Wednesday, April 28, 2021

ఫేస్ బుక్ అనువాదాన్ని నమ్మితే... ఇంతే సంగతులు!

(S.Ramu)

ఈ మధ్యన ఫేస్ బుక్ మనం తెలుగులో ఏదైనా రాసి పెడితే....అది రాకుండా దానంతట అది ఇంగ్లిషు లోకి అనువదించి పెడుతోంది. 'Show Original' అన్న మాటను నొక్కితే తప్ప తెలుగు లిపి కనిపించదు. ఈ అనువాదం సంగతి ఏమిటా? అని చూస్తే నాకు మతిపోయింది. ముందుగా ఫేస్ బుక్ నుంచి సంగ్రహించిన ఈ స్క్రీన్ షాట్ చూడండి.  




1992లో ఈనాడు జర్నలిజం స్కూల్ లో నా బ్యాచ్ మేట్ అయిన శోభశ్రీ పోస్టుచేసిన ఒక వ్యాసం.  చదువుదాం కదా... అని మొదలుపెట్టా. దిమ్మతిరిగింది.  ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్  రెండో తరంగం (సెకండ్ వేవ్ అన్న) జర్నలిస్టులను ఎలా పొట్టనపెట్టుకుంటున్నదీ తెలుగులో బాగా రాశారా వ్యాసంలో. తెలుగులో రాసింది చేయి తిరిగిన  జర్నలిస్టు.  తర్జుమా అయిన మొదటి పేరా చదివేసరికి ఓర్నాయనో... ఇది అనువాదమా? భాషా హననమా?? అనిపించింది. మచ్చుకు... 

1) శీర్షిక లోనే పెద్ద దూడ 

'సెకండ్ వేవ్ లో...  కొడిగడుతున్న జర్నలిస్టు దీపాలు' అని రచయిత రాశారు.  'దీపం కొడిగట్టడం' అనేది బతుకులు ఆరిపోతున్నాయని, జర్నలిస్టులు మరణిస్తున్నారని కవి హృదయం. దీన్ని వ్యతిరీకార్థంలో వాడతారు.  దీన్నే 'పిట్టల్లా రాలిపోతున్నారు' అని రచయిత వ్యాసంలో స్పష్టంగా చెప్పారు. దానికి పేస్ బుక్కు డొక్కు అనువాదం ఇదీ... 

In the second wave...journalist lamps are lighting...

wave ను అనువదించకుండా మక్కీకి మక్కీ దింపి... దీపం కొడిగట్టడాన్ని బండ బూతు అనువాదం చేయబడింది. ఒకపక్క జర్నలిస్టులు అష్టకష్టాలు పడుతుంటే... వారి ప్రభ వెలిగిపోతున్నదన్న ధోరణిలో అనువాదం!

2) 'శ్రీకారం రామ్మోహన్ మొదట జర్నలిస్టు' అన్న దానికి Srikaram Rammohan is the first journalist అని వచ్చింది. 

మొదట జర్నలిస్టు అంటే... initially he was a journalist. మొదటి జర్నలిస్టు... అంటే ఈ భూమ్మీద ఓం ప్రథమంగా పుట్టిన జర్నలిస్ట్ అనే అర్థం వచ్చేలా అనువాదం వచ్చింది.  

3) 'మంచి రచయిత' అని వ్యాసకర్త రాస్తే... A very good writer అని మెషిన్ అనువాదం చేసేసింది. 

చాలా మంచి రచయిత అని రాసినప్పుడు... ఆ ఇంగ్లిష్ సరిపోతుంది. 

4) 'రాసినవి చాలా తక్కువే అయినా-రాసినవన్నీ మంచి రచనలే' అని వ్యాసకర్త రాశారు. దానికి... 

Though the written things are very few-all the written things are good writings...అని అమ్మడు అనువదించింది. చేసినవన్నీ మంచి రచనలే... అని రచయిత రాసి ఉంటే దాని అనువాదం ఇంకెంత బాగా ఏడ్చెదో కదా! 

5) "1996 ప్రాంతంలో "శుభం" అని ఒక కథ రాశారు" అన్న వాక్యానికి పట్టిన ఇంగ్లిష్ తెగులు ఇలా ఉంది: In 1996 areas, a story was written as "shubham." 
తెలుగులో ప్రాంతంలో... ఉంది కాబట్టి ఇంగ్లిష్ లో AREAS అని వచ్చింది. 

ఇవి మచ్చుకు మాత్రమే... ప్రతి తెలుగు అనువాదంలో ఇలాంటివి బోలెడు ఉంటున్నాయి. తెలుగు భాషపై ఇది భయంకరమైన దొంగ దాడి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్... మెషిన్ లెర్నింగ్... తొక్కా తోలు ... తోటకూర పులుసు అని... భాషను మరింతగా ఖూనీ చేసి, సంకరం  కావించి భ్రష్టు పట్టిస్తున్నారు. 

ఈ ఘోరాన్ని ఆపేందుకు మనం అర్జెంటులా ఒక పనిచేయాలి. ఆంగ్లానువాదం చేసిన కాపీ కింద 'Rate translation' అని ఉంటుంది. అది నొక్కితే... 'is this translation useful' అని అడిగి మూడు options ('yes' 'somewhat' 'no') ఇస్తారు. సాధారణంగా సోషల్ మీడియా ధోరణి ప్రకారం... మనం ఇవి పట్టించుకోము. ఎందుకంటే... దడదడా వేలుతో స్క్రీన్ తిప్పుతూ వెళ్ళిపోతాం. 
కాబట్టి, తెలుగు పరిరక్షణలో భాగంగా ఎఫ్ బీ వాడికి ఎప్పటికప్పుడు.... 'నీ అనువాదం తగలెయ్యా....' అని తెలియజేయండి. ఇక్కడ 'నో' ఒత్తటమే కాకుండా మెయిల్స్ కూడా రాసి... ఈ చచ్చు చవక దరిద్రపు అనువాదం ఆపండని గట్టిగా కోరండి... This is very urgent, please. 

1 comment:

  1. Anonymous11:27:00 PM

    It's natural language processing can't understand the context,style and nuance of indian languages . It takes times ,,may be 2 year or 20years.. The goal is not to keep the letter and soul of the original ,(although that may take more than 50years),, the intention is to help the non native readers get the context and understand most of that..

    Also, there are blunders in telugu as well..
    1996 ప్రాంతంలో is incorrect, it should be 1996 కాలంలో

    ReplyDelete

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి