మీడియా అధిపతులకు,
నమస్కారం!
ఆధునిక మానవ చరిత్రలో మున్నెన్నడూ లేనివిధంగా కొవిడ్ వైరస్ సృష్టించిన ఒక చీకటి గుహలో దారీతెన్నూ తెలియక బిక్కుబిక్కుమంటూ ప్రాణ భయంతో బతుకు పోరాటం చేస్తున్న ఒక అసాధారణ పరిస్థితి మీది, మీ కుటుంబాలది, జర్నలిస్టులది, తతిమ్మా జనాలది అందరిదీ. మన దగ్గరున్న డబ్బు, డాబు, దర్పం, ఇతరేతర వనరులు ప్రాణాలను నిలబెట్టేట్టు కనబడడం లేదు. నిజానికి, మనుషులంతా ఒక్కటే... కలిసి (దూరందూరంగా నైనా) ఉంటే కలదు సుఖం... అన్న అతి సాధారణ సమైక్య భావనలను గుర్తుచేయడానికా అన్నట్టు ఈ వైరస్ విడతల వారీగా విరుచుకుపడుతున్నది.
ఐశ్వర్యాలు, అంతస్తులు ఈ విషమ పరిస్థితుల్లో ఏ మాత్రం ఆదుకోబోవని, కొవిడ్ వైరస్ రెండో తరంగం సృష్టిస్తున్న భయోత్పాతం ఊహకు అందకుండా ఉందని మీకు తెలియంది కాదు. ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా మన దేశంలో కేసులు, మరణాలు ఘోరంగా పెరుగుతున్నాయి. ఆ టీకాలు సామర్థ్యం పై చర్చోపచర్చలు ఎలా ఉన్నా... మనమంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి దాపురించింది. ఇంకో ఒకటి రెండేళ్లు ఇలానే ఉండవచ్చని అంటున్నారు.
ప్రజలకు సమాచారం అందించే పవిత్ర కార్యంలో నిమగ్నమైన మీడియా గత ఏడాది కొవిడ్ సృష్టించిన ప్రళయం వల్ల అతలాకుతలం అయ్యింది. పాడు వైరస్ పత్రికల ద్వారా కూడా వ్యాపిస్తుందన్న అనుమానం ప్రబలడం వల్ల, వ్యాపార ప్రకటనలు దాదాపు శూన్యం కావడం వల్ల పరిశ్రమ కోలుకోలేని దెబ్బతిన్నది. లక్షల మంది జర్నలిస్టులు ఉద్యోగాలు కోల్పోయారు. అప్పటిదాకా మీడియా పరిశ్రమనే నమ్ముకుని బతికిన సీనియర్లు పెద్ద సంఖ్యలో ఇంటికి పరిమితం కావాల్సి వచ్చింది. ఇది వారి కుటుంబాల్లో పెను విషాదానికి దారితీసింది. మీడియాకు 2020, 2021 చీకటి సంవత్సారాలు.
రెండో తరంగం మూలంగా డజను మంది జర్నలిస్టులు ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. పెద్ద సంఖ్యలో వర్కింగ్ జర్నలిస్టులకు, వారి మూలంగా వారి కుటుంబ సభ్యులకు వైరస్ సోకింది. కొవిడ్ సోకిన జర్నలిస్టులు మెడికల్ బిల్లుల కోసం, వృద్ధులైన తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవడం కోసం కష్టపడి దాచుకున్న నిధులు ఆవిరిచేసుకున్నారు. మిగిలిన వృత్తుల వారికన్నా అధికంగా జర్నలిస్టుల కుటుంబాల్లో ఒక భయంకరమైన వాతావరణం నెలకొంది. కొవిడ్ మరణాలకు వైరస్ తీవ్రతతో పాటు మానసిక భయాందోళనలు కూడా ఒక పెద్ద కారణం అని గ్రహించాలి.
అందుకే, అయ్యా... అటు పత్రికలు, చానళ్లు మూతపడకుండా, ఇటు జర్నలిస్టుల ఆరోగ్యాలు చెడకుండా వ్యూహాలు రచించాల్సిందిగా ప్రత్యేకంగా కోరుతున్నాం. కనీస సిబ్బంది ఆఫీసులకు వచ్చేలా, ఇంటి నుంచి జర్నలిస్టులు పనిచేసేలా వెసులుబాటు కల్పించాల్సిన సమయం ఎప్పుడో వచ్చింది. ఇప్పటికే ఆలస్యం అయ్యింది. ప్రయాణాల మూలంగా జర్నలిస్టులు కొవిడ్ పాలవుతున్నారు. ఇళ్లలో కూర్చొని జర్నలిస్టులు కాలక్షేపం చేస్తారన్న దురభిప్రాయాన్ని విడనాడి వెనువెంటనే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా వినమ్రంగా కోరుతున్నాం. దీనిపై ఇంకా ఆలస్యం చేస్తే ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని విజ్ఞులైన ఎడిటర్లు, యజమానులు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం. ఈ పరిస్థితుల్లో మానవతా దృక్పదంతో వ్యవహరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
కృతజ్ఞతలతో....
తెలుగు మీడియా కబుర్లు బృందం
(నోట్: ఈ లేఖను యాజమాన్యాలకు, వారి ప్రతినిధులకు అందేలా పాఠకులు చర్య తీసుకోవాలని ప్రత్యేక విజ్ఞప్తి)
No comments:
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి