Monday, January 17, 2022

'మా' తో TUOWJ చర్చలు: చెత్త థంబ్ నెయిల్స్ పై ఉమ్మడి కార్యాచరణ

కొందరు వెర్రిమొర్రి, బాధ్యతారహిత నెటిజెన్ల శునకానందానికి సెలిబ్రెటీస్-ముఖ్యంగా సినిమా యాక్టర్లు-బలవుతుంటారు. మంచీచెడూ లేకుండా కేవలం క్లిక్స్ పెంచుకునేందుకు ఘోరంగా తప్పుదోవ పట్టించే థంబ్ నెయిల్స్ పెట్టి వినోదం ముసుగులో చాలా మంది చెలరేగిపోతున్నారు. ఈ పెడధోరణి సీరియస్ రీడర్స్, వ్యూయర్స్ కు చాలా ఇబ్బంది కలిగిస్తుండగా, బాధితులకు చెప్పలేని మనోవేదన కలిగిస్తున్నది. సోషల్ మీడియా వేదికగా సీరియస్ జర్నలిజం చేసేవారికి ఇలాంటి అన్ ప్రొఫెషనల్ ఎలిమెంట్స్ తో చాలా ఇబ్బంది కలుగుతున్నది. 

సముద్రం లాంటి సోషల్ మీడియాలో ఎవడి చావు వాడు చస్తాడని అనుకోకుండా, మంచి ప్రాక్టీస్ ను పోషించేలా, వృత్తికి తలవంపులు తెచ్చేవారిని దారిలోకి  తెచ్చేలా చొరవచూపుతున్నది సీనియర్ జర్నలిస్టు బీ ఎస్ నేతృత్వంలోని  తెలంగాణ యూనియన్ ఆఫ్ ఆన్లైన్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUOWJ). డిజిటల్ జర్నలిస్టులకు గుర్తింపు.. సోషల్ మీడియా ఛానెళ్లకు సాధికారత సాధించడమే లక్ష్యంగా పని చేస్తున్న TUOWJ మరొక చొరవ చూపింది. సినీ ఆర్టిస్టుల ప్రధాన వేదిక అయిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA)తో ఈ రోజు (జనవరి 17, 2022) భేటీ అయ్యింది. 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు, కోశాధికారి శివ బాలాజీ తో డిజిటల్ మీడియా విస్తృతి, YouTube ఛానెళ్లకు గుర్తింపు తదితర అంశాలపై ప్రాథమికంగా చర్చించింది.

మంచు విష్ణు తో బీ ఎస్ 
తప్పుడు Thumbnails పెట్టేవారిపై కఠిన చర్యలు ఉండాలన్న తన విధానాన్ని మంచు విష్ణు ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. అయితే, యూనియన్ తో చర్చించాకే చర్యలుంటాయని కూడా హామీ ఇచ్చారు. "మా సమావేశం సుహృద్భావ వాతావరణంలో బాగా జరిగింది. వివిధ అంశాలను కూలంకషంగా చర్చించాం. గాసిప్స్ రాస్తే తప్పు లేదు కానీ తప్పుడు భాషలో కుటుంబాల్ని రోడ్డుకీడ్చేవిధంగా ఉండే ఛానెళ్లను ఉపేక్షించేది లేదని విష్ణు స్పష్టం చేశారు. ఇది అర్థం చేసుకోతగినదే. మా వైపు నుంచి 'మా' కు సంపూర్ణ సహకారాలు ఉంటాయి," అని బీ ఎస్ 'తెలుగు మీడియా కబుర్లు' తో చెప్పారు.  

డిజిటల్ మీడియా యూనియన్ గా తాము కూడా స్పష్టమైన విధివిధానాల్ని రూపొందించుకుని స్వయం నియంత్రణ పాటించేందుకు సిద్ధంగా ఉన్నామనీ, కలిసి పని చేయాలనుకుంటున్నామని చెప్పినట్లు బీ ఎస్ తెలిపారు. మరో సారి పూర్తి స్థాయిలో సమావేశమై విషయాలు చర్చించుకోవాలని ఉభయపక్షాలు నిర్ణయించాయి. ఇలాంటి సకారాత్మక చర్యలు సఫలం కావడానికి యూ ట్యూబర్స్, ఆన్ లైన్ జర్నలిస్టులు సహకరిస్తే బాగుంటుంది. ఈ విషయంలో పిచ్చి రాజకీయాలకు, కుళ్ళుబోతు వ్యవహారాలకు తావ్వివకుండా అంతా కలిసిపనిచేయాలని ఆశిద్దాం. 

Monday, January 3, 2022

'పరిశోధన' శూన్యం...'ఆత్మ' మిథ్య... 'జర్నలిజం' మాయం...

'పరిశోధనాత్మక జర్నలిజం' అంటే ఎవరో స్వప్రయోజనం కోసం దాచిపెట్టాలని లేదా సమాధిచేయాలని ప్రయత్నించే విలువైన సమాచారాన్ని తెలివిగా బట్టబయలు చేసి నిజాన్ని జనాల ముందుకు తెచ్చి బతికించే పని. ఇది సాహసోపేతమైన పనే కాక, సామాజిక విహిత కర్తవ్య నిర్వహణ కూడా. ఇన్వెస్టిగేషన్ కన్నా అద్భుతమైన పనేమీ ఉండదనీ, జర్నలిజాన్ని వృత్తిగా స్వీకరిస్తే ఇలాంటి మంచి పనులు బోలెడు చేసి ప్రజాసేవ నిర్వర్తించవచ్చునని నమ్మి జర్నలిజం లోకి వచ్చేవారు పెద్ద సంఖ్యలోనే ఉంటారు. కాలానుగుణంగా మీడియా స్వరూప స్వభావాల్లో వచ్చిన మార్పుల వల్ల, ఇతరేతర వివిధ కారణాల వల్ల ఇప్పుడు పరిశోధనాత్మక జర్నలిజం దాదాపుగా కనుమరుగు అయిపోయింది. అందుకే, గతంలో లాగా మీడియా ఇప్పుడు పరిశోధనాత్మక జర్నలిజం చేయడంలేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ గారు గత నెలలో హైదరాబాద్ లో మా మిత్రుడు, సీనియర్ జర్నలిస్టు ఉడుముల సుధాకర్ రెడ్డి ఎర్ర చందనం స్మగ్లింగ్ మీద శ్రమించి, పరిశోధించి రాసిన పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ ఆవేదన వ్యక్తంచేశారు.  మీడియా ముఖచిత్రం నుంచి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కనుమరుగుకావడం దురదృష్టకరమని అయన చెప్పారు.


'ఈనాడు' లో గతంలో కొద్దికాలం పనిచేసి ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానంలో అత్యున్నత పదవి అలంకరిస్తున్న జస్టిస్ రమణ గారు మినహా పరిశోధనాత్మక జర్నలిజం మీద ఈ మధ్య కాలంలో మాట్లాడినవారే లేకపోయారు. వారిలా మీడియాను దగ్గరి నుంచి చూసిన వారితో గానీ, ఇప్పుడు పనిచేస్తూ ఈ పవిత్ర వృత్తిలో తలపండిన జర్నలిస్టులతో గానీ మాట్లాడితే మీడియా పరిస్థితిలో వచ్చిన మార్పునకు కారణాలు తెలుస్తాయి. నేను 'ఈనాడు' లో పార్ట్ టైం విలేకరిగా చేరిన 1989-90 లో నాకు తారసపడిన సీనియర్లకు, 2002-2009 ప్రాంతంలో 'ది హిందూ' లో పనిచేసినప్పటి సీనియర్లకు మధ్య పోలికే లేదు. చిత్రా సుబ్రహ్మణ్యం, ఎన్ రామ్ బట్టబయలు చేసిన బోఫోర్స్ శతఘ్నుల కుంభకోణం రేపిన దుమారాన్ని చూసి పెన్ను పడితే అక్రమార్కులను వణికించవచ్చని గట్టి నమ్మకంతో పనిచేశాం అప్పట్లో. 1992 లో బయటపడిన హర్షద్ మెహతా గారి సెక్యూరిటీస్ స్కాం వల్ల సిరా చుక్క భూకంపాలు తెప్పిస్తుందని నమ్మి పనిచేశాం.

అప్పట్లో అయితే 'ఆధారాలు' గట్టిగా ఉన్నాయా? కథనంలో అందరి వెర్షన్స్ ఉన్నాయా? అని చూసుకుని పరిశోధనాత్మక కథనాలు ఎంతో ఉత్సాహంతో ప్రచురించేవారు. మొత్తం కెరీర్ లో పరిశోధించి ప్రచురించే వార్తలు ఒక ఐదారు ఉంటే గొప్పే. శోధించి వార్తలు రాసే జర్నలిస్టుకు మంచి క్రేజ్ ఉండేది. వ్యవస్థలో మార్పు కోసం తపించే వారు (విజిల్ బ్లోయర్స్) వచ్చి సమాచారం ఇచ్చేవారు. ఒక్కోసారి సిరీస్ (వరస కథనాలు) ప్రచురించి పత్రికలూ అవినీతిపరుల అంతు తేల్చేవి. వాటికి ప్రభుత్వం స్పందించేది. అప్పుడు మా ఘనకార్యం ప్రభావం ఇదని కాలర్ ఎగరేసి ఇంకో వార్త ప్రచురించేవారు. పథకాల్లో అవకతవకల మీద, అధికారుల డబ్బు కక్కుర్తి మీద, నాయకుల అన్యాయాల మీద, కలప స్మగ్లింగ్ మీద, బ్లాక్ మార్కెటింగ్ వంటి ప్రజోపయోగమైన అంశాల మీద పసందైన కథనాలు వచ్చేవి. సాధారణ ప్రెస్ నోట్లు, ప్రెస్ మీట్ల, స్పీచ్ ల వార్తలకు భిన్నంగా ఈ కథనాల్లో సమాచారం అబ్బురపరిచేది.

క్రమంగా పరిస్థితి మారింది. మన విలేకరి ఎవరికి వ్యతిరేకంగా ఆధారాలు సేకరించాడో వాడు తమ వాడేనా (కులం, ప్రాంతం వగైరా) ? అని చూడ్డం, వారి మనిషి అయితే  చూసీ చూడనట్టు పోవడం మొదలయ్యింది. కొన్ని పత్రికలు సదరు అవినీతి పరుడి నిజస్వరూపాన్ని బైటపెట్టేలా విలేకరి తెచ్చిన సాక్ష్యాలు, సేకరించిన ఆధారాలు (డాక్యుమెంట్లు) చూపించి అందినకాడికి దండుకోవడం కూడా బాగానే సాగింది. పత్రికలు రాజకీయ పార్టీల కొమ్ముకాయడం మితిమీరి పెరిగాక ఇన్వెస్టిగేషన్ అస్త్రాన్ని తమ కులస్థుల వ్యతిరేక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీయడం మాత్రమే మొదలయ్యింది. కాంగ్రెస్ హయాంలో నీటిపారుదల ప్రాజెక్టుల మీద, టెండర్లలో గోల్ మాల్ మీద తెలుగుదేశం అనుకూల పత్రికల్లో మొదటి పేజీల్లో పెద్ద పెద్ద వార్తలు వచ్చేవి. పొలిటికల్ బాసు, పత్రిక అధిపతి ముందుగా ప్లాన్ చేసేవారు కాబట్టి అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాలకు ముందురోజో, అవి కొనసాగుతున్నప్పుడో ఇన్వెస్టిగేటివ్ కథనాలు బాంబుల్లా పేలేవి. ఆ కథనాల మీద చర్చ జరగాలని విపక్షం పట్టుపట్టి విచారణకు ఆదేశించేలా చేయడమో, ఇంకేదైనా కీలక నిర్ణయం తీసుకోవడానికి ఒత్తిడి చేయడమో జరిగేది.  పరిశోధన ను పూర్తిగా వదలకుండా... కొన్ని పత్రికలు ప్రభుత్వం నొచ్చుకోని విధంగా సుతిమెత్తని పరిశోధనాత్మక కథనాలు ప్రచురిస్తున్నాయి.... అప్పుడప్పుడూ.

ప్రభుత్వాధినేతలు సొంత మీడియా సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటూ మీడియా యజమానుల మెడలు వంచే పద్ధతులు పాటిస్తుండడంలో మీడియా సంస్థలు జీ హుజూర్ జర్నలిజం చేస్తున్నాయి. దీంతో, ఇప్పుడు పరిశోధన శూన్యం, ఆత్మ సున్నా, జర్నలిజం జీరో అయిపోయిన దుస్థితి. అప్పట్లో డెక్కన్ క్రానికల్ పత్రిక ఇన్వెస్టిగేటివ్ వార్తలకు ప్రాధ్యాన్యం ఇచ్చేది. నాయర్ గారు ఎడిటర్ గా ఉన్నప్పుడు వెలువడిన కొన్ని కథనాలు జర్నలిస్టులకు మధుర స్మృతులుగా మిగిలిపోతాయి. పుట్టపర్తి లో సత్యసాయి ప్రాంగణంలో జరిగిన హత్యల మీద వచ్చిన కథనాలు కంపనాలు సృష్టించాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అప్పుడప్పుడు ఆంధ్ర జ్యోతి పత్రిక, ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా లో ఎడిటర్ (ఇన్వెస్టిగేషన్స్) గా ఉన్న సుధాకర్ రెడ్డి లాంటి ఒకరిద్దరు దమ్మున్న ఇంగ్లిష్ జర్నలిస్టులు అప్పుడప్పుడు  కథనాలు రాస్తున్నారు. పరిశోధనల కోసం ప్రత్యేకించి దమ్ము, ధైర్యం, బుర్ర, రచనా సామర్ధ్యం ఉన్న సీనియర్ జర్నలిస్టులను నియమించనైనా నియమించడంలేదాయె. ఇలా పలు కారణాల రీత్యా క్రిటికల్ వార్తలు రాసి ప్రభుత్వం స్పందించేలా చేసే జర్నలిస్టులు కనుమరుగయ్యారు. భారత ప్రధాన న్యాయమూర్తి గారే కాకుండా సదాలోచన పరులు, ప్రజాస్వామ్య హితైషులు పరిశోధనాత్మక జర్నలిజం లేకుండా పోయిందే... అని ఆవేదన చెందడానికి కారణమైన ఐదు అంశాలు ఏమిటంటే...
1) యాజమాన్య ధోరణులు 2) దమ్మున్న ఎడిటర్లు/ సీఓబీ లు లేకపోవడం 3) పరిశోధనాత్మక జర్నలిస్టులకు సముచిత గౌరవం, ప్రోత్సాహకాలు లేకపోవడం 4) ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులకు దన్నుగా నిలబడే వారు కరువవడం 5) పరిశోధనాత్మక జర్నలిజం లో శిక్షణ లేకపోవడం.

ఒక పత్రిక సత్య ప్రమాణకంగా పరిశోధించి వ్యాసం రాసినా దాన్ని తిప్పికొడుతూ వైరి పత్రిక వ్యాసం (రిజాయిండర్) రాసే పరిస్థితి ఇప్పుడు దాపురించింది.  కారణం, పైన మనం అనుకున్న యాజమాన్య ధోరణులు. మీడియా ఓనర్లకు పలు వ్యాపారాలు ఉండడం తో వాళ్ళ పిలక ప్రభుత్వం చేతిలో ఉంటున్నది. మాట వినకుండా ఇష్టమొచ్చినట్లు వ్యాసాలు ప్రచురించే పత్రికల ఆర్ధిక మూలాలపై కోలుకోలేని దెబ్బకొట్టే విద్వేషపూరిత ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్నాయి. ఇండిపెండెంట్ మీడియా అనేది లేకపోతే పరిశోధనకు అవకాశమే లేదు.

పగ్గాలు విడిస్తే పరిశోధించి అక్రమార్కుల భరతం పట్టే జర్నలిస్టులకు కొదవులేదు. కానీ అందుకు ఎడిటర్ల, చీఫ్ ఆఫ్ బ్యూరోల సంపూర్ణ మద్దతు అవసరం. నేను నా కెరీర్ లో ఒక వింత పరిస్థితి ఎదుర్కొన్నా ఒక చవట చీఫ్ ఆఫ్ బ్యూరో మూలంగా. డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్న ఒక అధికారి బినామీ పేర్లతో చీప్ రేటుకు వందల ఎకరాలు ఎలా కొన్నదీ నిరూపిస్తూ నేను డాక్యుమెంట్లు తెస్తే... అభినందించాల్సింది పోయి నా బాస్ అయిన ఈ సీనియర్ ఒక సిల్లీ ప్రశ్న వేశాడు- "ఇది మనం ప్రచురిస్తే కోర్టు కేసు అవుతుందా?' అని. కేసు కావచ్చు, కాకపోవచ్చు అనగానే... 'వద్దులే' అని కొట్టిపారేశాడు... ఆ డాక్యుమెంట్లను చూడకుండానే, నా శ్రమను అభినందించకుండానే. తాను ప్రపంచంలోనే గొప్ప జర్నలిస్టునని, చక్కని రాత గాడినని అందరితో మిడిసిపాటుతో వ్యవహరించి చివర్లో దారుణంగా భంగపడిన ఈ సీనియర్ లాంటి వాళ్ళ వల్ల కూడా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం భ్రష్టు పట్టిపోయింది. ఇప్పుడున్న తెలుగు పత్రికల ఎడిటర్లలో దూకుడు స్వభావం లేకుండా మన్నుతిన్న పాముల్లాంటి వాళ్ళే ఎక్కువ. ఇప్పటి ఎడిటర్లలో తమ జీవితంలో ఎవరు ఎన్ని పరిశోధనాత్మక కథనాలు రాసారో, ఎవరు ఎన్ని ప్రభుత్వ వ్యతిరేక కథనాలు రాసి సంచలనం సృష్టించారో లెక్కతీస్తే  ఉస్సూరుమంటాం. యాజమాన్యాలు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసిన వారికి కాకుండా వేరే కొలబద్దలను బట్టి తమ మనుషులకు ఎడిటర్లుగా పట్టంకట్టినంత కాలం పరిస్థితి మారదు. పరిశోధన చేసి ఏదైనా కథనం రాయాలంటే వృత్తిపట్ల కట్టుబాటు ఉండాలి, గుండె నిండా సాహసం ఉండాలి, నీతి విషయంలో నిబద్ధత ఉండాలి కదా!

ప్రాణాలకు తెగించి, ఎన్నో అవరోధాలను అధిగమించి పరిశోధనాత్మక కథనాలు రాసే జర్నలిస్టులకు వెన్నుదన్నుగా ఉండే వ్యవస్థ ఎక్కడుంది చెప్పండి. . ఇలాంటి సిన్సియర్ జర్నలిస్టులు ఇబ్బందుల్లో పడితే మీడియా మానేజ్మెంట్స్ పక్కకు తప్పుకుంటాయి. ఎడిటర్లు బండలు వేస్తారు. శ్రమించి సాధించిన జర్నలిస్టులను వారి మానాన వారిని వదిలేసి, మీ కేసు మీరే చూసుకోండని అంటే కష్టమై పోతుంది. పరిశోధనాత్మక జర్నలిజం బతకాలంటే ప్రోత్సాహకాలు భారీగా ఉండాలి. ప్రతి ఏడాదీ ఒక అత్యుత్తమమైన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు పనితనాన్ని గుర్తించి మెచ్చుకుని ఒక బహుమానం ఇస్తే ఎంత బాగుంటుంది!  ఒకటి రెండు ఇండియన్ ఎక్స్ ప్రెస్ లాంటి జాతీయ పత్రికలు  ఇలాంటి నికార్సైన జర్నలిస్టుల కోసం ఒక బహుమతి ఇచ్చి గౌరవిస్తున్నాయి. ప్రతి ఏడాదీ ప్రభుత్వమే చిత్తశుద్ధితో మంచి జర్నలిస్టులకు ప్రోత్సాహకాలు ఇచ్చే సత్సంప్రదాయాన్ని చిత్తశుద్ధితో కొనసాగించాలి. అయినా, మీడియా బిజినెస్ మీద బాగా సంపాదించిన 'ఈనాడు' లాంటి పత్రికలు ఒక పదో, పాతికో లక్షలు ఏడాదికి ఒకరిద్దరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులకు ప్రోత్సాహకంగా ఇవ్వవచ్చు కదా! జర్నలిజంలో అద్భుతమైన శిక్షణ పొంది, రచనలే శ్వాసగా చేసుకుని అర్ధంతరంగా చనువుచాలించిన సుమన్ పేరిట ఒక వార్షిక అవార్డు నెలకొల్పి ఉంటే ఒక సత్సంప్రదాయానికి తెర ఎత్తినట్లు అయ్యేది.  
అమెరికాలో ఉన్నట్లు పులిజర్ అవార్డుల్లాంటివి మన దగ్గర లేవన్న స్పృహ మనోళ్లకు లేకపోవడం బాధాకరం. ఈ అంశాన్ని అటు వ్యవస్థ గానీ, సంస్థలు గానీ, విశ్వవిద్యాలయాలు గానీ పట్టించుకోవడం లేదు. నేను అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా లో ఉన్నప్పుడు అక్కడి యాజమాన్యానికి ఇందుకు సంబంధించిన ఒక ప్రతిపాదన చేశాను గానీ అది వారికి వంటపట్టలేదు. ఇది ప్రచురించే సమయానికి సుప్రసిద్ధ జర్నలిస్టు అరుణ్ సాగర్ గారి స్మృత్యర్థం నెలకొల్పిన అవార్డుల ప్రధానం ప్రెస్ క్లబ్ లో జరుగుతున్నది. ఇలాంటి అవార్డులు మరెన్నో నెలకొల్పి అర్హులైన జర్నలిస్టులకు ప్రదానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


ఇక విశ్వవిద్యాలయాల్లో 'ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం' ఒక సీరియస్ అంశంగా చెబుతున్న దాఖలాలు లేవు. ప్రభుత్వం నడుపుతున్న విశ్వవిద్యాలయాల్లో ఇది నిల్లు. జర్నలిస్టులు నడుపుతున్న ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం లో మాకు ఇన్వెస్టిగేషన్ మీద సీరియస్ శిక్షణ ఇచ్చి ఒక ప్రాజెక్టు చేసేలా ప్రోత్సహించేవారు. నేను ప్రింట్ జర్నలిజం ఆరంభించడానికి సహకరించిన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ఈ తరహా జర్నలిజం మీద క్లాసులు తీసుకుని, ఒక అసైన్మెంట్ ఇచ్చేవాడిని. ఈ పనిచేయాలంటే బోధకులకు ఫీల్డ్ ఎక్స్పీరియెన్స్ ఉండాలి. దాన్ని పట్టించుకునే వారు ఇప్పుడు లేరు.

ఈ ఐదు అంశాల సంగతి అలా ఉంచితే, సోషల్ మీడియా వచ్చాక ఇన్వెస్టిగేషన్ మీద కొద్దిగా ఫోకస్ ఉన్నట్లు కనిపించింది. రెండు మూడు యూ ట్యూబ్ ఛానెల్స్ ఇలా ఆశలు రేకెత్తించాయి. అందులో ఒకటైన క్యూ న్యూస్ నాకు నచ్చేది. దాని ఆరంభకుడు తీన్మార్ మల్లన్న అనే చింతపండు నవీన్ కు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుకు ఉండాల్సిన లక్షణాలు అన్నీ పుష్కలంగా ఉన్నాయి. ఆ కారణంగానే 30కి పైగా కేసులు పడ్డాయి అతని మీద. ఇంతలో కారణాంతరాల వల్ల బీజేపీ తీర్థం స్వీకరించి మల్లన్న ఇండిపెండెంట్ జర్నలిజం అన్న మాటకు అనర్హుడయ్యాడు. తొలి వెలుగు లో రఘు అనే అబ్బాయి బాగానే చేస్తున్నాడు కానీ... ఇది శృతి మించిన కారణంగా క్రమంగా సీరియస్ నెస్ కోల్పోతున్నట్లున్నది.

ప్రజాస్వామ్యం మనగలగాలంటే జర్నలిజం, ముఖ్యంగా పరిశోధనాత్మక జర్నలిజం, బతికి బట్టకట్టే పరిస్థితులు సమాజం, వ్యవస్థలు సృష్టించాలి.  సిన్సియర్ జర్నలిస్టులు ఇండిపెండెంట్ గా నైనా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజాన్ని స్వీకరించి సోషల్ మీడియా వేదికగా ప్రోత్సహిస్తే మంచిది.  చీఫ్ జస్టిస్ గారు అభిలషిస్తున్న ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ (ప్రధాన మీడియాలో) లో రాణించి ప్రజాస్వామ్యానికి జవజీవాలు ఇస్తుందని ఆశిద్దాం. జస్టిస్ రమణ గారి ఆవేదనకు స్పందిస్తూ సుప్రసిద్ధ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్ గారు ఒక వ్యాసంలో పేర్కొన్నట్లు సీరియస్ జర్నలిజం చేసే జర్నలిస్టులకు న్యాయ స్థానాలు వెన్నుదన్నుగా నిలవాలని కోరుకుందాం. 

I published the same in Adarshini, edited by senior journalist Mr Mini Suresh Pillai.

Here is the link

https://adarsini.com/dr-s-ramu-feature-article-on-investigative-journalism/