Saturday, October 1, 2022

లక్ష్మణ మూర్తి సార్ కు అశ్రు-అక్షర నివాళి

అది 1989 వ సంవత్సరం. 

ఖమ్మం జిల్లా కొత్తగూడెం శ్రీనగర్ కాలనీ మూడో లైన్. 

వీధి ఆరంభంలో మేము అద్దెకు ఉండేవాళ్ళం. 

వీధి  చివర్లో ఉన్న ఇంట్లో లక్ష్మణ మూర్తి గారు ఉండేవారు. 

వారు ప్రభుత్వ లెక్చరర్. ఇంగ్లీష్ బాగా చెప్పేవారు.  

ఎప్పుడూ నవ్వుతూ అందరినీ పలకరించేవారు. 

చిన్నా పెద్దా తేడా లేకుండా ఆప్యాయంగా మాట్లాడేవారు. 

ప్రతి పదం స్పష్టంగా, విషయం విశదీకరించి మాట్లాడడం వారి ప్రత్యేకత. 

ఎవరినైనా ఇంటి పేరుతో సహా నోరారా పిలిచేవారు.  

లక్ష్మణ మూర్తి గారి కుటుంబం ప్రత్యేకమైనది.  

సార్ బాల్యం కష్టాలతో కూడినందనుకుంటా. 

ఆ కష్టం ఎవ్వరికి వచ్చినా అండగా నిలబడేవారు. 

వారిని నేను ఎప్పుడూ సార్ అనే అనేవాడ్ని.

మా అన్నయ్య, తమ్ముడు మామయ్య గారు అనేవారు. 

దానికి ఒక కారణం ఉంది. చివర్లో చెబుతాను. 

సార్ సతీమణి భారతి అత్తయ్య గారు గొప్ప మనసున్న మనిషి. 

వీధిలో ఉండే దాదాపు డజను మంది పిల్లలను సొంత పిల్లల్లా చూసుకునేవారు. 

వారి వంటిల్లు ఎవరి కోసమైనా తెరిచి ఉండేది. 

గట్టు గోపాలకృష్ణ గారనే కమ్యూనిస్టు యోధుడి కూతురు. 

నిజంగా మహా తల్లి. చేతులెత్తి దండం పెట్టవచ్చు. 

నవ్వుతూ గలగలా మాట్లాడడం ఆమెఅలవాటు.  

అమాయకత్వం, భోళాతనం కలబోత. 

సార్, అత్తయ్య గారు మాట్లాడుకుంటుంటే చూడముచ్చటగా ఉండేది. 

ఎంత పరాచికంగా, హాస్యంగా మాట్లాడేవారో! 

చిలకాగోరింకల్లా ఉండేవారు.

సార్ కాస్త తగ్గినట్లు నటించి మాట్లాడేవారు.   

ఆ దంపతులకు ఐదుగురు పిల్లలు.  

అందరికీ వారు ఆప్యాయత, ప్రేమలు మాత్రమే పంచారు.

వారి ఇల్లు మా అందిరికీ ఒక పెద్ద అడ్డా, ఒక కోలాహలం. 

అక్కడ ట్యూషన్ చదువుకోడానికి చాలామంది వచ్చేవారు. 

తెలిసిన వాళ్ళ అబ్బాయి ఫణి కుమార్ ను ఇంట్లో ఉంచుకున్నారు. 

కన్న కొడుకులా చూసుకున్నారు, కల్మషం లేకుండా. 

గోపాల కృష్ణ గారి మనమడూ అక్కడే చదువుకున్నాడు. 

ఎవరెవరికో ఆశ్రయం ఇచ్చేవారా దంపతులు. 

పిల్లలూ వారితో తోబుట్టువుల్లా ఉండేవారు.  

ఎవరైనా వచ్చి మేము ఇక్కడ ఉంటామంటే వారిద్దరూవద్దనలేరు.  

ఈ రోజుల్లో ఇది కనీసం ఊహించగలమా? 

సార్ ప్రేమ పంచిన శిష్యులుపెద్ద సంఖ్యలో ఉన్నారు. 

  

వారి పెద్దబ్బాయి మూర్తి. సింగరేణిలో అధికారి.  

మేధావి లక్షణాలు బాగా ఉండేవి. 

రెండో అమ్మాయి  ఝాన్సీ. ప్రభుత్వ టీచర్. 

అక్క ఒక ప్రేమ మూర్తి. నవ్వుమొహం.

మూడో అబ్బాయి శీనన్న. ప్రయివేట్ ఉద్యోగం. 

అన్న సంఘ జీవి, మాకు చాలా ఆప్తుడు. 

మా అన్నయ్యకు క్లాస్ మెట్, ధారాళంగా మాట్లాడతాడు. 

నాలుగో అమ్మాయి సుధారాణి. అడ్వొకేట్.

తల్లిగారిలా గలగలా మాట్లాడే మనిషి. 

ఐదో అబ్భాయి రాజు, ఐటీ ఫీల్డు. 

ఆటపాటలతో హాయిగా గడిపేవాడు. 

అందరికీ సార్ స్వాతంత్య్రం ఇచ్చారు. 

వారి ఇష్టాయిష్టాల ప్రకారమే ఎదగనిచ్చారు. 

మా అమ్మా, నాన్నలకు ఎంతో ఇష్టమైన కుటుంబం వారిది. 

అమ్మ-అత్తయ్య గారు, అమ్మ-శీనన్న మాట్లాడుకుంటుంటే చూడాలి. 

ఈ అద్భుతమైన కుటుంబం మాకు ఒక తీపి జ్ఞాపకం. 

మాకే కాదు వారిని కలిసిన ఎవ్వరికైనా ఇదే అనిపిస్తుంది. 


ఒక మింగలేని చేదు నిజం-సార్ ఇప్పుడు భౌతికంగా వెళ్లిపోవడం. 

విధివశాత్తూ ఆ పెద్దదిక్కు పోయారు, సెప్టెంబర్ 19 న.

అత్తయ్య గారు ఎంత డీలా పడ్డారో కదా! 

ఈ పదిరోజుల్లో సార్ గుర్తుకురాని రోజు లేదు.

అమృతప్రాయమైన పెద్దాయనను పాడు షుగర్ ఇబ్బంది పెట్టింది. 

మళ్ళిన వయస్సును మరింత కుంగదీసి దెబ్బతీసింది.  

అనివార్యమైన కారణాల వల్ల నేను అంతిమ దర్శనం చేసుకోలేకపోయా. 

29 నాడు శ్రద్ధాంజలి ఘటించి వద్దామంటే ఒక ఆటంకం వచ్చింది.  

నాకు జీవితంలో వెలితి మిగిల్చే అంశాల్లోఇది ఒకటి. 

 

వారు నాకు సార్, డిగ్రీలో ఏడాదికి దాదాపు నెల చొప్పున ఇంగ్లిష్ చెప్పారు. 

భయం కలిగించే భాషను అరటిపండు ఒలిచినట్లు చెప్పేవారు. 

ఉదయం 5 గంటలకే లేచి టీ తాగుతూ ప్రేమగా చెప్పారు. 

ఇంగ్లిష్ పట్ల భయం లేకుండా చేసింది సారే. 

ఒక మంచిస్నేహితుడిలాగా ఆత్మస్థైర్యం ఇచ్చేవారు. 

'యూ కెన్,' అంటూ ప్రోత్సహించేవారు. 

ఇదంతా ఫ్రీగానే, ప్రేమతోనే. 

అదీ లక్ష్మణ మూర్తి సార్ ప్రత్యేకత. 


ఆఖరుగా ఒక మూడు నెల్ల కిందట ఖమ్మంలో కలిసాను. 

అదొక ఫంక్షన్, హడావుడిగా ఉంది. 

సార్ లో ఓపిక ఏ మాత్రం తగ్గలేదు. 

హాస్య సంభాషణ, మాట చతురత అంతే ఉన్నాయి.  

సార్, అత్తయ్య గారు ఇద్దరూ ఎంతో ప్రేమగా మాట్లాడారు. 

వారిద్దరినీ అక్కడే ఉండమని చెప్పి నేను భోజనం తెచ్చాను. 

దగ్గరుండి వారికి అడిగి వడ్డించాను. 

వారు ఆనందించారు, చాలా మందికి ఇది చెప్పారు. 

వారిద్దరినీ కలిసుండగా అదే చూడడం. 

సదా నవ్వుతూ మాట్లాడే సార్ ను వారింట్లో ఒక విషాదం కుంగతీసింది. 

అయినా, ఝాన్సీ అక్కకు వెన్నంటి ఉండి అండనిచ్చారు. 

అక్క కొడుకు మహంత్ గురించి బాగా తపనపడేవారు. 

సార్ నాకొక విషయం చెప్పి కంట తడిపెట్టారు. నా గుండె తరుక్కుపోయింది.  

వారిని నేను ఏమని ఓదార్చను? అన్నీ సర్దుకుంటాయని చెప్పాను. 

పని అయిపోయిందని అంటే... అట్లా అనకండని వారించాను.   

మధ్యలో సార్ ఆరోగ్యం కాస్త దెబ్బతిన్నదని శీనన్న చెప్పాడు. 

సార్ అందరినీ విడిచి తరలిరాని లోకాలకు వెళ్లిపోయారు. 

ఎనభై ఏళ్ల పెద్ద మనిషి...

ఒక అద్భుతమైన టీచర్... 

ఒకగొప్ప మనిషి...

ఒక అద్భుతమైన కష్టజీవి... 

ఒక సంఘ ప్రేమికుడు... 

ఒక  ప్రేమ మూర్తి... 

లక్ష్మణ మూర్తి సార్ ఇక లేరు-ఇది జీర్ణించుకోలేని సత్యం.  

సార్ కు నేను ఎప్పుడూ రుణ పడి ఉంటాను. 

ఒకటి, ఇంగ్లిష్ చెప్పినందుకు. 

వారి కారణంగా ఇంగ్లిష్ వచ్చింది, నాకు వృత్తిలో లాభించింది.  

రెండు, కాలనీలో సిఫార్సు చేసి ఇల్లు ఇప్పించినందుకు.

వారి కారణంగా ఇల్లు దొరికింది, అందులోనే నా జీవిత భాగస్వామి లభించింది.  

నోరారా పిలిచే సార్ లేకపోవడం పెద్ద వెలితి. 

కాలపురుషుడి కాఠిన్యం ఎవరికైనా తప్పదు కదా! 

నా బాధ అత్తయ్య గారి గురించి. అయ్యో... పాపం.   

లక్ష్మణ మూర్తి సార్ కు వినయపూర్వక అశ్రు-అక్షర నివాళి. ఓం శాంతి.  

Dear Sir, Love you అండ్ Miss you. 

May God give strength to Attayya garu and the family to cope with the tragedy.

1 comment:

  1. Anonymous11:42:00 PM

    ఆయన ఫ్యామిలీ డీటైల్స్ ఇవ్వడం అవసరమా

    ReplyDelete

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి