చెన్నూరు నాయనమ్మకు....నివాళి
(Note: Dear subscribers, hi. It is purely a personal account and the first part of a series of articles I plan. If you look out for media-related stuff, please ignore this. This is about people and experiences.)
జోరున వర్షం వస్తుంటే వేడివేడిగా, కారంకారంగా తిని కొద్దిగా బద్ధకం చేసుకుని ముసుగేసుకుని గుర్రుపెట్టి నిద్రపోవాలిగానీ, ఒక 500 కిలో మీటర్లు కారులో... అడుగడుగునా ఆసరా కావలసిన తల్లిదండ్రులను తీసుకుని ప్రయాణం చేస్తారా? కుంభవృష్టిలో ఎందుకీ ప్రయాణం, ఏమిటీ సాహసం?
ఆగస్టు 20, 2024 నాడు 85 ఏళ్ల వయస్సున్న మా నాయనమ్మ (మా నాన్న గారి పిన్ని) కన్నుమూశారు. రాధమ్మ గారు అసలు పేరైనప్పటికీ వారు ఉండే గ్రామం పేరుమీద మేము 'చెన్నూరు నాయనమ్మ' అని పిలుస్తాం. ఆ సమయంలో వయోవృద్ధులైన మా తల్లిదండ్రులు బెంగుళూరులో ఉండి ఉన్నపళంగా అంతిమ సంస్కారాలకు చెన్నూరు వెళ్లలేక బాధపడ్డారు. కుటుంబంలో ఆ తరంలో కడపటి పెద్దమనిషి ఆమె. భలే సరదా మనిషి. అత్తగారైనా మా అమ్మతో సరదాగా జోకులేస్తూ ఉండేది. ఇళ్లల్లో కార్యక్రమాలు, పూజలు, పునస్కారాలు జరిగేటప్పుడు అన్నాలకు ఆలస్యమై చిన్న పిల్లల ఆకలి ఎవ్వరూ పట్టించుకోనప్పుడు చెన్నూరు నాయనమ్మ ఎవ్వరూ చూడకుండా లడ్డూలు, గారెలతో ఆదుకునేది. క్షుద్బాధ తీర్చేది. కొట్టంలో మంచం చాటుకు వెళ్లి ఎవ్వరూ చూడకుండా తినమని ప్రోత్సహించేది. చాదస్తంతో పిల్లలను ఇబ్బంది పెట్టడమేమిటని అనేది. నవ్వుతూ మాట్లాడేది. ఆ ధోరణి మా అత్తయ్యలకు వచ్చింది. నలుగురు సరదా అత్తయ్యల్లో ముగ్గురి వాక్బాణాలు, టీజింగ్ తట్టుకోవాలంటే బుర్ర, మాటలు షార్ప్ గా ఉండాలి. లేకపోతే వారు నవ్వులపాలు చేస్తారు. బంధువుల్లో ఇంత ప్రేమ పంచే వారు అరుదు. నాయనమ్మ కొడుకుల్లో పెద్ద ఆయన (విస్సప్ప బాబాయి) ఒక అరుదైన అనారోగ్యంతో కన్నుమూశారు. రెండో కొడుకు (వెంకటేశ్వర్లు బాబాయ్) తల్లిని బాగా చూసుకుంటూ కుటుంబం ఆనందం కోసం శ్రమించాడు. మా సొంత మేనత్త కూతురు, మేము చిన్నప్పటి నుంచి అభిమానించే ఉమా వదిన ఆ ఇంటి పెద్ద కోడలుగా చేసిన సేవ అపూర్వమైనది.
Chennur naayanamm (extreme left) with my parents at Khammam on August 23, 2022 |
ఈ కుటుంబ నేపథ్యంలో, కనీసం 12 వ రోజున (August 31, 2024) చెన్నూరు పోవాలని, ఏ పనీ పెట్టుకోవద్దని బెంగుళూరు నుంచి నాన్న కోరారు. నేను సరే అని రెడీ అయ్యాను. నిన్న పొదున్న 3.30 కి లేచి బయలుదేరి తమ్ముడి ఇంట్లో ఉన్న అమ్మ, నాన్న లను తీసుకుని హైదారాబాద్ లో 6 గంటలకు బయలుదేరినప్పుడు చినుకులు మాత్రమే. నేషనల్ హైవే వదిలి ఖమ్మం వైపు కొత్త రహదారిపై సర్రున ప్రయాణం సాగుతుంటే...వర్షం కాస్తా కుంభవృష్టి గా మారింది. ఖమ్మం లో వాసన్నయ్య (పెదనాన్న గారి అబ్బాయి) ఇంటికి వెళ్లేసరికి కూడా ఒక మోస్తరు గా ఉంది. పెదమ్మను, గీతక్కను పలకరించి, చిన్నక్కను, అరుణక్కను కూడా కలిసి...వద్దన్నా వాసన్నయ్య, వదిన, పిల్లలు బలవంతంగా పెట్టిన దోసెలు తిని 12 గంటలకు నెమలి బయలుదేరాం. నాన్న తమ్ముడు సుబ్రమణ్యం బాబాయిని, ప్రసన్న పిన్నిని పికప్ చేసుకుని బయలుదేరాం ఒంటి గంట ప్రాంతంలో. అయ్యో...ఇంత లేటు అయ్యిందని అనుకుంటూ ఉండగానే బాలు (నాన్న చిన్న తమ్ముడు కృష్ణ బాబాయ్ చిన్న కూతురు) చేసింది. మేము వెళ్లే దారిలో వెంకటాపురం దగ్గర రోడ్డు మీద గుండా తాళ్ళూరి చెరువు వరద నీరు పారుతోందని చెప్పింది. అది ఒక అవాంతరం.
ఈ అవాంతరం గట్టెక్కి ఎంతో ముఖ్యమైన ట్వల్త్ డే క్రతువు కు అందుకుంటామా? లేదా? అని భయపడ్డాను. నాతో ఉన్న నలుగురు పెద్దవాళ్ళు కూడా దిగులుపడ్డారు. వేరే రూట్ లో తిరిగి వెళ్లాలంటే చాలా ఆలస్యమవుతుంది. వరద నీరు సాఫీగా పోవడానికి వీలుగా చెత్త తొలగిస్తూ రోడ్డు మీద ఒక జే సీ బీ పనిచేస్తోంది. ఊళ్ళో యువకులు, రైతులు అక్కడ ఉన్నారు. కారు పోవచ్చా? అని అడిగితే ట్రై చేయమని ప్రోత్సహించారు. ధైర్యం చేసి వరద ప్రవాహం లోకి పోనివ్వాలని నిర్ణయించాను. అట్లా దుస్సాహసం చేసి వెళ్లి కొట్టుకుపోయిన వ్యక్తులు, వాహనాల గురించి జర్నలిస్టుగా వార్తలుగా రాసిన వాడిని, వార్తల్లో చూసిన వాడిని. అయినాసరే, చెన్నూరు టైం కు వెళ్లాలంటే ఇది తప్పదు. వరద మధ్యలో చిక్కుకుంటే అక్కడ యువకులు పెద్ద సంఖ్యలో ఉన్నారన్న భరోసాతో పోనిచ్చా. కారు సగం దాగా నీళ్లు వచ్చాయి. మొండిగా ఒకటో గేర్ లో స్పీడ్ పెంచి లాగించాను. చివర్లో కొద్దిగా ఇబ్బంది అయినా బండి ఒడ్డుకు చేరింది. నాయనమ్మ పెడుతున్న పరీక్షల ఖాతాలో ఇది చేరింది.
భారీ వర్షం మధ్యనే చెన్నూరులో కార్యక్రమాలు అయ్యాయి. పెద్ద సంఖ్యలో బంధువులు వచ్చారు. అది నాయనమ్మ మంచితనం. మనం పోయాక నిజంగా ప్రేమ, శ్రద్ధలతో ఎంతమంది వచ్చి నివాళి అర్పిస్తారన్న దానిమీద మనం బతికిన బతుకు నాణ్యత ఆధారపడి ఉంటుంది కదా! పైగా అంత పెద్ద ముసురులో, ప్రమాదకరమైన ప్రయాణాలు చేసి ఎవరు వస్తారు? జనం కిక్కిరిసి పోయారు. మా అత్తయ్యలు మా నాన్న, అమ్మను చూసి తమ దుఃఖాన్ని పంచుకున్నారు. నేను కూడా ఎంతో మంది బంధువులను కలుసుకున్నాను. నేను భోజనం తింటున్నప్పుడు నాయనమ్మ గుర్తుకు వచ్చింది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ కొత్త చింతకాయ పచ్చడి, కాకరకాయ పులుసు వేసుకుని అడ్డూ అదుపూ లేకుండా వర్షం మధ్యనే లాగించా.
భోజనాలు అయ్యేసరికి ఆరు అయ్యింది. వర్షం పిచ్చి కొట్టుడు కొడుతోంది. ముందుగా అనుకున్న ప్రకారం, అక్కడ ముఖ్యమైన ఆశీర్వచనం కార్యక్రమం అయ్యాక అక్కడ గానీ, నెమలి లేదా ఖమ్మంలో గానీ ఉండి మర్నాడు ఉదయం రావాలి. కానీ వర్షంలో వసతి సౌకర్యాలు అనుకూలంగా లేవనిపించింది. అమ్మా నాన్నలను నిదానంగా పట్టుకుని నడిపించాల్సి ఉంటుంది.
వాగులూ వంకలూ పొంగి పొర్లుతుంటే చెన్నూరు ఊళ్ళోనే ఉంటే ఇరుక్కుంటామని నాకు గట్టిగా అనిపించింది. సాయంత్రం ఆరు గంటలకు వర్షం మధ్యనే హైదరాబాద్ బయలుదేరాం. నాన్న మిత భాషి. మా ప్రియతమ బాబాయి అద్భుతంగా సంభాషణలో రక్తికట్టించే పెద్ద మనిషి. అమ్మ, పిన్ని కూడా సెన్సిబుల్ గా సంభాషణ సాగించే వారే. వారంతా 70-80 ఏళ్ల మధ్య వారు. జీవితంలో కష్టాలు, నష్టాలు, ఆనందాలు, చెడులు అనుభవానిచ్చిన వారు. కారు లోపల మాటా మంతీ చర్చలు జరుగుతున్నా బైట వరుణుడు నాలో వణుకు పుట్టించాడు. ఆకాశానికి చిల్లు పడినట్లు ఉంది. లావుపాటి చినుకులు బలంగా వచ్చి కారును కసిగా కొడుతున్నాయి. కారు లైట్లు మార్చాలని మిత్రుడు శంకర్ ఎందుకు గట్టిగా చెప్పాడో అప్పుడు అర్ధరాత్రి అర్ధమయ్యింది. గుండెల్లో దడ మొదలయ్యింది. పెద్దవాళ్ళు మనతో ఉన్నప్పుడు రెండు మూడు చోట్ల మూత్ర విసర్జనకు ఆపాల్సి ఉంటుంది. రోడ్డు మీద ఐదారు వాహనాల కన్నా ఎక్కువ లేవు. కంటి ముందు ఏమీ కనిపించడం లేదు, ఒక్క ధారాపాతమైన వర్షం తప్ప. కారు గుంటల్లో పడకుండా జాగ్రత్త పడ్డాను. స్పీడ్ బ్రేకర్స్ దగ్గర జాగ్రత్త పడాలి. పెద్దవాళ్ళు ఇబ్బంది పడకూడదు. అక్కడక్కడా రోడ్డు మీద నీరు నిలిచింది. ఆ నీటిని వేగంగా వెళ్తున్న కారు టైర్లు కోస్తుంటే పెద్ద శబ్దం అయి స్టీరింగ్ అదుపు తప్పుతోంది. ఈ పరిస్థితి నాకు ఎప్పుడూ ఎదురు కాలేదు. డ్రైవింగ్ అంటే పెద్దగా ఇష్టం లేని నేను రాత్రి పూట బండి తీయను, జర్నీ చేయను. కానీ ఈ రోజు తప్పలేదు. ఎడతెరిపి లేకుండా ఇంత వర్షం కురుస్తుంటే కొందరు మిత్రులు, బంధువులు ఫోన్ చేసి జాగ్రత్త చెప్పారు. మధ్యలో బండి అపి అందులోనే నిద్రపోవడమో,నార్కెట్ పల్లి లో రూం తీసుకుని ఉండడమో చేయాలినిపించింది. మూర్ఖపు, ప్రమాదకర ప్రయాణం చేస్తున్నామని మాత్రం అర్ధమయ్యింది.
నేను నల్గొండ జిల్లాలో 'ది హిందూ' రిపోర్టర్ గా పనిచేశాను కాబట్టి అక్కడ పరిచయాలు ఎక్కువ. ఏదైనా నీకు తెలిసిన పోలీస్ స్టేషన్ దగ్గర అపి కొద్దిసేపు ఆగి ప్రయాణం చేద్దామని అమ్మ చెప్పింది. కానీ, మధ్యలో ఆగడానికి వీలుగా పరిస్థితి లేదు. ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆపినపుడు వాళ్ళుమందులు వేసుకున్నారు.
ఇట్లా పూర్తి ఏకాగ్రతతో బండి నడిపి బాబాయి, పిన్నిని మౌలాలి లో దింపి, నాన్నను అమ్మను ఈ ఎస్ ఐ దగ్గర తమ్ముడి ఇంట్లో దింపి మలేషియన్ టౌన్ షిప్ లో మా ఇంటికి వచ్చేసరికి క్యాలెండర్లో తేదీ మారింది. క్షేమంగా ఇంటికి చేరడం గొప్ప విషయం. 12 గంటల కారు జర్నీ, హెవీ భోజనం, టెన్షన్ మధ్య ప్రయాణం చేసి అలిసి సొలిసి ఆదివారం ఉదయం 10 గంటలకు నిద్రలేచాను. ఈ లోపు మా క్షేమం కోరుతూ పలువురు ఫోన్ చేశారు.
సాయంత్రానికి తెలిసింది- ఖమ్మం నుంచి హైదరాబాద్ ప్రయాణం కష్టమైందని. చాలా చోట్ల వాగులు పొర్లాయి. రోడ్డు ప్రయాణం ఆగిపోయింది. నిన్న ఖమ్మంలో మేము వెళ్లిన ప్రాంతాలు ఈ రోజు నీళ్లలో మునిగాయి. గత రెండు దశాబ్దాలుగా ఎప్పుడూ లేని కుంభవృష్టి ఖమ్మాన్ని కుదిపివేసింది. మేము రాత్రిహైదరాబాద్ వచ్చేయడం మంచిదే అయినా ఇది ఒక సాహసోపేతమైన ప్రయాణంగాగుర్తుండి పోతుంది. అసలు ఈ వర్షంలో ఎట్లా వెళ్ళామా? ఎట్లా వచ్చామా? అనేది నాకు అర్ధం కావడం లేదు.
చెన్నూరు నాయనమ్మ కు ఈ రకంగా ఘనంగా నివాళి అర్పించామనిపించింది. ఓమ్ శాంతి.
Thank you Annaya, very well written.
ReplyDeleteఅన్నయ్య బామ్మ గురించి చాలా బాగా రాశారు. పోయినా సారి బామ్మ పుట్టిన రోజు నాడు నువ్వు రాసింది బామ్మ కి చదివి వినిపిస్తే బాగా ఆనంద పడింది. ఇవన్నీ రాము కి బాగానే గుర్తూనాయి అని అన్నది. ఇప్పుడు నువ్వు రాసింది చదివి వినిపించటానికి బామ్మ ఇంకా లేదు అని బాధగా ఉంది.
ReplyDeleteSuper Annaya 👏🏼👏🏼
ReplyDeleteప్రయాణం..బంధం..రెండు..బాగా చెప్పారు.. నాకు నా పెద్దవాళ్గు గుర్టుకొచేశారు..ఆ ప్రేమలే వేరు..
ReplyDeleteGood narration bava.👏👏
ReplyDeleteAdventurous
ReplyDeleteGreat tribute to🌹
ReplyDelete