Wednesday, September 3, 2014

'సాక్షి' లో చేరనున్న కొండుభట్ల రామచంద్ర మూర్తి గారు

తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు రెంటిలో తనదైన ముద్రవేసిన సీనియర్ మోస్ట్ సంపాదకుడు కొండుభట్ల రామచంద్ర మూర్తి గారు 'సాక్షి' పత్రికలో చేరబోతున్నారు. దీన్ని ఆయన 'తెలుగు మీడియా కబుర్లు' కు దృవీకరించారు... బుధవారం.  ఎడిటోరియల్ డైరెక్టర్ గా ఆయన 'సాక్షి' లో గురువారం చేరతారు. 

నిజానికి 'సాక్షి' పత్రిక ఆరంభించాలన్న నిర్ణయం తీసుకున్నప్పుడు... అప్పటి ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆహ్వానించినప్పటికీ మూర్తి గారు ఎడిటర్ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ తర్వాత పతంజలి గారు సంపాదక బాధ్యతలు నిర్వహించారు. ఆయన మరణానంతరం వర్ధెల్లి మురళి గారు ఎడిటర్ అయ్యారు. సజ్జల రామ కృష్ణా రెడ్డిగారు మానేజింగ్ ఎడిటర్ గా అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు సాధించడంలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ విఫలం కావడం, ఈ లోపు అనూహ్య పరిణామాల మధ్య మూర్తి గారు 'ద హన్స్ ఇండియా', హెచ్ ఎం టీవీ ల నుంచి బైటికి రావడం తెలిసిందే. 
'సాక్షి' పాత్రపై కూడా ఆ సంస్థలో అంతర్మథనం జరుగుతున్న నేపథ్యంలో... యాజమాన్యం ఒక పెద్ద దిక్కు కోసం ఎదురుచూస్తూ... మూర్తి గారిని ఎంపిక చేసినట్లు సమాచారం. ప్రింట్ జర్నలిజం లో అద్భుతమైన ఎడిటర్ మూర్తి గారు అనడంలో ఎలాంటి సందేహం అక్కరలేదు. వార్త, ఆంధ్ర జ్యోతి ఎదుగుదలలో మూర్తి గారి పాత్ర ఎక్కువే. 

ఆయన అంధ్ర జ్యోతిలో సంపాదక బాధ్యతలు స్వీకరిస్తుండగా.. కపిల్ గ్రూప్ యాజమాన్యం ఏరికోరి మూర్తి గారికి కొత్త ఛానల్ ఏర్పాటు బాధ్యతలు అప్పగించింది. 'దశ-దిశ' వంటి చారిత్రక ప్రోగ్రామ్స్, అంబుడ్స్మన్ నియామకం  వంటి వినూత్న చొరవ తీసుకుంటూ నైతిక జర్నలిజం అనే మాటను బహిరంగంగా అనగలిగే అరుదైన ఎడిటర్ గా పేరు తెచ్చుకున్నారు. హంస టీవీ సూపర్ గా నడుస్తున్నప్పుడు... 'ద హన్స్ ఇండియా' అనే ఆంగ్ల పత్రిక ఆరంభించి...ఎక్కడో తెరమరుగైన నాయర్ అనే సీనియర్ ఎడిటర్ ను పట్టుకొచ్చి... తనూ ధారాళంగా రాసారు. దీనివల్ల మూర్తి గారు చేతులు కాల్చుకున్నారని చెప్పకతప్పదు. కాలమానపరిస్థితులు, సుడి బాగోలేక అనూహ్య పరిస్థితుల మధ్య ఇటీవలనే బైటికి వచ్చారాయన. ఆయన ను నమ్ముకున్న 20-30 మంది సీనియర్ జర్నలిస్టులను హెచ్ ఎం టీవీ కొత్త యాజమాన్యం పీకిపారేసిన నేపథ్యంలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తున్న మూర్తి గారికి... అల్ ద బెస్ట్. 
Photo courtesy: The Hindu 

1 comment:

  1. కె రామచంద్రమూర్తిగారు మంచి నిజాయితి, నిబద్దతగల సంపాదకులు..ఎంతో మంది మంచి పాత్రికేయులకు మార్గదర్శిగా నిలిచిన నిజమైన జర్నలిస్టు ఆయన...
    ఈ గురుపూజోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు...
    - బెందాళం క్రిష్ణారావు (శ్రీకాకుళం)

    ReplyDelete

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి