దళితులకు సంబంధించిన అంశాలను, పరిణామాలను నిశితంగా పరిశీలించి వార్తలు రాసేందుకు డెక్కన్ క్రానికల్ (డీసీ) ఆంగ్ల పత్రిక ప్రత్యేకంగా ఒక రిపోర్టర్ ను నియమించబోతున్నది.
డీసీ పత్రిక రెసిడెంట్ ఎడిటర్ శ్రీరామ్ కర్రి బుధవారం మొట్టమొదటి 'ప్రొఫెసర్ బి. బాలస్వామి స్మారకోపాన్యాసం' చేస్తూ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. కరోనా మహమ్మారికి మే నెల ఏడున బలైన మానవతావాది, ప్రేమమూర్తి, విద్యార్థుల ఆత్మీయ ప్రొఫెసర్ బండి బాలస్వామి జయంతి సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం డిపార్టుమెంటు ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ జూమ్ లో ఈ స్మారకోపన్యాసం నిర్వహించింది.
Mr.Sriram Karri delivering "Prof B.Balaswamy Memorial Lecture" on June 30, 2021 |
"Virus in the Newsroom: Which Mask to Wear?' అనే అంశంపై డీసీ రెసిడెంట్ ఎడిటర్ మాట్లాడారు. కఠిన సామాజిక పరిస్థితులకు వెరవకుండా ప్రొఫెసర్ బాలస్వామి ఉన్నత ఎత్తుకు ఎదిగారని, అయన మరణానంతరం సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తిన నివాళులు దివంగత ప్రేమమూర్తి ఔన్నత్యానికి అద్దం పడతాయని అయన అన్నారు. ఈ సందర్భంగా, మాజీ ఎం ఎల్ సీ, ప్రొఫెసర్ బాలస్వామి సహోద్యోగి అయిన ప్రొఫెసర్ కె నాగేశ్వర్ న్యూస్ రూమ్ లలో దళితులకు దక్కని ప్రాతినిధ్యం గురించి ప్రస్తావించినపుడు శ్రీరామ్ కర్రి స్పందిస్తూ... దళితుల సమస్యల నివేదన కోసం ఒక జర్నలిస్టును నియమిస్తామని అక్కడికక్కడ ప్రకటించారు.
దళిత జర్నలిస్టులను యాజమాన్యాలు నియమించకపోవడం ఒక లోపమేనని శ్రీరామ్ అభిప్రాయపడ్డారు. అలాగే, పత్రికల విశ్వసనీయత బాగా దిగజారిందని స్పష్టంచేశారు. భిన్న అభిప్రాయాలకు ఆలవాలమైన సోషల్ మీడియా విస్తరణ ఆహ్వానించదగిన పరిణామమే అయినా తప్పుడు సమాచారం 'ఫేక్ న్యూస్' రూపంలో చేస్తున్న నష్టం అపారమైనది చెప్పారు.
కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రజలంతా కలిసికట్టుగా పనిచేసినట్టే, తప్పుడు సమాచారాన్ని నిలువరించేందుకు మూకుమ్మడిగా ప్రయత్నాలు చేయాలని రెసిడెంట్ ఎడిటర్ చెప్పారు. జర్నలిజంలో నాణ్యత ప్రమాణాలు దిగజారాయని చెబుతూ శ్రీరామ్ ఒక గమ్మత్తైన వ్యాఖ్య చేశారు. తన సుదీర్ఘ జర్నలిజం జీవితంలో తిరుగులేని అద్భుతమైన లీడ్ (వార్తలో మొదటి పేరా) రాసే వారిని ఇంతవరకూ చూడలేదని చెప్పారు.
ఓయూ జర్నలిజం శాఖ అధిపతి ప్రొఫెసర్ స్టీవెన్ సన్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ప్రొఫెసర్ బాలస్వామి గారిని ఆసుపత్రిలో చేర్పించి దగ్గరుండి చూసుకున్న డిపార్ట్మెంట్ పూర్వ విద్యార్థి రమేష్ మాట్లాడుతూ వారి మృతి తీరనిలోటని చెప్పారు.
నిజంగానే డీసీ పత్రిక దళిత్ బీట్ ఏర్పాటు చేసి, కేవలం దానికోసమే ప్రత్యేకించి ఒక రిపోర్టర్ ను నియమిస్తే అది భారతదేశ జర్నలిజం చరిత్రలో ఒక కొత్త ఒరవడికి నాంది పలికినట్లు అవుతుంది. కరోనా కారణంగా జర్నలిస్టుల ఉద్యోగాలు పీకేస్తున్న సమయంలో ఈ చర్య ఒక ఉదాహరణగా మిగిలిపోతుంది. ఈ పని సత్వరమే జరగాలని ఈ బ్లాగు కోరుకుంటోంది.
This comment has been removed by the author.
ReplyDelete