ఖమ్మం - తల్లాడ మధ్యలో ఉండే చిన్న పట్టణం వైరా. వందలాది గ్రామాల మంచినీటి అవసరాలు తీర్చే వైరా రిజర్వాయర్ ఒడ్డున చూడముచ్చటగా ఉంటుంది మా స్కూలు కమ్ కాలేజ్ ప్రాంగణం. అందులో మధ్యలో ఉన్న బాడ్మింటన్ కోర్టు, స్టేజ్...రెండూ నా జీవితంలో ప్రధానమైనవి. ఎనిమిదో తరగతి నుంచి ఇంటర్ ఫస్టియర్ వరకూ అవే ప్రపంచం. అంతకుముందు చదివిన రెబ్బవరం స్కూల్ లో కూడా బాడ్మింటన్ ఆడుతూనే చదువులో ముందున్న నేను వైరా వచ్చాక ఆటలు, నాటికల మీద దృష్టి పెట్టాను. వ్యాసరచన, వక్తృత్వంలో కూడా ప్రైజులు వచ్చేవి. పైగా...మా నాన్న గారు పనిచేసే వెటర్నరీ ఆఫీసు పక్కనే మాకు విశాలమైన క్వార్టర్ ఉండేది. క్రీడల మీద ఆసక్తి ఉన్న మా నాన్న గారు ఆఫీసు ఆవరణలో బాడ్మింటన్ కోర్టు తో పాటు షటిల్ బ్యాడ్మింటన్ కోర్టు వేశారు. ఉదయం అక్కడ నాన్న, అన్నయ్య, తమ్ముడు, నేను, సైదులు (ఇప్పుడు టీచర్), ఇతర పిల్లలు కలసి బాగా ఆడేవాళ్ళం.
వైరా స్కూల్ లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీ ఈ టీ) మల్లయ్య గారు, ఫిజికల్ డైరెక్టర్ (పీ డీ) రామస్వామి గారు ఉండేవారు. ఆ నాలుగేళ్లు అన్ని పోటీల్లో బాల్ బాడ్మింటన్ లో నేను ప్రైజులు పొందాను. వారిద్దరూ మంచి సమన్వయంతో కబడ్డీ, ఖో ఖో ఆడించేవారు. చిన్న మెరిసే కళ్ళతో రామస్వామి సార్ చలాకీగా నవ్వుతూ బాగుండేవారు. ఆయన మంచి బాడ్మింటన్ క్రీడాకారుడు. స్ప్రూ సర్వీస్ చేయడంలోనే కాకుండా బంతిని స్పిన్ చేస్తూ ఆయన కొడితే చూడముచ్చటగా ఉండేది. బాలు వర్తులాకారంలో కోర్టు బైటి నుంచి లోపలకి వెళ్లేలా ఆయన స్పిన్ షాట్ కొట్టే వారు. అందుకే ఆయన నాకు ఒక రోల్ మోడల్ అయ్యారు. ఆయన లాగా బీపెడ్ చేసి
పీడీ కావాలన్న టార్గెట్ ఉండేది. అయితే, 'రామూ, ఎప్పుడు చూసినా ఆటల మీద ఉంటున్నావ్. మన దేశంలో ఆటలని నమ్ముకుంటే ఫుడ్డు దొరకదు. ఇందులో ఎన్నో పాలిటిక్స్ ఉంటాయి. అవకాశాలు తక్కువ. నువ్వు బ్రైట్ స్టూడెంట్ వి. చదువు మీద దృష్టి పెట్టు,' అని మల్లయ్య గారో, రామస్వామి గారో నాకు ఒక రోజు ఉద్బోధ చేసినా నేను గ్రౌండ్ విడవలేదు.
ఆ తర్వాత కొత్తగూడెంలో డిగ్రీ చేస్తూ కూడా ఆటల మీద టైం పెట్టడానికి కారణం..పీ డీ కావాలన్న లక్ష్యం. యూనివర్సిటీ స్థాయికి వెళ్ళినా మోకాలులో లిగమెంట్ దెబ్బతిని ఆటలకు దూరం కావాల్సి వచ్చింది. ఆ విధంగా జర్నలిజం లోకి మారి దాన్నే వృత్తిగా ఎన్నుకోవాల్సి వచ్చింది.
అయితే, నా కుమారుడు స్నేహిత్ అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు అయ్యాడనీ, దాదాపు 45 దేశాల్లో భారత్ కు ప్రాతనిధ్యం వహించాడని మల్లయ్య సార్ ను, రామస్వామి సార్ ను కలిసి చెప్పాలని చాలా సార్లు అనుకున్నా కానీ కుదరలేదు. మొన్న సోమవారం నాడు రామస్వామి సార్ 75 ఏళ్ల వయస్సులో మరణించారన్న వార్త తెలిసి బాధేసింది. వారి ఆత్మకు శాంతి కలుగుగాక!
మల్లయ్య సార్ ఎక్కడ ఉన్నారో వాకబు చేసి కనీసం వారినైనా కలవాలి.
No comments:
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి