1) డబ్బు, 2) అధికారం.
కైపెక్కిస్తాయి.
కళ్ళు నెత్తికెక్కిస్తాయి.
తైతిక్కలాడిస్తాయి.
ఒకటి ఉంటే రెండోది ఈజీ.
రెండోది ఉంటే మొదటిది తేలిక.
రెండూ ఉంటే ఆటోమేటిక్ గా మరో రెండు 3) మత్తు (లిక్కర్, డ్రగ్స్) 4) పొత్తు (చెడు సావాసాలు, బైట సెట్టప్స్) చేరతాయి.
ఈ నాలుగూ కొన్నాళ్ళు నలిచేస్తాయి. తెరుకునేలోపు గుల్లచేస్తాయి. కోలుకునేలోపు కూలిపోతారు. చాలా వరకు చివరకు దొరికిపోయారు. ఉదాహరణలు కళ్ళముందే బోలెడు. పతనం సమయంలో అప్రమత్తం చేసే మంచి మిత్రులు, మొట్టికాయవేసే కుటుంబం, వినే మనసు లేకపోతే శంకరగిరి మాన్యాలే.
భారత ఆర్థిక వ్యవస్థను గుల్ల చేసిన స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా 30 వేల కోట్ల రూపాయల సెక్యూరిటీస్ స్కాం నేపథ్యంలో వచ్చిన కొత్త సినిమా ' లక్కీ భాస్కర్ ' నిన్న రాత్రి విశాఖపట్నంలో చూసా. మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్ ఉన్నాడంటే వెళ్ళాను. బాగా నటించాడు.
దరిద్రం వేటాడిన ఒక ప్రైవేటు బ్యాంకు ఉద్యోగి తనకు దక్కాల్సిన ప్రమోషన్ ఇద్దరి వల్ల (బెంగాలోళ్ళు మరి! ఇంగ్లీష్ మీడియా, అకాడమియలో ఉన్నవాళ్లకు బాగా తెలుస్తుంది) దక్కకుండా పోవడంతో పోతేపోతాం...అన్న తెగింపుతో కొద్దిగా బుర్రపెట్టి (అన్ని చోట్లా ప్లాన్ - బీ తో) స్కాం కు సహకరించే బ్యాంకింగ్ వ్యవస్థలో భాగమై వంద కోట్ల రూపాయలు రాయల్ గా సంపాదించడం...డబ్బు కిక్కులో పతనం మొదలైనాక మంచి భార్య, తండ్రి సహకారంతో డర్టీ గేమ్ సరైన సమయంలో ఆపేసి బ్యాంకుకు, సీ బీ ఐ కు, ఆర్ బీ ఐ కు కుచ్చుటోపీ వేసి కుటుంబం సహా అమెరికా చెక్కేసి అక్కడే పెద్ద హోటల్ కొనేసి దర్జాగా బతకడం సూక్ష్మంగా సినిమా కథ.
హీరోయిన్ మీనాక్షి చౌదరి, సీ బీ ఐ అధికారి సాయి కుమార్ తదితరులు బాగా నటించారు.
సైన్స్, ఫైనాన్స్ వంటి కథాంశాలను సాధారణ ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పడం చాలా కష్టం. అయినా ఒక మెగా ఫైనాన్షియల్ స్కాం చుట్టూ అల్లిన కథను దర్శకుడు వెంకి అట్లూరి అద్భుతంగా డీల్ చేశారు. కథ, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, కెమెరా వర్క్ చాలా చాలా బాగున్నాయి. చిన్నవైనా కొన్ని డైలాగ్స్ కలకాలం నిలిచేవిగా ఉన్నాయి.
ఓవర్ యాక్షన్, బూతు, బ్లడ్ లేకుండా ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమా.
అన్నిటికన్నా ముఖ్యంగా అంతర్లీనంగా స్నేహం ప్రాముఖ్యతను, కుటుంబం ఆవశ్యకతను ఈ సినిమా బాగా చెప్పింది.
ఒక్క టైటిల్ మాత్రమే అతికినట్టు సరిపోలేదని నాకు అనిపించింది. వీలుచేసుకుని చూడొచ్చు.
#venkiatluri #luckybhaskarmovie #suryadevaranagavamsi
#telugumovie
"ఓవర్ యాక్షన్, బూతు, బ్లడ్ లేకుండా ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమా."
ReplyDeleteఇదే నాలాంటి సీనియర్ ప్రేక్షకులు కోరుకునేది.
నిన్నే చూసాను, సినిమా బాగుంది.