Tuesday, October 16, 2012

మా డాక్టర్ రెంటాల జయదేవకు నంది అవార్డు

జర్నలిజంలోకి ఇష్టపూర్వకంగా వచ్చి కష్టాలూ నష్టాలూ ఎన్ని ఎదురైనా...తట్టుకుని ఈ వృత్తినే అంటిపెట్టుకుని ఉండే  వాళ్ళు కొద్ది మందే ఉంటారు. ఇది ఉత్తమమైన మొదటి కోవ. ఈ వృత్తిలోకి వచ్చాక...దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందామని అనుకుని నైతికతతో రాజీపడి కులం ప్రాంతాలను అడ్డం పెట్టుకుని విలువలను గాలికొదిలే సార్లకు, తోటి జర్నలిస్టులను వుజ్జోగాల నుంచి తప్పించడానికి ఏ మాత్రం వెనుకాడని మూర్ఖులకు, యజమాని చెప్పిందే వేదమని నమ్మి ప్రచారం చేసే బ్యాచులకు ఖైరతాబాద్, జూబిలీహిల్స్ లలో కొదవే లేదు. ఇందులో మొదటి కోవకు చెందిన జర్నలిస్టు రెంటాల జయదేవ. ఉత్తమ సినీ విమర్శకు గానూ జయదేవ కు నంది అవార్డు వచ్చింది. 

నాకు సన్నిహిత మిత్రుడు అని చెప్పడం కాదు కానీ...జయదేవలో పాతతరం జర్నలిస్టులకు ఉండాల్సిన సద్గుణాలు చాలా ఉన్నాయి. "ఎందుకులే బాబూ...మమ్మల్ని ఇలా బతకనివ్వండి.." అనుకుంటూ తన పని తాను  చేసుకుపోయేగడసరి. ఇచ్చిన పనికి పూర్తి న్యాయం చేయాలని తపిస్తూ...నాణ్యతకు పెద్దపీట వేసే మనిషి. తాను దగ్గరి మనుషులు అనుకుంటే తప్ప మనసులో భావాలను, గుండెలో చిందులు వేసే చిలిపి తనాన్ని వెలికి తీయని మంచి మిత్రుడు. తనకు జరిగినా, ఇతరులకు జరిగినా అన్యాయాలను నిశితంగా విమర్శించే స్వభావం ఉన్నవాడు. అందుకే తానంటే...మా బ్యాచులో దాదాపు అందరికీ చాలా ఇష్టం. 

'ఈనాడు జర్నలిజం స్కూల్' లో మేమంతా కలసి చదువుకున్నాం 1992 లో. ఈనాడు కు గుండెకాయ లాంటి జనరల్ డెస్క్ లో కలిసి పనిచేశాం. "ఈ అబ్బాయి గ్రాంథీక భాష రాస్తున్నాడండీ..." అని అప్పట్లో ఈనాడు జనరల్ డెస్క్ ఇన్ ఛార్జ్ గా ఉన్న ఒక మానసిక వికలాంగుడు రామోజీ రావు గారికి తప్పుడు రిపోర్ట్ ఇస్తే...జయదేవ ఎంతగానో నొచ్చుకుని 'ఈనాడు' నుంచి వెళ్ళిపోయాడు.

ఇప్పుడు ఒక పత్రికకు 'ఎడిటర్' గా ఉండి...అక్కడి జర్నలిస్టులను నంజుకు తింటున్న  ఆ 'మా.వి.' గాడిని ఒక రోజు కోపంతో పక్కకు తీసుకు వెళ్లి అడిగాను...."గుండె మీద చేయి వేసుకుని చెప్పండి....మీరు జయదేవ మీద చేసిన ఫిర్యాదులో నిజమెంత..." అని. అప్పట్లో న్యూస్ టుడే ఏం.డీ.గా ఉండి (ఇప్పుడు తెలుగు దేశం పార్టీ కోసం పనిచేస్తున్న) ఒకడి వల్ల, మరొక ఇన్ చార్జ్ ప్రోద్బలం తో తానూ అలా తప్పుడు నివేదిక ఇచ్చానని 'మా.వి.' ఒప్పుకున్నాడు. మా ప్రిన్సిపాల్ బూదరాజు రాధాకృష్ణ గారి మీద కోపం తో వీళ్ళు  జయదేవను టార్గెట్ చేసారు. ఇలా....అర్థంతరంగా ఈనాడు నుంచి వెళ్ళిన జయదేవ 'ఇండియా టుడే' లో చేరి ఇప్పుడు అసోసియేట్ కాపీ ఎడిటర్ స్థాయికి ఎదిగాడు. తెలుగు నేలకు దూరంగా...వృత్తి నిబద్ధతతో పనిచేస్తూ ఈ స్థాయికి చేరుకున్నాడు. స్వర్గస్థులైన వారి నాన్న గారు, బహు గ్రంథకర్త రెంటాల గోపాల కృష్ణ గారు ఎంతో  సంతోషించే మంచి వార్త ఇది. 

నేను తర్వాత ఐదేళ్లకు 'ఈనాడు' వదిలి చెన్నై లోని ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం లో చేరినప్పుడు జయదేవను కలిసేవాడిని. నవ్వుతూ...తుళ్ళుతూ మాట్లాడే జయదేవ నాకు మంచి స్నేహశీలి గా అనిపించేవాడు. మంచి ఆలోచనలను ప్రోత్సహించేవాడు. తరచి తరచి అడిగితె తప్ప సలహాలు ఇవ్వడు. మా బ్యాచులో మొదటి పీ.హెచ్ డీ అతనిదే. తెలుగులో చేసాడు. జర్నలిజం లో మాస్టర్స్ డిగ్రీ పొందాడు. తాను ప్రమాదకరం అనుకున్న వ్యక్తులతో ఆచితూచి మాట్లాడడం, అంటీ ముట్టనట్లు ఉండడం వల్ల  తనను అపార్థం చేసుకునే వారూ కొందరు నాకు తారస పడ్డారు. అది ఆయా వ్యక్తులకు సంబంధించిన విషయం. జయదేవకు నంది అవార్డు రావడం మాత్రం నాకు నా మిత్ర బృందానికి ఎంతో  ఆనందం కలిగించింది. 

మా వాడు ఎంతటి...మొహమాటస్తుడో తెలుసా మీకు? తాను రెండేళ్లుగా నడుపుతున్న బ్లాగు "ఇష్టపది"  గురించి కనీసం మాట మాత్రమైనా నా లాంటి మిత్రుడికైనా చెప్పలేదు. నాకిది ఈ పోస్టు రాసే ముందు తారసపడింది. ఇదేం  పోయే కాలం అంటే...."ఎందుకులే బాబు...మా బాధ మమ్మల్ని పడనివ్వండి..." అని ఒక నవ్వు నవ్వుతాడు. "జగమంత  కుటుంబం నాది...ఏకాకి జీవితం నాది" అని బ్లాగు స్క్రోల్ లో ప్రకటించిన జయదేవ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, మంచి జర్నలిస్టుగా పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను.  

Sunday, October 14, 2012

మలాలా!...నువ్వు నిండు నూరేళ్ళు బతకాల

చిట్టితల్లీ...మలాలా...

స్కూలు నుంచి వస్తున్న నీ తలపై మనసు చచ్చిన తాలిబాన్ పంది గత మంగళవారం (అక్టోబర్ 9) పేల్చిన తూటా  మా అందరి గుండెలను గాయపరిచింది. అచేతన స్థితిలో రావల్పిండి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నువ్వు తప్పక కోలుకోవాలని మేమంతా రోజూ ప్రార్ధనలు చేస్తున్నాం. నీపై దాడి గురించి తెలిసి దుఃఖం ఆపుకోవడం నా వల్ల  కాలేదు.  నీకు ఎలాంటి అపాయం కలగకూడదని శుక్రవారం నేనూ ఉపవాసం ఉన్నాను. అల్లాను 
ప్రార్ధించాను.  నీకేమీ కాదు. నువ్వు పువ్వులా నవ్వుతూ బైటికి వస్తావు. మా ప్రార్ధనలు, ఆశీస్సులు, శుభాకాంక్షలు, దీవెనలు వృధా పోవు. నీ పోరాటం వ్యర్ధం కాదు.  

ఈ రోజు 'డాన్' పత్రికలో వచ్చిన చిన్న వార్త నన్ను ఎంతగానో ఆనంద పరిచింది. మొట్టమొదటి సారి ఒక కాలు, చేయి కదిలించావని డాక్టర్ చెప్పారు. జర్మనీ లో వున్న ఒక అమెరికన్ ఆసుపత్రికి నిన్ను తరలించి మెరుగైన వైద్యం చేస్తారని అంటున్నారు. అంతా  సవ్యంగా జరిగి నువ్వు తొందరగా కోలుకుంటావు.

తల్లీ...మతం, కులం బురదలలో పొర్లుతున్న మా అందరికీ నిజానికి నువ్వు  ఒక గుణపాఠం. తాలిబాన్లు చెప్పిచేస్తున్నారు. ఆడపిల్లలను వద్దనుకోవడం, స్త్రీలను రకరకాలుగా కించపరచడం అన్ని మతాలలో ఉన్న తాలిబన్లు నిత్యం చేస్తున్న పనే. మంచి మాట చెబితే, మంచిని మానవత్వాన్ని గౌరవిద్దామని అడిగితే ....నీ కులాన్ని, మతాన్ని, అభిమతాన్ని ఎత్తిచూపి నోరు మూయడం ఇక్కడ మామూలయ్యింది. మతం, కులం వ్యక్తిగత లబ్ది కోసంవీరికి అద్భుత సాధనాలు. మనిషిని మనిషిగా చూస్తూ...లౌకిక భావనలతో బతకడం ఇక్కడ చేతకాదు.    

తాలిబాన్లను ఘాటుగా విమర్శిస్తున్నావని తెలిసి తెలిసీ ఈ న్యూ యార్క్ టైమ్స్, బీ.బీ.సీ. నీ కథనాలు ఎందుకు ప్రసారం చేసాయో తెలియడం లేదు. నీ ముఖాన్నైనా కవర్ చేయకుండా...ముష్కర మూకలపై నీ మాటల అస్త్రాలను ఆ జర్నలిస్టులు ఎలా ప్రసారం చేస్తారు? అలా చేయడానికి ఒక వేళ కుటుంబం అనుమతించినా...జర్నలిస్టుల నీతి నియమాలు ఏమయ్యాయి? నీ ఇంటర్వ్యూ చూసిన నాకు అప్పుడే అనిపించింది...మతిలేని తాలిబాన్ నీకేమైనా హాని చేస్తుందేమో అని.  నిజంగా అదే జరిగే సరికి తట్టుకోవడం కష్టంగా ఉంది. బాలికల విద్య కోసం, హాయిగా బతికే హక్కు కోసం నువ్వు చేస్తున్న పోరాటం, ఒక రాజకీయవేత్త గా దేశానికి సేవ చేయాలన్న నీ సంకల్పం ఎంతో గొప్పవి. పద్నాలుగేళ్ళ చిన్న వయస్సులోనే నీకున్న అభ్యుదయ భావాలు ఎంతో అబ్బురపరుస్తున్నాయి. 

ఏది ఏమైనా మలాలా...నువ్వు కోలుకుని...నిండు నూరేళ్ళు బతికి ఈ జనాల్లో ఉన్న మత పిచ్చిని, కుల గజ్జిని చెరిపివేసే శాంతి దూతవు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మలాలా...మంచి మనసులకు అవాంతరాలు ఎదురవుతాయి తప్ప అపజయం ఎదురు కాదు. అంతిమ విజయం నీదే.

photo courtesy: The Guardian (T.Mughal/EPA) 

Saturday, October 13, 2012

ABC ఛానల్ పరిస్థితి ఏమిటి?

 సీనియర్ ఎడిటర్ భావ నారాయణ గారి ఆధ్వర్యంలో ABC అనే ఛానల్ వస్తుందని తెలియగానే...దానికి పెట్టుబడి ఎవరు పెడుతున్నారో కనుక్కోమని ఒకరిద్దరు మిత్రులు అర్థించారు. పనుల ఒత్తిడి వల్ల నేను ఆ ప్రయత్నం చేయలేదు. అప్పటికే కొందరు జర్నలిస్టులను భావనారాయణ గారు నియమించారని కూడా సమాచారం. ఈ లోపు...CID పోలీసులు మైనార్టీ కార్పోరేషన్ లో కుభాకోణాన్ని బైట పెట్టారు. దర్యాప్తు తర్వాత సీ ఐ డి అదనపు డైరెక్టర్ జనరల్ ఎస్.వీ.రమణ మూర్తి విడుదల చేసిన ప్రకటనలో ఈ పేరాగ్రాఫ్ ABC లో చేరిన, చేరాలనుకున్న జర్నలిస్టులను అగాథం లోకి నెట్టింది.
"  It was confessed by Sai Kumar that an amount of Rs. 8 crores was paid to launch a new TV Channel in the name of ABC TV towards which he had entered into a MoU with one Bhava Narayana and others who were earlier working with various channels. " అని అందులో పేర్కొన్నారు. 
భావ నారాయణ బృందం కేవలం ఈ దొంగ బ్యాచ్ మీద ఆధారపడి  ఛానల్ ఆలోచన చేసిందా...వీళ్ళు జైలుకు వెళ్ళినా వేరే వాళ్ళ సహకారంతో చానెల్ వస్తుందా అన్నవి తేలాల్సిన అంశాలు. 
సీ ఐ డీ అధికారులు చెబుతున్న దాన్ని బట్టి వాళ్ళు (పోలీసోళ్ళు) భావనారాయణ గారితో ఇప్పటికే మాట్లాడి ఉండాలి. లేకపోతె...త్వరలో మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత గానీ తెరవెనుక విషయాలు బైటికి రావు. 

పెట్టుబడులు పెట్టే వారి గురించి తెల్సుకోకుండా...డబ్బులు వస్తున్నాయి కదా...అని రెచ్చిపోతే...జర్నలిస్టులు తర్వాత ఇరుక్కుంటారు. ఈ విషయంలో నాకు ఒక వింత అనుభవం ఉంది. ఒక సీనియర్ జర్నలిస్టు సలహా వల్ల  బైట పడ్డాను. లేకపోతె....గాలి జనార్ధన రెడ్డి గారి మాదిరిగా జైల్లో వుండే వాడినేమో!

ఈనాడు జర్నలిజం స్కూల్లో నాతొ పాటు చదువుకున్న ఒక సీమ పుత్రుడు చాలా రోజుల తర్వాత అప్పట్లో నాకు ఫోన్ చేసాడు. ఇప్పుడు జైల్లో ఉన్న ఒక ప్రముఖుడి దగ్గర ఆయన పనిచేసారు. నా బ్లాగు బాగుంటుందని...చాలా మంది చదువుతారని...తను కూడా ఇలాంటి మెటీరియల్ తో ఒక పత్రిక తెచ్చి మూసేసానని...ఆ పత్రికను మళ్ళీ  తేవడానికి పెట్టుబడి పెట్టడానికి తానూ సిద్ధంగా ఉన్నానని...చెప్పాడు. అది విని నాకు యమా ఊపు వచ్చింది. 
మీడియా మీద సీరియస్ గా పత్రిక తెచ్చి సమాజాన్ని అర్జెంటుగా ఉద్ధరించాలని నేను సీరియస్ గా ఆలోచిస్తున్న రోజులవి. వెంటనే...ఒక పత్రికలో పనిచేసి ఖాళీ గా ఉన్న ఒక మిత్రుడిని సంప్రదించి...ఆయనతో ఒక ప్రపోజల్ తయారు చేయించా. అప్పట్లో ఎన్  టీ  వీ నుంచి బైటికి వచ్చి ఖాళీగా ఉన్న హేమను కూడా అందులో ఇంవాల్వ్  చేయాలన్నది ప్లాన్. మొత్తం మీద....పెట్టుబడి పెడతానన్న మిత్రుడి గురించి ఆరా తీస్తే....ఆయన దగ్గర ఉన్నది క్లీన్ మనీ కాదని అర్థమయ్యింది. ఒక రెండు రోజులు నిద్ర మానేసి...ఏమిటి చేయడమని ఆలోచించాను. నీ పిచ్చి కాకపొతే...ఈ రోజుల్లో ఏ పెట్టుబడి దారుడి దగ్గరైనా...క్లీన్ మనీ ఉంటుందా? అన్న ఒక సన్నిహిత మిత్రుడి ప్రశ్న  నన్ను కన్వీన్స్ చేసింది. ఆఫీసు కోసం ఇల్లు కూడా వెతికాను. అడ్వాన్స్ ఇద్దామని, ఫర్నిచర్ సిద్ధంగా ఉందని మా పెట్టుబడి దారుడు చెబితే నమ్మాను. 

అయినా....మనసులో సందేహం వుండి ...నేను అభిమానించే ఒక పెద్ద మనిషి (సీనియర్ జర్నలిస్టు) దగ్గరకు వెళ్ళాను. పరిస్థితి వివరించాను. ఏమి చేయమంటారని అడిగాను. "అతన్ని నమ్మడానికి వీల్లేదు. అలాగని ఈ అవకాశం వదులుకోవడం కూడా చేయవద్దు. కొద్దిగా పెద్ద మొత్తాన్ని జాయింట్ అకౌంట్ లో వేయమను. అప్పుడు తేడా వస్తే....తర్వాత సంగతి తర్వాత చూడవచ్చు...," అని మా సారు అన్నారు. తనతో గొడవ వస్తే...ఏమిటన్న సందేహం వచ్చింది. సరే...దానికి సంబంధించి కూడా మనల్ను ఆరాధించే కండపుష్టి  వీరులు కొందరిని అలెర్ట్ చేసాను. 

ఇక్కడే నా అదృష్టం బాగుంది. నేను ఎప్పుడైతే...జాయింట్ అకౌంట్ అన్నానో...ఆ రోజు నుంచి మన పెట్టుబడిదారుడు నా ఫోన్ తీయడం మానేసాడు. ఒక పది సార్లు ప్రయత్నం చేసి...ఛీ...తనతో మనకు అనవసరమని వదిలేసాను. తర్వాత గాలి కుంభకోణం బైట పడడం...మన మిత్రుడి ఆచూకి తెలియకుండా పోవడం జరిగాయి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. తెలుసుకునే ప్రయత్నం కూడా నేను చేయలేదు.   

ఇలా...ఒక వారం పది రోజుల నా సమయాన్ని, నిద్రను, కలలను  ఖతం చేసింది...ఈ వ్యవహారం. అప్పుడు మళ్ళీ మా నాన్న చెప్పిన మాట గుర్తుకు వచ్చింది....పరిగెత్తి పాలు తాగడం కన్నా....హాయిగా నిలబడి నీళ్ళు తాగడం...ఉసేన్ బోల్టు లా పెరిగెత్తుతూ పాలు కిందా  మీదా పోసుకునే వారిని చూస్తూ...వీలయితే వద్దురా నాయనా...అని సూచిస్తూ  గడపడం అంత ఉత్తమమైన పని ఇంకొకటి లేదని. 

భావ నారాయణ గారు కూడా ఈ సమస్య నుంచి బైటపడి...ఒక లక్షకో, లక్షన్నరకో ఏదో చానెల్ లో చేరి ప్రశాంత జీవితం గడపాలని కోరుకుంటున్నాను. అది కష్టమైనా..జర్నలిస్టులు పెట్టుబడి గురించి కాస్త వాకబు చేసుకుని, డబ్బు కక్కుర్తికి పోకుండా కాస్త సురక్షిత చానెల్ లో పని చేయడం ఉత్తమం. 

Friday, October 5, 2012

V 6 కు పసునూరి శ్రీధర్ బాబు గుడ్ బై...

తెలుగు జర్నలిజం రంగంలో నాణ్యమైన జర్నలిస్టులలో ఒకరైన పసునూరి శ్రీధర్ బాబు వీ సిక్స్ ఛానెల్ కు రాజీనామా చేశారు. అక్కడ ఆయన ఎగ్సిక్యూటివ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. ఆ ఛానెల్ కు కొద్ది కాలంలోనే గుర్తింపు రావడంలో శ్రీధర్ పాత్ర ఎంతో ఉంది. ఈ పరిణామానికి కారణాలు స్పష్టంగా తెలియనప్పటికీ....సీ.ఈ.ఓ. అంకం రవికి శ్రీధర్ కు మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లు విశ్వసనీయ వర్గాల కథనం. మంచి కవి కూడా అయిన శ్రీధర్ మానవ సంబంధాలకు గౌరవం ఇచ్చే జర్నలిస్టు గా పేరుంది. 

ఇదే ఛానెల్ లో ఫీచర్స్ ఎడిటర్ గా వున్న చల్లా శ్రీనివాస్ కూడా మూడు రోజుల కిందట వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. చల్లా శ్రీనివాస్, అంకం రవి ఐ-న్యూస్ లో కలిసి పనిచేసారు. శ్రీనివాస్ ను రవి ఏరికోరి వీ-సిక్స్ కు తీసుకువచ్చారు. 


శ్రీధర్ బాబు చెన్నై లో ఇండియా టుడే లో చాలా కాలం పాటు పనిచేసారు. హెచ్. ఎం. టీ వీ ఆరంభంలో ఆ ఛానెల్ ఎడిటర్ కొండుభట్ల రామచంద్ర మూర్తి గారి మీద ఎంతో నమ్మకంతో ఆ ఛానెల్ లో చేరారు. అక్కడ కోర్ కమిటీ లో ఆయన ఒక సభ్యుడిగా ఉండేవారు. అంకం రవి చొరవతో...మూర్తి గారి బృందం నుంచి శ్రీధర్ వెళ్ళిపోయి వీ సిక్స్ లో చేరారు.

"ప్రాంతం, కులం వంటి అంశాలకు ప్రాముఖ్యమిస్తే పరిణామాలు ఇలానే ఉంటాయి. ఆ రెండు అంశాలకన్నా బలమైన వ్యక్తిగత అహంకారాల వల్ల శ్రీధర్ ఇబ్బంది పడ్డారు," అని ఒక జర్నలిస్టు వ్యాఖ్యానించారు. పూర్తి సమాచారం అందాల్సి ఉంది.     

రవి, శ్రీధర్ ల గురించి కిందటేడాది ఆగస్టులో నేను రాసిన పోస్టు చూడండి.