Saturday, October 4, 2014

'ఈనాడు' మెషిన్ సెక్షన్ కార్మికుల సమ్మె బాట!

ప్రముఖ తెలుగు దినపత్రిక 'ఈనాడు' లో మెషిన్ సెక్షన్ కార్మికులు శనివారం నాడు సమ్మె బాట పట్టారు. జీతాలు పెంచకుండా... తమను కాంట్రాక్ట్ కార్మికులుగా మార్చేందుకు యాజమాన్యం కుతంత్రం పన్నుతోందని ఆరోపిస్తూ... కొన్ని యూనిట్లలో కార్మికులు మెరుపు సమ్మెకు దిగినట్లు సమాచారం. నోటీసు గట్రా ఏమీ లేకపోయినా... పని చేయకుండా తమ నిరసన తెలుపుతున్నట్లు తెలిసింది. ఈ నెల రెండో తేదీన (గురువారం) ఒక మూడు యూనిట్లట్లో నిరసన గళం వినిపించిన కార్మికులు... దసరా పండగ సందర్భంగా ఆఫీసుకు శలవు కాబట్టి...మర్నాడైన (శనివారం) నాడు ఈ కార్యక్రమం చేపట్టారు. 

తమ సమ్మెకు మద్దతు ఇవ్వాలని, రేపు మీ గతి కూడా ఇంతేనని మిషన్ సెక్షన్ కార్మికులు 'ఈనాడు'లో వివిధ సెక్షన్ల ఉద్యోగులను అభ్యర్ధిస్తున్నారు. అయితే, మిగతా జనాల హక్కుల గురించి వీర విప్లవ సాహిత్యంలో కాపీ కొట్టిన పదాలతో అందమైన శీర్షికలు, లీడ్ లు రాసే జర్నలిస్టులు చాలా మంది అంటీ ముట్టకుండా ఉన్నారని సాయంత్రం వరకు వార్తలు వచ్చాయి. కానీ, కృష్ణా, గుంటూరు, విజయవాడ, కరీంనగర్ లలో ఉద్యోగులు కొందరు ఈ సమ్మెకు మద్దతు ప్రకటించినట్లు సమాచారం. 

తమ పని గంటలను ఎనిమిది నుంచి ఐదుకు తగ్గించిన యాజమాన్యం... అలవెన్సులపై కోత వేసిందని, కాంట్రాక్టు లేబర్ గా తమను మార్చేందుకు కుయుక్తులు పన్నుతోందని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఈ రోజుకు మెషిన్స్ ఆన్ చేయబోమని కార్మికులు ప్రకటించగా... వారితో యాజమాన్యం చర్చలు జరుపుతున్నట్లు చెబుతున్నారు. 

తెలుగు జర్నలిజం లో ఒక అద్భుతమైన సంచలనం గా చెప్పుకోదగ్గ 'ఈనాడు' లో పరిస్థితులు సత్వరం సద్దుమణిగి... ప్రజల పక్షాన పోరాడే పత్రికగా అది వెలుగొందాలని కోరుకుందాం. 

నగరం నడిబొడ్డు నుంచి ఫిల్మ్ సిటీకి తరలిన "ఈనాడు"

హైదరాబాద్ నడిబొడ్డున ఖైరతాబాద్ లో ఒక లాండ్ మార్క్ గా నిలిచిన 'ఈనాడు' పత్రిక ఆఫీసు విజయ దశమి నాటికి దాదాపు ఖాళీ అయ్యింది. కొందరు రిపోర్టర్లు, మార్కెటింగ్ సిబ్బంది తప్ప జర్నలిస్టులు అంతా యాజమాన్యం నిర్ణయానికి అనుగుణంగా ఫిలిం సిటీ కి తరలివెళ్ళారు. ఈ రోజు నుంచి జర్నలిస్టులు, ఇతర సిబ్బంది... కనీసం మూడు గంటలు రాకపోకలకే చెల్లించాల్సి వస్తుంది. రామోజీ ఫిలిం సిటీ లోకి, అక్కడి నుంచి సిటీ కి యాజమాన్యం ఏర్పాటు చేసే బస్సు టైమింగ్ కు అనుగుణంగా...జర్నలిస్టులు, ఇతర సిబ్బంది తమ జీవన గమనాన్ని, విధానాన్ని మార్చుకోవాలి.    

"యాజమాన్యం నిర్ణయం మా ప్రాణం మీదికి వచ్చింది. ఇన్నాళ్ళూ 'ఈనాడు' అంటే పర్మినెంట్ జాబ్ అనే ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు... ఒక అవకాశం వస్తే ఎప్పుడు బైట పడదామా? అనిపిస్తోంది," అని దాదాపు రెండు దశాబ్దాల అనుభవం ఉన్న ఒక జర్నలిస్టు చెప్పారు. జర్నలిస్టులలో నిరాశ, నిస్పృహ పెరగడానికి కారణాలు ఇలా ఉన్నాయి. 

1) విధి నిర్వహణ కోసం అదనపు ప్రయాణం చేయాల్సిరావడం, దానివల్ల అదనపు గంటలు వెచ్చించాల్సి రావడం 

2) వేతన సంఘం సిఫార్సు లకు అనుగుణంగా అంటూ... జీతాలు పెంచినా....సీనియర్లకు పావలా, నలభై పైసలు మాత్రమే పెరగడం. (2005 తర్వాత జాయిన్ అయిన వారికి మాత్రమే ఓకే ఐదు వేల దాకా పెరిగాయి) 

3) దసరా పండక్కు బోనస్ ఇస్తూనే... పెట్టిన ఒక ఫిటింగ్. 'ఒక వేళ పాత బకాయిలు గానీ, భవిష్యత్ బకాయిలు గానీ చెల్లించాల్సివస్తే... ఈ బోనస్ ను అందులోంచి  మినహాయిస్తా'మని యాజమాన్యం లిఖితపూర్వకంగా తెలియజేయడం

4) ఆదుకుంటుందని అనుకున్న తెలంగాణా రాష్ట్ర కార్మిక శాఖ అనుమాన పడిన ప్రకారం... మౌనం పాటించడం 

5) ఉద్యోగ అభద్రత మున్నెన్నడూ లేనంతగా పెరగడం

6) వేజ్ బోర్డ్ పెంచిన భారానికి విరుగుడుగా... పర్మినెంట్ ఉజ్జోగాలకు మంగళం పాడుతూ...అందరినీ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మారుస్తారన్న ప్రచారం

7) తెలంగాణా రాష్ట్ర సమితి ప్రభుత్వానికి, 'ఈనాడు' కు మధ్య ఒక అవగాహన కుదిరిందన్న ప్రచారం.

'ఈనాడు' ను ఉన్నపళంగా ఫిలిం సిటీ కి ఎందుకు మార్చారు? ఖైరతాబాద్  నుంచి ఇప్పుడు ఖాళీ చేస్తున్న ఆఫీసును రిలయన్స్ కు బదలాయిస్తున్నారా? అన్నవి తేలాల్సి ఉంది.