Friday, February 7, 2014

ఇంతలోనే...ఒక ఏడాది పూర్తయ్యిందే...

రోజులు చాలా వేగంగా పరిగెడుతున్నాయి. ఇంతలోనే ఒక ఏడాది పూర్తి అయ్యింది. ఏడాది కిందట ఇదే రోజు పీ హెచ్డీ పట్టా తీసుకున్నాను. అయినా పెద్దగా ఒరగబెట్టింది ఏమీ లేదు. వచ్చే ఏడాది లోపు  ఈ  పరిశోధన కు ఒక పుస్తక రూపం ఇచ్చి తీరతానని హామీ ఇస్తూ... లాస్ట్ ఇయర్ రాసిన పోస్టు మీ మళ్ళీ పంచుకుంటాను.... మీలో కొంతమంది తిట్టుకుంటారని తెలిసినా... 
------------------------------------------------------------ 
బ్లాగ్ మిత్రులారా...ప్రియమైన పాఠకులారా...ఆత్మ బంధువుల్లారా....

ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న రోజు వచ్చింది. ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ రోజు... 2013 ఫిబ్రవరి ఏడో తేది...ఎప్పుడూ తియ్యగా, తడి ఆరని కలలా గుర్తుండిపోతుంది. ఏడేళ్ళ కిందట 'ది హిందూ' పత్రిక రిపోర్టర్ గా ఉండగా చరిత్రాత్మకమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం జర్నలిజం డిపార్టుమెంటు లో PhD రిజిస్టర్ చేసుకున్నాను...ఎన్.రామ్ గారి లిఖితపూర్వక అనుమతితో. 'జర్నలిస్టులు-నైతిక విలువలు' అన్న అంశంపై పరిశోధన అనుకున్నంత సులువు కాలేదు. అప్పటి నుంచి కష్టపడి, కలతపడి, దుఃఖపడి, మదనపడి, బాధపడి, బద్ధకం వల్ల కిందపడి మీదపడి  ఎలాగోలా పరిశోధన పూర్తయి ఈ రోజున డిగ్రీ ప్రధానం జరిగింది. ఈ పరిశోధన పని ఒత్తిడి కారణంగా బ్లాగింగ్ కు కొద్దిగా దూరం కూడా అయ్యాను. 


ఒక పన్నెండేళ్ళ కిందట జర్నలిజం లో నేను రెండు గోల్డ్ మెడల్స్ తీసుకున్నటాగోర్ ఆడిటోరియం లో జరిగిన ఉస్మానియా 79 వ స్నాతకోత్సవం లో ఇద్దరు ప్రొఫెసర్లు ఎస్.సత్యనారాయణ (వైస్ చాన్సలర్), గోవర్ధన్ మెహతా (ప్రముఖ రసాయన శాస్త్ర నిపుణుడు) చేతుల మీదుగా కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం లో PhD పట్టా అందుకున్న ఇద్దరిలో నేను ఒకడిని. మొత్తం 279 మందికి ఈ పట్టాలు అందించారు. ఇంతవరకూ ఉస్మానియా నుంచి ఒక అరడజను మందిమి మాత్రమే పట్టాలు పొందగలిగాము. 
బాధ కలిగిన విషయం ఏమిటంటే...విశ్వవిద్యాలయం చాన్సలర్ అయిన గవర్నర్ నరసింహన్ ఈ కార్యక్రమానికి రాకపోవడం. తెలంగాణా కు వ్యతిరేకిగా ముద్ర పడిన ఆయన రావడానికి వీల్లేదని విద్యార్ధి సంఘాలు హెచ్చరించడం, హడావుడి చేయడంతో ఆయన రాలేదని చెప్పారు. ఇది డిగ్రీలు పొందిన వారికి  సమంజసంగా తోచలేదు. ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి పట్ల వ్యతిరేకత ఉండవచ్చుగానీ...ఎందరో తెలంగాణా విద్యార్థులకు కలలాంటి స్నాతకోత్సవానికి, ఆయన అభిప్రాయాలకు సంబంధం ఏముందని పలువురు ప్రశ్నించారు. తెలంగాణా ఇవ్వడం ఇవ్వకపోవడం సోనియా, మన్మోహన్, రాహుల్ చేతిలో ఉంది, ఈ గవర్నర్ మాట విని తెలంగాణా ఇవ్వడం లేదనుకోవడం సమంజసంగా తోచడం లేదు. 

కాస్త అనారోగ్యం తో ఉన్న మా అమ్మ, పిల్లలను తీసుకు రావద్దని యూనివర్సిటీ ప్రత్యేకించి చెప్పడం వల్ల నా పుత్రుడు ఫిడేల్ ఆర్ స్నేహిత్ ఈ స్నాతకోత్సవానికి రాలేదు. మా నాన్న ప్రత్యేకించి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని..."I am proud of you..." అని నాతో గర్వంగా చెప్పారు. మా కుటుంబం లో ఇది మొట్టమొదటి PhD. పరిశోధనకు అడుగడుగునా ప్రోత్సాహం అందించిన నా జీవిత భాగస్వామి హేమ రిపోర్టింగ్ గొడవలో పడి కాస్త లేట్ గా వచ్చింది స్నాతకోత్సవానికి. 

మొత్తం మీద మా అమ్మకు చిన్నప్పుడు ఇచ్చిన మాట ప్రకారం డాక్టర్ అయినందుకు ఆమె, నేను ఆనందించాము. నా గైడ్ ప్రొఫెసర్ పద్మజా షా, ఈ టాపిక్ కు ఒక రూపం ఇచ్చిన నా మొదటి గైడ్ ప్రొఫెసర్ స్టీవెన్ సన్, నేను నిస్పృహకు గురైనప్పుడు ఓదార్చిన ప్రొఫెసర్ బాలస్వామి-ప్రొఫెసర్ నరేందర్ లకు కృతఙ్ఞతలు. నా వెన్నంటి ఉండి సాంకేతిక సహకారం అందించిన నా కూతురు మైత్రేయి, నా ఆప్త మిత్రుడు బలుసూరి శంకర్ లకు థీసిస్ లో విధిగా థాంక్స్ తెలిపాను. వివిధ భంగిమల్లో ఫోటోలు తీసిచ్చిన నా మాజీ సహచరుడు, మాకు ఇంకో కొడుకు లాంటి గోపాల్ కు థాంక్స్. 

ఈ డిగ్రీ ఇచ్చిన అదనపు బాధ్యతతో సమాజ హితం కోసం మరింత పాటుపడతానని గట్టిగా హామీ ఇస్తూ...ఈ ఇకిలించే ఫోటో తో సెలవు తీసుకుంటాను. 

2 comments:

  1. Congrats sir.
    Kalasagar
    editor,
    www.64kalalu.com

    ReplyDelete
  2. Anonymous11:49:00 PM

    congrats once again.. ఇకిలించే ఫోటో మహత్తరం.

    ReplyDelete

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి