Wednesday, August 4, 2021

తీన్మార్ మల్లన్నపై కక్షపూరిత వైఖరి తగదు!

ప్రశ్నించే గొంతులను నొక్కేయడం అప్రజాస్వామిక పాలకుల ప్రథమ కర్తవ్యం. ప్రశ్నించే తత్త్వం నుంచి, ఒక మహోన్నత ఉద్యమం ద్వారా పాలనాధికారం పొందిన తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రజాదరణ కలిగిన ' క్యూ న్యూస్'  యూ ట్యూబ్ ఛానెల్ వ్యవస్థాపకుడు, జర్నలిస్టు అయిన  తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ పట్ల ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తున్నట్లు కనిపించడంలేదు. ఇది దారుణం, అన్యాయం. 

ప్రభుత్వ విధానాలకు,  అవినీతికి పాల్పడిన మంత్రులకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు, పత్రికలు, టెలివిజన్ చానళ్ల కన్నా ఘాటుగా స్పందిస్తూ ప్రజాదరణ పొందిన మల్లన్న ఆఫీసులో నిన్న (ఆగస్టు 3, 2021) రాత్రి మూడు గంటలకు పైగా  హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ పనిచేసినట్లు పోలీసులు తెలిపినా, ఇది ఒక పద్ధతి ప్రకారం కక్ష సాధింపుతో చేసినట్లు కనిపించింది. ఆఫీసు బైట మల్లన్న అభిమానులు ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు. పలు రాజకీయ పార్టీలు కూడా మల్లన్నకు బాసటగా నిలిచాయి. పోలీసుల సోదాలను మల్లన్న టీమ్, అయన అభిమానులు సామాజిక మాధ్యమాల్లో  లైవ్ చేసారు. మొత్తం మీద పోలీసులు తనను అక్రమంగా కదలకుండా చేశారని, కొన్ని కంప్యూటర్ డిస్కులు స్వాధీనం చేసుకున్నట్లు మల్లన్న చెప్పారు.  

ఇటీవల ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్ధికి ముచ్చెమటలు పట్టించి మల్లన్న రెండో స్థానం పొందారు. ఆ తర్వాత ప్రభుత్వంపై దాడిని మరింత పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా టీమ్ లను ఏర్పాటు చేసి అక్రమార్కులపై కథనాలు పెంచి, తనను కలిసిన బాధితులకు బాసటగా ఉంటున్నారు.  సాధారణ జర్నలిజానికి భిన్నంగా పరుష పదాలతో.... ముఖ్యమంత్రిని, ఆయన పరివారాన్ని నేరుగా దూషిస్తూ, పలు ఆరోపణలు చేస్తూ మల్లన్న రోజూ చేసే చర్చలకు ప్రజాదరణ ఉంది. ఈ ప్రభుత్వ పాలనలో తెలంగాణలో అవినీతి పెరిగిందిగానీ, అభివృద్ధి జరగడం లేదన్న అక్కసు, ఆవేదన మల్లన్న మాటల్లో కనిపిస్తుంది. 

తనను అరెస్టు చేసేందుకు ముఖ్యమంత్రి కుట్ర పన్నుతున్నారని మల్లన్న చెబుతూ వస్తున్నారు. గత కొన్ని రోజులుగా మల్లన్న కు వ్యతిరేకంగా కొన్ని పరిణామాలు జరిగాయి. వాటికి, పోలీసుల చర్యకు ఎంత సంబంధం ఉన్నదీ తెలియదు గానీ, ప్రభుత్వం పరిధికి మించి ఒక జర్నలిస్టును వేధించడం మంచిది కాదు. ప్రభుత్వంలో అవినీతిని ప్రశ్నించిన యువ జర్నలిస్టు రఘు ను పోలీసులు గూండాల్లా అరెస్టు చేసి అభాసు పాలైన కొన్ని రోజులకే మరో జర్నలిస్టు ఆఫీసులో పోలీసు సోదాలు జరగడం గమనార్హం. 

మల్లన్న పై ప్రభుత్వ పత్రికగా ముద్ర ఉన్న 'నమస్తే తెలంగాణ' ప్రచురించిన వార్త ఈ కింది విధంగా ఉంది. ముఖ్యమంత్రిని మాటిమాటికీ అనుచితంగా మల్లన్న తిట్టడం ఎంత తప్పో, ఈ కింది కార్టూన్ లో 420 గా తనను పేర్కొనడం అంతే తప్పు. జర్నలిజం ముసుగులో దొంగదెబ్బలు తీయడం వృత్తికి ప్రమాదం. 


   

No comments:

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి