జర్నలిస్టు అంటే ఎవరో చెప్పి పుణ్యం కట్టుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడిగితే....చాలా మందికి కోపం వచ్చింది. తమవల్ల మాత్రమే తెలంగాణ వచ్చిందని భ్రమ పడే కొందరు ఆ మాటలకు గయ్యిమన్నారు. ముఖ్యంగా యూ ట్యూబ్ ఛానెల్స్ వాళ్లకు బాగా మండింది. కానీ, చూసే వాళ్ళ సంఖ్యను, అంటే ప్రజాదరణను, బట్టి రేటింగ్ ఉండీ, దాన్ని బట్టి డబ్బులు ఇచ్చే మెకానిజం కావడంతో యూ ట్యూబ్ వాళ్ళను మరీ తీసిపారేయడానికి వీల్లేని పరిస్థితి. ఛానెల్స్ ద్వారా లక్షలు సంపాదిస్తున్నా...తద్వారా ఎందరికో ఉపాధి ఇస్తున్నా...నేను జర్నలిస్టును కానా? అని ఇలాంటి వాళ్ళు వాదిస్తారు. నిజమే, అదీ కాదనలేని మాటనే. కొందరైతే జర్నలిజం మౌలిక సూత్రాలు గాలికొదిలి ఎవడ్నిబడితే వాడ్ని బండబూతులు తిట్టి, నోటికొచ్చిన అవినీతి ఆరోపణలు చేసి ప్రజాదరణ పొందుతున్నారు. అలాంటి వారిని ఏమనాలి? మన జనాలకు కావలసింది...మసాలా సరుకు, బూతు వినోదం. సంసారపక్షంగా పద్ధతి ప్రకారం ప్రోగ్రాం చేస్తే చూడరు కదా! అదొక వీక్ నెస్, దౌర్భాగ్యం. అందుకే జర్నలిస్టు నిర్వచనం ఇక్కడ చాలా కష్టం.
1) మోదీ గారిని, హిందువులను తిట్టే బ్యాచ్, 2) కాషాయం మాత్రమే ఎజెండా గా ఉన్న బ్యాచ్, 3) ముస్లిం అనుకూల, కుల రాజకీయాల మీద మాత్రమే మాట్లాడే బ్యాచ్, 4) బీ ఆర్ ఎస్ లేదా కాంగ్రెస్ అనుకూల బృందం, 5) ఎప్పుడూ నెగిటివ్ వార్తల మీదనే వండివార్చే వారు...ఇలా ఐదు రకాలుగా యూ ట్యూబ్ వాళ్ళు కనిపిస్తున్నారు. నిష్పాక్షికంగా ఉండి కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఒక వీడియో చేస్తే... మోదీ భక్త్ అని కాంగ్రెస్, కమ్యూనిస్టు అనుకూల ఛానెల్స్ వాళ్ళు, వారి వ్యూవర్స్ ముద్ర వేస్తారు. రాహుల్ మంచి మాట చెప్పాడని ఒక క్లిప్ చేస్తే... దేశ ద్రోహి అంటారు కాషాయ బ్యాచ్. ఒక కులానికి వ్యతిరేకంగా దుమ్మెత్తిపోసే వాళ్ళను..తప్పురా నాయనా అంటే...మనువాది అంటారు. రాజ్య హింసకు బలైన ప్రొఫెసర్ సాయిబాబా గారికి నివాళిగా రాస్తే...ఏదేదో అన్నారు. ఎన్నికలప్పుడు దగ్గరి నుంచి చూసాను...కొందరు యూ ట్యూబర్స్ బీభత్సకాండ.
ఈ దారుణ వాతావరణంలో సైడ్స్ తీసుకోకుండా టాపిక్ ను టాపిక్ గా, తప్పును తప్పుగా, ఒప్పును ఒప్పుగా జర్నలిస్ట్ గా చూద్దామంటే బతకనివ్వడం లేదు. భలే ఇబ్బందిగా ఉంది...చటుక్కున లేబులింగ్ చేసే బుర్ర తక్కువ మూర్ఖపు దండుతో.
ఇదెందుకు రాస్తున్నానంటే, ప్రజాస్వామ్యానికి పనికి వచ్చే మాటలు కాకుండా పనికిరాని చెత్త విషయాల మీద ఎక్కువవుతున్న యూ ట్యూబ్ ప్రోగ్రాం లను చూసి. ఉదాహరణకు - ఈ మధ్య అఘోరాల మీద ప్రోగ్రామ్స్ ఎక్కువ అయ్యాయి. ఆడ లేడీస్ అఘోరాస్ మీద కుమ్మేస్తున్నారు. జర్నలిజం కోర్సు చేసి మీడియాలో పనిచేసిన వాళ్ళు కూడా ఇలాంటి చెత్త ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. సీనియర్ జర్నలిస్టులు గా పేరున్న వారు నోటికి ఏది వస్తే అది మాట్లాడే సినీ గలీజ్ గాళ్లను (ముఖ్యంగా డైరెక్టర్స్) ను కూర్చోబెట్టుకుని రోజూ ఇంటర్వ్యూస్ చేసి గబ్బు లేపుతున్నారు.
భావప్రకటన హక్కూ...తొక్కా అనుకుంటూ గొట్టాలు పట్టుకుని వసూలు చేసే వాళ్ళు ఎక్కువై, తాము చేసేది జర్నలిజం అని వారు ప్రచారం చేస్తుంటే...జర్నలిస్టిక్ ఎథిక్స్ అనే సత్తెకాలపు ఎడిటర్లు, జర్నలిస్టులు ఏడుస్తున్నారు.
పరిస్థితి మారాలి, బాస్!
ఇంతకీ నువ్వు ఏ బ్యాచ్ కు చెందిన స్వయం ప్రకటిత జర్నలిస్టు చెప్పు సోదరా. అర్బన్ నక్సల్స్ ను గ్లోరిఫై చేసే వాళ్ళు కూడా నీతులు చెబితే ఎలా ?So called journalists are patent owners of self righteous and holier than thou attitude.
ReplyDelete