురించి మాట్లాడడం ఆనందం ఇచ్చింది. దీంతో యమ ప్రేరణ పొందిన నేను ఇక నుంచి ప్రతి ఆదివారం ఒక టూర్ గురించో, ఫుడ్ గురించో రాయాలని నిశ్చయించుకున్నాను. అందులో భాగమే ఇది.

రోలులో...రోకటితో నూరిన పండుమిరప ప్లస్ ఉల్లిగడ్డ పచ్చడి, దాంట్లో నంచుకోవడానికి మంచిగా వేగిన ఆలుగడ్డ కూరతో లంచ్ అద్దిరిపోయింది. భర్త మరణించిన సంతోషి గైర్హాజరీ లో హేమ ఉదయం నుంచీ ఇంటిపనితో బిజీగా ఉండి ఒంటిగంటకు గానీ అడిగింది....మరి ఫుడ్ ఏంటి? అని. "మన కోసం ఆ పండు మిరప చట్నీ చెయ్యి. పిల్లలకు ఆలుగడ్డ కూర చేద్దాం," అని 'కలర్స్' ఛానల్ లో 'గజని' సినిమా చూస్తూ ఆలుగడ్డలు తరిగి ఇచ్చా.

మా గురూ గారు కం హేమ ఫాదర్ రామకృష్ణయ్య గారు పుట్టపర్తి నుంచి వచ్చిన సందర్భంగా నిన్న వండిన అరటి కాయ పులుసు, వంకాయ పెరుగు పచ్చడి ఆ మినీ శీతల గిడ్డంగి (ఫ్రిడ్జ్) లో దాగి ఉన్న సంగతి గుర్తు ఉండి ఈ ప్రతిపాదన చేశా. నిన్న ఉస్మానియాకు వెళ్లి అక్కడే బాక్స్ లాగించడం వల్ల ఈ రెండు ఐటెంలు మిస్ అయ్యాను. నిజానికి ఫ్రిడ్జ్ అంటే నాకు పరమ మహా ఒళ్ళు మంట...అయినా...అప్పుడప్పుడూ ఇలా నాకు ఇష్టమైన సద్ది బువ్వను కడుపులో చల్లగా దాచి అందిస్తుంది కాబట్టి దాన్ని క్షమించేస్తుంటాను.

ఆదివారం ఏదో ఒక స్పెషల్ ఉంటుందని ఆశపడి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చిన ఫిదెల్ కొద్దిగా విసుగు ముఖం పెట్టినా...మైత్రి ఈ ఆలు గడ్డ కూరతో ధమాల్ అయిపోయింది. నేను కోళ్ళూ, మేకలూ తినే రకమైనా...ఈ పిల్లలు శుద్ధ శాకాహారులు. ఇద్దరూ బైట ఫ్రెండ్స్ దగ్గర చికెన్ ముక్కలు టేస్ట్ చేసినా....నేను కొత్త సంవత్సరం తీర్మానాల్లో భాగంగా శాకాహారిని, మితాహారిని అయిపొయ్యాను. కాకుంటే...ఈ రోజుకు మితాహారానికి మినహాయిపు ఇవ్వక తప్పలేదు...ఈ పండు మిర్చి పచ్చడి వల్ల. అప్పుడెప్పుడో ...ఖైరతాబాద్ లో ఒకడు తోపుడు బండి మీద బాగా ఊరి..ఎర్రగా..రబ్బరు బొమ్మల్లా ఉన్న మిర్చీ అమ్ముతున్నప్పుడు చూసిన క్షణానే ఈ డిష్ లాగించాలని అనిపించింది.


ఇక...అద్భుతంగా పోపు (తాలింపు) పెట్టిన పండు మిరప పచ్చడితో టేబుల్ దగ్గర నా వీర విహారం చూసి నేనే ఆశ్చర్య పోయాను. 'కొద్దిగా...ఈ పచ్చడి కలిపిపెట్టు," అని హేమ అంటే...'ఓహో...మనం కలుపుకుంటున్నతీరు చాలా రోజుల తర్వాత ఈమెకు నచ్చినట్లు ఉంది," అని అనుకున్నా. అప్పుడు మైత్రి చెప్పింది...రెండు రోజుల పని వల్ల అమ్మ అరచేయి మీద బొబ్బ లాంటిది వచ్చిందని. 

మనసు చివుక్కు మన్నా...ఇదే మాంచి అదనుగా నా ప్రతిభను రంగరించి...మిర్చీ పచ్చడి కలిపి...ఆలుగడ్డ కూర మూకుడు (పాత్ర)లో కింది భాగాన చేరుకున్న నూనె కూడా దట్టించి హేమకు కలిపాను. పిల్లలు స్పూన్ తెచ్చే లోపు...ఆమె నోట్లో ఆ పచ్చడి ముద్దలు రెండు పెట్టి పాయింట్లు కొట్టేశే ప్రయత్నం  చేశాను. ఈ సినిమా దృశ్యాన్ని చూసి పిల్లలు వింతగా నవ్వారు.  


మూడు సార్లు ఆ మిర్చీ పచ్చడి (లేదా తొక్కు), ఒక సారి అరటి పులుసు, మరొక సారి వంకాయ పెరుగు పచ్చడి...చివరకు అరటిపండుతో పెరుగన్నం. అలా ముగిసింది మన మధ్యాహన్న భోజనం. భుక్తాయాసంతోనే...ఈ పోస్టు రాస్తున్నా. ఈ తిండికి ప్రతిహారంగా సాయంత్రం మరొక మూడు రౌండ్లు వాకింగ్ చేసి తీరాలని తెర్మానించుకొని సియస్తా (ఒక కునుకు) కోసం ఉపక్రమిస్తున్నాను. హ్యాపీ సండే.

Friday, January 22, 2010

ఇద్దరూ ఇద్దరే....ఛానెల్స్ లో ఒక్కటే సందడే....

ఈ మధ్యకాలంలో తెలుగు ఛానెల్స్ లో ఇద్దరు ప్రముఖుల ఇంటర్వ్యూలు ప్రముఖంగా ప్రసారమవుతున్నాయి. గత వారం రోజులుగా వారు ఏదో ఒక ఛానల్ లో ప్రత్యక్షమవుతూ తమదైన శైలిలో...ఇంటర్వ్యూ చేసే వారికి సమాధానాలు ఇస్తున్నారు. ఇద్దరి విషయంలో ఒక కామన్ అంశం ఏమిటంటే....ఇతరుల నేతలను/ప్రముఖులను వెకిలి ప్రశ్నలు వేసే వీర జర్నలిస్టులు వీరిద్దరిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకుని  జాగ్రత్తగా ప్రశ్నలడుగుతున్నారు. ఇది చెడ్డ పరిణామం అని అనలేం.

ఆ ఇద్దరు ప్రముఖులే...సెన్సేషనల్ దర్శకుడు రాంగోపాల్ వర్మ అలియాస్ రాము, రాయలసీమ బిడ్డ మద్దెలచెరువు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరి. రాము...వచ్చే వారం విడుదలకానున్న 'రణ్' అనే హిందీ సినిమా ప్రమోషన్లో భాగంగా ఇంటర్వ్యూ ల మీద ఇంటర్వ్యూలు ఇస్తుంటే...దశాబ్దానికి పైగా జైల్లో మగ్గి విడుదలైన సందర్భంగా సూరిని దాదాపు అన్ని ఛానెల్స్ ఇంటర్వ్యూ చేస్తున్నాయి.

TV-9 ఇంటర్వ్యూలో రజనీకాంత్ ను రాము ఆడుకుంటే...సూరిని రవి ప్రకాష్ సూటి ప్రశ్నలడిగి జవాబులు రాబట్టారు. రాము ఇంటర్వ్యూలో కాంట్రడిక్షన్  (పరస్పర వైరుధ్యం) కొట్టొచ్చినట్లు కనిపించింది. జనం మీడియాను ఆసహ్యించుకుంటున్న దశలో...ముఖ్యంగా తెలుగు నాట ప్రజలు టీ.వీ.ఛానెల్స్ ను చీదరించుకుంటున్న సమయంలో రాము మీడియాపై దాడి చేస్తూ సందర్భోచితంగా 'రణ్' అనే చిత్రాన్ని తీసాడు. 

"తెలుగు ఛానెల్స్ చూస్తే భయం వేస్తోంది. More scary than my horror films," అని శుక్రవారం రాత్రి i-news కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాము సెలవిచ్చారు.  టీ.వీ. చానెళ్ళు.... చెప్పే విధానం, ప్యాకేజింగ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వంటి వాటి ద్వారా...మీరు ఎలా ఆలోచించాలో అవే (ఛానెల్స్) చెబుతున్నాయని రాము విశ్లేషించారు. తన సినిమాలకు భిన్నంగా ఛానెల్స్ ఏమీ చేయడం లేదుకదా అని అనుకుంటుండగానే...రాము మరికొన్ని ప్రకటనలు గుప్పించారు. "నేను చాలా సార్లు చెప్పాను. నాకు నచ్చిన సబ్జెక్ట్ నా కోసం చేస్తాను. (జనం) చూస్తే చూస్తారు...లేకపోతే లేదు. సామాజిక బాధ్యతను నేను పట్టించుకోను," అని రాము సమాధానాలు చెబుతుంటే...ప్రశ్నలు అడగడానికే i-news జర్నలిస్టు శ్రీనివాస్ చాలా ఇబ్బంది పడ్డారు. దటీజ్ రాంగోపాల్ వర్మ. 
వర్మాజీ, మీరు తెలుగు ఛానెల్స్ చూసి మరీ భయపడకండి. మీరు ఎలా మీకు నచ్చిన సబ్జెక్ట్స్ తీస్తున్నారో...మా చిత్తకార్తె ఛానెల్స్ బూతు, భయానక ప్రోగ్రామ్స్ చేసి జనం మీదికి వదులుతున్నాయి. మనం మనం బరంపురం. మీకు లాగానే మా వాళ్ళకూ "డార్క్ సైడ్ చాలా ఇంట్రెస్ట్."


అన్నింటికన్నా 'సాక్షి ఛానల్' లో 'ప్రియదర్శని' రామ్ రెడ్డి గారు "రాం vs రాం" అనే ప్రోగ్రాంలో రాంగోపాల్ వర్మను చాలా లైవ్లీ ఇంటర్వ్యూ చేసారు. ఎందుకో గానీ...రామ్ రెడ్డి గారి వర్చస్సు, చురుకుదనం చూస్తే...ఆయన వయస్సు సగానికి సగం తగ్గి నవ యువకుడిగా కనిపించారీ ప్రత్యేక ఇంటర్వ్యూ లో. 

మరది నటనో...మారిన వ్యక్తిత్వమో కానీ సూరి చాలా సుద్దులు చెబుతున్నారు టీ.వీ. ఇంటర్వ్యూ లలో. "ఈ పాడు జైలు జీవితం పగవాడికి కూడా వద్దు. నా శత్రువులు సైతం దాక్కోకుండా...బైటికి వచ్చి భార్య బిడ్డలతో సుఖంగా ఉండాలి," అని ఆయన చల్లని పలుకులు పలుకుతున్నారు. జైలు జీవితంపై ప్రశ్న వేస్తేనే....సూరి భయపడుతున్నట్లు కనిపించింది.
తాను ఎలా ఫ్యాక్షన్ లోకి ప్రవేశించిందీ..ఇప్పుడు ఎంత మారిందీ ఆయన చెబుతున్నారు. పరిటాల రవి హత్యలో తన ప్రమేయం లేదని, జైల్లో సెల్ ఫోన్లు అస్సలు వాడలేదని, ఓం ప్రకాష్ సంచలనం కోసమే మొద్దు సీనును చంపి ఉంటాడని, పెద్దాయన (వై.ఎస్.ఆర్.) అంటే తనకు చాలా అభిమానమని....సూరి చెప్పుకొస్తున్నారు. 

సూరి నిజంగానే హత్యా రాజకీయాలకు దూరం జరిగి ప్రశాంత జీవితం గడిపితే రాష్ట్రానికి ఎంతో మేలు. అన్నట్లు ఈ హత్యల మీద...మన సంచలన దర్శకుడు 'రక్త చరిత్ర' అనే సినిమా తీస్తున్నారు. అది విడులైతే...సూరి జీవితంలో మనకు తెలియని మరికొన్ని కోణాలు తెలిసే అవకాశం ఉంది.

Thursday, January 21, 2010

ఇది ఒక సంతోషికి సారా మిగిల్చిన వ్యధ... సారో కథ

ఆమె పేరు సంతోషి. పేరుకు తగినట్లు నవ్వుతుండే మొహం ఆమెది. ఆమెకు ఈ రోజు పుట్టెడు దుఃఖం కలిగింది. సంతోషి భర్త ఎప్పట్లాగానే నిన్న రాత్రి దోస్తులతో కలిసి తాగడానికి వెళ్ళాడట. పొద్దున్నే శవమై కనిపించాడు. నిండా 35 సంవత్సరాలు లేని ఆమె ఇళ్ళలో పనిచేస్తూ ఇప్పటికే ఐదుగురు పిల్లలను పోషిస్తున్నది. నిత్యం సాధించి...వేధించే తాగుబోతు భర్త ఉన్నా లేనట్లే...అనిపిస్తుంది కానీ...సమాజంలో రక్షణ కోసం ఒక మగతోడు కావాలని సగటు స్త్రీ కోరుకుంటుంది కదా!

"అయ్యా...రాత్రి పోయిండు. దోస్తులే కొట్టి చంపారు," అని ఏడుస్తూ దీనంగా ఉదయాన్నే ఫోన్ చేసింది...సంతోషి. సమస్యలు ఉన్నప్పుడు ఏడుస్తూ కూర్చోవడం కాదు...కష్టపడి అధిగమించాలన్న జీవన సత్యాన్ని నిత్యం మాకు అందరికీ నేర్పేది ఆ పిచ్చి తల్లి. మా ఇంట్లో పని చేస్తుందామె.  
 సంతోషి భర్తను సంస్కరించాలని గతంలో నేను చేసిన ఒక ప్రయత్నం గుర్తుకు వచ్చింది. ఒక రోజు అతన్ని పిలిపించి...ఆరు నెలల పాత పేపర్లు ఇచ్చి...అమ్ముకు రమ్మన్నాను. అమ్ముకొస్తే...ఆ డబ్బు తనకే ఇచ్చి...'తాగుడు మాను బాబూ.." అని హితబోధ చేద్దామన్నది నా ప్లాన్. ఆ రోజు పేపర్లు కట్టకడుతున్నప్పుడు, తీసుకెడుతున్నప్పుడు చూసాను అతన్ని. అప్పటి నుంచి మళ్ళా కనిపించలేదు. 


"అమ్మా...సార్ పేపర్ల కట్ట ఇస్తే..ఒక ఎనిమిదొందల దాకా వచ్చింది. మొత్తం తాగుడుకు పెట్టాడు," అని సంతోషి చెప్పింది హేమకు. ఒక రెండు సార్లు తాగి కింద పడి దెబ్బలు తగిలించుకుంటే...ఆమె ఆసుపత్రిలో చేర్పించి సపర్యలు చేసింది. ఏ పని చేయకుండా....చిన్నా చితకా పని చేసినా...ఒక పైసా ఇంట్లో ఇవ్వకుండా...తాగి సంసారాలు గుల్ల చేసే వారు అడుగడుగునా ఉన్నారు. ఈ సారా మహమ్మారిపై మాత్రం ఇప్పుడు జరుగుతున్న స్థాయి ఉద్యమాలు రావడం లేదన్నదే బాధ.
ముగ్గురు పిల్లలు పుట్టాక....యాసిడ్ తాగి అక్క మరణిస్తే...ఆమె భర్తనే సంతోషికి కట్టబెట్టారు. ఆ మరణం అనుమానస్పదమైనది అయినా...వయస్సు అంతరం చాలా ఉన్నా...అక్క సంతానం కోసం సంతోషి పెద్దల నిర్ణయాన్ని శిరసావహించినట్లు హేమకు చెప్పింది.  తాగుడు వల్ల కలిగిన బాధలు విని మేము చాలా బాధ పడేవాళ్ళం కానీ...మాది నిస్సహాయ స్థితి.

తాగుడుకు బానిస అయిన వ్యక్తి వల్ల ఒక కుటుంబం...అందులోని భావి తరం సభ్యులు ఎలా బాధ పడతారో సంతోషి ఫ్యామిలీని చూస్తే అర్థమవుతుంది. తండ్రి డబ్బు ఇవ్వడు కాబట్టి...మొదటి భార్య కొడుకు తొమ్మిదో తరగతి చదువుతూ...ఉదయం పేపర్ వేస్తాడు, బడి నుంచి వచ్చాక ఒక కిరాణా షాప్ లో ఒక నాలుగు గంటలు పనిచేస్తాడు. పెళ్ళికి ఎదిగిన ఒక అమ్మాయి...ఒకరి ఇంట్లో ఒక వృద్ధురాలికి సేవ చేసేందుకు కుదిరింది. తండ్రి వల్ల వీళ్ళ చదువులు దెబ్బ తిన్నాయి. ఆ అమ్మాయికి హేమ అక్షరాల వరకు నేర్పింది...కానీ...అది సరిపోదు. ఇతర ముగ్గురు చిన్నారులకు దగ్గరలోని ప్రభుత్వ స్కూల్ లో సంతోషి చదువు చెప్పిస్తున్నది. ఏ రకంగా చూసినా...ఆమెది సంతోషం లేని జీవితం. ఈ కుటుంబం బాధ చూసి వీధిలో అందరికన్నా ఎక్కువ జీతం ఇస్తున్నది హేమ. సంసార బాధల్లో పడి కొన్ని రోజులు రాక పోయినా ఏమీ అనేది కాదు. ఇదంతా..సమస్యకు అసలు పరిష్కారం కాదు కదా!
        

రెక్కాడితే గానీ...డొక్కాడని సంతోషి లాంటి కుటుంబాలను ఈ సారాయి సర్వ నాశనం చేస్తుంది. ఆదాయం కోసం ప్రభుత్వం దీన్ని పెంచి పోషిస్తున్నది. ఎన్నికల అప్పుడు నేతలు మందు పంచి ఓటర్లను జోకొడతారు. లోక్ సత్తా మినహా ఒక్క రాజకీయ పార్టీ కూడా దీన్ని పెద్ద సమస్యగా చూడడం లేదు. అందరూ కావాలని మౌనం పాటిస్తున్నారు కానీ...ఈ మద్యం మన గ్రామీణ భారతాన్ని దారుణంగా దెబ్బ తీస్తున్నది. మన అభివృద్ధికి ఇది పెద్ద అవరోధం. దీన్ని పట్టించుకునే నాథుడేడీ?

టీ.ఆర్పీ. కింగ్ 'రవికెల' తో ప్రత్యేక ఇంటర్వ్యూ .........మీడియా పై వ్యంగ్య రచన--పార్ట్-1

మా వాడి పేరు సామేలు. మంచి మిత్రుడు. చదువుకున్నవాడు. అందరి పేర్లకు భిన్నంగా... తన పేరులో 'మేలు' ఉంది చూసావా...అని కాలర్ ఎగరెస్తాడు. వాడికి ఇలాంటి అలాంటి చావు ఐడియాలు చాలా ఉన్నాయి. తనకున్నవన్నీఅద్భుతమైన ఐడియాలనీ, వాటిని జనం గుర్తించడం లేదని రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు బాధపడతాడు. తనను ఐడియాల సామేలు (ముద్దుగా 'ఐసా') అని పిలిపించుకుంటాడు. ఇలాంటి 'ఐసా' ప్రతిభను 'వరల్డ్ బ్రాడ్ కాస్టింగ్ అసోసియేషన్' వాళ్ళు గుర్తించారు. ఆంధ్రాలో కొమ్ములు తిరిగిన జర్నలిస్టుల లిస్టు ఒకటి ఇచ్చి వారిని ఇంటర్వ్యూ చేసి పంపితే ఎంతో కొంత చెల్లిస్తామని ఆఫర్ ఇచ్చారు. తెలుగు టెలివిజన్ రంగంలో విప్లవ కెరటాలు సృష్టించిన/సృష్టిస్తున్న ఒక ప్రముఖ జర్నలిస్టు..సీ.ఈ.ఓ. రవికెల ప్రవేష్ (ఆర్.పీ.) తో 'ఐసా' ఇంటర్వ్యూ ఇలా సాగింది.


ఐసా: మిస్టర్ రవికెల...మా ఆహ్వానాన్ని మన్నించి ఇంటర్వ్యూ కు అంగీకరించినందుకు థాంక్స్. సమాజం కోసం అహరహం..క్షణం తీరిక లేకుండా కృషి చేసే మీరు ఇలా సమయం వెచ్చించడం మాకు గర్వకారణం. 

సీ.ఈ.ఓ.: (చేతిలోఆరు కాస్ట్లీ మొబైల్స్ పక్కనున్న బల్ల మీద పెడ్తూ) థాంక్స్ అండీ. నో ప్రోబ్లం. కానివ్వండి.


ఐసా: ఇదొక డిఫ్రంట్ ఇంటర్వ్యూ. నా ప్రశ్నలు సూటిగా ఎన్కౌంటర్లో బుల్లెట్ లాగా ఉంటాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశ్యం కాదని మీరు గమనించాలి. కోపగించుకోకూడదు.
సీ.ఈ.ఓ.: పర్లేదండి. మేమూ అలానే ప్రశ్నలు అడుగుతాం. గుచ్చి గుచ్చి అడగాల్సిందే. నో ప్రాబ్లెం.

ఐసా: మిస్టర్ రవికెల...చెప్పండి...ముందుగా మీ ఇంటిపేరు నుంచి మొదలుపెడదాం. అసలు రవికెల అన్న పేరు ఎలా వచ్చింది?
సీ.ఈ.ఓ.: (చాలా ఆనందంగా)..వండర్ఫుల్. మంచి ప్రశ్నతో ఆరంభించారు. దాని వెనుక పెద్ద కథ ఉంది. మీకు 'ట్రాప్' గురించి ఐడియా ఉందా? హూ..ట్రాప్ అంటే...అమ్మాయిలను ట్రాప్ చేయడం కాదండీ..టీ.ఆర్.పీ. గొడవ అన్న మాట. ఈ రేటింగ్స్ పెరిగి నా ఛానల్ ముందుండాలంటే...మేము చూపించే అమ్మాయిలకు రవికెలు...చీరెలు ఉండకూడదన్న మాట. జనాలను ట్రాప్ చేయడానికి ఈ ఏర్పాటు తప్పదు. నాకనిపిస్తున్నది...నేనే మీడియాలో ఇంత మొనగాడిని అవుతానని తెలిసే...మా ఇంటిపేరు 'రవికెల' అని మా పూర్వీకులు  పెట్టరనిపిస్తున్నది.

ఐసా: చోళీ కే పీచే...అంటే..రవికె వెనుక ఇంత కథ ఉందా? గ్రేట్. మిస్టర్ రవికెల...సూటిగా చెప్పండి...మీ గొప్పతన్నాన్ని రెండు ముక్కల్లో చెప్పుకోమంటే ఏమి చెబుతారు?
సీ.ఈ.ఓ.: నిజానికి చూస్తే...ఉత్తమ సమాజ నిర్మాణమే నా ధ్యేయం. మా ప్రతి మూవ్ అందులో భాగమే. సమసమాజ నిర్మాణమే ఆశయం. అందుకే...ప్రజల సమస్యలు ఒక పక్క చూపిస్తూనే...మరొక పక్క ఆ బాధల నుంచి వారికి కొంత ఊరట కలిగేందుకు...ముద్దులు, కౌగిల్లు, కురచ బట్టలు....వంటి వాటి మీద సరదా ప్రోగ్రామ్స్ చేస్తాం. అదే మా విజయ రహస్యం. ఇది కళాపోషణ అన్న మాట...


ఐసా: సార్...ఇంత సిగ్గు లేకుండా..సారీ...ఇంత నిర్మొహమాటంగా... ఇంత పెద్ద అబద్ధం చెబుతున్నందుకు ఇబ్బందిగా లేదా?
సీ.ఈ.ఓ.: చూడండి...ఐసా గారూ...మీడియా అంటేనే లోపల దాగి ఉన్న వాటిని చూపించే సాధనం. మేము చేస్తున్నది అదే. బుల్లి తెర మీద చూపిస్తుండగా లేనిది...మీతో చెప్పడానికి ఎందుకండీ ఇబ్బంది. సత్యం సత్యమే. జనం మా ప్రోగ్రామ్స్ చూసి ఆనందిస్తున్నారు. టీ.ఆర్.పీ.రేటింగ్స్ బాగున్నాయంటే...మాకు జనామోదం ఉన్నట్లే కదా...

ఐసా: నాకు ఇప్పుడే ఒక ఐడియా వచ్చిందండీ. మీ ఇంటిపేరు మీకు చక్కగా అతికినట్లే...టీ.ఆర్.పీ.కూడా అతికింది చూసారూ? అందులో చివరి రెండు అక్షరాలు...ఆర్.పీ...అంటే...రవికెల ప్రవేష్...మీ పేరును సూచించడం లేదూ? మీరు ఈ టీ.ఆర్.పీ. విషయంలో పీహెచ్ డీ చేసినట్లున్నారు. మీకు అన్నింటిలో  ప్రవేశం ఉంది కాబట్టి ఆ పేరు వచ్చింది...యాం ఐ రైట్?

సీ.ఈ.ఓ.: (కాస్త ఇబ్బంది పడుతూ) సక్సెస్స్ సూత్రాలు తెలియాలి అంతే. ప్రజలను మరింత అలరించేందుకు...త్వరలో ఓకే ఎంటర్ టైన్మెంట్ ఛానల్ తేబోతున్నాం. అప్పుడు మా సత్తా ఏమిటో చూపిస్తాం. అప్పుడే పుట్టిన బుడతడి నుంచి..పండు ముదుసలి వరకు...అందరినీ...అలరించేలా మా ప్రోగ్రామ్స్ ఉంటాయి. చేవఛచ్చిన వాడిలో సైతం...వేడి పుట్టించి నిలబెట్టేలా ఉంటుంది...క్రియేటివిటీ.


ఐసా:ఓహో...తెలుగు జనాలకు మరొక కానుక ప్రసాదించబోతున్నారన్న మాట. అయినా సార్...భక్తి రసం అందించే ఛానల్ మూసేసి ఆ స్థానంలో బూతు రసం అందిస్తున్నారు కదా. మరొక ఛానల్ అవసరమా? 
సీ.ఈ.ఓ: అన్ని రాష్ట్రాలలో అన్ని భాషలలో ఛానెల్స్ తేవడం..మా ఉద్దేశ్యం. ఫైల్యూర్ గురించి మాట్లాడడం నాకు ఇష్టం ఉండదని మీకు తెలియదా?


ఐసా: (సర్దుకుని) ఓహో..అమీబా అయిపోతారన్నమాట.
సీ.ఈ.ఓ.: నాన్ సెన్స్.. అమీబా ఏమిటి? కొత్త కాంసేప్టా? 

ఐసా: అద్భుతమైన...మీడియా..బారన్...అంతే...అమీబా...ఇది ఇలా వుండగా..ఎంత సంపాదించారు? ఎస్.ఈ.జెడ్....

సీ.ఈ.ఓ.: (మధ్యలోనె అందుకుని) సత్యం చెబుతున్నా...మెరుగైన సమాజమే నా ధ్యేయం. అవినీతి అవసరం మాకు లేదు. 


ఐసా: ఛానెల్స్ నియంత్రణకు ఒక యంత్రాంగం ఉండాలని గీతా రెడ్డి తదితరులు అంటున్నారు.  దీనిమీద మీ అభిప్రాయం?

సీ.ఈ.ఓ.: వాళ్ళ మొహం. మా పత్రికా స్వేచ్ఛ నే నియంత్రిస్తారా? మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు. మీడియా గొంతు నొక్కుతున్నారని ధర్నాలు చేస్తాం...ఉద్యమం నడుపుతాం.  ప్రభుత్వాలు కూల్చగలం. అలా అంటారు గానీ..మాతో ఎవ్వడూ పెట్టుకోడు లెండి


ఐసా: సరే...మీరు ఏడాదిలో ఎన్నిసార్లు సింగపూర్ పోతారు? ఎవరితో పోతారు? ఏమి చేస్తారు?....
సీ.ఈ.ఓ.: (ఇలా ఐసా ప్రశ్నలు సందిస్తున్డగానే...మిస్టర్ రవికెలకు ఎవరో ఫిలిం స్టార్ ఫోన్ చేసారు. ఏదో స్టార్ నైట్ ప్రోగ్రాం కు సంబంధించిన కాల్)..(ఫోన్ లో) ఒకే..దాని లైవ్ టెలి కాస్ట్ హక్కులు మావే....నన్ను చీఫ్ గెస్ట్ గా పిలవాలి. నేను ప్రసంగించాలి. ఓకే.. వెంటనే వస్తున్న.

(ఐసా వైపు తిరిగి)...సారీ బాస్...చాలా ముఖ్యమైన పని. నేను అర్జెంటుగా బిజినెస్ పని మీద దుబాయ్ వెళ్ళాలి...మళ్ళీ కలుద్దాం...సీ యూ.
------------------
నోట్: అనామిక పేరిట వచ్చిన కల్పిత రచన ఇది. కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందనిపించి ఇన్ని రోజులు కోల్డ్ స్టోరేజ్ లో ఉంచాను. ఇది పోస్ట్ చేయడం హేమకు నచ్చలేదు. అయినా...దీనిపై మీ అభిప్రాయాలు చూసి మిగిలిన కొన్ని బిట్స్ పోస్ట్ చేస్తాను. ఐ విల్ వెయిట్ ఫర్ యువర్ రెస్పాన్స్...రాము

Tuesday, January 19, 2010

ఈ ఆత్మహత్యల పరంపర పాపం ఎవ్వరిది?

ఈ ఉదయం ఇన్విజిలేషన్ కోసం ఉస్మానియా యూనివర్సిటీ సింహద్వారం నుంచి ఆర్ట్స్ కాలేజ్ వైపు వెళుతుంటే...గుండె తరుక్కుపోయింది. టాగోర్ ఆడిటోరియం దగ్గర ఒక ఎం.సీ.ఏ.విద్యార్థి వేణుగోపాల్ రెడ్డి ఒళ్ళు కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 'సోనియాజీ తెలంగాణా ఇవ్వండి'...అని రాసి వున్న ఒక కాగితం వదిలి వెళ్ళాడు.

నల్గొండ జిల్లాకు చెందిన వేణు చదువులో, కమ్యునికేషన్ స్కిల్స్ లో ఇతరులకన్నా ముందు ఉండేవాడట. ప్రతిభావంతుడైన ఒక యువకుడు ఇలా ఆత్మహత్యకు పాల్పడడం చాలా బాధాకరం. ఇప్పటికే రెండు పక్కలా కలిపి వంద మందికి పైగా బలవన్మరణం పొందారు. డిమాండ్ ఏదైనా...ఇలాంటి పని చేయడం ఆక్షేపణీయం. ఈ సంక్లిష్ట పరిస్థితిలో ఇలా చనిపోయి సాధించేది ఏమిటి?


ఇది మొట్టమొదటి సారిగా ఉస్మానియా క్యాంపస్ లో జరిగిన దుర్ఘటన. ఇది మరొక ఘట్టానికి తెరలేపుతున్నది. కే.సీ.ఆర్. నిరాహార దీక్ష తర్వాత...అనూహ్యంగా ఈ ఆత్మహత్యల పరంపర మొదలయ్యింది. మర్నాడు 'విద్యార్ధి గర్జన' ఉన్నందున...సోనియా గాంధీ జన్మదినం రోజే చిదంబరం ముందూ వెనుకా ఆలోచించకుండా...ఎవ్వరితో ప్రత్యక్ష సంప్రదింపుల పనిలేకుండా...ఆ ప్రకటన చేసారు. 'తెలంగాణా వాళ్ళు గింజుకు చచ్చినా...ప్రత్యేక రాష్ట్రం ఇవ్వర్లే," అని అన్ని తీర్మానాలకు వాకే అన్న ఈ బాధ్యతలేని నాయకులు...ఆంధ్రా, రాయలసీమలలో ప్రజా స్పందన చూసి వెంటనే పిల్లిమొగ్గలు వేసారు. అక్కడ అలజడికి, ఆగని మరణాలకు కారణ"భూతం" అయ్యారు వీరంతా. 


ఇంత జరుగుతున్నా...సోనియా అండ్ కో ఒక నిర్దిష్ట నిర్ణయం తీసుకోలేక ఇక్కడ రాష్ట్రాన్ని పలురకాలుగా నాశనం చేస్తున్నది. చిదంబరం ప్రకటనలు...అన్ని పక్షాల జనాన్ని పదజాలంతో మోసం చేసేవిగా ఉన్నాయి తప్ప ఏమీ ఒరగబెట్టడంలేదు. కేంద్రం ఇలా మన రాష్ట్రంతో మాటలతో, మౌనంతో ఆడుకుంటుంటే...మన నాయకులు రెండుగా చీలి ఎవడి గొడవ వాడిదన్నట్లు స్టేట్మెంట్లు ఇస్తూ స్వలాభనష్టాల బేరీజులో పడ్డారు. చేవ, రోషం లేని ఒక ముఖ్యమంత్రి చోద్యం చూచుచూ పన్నుల మోత మొగించుచూ  ఉన్నారు తప్ప సమస్య పరిష్కారానికి ఏమీ చేయలేక పోతున్నారు.


ఇది అర్థంకాని గందరగోళంలో ఉన్న యువకులు అమాయకంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇప్పటికైనా కేంద్రం మీనమేషాలు లెక్కించకుండా...అటో ఇటో ఒక నిర్ణయం తీసుకోవాలి. ముసుగులో గుద్దులాట ఇక ఏ మాత్రం మంచిది కాదు. ఒక పక్క జనం చస్తుంటే..మరొక పక్క ప్రాంతీయ విద్వేషాలు బుసలుకొడుతున్నాయి. ఇంకోపక్క అభివృద్ధి కుంటుపడింది. రాష్ట్రం ప్రమాదకర స్థితిలో తిరోగమనంలో ఉంది. 



"ఇతర ప్రాంతాల అభ్యంతరాలతో పాటు ఇస్లామిక్ తీవ్రవాదం, మావోయిజం హింసల పై మాకు భయం ఉంది...అందుకే తెలంగాణా ఇవ్వడానికి మాకు కొంత సమయం కావాలి," అని స్పష్టంగా చెప్పినా..."ఇది దీర్ఘకాల సమస్య. ఇప్పటికే...ఒక మాట ఇచ్చి ఉన్నాం కాబట్టి తెలంగాణా ఇవ్వక తప్పడంలేదు," అని ప్రకటించినా...ఈ సందిగ్ధ పరిస్థితి ఉండదు. 

అప్పుడు జరిగే గొడవ ఏదో...కొన్ని రోజులు జరిగి చల్లారుతుంది. ఏదో ఒక నిర్ణయం తీసుకుని...ధైర్యంగా ప్రకటించి...పరిణామాలకు సిద్ధపడితే...నష్టం ఇంతగా ఉండదు. తేనెతుట్టెను కదిల్చి...కందిరీగలు జనాలను కుడుతుంటే....నిర్ణయాలు చేయలేక కాలక్షేపమే మంచి మందని అనుకోవడం అవివేకం, మూర్ఖత్వం, దేశద్రోహం.

ప్రమాదకరమైన మౌనముద్రతో ఇన్ని మరణాలకు, నష్టానికి కారణం అవుతున్న సోనియా బృందం, ఈ యావన్మంది స్వార్ధ రాజకీయ నేతలు  రాష్ట్రానికి నష్టపరిహారం చెల్లించాలి. ఇరు పక్షాల నేతలు, మీడియా విద్యార్ధులను, యువకులను రెచ్చగొట్టడం వెంటనే ఆపాలి.  ఇంకా ఒక్కడు చచ్చినా...ఉద్యమాన్ని ఆపేస్తామని గాంధీజీ స్ఫూర్తిగా ప్రకటించాలే తప్ప...ఇలాంటి చావులతో ఉద్యమాలకు ఊపిరిలూద్దామని చంకలుగుద్దుకో కూడదు. ఇలా సమిధలవుతున్నది ఎక్కువగా...బడుగు బలహీన వర్గాల యువకులే. వారి మరణం...వారి పేద కుటుంబాలకు కోలుకోలేని కుదుపు, అశనిపాతం.    


తమ్ముళ్ళూ....రాజకీయ నేతల ప్రకటనలు, కల్లబొల్లి కబుర్లు చూసి ఆవేశానికి, నిస్పృహకు లోను కావద్దు. ప్రాణాలు తీసుకోవద్దు. ఒక అభిప్రాయాన్ని లేదా నిరసనను తెలియజేయడానికి మార్గాలు చాలా ఉన్నాయి. అన్నింటికీ...చావే పరిష్కారం కాదు. మిమ్మల్నే నమ్ముకుని...అనునిత్యం మీ కోసమే పరితపిస్తూ మీ అభ్యున్నతిని చూసి ఆనందిద్దామని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న అమ్మ, నాన్న, అన్న, అక్క, చెల్లి గురించి ఓ క్షణం ఆలోచించండి. ఇలాంటి చావు...ముమ్మాటికీ ఓటమే. 

ఈ గొడవ మధ్య ఇంకొక అమానుషమైన పరిణామం జరుగుతున్నది. ఇతర రెండు ప్రాంతాలలో మరణాలు ఇక్కడి నేతలకు కనిపించడంలేదు. ఇక్కడి ఆత్మహత్యలను అటు పక్క నేతలు లెక్కలోకి తీసుకోవడం లేదు. వారి యువత చేస్తే అది 'బలిదానం'...వేరే ప్రాంత యువత అదే పని చేస్తే...అది 'అనవసరపు చావు'! ఎటుపోతున్నాం? మనం ఏమైపోతున్నాం? 


టీ.వీ.ఛానెల్స్ మైకుల్లో, స్టూడియోలలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్న నేతలు....కళ్ళు తెరవండి, కుళ్ళు మరవండి. మనం రాక్షసులం కాదని..మనుషులమని కాస్త గుర్తుంచుకొండి.

Sunday, January 17, 2010

మహా న్యూస్ లో....'రాంగోపాల్ వర్మ అండ్ ఐ'

దివారం రాత్రి 'మహా న్యూస్' లో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మీద "నేను" అనే ఒక కార్యక్రమం వచ్చింది. ఆ కథనం చాలా ఆసక్తిగా సాగింది. ఈ మనిషి నాకు ఒక పట్టాన అర్థం కాడు కాబట్టి దీన్ని చాలా ఆసక్తిగా చూసాను. 'రాంగోపాల్ వర్మ-ఐ (నేను)' అన్న థీంతో రాసిన ఆ కాపీ చాలా బాగుంది.  


నాకు ఈ సృజన శీలత పొంగిపొర్లే సినిమా/ టీవీ కళాకారులతో ఒక సమస్య ఉంది. వీళ్ళు ఏదో ఐడియా తో కథ అల్లుతారు...సృజనాత్మకత పేరుతో జనం మీదికి వదులుతారు. కథకులు, దర్శకులకు ఉన్న ఈ సృజనాత్మకత (క్రియేటివిటీ) వల్ల...ఎన్ని రకాలుగా మర్డర్లు, రేపులు చేయవచ్చు? కాలేజ్ లో ఆడపిల్లలను ఎన్నేసి రకాలుగా ఏడిపించవచ్చు? వారిని ఎలా ట్రాప్ చేయవచ్చు? అసలు ప్రేమ అనే ముగ్గులోకి దింపడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి? పాఠాలు చెప్పే టీచర్లను ఎలా ఫూల్ చేయవచ్చు? ముఠాలు ఎలా కట్టవచ్చు? జనాలను ఎలా దోచుకోవచ్చు?...వంటివి జనాలకు తేలిగ్గా తెలిసి పోతున్నాయి. అంటే....వారే పరిశోధన చేసి ఈ దుష్కార్యాలలో వివిధ యాంగిల్స్ ను ప్రజలకు ఖరీదుకు అందజేస్తున్నారు.


ఈ సినిమాలు, టీవీ సీరియళ్ళు...జనాలకు గైడ్ గా పనికి వస్తున్నాయి. యువతపై ఈ సినిమాల ప్రభావం చాలా ఎక్కువ వుంటుంది....కాబట్టి మన సృజనాత్మకత సమాజానికి పొరపాటున ఏమైనా హాని చేస్తుందేమో అన్న సామాజిక బాధ్యత ఈ సృజనశీలురకు ఉండి తీరాలి. అయితే...అది మా పని కాదని వర్మ తేలిగ్గా చెప్పేస్తున్నారు.


ఇలా సామాజిక బాధ్యతా...పాడూ లేకుండా...రక్తపాతం, భూతాలూ, దయ్యాలు, సెక్స్ ప్రధానంగా సినిమాలు తీసే దర్శకుడిగా రాంగోపాల్ వర్మ  నాకు అనిపిస్తారు. నాకు అనిపించింది చూపిస్తా...చూస్తే చూడండి...అంటారాయన. అందుకేనేమో..."రాంగోపాల్ వర్మ మైనస్ 'నేను' ఈజ్ ఈక్వల్ టు నథింగ్," అని తనికెళ్ళ భరణి గారు ఈ కార్యక్రమంలో వేరే కాం టెక్స్ట్ లో చెప్పారు. 
నిజమే...భరణి గారు అన్నట్లు...."ఇలాంటి కళాకారులు తమ ఆత్మానందం కోసం సినిమా తీయడమో, బొమ్మ గీయడమో చేస్తారు. దాన్ని చూస్తే చూడండి అని జనం మీదికి వదులుతారు." మరి ఇలాంటి వారికి సమాజ హితం పట్టదా? అన్న ప్రశ్న వేధిస్తున్నది.


వర్మ గారి సినిమా..."శివ" నేను చూసాను. చాలా పవర్ఫుల్ మూవీ. అందులో నాగార్జున సైకిల్ చైన్ను ఒంటిచేత్తో తెంపి ఇతరులను కొట్టే దృశ్యం చాలా మందికి ప్రేరణను ఇచ్చింది. అప్పట్లో అన్ని చోట్లా అదే చర్చ. ఆ సినిమా చూశాక...కాలేజ్ లలో బ్యాచులు మొదలయ్యాయంటారు. 


అలానే...'రంగీలా' అనే సినిమాలో ఊర్మిళ అనే అమ్మాయిని తీవ్రంగా ఎక్స్ పోజ్ చేసి చూపారాయన. అప్పటికే సముద్రపొడ్డున తడి బట్టలతో పరిగెత్తే హీరోయిన్లు...ఆ తర్వాత గిరగిరా తమకంతో నడుము తిప్పడం ప్రారంభించారు. ఊర్మిళ తిప్పిన తిప్పుడుకు చాలా రోజులు చాలా మంది మిత్రులు కోలుకోలేదు. అలాగే...దయ్యాలు, భూతాలూ, అండర్ వరల్డ్ కథలు. "ఆయన మన అదృష్టం బాగుండి...బాలివుడ్ కు తరలిపోబట్టి సరిపోయింది లేకపోతే...ఈ క్రియేటివిటీ పేరిట...ఇంకాస్త భీభత్స కాండ జరిగిపొయ్యేది," అని ఒక మిత్రుడు అన్నాడు.


జరగని వాటిని ఊహించి....శక్తిమంతంగా సినిమాగా తీసి జనం మదిపై ప్రభావం పడేలా చేయడం దారుణం కాదా?  వారిది నిజంగా సృజనాత్మకతా? క్షుద్ర సాహిత్య సృష్టా?  వర్మ లాంటి అత్యంత తెలివిగల వారు కొన్నాళ్ళ పాటు కమర్షియల్ యాంగిల్ కు పెద్ద ప్రాముఖ్యత ఇవ్వకుండా...పాజిటివ్ కథాంశాలను స్వీకరించి ప్రయోగాలు చేస్తే బాగుణ్ణు. ఎవడికి తెలుసు...అవి సూపర్ డూపర్ హిట్ కావచ్చు. అన్ని వృత్తులలో వారి నుంచి నైతికతను ఆశిస్తూ...ఇలాంటి శక్తిమంతమైన మాధ్యమాన్ని సృజనాత్మకత పేరిట పెద్దగా పట్టించుకోకుండా ఉండడం సమంజసం కాదు. సెన్సార్ బోర్డులు నామ్ కే వాస్తే...గా మారడం....చేటు చేసే చెత్త ఐడియా లు కళా పోషణ పేరిట...ప్రశంసలు అందుకోవడం విచిత్రం. 

Saturday, January 16, 2010

మీడియాకు దూరంగా..పల్లె తల్లి ఒళ్లో..చల్లచల్లగా..

చాన్నాళ్ళ తర్వాత... ఈ సవాలక్ష ఛానెల్స్ కు, వార్తా పత్రికలకు దూరంగా ఒక నాలుగు రోజులు నాణ్యంగా బతికి తీరాలనుకున్నాను. ఈ పండగ పుణ్యాన అది సాధ్యం అయ్యింది. అలాగే, కుటుంబంలో పిల్లలందరూ...ఈ సంక్రాంతి రోజు మా ఊరుకు వెళ్లి తీరాలని మేము వేసిన ప్లాన్ కూడా పారింది. ఇది నాలుగు రోజులు గుర్తుండే మధుర సంక్రాంతి.


పల్లె నిజంగా తల్లి ఒడి, చల్లని బడి. అక్కడి ప్రజలు అమాయకులు. ఆదరించి అక్కున చేర్చుకుంటారు. కాయకష్టాన్ని నమ్ముకుంటారు. గుండెలనిండా ప్రేమతో పలకరిస్తారు. మంచి చెడ్డలు కనుక్కుంటారు, మన ఎదుగుదల చూసి హృదయపూర్వకంగా పులకరిస్తారు. 


ఇది ఖమ్మం జిల్లా వైరా మండలం గొల్లపూడి గ్రామం. గురువారం ఉదయం కారులో ప్రయాణం మొదలయ్యింది మొదలు...మా ఊరు గురించే ఆలోచనలు. రజాకార్ల దాడి నుంచి తప్పించుకునేందుకు మా తాతా వాళ్ళు పొరుగున ఉన్న కృష్ణా జిల్లా నెమలిలో తల దాచుకున్నారు. ఇంట్లో అమ్మమ్మా వాళ్ళు ఉన్నప్పుడు ఒకసారి ఒక నిజాం ముఠా దుర్భుద్ధితో మా ఇళ్ళ  చుట్టుముడితే...మా కుటుంబంతో కలిసి మెలిసి ఉండే ఒక ముస్లిం కుటుంబం రక్షించింది. ఇది యాదికొచ్చింది. ఇది రెండు స్వాతంత్ర్య పోరాటాలు చేసి పునీతమైన నేల. లౌకికత్వానికి ప్రతీక.


ఈ ఆలోచన పరంపర కొనసాగుతూనే పోయింది. గొల్లపూడి పక్కనున్న రెబ్బవరం గ్రామం...నా క్రీడా ప్రాంగణం. స్కూలు గ్రౌండ్, ఇంగ్లిష్ చెబుతూ ఎప్పుడూ కొట్టే డీ.పీ.రంగారావు గారు, పద్యాలు నేర్పిన వెంకటప్పయ్య గారు, అప్పట్లో ట్యూషన్ లో ఇంగ్లిష్ రైమ్స్ చెప్పిన కుసుమ టీచర్, స్కూల్ ఎగ్గొట్టి మేము రాళ్ళతో కొట్టిన గిన్నె చెట్లు, పశువుల డాక్టర్ గా మా నాన్నగారికి ఉన్న మంచి పేరు...అన్నీ స్ఫురణకు వచ్చాయి. అవన్నీ నాతో పాటు ప్రయాణం చేస్తున్నహేమ, నా పద్నాలుగేళ్ళ కూతురు మైత్రేయి కి వివరించాను. నా తొమ్మిదేళ్ళ కొడుకు ఫిదెల్ రఫీక్ స్నేహిత్  ఒక్క రోజు ముందే...నా తమ్ముడు, వాడి సతీమణి, వారి ముగ్గురు చిన్న పిల్లలతో కలిసి

వెళ్ళిపొయ్యాడు కాబట్టి చాలా మిస్ అయ్యాడు. ఆరో తరగతిలో కల్లు కొండయ్య తో కలిసి  బీడీలు, సిగరెట్లు తాగి ఫస్ట్ అండ్ లాస్ట్ టైం అమ్మతో తిన్న తన్నులు, పేక ముట్టుకున్నా, వక్కపొడి తిన్నా...నాన్నకు కట్టలు తెంచుకునే ఆగ్రహం గురించి వారికి ఎప్పుడో చెప్పేసా.


పచ్చని చేల మధ్య కొండచిలువలా ఉన్న తార్రోడ్డు మీద కారు దూసుకుపోతుంటే...వైరా వచ్చింది. అక్కడ రోడ్డు మీద ఉన్న మా కాలేజ్, దాని వెనుక చెరువు పక్క ఉన్న నా బాడ్మింటన్ గ్రౌండ్ చూపించాను. ఒక పది కిలోమీటర్ల ప్రయాణం కాగానే...రెబ్బవరం రానే వచ్చింది. రోడ్డు పక్క స్కూలు చూస్తే...ప్రాణం ఎందుకో లేచి వచ్చింది. అది శిధిలావస్థకు చేరింది. గ్రౌండ్ కుంచించుకుపోయింది. ఎప్పటికైనా....ఈ స్కూల్ ఋణం తీర్చుకోవాలి. 
మరొక రెండు కిలో మీటర్లకు గొల్లపూడి వచ్చింది. 

ఒక రోజు ముందే అక్కడ చేరుకున్న...ఫిదెల్ మా ఇంటిపక్క ఉన్న ఖాళీ స్థలంలో వీధిలో పిల్లలతో కలిసి చెక్క బ్యాటు, తుమ్మ వికెట్ల తో చెమటలు కారేలా క్రికెట్ ఆడుతుంటే...నాకు ఆనందం వేసింది. ఈ పిల్లలు హైదరాబాద్ లో పడి బాల్యపు అనుభూతులు చాలా కోల్పుతున్నారు అన్న బాధ కొద్దిగా తొలిగిపోగానే...మా ఇంటి పక్క గుడిలో గంట మోగింది.
పిల్లలంతా...పోలో మంటూ గుడిలోకి వెళ్లారు. అదొక చూడ ముచ్చటి సీన్. మాకు ఒకప్పుడు అది నిత్యకృత్యం. వీడు ఒక కొబ్బరి చిప్ప లో ప్రసాదం తెచ్చాడు. ఆ గుడిలో ఉదయం నాలుగున్నర నుంచి మోగే మైకు వల్ల నేను భగవత్గీత తో పాటు చాలా విషయాలు నేర్చుకున్నాను. "ఎంట్రా..చిప్ప తెచ్చావ్?" అని ఎవరో అడిగితే..."ఎవరో....ఆ అయ్యగారికి చెప్పారు...డాక్టర్ గారి...మనవడనో ఏదో చెప్పారు. ఆయన అప్పుడు ఈ కొబ్బరి చిప్ప ఇచ్చారు," అన్నాడు మన వాడు...ప్రసాదం అంటిన వేళ్ళు నాకుతూ.

అన్నయ్య కూతుళ్ళు ముగ్గురితో సహా..వివిధ సైజుల వారితో వీధిలో ఒక చిన్నపాటి క్రికెట్ టీం బయలుదేరింది. మర్నాడు...పెద్దలంతా..పండగ హడావుడిలో ఉండగా...పిల్లలు రకరకాల ఆటలు ఆడారు. నాన్న కట్టిన ఊయల తమ్ముడి మూడేళ్ళ కవల పిల్లలకు మంచి ఆట వస్తువయ్యింది. మా నాన్న ఊయల ఊపుతుంటే...వాళ్ళు మైమరిచి పోయారు. పిల్లలు ఖో-ఖో కూడా ఆడారు. వైరా కాలేజ్ లో నేను ఈ ఆటలో ఒక ప్రముఖ ఆటగాడిగా ఉండే వాడిని. 
నాన్న అమ్మా కష్టపడి పెంచిన జామ చెట్టు కింద పడక కుర్చీలో కూర్చుని ఆలోచిస్తుంటే...ఈ సారి ఊళ్ళో మార్కండేయులు లేని వెలితి కనిపించింది. డెభై ఏళ్ళ మార్కండేయులు మా ఇంటి ముందు ఉండే వాడు. మంచి రైతు. ఊరు వెళ్ళినప్పుడు వ్యవసాయం స్థితిగతులు తెలుసుకోవడానికి నాకు ఆయన ది బెస్ట్ శాంపిల్. తనకు ఇష్టమైన చింతకాయ పప్పు చేయించుకుని పడుకున్న మార్కండేయులు...అకస్మాత్తుగా గుండె పోటు వల్ల కన్నుమూసాడు. చిన్నపుడు మా అందరికీ నీళ్ళు పోయించి అమ్మకు సాయంగా ఉన్న వెంకట రమణ ఇంటికి స్వయంగా నేను వెళ్ళాను. ముగ్గుబుట్ట లాంటి జుట్టు, గారపట్టిన పళ్ళు, వంగిన నడుము, మో కాళ్ళ  నొప్పులతో (ఫ్లోరోసిస్ పుణ్యం) ఎదురొచ్చింది. రామయ్యా...బాగున్నావా...అని  ఆప్యాయంగా చేతులు నిమిరి ఇంట్లోకి తీసుకెళ్ళింది. కుర్చీ వద్దని వసాట్లో కూర్చుంటే...విలవిలలాడింది. చాలా మంది తెలిసిన వాళ్ళు కలిసి తృప్తిగా మాట్లాడారు. మేమంతా...కులం మతం వంటి వాటికి అతీతంగా బతికాం. అందుకే...హైదరాబాద్ లో ఏ కుటిలుడైనా...కుల ప్రస్తావన తెస్తే...వాడు ఒట్టి వెర్రిబాగుల వాడిలాగా కనిపిస్తాడు మాకు.   



పిల్లలకు కాసేపు ఎసోప్ ఫేబుల్స్ వినిపించాను. కానీ వారి మనసంతా ఆటలపైనే. మొత్తం మీద సాయంత్ర పిల్లలందరినీ దీసుకుని...నాన్న, పొలాలు చూసే వెంకటి, నేను ముందుగా మెట్ట పొలం చూపించాం. ఆ పొలంలో నా చిన్నప్పుడు ఒక పెద్ద తెల్ల తాచును చూసి రెండు కిలోమీటర్లు పరిగెత్తిన విషయం గుర్తుకు వచ్చి భయమేసింది. ఆ పొలంలో వేరుశేనగకు రాత్రి నీళ్ళు పెట్టడానికి మా కుటుంబం అంతా వస్తే...ఇంటి దగ్గర మేము అపురూపంగా పెంచుకున్న నాలుగు మంచి కుందేళ్ళను వీధి కుక్కలు చంపిన సంఘటన కూడా కళ్ళ ముందు మెదిలింది. 

పత్తి, మొక్కజొన్న, వరి, మిర్చి...వంటి పొలాలు...వాటికి కావాలిసిన నీటి వసతి గురించి పిల్లలకు చెప్పాము. మా వూరి పంట పొలాలు, కాల్వ గట్టు, డొంక దారి వెంట పిల్లలను తిప్పాం. అవన్నీపాతికేళ్ళ కిందట నేను కలియదిరిగిన దార్లు. "రండి నాన్నా...ఈ ఊళ్ళో ఇంకా ఎన్నాళ్ళు ఉంటారు?" అంటే....నాన్న ఒక మాట అన్నారు. "అంతా బాగుంటుంది కానీ...అక్కడ (హైదరాబాద్) ఇక్కడ ఉన్న ప్రశాంతత ఉండదురా...ఈ పొలాలు, ప్రజలు, వాతావరణం ఇచ్చే ప్రశాంతతే వేరు," అని ఆయన అంటే...మనం ఈ ఉరుకుల, భుగభుగ పొగల నగరం లో ఏమి కోల్పోతున్నామో అర్థమయ్యింది.  
అందుకే ఈ సారి సంక్రాంతి నాకు చాలా తృప్తిని ఇచ్చింది. పట్నంలో పెంచుతున్న మన పిల్లలను కనీసం సంక్రాంతి నాడైనా ఇక్కడ ఒక మూడు రోజులు ఉన్చాలనుకున్నా. కాకపోతే...ఒకటే బాధ వేసింది. నగరంలో మనకు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తూ...పల్లెల్లో విపరీతంగా కోత విధిస్తున్నారు. ఇది సమన్యాయం కాదు. వారికి మనలా మంచి నీరు అందడం లేదు. తాగునీరు, ఆరోగ్యం, విద్య, రోడ్లు వంటి మౌలిక విషయాలలో ఇంకా పల్లెల్లో ఎక్కడవేసిన గొంగళి ఆక్కడే!అయినా మీడియా మనకు సుందర ప్రపంచాన్ని మాత్రమే చూపించి జోలకొడుతున్నది కదా!!


(గమనిక: నేను కొన్నాళ్లుగా పేపర్లు, ఛానెల్స్ చూడకపోవడం వల్ల ఇలా మీడియా కు దూరమైన ఒక అంశాన్ని రాసాను. నచ్చినా, నచ్చకపోయినా...నాకు రాయండి.)

Tuesday, January 12, 2010

TV-5 ఎపిసోడ్ నేర్పిన గుణపాఠాలు?

సంతోషం...ఒక చెత్త రష్యన్ వెబ్ పేపర్ స్టోరీని సోర్సు (ఆధారం) గా చేసుకుని ఒక నాలుగు గంటలపాటు వై.ఎస్.ఆర్.దుర్మరణంపై వేడివేడి చర్చ జరిపి రాష్ట్రంలో అగ్గి రేపినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న TV-5 ఎగ్జిక్యుటివ్ ఎడిటర్ బ్రహ్మానంద రెడ్డి, ఇన్ పుట్ ఎడిటర్ వెంకటక్రిష్ణ లకు సీ.ఐ.డి. ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. వారు...ఒక రెండు రోజుల పాటు జైలు జీవితం అనుభవించి చంచల్ గూడా కేంద్ర కారాగారం నుంచి సోమవారం బైటికి వచ్చారు. 

జైలు దగ్గరకు అన్నకు స్వాగతం పలికేందుకు జర్నలిస్టులతో పాటు వెళ్ళిన వెంకటకృష్ణ సోదరి పద్మ విలేకరులతో మాట్లాడుతూ ఒక ప్రశ్న వేసినట్లు 'సాక్షి' పత్రిక పేర్కొంది. ఆమె వేసిన ప్రశ్న: "ఆ వార్త ప్రసారంలో తప్పు ఏముంది?"

ఇక్కడే సమస్య వచ్చిపడింది. పద్మ గారే కాకుండా ఒక సెట్ ఆఫ్ సీనియర్ జర్నలిస్టులు ఆ ఛానల్ స్టూడియోలో చర్చలలో ఇలాంటి వాదన చేస్తూ వస్తున్నారు. ఛానల్ యజమానులను కాకుండా...వారి 'అజెండా' ను మాత్రమే నెత్తికెత్తుకున్న జర్నలిస్టులను అరెస్టు చేయడం పట్ల, ఆ అరెస్టు చేసిన తీరు పట్ల మనకు అభ్యంతరం ఉండాలి. అంతేకానీ...పిచ్చి వాదనలు చేసి జనంలో మరీ పలచన కాకూడదు.

ఇద్దరు ఎడిటర్లు విడుదల అయ్యాక ఆ ఛానల్ సిబ్బంది చాలా హడావుడి చేసారు. డప్పులు, కేరింతలు, నృత్యాలతో రోడ్ల మీద నాట్యం చేసారు. సంస్థ మహిళా ఉద్యోగులు కూడా లయబద్ధంగా డాన్స్ చేసారు. వీరతిలకం దిద్ది ఇద్దరు ఎడిటర్స్ కూ పూలదండలతో ఘన స్వాగతం పలికారు. ఎవరి ఆనందం వారిది....వారిని తప్పు పట్టలేం. నన్నే గనక ఇలాంటి కేసులో...అరెస్టు చేసి...ఆనక బెయిలు మీద విడుదల చేస్తే...మూడో కంటికి కనిపించకుండా ఇంటికి చేరి... చేసిన ఫూలిష్ తప్పుకు ప్రాయశ్చిత్తం ఎలా చేసుకోవాలో ఆలోచిస్తాను. యజమాని నిజంగానే ఏదైనా రాజకీయ ఎజెండాతో ఆ కథనం ప్రసారం చేయించి మనల్ను ఎర్రిపప్పను చేశాడా? తెలివితక్కువగా మనం ఇరుక్కున్నమా?...ఇప్పుడు మార్గాంతరం ఏమిటి? అని విశ్లేషించుకుంటాను. "అసలే మనం చేసింది ఘోర తప్పిదం. చేసింది చాలక మళ్ళీ ఏదో ఘనకార్యం చేసినట్లు ఈ డప్పు దర్వులా? జనం చూసి నవ్వుకోరూ?" అనిపిస్తుంది నామటుకు నాకు.  

ఈ అరెస్టులను చూస్తుంటే...ప్రభుత్వం మీడియా గొంతు నొక్కేట్లు కనిపిస్తున్నదని వెంకటక్రిష్ణ విడుదలయ్యాక చెప్పారు. నిజంగానే ప్రభుత్వం ఈ పనిచేస్తే...జర్నలిస్టులు ఊరుకోకూడదు. అదే సమయంలో....ఈ కేసు నేపథ్యంలో, ఒక పక్షం పాటు ఛానెల్స్ ను మూసేస్తే బాగుండనిపిస్తున్నాదని జే.పీ.గారు చేసిన సూచన పూర్వరంగంలో మీడియా ఆత్మపరిశీలన చేసుకోవాలి.  


కారణాలు ఏవైనా...మీడియాలో "సోర్సులు" అనే చాప్టర్ కు ప్రాధాన్యం తగ్గిపోయింది. మన తెలుగు జర్నలిస్టులకు ఈ విషయంలో సరైన శిక్షణ లభించడం లేదు. "సోర్సులు--నైతికత" అనే అంశానికి చాలా ఆంగ్ల పుస్తకాలలో ఎక్కువ ప్రాధాన్యం లభిస్తున్నది. ఒక్క సోర్సు ఆధారంగా స్టోరీలు తయారు చేస్తే...చాలా సందర్భాలలో చిక్కులు వస్తాయి. ఏదో..."పత్రికా స్వేచ్ఛ" అని జనాన్ని బెదరగొట్టి బతుకుతున్నాం...కానీ...70% కథనాలపై ఎవడైనా కోర్టుకు ఈడిస్తే...మన కేరాఫ్ అడ్రస్ చంచల్ గూడా జైలే! ఒక వేళ సింగిల్ సోర్సు వార్తలు ప్రసారం చెయ్యాలనుకున్నా...విమర్శలు ఎదుర్కుంటున్న వ్యక్తి/ సంస్థ వెర్షన్ తీసుకుంటే...చాలా వరకు సమస్య తీవ్రత తగ్గుతుంది. ఈ రష్యన్ స్టోరీ విషయంలో...మారెప్ప లాంటి వారు "సపోర్టింగ్ సోర్సు" అని వెంకట క్రిష్ణ అనుకోవడం తప్పు.

చిరంజీవి దుకాణం మూసేద్దామని అనుకుంటున్నట్లు  "ఈనాడు" ఆ మధ్యన ప్రచురించిన వివాదాస్పద బ్యానర్ వార్త ఇలాంటిదే. ఒక నలుగురు ప్రజారాజ్యం ఎం.ఎల్.ఏ.లు ఒక మీటింగులో ఆ మాట అనుకుని ఉండవచ్చు కానీ...దానికి చిరంజీవి వెర్షన్ తీసుకుంటే...సమస్య తీవ్రత తగ్గుతుంది. కానీ..మన 'టార్గెట్' పొద్దున్నే ఆ వార్త చూసి దిమ్మతిరిగి పడిపోవాలన్న పిచ్చి తలంపు ఛిక్కులు కొనితెస్తుంది. 


'సాక్షి' ఛానల్, పేపర్ రామోజీరావు గారి తోడల్లుడు ఎం.అప్పారావు ఆయనపై చేసిన తీవ్ర ఆరోపణలు ప్రసారం చేసింది, ప్రచురించింది. ఇది కూడా రామోజీ దిమ్మతిరిగి కింద పడి కొట్టుకోవాలన్న దురూహే. అప్పారావు గారు కాంక్రీట్ సాక్ష్యాలు ఇవ్వకుండా...నోటికొచ్చిన ఆరోపణలు చేసారు. ఇది జర్నలిజం కాదు. "అయ్యా...నాలుగు రోజులు ఆలస్యమైనా..కొన్ని సాక్ష్యాలు దొరకబట్టండి. అప్పుడు మనం ఆయనను ఉతికేసేయ్యవచ్చు," అని రిపోర్టర్ ఈ తోడల్లుడిని పురమాయించాలి. ఆ సాక్ష్యాలపై ...రామోజీ వివరణ అడగాలి. అది సమగ్ర వార్త అవుతుంది. (నిజానికి ఇక్కడి పోస్టులకు కూడా ఆయా జర్నలిస్టుల వివరణలు అడిగి రాయాలని ఉంది...కానీ...వారి స్పందన కరువవుతున్నది. మన సోదరులు...డబ్బును తప్ప దేన్నీ సీరియస్ గా తీసుకుంటునట్లు లేరు.)

ఏది ఏమైనా..."ది ఎగ్జైల్" వార్త విషయంలో పలు ఛానెల్స్ నిస్సిగ్గుగా ఒక దానిపై ఒకటి దుమ్మెత్తి పోసుకుని...జనానికి కనువిందు కలిగించాయి. మీడియా పట్ల జనం ఒక అభిప్రాయం ఏర్పరుచుకునేలా...ఈ కథనాలు సాగాయి. ఇప్పుడు 'సాక్షి'--'ఈనాడు' మాటల/రాతల యుద్ధం మీడియా పరువును మరింత పంచనామా చేస్తుంది.  ఇప్పటికైనా....జరుగుతున్న విపరిణామాల నుంచి గుణపాఠాలు నేర్చుకునే అలవాటు చేసుకోకపోతే...మీడియాకు కష్టకాలమే, జర్నలిస్టులకు గడ్డురోజులే.

Sunday, January 10, 2010

మీడియాలో రొచ్చుకు కారణం ఎవడయా?

ఈ రోజుల్లో ఎవర్ని కదిలించినా ఈ మీడియా ఓవర్ యాక్షన్ ఎక్కువయ్యిందని అంటున్నారు. చివరకు...మీడియాలో అబద్ధాలు ప్రచారం చేయించుకుని, పచ్చ నోట్లు, సారా పాకెట్లు పంచి గెలిచిన ప్రజాప్రతినిధులకు సైతం మీడియా లోకువ అయ్యింది. "ఒక దశలో విలేకర్లను జనం రాళ్ళతో కొట్టే రోజులు వస్తాయి," అని నేను నా సన్నిహిత మిత్రులతో అంటే ఒక్కడంటే ఒక్కడైనా ఖండించడంలేదు. వారంతా "నిజమేరా...ఎందుకు వచ్చామురా ఈ రొచ్చులోకి అనిపిస్తున్నది," అంటున్నారు. అసలీ కారణానికి బాధ్యులు ఎవరు?


"ఈనాడు" ను స్థాపించి తెలుగు భాషను, జర్నలిజాన్ని కొత్తపుంతలు తొక్కించిన రామోజీరావు గారు, "TV-9" ద్వారా వార్తల అర్ధాన్ని "infotainment" (information+entrainment) గా మార్చిపారేసిన రవి ప్రకాష్ గారు నాకు ఈ విషయంలో దోషులుగా కనిపిస్తున్నారు. వీరు జర్నలిజానికి ఎంత మేలు చేసారో...అంతే కీడు చేసారని అనిపిస్తున్నది.


చిన్న చిన్న వ్యాపారులు కూడా అడ్వెర్టైజ్జ్మెంట్లు ఇవ్వాలనుకుంటారు...తమ చుట్టుపక్కల జరిగే పరిణామాల పట్ల జనానికి ఆసక్తి ఉంటుంది...అన్న సూత్రం ఆధారంగా రామోజీ గారు ఒక ఇరవై ఏళ్ళ కిందట జిల్లా అనుబంధాలను పెట్టారు. ఇది అద్భుతమైన వ్యాపార సూత్రం. ఇందులో భాగంగా...మండలానికొక విలేకరిని నియమించారు. కాలేజ్ డిగ్రీల పట్ల పెద్దగా నమ్మకం లేని రామోజీ గారు...పదో తరగతో, ఇంటరో చదివి ఒక నాలుగు తెలుగు వాక్యాలు రాసేవారని విలేకరులుగా నియమించారు. ఇలా...అప్పటి దాకా....పదుల సంఖ్యలో ఉన్న జర్నలిస్టులు ఒక్కసారిగా వేల సంఖ్యలో పుట్టుకొచ్చారు. పోటీ ధోరణితో... ఆ తర్వాత వచ్చిన పత్రికలన్నీ లోకల్ విలేకరులను విచ్చలవిడిగా నియమించాయి.

జిల్లా అనుబంధాలు క్లిక్ కావడంతో ఈ విలేకరుల మాట మండలాలలో పెట్రోలై మండడం ఆరంభించింది. నాయకులు-అధికారులు-పోలీసులు-విలేకరులు లోకల్ గా ఒక కాకస్ అయిపోయారు. ఇప్పుడు కొందరు మండల స్థాయి విలేకరులు...హైదరాబాద్ లో జర్నలిజాన్ని (అంటే..నెల జీతాన్ని) నమ్ముకున్న వారికన్నా ధనవంతులు, శక్తిమంతులు. లోకల్ పరపతితో వీరు యాజమాన్యాలు లోకల్ ఎడిషన్లు పెట్టుకోడానికి చాలా చౌక ధరకు భూములు కూడా ఇప్పించి....సంస్థల పెట్టుబడి వేల కోట్లకు పెరగడానికి దోహదపడ్డారు. ఈ క్రమంలో విలేకర్లు అంటే జనానికి అసహ్యం పెరిగింది. వారి బారిన పడిన చౌక దుకాణాల వారు, డీలర్లు, కాంట్రాక్టర్లు, వైద్యులు...ఈ స్థానిక విలేకరుల గురించి ఎన్నైనా చెబుతారు. అయితే....గతంలో మనం అనుకున్నట్లు అంతా..అవినీతిపరులు కారు. కొందరు అద్భుతమైన వార్తలు రాసారు, కుంభకోణాలు వెలికి తీసారు. తన కుమారుడిని ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం డిపార్టుమెంటులో చదివించిన రామోజీ గారు...సొంతగా ఒక జర్నలిజం స్కూల్ ఏర్పాటు చేసుకుని....సంస్థ అవసరాలకు అనుగుణంగా పర్మినెంట్ విలేకరులను, సబ్-ఎడిటర్లను తయారు చేసుకుంటున్నారు.


ఇలా తెలుగు జర్నలిజం 'ఈనాడు' వటవృక్ష ఛాయలో వర్ధిల్లుతూ ఉండగానే...రవిప్రకాష్ అనే జర్నలిస్టు వెలుగులోకి వచ్చాడు. స్ఫురద్రూపి, వాక్శుద్ధి గల విద్యావంతుడు, ఏదో చేయాలన్న తపన బలీయంగా గలవాడు కావడం చేత...రవి పెట్టించిన TV-9 అనతి కాలంలోనే వినుతికెక్కింది. వార్తలే కాదు...యాంకర్ల డ్రస్ కూడా జనంలో కేక, కాక పుట్టిన్చాలన్న పాశ్చాత్య దృక్కోణంతో రవి బృందం దూసుకుపోయింది. అప్పటికే...'ఈనాడు,' 'ఈ-టీవీ' వంటి సంప్రదాయ ఛానెల్స్ తో మొహం మొట్టిన తెలుగు జనం...TV-9 ను ఆదరించారు. జనం సమస్యలతో పాటు, సెక్స్ ను ఈ ఛానల్ ఒక అస్త్రంగా వాడుకుని...రేటింగ్స్ ఆధార ప్రోగ్రామ్స్ నిర్మించి నంబర్-1 అయ్యింది.



'ప్రజాహితం', 'మెరుగైన సమాజం' వంటి అందమైన మాటలు వల్లిస్తూ...ఫ్లోరోసిస్, అవినీతి వంటి సమస్యలపై ఉద్యమాలు చేస్తున్నట్లు చెప్పుకుంటూనే...సెక్స్ ఎలిమెంట్ ప్రతి వార్తలో చూపిస్తూ రవి ఛానల్ తిరుగులేని 'infotainment channel' అయ్యింది. ఆ ఛానల్ చూపిన విజయసూత్రం అనుసరించడం కోసం అన్ని ఛానెల్స్ పాకులాడుతూ ఒక పక్క, పొజిషన్ నిలబెట్టుకునే క్రమంలో రవి టీం ఒక పక్క తెలుగు టెలివిజన్ జర్నలిజాన్ని మరింత దిగజారుస్తూ...పరిస్థితిని ఇక్కడిదాకా తెచ్చాయన్న అపవాదు ఉంది. 

ఆయన బృందంలో కీలక సభ్యుడు కరీం గారు ..అమ్మాయిల విషయంలో బద్నాం అయి...చివరకు దారుణంగా యాసిడ్ దాడికి గురికాగా, మరొక సభ్యురాలు స్వప్న రేడియోలో తన అదృష్టం పరీక్షించుకుని ఇప్పుడు 'సాక్షి' ఛానల్ లో దర్శనమిస్తున్నారు. కరీం కూడా ఏదో ఛానల్ లో తెర వెనుక ఉండి సేవలు అందిస్తున్నారు. ఏ చర్చనైనా అవలీలగా నవ్వుతూ నిర్వహించే....రజనీకాంత్ గారు మధ్యలో TV-9 వీడి మరొక ఛానల్ లో చేరి అక్కడ తట్టుకోలేక మళ్ళీ పాతగూటికే చేరుకున్నారు.  రామోజీ లేదా రవి బృందంలో పనిచేసిన వారే...ఇప్పుడు అన్ని ఛానెల్స్ లో కీలక పదవులు నిర్వహిస్తున్నారు.

ఇప్పుడు TV-5 లో ఇన్ పుట్ ఎడిటర్ గా ఉండి...వివాదాస్పద చర్చ జరిపి జైలుకెళ్ళిన వెంకట క్రిష్ణ 'ఈనాడు', 'ఈ-టీవీ' లో చాలాకాలం పనిచేసారు. పరిశోధనాత్మక కథనాలు ఇవ్వడంలో దిట్ట అయిన ఈయన ఒకప్పుడు రామోజీ గారి ఇష్టుడు.

ఇదే కేసులో ఇరుక్కున్న N-TV లో ఉన్నకొమ్మినేని శ్రీనివాస రావు, ఏలూరి రఘుబాబు, వీ.ఎస్.ఆర్.శాస్త్రి, శ్రీరాం తదితరులు కూడా 'ఈనాడు' ప్రోడక్టులే. వీరంతా రామోజీ గారి ప్రియతముల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నవారే. ఈ బ్యాచ్ లోనే ఉన్న రాజశేఖర్ గారిది ఇంకొంత డైనమిక్ చరిత్ర. రామోజీ దగ్గర, రవి ప్రకాష్ దగ్గరా పనిచేసారాయన. తాను కీలక భూమిక poshinchina TV-9 నుంచి వివాదాస్పద పరిస్థితుల నడుమ వైదొలిగి...అజ్ఞాతంలోకి వెళ్ళిన రాజశేఖర్ ఆ తర్వాత మరొక రాజ కుటుంబం తో 'i-news' పెట్టించి....అక్కడా అచ్చిరాక ఈ మధ్యనే N-TV లో చేరారు.

Saturday, January 9, 2010

TV-5 ఎడిటర్ల అరెస్టు...ఏ రకంగా తప్పు?

మన వ్యవస్థలను నాలుగు కాలాల పాటు రక్షించుకునేందుకు రూల్స్ పెద్దగా లేవు. ఒకవేళ ఉన్నా...అందరం వాటిని తుంగలో తొక్కేందుకు ప్రయత్నాలు చేస్తాం. ముఖ్యంగా 3 Ps (Politicians, Police, Press) లో ఉన్న వారు తాము ఈ రూల్స్ కు అతీతులమని విశ్వసిస్తూ పదే పదే వ్యవస్థలను అపహాస్యం చేస్తున్నారు. దీనివల్ల ప్రజల నమ్మకం కోల్పోయి సిస్టమ్స్ బ్రష్టుపట్టిపోవడమో, నీరుకావడమో జరుగుతున్నది.

TV-5 లో ఎడిటర్ స్థాయిలో ఉన్న ఇద్దర్ని ఒక ప్రమాదకరమైన గాలివార్త విషయంలో పోలీసులు అరెస్టు చేయగానే జర్నలిస్టు లోకం గగ్గోలు పెడుతున్నది. సంచలనాలే ఊపిరిగా బతికే ఒక రష్యన్ వెబ్ సైట్ లోని నాలుగు నెలల కిందటి వార్తకు తాజాదన్న కలర్ ఇచ్చి అగ్గి రాజేసి...చోటామోటా నాయకుల అభిప్రాయలు స్వీకరించి ఆజ్యం పోసి రాష్ట్రంలో భుగభుగలు సృష్టించిన ఛానల్ ను...పత్రికా స్వేచ్ఛ పేరిట వదిలేయాల? ఆ ఛానల్ ను శిక్షించకపోతే అది పోలీసుల తప్పు కాదా? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. 

"ఈ విచక్షణను మరిచి జర్నలిస్టులు నిరసన ర్యాలీలు జరపడమేమిటో నాకు అర్థం కావడం లేదు. ఆ ఛానల్ కచ్చితంగా శిక్షార్హురాలే," అని ఒక సీనియర్ మిత్రుడు వ్యాఖ్యానించాడు. నాకు ఈ అభిప్రాయంలో తప్పు ఉన్నట్లు కనిపించడంలేదు.

కాకపోతే...ఇన్ పుట్ ఎడిటర్, సీనియర్ ఎక్జిక్యుటివ్ ఎడిటర్ లతో పోలీసులు వ్యవహరించిన ధోరణితో పాటు మరొక్క అంశంలో నాకు అభిప్రాయబేధం ఉంది. సాధారణంగా...పత్రికలలో ఇలాంటి తప్పులు దొర్లితే..ఎడిటర్ మరియు పబ్లిషర్ ల మీద కేసులు నమోదు అవుతాయి. ప్రస్తుత కేసులో TV-5 యజమానిని, అతని కొడుకును అరెస్టు చేయాలి తప్ప జర్నలిస్టులను బుక్ చేయడం ఏమిటన్న ప్రశ్న ఉదయిస్తున్నది. 

ఇప్పుడు ఛానెల్స్ ను జర్నలిస్టులు నడపడం లేదు. యజమాని, వాడి తాబేదారు కార్యాలయాలలో తిష్టవేసి ఏ వార్త ఎలా ట్విస్ట్ చెయ్యాలో చెబుతున్నారు. యజమాని ప్రతి దాంట్లో వేలుపెట్టి ఆదేశించడం పూర్వంలో లాగా సీనియర్ జర్నలిస్టుల బృందాలకు ఇబ్బందికరంగా లేదు. ఎందుకంటే...ఇది...రేపు దావూద్ ఇబ్రహీం వచ్చి ఎక్కువ డబ్బులిస్తే...తనతో కలిసి నిర్మొహమాటంగా ఛానల్ లాంచ్ చేసే పరమ తుక్కు బ్యాచ్. 

వీళ్ళకు నీతీనిజాయితీ, దేశభక్తి ఉన్న దాఖలాలు లేవు. "ఒక సిరా చుక్క లక్ష మెదళ్ళకు కదలిక," "మీడియా ద్వారా...ప్రజలు సమాచారం గ్రహిస్తారు. దాని ఆధారంగా ఒక అభిప్రాయానికి వస్తారు. వారి అభిప్రాయం ప్రజాస్వామ్య సమాజానికి వెనుదన్ను," అన్న సత్తెకాలపు స్పృహ వీరికి లేదు. డబ్బు కోసం ఏ పనైనా చేసే జర్నలిస్టులు ఎక్కువయ్యారు. విలాసాల మోజులో పడి పర స్త్రీలు, సహచరుల సంసారాలు నాశనం చేస్తున్నారు. యజమాని వేసే ఎంగిలి మెతుకుల కోసం వాడికి మీడియాను అడ్డం పెట్టుకుని ఒక ఎస్.ఈ.జడ్. సంపాదించేందుకు కృషిచేస్తున్నారు. ఇది వారికి తప్పు అనిపించడం లేదు.

 

కొన్ని చోట్ల జర్నలిస్టులు నిర్ణయాలు తీసుకునే స్థానంలో ఉన్నప్పటికీ...వారు బూతు అయస్కాంతానికి అతుక్కుపోయి మెరుగైన సమాజం పేరిట సిక్ సమాజాన్ని నిర్మిస్తున్నారు. ముందు ఈ బ్యాచ్ దూకుడుకు ముకుతాడు వేస్తే...ఒక 24 గంటలలో మెరుగైన సమాజం మనకు కనిపిస్తుంది. ఈ ఛానల్ లో బూతును వ్యవస్థీకృతం చేసి...అదే టీ.ఆర్.పీ.రేటింగ్ పెరగడానికి తారకమాత్రం అని వివిధ ఛానెల్స్ యాజమాన్యాలకు నిరూపిస్తున్న...ఒక దుర్మార్గపు జర్నలిస్టును దావూద్ ఇబ్రహీం దగ్గరకు పంపినా సమస్య కొంతవరకు పరిష్కారమవుతుంది.

ఇప్పుడు తెలుగు గడ్డపై డజనుకు పైగా ఛానెల్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. వీరిలో ఎందరికి సమాజహితం పరమావధి? కొన్ని వినోదాత్మక ఛానెల్స్ సినిమా బిట్లు, బూతు పాటలు, రియాలిటీ షోలు...తదిరాలతో సాగుతుండగా...మెజారిటీ ఛానెల్స్ కు  సంచలనం చేయడం (sensationalize), మరీ చిల్లరగా వ్యవహరించడం (trivialize) నిత్యకృత్యం అయ్యింది. పవిత్రమైన ఎడిటింగ్ తో సంబంధం లేకుండా...లైవ్ టెలికాస్ట్ లు చేస్తూ...వీలైనంతగా మంటల్లో కిరోసిన్ పోసి...పిచ్చి చర్చలు జరుపుతూ...కుర్ర జర్నలిస్టులతో కాలక్షేపం చేస్తున్నారు ఈ ఛానెల్స్ వారు.

విలేకరులకు శిక్షణ, కాలానుగుణంగా పునఃశిక్షణ (reorientation) ఉండడం లేదు. తప్పులు చేయడం..."పత్రికా స్వేచ్ఛ" పేరుతో తప్పించుకోవడం యథేచ్ఛగా జరుగుతున్నది. తప్పులకు శిక్ష ఉండాలి. తప్పులను, శిక్షలను అంతా గౌరవించాలి.దీనికి అమెరికా వంటి దేశాలలో ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. మనం మాత్రం...శిక్ష పడితే..ధర్నాలు చేస్తాం. యాజమాన్యాలు నిర్దయగా జర్నలిస్టులను ఉజ్జోగాల నుంచి చెప్పాపెట్టకుండా తీసేస్తే...వేల మంది వీధిన పడితే జరగని ధర్నాలు...ఇప్పుడు ఒక ఛానల్ కోసం జరుగుతున్నాయి. 


అన్ని ఛానెల్స్ డీ.డీ., ఏ.ఐ.ఆర్.లలో మాదిరిగా తప్పులు పట్టుకునే "డ్యూటీ ఆఫీసర్" లేదా వృత్తిలో తలపండిన నీతిమంతులైన జర్నలిస్టులతో "అంబుడ్స్మన్" వంటి వ్యవస్థలను నిర్మించుకోవాలి. 

అసలు జర్నలిస్టు సంఘాలు గట్టిగా ఉంటే..ఈ సమస్య రాదు. నీతికి కట్టుబడి జర్నలిజం చేసే జర్నలిస్టులు లేక పోలేదు కానీ...యజమానుల నుంచి వారిని ఆదుకునే జర్నలిస్టు సంఘాలు లేవు. తరతరాలుగా జర్నలిస్టుల నేతలుగా చెలామణి అవుతున్న వారు...స్వచ్ఛందంగా పక్కకు తప్పుకుని...సదాలోచన పరులైన...నీతిమంతులైన జర్నలిస్టులకు పట్టం కట్టడం తక్షణావసరం. 

యజమానుల అఘాయిత్యాలకు చెక్ పెట్టి...నీతికి కట్టుబడే జర్నలిస్టులకు అందదండా అందించే ఒక నూతన వ్యవస్థ ఆవిష్కృతం కాకపోతే...మీడియాలో నీతే బతకదు. ఆదుకునే నాథుడు లేకపోవడంతో....బతుకు తెరవు కోసం...జర్నలిస్టులు యజమానుల అడుగులకు మడుగులొత్తుతున్నారు. ఈ క్రమంలో వృత్తిలోకి తాలు సరుకు వచ్చి చేరుతున్నది. ఈ అరెస్టులను అందరూ ఒక గుణపాఠం గా భావించాలి. ఈ రూల్స్, అరెస్టుల  బూచిని చూపి జర్నలిస్టులు యాజమాన్యాల కక్కుర్తి, ఛీప్ ట్రిక్ లు నిలువరించవచ్చు. పరమ పవిత్రమైన ఈ వృత్తిని కాపాడుకోవడానికి, ఇందులో నైతిక విలువలు పునరుద్ధరించడానికి ఇంతకన్నా మంచి తరుణం లేదు. 

Friday, January 8, 2010

TV-5 జర్నలిస్టులను అరెస్టు చేసిన CID:: 'సంచలన' కథనం పర్యవసానం

ఇది తెలుగు జర్నలిజం చరిత్రలోనే ఒక మలుపుగా చెప్పుకోదగ్గ పరిణామం. 

ఒక సంచలనాత్మక రష్యన్ వెబ్ ఎడిషన్ నాలుగు నెలల కిందట వై.ఎస్.ఆర్. దుర్మరణంపై పోస్ట్ చేసిన ఒక కథనం ఆధారంగా దాదాపు నాలుగు గంటల పాటు చర్చ జరిపి...రిలయన్స్ ఆస్తులపై దాడికి పరోక్షంగా కారణమయినందుకు TV-5 ఛానల్ మూల్యం చెల్లించుకుంది.

ఆ ఛానల్ ఎక్సిక్యుటివ్ ఎడిటర్ బ్రహ్మానంద రెడ్డి, ఇన్-పుట్ ఎడిటర్ వెంకట క్రిష్ణ లను హై డ్రామా నడుమ సీ.ఐ.డి. పోలీసులు రోజంతా TV-5 ఆఫీసులోనే విచారణ జరిపి రాత్రి అరెస్టు చేసారు. ఆఫీసులో కంప్యూటర్ హార్డ్ డిస్క్ లతో పాటు...వారి సెల్ ఫోన్ లను కూడా సీజ్ చేసినట్లు సంస్థ ప్రతినిధులు చెప్పారు. ఇద్దరినీ కేబుల్ నెట్ వర్క్ యాక్ట్ కింద అరెస్ట్ చేసి...సీ.ఐ.డి. అధికారులు తరలిస్తుండగా...ఆ సంస్థ ఉద్యోగులు అడ్డుకున్నారు. వారిని కూడా అరెస్టు చేసినట్లు ఆ ఛానల్ ప్రకటించింది. ఈ అరెస్టులను ఖండిస్తూ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో జర్నలిస్టులు ప్రదర్శనలు నిర్వహించారు. 

TV-5 భూతద్దంలో చూపి ప్రసారం చేసిన కథనం చూసి వై.ఎస్.అభిమానులు ఆగ్రహంతో చేసిన దాడిలో రిలయెన్స్ కు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. పోలీసులు తమంత తాముగానే కేసు నమోదు చేసిందీ, లేక రిలయన్స్ ఫిర్యాదుపై స్పందించి అరెస్టులు చేసిందీ తెలియరాలేదు.



TV-5 కు దీటుగా రష్యన్ వెబ్ సైట్ కథనం ఆధారంగా వండి వార్చిన సాక్షి, N-TV ఛానెల్స్ పై కూడా కేసులు నమోదు అయ్యాయి. ఆ ఛానెల్స్ లో ఆ కథనం ప్రసారం కావడానికి బాధ్యులైన వారిని కూడా అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం అయ్యింది. టీ.ఆర్.పీ.రేటింగ్ పిచ్చిలో పడి బాధ్యతారహితంగా వ్యవహరించే ఛానెల్స్ కు ఇది ఒక చెంపపెట్టు లాంటిదని పలువురు సీనియర్ జర్నలిస్టులు, మేథావులు వ్యాఖ్యానించారు. 


విచిత్రంగా...ఈ ఛానెల్స్ కథనాలను ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర పత్రికలు తీవ్రంగా ఖండిస్తూ బ్యానర్ వార్తలు ప్రచురించాయి. తెలుగు టెలివిజన్ లో సంచలనాలు సృష్టిస్తూ బూతు బొమ్మల మీద బతుకుతున్న TV-9 తానేదో ఆరిందయినట్లు ఈ ఛానెల్స్ కు వ్యతిరేకంగా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. ఇందులో జర్నలిస్టు సంఘాల నేతలు శ్రీనివాస రెడ్డి, అమర్ లు కూడా TV-5 చేసిన పనిని హర్షించలేదు. ఈ కేసులో కాకపోయినా...బూతులు ప్రసారం చేసినందుకు....నీలి ఛానెల్స్ పెద్దలను కూడా పనిలో పనిగా బుక్ చేస్తే బాగుంటుందన్న భావన వ్యక్తమవుతున్నది.  మరి మీరేమి అంటారు?

Thursday, January 7, 2010

వై.ఎస్.ఆర్. దుర్మరణంపై TV-5 కథనం; గందరగోళం

తెలుగు టెలివిజన్ రంగంలో మునుపెన్నడూ లేని ఒక అరుదైన వింత సంఘటన జనవరి ఏడో తేది రాత్రి జరిగింది. అది నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి దుర్మరణంపై TV-5 ఛానల్ దాదాపు మూడు గంటల పాటు ప్రసారం చేసిన ఒక "సంచలనాత్మక" కథనం. ఈ 'గొర్రెదాటు మీడియా' ఒక పరిశోధనా పాడూ లేకుండా వార్తలను క్షణం ఆలస్యం చేయకుండా ఎలా వాస్తవాలుగా చిత్రీకరించిపారేస్తుందో కూడా ఈ సంఘటన నిరూపించింది. 

మాస్కో కేంద్రంగా రెండు వారాలకొకసారి వచ్చిన సంచలనాత్మక పత్రిక  "The eXile" మూతపడిన తర్వాత ప్రారంభమైన exiledonline.com అనే వెబ్ సైట్ అందించిన ఒక వార్తా కథనం ఈ రాత్రి పెద్ద సంచలనం సృష్టించింది. కృష్ణా బేసిన్లో గ్యాస్ విషయంలో వై.ఎస్.ఆర్. అంబానీ సోదరులతో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా టఫ్ గా వ్యవహరించారనీ, అది గిట్టక వాళ్ళో, ఇద్దరిలో ఒకరో ఆయన హత్యకు పథకం పన్నారనీ, ఇదొక వెయ్యి కోట్ల రూపాయల డీల్ అనీ... స్థూలంగా ఈ వ్యాసంలో ఉంది(ట). హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన కెప్టెన్ భాటియా మృతదేహం ఛిద్రం కాకపోవడం ఈ అనుమానాలకు మరింత బలమిస్తున్నదని ఈ వెబ్ సైట్ లో రాసారట. 

 
ఈ కథనాన్ని బేస్ చేసుకుని TV-5 యాంకర్, సీనియర్ జర్నలిస్టు వెంకటక్రిష్ణ మూడు, నాలుగు గంటల పాటు ఒక సీరియస్ చర్చ జరిపారు. తన వాక్చాతుర్యంతో ఆయన షో ను పండించగా...మాజీ మంత్రి మారెప్ప ఆ కథనాన్ని బలపరిచేలా మాట్లాడారు. ఈ చర్చ జరుగుతుండగానే...నిజంగానే ఆశ్చర్యకరంగా అ వెబ్ సైట్ పనిచేయడం మానేసింది. ఆ పేజీలు  ఓపెన్ చేస్తే "Error establishing a database connection" అని  రావడం మొదలయ్యింది. దీంతో...వెంకట క్రిష్ణ అనుమానం మరింత బలపడి వెరీ సీరియస్ చర్చ ఆరంభించారు. "మా చర్చ జరుగుతుండగానే...వెబ్ సైట్ ఎందుకు క్లోజ్ చేసారని మీరు భావిస్తున్నారు?" అని ఆయన అడగడం..."ఇది కూడా కుట్రలో ఒక భాగమే" అని కొందరు చర్చలో అనడం జరిగిపోయింది. ఇందులో నిజమెంతో ఆ పైవాడికే తెలియాలి. అంతకుముందు...ఆ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకున్న ఈ కథనం మీద TV-5 ఎక్స్ క్లూజివ్ అన్న ముద్రవేసుకుని, దాన్ని తెర నిండా చూపిస్తూ కార్యక్రమం నడిపింది.


ఆ సమయంలో TV-5 చూసిన మరికొన్ని ఛానెల్స్ వెంటనే...రంగప్రవేశం చేసాయి. ఒక పక్క మన TV-9 వెంటనే రజనీ బాబును రంగప్రవేశం కావించగా, వై.ఎస్.తనయుడి ఛానల్ 'సాక్షి' కూడా ఈ స్టోరీ ని అందబుచ్చుకుంది. TV-5 కు తీసిపోకుండా..."పావురాల గుట్టు" అంటూ రజని దడదడ లాడిస్తూ ఉండగానే...N-TV ఏకంగా TV-5 ను అనుసరిస్తూ ఆ వెబ్ సైట్ కథనం మీదనే పూర్తి దృష్టి కేంద్రీకరిస్తూ...హడావుడి చేసింది. 

ఇది చూసి ఉత్సాహం, ఉత్తేజం పొంది...మహా టీవీ కూడా చటక్కున రంగప్రవేశం చేసింది. అప్పటికే i-news లో 'హార్డ్ కోర్" అనే ఒక చక్కని చర్చా కార్యక్రమంలో రాష్ట్ర బడ్జెట్ పై సీరియస్ గా డిస్కషన్ చేస్తున్న రవి ఇతర ఛానెల్స్ లో జరుగుతున్న హడావుడికి ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. వెంటనే..బడ్జెట్ సంగతి పక్కనపెట్టి...అర్థంతరంగా ఆయన కూడా వై.ఎస్.ఆర్. దుర్మరణం వెనుక గుట్టుపై చర్చ మొదలెట్టారు.

ఈ ఛానెల్స్ అన్నీ ఒక వెబ్ సైట్ కథనంపై ఎక్కడలేని హడావుడి చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ కథనంతో ఆగ్రహం చెందిన కొందరు వై.ఎస్.ఆర్. అభిమానులు పలుచోట్ల రిలయన్స్ సంస్థల ఆస్తులపై దాడులు ప్రారంభించారు. కొందరు కడప బంద్ కు పిలుపు కూడా ఇచ్చారు. దీని పరిణామాలు శుక్రవారం గానీ బోధపడవు.


అప్పుడు ABN- ఆంధ్రజ్యోతి ఛానల్ కూడా బరిలోకి ప్రవేశించింది. స్టార్ యాంకర్ మూర్తి కొత్త వాదనతో ముందుకు వచ్చారు. అసలు ఆ వెబ్ సైట్ వై.ఎస్.ఆర్. మృతిపై...నాలుగు నెలల కిందట ఆయన మరణించిన తర్వాతి రోజు ఫ్లాష్ చేసిందని...ఆ కథనంపై ఒకే సారి మూడు తెలుగు ఛానెల్స్ ఇప్పుడు హడావుడి చేయడమేమిటన్నట్లు ఆయన మాట్లాడారు. వికిపిడియా లో ఆ పత్రికకు ఉన్న మురికి చరిత్రను మూర్తి గారు వివరిస్తూ....ఈ కథనానికి ఇంత పెద్ద ప్రాముఖ్యత ఇవ్వవలసిన పనిలేదన్నట్లు మాట్లాడారు. ఇదండీ సంగతి.

Wednesday, January 6, 2010

మీడియాపై జే.పీ. మేధోపరమైన దాడి!

ఏదో ఒక సంచలన ప్రకటన చేస్తే మీడియా దృష్టిలో పడవచ్చు...ప్రజల చర్చలలో నలగవచ్చు...అన్న తీట రాజకీయ నాయకుడనబడే వాడికి ఉండే దుర్లక్షణాలలో ఒకటి. మాజీ ఐ.ఏ.ఎస్.అధికారి, లోక్ సత్తా అధినేత డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ గారికి కూడా ఎం.ఎల్.ఏ. అయ్యాక ఇది అబ్బినట్లు నాకు అనిపిస్తున్నది.

పదిహేను రోజుల పాటు ఛానెల్స్ ను  మూసివేస్తే పరిస్థితి చక్కబడుతుంది అని ఆయన సెలవిచ్చారు. అసెంబ్లీ కార్యక్రమాలను మీడియా ప్రసారం చేయడం ఆపాలన్న వై.ఎస్.రాజశేఖర రెడ్డి గారి కుతంత్రంలాంటిదే జే.పీ.గారి సూచన. పందికొక్కు దూరిందని కొంపను తగలబెట్టడమంటే ఇదే. ఇది ప్రజలకున్న సమాచార హక్కును తస్కరించడం, మీడియాకు ఉన్న స్వేచ్ఛను హరించడం.

దీనికన్నా...మంచి మందును మా మిత్రుడు ఒకడు సూచించాడు. ఈ సమస్యకు కారణమైన నాయకులు ఎవరో మనకు తెలుసు కాబట్టి...వారిని అసెంబ్లీ ముందు నిలబెట్టి....కాల్చిపారెయ్యడమో....అందర్నీ కట్టకట్టి బంగాళా ఖాతంలో తోసెయ్యడమో చేయాలి. జే.పీ.గారు సూచించిన దానికన్నా ప్రభావశీలంగా పనిచేసే మంచి మందు కాదా ఇది? 

ఎన్నికలకు ముందు...దూరాశతో పుట్టుకొచ్చిన పలు ఛానెల్స్ జనానికి జుగుప్స కలిగిస్తున్నాయి. ఇది ఎవ్వరూ కాదనని సత్యం. వీటికి ముకు తాడు వేసే యంత్రాంగం కావాలని సదాలోచనపరులు కోరుకుంటున్నారు. రాష్ట్రం రగులుతుంటే....అవి అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. పిచ్చి కుక్కల రేసులా...టీ.ఆర్.పీ. రేటింగ్ యావలో పడి ఈ ఛానెల్స్ చాలా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నాయి. (అందుకే...ఛానెల్స్ యజమానులు, ఎడిటర్స్ సమావేశమై స్వీయనియంత్రణ వ్యవస్థను రూపొందించుకోవాలని   ఈ బ్లాగ్లో ఎప్పుడో మొత్తుకున్నా అది అరణ్యరోదనే అయ్యింది. శ్రీమాన్ రవిప్రకాష్ కు కూడా వినమ్రంగా ఆ పోస్ట్ మెయిల్ చేశాను. సారు పట్టించుకోలేదనేది వేరే విషయమనుకోండి.)


ఏ బంగి అనంతయ్యో మీడియా నిషేధం వంటి దుందుడుకు ప్రకటన చేస్తే...పోనీ..పాపం...పెద్దగా తెలీని మనిషి...అనుకోవచ్చు. కానీ..జే.పీ.లాంటి మేధావి ఈ ప్రకటన చేయడం ఆందోళనకరం. ఆయన ఏదో నిస్పృహతో ఇలా మాట్లాడారని భావించి మెదలకుండా ఉండడం బెటర్.


జే.పీ.గారూ....ముందుగా మీరొక మూడు పనులు చేసి ఈ స్టేట్ మెంట్ ఇచ్చివుంటే....మర్యాదగా, బాధ్యతాయుతంగా ఉండేది. 

ఒకటి) మీడియా ధోరణులను వాటి యజమానులకు తెలిసే ప్రయత్నం మీరు ఒక్కటైనా చేసారా? ఈ ఘర్షణలు చెలరేగగానే వారితో మీరు ఒక మీటింగ్ జరిపితే ఎంత బాగుండేది! మీరు పిలిస్తే...వారు తప్పనిసరిగా వచ్చివుండే వారు. సమస్య తీవ్రతను వారికి తెలియజెప్పి ఉండాల్సింది. ఏదో...అడ పిల్లల నగ్న శరీరాలు జననానికి చూపి...నాలుగు ప్రకటనలు సంపాదించాలని అనుకునే...పరమ కర్కోటక జాతికి చెందిన పశువులు ప్రవేశించిన రంగమిదని మీరు మరిస్తే ఎలా? 

రెండు) మీ లోక్ సత్తా వేదికగా మీడియా పాత్రపై అన్ని జిల్లాలలో చర్చ నిర్వహిస్తే బాగుండేది. మీడియా యజమానులకు దానివల్ల కొంత బుద్ధి వచ్చేది. 
మూడు) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మీరు మీడియా నియంత్రణ గురించి లేఖలు రాసి జనాలను చైతన్య పరచాల్సింది. 

ఇక అన్నింటికన్నా ముఖ్యమైనది...."మీడియా తోడేళ్ళ పోరాటం" చేస్తున్నదని మీరు భావిస్తున్నారు కాబట్టి...ఈ ధోరణికి నిరసనగా...ఆ ఛానెల్స్ లో చర్చలలో మీరు, మీ కటారి శ్ర్రీనివాస రావు గారు పాల్గొనకుండా ఉండాల్సింది. లేదా నల్ల బ్యాడ్జ్ లతో చర్చలలో పాల్గొనాల్సింది. ఇలాంటి పనులు చేయకుండా...వింత ప్రతిపాదనలు చేయడం...దారుణం.



అయ్యా...జే.పీ.గారూ మీరు ఈ రాత్రి 'మహా టీవీ' చర్చలో చెప్పినట్లు...ప్రచారం అనేది రాజకీయనేతలకు ఆక్సిజన్ లాంటిది. అది లేనిదే...వారూ, మీరూ బతకలేరు. ఇప్పుడు మీకు మనసుబాగోలేక...మీడియా ను కొన్ని రోజులు నిషేధీద్దామని అంటున్నారు. రేపు మరొక సమస్య వస్తే...ఆ లగడపాటో, కే.సీ.ఆరో మరి కొన్ని రోజులు నిషేదిద్ధమంటారు. అప్పుడేమి చేస్తారు? 

సార్...మీడియా చేస్తున్న అఘాయిత్యాలు కోకొల్లలు. దీని విపరీత పోకడల గురించి రోజూ నెత్తి నోరూ బాదు కుంటున్నామిక్కడ. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే...సమస్యకు మూలం ఆలోచించండి, ప్రక్షాళనకు నడుం బిగించండి. అంతే కానీ.. సగటు రాజకీయ నాయకుడిలాగా నోటికొచ్చింది మాట్లాడి...ప్రజాస్వామ్యంలో ఒక కీలక వ్యవస్థకు మాత్రం చిక్కులు తేకండి.

Tuesday, January 5, 2010

మీడియా --అడ్వర్టైజుమెంటు మాఫియా

తెలుగు టెలివిజన్ ఛానెల్స్ లో బూతు కార్యక్రమాల ప్రసారంపై మేము రాసిన పోస్టులకు...చాలా ఆవేదనతో క్రమంతప్పకుండా స్పందిస్తున్న సదాలోచానపరుల్లో గౌరవనీయులు కప్పగంతు శివరామ ప్రసాద్ గారు ఒకరు. సమాజహితం పట్టని ఈ నీచ నికృష్ట ఛానెల్స్ పై కోర్టుకు వెళ్తే ఎలావుంటుందని కూడా వారు సూచించారు. TV-5 ప్రసారం చేసిన 'నగ్నా'మృతం...మీద పెట్టిన పోస్టుకు స్పందనగా వారు పంపిన వ్యాఖ్యను ఇక్కడ ఇస్తున్నాము. సమాజం గురించి ఆందోళన చెందుతున్న శివ గారికి హృదయపూర్వక అభినందనలు---రాము, హేమ
---------------------------------------------------------

ఈ విషయం మీద కొంత ఆలోచించిన మీదట నాకు అనిపించినది ఏమంటే, ప్రస్తుతం మన సమాజం అడ్వర్టైజుమెంటు మాఫియా చేతుల్లో నలిగి పోతోంది. ఈ మీడియా గాళ్ళందరూ, ఆ మాఫియా చేతిలో కీలు బొమ్మలే. చాపకింద నీరులాగ, ఈ అడ్వర్టైజుమెంటు మాఫియా అన్ని చోట్లా చేరి మన జీవితాలను భ్రష్టు పట్టించి తమ తమ వ్యాపార పబ్బాలను గడుపుకోవటానికి అన్ని పన్నాగాలను పన్నుతోంది. ఏ చానెల్ కు ఏ రేటిన్గు? ఎందుకు? ఎవడికి ఎంత రేటింగు అయితే అన్ని అడ్వర్టైజుమెంటులు వస్తాయి, దాంతో బాటే డబ్బులు. అది అసలు కథ. 

ఇదివరకు ఎక్కడో ఓ పత్రికలో ఒదిగి ఉండే ఈ అడ్వర్టైజుమెంటులు, ఇప్పుడు కాల సర్పాలలాగ ఆ పత్రికలనే మింగేసి, వాటిల్లో ఉండే కథలను ఇతర శీర్షికలను పక్కకు నెట్టేసి వాటిని ప్రభావితం చేసే స్థాయికి చేరుకున్నాయి. దూరదర్శన్ నుండి ఈ రోగం బాగా వంట పట్టించుకున్నయి చానెల్సు అన్ని.

మనం కూడ అబ్బా బాగుంది బాగుంది... అని ఎగపడి చూస్తున్నాము, వాళ్ళు చెలరేగి పోతున్నారు. మనం చూసే ప్రతి ప్రోగ్రాము, స్పాన్సరుడు, అంటే ఎవడో ఒక వ్యాపారి తన వస్తువులను అమ్ముకోవటానికి ఈ చెత్త ను స్పాన్సరు చేస్తాడు. అది మనం ఎగబడి చూడటం వల్ల తన వస్తువులను (ఎంత పనికిరానివైనా) అమ్ముకోవటానికి ప్రచారం సంపాయించి పదే పదే చూపటం వల్ల మన మీద తెలియకుండా మన కొనుకోలు ప్రవర్తన మీద ప్రభావితం చేస్తారు. 


మనం మన కేబుల్ వాడికి కట్టేదే ఖర్చు అనుకుంటాము. అది సరి కాదు. మనం కొనే ప్రతి వస్తువులోను, మనం చూసే/చదివే ప్రతి చెత్త ఖరీదు పడుతోంది. ఇది తెలుసుకుని, ఇది చూడచ్చు, ఇది చూడకూడదు అని నిర్ణయం తీసుకోగలిగిన పరిణితి మనకు వచ్చి, టీ.వి. తీసేస్తే ఇవన్ని సద్దుమణుగుతాయి. ఇక్కడ బ్లాగుల్లో ఎంత వ్రాసినా అరణ్యరోదనమే. కారణం బ్లాగుల్లో వ్రాసేవారే ఇక్కడ ఎక్కువమంది చదువుతారు, వ్యాఖ్యలు వ్రాస్తారు. జనరల్ పబ్లిక్ కి ఈ బ్లాగుల గురించి తెలుసా?? నాకు అనుమానం. 

ఈ మీడియా వాళ్ళు అస్సలు చూడరు. వాళ్ళకు టైమేది, రేపు మరేమి చెత్త చూపించాలి అన్న విషయం లో చాలా బిజీ. డబ్బులు కోసమే ఈ చానెల్సుకాని, సమాజ శ్రేయస్సు కోసమా? ఈ చానెల్సు పెట్టిన వాళ్ళల్లో ఒక్కడుకూడ సమాజం గురించి అలోచించట్లేదు. సామాజిక స్పృహ (ఈ జర్నలిస్టులమని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఈ మాటను తెగ వాడేస్తుంటారు తమ సౌకర్యం కొద్ది) అనేది మృగ్యం. కాబట్టి ఈ అడ్వర్టైజుమెంటు మాఫియా (అవును మాఫియానే) కోరలలోంచి మనను రక్షించేది ఎవరు? మనకు మనమే. 

అతి వ్యాపార ప్రకటనలు చేశే ఉత్పత్తులను కొనటం మానేయ్యాలి. చండాలపు ప్రోగ్రాములను స్పాన్సరు చేస్తున్న ఈ వ్యాపార సంస్థలకు మన అభిప్రాయాలను తెలియ చెయ్యాలి. ఈ రోజున ఆ పని ఇంటర్నెట్టు ద్వారా చాలా సులభం.

Sunday, January 3, 2010

ఈ 'నగ్నా'మృతం--ఒట్టి బరితెగింపు, ఓ విషప్రాయం

బూతు... ఒక వైరస్. బూతు ప్రోగ్రాంల ద్వారా 'మెరుగైన సమాజం కోసం' పాటుపడుతున్న TV-9 లో జనవరి ఫస్టున కొత్త ఊపుతో ప్రారంభమైన ఈ వైరస్ రెండు మూడు రోజుల్లో అన్ని ఛానెల్స్ కు హెచ్.ఐ.వి.కన్నా ఘోరంగా పాకింది. తెలుగు జనం మెదడు తొలచి...స్త్రీ కనిపించగానే నీచ దృష్టితో కసితో చూసేలా చేసే భయంకరమైన వైరస్ ఇది.


కాంగ్రెస్ నేతల శారీరక సుఖాలు  తీర్చే (తార్చే) కళలో ఆరితీరి కోట్లకు పడగలెత్తిన ఒక కళాపోషకుడు పెట్టిన ఛానల్ లో కూడా...క్యాలండర్ తయారీ పేరిట అందమైన భామల వొంపుసొంపులు చూపారు. ఇది చూసి...మన రేటింగ్స్ గతి ఏమి కాను...అని బాధపడిన మరొక విద్యా సంస్థల వారి ఛానల్ ఎక్కడో అందాల పోటీని రస రమ్యంగా అందించింది. అక్కడా...అర్థ, ముప్పావు నగ్న భామలే వారికి స్ఫూర్తినిచ్చారు. 

ఆ తర్వాత కొన్ని ఛానెల్స్...."మేము సైతం...తెలుగు వాడి నాశనానికి...బూతు ప్రోగ్రాం ఒహటి అర్పిస్తాము"...అని తమవంతుగా నీలి కార్యక్రమాలు ప్రసారం చేసాయి. గవర్నర్ తివారీ తాతయ్యపై నానా యాగీ చేసిన సంధ్యక్కా....ఎక్కడున్నావు తల్లీ! (ఈ పోస్టు చదివిన వారు సంధ్య లేదా ఇతర విప్లవ నారీమణుల మెయిల్ అడ్రస్ లు ఉంటే దయచేసి వారికి న్యూస్ చానళ్ళ బూతు న్యూ సెన్స్ పై మన ఆవేదన తెలియజేయ ప్రార్ధితులు. లేదా, వారి మెయిల్ ఐ.డీ.లు మాకు పంపి పుణ్యం కట్టుకోండి.)


బూతు ఛానెల్స్ పై కొందరు సీరియస్ సీనియర్ బ్లాగర్స్ స్పందించిన తీరుతో ఉత్తేజం పొంది...ఈ ఏడాది మనమేదో ఒకటి చేసి...బూతు ప్రకాష్ లకు బుద్ధి చెప్పాలి...అనుకుంటుండగానే....TV-5 "నగ్నా"మృతం అనే పరమ నీలి కార్యక్రమాన్ని ఆదివారం రాత్రి పది గంటలన్నా కాకముందే చూపింది. 


"కాస్త అందం ఉండి 'ఎక్స్పోజ్' చేస్తే చాలు..."అని ఒక ఆడ యాంకర్ చదవగానే....దిమ్మతిరిగే సీన్లు చూపించారు. హిందీ సినిమాలలో ఉన్న బూతు సీన్లు అన్నీ పట్టుకొచ్చి రూపొందించారు ఈ "స్పెషల్ ఎపిసోడ్"ను. జంటలు షవర్ కింద, మంచం మీద, పార్కులో, బీచులో, గడ్డివాములో తమకంతో రెచ్చిపోతున్న దృశ్యాలు దారుణంగా చూపించారు. దేనికైనా బరితెగించే హీరోయిన్స్ వల్ల ఐటం గర్ల్స్ అవసరం లేకుండా పోయిందని ఒక సారి, బికినీ భామల వల్ల నిర్మాతలకు కాస్ట్యూమ్స్ ఖర్చు తగ్గుతున్నదని మరొక సారి చెప్పి...అచ్చం నీలి చిత్రాలను చూపించారు. "ఇలాంటి సీన్ల లో సీనియర్ స్టార్లే ఈజ్ తో నటిస్తుంటే మరి కొత్త వారి పరిస్థితి ఏమిటి?" అని యాంకరమ్మ కొద్దిగా బాధకూడా పడింది. 


ఇలాంటి స్టోరీ లకు ఒక ఫ్రేం ఉండడంలేదు. నాలుగు పచ్చి శృంగారపు సీన్లు సేకరించడం...వాటికి అనుగుణంగా ఏదో ఒకటి రాయడం...దాన్ని సొంగ కార్చుకుంటూ చూసే తెలుగు జనం ఉన్నారుగా...అని వారి మీదకు విడవడం. ఏదో ఎంటర్ టైన్మెంట్ ఛానెల్స్ ఈ కక్కుర్తి పడితే..చావనీ...అనుకోవచ్చు. న్యూస్ ఛానెల్స్ లో ఇలాంటివి చూపితే ఎలా? 

పిల్లలతో కలిసి కూర్చుని టీ.వీ.చూడలేని పరిస్థితి దాపురించింది. ఈ బూతు వారి కంటపడకుండా ఉండడానికి...మాటి మాటికీ..ఛానల్ మారుస్తుంటే...పిల్లల్లో లేనిపోని ఉత్సుకత (క్యురియసిటి) పెంచడం అవుతోంది. మరి ప్రజలకు మార్గాంతరం ఏమిటి? మీరే చెప్పండి.

----------------------------------------------------------
నోట్: "ఒరేయ్...సమాజహితం పట్టని దౌర్భాగ్యుల్లరా...మీరు మనుషులా..చిత్తకార్తె  కుక్కలా? మీకు తల్లి, చెల్లి, అక్క, కూతురు లేరా? ఈ బూతు ప్రోగ్రామ్స్ ప్రసారం చేసేటప్పుడు కనీసం 'పెద్దలకు మాత్రమే' అన్న అక్షరాలైనా స్క్రీన్ మీద వేసి చావండ్రా..." అంటూ మిత్రుడు సీతారామ శేష తల్పసాయి సంధించిన ఒక వ్యంగ్య అక్షర బాణం త్వరలో...మీ కోసం...

Friday, January 1, 2010

బూతు ఛానెల్స్ పై పౌర ఉద్యమం

అఖిలాంధ్ర ప్రేక్షకులారా....

మనమంతా...ఏవేవో విషయాలపై సొల్లు కబుర్లు మాని సీరియస్ గా కొన్ని అంశాలు చర్చించాల్సిన సమయం ఆసన్నమయ్యింది. ఎంటర్ టైన్మెంట్ ముసుగులో మన సంస్కృతిపై మన టీ.వీ. ఛానెల్స్ జరుపుతున్న దాడి నుంచి సమాజాన్ని కాపాడుకోవాల్సిన సమయమిది. సినిమాల కన్నా వేగంగా, బలంగా కొన్ని ఛానెల్స్ మన సమాజాన్ని మనకు తెలీకుండానే నైతిక సంక్షోభం లోకి నెట్టేస్తున్నాయి. ఇది కంటికి కనిపించని మహా సంక్షోభం, పెను ఉపద్రవం.



స్కూల్ లో చదివే మీ కూతురుకు క్లాస్మేట్ తో లేచిపోవాలని అనిపించకముందే...అక్రమ సంబంధాలు తప్పు కాదు అన్న భావనను  టీ.వీ. సీరియల్స్ నుంచి వంటబట్టించుకున్న మీ ఇంటి ముందు కాలేజ్ కోర్రోడు మీరు లేనప్పుడు...మీ ఇంట్లోకి దూరకముందే...మీ బుర్రల్లో...పరాయి అమ్మాయి కనిపించగానే అందాన్ని సొంతం చేసుకోవాలన్న పిచ్చి పిచ్చి  ఆలోచన ప్రవేశించి మిమ్మల్ని కసాయిగా మార్చకముందే...మీరు మేల్కొనాలి. చదవడానికి ఇది సిల్లీగా కనిపించినా....కాస్త తీరిగ్గా బుర్రపెట్టి ఆలోచిస్తే...మీకే అర్థమవుతుంది...కనిపించకుండా జరుగుతున్న తీవ్ర నష్టం. 


న్యూ ఇయర్ ఆగమనం సందర్భంగా...'కిస్ మిస్' పేరిట ఈ TV-9 ప్రసారం చేసిన ముద్దు సీన్లు చూసారా? ఇదేమి వికృత టేస్టు? సినిమాలలో కళాపోషణ, క్రియేటివిటీ ముసుగులో పెంట మీద రూపయినైనా ఏరుకుని జేబులో వేసుకునే ఏ దర్శకుడో....సమాజంపై ఈ సీన్ల ప్రభావం గురించి ఆలోచించకుండా..చిత్రీకరించిన ముద్దు సీన్లు ఇవి. వీటన్నింటిని...గుదిగుచ్చి ఒక కార్యక్రమంగా మలిచి తెలుగు ప్రేక్షకులపై వదిలారు...TV-9 వారు. ఇది వారికి కొత్త కాదు. ఇతర ఛానెల్స్ కూడా దీన్ని 'సక్సెస్స్ ఫార్ములా' గా స్వీకరించాయి. 

ఇంట్లో పిల్లా పాపలతో..తల్లి దండ్రులతో కలిసి కూర్చొని చూడదగిన ప్రోగ్రామా ఇది? గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పండి...ఇది మిమ్మల్ని ఎంబరాస్ చేయలేదా? ఆ స్క్రిప్టు ఏమిటి? ఆ పిచ్చి సీన్లు ఏమిటి? మనమేమి చేస్తాం?.. అని అనుకుని ఛానల్ మార్చడమో, సిగ్గూ ఎగ్గూ లేకుండా ఆ సీన్లు చూడడమో చేద్దామా? భావ ప్రకటన స్వేచ్ఛ అంటే...మాటి మాటికి...ఏకంగా న్యూస్ బులెటిన్లలో నగ్న, అర్ధ నగ్న అమ్మాయిలను చూపిస్తుంటే...అది మన

ఇంట్లో పిల్లలపై ప్రభావం చూపుతుంటే...రిమోట్ కు పనిచెప్పడం తప్ప ఇంకేమీ చేయలేమా? 

ఇది కాదురా నాయనా...జర్నలిజమంటే...అని మనం (అంటే సాధారణ జనం) గొంతెత్తి చెప్పలేమా? అసలు ఆ హక్కు మనకు లేదా? పిచ్చి కుక్కలా రేస్ లాగా ఛానెల్స్ పోటీ పడి...టీ.ఆర్.పీ. రేటింగ్స్ కోసం న్యూస్ లో స్త్రీ అంగాంగ ప్రదర్శన చేస్తుంటే...ఇది మనకు పట్టని వ్యవహారం ఎలా అవుతుంది?


"మ్యేకింగ్ ఆఫ్ సౌత్ స్కోప్ క్యాలెండర్" అనే ఒక కార్యక్రమాన్ని కూడా ఈ ఛానల్ ప్రసారం చేసింది. ఒక తొక్కలో క్యాలెండర్ కోసం అందమైన భామలు ఇచ్చిన పోజులు...బ్యాక్ గ్రౌండ్ వర్క్... అసలు ఒక కార్యక్రమం ఎలా అవుతుంది? కింగ్ ఫిషర్  క్యాలెండర్ కు సంబంధించిన  ఒక కార్యక్రమాన్ని N-TV ప్రసారం చేసింది. అంటే...మనం ఏది చూపినా..సొంగ కార్చుకుంటూ చూసేందుకు తెలుగు జనం సిద్ధంగా ఉన్నారని ఈ చానెళ్ళ భావనా? జనం బలహీనతపై వీరికి ఎనలేని భరోసా. 

అమెరికన్ టెలివిజన్ కార్యక్రమాలను తన దేశం లోకి అనుమతించని క్యూబా కమ్యునిస్టు వీరుడు ఫిదెల్ క్యాస్ట్రో చెప్పిన ఒక మాట గుర్తుకు వస్తున్నది. "ప్రజలు నా దేశ మానవ వనరులు. స్వేచ్ఛ, భావ ప్రకటన పేరిట మీ కార్యక్రమాలతో మీరు (అమెరికా) వారి బుర్రలను కలుషితం చేస్తానంటే...చూస్తూ ఊరుకునే వెర్రి వెంగళప్పను కాను నేను," అని ఫిదెల్ చెప్పాడు. మన ప్రజలను అద్భుతమైన మానవ వనరులుగా ఎవరూ చూడరేం? ఈ ఛానెల్స్ ప్రతి పల్లె కూ పోతున్నాయి. అవి అక్కడి అమాయకులను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. చదువుకున్న జనమే...రెచ్చిపోయి...ఓకే అనని అమ్మాయిలపై యాసిడ్ దాడులు చేస్తుంటే...పెద్దగా వివేచనలేని వారి గురించి అనుకోవడం దండగ.

"ఏటండీ....ఈ TV-9? కిస్సు సీన్లు మరీ దారుణంగా చూపించేస్తంది? ఇది మరీ దారుణం," అని ఈ ఉదయం రాజమండ్రి వాస్తవ్యుడు ఒకరు ఖైరతాబాద్ లో కలిసి వాపోయారు. చాలా మంది ఈ "హాట్ హాట్" కార్యక్రమాల గురించి ఇబ్బంది పడ్డారు. కానీ...అంతా కిమ్మనకుండా ఉంటే ఎలా? మీ నిరసనను... బూతును ప్రసారం చేసే ఛానల్స్ కు తెలియజేయండి. ఇలాంటి బూతు ఛానెల్స్ ను క్షమించడం బాధ్యతారాహిత్యం.


భారత్ లో ఒక పధ్ధతి ఉన్న వ్యవస్థను మనం నిర్మించుకున్నాం. ప్రకృతి...ఎంతో అద్భుతంగా ఒక వయస్సు ప్రకారం లైంగిక మార్పులను శరీరంలో తీసుకువస్తుంది. మనకొక పటిష్టమైన వివాహ వ్యవస్థ ఉంది. భార్యా, భర్త కొన్ని కొన్ని అభిప్రాయబేధాలు ఉన్నా జీవితాంతం కలిసి ఒక చక్కని వ్యవస్థను ఏర్పరచడం...ఒక సాంప్రదాయంగా వస్తున్నది. అందుకే...ఇతర దేశాల వారు...మన వైపు భక్తి శ్రద్ధలతో చూస్తున్నారు. మన వ్యవస్థ వారికి ఒక వింత....ఇక్కడి "క్రియేటివ్ బ్రైన్స్" కు మాత్రం ఒక రోత. మన సినిమా జనం, టీ.వీ.ల సీ.ఈ.ఓ.లు రేటింగ్స్ కోసం జుగుప్సా కరమైన శృంగారానికి పెద్దపీట వేయడం వల్ల...పిల్లలలో హార్మోన్ల మీద ప్రభావం కనిపిస్తున్నది. ఒక గాఢ చుంబనం వంటి హాట్ సీన్ తెరపై చూసిన అమ్మాయి/ అబ్బాయి లో ఒక్క సారిగా వస్తున్న మార్పు చూడండి. స్కూల్ లెవల్ లోనే ఇవన్నీ చేసుకోవచ్చన్న సందేశం ఇస్తున్నారు. ఇక అక్రమ సంబంధాలను వ్యవస్థీకృతం చేస్తున్నారు. 

సదాలోచన పరులారా....ఈ వ్యవహారం చాప కింద నీరులా మనలను నైతికంగా దెబ్బ తీస్తున్నది. యాసిడ్ దాడులు, హత్యలు, రేప్ ల వంటి నేర ధోరణులు పెచ్చరిల్లడానికి అశ్లీల దృశ్యాలు కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. సమాజంలో కీలక భాగస్వామి అయిన మహిళల పట్ల చులకన భావం ఏర్పడడానికి ఈ ఛానెల్స్ ప్రసారం చేసే చెత్త కార్యక్రమాలే కారణం. "ఇష్టం లేకపోతే..వేరే ఛానల్ చూడండి" అనడం....సరైన జవాబు కాదు.  


ఈ కొత్త సంవత్సరంలో...బాధ్యతాయుతమైన పౌరులుగా...ఈ పాడు కార్యక్రమాలకు మనం అడ్డుకట్ట వేద్దాం. ఈ అంశంపై చర్చ జరుపుదాం...మన నిరశనను టీ.వీ.యాజమాన్యాలకు తెలియజేద్దాం. అందుకు పట్టణాల వారీ గా కొన్ని వేదికలు (ఫోరమ్స్) ఏర్పాటు చేసుకుందాం. బూతు చూపే ఛానెల్స్ ను బహిష్కరిద్దాం. ఇది నైతిక సమాజం కోసం జరిపే..ఒక పవిత్ర కార్యం. రండి..ఇందులో భాగంకండి. మన సమాజాన్ని, సంస్కృతిని మనమే రక్షించుకుందాం.