Friday, July 25, 2014

ఘనంగా తెలుగు, ఉర్దూ జర్నలిస్టుల వర్క్ షాప్

మన దగ్గర జర్నలిజంలో పెద్ద లోటు ఏమిటయా అంటే... వృత్తిలో చేరిన వారి ప్రతిభ మెరుగు పెట్టుకోవడానికి కాలక్రమేణా వర్క్ షాపులు, రిఫ్రెష్ మెంట్ కోర్సులు లేకపోవడం. అకడమిక్స్ కు ఇండస్ట్రీ కి మధ్య సరైన వారధి లేకపోవడం. ఒక సారి వృత్తిలో చేరిన వారిలో చాలా మంది... విజ్ఞానంతోనో-అజ్ఞానంతోనో, కష్టపడో-కనికట్టుచేసో పనిచేస్తూ, బై లైన్లు చూసుకుని మురుస్తూ వృత్తి తెచ్చిన అహంకారంతో మెలుగుతూ, ఉద్యోగం కాపాడుకుంటూ బతికేస్తారు. వృత్తి నైపుణ్యం మెరుగు పరుచుకునే, కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం అటు యాజమాన్యాలు ఇవ్వవు, ఇటు వీళ్ళకు ఆ పనిచేసే సాధన సంపత్తి గానీ, తీరికా ఓపికా గానీ ఉండవు. ఒక ఇరవై ఏళ్ళు తెలుగు, ఇంగ్లీష్ జర్నలిస్టుగా, మరొక ఐదేళ్ళు యూనివర్సిటీ లో జర్నలిజం బోధకుడిగా పనిచేసిన నాకు (ఈ వ్యాసకర్త ఎస్ రాము) ఈ వెలితి ఎక్కువగా అనిపించేది. 

ఈ పరిస్థితిలో నాకు ఒక రెండు మూడు నెలల కిందట.. వాషింగ్టన్ కేంద్రంగా గత ముప్ఫై ఏళ్ళ నుంచి పనిచేస్తున్న ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జర్నలిస్ట్స్ (ఐ సీ ఎఫ్ జే) అనే సంస్థ నుంచి ఒక మెయిల్ వచ్చింది. హైదరాబాద్ లోని అమెరికన్ కాన్సులేట్ ఫండింగ్ తో హైదరాబాద్ లో తెలుగు, ఉర్దూ జర్నలిస్టుల కోసం ఒక నాలుగు రోజుల పాటు.. నేను ఒక అధికారిగా ఉన్న అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ (ఆస్కీ) లో వర్క్ షాప్ నిర్వహిద్దామని. ఆ సెంటర్ కు చెందిన జోహనా కొరిల్లొ (అమెరికా లో స్థిరపడిన చిలీ మహిళ), నేను మెయిల్స్, స్కైప్ కాల్స్ తర్వాత ఇక్కడి అమెరికన్ కాన్సులేట్ అధికారుల సూచనలు, సలహాలు, ప్రమేయాలతో... ఒప్పందాలు కుదుర్చుకుని, అజెండా తయారుచేసి ఒక కొలిక్కి తెచ్చాం. "బ్రింగింగ్ ద వరల్డ్ టు ఆన్ ఇండియన్ న్యూస్ ఆడియన్స్" అనే థీమ్ తో... అంతర్జాతీయ వార్తల విషయంలో మన కవరేజ్ అన్న అంశం కేంద్రంగా అజెండా ఉన్నా... ఎథిక్స్ తో సహా జర్నలిజానికి సంబంధించిన అనేక ముఖ్య అంశాలు అందులో చేర్చాం. 
 అనుకున్న ప్రకారం ఆన్ లైన్ లో దరఖాస్తులు అడిగాం. మొత్తం మీద 64 మంది తెలుగు, ఉర్దూ జర్నలిస్టు లు దరఖాస్తు చేయగా... అందులో 30 మందిని కాన్సులేట్ ఎంపిక చేసింది. అందులో 10 టీవీ ప్రతినిధిగా హేమ కూడా నా ప్రమేయం లేకుండా ఎంపిక కావడం నాకు మంచిగా అనిపించింది. తనతో పాటు.. నాకు తెలిసిన అనేక మంది జర్నలిస్టులు కూడా ఎంపికయ్యారు. ఇది రెండు భాషల జర్నలిస్టుల కోసం ఉద్దేశించినప్పటికీ పలువురు ఇంగ్లిష్ జర్నలిస్టులకు కూడా అవకాశం కల్పించారు కాన్సులేట్ వారు. సోమాజిగుడా లో ఉన్న మా ఆస్కీ ఆఫీసులో ఈ కార్యక్రమం ఈ నెల 21 నుంచి 24 వరకు దిగ్విజయంగా జరిగింది. వర్క్ షాప్ నిర్వహణ కోసం.. జొహన్నా తో పాటు ప్రముఖ జర్నలిజం ట్రైనర్ షెర్రీ రిచరార్డి  గత ఆదివారం అమెరికా నుంచి వచ్చారు. ది హిందూ మాజీ ఎడిటర్ సిద్ధార్థ్ వరదరాజన్, ప్రముఖ పర్యావరణ జర్నలిస్టు బహర్ దత్, ది హిందూ హైదరాబాద్ రెసిడెంట్ ఎడిటర్ కె శ్రీనివాస్ రెడ్డి, బిజినెస్ లైన్ బ్యూరో చీఫ్ సోమశేఖర్, ఎం ఎల్ సీ డాక్టర్ కె నాగేశ్వర్, ఆస్కీ ప్రొఫెసర్లు పరమితా దాస్ గుప్తా, వల్లీ మాణిక్యం, గూగుల్ అధికారి శ్రీకాంత్ లతో పాటు పలువురు ఇందులో పాల్గొని ప్రసంగించారు. అమెరికన్ ట్రైనర్ ఆ 30 మంది చేత కొన్ని ఆసక్తికరమైన ఎక్సర్ సైజులు చేయించి...మన్ననలు అందుకున్నారు. 

వర్క్ షాప్ చివరి రోజైన నిన్న (గురువారం), భారత్ లో అమెరికా రాయబారి కెథలీన్ స్టీఫెన్స్ వచ్చి ప్రసంగించారు. దౌత్యవేత్తలు, జర్నలిస్టులు తమ తమ వృత్తుల్లో ఎదుర్కొనే సవాళ్లు, వారి మధ్య ఉండాల్సిన సంబంధాల గురించి ప్రసంగించారు. ఈ సదర్భంగా... ఆస్కీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎస్ కె రావు గారు ఆమెకు హైదరాబాద్ మీద నరేంద్ర లూథర్ రాసిన పుస్తకాన్ని బహూకరించారు. వర్క్ షాప్ అద్భుతంగా జరిగిందని అందులో పాల్గొన్న జర్నలిస్టులు చెప్పడం ఆనందం కలిగించింది. దీనికైన ఖర్చు భరించిన అమెరికన్ కాన్సులేట్ కు పార్టిసిపెంట్స్ తరఫున కృతఙ్ఞతలు. 

ఫోటో ల వివరణ 
1) వర్క్ షాప్ లో ప్రసంగిస్తున్న అమెరికా రాయబారి 
2) ఆస్కీ లో చిత్రపటాలను తిలకిస్తున్న అమెరికా రాయబారి 
3) అమెరికా రాయబారికి పుస్తకాన్ని బహూకరిస్తున్న ఆస్కీ డైరెక్టర్ జనరల్ 
4) నాలుగు రోజుల వర్క్ షాప్ లో పాల్గొన్న జర్నలిస్టులు 

Thursday, July 3, 2014

"నమస్తే తెలంగాణ" ఎడిటర్ గా శ్రీ కట్టా శేఖర్ రెడ్డి

మన ఈ 'తెలుగు మీడియా కబుర్లు' బ్లాగు ముందుగానే అంచనా వేసినట్లు... "నమస్తే తెలంగాణ" పత్రిక ఎడిటర్ గా సీనియర్ జర్నలిస్టు కట్టా శేఖర్ రెడ్డి నియమితులయ్యారు. ఆయనకు మా అభినందనలు. 


"ప్రస్తుతం 'నమస్తే తెలంగాణ' ఎడిటర్ గా ఉన్న అల్లం నారాయణ గారు ప్రెస్ అకాడమీ అధ్యక్షుడిగా చేరుతున్న నేపథ్యం లో శేఖర్ రెడ్డి గారు ఆ పదవిని భర్తీ చేసే అవకాశం కూడా లేకపోలేదు" అని జూన్ 27 న "నెగ్గిన కే సీ ఆర్ పంతం: పత్రికను వదులుకున్న రాజం" అన్న శీర్షికతో మేము ప్రచురించిన విషయం రెగ్యులర్ రీడర్స్ కు గుర్తుండే ఉంటుంది. 

శేఖర్ రెడ్డి గారికి శుభాభినందనలు తెలుపుతూ ఆ పత్రిక వెబ్ పేజీలో వాడిన స్ట్రిప్ ను ఈ పైన ఇచ్చాము. ఇప్పటికే తెలంగాణ ప్రజల మనసులు చూరగొన్న 'నమస్తే తెలంగాణ' పత్రిక సీనియర్ జర్నలిస్టు, కవి, మృదు స్వభావి, వ్యాసకర్త, వ్యూహకర్త అయిన శేఖర్ రెడ్డి గారి సంపాదకత్వంలో మరింత పురోగతి సాధించాలని కోరుకుంటున్నాం. తెలంగాణా పునర్నిర్మాణంలో... ఈ పత్రిక నిజమైన పాత్రికేయ విలువలతో వెలగాలని ఆశిస్తున్నాం. 

ఆణిముత్యాల లాంటి కార్టూనిస్టులను, జర్నలిస్టులను ఎందరినో అందించిన ఉద్యమాల ఖిల్లా నల్గొండ జిల్లా తెలంగాణాకు అందించిన మొట్ట మొదటి ఎడిటర్ గా కట్టా చరిత్రలో నిలిచిపోతారు. 

కంగ్రాట్స్... కట్టా శేఖర్ రెడ్డి గారు.

Wednesday, July 2, 2014

హెచ్ ఎం టీవీ రాజశేఖర్ vs జర్నలిస్ట్స్ యూనియన్

"వరల్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ డే" అయిన ఈ రోజు (జులై 2, 2014) తెలుగు జర్నలిజం చరిత్రలో ఒక అపూర్వమైన ఘట్టానికి తెరలేచింది. జర్నలిస్టులు చేతులెత్తి దండం పెట్టే ఒక మాంచి పనిని వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ చేసింది. హాట్స్ ఆఫ్ టు యూనియన్ లీడర్స్. మీకిదే మా లాల్ సలాం. 

ముందుగా టీవీ 9 లో రవి ప్రకాష్ తో పనిచేసి అవాంఛనీయ పరిస్థితుల్లో ఉద్యోగం పోగొట్టుకుని... ఐ న్యూస్ ఛానెల్ ఆరంభించి ఫీనిక్స్ పక్షిలా లేచి, ఆ తర్వాత ఎన్ టీవీ ఎదుగుదలలో ముఖ్య పాత్ర పోషించి... ఈ మధ్యనే హెచ్ ఎం టీవీ లో భారీ ప్యాకేజ్ తో చేరిన రాజశేఖర్ ఊహించని పరిణామం ఈ రోజు జరిగింది. రాజశేఖర్ హెచ్ ఎం టీవీ లో చేరిన తర్వాత ఆ ఛానెల్ లో ఉద్యోగాలు పోయిన 20 మంది లో (అందులో అత్యధికులు తెలంగాణ ప్రాంతీయులు) ఒకరు చేసిన ఫిర్యాదు మేరకు వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ అద్భుతంగా స్పందించింది.  

యూనియన్ నేతలు ఒక సారి ఫోన్ చేస్తే... సింగపూర్ వెళుతున్నానని, మరొకసారి చేస్తే బోర్డు మీటింగ్ లో ఉన్నానని చెప్పిన రాజశేఖర్ యూనియన్ ఆఫీసులో ఈ రోజు జర్నలిస్టు సంఘం నేతలతో భేటీ జరపక తప్పలేదని సమాచారం. శ్రీనివాస రెడ్డి, అమర్, శేఖర్, సురేష్, కోటి రెడ్డి, యాదగిరి గార్లు ఈ సమావేశంలో పాల్గొన్నట్లు పక్కా సమాచారం. గంటన్నరకు పైగా ఇది సాగినట్లు తెలిసింది. 

 "ఎడాపెడా ఉద్యోగాలు తీసేయడం గురించి యూనియన్ నేతలు రాజశేఖర్ ను ప్రశ్నించారు. ఇది పధ్ధతి కాదని చెప్పారు. ఆ 20 మందిని విధుల్లోకి తీసుకుంటానని ఆయన మాట ఇచ్చారు," అని ఒక సీనియర్ జర్నలిస్టు వెల్లడించారు. నేతలు చెప్పింది విన్న రాజశేఖర్... రామచంద్ర మూర్తి గారు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తీసేస్తే స్పందించని మీరు... ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతున్నారని... ఒక దశలో అడిగినట్లు చెబుతున్నారు. దానికి నేతలు సరిగానే స్పందించారట. 

అలాగే... రాజశేఖర్ వచ్చాక హెచ్ ఎం టీవీ ఉద్యోగుల జీతాల నుంచే ఉద్యోగుల వాటా తో పాటు... యజమాని వాటా  ప్రావిడెంట్ ఫండ్ కట్ కావడం గురించి కూడా చర్చ జరిగిందని తెలిపారు. అన్ని టీవీ ఛానెల్స్ లో చేసినట్లే తనూ చేస్తున్నానని... రాజశేఖర్ వివరణ ఇచ్చారట. ఈ నిర్ణయాన్ని కూడా వెనక్కు తీసుకోవాలని నాయకులు కోరారు. "రాజశేఖర్ గారితో ఒప్పంద పత్రం రాయించుకోలేదు. కానీ... ఈ రెండు విషయాల్లో (ఉద్యోగాలు పీకడం, పీఫ్ దోచేయ్యడం) దిద్దుపాటు చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు," అని ఆ జర్నలిస్టు వెల్లడించారు. 

వేల మంది జర్నలిస్టులు వీధిన పడినా పట్టించుకోలేదని అపవాదు మూటగట్టుకున్న యూనియన్ నేతలు... ఇప్పుడు గట్టిగా వ్యవహరించడం హర్షణీయ పరిణామం. ఇక నుంచి ఏ ఛానెల్ లో నైనా జర్నలిస్టులు, టెక్నీషియన్ల ఉద్యోగాలు పోకుండా యూనియన్ పట్టించుకోవాలని విన్నపం. ఉద్యోగులను పూచిక పుల్లల్లా ఏరి పారేసిన యాజమాన్యాల కొమ్ములు వంచండి. జర్నలిస్టులను ఆదుకోండి సార్.  

జర్నలిస్టులారా...మంచి రోజులు వచ్చాయి. మీరంతా ఏకంకండి. కులం, మతం వంటి పిచ్చి భావాలు వదలండి. కడుపు ఆకలి ఎవరిదైనా ఒకటే. మీలో ఒకడు...వాడి డబ్బు కోసం, దర్పం కోసం ఉద్యోగాలు పీకుతూ మీ కుటుంబాలను వీధిన వేస్తే కళ్ళల్లో నీళ్ళు కుక్కుకుని కిమ్మనకుండా పడి ఉండకండి. మీ హక్కుల కోసం పోరాడండి. గతం గతః. తెలంగాణ రాజ్యంలో జర్నలిస్టు సంఘాలు మీ కోసం పోరాడతాయి. ఆల్ ద బెస్ట్. 

Sunday, June 29, 2014

RFC కి మారనున్న 'ఈనాడు': ఉద్యోగుల్లో గుబులు

హైదరాబాద్ లో ఖైరతాబాద్ చౌరస్తా దాటగానే విద్యుత్ సౌధ పక్కన కొలువై ఒక సెక్షన్ రాజకీయ నేతలకు, అక్రమార్కులకు షాక్ ల మీద షాకిచ్చే 'ఈనాడు' పత్రిక ప్రధాన కార్యాలయం... ఊరి బైట ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీ కి తరలనున్నట్లు సమాచారం. ఇన్ చార్జ్ ల స్థాయిలో ఉన్న వ్యక్తులు యాజమాన్యపు ఈ నిర్ణయాన్ని కింది స్థాయి ఉద్యోగులకు చెప్పడం, ఇది ఆ సంస్థలో మౌన గగ్గోలు కు, వారి కుటుంబాల్లో పెద్ద చర్చకు దారితీసింది. 

"ఇదొక షాకింగ్ న్యూస్. నెలల్లో కాదు... రోజుల్లోనే మనం ఆర్ ఎఫ్ సీ కి వెళ్ళబోతున్నామని బాసు చెబితే గుండె గుబెల్ మంది. రోజూ ఒక మూడు, నాలుగు గంటలు ప్రయాణానికి వెచ్చించి.. బతకడం ఎలా?," అని ఒక సీనియర్ జర్నలిస్టు వ్యాఖ్యానించారు. ఇప్పటికే వందకు పైగా జర్నలిస్టులను అడ్డదిడ్డంగా బదిలీ చేసి... కుటుంబాల్లో అశాంతి కలిగించిన 'ఈనాడు' యాజమాన్యం ఇప్పుడు ఆఫీసు బదిలీ నిర్ణయంతో మరింత సంచలనం కలిగించింది. ఇప్పుడున్న ఆఫీసు ను రిలయెన్స్ వారికి ఇస్తారని చెబుతున్నారు. 

ఆఫీసు ను ఎక్కడికంటే అక్కడికి మార్చే హక్కు యాజమాన్యానికి ఉంది కానీ... ఈ తాజా నిర్ణయం వెనుక కొందరు ఉద్యోగులు ఒక పెద్ద వ్యూహం ఉందని అనుకుంటున్నారు. "దాదాపు ఒక గ్రామంలో ఉన్న రామోజీ ఫిలిం సిటీ కి ఆఫీసు మారిస్తే.... కొత్త వేజ్ బోర్డ్ కింద భారీగా చెల్లించాల్సిన హెచ్ ఆర్ ఏ (హౌస్ రెంట్ అలవెన్స్), సీ సీ ఏ (సిటీ కాంపెంసేట్రీ అలవెన్స్) ల ఖర్చు భారీగా ఆదా చేసుకోవచ్చని యాజమాన్యం భావిస్తున్నట్లు ఉంది. ఇది మా ప్రాణాల మీదికి తెచ్చింది. ఇప్పుడేమి చేయాలో తెలియడం లేదు," అని ఒక జర్నలిస్టు అన్నారు. 

ఆర్ ఎఫ్ సీ కి వెళ్లేందుకు యాజమాన్యం బస్సులు నడుపుతుంది. ఆ బస్సులు ఇప్పుడు ఖైరతాబాద్ ఆఫీసు నుంచి నడుస్తున్నాయి. ఆఫీసు మారితే.... ఆ బస్సుల షటిల్ సర్వీసులు దిల్ సుఖ్ నగర్ నుంచి మొదలవుతాయన్న టాక్ మొదలయ్యింది. తెలంగాణ ఏర్పడకున్నా... చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడకపోయినా... మా బతుకులు బాగుండేవని ఇద్దరు ముగ్గురు సీనియర్లు మా బృందం తో అన్నారు. పాపం... జర్నలిస్టులకు, ఇతర ఉద్యోగులకు ఎంత కష్టకాలం వచ్చింది!
Photo courtesy: http://www.panoramio.com 

Friday, June 27, 2014

నెగ్గిన కే సీ ఆర్ పంతం: పత్రికను వదులుకున్న రాజం

తెలంగాణ గుండె చప్పుడు "నమస్తే తెలంగాణ" పత్రికను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కట్టబెట్టకుండా బెట్టుచేసి... మాంచి వ్యూహంతో రాత్రికి రాత్రే భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్న లక్ష్మీరాజం మనసు మార్చుకోక తప్పలేదు. ముఖ్యమంత్రి బాబాయి... చార్టెడ్ అకౌంటెంట్ దీకొండ దామోదర్ రావు కు నిన్న లాంఛనంగా పత్రికను రాజం సమర్పయామి చేసారు. 

నమస్తే తెలంగాణ సీఎండీగా గురువారం బాధ్యతలు స్వీకరించిన దామోదర్‌రావుకు పుష్పగుచ్ఛం అందించి అభినందిస్తున్న పూర్వ సీఎండీ సీ లక్ష్మీరాజం ఫొటో (ఈ పోస్టులో ఉన్నది) ను ఆ పత్రిక మొదటి పేజీలో ప్రచురించింది. పత్రిక సంపాదకులు అల్లం నారాయణ, సీఈవో కట్టా శేఖర్‌రెడ్డి, అసిస్టెంట్ ఎడిటర్ కే కృష్ణమూర్తి, వైస్ ప్రెసిడెంట్ తులసీదాస్ వివిధ విభాగాల అధిపతుల సమక్షంలో ఈ యాజమాన్య మార్పిడి జరిగింది. కే సీ ఆర్ క్యాంపు ఆఫీసు పూజకు రాజం హాజరయినప్పుడే... ఇలాంటిదేదో జరుగుతుందన్న చర్చ జరిగింది. ఈ ఫోటో లో రాజం గారి ఆంగ్ల పత్రిక 'మెట్రో ఇండియా' ఎడిటర్ ఏ శ్రీనివాస రావు గారు లేరు. ప్రస్తుతం ఆ పత్రికను రాజం-రావు గార్లకే వాదులుతారా? లేదా? అన్నది కూడా మీడియా ప్రపంచంలో ఆసక్తిగా మారింది. 
నిజానికి... 'నమస్తే తెలంగాణ' పత్రికను మొదట్లో పెట్టింది... దామోదర్ రావు గారే. కానీ ఖర్చు తడిసి మోపెడు కావడంతో... దిక్కుతోచని పరిస్థితుల్లో చంద్రశేఖర్ రావు గారి మాట మేరకు రాజం దాన్ని టేకోవర్ చేసి ఒక స్థాయికి తెచ్చారు. కానీ అధికారం లోకి వచ్చిన తర్వాత అన్ని పార్టీల మాదిరిగానే...తమకూ ఒక పత్రిక ఉండాల్సిన తక్షణ అవసరాన్ని ఆయన గుర్తెరిగి ఇలా చేసారు. బీజేపీ లో చేరి... డిల్లీ నుంచి వచ్చి... పదిహేను శాతం చొప్పున జీతాలు పెంచి... పత్రికలో మీకూ షేరిస్తానని వాగ్దానం చేసిన రాజం ఒక్కసారిగా పత్రికను వదులుకోవడం 'నమస్తే తెలంగాణ' జర్నలిస్టుల్లో, వర్కర్లలో చర్చకు దారితీసింది. 

రాజం గారు బీజేపీ లో చేరిన తర్వాత 'నమస్తే తెలంగాణ' కు రావడం మానేసిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కట్టా శేఖర్ రెడ్డి గారు మళ్ళీ నగుమోముతో పత్రిక ఆఫీసులో కనిపించారు. ఎవర్ హుషారు గా ఉండే ఆయన ఈ పత్రిక యాజమాన్య మార్పిడి లో కీలక పాత్ర పోషించారని బావిస్తున్నారు. ముఖ్యమంత్రి కి దగ్గరైన మంత్రి జగదీశ్వర్ రెడ్డి కి స్వయంగా బావ అయిన కట్టా శేఖర్ రెడ్డి గారి పాత్ర ఇప్పుడు పెరిగే అవకాశం కనిపిస్తున్నది. జగదీశ్ గారి ఏకైక సోదరి రేణుక గారు శేఖర్ రెడ్డి గారి సతీమణి. 
ప్రస్తుతం 'నమస్తే తెలంగాణ' ఎడిటర్ గా ఉన్న అల్లం నారాయణ గారు ప్రెస్ అకాడమీ అధ్యక్షుడిగా చేరుతున్న నేపథ్యం లో శేఖర్ రెడ్డి గారు ఆ పదవిని భర్తీ చేసే అవకాశం కూడా లేకపోలేదు. అయితే.. అల్లం నారాయణ గారి స్థానంలో ప్రస్తుత ఆంధ్ర జ్యోతి ఎడిటర్ కే శ్రీనివాస్, అప్పటి వార్త ఎడిటర్ టంకశాల అశోక్ ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో లాగా మీడియా లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు.  లెట్స్ వాచ్. 
(Photo and caption courtesy: Namaste Telangana)

Tuesday, June 24, 2014

యాడ్స్ బాధ్యత జర్నలిస్టులదా?: దారితప్పిన జర్నలిజం

ఒక ఇరవై ఏళ్ళ కిందటి జర్నలిజానికి, ఇప్పటి జర్నలిజానికి పలు తేడాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. గత ఏడెనిమిదేళ్ళుగా తెలుగు జర్నలిజం మరింత దారుణంగా తయారయింది. 2009 నుంచి 2014 మధ్య కాలంలో జరిగిన పెను మార్పు... యాడ్స్ సేకరణ బాధ్యత జర్నలిస్టుల మీద పడడం. కొందరు దాన్ని కష్టంగా, మరికొందరు ఇష్టంగా దాన్ని మోయడం.   

గతంలో ప్రతి పెద్ద పత్రికకు యాడ్స్ సేకరణ కోసం ఒక యంత్రాంగం ఉండేది. విలేకరులు, యాడ్స్ సేకర్తలు ఒకే ఆఫీసులో కూర్చున్నా... ఎవరి పని వారు చేసుకునేవారు. యాడ్స్ వాళ్ళు మరీ అడిగితే... జర్నలిస్టులు వారిని అధికారులకు, లీడర్లకు పరిచయం చేసేవారు. లోపాయికారీగా ఒక మాట చెప్పేవారు. యాడ్స్ బృందంతో జర్నలిస్టులు రాసుకుపూసుకుతిరగడం ఉండేది కాదు. చిన్న పత్రికలు పెట్టిన వాళ్ళు వారే యజమానులు, సంపాదకులుగా ఉంటారు. ప్రకటనల కోసం, మార్కెటింగ్ కోసం వాళ్ళే వెంపర్లాడే వారు. వాళ్ళను చూసి ఈ సో కాల్డ్ మెయిన్ స్ట్రీం జర్నలిస్టులు... తలలు అటు తిప్పుకుని వెళ్ళేవారు. 

ఈ పరిస్థితి 2009  నాటికి మారిపోయింది. వ్యాపార ప్రకటల సేకరణ లో సహకరించడం తో మొదలైన జర్నలిస్టుల బాధ... యాడ్స్ టార్గెట్ ను పూర్తి చేయక తప్పని స్థితికి వచ్చింది. మాకున్న సమాచారం ప్రకారం... జర్నలిస్టులకు డైరెక్ట్ గా యాడ్స్ టార్గెట్ ఫిక్స్ చేయడం ఒక్క 'ఈనాడు' పత్రికలోనే లేదు. మిగిలిన అన్ని చోట్లా... వార్తలు రాసే జర్నలిస్టులను వాడుకుని మరీ వ్యాపార ప్రకటనలు సేకరిస్తున్నాయి యాజమాన్యాలు. వార్త అనే పత్రిక వచ్చాక కాంపిటీషన్ ఎక్కువై...జర్నలిస్టుల ధోరణిలో కూడా మార్పు వచ్చింది. 

తక్కువ జీతాలతో బతికే జర్నలిస్టులకు... యాజమాన్యాలు వాటాల రుచి చూపించాయి. లక్ష రూపాయల యాడ్ తెస్తే పది నుంచి ఇరవై వేలు మన రాతగాడికి వస్తాయి. మార్కెట్ ప్రభావం తో జర్నలిస్టులు దీన్ని మంచి ఆదాయమార్గంగా తీసుకుని అటు యజమానికి నొప్పించకండా నాలుగు రాళ్ళు సులువుగా వెనకేసుకోవడం మొదలెట్టారు. వృత్తి నిబద్ధత లేని సంపాదకులు దీన్ని ప్రోత్సహించి జర్నలిజానికి తీరని ద్రోహం చేశారు, చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో 70 శాతం జర్నలిస్టులు యాడ్స్ లో నిమగ్నమై... ఓనర్ ను తృప్తి పరిచి తమకు తాము కొంత సంపాదించుకున్నారు. విచిత్రం ఏమిటంటే... ఈ జర్నలిస్టులు, ఈ సంపాదకులే... యావత్ జర్నలిజానికి ప్రతినిధులుగా చెలామణి కావడం, పత్రికా స్వేచ్ఛ గురించి లెక్చర్లు దంచడం. ఇదొక దౌర్భాగ్యం. 

"సార్... మా యజమాని డైరెక్ట్ గా మీటింగ్ పెట్టి నాకు రెండు కోట్ల టార్గెట్ ఇచ్చిండు. అది పూర్తి చేస్తే నాకు 20 లక్షలు వచ్చెడివి. ఎన్నికలప్పుడు రెండు నెలలు కష్టపడ్డం. కనాకష్టంగా ఒక కోటి మేర యాడ్ తెచ్చినం. నాకు పది లక్షలు వచ్చినయ్. ఆ కర్చులు ఈ కర్చులు పోను.. ఒక ఆరేడు లక్షలు మిగిల్నయ్...." అని ఒక జర్నలిస్టు మిత్రుడు చెప్పంగ విన్నాం. 
ఇదండీ జర్నలిజం పరిస్థితి. డబ్బు కక్కుర్తి ఉన్న ఇలాంటి మీడియా... జనాలకు మేలు చేస్తుందని, ప్రజా సమస్యల గురించి పట్టించుకుని బాధ్యతతో వ్యవహరిస్తుందని మనం భావించగలమా, చెప్పండి.

Monday, June 16, 2014

TV 9, ABN-ఆంధ్రజ్యోతి ప్రసారాల నిలిపివేత

తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో మూస జర్నలిజానికి పాతరేసిన టీవీ 9, దాంతో పాటు సంచలనాలే ఊపిరిగా కొనసాగిన ABN-ఆంధ్రజ్యోతిల ప్రసారాలు ఇవ్వాళ కనిపించకుండా పోయాయి. తెలంగాణా శాసనసభ్యుల ప్రమాణ స్వీకారంలో దొర్లిన అపశృతులు వస్తువుగా ప్రకోపించిన పైత్యంతో చెలరేగిపోయి కార్యక్రమాలు ప్రసారం చేసినందుకు ఈ రెండు ఛానెల్స్ పై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నిప్పులు చెరిగిన మూడు రోజుల్లోపే ఈ రెండు చానెళ్లు భాగ్యనగరం లో కూడా బ్లాక్ అయ్యాయి.

ఈ ఛానెల్స్ పై అసెంబ్లీ ద్వారా వాత వేయాలని ప్రభుత్వం భావిస్తుండగానే... తెలంగాణా ఎమ్ ఎస్ ఓ లు వాటిని బ్లాక్ చేశారు. దీన్ని పత్రికా స్వేచ్ఛపై దాడిగా ఎవ్వరూ పరిగణించాల్సిన పనిలేదన్న విధంగా ఆ కార్యక్రమాల్లో భాష ఉన్నది. ఇప్పటికైనా బాధ్యతారహిత చానెళ్ళ పై కొరడా ఝళిపించడం మంచిపనే కానీ...ఇతరేతర సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరైనది కాదు.

ఒక సామాజికవర్గానికి, ఒకే పార్టీకి కొమ్ముకాసినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న ఛానెల్స్ ను లక్ష్యంగా చేసుకుని, దాదాపు అదే స్థాయిలో తప్పు చేసిన తెలంగాణా యజమానుల ఛానెల్స్ ను వదిలేయడం భావ్యం కాదు. భాషను, యాసను, సభ్యులను కించపరిచిన ఆరోపణలపై ఒక అరడజను ఛానెల్స్ ను నిషేధించి... యజమానులను శిక్షిస్తే తెలుగు ప్రజలకు కొద్దిగైనా దరిద్రం వదులుతుందని అనిపిస్తుందని అనుకునేవారూ లేకపోలేదు.

అయితే... ఈ రెండు ఛానెల్స్ కు ఒక అడ్వాంటేజ్ ఉంది. ఒకరికి తీవ్రవాది... మరొకరికి సమర యోధుడు అన్నట్లు... ఈ ఛానెల్స్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీరాజనం పలకవచ్చు. అక్కడి ప్రజలూ వాటిని ఆరాధించవచ్చు.