Tuesday, September 24, 2013

సాక్షి టీవీ ఛానల్ హెడ్ గా మళ్ళీ మీసాల (యువ) రామ్ రెడ్డి

కంచు కంఠం తో, నిత్య ఉత్తేజంతో డ్రమాటిక్ మాటలతో సంభాషణలను రక్తి కట్టించే ప్రియదర్శిని రామ్ (రెడ్డి) గారు మళ్ళీ సాక్షి టీవీ ఛానెల్ పగ్గాలు స్వీకరించారు. జగన్ బాబు జైలు నుంచి బైటికి రావడానికి రెండు  రోజుల ముందే ఆయన ఛానెల్ సీ ఈ ఓ అయినట్లు సమాచారమ్. "ఎన్నికల సీజన్ లో రామ్ రెడ్డి లాంటి డైనమిక్ వ్యక్తి ఛానెల్ హెడ్ గాఉంటే బాగని యాజమాన్యం భావించినట్లు ఉంది," అని ఒక సీనియర్ జర్నలిస్టు చెప్పారు.  

దాంతో, ఇప్పటి దాకా దాదాపు ఛానెల్ హెడ్ గా ఉన్న సీనియర్ జర్నలిస్టు, మాజీ ఇన్ఫర్మేషన్ కమిషనర్ దిలీప్ రెడ్డి కి పదవీ గండం కలిగినట్లు తెలిసింది. అయితే, దిలీప్ సేవలను ఇతరత్రా వాడుకోవాలని యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. 

సీనియర్ యాంకర్ స్వప్న కు రామ్ రెడ్డి కి పడలేదని, ఒక విషయంలో వచ్చిన పంచాయితీ లో జోక్యం చేసుకుని జగన్ భార్య భారతి రామ్ రెడ్డి కి ఉద్వాసన పలికారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సాక్షి కుటుంబానికి దూరమైన రామ్ రెడ్డి మళ్ళీ క్రమంగా దగ్గరై.. విశ్వాసం చూరగొన్నారని చెబుతున్నారు. మరి ఇప్పుడు స్వప్న గారు అక్కడే రాజీపడి ఉంటారా? లేక తన దారి తానూ చూసుకుంటారా? అన్నవి మీడియాలో జరుగుతున్న చర్చల్లో ప్రముఖ ప్రశ్నలు. 

రామ్ అన్నయ్యా... దున్నుకోవయ్యా. మళ్ళీ 'సాక్షి సలాం' తో అలా ముందుకు సాగిపో. సమకాలీన జర్నలిజాన్ని ఏలుకో. ఆల్ ద బెస్ట్.   

నగేష్ గారి విషయంలో పోలీసుల తీరు గర్హనీయం

'ది హిందూ'  హైదరాబాద్ రెసిడెంట్ ఎడిటర్ సుసర్ల నగేష్ కుమార్ గారి విషయంలో పోలీసుల తీరు ఏ మాత్రం బాగోలేదు. కోర్టు ఆర్డర్ తీసుకోకుండా తిప్పడం... ఇంటి మీదికి పోలీసులను పంపడం...నగేష్ గారి తల్లి గారిని గాబరా పెట్టడం మంచిది కాదు. కేసు పెట్టారు, కోర్టులో విషయం ఉంది కాబట్టి పోలీసు బాసులు కామ్ గా ఉంటే బాగుంటుంది. వ్యక్తిగత కక్ష సాధింపు దారుణం. ఇంతవరకూ.. పత్రికల మీద కేసులు పెట్టి, కోర్టులకు పోయి పెద్దగా సాధించింది ఏమీ లేదన్న నిస్పృహ నగేష్ విషయంలో పోలీసుల పరంగా కనిపిస్తున్నది. 

ఇంకొక గమ్మత్తు ఏమిటంటే... నగేష్ గారి విషయంలో నా అనుమానం కరెక్టు అయ్యింది. నేను అనుమానించినట్లు ఇంతకూ ఆ వార్త రాసింది ఆయన కాదట. కానీ ఆయనే దాన్ని క్లియర్ చేసారట. అంటే తప్పులో పెద్ద భాగమే ఉన్నట్లు. 

నేను నగేష్ గారి గురించి రాసిన పోస్టు చూసి పలువురు స్పందించారు. వార్త రాసే తీరు మాత్రం అది కాదని తామూ నమ్ముతున్నట్లు వాళ్ళు చెప్పారు. మారిన 'ది హిందూ' వైఖరి (అంటే టైమ్స్ లాగా సెన్సేషన్ గబ్బు లేపడం) ని పరిగణన లోకి తీసుకోకుండా పోస్టు రాసినందుకు ఒక సీనియర్ మిత్రుడు అభ్యంతరం తెలిపారు. 
 
మొత్తం మీద రెండు రోజులుగా నగేష్ గారి ఫోటో చూసే భాగ్యం ఆంధ్ర ప్రజలకు కలిగింది. పోలీసుల ఓవర్ యాక్షన్, దానికి 'ది హిందూ' ఇస్తున్న విస్తృత ప్రచారం నగేష్ గారికి కచ్చితంగా మేలు కలిగిస్తుంది. ఆయనకు మేలు జరగాలని భగవంతుడ్ని ప్రార్ధించే వారిలో నేనూ ఉంటాను. 

యాజమాన్యం తొత్తులుగా మారి సామాన్య జర్నలిస్టుల ఉద్యోగాలు పీకేసి వీధన పడేస్తున్న వీర ఎడిటర్లు, జర్నలిస్టు కష్టాలు పట్టని పైరవీ లీడర్లు కలిసి నగేష్ గారికి జరిగిన ఘోర అన్యాయానికి వ్యతిరేకంగా ఎలుగెత్తి అరవడం బాగుంది. అంత పెద్ద స్థాయి జర్నలిస్టుకు అంత అవమానం జరిగితే మాట్లాడకపోవడం నిజంగానే తప్పవుతుంది కదా!

నగేష్ గారి బాధితుల్లో ఒకరైన ఒక సీనియర్ జర్నలిస్టు, వారి సతీమణి కూడా నాతో ఫోన్ లో మాట్లాడారు. నగేష్ తమను, తమ కుటుంబాన్ని పెద్ద అభాండం వేసి చిత్రహింసలకు గురిచేసారని చెప్పారు. ఆ వివరాలు పరిశీలిస్తే నాకు నగేష్ గారి పట్ల ఉన్న వ్యక్తిగత అభిప్రాయం లో పెద్ద తప్పు లేదని తేలింది. అది వివరంగా రాద్దామంటే... ఇది సమయం, సందర్భం కాదని అనిపిస్తున్నది. కాదంటారా?

Note:పై ఫోటో లో బుర్ర గోక్కుంటున్న లాయర్ గారి కి కుడి వైపున కూర్చున్న వారే సుసర్ల నగేష్ కుమార్ గారు. ఈ ఫోటో కు సౌజన్యం 'ది హిందూ'  

Saturday, September 21, 2013

నగేష్ (ది హిందూ) వర్సెస్ దినేష్ (ద పోలిస్)

మీడియాలో దేముళ్ళు, దయ్యాలు, మనుషులు.... అంతా ఉంటారు. దాసు కేశవ రావు గారు అనే దేముడి లాండి మనిషి దగ్గర పనిచేసే భాగ్యం కలిగిన నేను సుసర్ల నగేష్ కుమార్ అనే సారు దగ్గర కొన్ని సంవత్సరాలు పనిచేసాను 'ది హిందూ' లో. ఇప్పుడు డీ జీ పీ గారి కేసులో నగేష్ గారిని అరెస్టు చేయకుండా కోర్టు ఆర్డర్ ఇచ్చిందన్న వార్త చూసి ఆనందించిన వాళ్ళల్లో నేనూ ఒకడ్ని. 

నేను 'ది హిందూ' కు నల్గొండ రిపోర్టర్ గా పనిచేస్తున్న రోజులవి. నగేష్ గారు ఒక సీనియర్ జర్నలిస్టు. ఆయన పొలిటికల్ రిపోర్టింగ్ బాగుంటుంది. కోర్టు కేసులంటే ఆయన బాగా భయపడేవారని నాకు అప్పట్లో అర్థమయ్యింది. తల్లీ తండ్రి, బంధువులు, పనివాళ్ళ పేరు మీద దాదాపు వంద ఎకరాల పొలాలు చీప్ రేటుకు కొన్న ఒక పెద్ద స్థాయి రెవెన్యూ అధికారి మీది ఒక పరిశోధన చేసి పత్రాలు తీసుకుని ఆయన దగ్గరకు వెళ్లాను ఒక రోజు. "ఈ స్టోరీ వేస్తే.. లీగల్ నోటీస్ వస్తుందా?' అని నగేష్ గారు అడిగారు... నా దగ్గరి డాక్యుమెంట్లు చూడకుండానే. వస్తుందని నేను చెప్పడం.. 'అయితే ఈ స్టోరీ వద్దు' అని ఆయన అనడం...జర్నలిజం మీద తొలిగిన భ్రమలతో ఆయన రూం నుంచి బైటికి వచ్చి... గుండె భారంతో దిగాలుగా నల్గొండ బస్సు ఎక్కడం జరిగిపోయాయి. ఇది ఒక చెప్పుకోలేని బాధ. 

ఒక వార్త విషయంలో...నగేష్ గారు నా మీద డిసెంబర్ 25, 2007 సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ఫోన్ లో చేసిన అవినీతి ఆరోపణలతో నేను బాగా నొచ్చుకున్నాను. ఇదేంటబ్బా... ఇంత అభాండం వేశారీ బ్యూరో చీఫ్ గారు... అని నిద్రాహారాలు మాని రోదించి చెన్నై లో ఒకరికి ఫోన్ చేశాను. నగేష్ గారు ఎప్పుడు రిటైర్ అవుతారు? అని అడిగితే వారు చెప్పిన సమాధానంతో బిక్కచచ్చి.. ... బతికి బాగుంటే గచ్చీబౌలీ లో స్టేడియం బైట పల్లీలు అమ్ముకోవచ్చు... పిల్లవాడికి టేబుల్ టెన్నిస్ ఆడించుకుంటూ అని ది హిందూ ని వదిలి నా మానాన నేను బతుకుతున్నాను. ఒకటి రెండు సార్లు ఇందిరా పార్కులో నగేష్ గారు వాకింగ్ చేస్తూ ఆరోగ్యంగా కనిపించారు. ఆ తర్వాత తెలిసింది ఆయన రెసిడెంట్ ఎడిటర్ అయ్యారని. ది హిందూ లో సీనియారిటీ కి భలే గౌరవం ఇస్తారు. ఆ ఆర్గనైజేషన్ చాలా మంచిదని మనకు తెలిసిందే.    

ఇంతకూ ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే... ఒక ఇన్వెస్టిగేటివ్ స్టోరీ విషయంలో చిన్న లీగల్ నోటిస్ వస్తుందని భయపడిన నగేష్ గారు సెప్టెంబర్ 13 న అలాంటి స్టోరీ రాస్తారంటే నేను నమ్మలేకపోతున్నాను. అది ఆయన రాసి ఉండరని నా నమ్మకం. ఆ వార్త తీరు చూస్తే దురుద్దేశం తో రాసిందిగా నాకు అనిపించింది. రాగ ద్వేషాలకు అతీతంగా మూడు రోజుల నుంచీ ఆలోచించినా ఆ స్టోరీ ని జర్నలిస్టులు సమర్ధించడం భావ్యం కాదని నాకు అనిపిన్స్తున్నది. యూనివెర్సిటీ లో, మరొక కాలేజీ లో జర్నలిజం కోర్సు చేస్తున్న పీ జీ స్థాయి పిల్లలకు ఆ వార్త ఇచ్చి మీరేమి అనుకుంటున్నారు? అని అడిగాను. నా అభిప్రాయం, వారి పరిశీలన దాదాపు గా ఒకటే. అది వార్త రాసే విధానం ముమ్మాటికీ కాదు. పైగా ది హిందూ లాంటి సంసార పక్షపు పేపర్లో వార్త తక్కువ, ఆపాదనలు ఎక్కువ కావడం అరుదు. 

డీ జీ పీ ఒక గాడ్ మాన్ దగ్గరకు బందోబస్తుతో వెళ్ళడం, ఫైల్స్ మోసుకు వెళ్ళడం కచ్చితంగా వార్తే... ఆయన పోలీసు యూనిఫాం లో వెళ్లకపోయినా. కానీ, ఆ వార్తలో... ఆయన కేసు గురించి, ఉద్యోగంలో కొనసాగే ప్రయత్నాల గురించి, ఆ గాడ్ మాన్ దగ్గరకు గతంలో వెళ్ళిన వాళ్ళ గురించి రాయడం దురుద్దేశం (malafide intention) కాక మరేమిటి? 

ఈ వార్తకు, 'మీడియా స్వేఛ్చ కు సంబంధం లేదు. "Raising eyebrows", "created flutter" అనేవి శాస్త్రీయతకు అందని సదరు జర్నలిస్టు మస్తిష్కపు తిక్క మాటలు. "Casting aspersions" అనే దానికి ఈ వార్త ఒక మంచి ఉదాహరణ. ఈ వార్త లో లోపాలు అనేకం ఉన్నాయి. నిజానికి డీ జీ పీ కామ్ గా ఉండి.. ఆ గాడ్ మాన్ గారితో కేసులు వేయించి ఉంటే ఇంకా కేసు బలంగా ఉండేది. ఈ వార్త డీ జీ పీ కన్నా గాడ్ మాన్ ను ఒక బ్రోకర్ గా, కళంకితుల ఆరాధకుడిగా, ఆపదల్లో ఉన్న వారిని ఆదుకునే ఒక మహిమాన్వితుడి గా చిత్రీకరించింది. ఈ ఫైళ్ళకు, గాడ్ మాన్ గారికి సంబంధం ఏమిటో చెప్పకుండా రచయిత పజిల్ మిగిల్చారు. 

Dear Mr.Nagesh, 
Did you allocate the same space and use the same kind of words when the former Governer ND Tiwari visited the same God man? Did you or your organisation cover that story at all? Boss, check your conscience; it is unfair and unprofessional.

Committing mistake is not wrong but stoking the emotions of a section of people to cover up our mistake is a threat to the very foundation of the organ we belong to. 

Sir, let me clarify that I am not saying that DGP is a saint. But, as the first journalist who did PhD on 'journalistic ethics' in AP, I can argue that the story is full of loopholes. Let us learn from our mistakes humbly. After all to err is human. 

Wednesday, September 4, 2013

ఐ బీ ఎల్ సెమీఫైనల్స్ కవర్ చేసే భాగ్యం

మొన్న అక్టోబర్ ఫస్టున ఆరంభమైన 'మెట్రో ఇండియా' అనే ఇంగ్లిష్ పత్రిక స్పోర్ట్స్ ఎడిటర్ గా చేరాను. జీవితంలో కావాలని నేను కోరుకున్న పోస్టుల్లో ఇది ఒకటి కాబట్టి చాలా ఆనందం అనిపించింది. 

పదేళ్ళ పాటు ప్రాణాలు పెట్టి... డబ్బు, టైం వెచ్చించి కాకతీయ యూనివర్సిటీ స్థాయిలో షటిల్ బాడ్మింటన్ ఆడిన నేను లిగమెంట్ ఇంజురీ వల్ల ఆట ఆపేసాను. అదొక విషాద గాధ. స్పోర్ట్స్ మీద నేను రాస్తున్న పుస్తకంలో అదొక పెద్ద చాప్టర్. ఆ ఆట పుణ్యాన స్పోర్ట్స్ కంట్రీబ్యూటర్ గా కాలేజి లో ఉన్నప్పుడే 'ఈనాడు'లో నాకు అవకాశం ఇచ్చింది... 1989 లో. నాకు ఆ అవకాశం తెచ్చింది ఈ ఆటే. ఈ ఆటకు, నాకు ఈనాడు లో అవకాశం ఇచ్చిన మొదటి గురువు శ్రీకాంత్ గారికి, ఖమ్మం డెస్క్ లో పనిచేసి స్పోర్ట్స్ లో నన్ను ప్రోత్సహించిన రమేష్ గారికి, (ఎర్ర)  కృష్ణయ్య  గారికి, గోపీనాథ్ గారికి నేను ఎంతో రుణపడి ఉంటాను. ఈనాడు మినీ లు పెట్టాక జిల్లాకు నేను మొదటి స్పోర్ట్స్ కంట్రిబ్యూటర్ ను. ఆలిండియా రేడియోకి స్పోర్ట్స్ రిపోర్ట్స్ ఇస్తూ... ఈనాడు కు రోజూ రాస్తూ... చదువుకున్నాను. అదొక అద్భుతమైన అనుభవం. 

స్పోర్ట్స్ రిపోర్టర్ ఉద్యోగం ఇస్తారు కదా... అని ఈనాడు జర్నలిజం స్కూల్ కు వచ్చాను 1992 లో.  కానీ మెరిట్ ప్రాతిపదికన జనరల్ డెస్క్ లో వేసారు రామోజీ గారు. ఆప్పటి నుంచి 'స్పోర్ట్స్' కు మార్చమని నేను ఒక వంద సార్లు ప్రాధేయ పడి ఉంటాను. రమేష్ బాబు పడనివ్వలేదు. ఎప్పుడు అడిగినా... 'నీ అవసరం ఈనాడు కు గుండె కాయ లాంటి జనరల్ డెస్క్ లో ఉంది' అనే వారు. స్పోర్ట్స్ తీట తో వసుంధరకు, సండే మాగజీన్ కు వ్యాసాలు రాసాను. ఆక్కడ వర్మ అనే వాడు తిక్క పోలిటిక్స్ చేసి రాయకుండా చేసాడు. 


ది  హిందూ లో స్పోర్ట్స్ స్టోరీ లు రాశాను కానీ పెద్ద సీరియస్ స్పోర్ట్స్ రిపోర్టింగ్ కాదది. మెయిల్ టుడే లో కూడా కుదర లేదు. చివరకు.. పీ హెచ్ డీ అయ్యాక తెలుగు పేపర్లో గానీ చానెల్ లో గానీ స్పోర్ట్స్ డెస్క్ లో పనిచేయాలని అప్పటి నుంచి గట్టిగా అనుకున్నాను. హేమ టెన్ టీవీ లో స్పోర్ట్స్ రిపోర్టర్ గా చేరినప్పుడు చాలా ఆనందం అనిపించింది. 
చివరకు నాకు ఈ అవకాశం వచ్చింది. శక్తి వంచన లేకుండా... స్పోర్ట్స్ పేజీలు  విభిన్నంగా సూపర్ గా తేవడం కోసం కృషి చేస్తున్నాను. వీలు చేసుకుని మెట్రో ఇండియా చదివి... ఆ పత్రిక మీద, స్పోర్ట్స్ పేజీల మీద మీ అభిప్రాయలు రాయండి. 

ఇకపోతే... ఒక మీడియా కోసం పనిచేస్తూ మీడియా మీద బ్లాగ్ నడపడం బాగుండదని ఈ సందర్భంగా అనిపిస్తున్నది. పైగా... ఉన్నది ఉన్నట్లు మాట్లాడాలని, రాయాలని అనవసరంగా శత్రువర్గాన్ని పెంచుకున్న అనుభవంతో కాస్త లౌక్యం నేర్చుకుంటే ఎలా ఉంటుందో ప్రాక్టిస్ చేస్తున్నాను. ఈ క్రమంలో...కొన్ని రోజుల పాటు ఇందులో పోస్టులు రాయకుండా ఉందామని అనికుంటున్నాను. పని ఒత్తిడి లో బిజీ గా ఉన్న మా అబ్రకదబ్ర ను అడిగి చూస్తా. తను కూడా కుదరదంటే... బ్లాగ్ కు త్వరలో తాత్కాలిక విరామం ప్రకటిస్తా. మీరు అర్థం చేసుకుంటారని భావిస్తా. బై బై.  

(పై ఫోటో లో ఉన్నది... హేమ, ఫిదెల్, నేను. గచ్చి బౌలి స్టేడియం లో ఐ బీ ఎల్ మొదటి సెమీ ఫైనల్స్ రోజు ఇద్దరం రిపోర్టింగ్ కు వెళ్ళినప్పుడు తీసిన ఫోటో.)