Tuesday, July 30, 2013

ఇది 'బిగ్ డే' నా?--నిజంగా తెలంగాణా వస్తుందా?

భారత దేశ చరిత్రలో ఈ రోజు ఒక మరుపురాని, మరిచిపోలేని రోజుగా మిగిలి పోయే అవకాశం అనిపిస్తున్నది. తెలంగాణా రాష్ట్రం పై కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేట్లున్నది. హైదరాబాద్ ఒక పదేళ్ళ పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తారని గట్టిగా అనిపించేలా పరిణామాలు ఉన్నాయి. ఒక వేళ అదే జరిగితే మనందరి జీవితాల్లో ఇదొక ప్రధాన ఘట్టం. ఒక చారిత్రక పరిణామాన్ని ప్రత్యక్షంగా చూసిన వారమవుతాం. 

ఇదొక బిగ్ డే నే కానీ.. ఒక భారమైన రోజు. ఇప్పుడు ఏమి జరిగుతుందో... భవిష్యత్తు ఏమవుతుందో, అంతా సవ్యంగా సాగుతుందో లేదో, మున్ముందు తెలుగు ప్రజలు భారత్-పాకిస్థాన్ జనం మాదిరిగా కొట్టుకు చస్తారో ఏమో అన్న అనుమానాలకు తావిచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ నీచ రాజకీయాలు, అనాలోచిత నిర్ణయాల వల్ల ఈ పరిస్థితులు దాపురించాయి. 

తెలంగాణా నిజంగానే అత్యంత సున్నితమైన అంశం. ఇక్కడ భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అన్ని వాదనలు నిజమే అనిపిస్తాయి. ఒక వేళ తెలంగాణా వస్తే ఇళ్లల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో కదా! అనిపిస్తుంది. ఆంధ్ర కు తెలంగాణాకు మధ్యన ఉన్న మా ఖమ్మం జిల్లా పరిస్థితి ఏమిటి? అన్న సందేహం నా బోటి వాళ్లకు కలుగుతుంది. ఒంటి రంగు, ఉన్న డబ్బు, జన్మించిన కులం, పుట్టిన ప్రాంతం... బట్టి మనుషుల గుణగణాలను బేరీజు వేయడం, ముద్ర వేయడం కచ్చితంగా సంకుచితత్వమే కదా!   

మా అమ్మా వాళ్ళది ఖమ్మం జిల్లా వైరా మండలం గొల్లపూడి గ్రామం. మా నాన్నా వాళ్ళది కృష్ణా జిల్లా తిరువూరు మండలం నెమలి గ్రామం. మా నాన్న ఉద్యోగం మొత్తం ఖమ్మం జిల్లాలో కావడం వల్లనో, నేను గొల్లపూడి లో పుట్టి ఖమ్మం జిల్లాలో పెరగడం వల్లనో, నన్ను వృత్తిలో దారుణంగా ఇబ్బంది పెట్టిన నీచ నికృష్ట దరిద్రులు అంతా ఆంధ్రా ప్రాంతం వారు కావడం వల్లనో, ఒక జర్నలిస్టుగా గ్రౌండ్ రియాలిటీస్ ను దగ్గరి నుంచి చూడడం వల్లనో...నేను తెలంగాణా వాదిని.
హేమ సంగతీ అంతే. వాళ్ళ నాన్న గారు ప్రకాశం జిల్లాలో పుట్టి ఖమ్మం జిల్లా కొత్తగూడెం కు ఉద్యోగ రీత్యా వచ్చారు. హేమ పుట్టింది అమ్మమ్మ గారి ఊర్లో అయినా చదివింది పెరిగింది కొత్తగూడెం లో. మా అమ్మాయి ఖమ్మం జిల్లా కొత్తగూడెం లో పుట్టింది. మా అబ్బాయి తాన తాత ఉద్యోగ రీత్యా ఉన్న అనంతపురం జిల్లా పుట్టపర్తి లో పుట్టాడు. అమ్మాయి, అబ్బాయి నల్గొండ, హైదరాబాదు లలో పెరిగారు.  

రాష్ట్ర విభజన మా నాన్నకు గానీ, మా మామ గారికి గానీ సహజంగానే ఇష్టం ఉండదు. నేను ప్రత్యేక తెలంగాణా గురించి మాట్లాడితే వీళ్ళిద్దరి మొహాల్లో చిరాకు కనిపిస్తుంది. ప్రాంతాల గురించి ఆలోచించకుండా మనసా వాచా కర్మణా ఉద్యోగ ధర్మం నిర్వర్తించి సేవ చేసి పదవీ విరమణ చేసిన తమను ప్రాంతాల వారీగా చూడడం వారికి ఇష్టం ఉండదు. నాకూ, హేమకు, మా అమ్మకు మాత్రం ప్రత్యేక రాష్ట్రం వస్తేనే మంచిది అని ఉంటుంది.  నేతలు, అధికారులు తెలిసి చేసారో, తెలియక చేసారో గానీ ఈ ప్రాంతానికి అన్యాయం జరిగిందని, ఇక్కడి ప్రజల పట్ల చిన్న చూపు నిజమని మేము నమ్ముతున్నాం. 

ఈ పరిస్థితి మా కుటుంబం ఒక్క దానికే పరిమితం అని నేను అనుకోవడం లేదు. చాలా కుటుంబాలు ఇదే వాతావరణంలో ఉన్నాయి. రాష్ట్ర విభజన ప్రభావం కుటుంబ సంబంధాలపై కూడా పడుతుంది. ఈ రోజు వచ్చే నిర్ణయం ఏదైనా... తెలుగు ప్రజలంతా పరస్పర గౌరవంతో, బాధ్యతాయుతంగా మెలగాలని కోరుకుంటున్నాం. వీర తెలంగాణా సాయుధ పోరాట వారసులు, సమ సమాజం కోసం పోరాడి నేలకొరిగిన విప్లవ యోధుల వారసులపై ఈ బాధ్యత మరింత ఎక్కువగా ఉంది. 

 ప్రత్యేక రాష్ట్రం వస్తే బ్రహ్మాండం బద్దలై ఇక్కడి ప్రజలకు ఎనలేని మేలు జరుగుతుందన్న  పిచ్చి భ్రమలు లేకపోయినా తెలంగాణా, ఆంధ్రా ప్రజల మధ్యన మానసికంగా గ్యాప్ ఏర్పడిందని నేను నమ్ముతున్నాను. ఇది ఎప్పటికీ మంచిది కాదని నమ్ముతున్నాను. ఇవ్వాళ కాకపోయినా రేపైనా ఈ సమస్య మళ్ళీ మన ముందుకు వస్తుంది. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక సభ్య సమాజంలో చాలా సవరణలు జరగాలని కోరుకుంటున్నాం. 

Wednesday, July 17, 2013

ఈనాడు జర్నలిజం స్కూల్ 1996-97 బ్యాచ్ సమాగమం

ఈనాడు జర్నలిజం స్కూల్ (ఈజస్కూ) 1996-97 బ్యాచ్ మిత్రులు ఈ వారం సమావేశమయ్యారు. ఆ అపూర్వ కలయిక మీద సీనియర్ జర్నలిస్టు మిత్రుడు కోవెల సంతోష్ కుమార్ రాసి పంపిన వ్యాసం ఇది. కలిసి చదువుకున్న మిత్రులు కలిసి అనుభవాలు, అనుభూతులు పంచుకోవడం మంచి విషయం కదా! సంతోష్ కు థాంక్స్...రాము 
-----------------------------------------

ఏ క్యాలెండర్‌ కూడా ప్రస్తావించని ఓ పండుగ.. పదహారేళ్ల క్రితం కలిగిన ఎడబాటు అమాంతంగా తొలగిపోయిన సందర్భం.. ఓ అపూర్వ సమాగమం.. అపురూపమైన వేడుక.. ఎన్నో ఏళ్ల తరువాత జరిగిన స్మృతుల వేకువ.. ఏ వినోదానికీ.. ఏ పండుగకూ.. ఏ సంబరానికీ.. ఏ సంతోషానికీ, అతీతమైన ఆనందం 24మనసుల్లో నిండిన శుభ సమయం.. మాకు తప్ప ఎవరికీ ఇంత సంతోషం కలగలేదేమోనన్న గర్వం.. 14 జూలై 2013 ఈనాడు జర్నలిజం స్కూలు 1996-97 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థుల కళ్లల్లో కనిపిస్తుంటే.. ఆ మెరుపులను ఏమని వర్ణించేది?

హైదరాబాద్‌ సితారా గ్రాండ్ హోటల్లో  మొన్న ఆదివారం అనూహ్యమైన పండుగే జరిగింది. 1996-97 బ్యాచ్‌కు చెందిన ఈనాడు జర్నలిజం స్కూలు విద్యార్థులు ఒకటిన్నర దశాబ్దం తరువాత ఒక్కచోట కలుసుకున్నారు. వేర్వేరు వృత్తుల్లో కొనసాగుతున్న వారు కొందరు.. పాత్రికేయులుగానే కొనసాగుతున్న వారు మరికొందరు.. వేర్వేరు పత్రికల్లో.. వేర్వేరు చానళ్లలో.. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు.. ఒక్కచోట కలిసి సంబరం చేసుకున్నారు. 

రాష్ట్రంలో నలుదిక్కుల ఉన్నవారిని ఒకటి చేసి.. సమీకరించి అందరికీ అనువయ్యేలా సమావేశం ఏర్పాటు చేయటం ఎంత కష్టమో తెలియంది కాదు.. కానీ, అది సాధ్యమైంది.. అదీ పదహారేళ్ల తరువాత.. అదీ గురువులు తల్లాప్రగడ సత్యనారాయణ మూర్తి, పోరంకి దక్షిణామూర్తి (కింది ఫోటో) సమక్షంలో...అందరం కలుసుకోవటం ఒక ఎత్తైతే.. ఇద్దరు గురువులను తీసుకుని వచ్చి వారిని గౌరవించుకోవటం మరో ఎత్తు. ఒకరు 82 సంవత్సరాలు నిండి సహస్ర చంద్రదర్శనం పూర్తి చేసుకుని పూర్ణ చంద్రుడిలా వెలిగిపోతున్నారు. మరొకరు 78 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పుంభావ సరస్వతిగా మూర్తిమంతమై ఉన్నారు. ఒక్కొక్కరినీ చేతులు పట్టుకుని స్పృశించి  ప్రియంగా మాట్లాడుతుంటే.. ఆ స్పర్శకు ఒళ్లంతా పులకరించని వాళ్లు లేరు. అతిశయోక్తి కాదు.. అత్యుక్తులసలే లేవు.. ఇన్నేళ్ల తరువాత వారిని చూస్తుంటే.. మాట్లాడుతుంటే.. చలించకుండా ఎలా ఉండగలరు? 

ఇన్నేళ్ల తరువాత ఒకరినొకరు కలుసుకుంటుంటే.. వాళ్ల కళ్లల్లో ఆనందం అనిర్వచనీయంగా అనిపించింది. కొందరు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. మరి కొందరు అప్పుడెలా ఉన్నారో.. ఇప్పుడూ అలాగే ఉన్నారు. కొందరు నేను ఫలానా అని పరిచయం చేసుకోవలసి వచ్చింది. 36మంది ఉన్న బ్యాచ్‌లో ఒకరు (వెంకటరమణ) మరణించగా.. 24 మంది హాజరయ్యారు. శంకర్‌బాబు, ప్రసన్నకుమార్‌ల సమాచారం దొరకలేదు. ఇక ఒకరేమో (రమాకాంత శర్మ) శివరాంపల్లిలో శంకర పీఠాన్ని ఏర్పాటు చేసుకుని పీఠాధిపతి అయిపోయారు. ఆయన హోటళ్లకు వచ్చే పరిస్థితిలో లేరు. అయిదుగురేమో పంచాయతీ ఎన్నికల బిజీలో ఉండి రాలేకపోయారు. ఎన్నికలు లేకుంటే.. వీరందరితో మరింత సందడిగా ఉండేది.


ముందుగా పాత్రికేయ సమాజానికే ఆది గురువులైన బూదరాజు రాధాకృష్ణ గారికి, సహచర మిత్రుడు వెంకటరమణకు నివాళి అర్పించాము. 
ఆ తరువాత ఒకరికొకరు పరిచయ కార్యక్రమం ఎంతో ఉద్వేగభరితంగా సాగింది. ఎన్నెన్నో జ్ఞాపకాలు మేలుకున్నాయి.. తీపిచేదుల మేలు కలయిక జరిగింది.. ఈ వేడుకలో పాల్గొన్న వారిలో నలుగురు ప్రభుత్వోపాధ్యాయులుగా పని చేస్తున్నారు. ఒకరు ఆర్టీసీలో మేనేజర్‌ స్థాయిలో ఉన్నారు. ఒకరు గ్రూప్‌ వన్‌ అధికారిగా పనిచేస్తుంటే.. మరొకరు ఎంపిడిఓగా పనిచేస్తున్నారు. మిగతా వాళ్లంతా చక్కగా పాత్రికేయులుగానే కొనసాగుతున్నారు.  మరొకరు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉంటూనే జీవని పేరుతో అనాధలకోసం ఒక స్వచ్ఛంద సంస్థను నడిపిస్తూ ఉన్నారు. 
పరిచయ కార్యక్రమం ముగిశాక, ఇద్దరు గురువులకు ఉడతాభక్తిగా సత్కరించుకున్నాం. వారు చాలా ప్రేమతో స్వీకరించటం ఎంతో ఆనందం కలిగించింది. సత్కారం తరువాత భోజన కార్యక్రమంతో కాసింత విరామం తీసుకుని.. ఆ తరువాత గురువులిద్దరి అమూల్యమైన సందేశాల్ని విన్నాం.. 16 ఏళ్ల తరువాత వాళ్ల మధుర పలుకులు మరోసారి అందరిలోనూ ఉత్సాహాన్ని నింపాయి. ఇంత వయసులో కూడా ఇవాళ్టి పాత్రికేయులు ఎలా వ్యవహరించాలో మార్గనిర్దేశనం చేయటం అపూర్వం. అలాంటి గురువులకు శిష్యులమైనందుకు అంతా గర్విస్తున్నాం. 


గురువుల సందేశం పూర్తయిన తరువాత నంది అవార్డు అందుకున్న ఈనాడు సీనియర్‌ స్పెషల్‌ కరస్పాండెంట్‌ చక్రవర్తికి, విదేశాల్లో పాత్రికేయుడిగా రాణించి వచ్చిన సాక్షి అసిస్టెంట్‌ ఎడిటర్‌ రమణమూర్తికి, అన్నింటికీ మించి జీవని సంస్థ ద్వారా ఎవరూ చేయలేని అత్యున్నతమైన సామాజిక కార్యాన్ని నిర్వహిస్తున్న ఎస్వీ ప్రసాద్‌కి అభినందనలు అందించాం. జీవని సంస్థ ఇక నుంచి అందరి కుటుంబంగా భావించాలని నిర్ణయించుకున్నాం. 
సాయంత్రం 4.30 గంటల దాకా సితార అంబరాన సంబరాలు నడిచాయి. వచ్చే సంవత్సరం నెల్లూరులో, మరుసటి సంవత్సరం మిడ్‌ మానేర్‌ డ్యాం దగ్గర కలుసుకోవాలని అంతా నిర్ణయించుకున్నాం.

Monday, July 15, 2013

చాగంటిపై వివాదానికి TV-9 ప్రయత్నం

అద్భుతమైన ప్రవచనాలతో మానవ ధర్మాన్ని ప్రచారం చేస్తున్న చాగంటి కోటేశ్వర రావు గారి మీద టీవీ నైన్ ఛానల్ కన్నుపడింది. ఆయన్ను గబ్బు పట్టించే కార్యక్రమానికి ఈ సాయంత్రం ఈ ఛానెల్ "పారాయణం లో పిడికల వేట" అనే లైవ్ షో ద్వారా శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం నడిపిన విధానం చూస్తే ఒక కుట్ర, దురుద్దేశం దీని వెనుక ఉన్నాయన్న అభిప్రాయం కలుగుతుంది. సాయి బాబా భక్తులను రెచ్చగొట్టి ఒక రెండు రోజుల పాటు హడావుడి చేయాలన్న కుత్సితం ఇందులో ఉంది. ఇది దిక్కుమాలిన జర్నలిజమ్.  

తుచ్ఛమైన కోరికలతో పారాయణం చేయకండి... అని చాగంటి గారు చెప్పిన మాటను పట్టుకుని బుర్ర తక్కువగా ఈ ప్రోగ్రాం నడిపారు. సాయిబాబా తత్వాన్ని అర్థం చేసుకోండని ఆయన అనడం తప్పు ఎలా అవుతుంది? ఒక వ్యక్తిని స్టూడియో లో కూర్చోబెట్టుకుని రచ్చ చేయాలనుకోవడం దారుణం. తనతో చాలా మంది మాట్లాడి బాధను తెలిపారని ఆయన గారు అనడం, ఆ వివాదం కోసం పాకులాడడం దౌర్భాగ్యం.  

మానవ విలువలు నిర్వీర్యమై పోతున్న సమయంలో చాగంటి ప్రవచనాలను స్వాగతించాల్సింది పోయి చాగంటి పై బురద చల్లాలనుకోవడం టీవీ నైన్ బృందం చేసిన పాపం. 

Friday, July 12, 2013

తెలంగాణా పరిణామాలపై భలే హెడ్డింగులు

తెలంగాణా విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడడం కాంగ్రెస్ పెద్దలకు అలవాటయ్యింది. అప్పట్లో చిదంబరం ప్రకటనలు చేసి మరీ రెండు ప్రాంతాల ప్రజల మధ్య చిచ్చు రగిల్చారు. ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ వచ్చి అటో ఇటో తేల్చేస్తామన్న కలర్ ఇచ్చి హడావుడి చేస్తున్నారు. దేశ రాజధానిలో శుక్రవారం జరిగే కోర్ కమిటీ భేటీ లో తాడో పేడో తేలిపోతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది.   ఈ నేపథ్యంలో తెలుగు పత్రికలకు, చానెల్స్ కు తగిన ముడిసరుకు దొరికింది. కొద్ది సేపట్లో భేటీ జరుగుతున్నదనగా వివిధ ఛానెల్స్ లో చర్చలు రసవత్తరంగా సాగాయి. చర్చలకు ఛానెల్స్ పెట్టిన పేర్లు ఇలా ఉన్నాయి. 

TV 9:           క్లారిT
V6:             టీ సిట్టింగ్ 
I news:       కోర్ భేT
ABN-AJ:   T టైమ్స్ 
10 TV:      తేలేదేంT? 
saakshi:    టీ క్లైమాక్స్
HM TV:   తేలేదేమిటి? 
                తేల్చేదేమిటి?           

గత రెండు రోజులుగా అన్ని పేపర్లు తమ శీర్షికలతో గమ్మత్తులు చేస్తున్నాయి. శీర్షికలో "టి" అన్నఅక్షరం కనిపిస్తే దానికి రంగు పులిమి తమ ప్రతిభను చాటుకుంటున్నారు. 

శుక్రవారం ఈనాడు: తెల్చుడేనా?
ది హిందూ: "T" Issue: action shifts to Delhi
గురువారం ఈనాడు: భేటీకి సిద్ధం 
ఆంధ్రజ్యోతి: టిక్... టిక్... టిక్ 
నమస్తే తెలంగాణా: సీమాంధ్ర నేతలకు ఫ్రైడే- హీటెక్కిన టీ  
టైమ్స్ అఫ్ ఇండియా: Cong weighing 2 options on T
ఇండియన్ ఎక్స్ ప్రెస్: Desperate "T"imes
-----------------
TV 5 నుంచి వెంకట కృష్ణ వెళ్లిపోయారా? 

తెలంగాణా గొడవతో నేను చస్తుంటే ఒకరు ఫోన్ చేసి నాకొక 'బ్రేకింగ్ న్యూస్' చెప్పారు. టీవీ ఫైవ్ నుంచి సీనియర్ జర్నలిస్టు వెంకట కృష్ణ ను పంపేసారన్నది దాని సారాంశం. వరంగల్ "ఈనాడు" లో తను నకిలీ మిరప విత్తనాల మీద పరిశోధాత్మక కథనం రాసి రామోజీ దృష్టిలో పడింది మొదలు... రకరకాల గందరగోళాల మధ్య టీవీ ఫైవ్ లో చేరి రష్యన్ వెబ్సైట్ లో వచ్చిన కథనం ఆధారంగా వై ఎస్ ఆర్ మరణం వెనుక రిలయెన్స్ హస్తం అంటూ నానా యాగీ చేసి అరెస్టు అయిన లగాయితూ... జర్నలిజం లో వెంకట కృష్ణ పురోగతి నాకు తెలుసు. ఈ వార్త వెనుక నిజా నిజాలు గానీ, మీ దగ్గర ఉన్న సమాచారం గానీ తెలియజేయండి. 

Thursday, July 11, 2013

HY-TV లోకి శైలేష్ రెడ్డి - Studio N కి సాగర్

గత వారం మీడియాలో రెండు మూడు ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. జీ టీవీ లో దాదాపు 15 సంవత్సరాలకు పైగా పనిచేసి... యాజమాన్యం మారడంతో అక్కడి నుంచి వైదొలిగిన సీనియర్ జర్నలిస్టు శైలేష్ రెడ్డి రాజకీయాల్లోకి వెళతారన్న ప్రచారం జరిగింది. శైలేష్ దాన్ని దృవీకరించారు కూడా. టీ ఆర్ ఎస్ తరఫున మహబూబ్ నగర్ జిల్లాలో ఒక నియోజవర్గం నుంచి ఆయన అసెంబ్లీ కి పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇంతలో... HY-TV నుంచి ఒక ఆఫర్ రావడంతో శైలేష్ రెడ్డి దాన్ని స్వీకరించారు. ఈశాన్య భారతానికి చెందిన ఒక ఎం పీ స్థాపించిన ఆ ఛానెల్ ఆ మధ్యన మూతపడినంత పనిచేసింది. అక్కడ యాజమాన్య మార్పిడి జరిగి.. రివైవల్ పనిని శైలేష్ కు అప్పగించినట్లు సమాచారం. జిందాల్ గ్రూప్ ఈ ఛానెల్ ను తీసుకున్నదన్న ప్రచారం జరుగుతున్నది. 

HM TV ఛానెల్ ఆరంభించడానికి, నిలదొక్కుకోవడానికి పాటుపడిన ముఖ్యుల్లో ఒకరైన సాగర్ Studio N లో చేరారు. ఈ టీవీ, జీ టీవీ లలో పనిచేసిన సాగర్  HM TV, The Hans India చీఫ్ ఎడిటర్ కొండుభట్ల రామచంద్ర మూర్తి గారికి స్వయానా బావ మరిది. ఒక రెండేళ్ళ కిందట... సొంతగా ప్రాజెక్టులు చేసుకుంటానని చెప్పి సాగర్ హెచ్ ఎం టీవీ నుంచి బైటికి వచ్చారు. తర్వాత సాక్షి వారి వెబ్ ఎడిషన్ కోసం పనిచేసి ఇప్పుడు Studio N లో CEO గా చేరారు. మిగిలిన వాళ్ళ కన్నా అద్భుతమైన జర్నలిస్టు అని మూర్తి గారు నమ్మే సాగర్ ఈ ఛానెల్ ను ఏమి చేస్తారో వేచి చూడాలి! 

సాక్షి టీవీ కి గోవింద రెడ్డి రాంరాం

ఈ మీడియాలో ఎప్పుడు ఏమవుతుందో చెప్పడం భలే కష్టం. చాలా సార్లు పనికిరాని సన్నాసులకు పెద్ద పదవులు వస్తాయి, నిజంగా కష్టపడే బుద్ధిజీవులకు బతుకు పోరులో భాగంగా శుంఠల దగ్గర తల వంచుకుని పనిచేయాల్సిన దుస్థితి వస్తుంది. ఇంకొన్ని సార్లు సీనియర్ జర్నలిస్టులకు పలు కారణాల రీత్యా వృత్తి మీద అసహ్యం కలుగుతుంది. ఈనాడు నుంచి బైటికి వచ్చి శైలేష్ రెడ్డి సహాయ సహకారాలతో జీ టీవీ లో వెలిగిన గోవింద రెడ్డి కాలక్రమంలో ఒకటి రెండు ఛానెల్స్ లో పనిచేసి చివరకు సాక్షి టీవీ లో ఇన్ పుట్ ఎడిటర్ గా సెటిల్ అయ్యారు. అక్కడ ఉన్నత స్థాయిలో ఉన్న ఒక మహిళతో బెడిసిన గోవింద రెడ్డి ఆ ఛానెల్ నుంచి బైటికి వచ్చారు. మా వాళ్ళే పంపించారని సాక్షి లో గోవింద్ కు గిట్టని వాళ్ళు ప్రచారం చేస్తుండగా... ఆ మహిళ బాధకు తాళ లేక ప్రశాంత జీవితం కోసం బైట పడ్డానని ఆయన అంటున్నారు. సాక్షి లో కీలక పాత్ర పోషిస్తున్న దిలీప్ రెడ్డి గారి ఆశీస్సులు ఉన్నా గోవింద రెడ్డి బైటికి రావాల్సి రావడం చర్చకు దారి తీసింది. శైలేష్-దిలీప్-గోవింద్ రెడ్లు మంచి మిత్రులని అందరికీ తెలిసిందే.