అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లను తయారుచేయాలంటే...ప్లేయర్స్ తో పాటు వారి తల్లిదండ్రులు చాలా కష్టపడాలి. సానియా మీర్జా (టెన్నిస్), సైనా నెహ్వాల్, సింధూ, శ్రీకాంత్ (బాడ్మింటన్), హరికృష్ణ (చెస్), నిఖత్ జరీన్ (బాక్సింగ్), శ్రీజ (టేబుల్ టెన్నిస్)...వీరిలో ఎవ్వరి కథ తీసుకున్నా.. తల్లిదండ్రుల కష్టాలు, కుటుంబం చేసే త్యాగాలు ఉంటాయి-వారి కఠోర శ్రమ, దృఢ దీక్షతో పాటు. దేశంలో చాలా రాష్ట్రాలకు క్రీడా విధానాలే లేవు. శ్రమపడి పైకొచ్చే ఆటగాళ్లను పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. ముఖ్యమంత్రులు దయతలిచి మెడల్స్ విన్నర్స్ కు పారితోషకాలు ఇవ్వడం తప్ప... ఒక పథకం ప్రకారం ఆటగాళ్లను ప్రోత్సహించడం జరగడం లేదు. ఇది దురదృష్టకరమైన పరిస్థితి!
ఈ విషయంలో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాన్ని పొగడాలో, తెగడాలో తెలియదు. ప్రభుత్వంలో పలుకుబడి ఉన్నా, ఆటగాడు ముస్లిం అయినా... ఇక్కడ ఎంతో కొంత సహాయం అందుతుంది. మిగిలిన వాళ్ళకు వచ్చేది సున్నా. చచ్చు సన్నాసులు-పనికిరాని చవటలు క్రీడా సంఘాలకు నాయకత్వం వహించడం, చిత్తశుద్దిలేని వయసు మళ్ళిన దద్దమ్మలు అలంకారప్రాయంగా పోస్టులలో కొనసాగడం, అంతేవాసులతో పొగిడించుకోవడం కోసమే వాటిని వాడుకోవడం, మంచి క్రీడా సౌకర్యాలతో పాటు నాణ్యమైన కోచ్ లు లేకపోవడం, స్పోర్ట్స్ అథారిటీ దగ్గర నిధుల లేమి, ఇవన్నీ ప్రభుత్వానికి పట్టకపోవడం... ఈ దుస్థితికి కారణాలు.
ఈ పోస్టు రాయడానికి కారణం.. ఫణిబాబు గారు 'వడ్డించేవాళ్లుంటేనే' అనే శీర్షికతో రాసిన పోస్టు... అందులో చేసిన 19 సంవత్సరాల స్నేహిత్* ప్రస్తావన. తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకూ ఏ టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు సాధించని అనేక విజయాలను సాధించినా... రెండు సార్లు వరల్డ్ జూనియర్ చాంపియన్షిప్ కు అర్హత సాధించిన తొలి తెలుగు వాడైనా... 15 అంతర్జాతీయ టోర్నమెంట్స్ లో 20 కి పైగా మెడల్స్ సాధించినా, ఒక దశలో వరల్డ్ నెంబర్-23 రాంక్ వచ్చినా తెలంగాణా ప్రభుత్వం కనీసం భేష్ అనలేదు, ఆర్థిక సాయం మాట అలా ఉంచితే. 2017 లో జోర్డాన్ లో జరిగిన పోటీలో ఏకంగా టైటిల్ గెలిచి... ఆ ఘనత సాధించిన తొలి తెలుగు టేబుల్ టెన్నిస్ ప్లేయర్ గా చరిత్ర సృష్టించిన స్నేహిత్ ఆ టోర్నమెంట్ లోనే మరొక రెండు పతకాలు సాధించాడు (ఫోటో చూడండి). తన తోటి గుజరాత్ ఆటగాళ్లకు ఏడాదికి 40 లక్షలు ప్రభుత్వం అందిస్తుంటే.. ఇంటర్నేషల్ రాంక్ కోసం స్నేహిత్ ప్రభుత్వ దన్నులేక ఇబ్బంది పడ్డాడు. స్నేహిత్ కు ఉత్తమ శిక్షణ కోసం, అంతర్జాతీయ పోటీల కోసం కుటుంబం రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమి అమ్మాల్సివచ్చింది. ఇది కొన్ని పేపర్లలో కూడా వచ్చింది.
కొద్దిలో కొద్దిగా కేంద్ర ప్రభుత్వమే నయం. ఖేలో ఇండియా వంటి పథకం పెట్టడం వల్ల ఎంతోకొంత ఊరట లభిస్తున్నది. మరొక వైపు ప్రభుత్వరంగ సంస్థలు కూడా స్కాలర్ షిప్ లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాయి. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు గుజరాత్, హర్యానా, తమిళనాడు, మధ్య ప్రదేశ్ వంటి రాష్ట్రాలను చూసి నేర్చుకంటే బాగుంటుంది. మన దగ్గర ప్రతిభకు కొదవలేదు. ఇప్పుడు కావలసింది ప్రభుత్వ చేయూత.
ఒక్క స్నేహితే కాదు. ఇలాంటి యువ క్రీడాకారులు, వారి కుటుంబాలు అనేకం ఎన్నో త్యాగాలు చేస్తూ రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడుతున్నారు. ప్రభుత్వాలు యువ ఆటగాళ్లను ఆదుకోకపోవడానికి తప్పు పెట్టాల్సింది... స్పోర్ట్స్ అథారిటీ అధికారులను, క్రీడాసంఘాల పెద్దలను. ఇలాంటి వర్థమాన క్రీడాకారులకు ఆర్థికంగా ఆదుకునేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి బాధ్యత నిర్వర్తించాల్సిన ఈ వేస్ట్ బ్యాచులు ఆ పనిచేయకపోవడమే పెద్ద సమస్య. మన క్రీడా వ్యవస్థ ఇలా కునారిల్లడానికి తప్పు పెట్టాల్సింది ఈ మహానుభావులనే.
ఎవరమైనా ఏం చేస్తాం... మంచి రోజుల కోసం వేచిచూడడం తప్ప.
* (నోట్: ఈ బ్లాగ్ వ్యవస్థాపకులు రాము-హేమల కుమారుడే 19 ఏళ్ళ స్నేహిత్)
ప్రతి ఒక్కరు క్రీడలు అంటూ వచ్చి లక్షలు కావాలంటే ప్రభుత్వం ఎంతమందికి ఇస్తుంది. అసలు ఈ క్రీడలు అంతా ఒక మాయ. రకరకాల బంతులను చెక్క ముక్కలతో అటూ ఇటూ కొట్టడం వల్ల ఏమి ఉపయోగం. మానసొల్లాసానికి ఒక వ్యాయామం గా క్రీడలు మంచిదే కానీ అదే వేలం వెర్రిగా ఆడటం ఎందుకు. భారతదేశం లో ఆదుకోవాల్సిన వాళ్ళు కోట్లలో ఉన్నారు. Sports persons are not the priority for government. Either they have to fend for themselves or try for private sponsors. Don't blame government for everything.
ReplyDelete