Thursday, March 31, 2011

భలే మంచిరోజు......పసందైన క్రికెట్ రోజు.....

జాతి యావత్తూ ఒక్కతాటి మీదకు వచ్చి ఆనంద పడడమో, ఏడవడమో చేసే సంఘటనలు అరుదుగా వుంటాయి. ఎందుకంటె, ఇక్కడ ఎవడి అంతస్తు వాడిది, ఎవడి మతం గొడవ వాడిది, ఎవడి కులం గొడవ వాడిది, ఎవడి బతుకు పోరు వాడిది. దీనికి భిన్నంగా భారతీయులలో క్రీడాప్రేమికులంతా గుండెలనిండా ఆనంద పడే సంఘటన నిన్న రాత్రి జరిగింది. అదే... మొహాలీలో ప్రపంచ కప్ క్రికెట్ పోటీలలో దాయాది పాకిస్తాన్ పై భారత్ విజయం సాధించడం. జనం ఇంతలా ఆనందపడడం, దాన్ని రెచ్చిపోయి సెలబ్రేట్ చేసుకోవడం ఈ మధ్యకాలంలో జరగలేదు. నేను, క్రికెట్ పిచ్చి బాగానే పట్టిన నా పదేళ్ళ కొడుకు ఫిదేల్ మ్యాచును ఆద్యంతం ఆస్వాదించాం...వేరు వేరు ప్రదేశాలలో కూర్చుని. 


చిన్నప్పుడు...మా నాన్నతో కలిసి రేడియోలో క్రికెట్  కామెంటరీ వినడం, మ్యాచులు టీవీ లలో చూడడం భలే మజాగా అనిపించేవి. బాధలు, ఇబ్బందులు, చదువులు, ఉద్యోగ బాధ్యతలు అన్నీ మరిచిపోయి మైమరచి క్రికెట్ లో లీనమై బైటకురావడం ఒక వింత అనుభూతి. ఆ మాటకొస్తే...ఆటలు, సంగీతం, నృత్యం వంటి కళలన్నీ మనలను వేరే లోకంలోకి తీసుకెళ్ళి సాంత్వన చేకూర్చేవే కదా! అందుకే...బుధవారం పొద్దున్న లేవగానే...ఇంట్లో కూర్చొని కుటుంబ సభ్యులతో కలిసి మ్యాచ్ చూడాలని ప్లాన్ చేసుకున్నాను. 

టేబుల్ టెన్నిస్ ఆటగాడైన ఫిదేల్ కు దొరికిన ఒక స్పాన్సరర్ కోరిన మీదట తన ప్రొఫైల్ తయారీ కోసం, ఇతరత్రా చిన్న పనులు చక్కబెట్టుకునేందుకు ఆఫీసుకు వెళ్లాను. తొందరగా అన్నీ పనులు తెముల్చుకుని లంచ్ టైం కు ఇంటికి రావాలన్నది ప్లాన్. కానీ అక్కడ పనుల్లో బిజీ అయి రెండైనా ఇంటికి చేరలేకపోయాను. లాభం లేదనుకుని...ఆఫీసులోనే తిని...హెచ్.ఎం.-టీ.వీ.ఎడిటర్ రామచంద్ర మూర్తి గారు, సీనియర్ మోస్ట్ జర్నలిస్టు వరదాచారి గారితో కలిసి పెద్ద తెర మీద క్రికెట్ చూసాను. మూర్తి గారు ప్రతి బంతినీ ఆస్వాదించారు. ఆట మీద మంచి విశ్లేషణ చేసారు. తానూ హైదరాబాద్ న్యూ సైన్సు కాలేజీలో, నల్లకుంట గ్రౌండ్ లో క్రికెట్ ఆడిన రోజులను మూర్తి గారు గుర్తుకు తెచ్చుకున్నారు. 
సెహ్వాగ్ ఊపును ఇతరులు కొనసాగించకపోవడం మా అందరికీ చికాకు కలిగించింది. యువరాజ్ అలా డకౌట్ కావడం ఆశ్చర్యం కలిగించిది. మ్యాచ్ ఫిక్స్ అయిందన్న అనుమానం బలపడేలా మన వాళ్ళు ఆడారు.  'సార్...నాకొక ట్రాక్ రికార్డ్ వుంది. నేను కీన్ గా చూసిన ఏ మ్యాచూ ఇండియా గెలవదు,' అని నేను చెప్పినప్పుడు...'ఇవ్వాల్టికి మరి ఏదైనా పని వుంటే పోయి చూసుకోరాదూ...' అని మూర్తి గారు అన్నారు. భారత్ గెలవాలన్న సంకల్పం అందరిదీ. సచిన్ కు ఇన్ని లైఫ్ లు రావడం నా జన్మలో ఎప్పుడూ నేను చూడలేదు. ఒక లైఫ్ వచ్చాక తను జాగ్రత్తగా ఆడతాడు. నిన్న ఆయన అదృష్టం కలిసి వచ్చింది. ఇండియా అదృష్టం బాగుంది..తను సెంచరీ చేయకుండా వెళ్ళిపోయాడు. అప్పుడే అనిపించింది...హమ్మయ్య మనం గెలుస్తాం...అని.

మ్యాచుకు ముందే...నా సన్నిహిత మిత్రుడు షణ్ముఖేశ్వర రావు గారు ఫోన్ చేసి..తన ఎనిమిదేళ్ళ పిల్లవాడు విష్ణుతో పాటు ఫిదేల్ ను, రోహన్ ను జల విహార్ లో పెద్ద స్క్రీన్ మీద క్రికెట్ చూపే చోటికి తీసుకెళ్తున్నానని చెప్పారు. వీళ్ళు ముగ్గురూ టీ.టీ.ప్లేయర్స్, ఫ్రెండ్స్. అంత ఎండలో...అయన ఇంటికి వచ్చి పిల్లలను తీసుకుని జలవిహార్ కు వెళ్ళారు. అంటే...నేను, వాడూ ఒక చోట కూర్చొని చూడలేకపోయాం. బుధవారం నాడు 'రామ్ బాణం' కాలం ప్రూఫు చూసుకోవడానికి...భారత్ బ్యాటింగ్ ముగియగానే...ది సండే ఇండియన్ ఆఫీసుకు బయలుదేరాను. మధ్యలో నల్గొండ నుంచి మరొక టీ.టీ.క్రీడాకారిణి తండ్రి శంకర్ ఫోన్ చేసి...'ఏంది సార్... ఇట్లయ్యింది' అని ఆవేదన చెందాడు. 'సచినే బంతిని కొట్టడానికి అంత ఇబ్బంది పడ్డాడంటే...వికెట్ లో ఏదో తేడా వుంది. డోంట్ వర్రీ,' అని మూర్తి గారి ప్రెడిక్షన్ ను శంకర్ కు చెప్పాను. తీరా పొతే...ది సండే ఇండియన్ ఆఫీసులో టీ.వీ.లేదు. ఒక కంప్యూటర్ లో వాయిస్ లేకుండా వాళ్ళు టీ.వీ.చూస్తున్నారు. నాకు పరమ చికాకు కలిగినా తప్పలేదు.

సాహిత్యం గురించి, తన మనసుదోచిన మహిళల గురించి తన్మయత్వంతో చెప్పే/ రాసే మిత్రుడు నరేష్ గారు కూడా క్రికెట్ పట్ల చాలా ఆసక్తి కనబరచడం నన్ను అబ్బురపరిచింది. అక్కడ పనిచేసే రవి అనే టైపిస్టు గారు...బ్రహ్మం గారి లాగా...కచ్చితంగా పాకిస్తాన్ ఓడిపోతుంది అని ముందే చెప్పారు. ఇండియా గెలవడం ఖాయం....అని నేను పది బీరు బాటిల్స్ బెట్ పెట్టాను..నరేష్ గారితో. పది గంటలకు 'ఈనాడు' వెనక ఉన్న క్షేత్ర అనే హోటల్ కు వెళ్ళాం. అక్కడ ఒక్క కష్టమరైనా లేదు. హోటల్ సిబ్బంది అంటా ఒక గదిలో కూర్చొని టీ.వీ.చూస్తున్నారు. భారత్ క్లిష్ట పరిస్థితులలో ఉన్నప్పుడు నేను కూడా కాసేపు అక్కడ కుక్స్, వెయిటర్స్, మానేజర్స్ తో కలిసి ఆట చూసి ఆనందించాను. అఫ్రిది అవుట్ కావడంతో మన విజయం ఖాయమని నాకు ఖాయమైంది. అందుకే అక్కడ ఖుబానీ కా మీఠా కూడా ఆర్డర్ ఇచ్చాను. 

మళ్ళీ..ది సండే ఇండియన్ ఆఫీసుకు వచ్చి....తెచ్చుకున్నవి తింటూ...భారత్ విజయాన్ని ప్రత్యక్షంగా చూసాం. మధ్యలో ఇంటికి ఫోన్ చేసి..మీరూ చూడండి..అని ఆటల పట్ల పెద్దగా ఆసక్తి లేని నా భార్యామణి కి చెప్పాను. మిస్బా చెలరేగి పోయి ఆడుతుంటే...కొద్దిగా భయమేసినా...భారత్ గెలుపు ఖాయం కావడంలో  ఖుబానీ కా మీఠా మరింత ఆస్వాదించాం. అక్కడ జల విహార్లో ఉన్న ఫిదేల్ కు ఫోన్ చేసి...'ఇండియా జిందాబాద్' అని ఇద్దరం ఫోన్ లో నినాదాలు చేసాం. ఇలా బారత్ ఇన్నింగ్స్ ఒక ఎడిటర్ గారితో, పాక్ ఇన్నింగ్స్ ఇంకొక ఎడిటర్ గారితో కలిసి చూసి...రోడ్ల మీద జనం విజయోత్సవాలు జరుపుకుంటూ ఉంటే...చూసి ఆనందించి....అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఇంటికి చేరి నిద్రకు ఉపక్రమించా. ఓడినా అద్భుతంగా ఆడిన పాకిస్తాన్ కూడా నాకు నచ్చింది. కొట్టుకుచచ్చే రెండు దేశాల ప్రధానులను ఒక దగ్గరికి తెచ్చిన ఆట గొప్పతనం నాకు నచ్చింది. జీవితంలో దొరికే పసందైన రోజులలో కచ్చితంగా ఇదీ ఒకటే.

చివరకు మరో మాట. ఆ పది బీర్లు లాగించడం...మన మనవల్ల అయ్యే పని కాదు. వాటా కావలసిన వారు....నన్ను కలవవచ్చు. సేం ప్లేస్ (సార్వి హోటల్, ఖైరతాబాద్ చౌరస్తా)...ఎనీ టైం ఇన్ ది ఈవినింగ్. అంతవరకూ చీర్స్.

Wednesday, March 23, 2011

కారులో సరస సల్లాప కార్యక్రమాలు: పాపం పిల్లలు

ఒక వయసు వచ్చిన ప్రేమికులకు భంగం కలిగించడం పాపమే అయితే...నేనీ ఉదయాన్నే ఆ పాపం మూట కట్టుకున్నాను. సొంత టేబుల్ టెన్నిస్ అకాడమీ కోసం దొరికిన మూడు ప్రాంతాలలో ఒకటైన నవీన్ నగర్ కు ఆ పక్కనే ఉన్న ఆనంద్ నగర్ నుంచి రెండు నెల్ల కిందట మారిన సంగతి మీకు తెలిసిందే. ఈ ఇంటి దగ్గర ఒక చిక్కు వచ్చిపడింది. మా ఇంటికి దగ్గరలో ఆరిందం చౌదరి గారి ఐ.ఐ.పీ.ఎం. ఉంటుంది. ఇక్కడ చదువుకునేది డింగ్ డాంగ్ జీన్స్ జనరేషన్. పిల్లలు ముట్టుకుంటే మాసిపోయేట్లు  ఉంటారు. 

వారి ధైర్యంగా...ఆత్మవిశ్వాసంతో...తోటి మగ విద్యార్థులతో కలివిడిగా మాట్లాడుతూ....మా ఇంటిపక్కన వున్న బండి దగ్గర జూసు తాగుతుంటే....ముచ్చటేస్తుంది. వారి ఇంగ్లిష్ భాష అద్భుతంగా ఉంటుంది. వీరిని చూస్తే....భారత్ భవిత మీద అవిశ్వాసం చప్పున పోతుంది. మా వీధిలో జనం ఆ పిల్లల వంక...అదోలా చూస్తూ కాలక్షేపం చేస్తారని నాకు అర్థమయ్యింది.  

వారిలో చాలా మంది ఖరీదైన కార్లలో కాలేజికి వస్తారు. వాళ్ళ కాలేజ్ రోడ్డు మీద ఉంటుంది కాబట్టి...దర్జాగా వాటిని తెచ్చి మా ఇంటి ముందో...పక్కనో పెడతారు. చాలా సార్లు కార్లోనే కూర్చుని కబుర్లు చెప్పుకుంటారు. వారి అద్దాలకు నల్లటి ఫిలిం అతికించి ఉంటుంది కాబట్టి...అందులో వారేమి చేస్తారో నర మానవుడికి తెలియదు. ఈ షోకుల పిల్లలు...బాయ్ ఫ్రెండ్స్ తో వారి చనువు...చూస్తుంటే....అప్పుడప్పుడు భయమేస్తుంది కూడా. వాళ్ళ బాధ వాళ్ళు పడితే నాకేమీ ప్రాబ్లం లేదు. వారు కారులో చేసుకునే ఎవ్వారాలు మొదటి అంతస్తులో ఉన్న మాకు కళ్ళకు కట్టినట్లు కలిపిస్తాయి. మనం చూస్తే...పర్వాలేదు...ఇంట్లో పిల్లలు చూడరాని ఎవ్వారాలు చూస్తే కొంప మున్గుతుందని నా భయం. 

డు తరగతిలో ఒక చోట ఇలా చూడకూడని ఎవ్వారం చూసి నేను చాలా రోజులు కంపు కంపు అయిన విషయం గుర్తుకువస్తూ ఉంటుంది. అది చూశాక ఘోరాతి ఘోరంగా ఆడ పిల్లలను చూసే దృక్కోణంలో నాకే తేడా కనిపించి చాలా ఇబ్బంది పడ్డాను. దుర్భావాలు కలగకుండా ఉండేలా ఉండడానికి చాలా కసరత్తు చేయాల్సి వచ్చింది. ఈ కార్లలో సరస సల్లాప కార్యక్రమాలు పిల్లల కంట పడకుండా ఉండడానికి ఏమి చేయాలో నాకు బోధపడడం లేదు.
సరే....ఈ రోజు ఏదో బాంకు పని మీద వెళ్లి వచ్చాను. ఆ కార్లో వాళ్ళు కిస్సులు ఇచ్చుకుంటున్నారు...అని ఇంట్లో నుంచి ఫిర్యాదు వచ్చింది. నేను...కాస్త కళ్ళు చిట్లించి చూద్దును కదా...
కొంపలారి పోతున్నాయి. 

ఒక చూడచక్కని టీనేజ్ అమ్మాయి...డ్రైవర్ సీట్లో ఉన్న ఒక అబ్బాయి యమ తమకంతో చుబనాది కార్యక్రమాలు సాగిస్తున్నారు. ఆ కారు అద్దాల ఫిలిం ట్రాన్స్పరెంట్ గా ఉండడంతో అందులో లీలా విలాసాలు చక్కగా కనిపిస్తున్నాయి. ఇలాంటి విషయాలు ఎలా డీల్ చేయడం చెప్మా? అన్న సందేహం కలిగింది. 

పిల్లలను బైటికి రావద్దని చెప్పి....మనసు చెప్పిన ప్రకారం...వడివడిగా మెట్లు దిగి...కారు దగ్గరకు వెళ్లాను. దగ్గరకి వెళ్ళిన విషయం కాస్త ఆలస్యంగా గమనించిన మగ ధీరుడు....'ఏంటి...బే' అన్నట్లు తల ఊపాడు. డోర్ తియ్యమన్నట్లు నేను సైగ చేశాను. వాడు...సరే అంటూ....కారు రివర్స్ చేసుకుని....యమ స్పీడుగా అక్కడి నుంచి వెళ్లి పోయాడు. నాకు బాధేసింది.
'బాబూ...ఇలా చేయకు....' అని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. 'బాబూ...ఇక్కడ ఇలా చేయకు...' అని మాత్రమే చెబుదామని అనుకున్నాను. 

లేకపోతే....నాయనా....కాస్త...మందపాటి ఫిలిం పెట్టించుకోవచ్చు కదా...అని సలహా ఇద్దామనుకున్నాను. పాపం..వాళ్ళిద్దరూ నన్ను దుర్మార్గుడిగా అనుకుని....తిట్టుకుని ఉంటారన్న అపరాధభావం తో దీని గురించే ఆలోచిస్తూ యూనివెర్సిటీకి వచ్చాను. నేను పాఠం చెబుతుంటే...చెప్పా పెట్టకుండా బైటికి వెళ్లి ఇకిలిస్తూ వచ్చిన ఒక  అమ్మాయి....కేరళ అబ్బాయిని చూసి...ఈ మన్మధుడ్ని మనమేమి కంట్రోల్ చేస్తాం అనిపించింది.

Sunday, March 20, 2011

హైదరాబాద్ లో కొత్తగా త్వరలో రెండు ఇంగ్లిష్ న్యూస్ పేపర్లు

తెలుగు న్యూస్ ఛానళ్లు తామరతంపరగా పుట్టుకొస్తుంటే...ఇన్నాళ్లూ కుళ్లుకున్న ఇంగ్లిష్ జర్నలిస్టులకు ఇది ఒక శుభవార్త. హైదరాబాద్లో త్వరలో కొత్తగా రెండు ఇంగ్లిష్ న్యూస్ పేపర్లు రాబోతున్నాయి. కొందరు సాఫ్ట్ వేర్ సంస్థల పారిశ్రామికవేత్తలు కలిసి ఒక మధ్యాన్నం పత్రికను తీసుకురాబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. "ఉదయం నుంచి మధ్యాన్నం దాకా జరిగే పరిణామాలను అందించడం దీని ఉద్దేశం. బెంగుళూరుకు చెందిన ఒక జర్నలిస్టును ఎడిటర్ గా నియమించారు," అని ఒక సీనియర్ పాత్రికేయుడు తెలిపారు. జీవీకే సంస్థ పాత్ర కూడా ఇందులో ఉన్నదని చెబుతున్నారు కానీ అధికారికంగా అది తెలియరాలేదు.  

కపిల్ గ్రూప్ వారి ఆధ్వర్యంలో రోజూ ఒక టాబ్లాయిడ్ రాబోతున్నది. దీనికి ఎడిటర్ గా కొమ్ములుతిరిగిన జర్నలిస్టు, డెక్కన్ క్రానికల్ పేపర్ కు జవసత్వాలు ఇచ్చిన వెటరన్ ఎడిటర్ సి.ఎన్.విశ్వనాథన్ నాయర్ నియమితులయ్యారు. ‌న్యూఢిల్లీ కేంద్రంగా 'ఇండియా టుడే' తెస్తున్న మెయిల్ టుడే తరహాలో ఆరంభంలో హైదరాబాద్ పరిధిలో ఈ పత్రిక వస్తుందని చెబుతున్నారు. (తను పనిచేస్తున్న సంస్థ వారి టాబ్లాయిడ్ కాబట్టి...అర్ధం చేసుకోదగ్గ ఇబ్బంది కారణంగా వివరాలు అందించడానికి రాము సహకరించడం లేదు...అబ్రకదబ్ర)

Wednesday, March 16, 2011

ABN-ఆంధ్రజ్యోతి లో చేరిన జకీర్, రామచంద్ర-- అమెరికాకు మూర్తి

TV-9 స్టార్ రిపోర్టర్లలో ఒకరిగా వెలుగొంది...తెలంగాణా వారి రాజ్ న్యూస్ లో చేరిన సీనియర్ జర్నలిస్టు జకీర్ తాజాగా ABN-ఆంధ్రజ్యోతి లో చేరారు. రవిప్రకాష్ ఛానల్లో చేరడానికి ముందు జకీర్ రాధాకృష్ణ పేపర్లో రోవింగ్ కరస్పాండెంట్గా పనిచేశారు. ఖమ్మం జిల్లా కొత్తగూడానికి చెందిన జకీర్ కిందపడిమీదపడి జర్నలిజంలో ఈ స్థాయికి చేరుకున్నారు. తెల్లతోలు జనాలే టీవీ జర్నలిజానికి పనికొస్తారన్న దురభిప్రాయాన్ని చెరిపేస్తూ....సమాచార సేకరణ, వాగ్ధాటిలతో బుల్లితెర మీద జకీర్ మార్కెట్ సృష్టించుకున్నారు. రాజ్ న్యూస్ ను జకీర్ విడవడానికి కారణాలు తెలియరాలేదు. 

‍N-TV త్రిమూర్తులలో ఒకరిగా ఒక వెలుగువెలిగి...అనూహ్య పరిస్థితుల్లో నారా వారి Studio-N లో చేరి నానా తంటాలు పడిన రామచంద్ర కూడా ABN-ఆంధ్రజ్యోతి లో చేరారని సమాచారం. త్రిమూర్తులలో ఒకరైన మూర్తి ABN-ఆంధ్రజ్యోతి ఛానల్ కు గుడ్ బై చెప్పారని తెలిసింది. తాను ఎందుకు ఉద్యోగం వదిలేస్తున్నదీ మూర్తి స్పష్టంగా చెప్పడంలేదని ఆయన మిత్రులు కొందరు చెప్పారు. తాను అమెరికాలో ఏదో కోర్సుచేయడానికి వెళుతున్నట్టు మూర్తి చెబుతున్నారట. అయితే...ఇపుడిప్పుడే స్థిమితపడుతున్న ఒక ఛానల్ లో మూర్తిచేరబోతున్నట్టు పునకార్లు వ్యాపిస్తున్నాయి.

Sunday, March 13, 2011

మేధావులారా...ఈ conspiracy of silence ఇంక ఎన్నాళ్లు??

ఈ తెలుగునేల మీద నివసిస్తున్న మేధావులనబడే జనాలను చూస్తే బాధేస్తున్నది, భయమేస్తున్నది. ఎముకలు కుళ్లిన, కండలు-కండరాలు చీకిపోయిన, వెన్నెముక తునకలైన, బుర్రచెడిన ఈ వెర్రి జనం ఇకిలిస్తూ ప్రతిదాన్నీ నిశ్శబ్దంగా చూస్తూ....ఈ రోజుకు తినితొంగుటే చాలనుకున్నట్లు ప్రవర్తించడం ఆవేదన కలిగిస్తున్నది. తప్పును తప్పుగా, ఒప్పును ఒప్పుగా మాట్టాడే జనం మృగ్యమైపోయారు. నోరెత్తితే ఎవడో వచ్చి ఏదో చేస్తాడని వీరి వెర్రి భయం. మనకెందుకు శ్రమ అనే నిర్లిప్తత. శాస్త్రీయ దృక్పథానికి చోటులేని మాబ్ కల్చర్ లో మునిగితేలుదామన్న ఈజీ గోయింగ్ ధోరణి.

స్పందించి చచ్చే గుణం లేకపోతేమాయె..నువ్వు Either that side or this side అనే దరిద్రపు రోగం పట్టుకుందీ జనాలకు. మీరు పుట్టింది..ఆంధ్రాప్రాంతంలోనా? అయితే తెలంగాణా వాళ్లను తిట్టాలి...సమైక్య ఆంధ్రా నినాదం చేయాలి. అరె..నువ్వు బుట్టింది...తెలంగాణాలోనా? ఆంధ్రోళ్లను దొంగలనాలి...దోపిడీదార్లనాలి. పండక్కుపోతే...రార్ బై అని ధమ్కీ ఇవ్వాలి. ఇక అంతే....ఒక లాజిక్కు లేదు. మర్యాద లేదు. మానవత్వం లేదు. ఎదుటివాడి మీద ఎందుకో చెప్పరాని పగ, ఆవేశం, అధిపత్యభావం. అన్నిప్రాంతాలలో అన్ని అంశాల్లో ఇదే ధోరణి...ఇదే మృగ స్వభావం. ఎవడైనా లాజిక్ తో నోరెత్తితే...వాడి మీద బండలేసి నోరునొక్కి చంపడం. దాన్ని మిగిలిన జనాలు సానుభూతితో చూడడం. ఛీ...వీళ్లు మనుషులా?

ఇతరేతర మార్కెట్ శక్తులు నడిపిస్తే జనం నడుస్తున్నారు. సొంత సుఖం తప్ప సమష్టి తత్వం మృగ్యమైపోయింది. రాజకీయ రాబందుల రెక్కల చప్పుడు ఒకపక్క, వాటి అక్రమసంబంధంతో పురుడుపోసుకున్న అవినీతి అష్టావక్రుడు మరొకపక్క, పెట్టుబడికి కట్టుకథలకు పుట్టిన విషపుత్రికలు మరొకపక్క జీవితాలను అనుక్షణం ప్రభావితం చేస్తూ ఛిన్నాభిన్నం చేస్తుంటే...మనకెందుకొచ్చిన గొడవని...ఈ చిన్ని నా బొజ్జ శ్రీరామ రక్ష అని ఈ జనం నిర్లజ్జగా బతికేస్తున్నారు. ఎదుటి వాడి వాదన కూడా విని చూద్దాం...అనే ధోరణి మచ్చుకైనా కనిపించడంలేదు.

నాలుగు అక్షరం ముక్కలు వచ్చిన వాళ్లు...వసుధైక కుటుంబం అన్న భావనను దరిదాపుల్లోకైనా రానీకుండా నా కుటుంబం...నా బాంకు బాలెన్సు అంటూ వెర్రెక్కిపోతున్నారు. రిక్షా కార్మికుడు స్పందించకపోతే...పర్వాలేదు. సర్కారు సబ్సిడీలతో చదివి...దాని పుణ్యాన ఉజ్జోగం వెలగబెడుతూ...ఈ సమాజం గురించి పట్టించుకోని బాధ్యతారహితజీవులనేమనాలి?
నిరక్షర కుక్షులు చావలేక భారంగా బతుకుతున్నారు. నిర్వచించడం కష్టమైన మేధావులు బాధ్యత విస్మరించి గిరిగీసుకుని స్వభుజతాడనంతో తృప్తిగా బతికేస్తున్నారు. పెద్ద చదువులు చదువుకున్న వారు...విశ్వవిద్యాలయాలలో భావి భారత పౌరులను తీర్చిదిద్దుతున్నవారు...నిమ్మకునీరెత్తినట్లు ఉంటున్నారు. ఒకడు తెలబాన్లు అంటాడు, మరొకడు...అసెంబ్లీకి పిండప్రదానం అంటాడు. ఎవ్వడూ ఇందేంటనడు. భయం, చచ్చేంత భయం.
సమాజం చంకనాకిపోతోంది. శాంతి....తెలీకుండా మంటగలుస్తోంది. ఒక్కో దుర్ఘటన  జరిగినప్పుడు, దుష్పరిణామం సంభవించినప్పుడు జనం గుండెలు ముక్కలవుతున్నాయి. హృదయాలు చిట్లిపోతున్నాయి. సామాన్య జనం మనోక్లేశాన్ని కొలిచే మెషిన్ ఎవడైనా కనిపెడితే ఆ బీభత్సం తీవ్రత జపాన్ సునామీకన్నా తక్కువేమీ ఉండదు.


An intellectual is a person who uses intelligence (thought and reason) and critical or analytical in either a professional or at a personal capacity అంటారు. ఈ నిర్వచనాన్ని బట్టిచూస్తే...కాస్తంత బుద్ధిపెట్టి ఆలోచించే ప్రతి ఒక్కరూ మేధావే. మరి ఈ మేధావులకేం రోగం వచ్చింది...ఇంత క్లిష్ట సమయంలో. టీవీల్లో వచ్చింది చూసి కుళ్లికుళ్లి చస్తారు తప్ప...ఏమీ మాట్లాడరేం? వీళ్లకు ఒక రీజనింగ్ అనేది ఏడవదా? కొంపకొల్లేరవుతుంటే...వీళ్లకు నిద్ర ఎట్టాపడుతుంది?

ఇప్పటికప్పుడు చూడండి. టాంక్ బండ్ మీద విగ్రహాలను ఉన్మాదులు వేల మంది పోలీసుల సాక్షిగా ఊడబెరికి మురికి కూపంలో వేస్తే....మేధావులారా మీరు నిద్రపోతున్నారా? దీన్ని నిరసించాల్సిన బాధ్యత మీకు లేదా? మనసులు చంపుకుని దీన్ని కూడా మీ ప్రాంతీయ భూతద్దాల నుంచి చూస్తారా? పోనీ మీకు ఆఫీసు జంఝాటం ఉందనుకుంటే...కనీసం ఆదివారం నాడైనా మీరు అదే టాంక్ బండ్ మీద నిరసనకు ఎందుకు కూర్చోలేదు? భాషణ్ మీద ఉన్న అనురక్తి మీకు చేతలమీద లేదే? తెలంగాణా కోసమంటూ అంతమంది ప్రాణాలు తీసుకుంటున్నా...మీకు పట్టదు. రైతులు ఉరేసుకున్నా, చేనేతలు చచ్చినా, మన ఆడపిల్లలను మృగాళ్లు యాసిడ్ తో చంపుతున్నా...మనకు పట్టదు. మన కళ్ల ముందు స్కాంలలో సంపాదించి, దాన్ని ఎన్నికలప్పుడు పంచి చట్టసభలకు ఎన్నికవుతున్నారు. వారి కబంధ హస్తాలలో రాష్ట్రం విలవిలలాడుతుంటే...కుల రక్కసి కోరల్లో చిక్కి జనం చస్తుంటే మనం చేతగాని చవటల్లా జరిగేది జరగనిస్తున్నాం. ఇప్పుడు మనం పొగలా భావిస్తున్నది...ఈ రాజకీయ నేతలు పెట్టిన మంట నుంచి వచ్చినదే కదా? అయినా...మనం మిన్నకుందామా?

సిలికాన్ వ్యాలీలో సంచలనాలు సృష్టిస్తున్నాం. కుబేరులను మన మేధతో మనం తయారుచేస్తున్నాం. అధ్భుతంగా సంపద సృష్టిస్తున్నాం. కానీ సంకుచిత దృష్టిని మాత్రం వదలలేకపోతున్నాం. మేధావులారా...మీరు మేతావులు కాదు. ఆత్మచచ్చిన మనుషుల్లా బతక్కండి. రాష్ట్రం వస్తే వస్తుంది, లేకపోతే లేదు. ఎదుటివాడి ఆవేదనను అర్థంచేసుకోండి. ప్రాంతాలు, కులాలు, స్వార్థం వంటి గజ్జిని మీరు కూడా వంటబట్టించుకుంటే మనకు పుట్టగతులుండవు.
దొంగ నిద్ర నటించకండి. ఈ సమాజంలో మీ గళానికి ఎంతో విలువుంది. మీ అభిప్రాయాన్ని గొంతెత్తి సమాజానికి చాటండి. మన సమాజాన్ని మనమే బాగుచేసుకుందాం. ఈ క్రమంలో చస్తే చస్తాం. నీతిమంతమైన, శాంతియుతమైన సమాజం కోసం మనం పోతే పెద్దగా నష్టంలేదు. నిజానికి మీ conspiracy of silence చావుతో సమానమైనది. లేదంటే..దేశద్రోహంతో సమానమైనది. విద్యావంతులు, మేధావులు ఈ దారుణమైన వ్యవస్థకు వ్యతిరేకంగా చిత్తశుద్ధితో ఒక ఉద్యమం నిర్మించలేనంత దద్దమ్మలా?

Saturday, March 12, 2011

మనం దారి తప్పుతున్నమా? -తిగుళ్ల కృష్ణమూర్తి

నా బతుకు కాపీ బతుకై పోయిందండీ. నిన్నటికి నిన్న 'మనసులో మాట' సుజాత గారి పోస్టు లిఫ్ట్ చేసి మీకు అందించాను. దానికి విపరీతమైన స్పందన కనిపించింది. ఈ విగ్రహాల కూల్చివేత మీద సొంతగా ఒక బిట్ రాద్దామని అనుకుంటూ ఉండగానే...నా సహచర జర్నలిస్టు మిత్రుడు తిగుళ్ల కృష్ణమూర్తి 'ఆంధ్రజ్యోతి' పత్రికలో ఆవేదనతో ఒక వ్యాసం రాసాడు. తనూ నా లాగానే తెలంగాణా ప్రాంతంలో పుట్టి పెరిగినవాడు. నా అభిప్రాయాలు చాలా ఈ వ్యాసంలో ప్రతిబింబించాయి. అందుకే నేను రాయకుండా...ఆ స్టొరీ ని సంగ్రహించి ఇక్కడ ఇస్తున్నాను. కర్టసీ: ఆంధ్రజ్యోతి, థాంక్స్ కే.ఎం.
--------------------------------
గురువారం నడిరాత్రి దాటినాక, డ్యూటీ అయిపోయినా క, రెండున్నర గంటలకు, నేను, నా ఇద్దరు మిత్రులు శాస్త్రి, సుధాకర్, ట్యాంకుబండు మీదికి పోయినం. ఏమున్న దో చూస్తమని, ఎట్లున్నదో చూస్తమని! పాదాలు మాత్రమే మిగిలిన పద కవితా పితామహుడు అన్నమయ్య విగ్రహం దగ్గర, బైకులాపి నిలుచున్నం. అటువైపు పడిపోయిన రెయిలింగ్‌ను జీహెచ్ఎంసీ ఉద్యోగులు కట్టెలతో మళ్లీ కడుతున్న రు. తెగిన వైర్లను సరిచేసేందుకు కరెంటోళ్ల ఎమెర్జెన్సీ వ్యాన్ అటూ ఇటూ తిరుగుతున్నది.

అప్పుడే శవం లేచిన ఇంటి లా, అంత పెద్దరోడ్డు మీదా భయపెట్టే నిశ్శబ్దం! హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపుపోయే మెట్‌పల్లి డిపో బస్సు ఒకటి ఆ దారి గుండా వచ్చింది. బస్సు నడక వేగంతో పోతున్నది. డ్రైవర్ చూపు రోడ్డు మీద లేదు. తనకు కుడి దిక్కు కూలిన విగ్రహాల గద్దెల మీదుంది! బస్సులోని ఒక్కరు కూడా నిద్ర పోలే. కిటికీవైపు ఉన్నోళ్లు, ఆడోళ్లు, మొగోళ్లు తలలు బయటకు పెట్టి చూస్తున్నరు. లేనోళ్లు వాళ్ల పక్కకొచ్చి నిలబడి చూస్తున్నరు. కాలంలాగే బస్సు అలా కదిలిపోయింది. సికింద్రాబాద్ వైపు నుంచి ఒకాయన నల్లటి ఆల్టో కారు లో వస్తూ, విషాదంగా చూస్తూ, చేతిలోని హ్యాండీకామ్‌తో శిథిల దృశ్యాలను బొమ్మలుగా మార్చి దాచుకోవడానికి చూస్తున్నడు. ఎవరు మీరని అడిగితే 'నల్లగొండ' అన్నడు.

అప్పటికే అక్కడికి చేరిన మరొక నడి వయసు మనిషి, గద్దెమీద మిగిలిన కాళ్లు ఎవరివో తెలియక, కింద పడి ఉన్న నేమ్‌ప్లేట్ ముక్కలన్నింటినీ ఒక్కచోటుకు చేర్చి, క్రమ పద్ధతిలో కూర్చి, చూసి చదివి, 'అయ్యో, ఇది అన్నమయ్య దా?' అన్నడు.

ఎవరమూ ఏమీ మాట్లాడలే! అట్లానే చూసుకుంటూ ముందుకు పోయినం. మాట్లాడుకునే పరిస్థితి లేదు. నేనేం చెప్పినా వాళ్లు పూర్తిగా నమ్మేటట్టు నాకు కనిపించలేదు. వాళ్ల అభిప్రాయాన్ని నాతో మనస్ఫూర్తిగా పంచుకుంటరనీ అనిపించలేదు. ఎన్నేళ్ల స్నేహం ఉంటేనేం?! ఇప్పుడు నేను తెలంగాణ. వాళ్లు సీమాంధ్ర! మొట్టమొదటిసారి నాలో ఒక అపరాధ భావన.

తెల్లారి పొద్దునే లేవంగనె, తెలంగాణ కంచుకోట సిద్దిపేటకు చెందిన, కరడుగట్టిన తెలంగాణవాది కూడా అయి న నా భార్య, ఆంధ్రజ్యోతి తెచ్చిస్తూ, కోదండరాం బొమ్మ ను చూసి, 'ఇంగ ఏం ప్రతిజ్ఞ చేసిండ్రట వీళ్లు? ఇంత పిచ్చి పని చేసి?!' అంటూ పేపరును విసురుగా పారేసింది. సెల వు రాంగనె ట్యాంకుబండు మీది నుంచి విగ్రహాలు చూసుకుంటూ పోదమని లొల్లిజేసే, జై తెలంగాణ నినాదం చేయకుండా రోజు గడపని నా కొడుకులిద్దరూ, వరంగల్ జిల్లాలోని మా సొంతూరి నుంచి ఫోన్ చేసి, 'నాన్నా.. ట్యాంకుబండు మీద విగ్రహాలు కూల్చేసిండ్రట కద!' అన్నరు.

నేనేం జవాబు చెప్పలే! పదమూడేళ్ల లోపు పిల్లలకు చెప్పేందుకు నా దగ్గర జవాబు కూడా ఏమీ లేదు. ఎందుకిలా జరిగిందో తెలుసుకుందమని టి.ఆర్.ఎస్. పొలిట్‌బ్యూరోలోని నా మిత్రుడికి ఫోన్ చేస్తే, ఆయన నోట కూడా... 'జరగకూడనిది జరిగింది' అనే మాటే. 'గవెందుకయ్యా పడగొట్ట డం? ఏమొస్తది!' నా కారు తుడిచే సోమయ్య తాత ప్రశ్న ఇది. నేను మాట్లాడిన ఎవరిలోనూ నాకు విజయగర్వం కనిపించలె. మంచి పని చేసిండ్రనే మాట వినిపించలె.

మరి ఎందుకు చేసిండ్రీ పని? తెలంగాణది తెలుగు భాష కాదా? ప్రాచీన తెలుగు కవులు మనవాళ్లు కారా? భాగవతోత్తముడైన పోతన మనవాడైనపుడు, మహా భార త కవిత్రయం నన్నయ, తిక్కన, ఎర్రన మనవాళ్లు కాకుం డాపోయారా? అన్నమయ్య, వేమన్న, జాషువా, శ్రీశ్రీలకు మన పంచాయితీతో ఏం తకరారు? విగ్రహాలు కూల్చాలనే అనుకుంటే, తెలంగాణతోపాటు యావత్ రాష్ట్ర ప్రజానీకాని కీ ద్రోహం చేసిన మహా రాజకీయ నాయకుల విగ్రహాలు హైదరాబాద్‌లో ఎన్నిలేవు? మరి మహనీయుల విగ్రహాల ను ఎందుకు టార్గెట్ చేసిండ్రు? హైదరాబాద్‌పై హక్కు కోరుతూ, తెలంగాణకు అడ్డుపడుతున్న సీమాంధ్రులను భయభ్రాంతులకు గురిచేసి, స్వచ్ఛందంగా క్లెయిమ్‌ను వదులుకునేలా చేసేందుకా? వెళ్లిపోతామనో, తెలంగాణ ఇచ్చేయండనో వారి నోటితోనే అనిపించేందుకా? కేంద్రం ఇంకా తెలంగాణ ఇస్తలేదనే అసహనంతోనా?

తెలంగాణ ఇవ్వరేమోనన్న ఫ్రస్టేషన్‌తోనా? తెలంగాణ వైతాళికులకు ట్యాంకుబండు మీద తగినంత ప్రాధాన్యం దక్కలేదన్న ఆవేశంతోనా? అందుకు ఇదా మార్గం? ఇదేనా మార్గం? ఇలాం టి విధ్వంసాల తెలంగాణనా మనం కోరుకుంటున్నది? తెలంగాణ కోసం 600 మంది ప్రాణాలే పోయినపుడు, విగ్రహాలు పోవడం ఒక లెక్కా అంటరా? 600 మంది తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి, మరో 50 ఏళ్లైనా చావని తెలంగాణవాదానికి చెక్కుచెదరని పునాదులేసిం డ్రు. మరి విగ్రహాలు కూల్చిన వాళ్లు ఏం సాధించిండ్రు! విషాదమూ, విద్వేషమూ తప్ప!! విధ్వంసాన్ని అనుమతిం చి, ఉద్యమాన్ని అప్రతిష్ఠపాల్జేసే కుట్ర ఒకటి ఎప్పుడూ పొంచి ఉందే వాస్తవాన్ని ఇప్పుడెందుకు విస్మరించిండ్రు? మనసు నిష్టూరంగా ఉన్నా, మనసుకు కష్టమైనా ఒక ప్రశ్న మాత్రం మెదడు తొలుస్తున్నది.

మనం దారి తప్పుతున్నమా? నిర్ణయాల్లో పరిణతి లోపిస్తున్నదా? యుద్ధంలో అవసరమైపుడు ఒక అడుగు వెనక్కువేసి, ఆ తర్వాత నాలుగడుగులు ముందుకు దూకి, అంతిమ విజయం సాధించాలనే వ్యూహ చైతన్యం లోపిస్తున్నదా? రాజకీయ నాయక త్వం చేతిలో దాదాపు 11 ఏళ్లు ప్రశాంతంగా, కన్విన్సింగ్ గా, తెలంగాణవాదన, వేదన సబబే అని సీమాంధ్రులను సైతం ఒప్పించేటట్టుగా సాగిన ఉద్యమం బహునాయకత్వంతో దారి తప్పుతున్నదా?

రాజకీయ ప్రయోజనాల దృష్టితో, ఒకరికంటే ఒకరు ముందుండాలనే రేసులో, ఎవరి మాట ఎవరు వినాలనే జిద్దులో, ఒకరు కాదంటే తాము ఔనని తీరాలనే మంకుపట్టు వ్యవహారంలో తేడా చేస్తున్న దా? ప్రజాస్వామిక తెలంగాణ అంటూనే, భిన్నాభిప్రాయం వ్యక్తం చేయడానికి భయపడే, భయపె ట్టే, ఏకపక్ష ధోరణి, నిర్ణయాల రుద్దుడు జరుగుతున్నదా? ఒకసారి సమీక్షించుకుందాం.

ప్రభుత్వం చేతిలో జీతం అనే అస్త్రం ఒకటి ఉంటుందనీ, 80 శాతం మంది తెలంగాణ ఉద్యోగులు జీతం లేకుండా నెల గడపలేరని తెలిసీ, సహాయ నిరాకర ణ మొదలుపెట్టి, ఒకటో తారీఖు రాగానే ఉద్యోగుల ఒత్తిడి కి తట్టుకోలేక, అర్ధాంతరంగా విరమించడం అభాసుపాలు కావడం కాదా? ఉద్యోగుల సహాయ నిరాకరణతో అంతిమంగా నష్టపోయింది తెలంగాణ ప్రజలు కాదా? తెలంగా ణ సహాయ నిరాకరణ కేవలం ఉద్యోగుల సహాయ నిరాకరణగా మారిపోవడం నిజం కాదా?

గ్రూప్-1, ఎస్సై, పీజీ, డిగ్రీ, ఇంటర్... అది ఏదైనా... పరీక్షల వాయి దా కోరడం, పదేపదే కాలేజీలు మూయించడం, ఒకసారి కిందపడితే లేవలేని ప్రస్తుత పోటీ యుగంలో, తెలంగాణ పిల్లల భవిష్యత్తును పణంగా పెట్టడం కాదా? పేరు కోసమో, ప్రతిష్ఠ కోసమో, ఎవరు పడితే వారు, డజను మంది కలిసి, జేఏసీ పేరు పెట్టుకుని, కాలేజీ పిల్లలను రోడ్డుమీదకు పంపండని ఏకపక్ష ఆదేశాలు జారీచేయడం తప్పు కాదా? రెక్కాడితేగాని డొక్కాడని లక్షలాది బడుగుజీవుల మీద, చిన్నకారు వ్యాపారుల మీద బంద్ మీద బందు రుద్దడం పొట్టగొట్ట డం కాదా?

క్షేత్రస్థాయిని నిశితంగా పరిశీలించినపుడు, రెండు రకా ల సంఘర్షణలు జరుగుతున్నట్టు అనిపిస్తున్నది. ఒకటి సమైక్యాంధ్ర కోరుకుంటున్న రాజకీయ నాయకులకు, ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటున్న తెలంగాణ వాదులకు మధ్య అయి తే, మరొకటి తెలంగాణ ఉద్యమ నాయకులకు, తెలంగాణ ప్రజలకు మధ్య! తెలంగాణపై ఎంతటి అభిమానమున్నా, ఎప్పుడు వస్తుందో, అసలు వస్తుందో రాదో, ఇస్త రో, ఇవ్వని రాష్ట్రం కోసం తక్షణ వ్యక్తిగత ప్రయోజనాలను, పిల్లల చదువును పణంగా పెట్టలేమన్నది సహాయ నిరాకరణకు 'సహా య నిరాకరణ' ద్వారా తెలంగాణ ప్రజలు ఇచ్చిన సందేశంలా కనిపిస్తున్నది.

గుర్రం దాహంతో లేవలేకుండా ఉన్నది. చెరువులో నీళ్లున్నాయి. చెరువులో నీళ్లను గుర్రం దగ్గరికి తెచ్చే ఉపాయం ఆలోచించాలిగానీ, నోరు పిడచకట్టుకు పోయిన లేవలేని గుర్రాన్ని, ఉరుకురుకు మంటూ బాదితే లాభమేముంది? ఢిల్లీలో ఇనుము ఇంకా తగినంత వేడెక్కలేదు. మేదాకా వేడెక్కేట్టు లేదు. వేడి చేసే కొలిమి వేరే దగ్గర ఉంది. దాన్ని వదలి జనాన్ని గెదిమితే ఎవరికి ఉపయోగం? మనల్ని మనం శుష్కింప జేసుకుంటే, ఆత్మార్పణలు చేసుకుంటే, అష్టకష్టాలు పడితే, అయ్యో పాపం అని మన సు కరిగే, మంచి చేసే స్వాత్రంత్య సమరం నాటి రోజులు కావివి.

తోటి ప్రజలను హింసించి, భయభ్రాంతులకు గురిచేసి మనం అనుకున్నది సాధించగలిగే కాలం కూడా కాదిది. నిజానికిప్పుడు అక్కడా, ఇక్కడా ప్రజల చేతుల్లో ఏమీ లేదు. అంతా రాజకీయంలో ఉంది. కేసీఆర్ ఏనాడో చెప్పినట్టు తెలంగాణ సాధించడానికి ఒకే మార్గం. అది రాజకీయ లాబీయింగ్- సీమాంధ్రులతో విన్-విన్ సంబంధాలు! నొప్పించడం ద్వారా కాదు; ఒప్పించడం ద్వారా తెలంగాణ సాధించుకుందాం. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాల్లో ప్రజల మధ్య చిచ్చుపెట్టడం, తాత్సారం చేసి రావణ కాష్ఠాల్లా మండించడం కాశ్మీర్ నుంచి పంజాబ్‌దాకా కాంగ్రెస్‌కున్న అలవాటు.

అదే ఇప్పుడు తెలంగాణలో పునరావృతమవుతున్నది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం మెడలు వంచడమే సమస్యకు పరిష్కారం. అందుకు రాజకీయ సంక్షోభాన్ని సృష్టించడం, అవసరమైతే అక్కడా ఇక్కడా ప్రభుత్వాలను పడగొట్టడం, ఆ మేరకు కాంగ్రెస్‌పై ఒత్తిడి తేవడం, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసేలా, ఆ స్థానాలకు తెలంగాణ వచ్చేదాకా మళ్లీ ఎన్నికలే జరగకుం డా, జరిపినా ఎవరూ పోటీ చేయకుండా చూడడం ఇదే ఇప్పుడు ఏకైక మార్గం.

తెలంగాణలో జరుగుతున్న ఉద్యమాన్ని కేంద్రానికి చేరవేయడానికే పదవుల్లో కొనసాగుతున్నామనే కుంటిసాకులు, కల్లబొల్లి పేపర్ టైగర్ కబు ర్లు ఇక చాలించండి. లక్షలాది మంది తెలంగాణ చిన్నారులు పరీక్షలు రాయకుండా, తమ జీవిత భవితవ్యాన్ని ఉద్యమానికి అర్పించాలని బలవంత పెడుతున్న తెలంగాణ రాజకీయ, ఉద్యమ నాయకుల్లారా! మళ్లీ గెలిపిస్తామని యావత్ తెలంగాణ ప్రజలు ముక్తకంఠంతో భరోసా ఇస్తున్నా,

(మూడున్నరేళ్ల) పదవీ పీఠాన్ని త్యాగం చేయడానికి మీరెందుకు సిద్ధపడరు? లేస్తే మనిషిని కాదన్న ట్టు, చేస్తాం చేస్తాం అని గడువులు పెంచుకుంటూ పోవ డం తప్ప, నాడు సీమాంధ్ర నాయకులు ఎడమ చేత్తో ఎంగిలాకులు పారేసినట్టుగా, తెలంగాణ నాయకులు పార్టీలకు అతీతంగా, కలసికట్టుగా నేడు రాజీనామాలు ఎందుకు చేయరు? రాజీనామాలు చేస్తే తెలంగాణ వస్తుందా అంటారా? మరి పదవుల్లో ఉంటే వస్తుందా? అదే నిజమైతే ఇంకా ఎందుకు రాలేదు? నాయకులు ఏం నష్టపోతున్నారో తెలియదు.

జనం మాత్రం నష్టపోతున్నారు. ఎవడి బతుకు వాడు బతుకుతున్న తెలంగాణ ప్రజలను, మీ భవిష్యత్తు కోసం నాశనం చేయకండి.. ఒకరిమాట మరొకరు విని, కలసి నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో రాజకీయ నాయకులు లేనపుడు, వారి మాటను, పిలుపును జనం ఎందుకు వింటరు? ఎందుకు వినాలి? తెలంగాణ ప్రజలు ప్రాణార్పణంతో సహా ఇప్పటికే అనేక త్యాగాలు చేశారు. ఇక త్యాగాలు చేయాల్సింది అధికార సౌధాల్లో భవిష్యత్తును అనుభవించాలనుకుంటున్న పార్టీ ల నాయకులే!

Friday, March 11, 2011

ఆ విగ్రహాలకు ప్రాణం లేదా?: ఒక బ్లాగర్ ఆవేదన

టాంక్ బండ్ మీద విగ్రహాలను 'మిలియన్ మార్చ్' నిరసనకారులు ధ్వంసం చేసారన్న వార్త నాకూ గుండెలో ముల్లులా దిగబడింది. ఇది నిజంగా ఉద్యమానికి ఉపకరించే పనేనా? శ్రీ శ్రీ కొటేషన్లు లేకుండా  ఉద్రేకపూరిత ప్రసంగం చేయలేని వారు...ఆయనకు కూడా ప్రాంతం ఆపాదిస్తే? అమృతం లాంటి తెలుగుకు అంతటి గౌరవం తెచ్చిపెట్టిన వారి విగ్రహాలను అలా పెకళించి మురికి హుస్సేన్ సాగర్ లో తోసేస్తారా? మన మతిమాలిన చర్యలతో ఇపుడు తెలుగు నెల మీద భారత్-పాకిస్తాన్ సరిహద్దు పరిస్థితి సృష్టిస్తే చివరకు మిగిలేది బూడిదే. నాడు-నేడు అంటూ...ఫోటోల ద్వారా భావావేశాలు రెచ్చగొట్టాలని చూసిన 'ఈనాడు' పత్రిక ఉన్మాదం కూడా అంతే ఖండించదగినది.  

ఆ ఆగ్రహానికి అర్థం ఉండవచ్చు కానీ....పధ్ధతి మాత్రం ఇది కాదు. ఆ రోజున ఆ ప్రకటన చేసిన చిదంబరం, చేయించిన సోనియా, మన్మోహన్ లను ఏదైనా చేయండి గానీ...తెలుగు ప్రజలు మురిపెంగా చూసుకుని గర్వపడే  విగ్రహాల మీద దాడి ఏమి సమంజసం? తెలంగాణా కోసం నా తమ్ముళ్ళు, అన్నలు బలిదానం చేసినప్పుడు ఎంత బాధ వేసిందో...విగ్రహాల కూల్చివేత కూడా అంతే ఆవేదన మిగిల్చింది. ఈ విగ్రహాలలో ప్రాణం ముమ్మాటికీ ఉంది సార్.
విగ్రహాల కూల్చివేత మీద 'మనసులో మాట' బ్లాగర్ గారు రాసిన పోస్టును సంగ్రహించి ఇక్కడ అందిస్తున్నాను.
--------------------------------------------------------------------------
"టాంక్ బండ్ మీది విగ్రహాలను ధ్వంసం చేసేస్తున్నారు! కృష్ణ దేవరాయల విగ్రహాన్ని విరగ్గొట్టి హుసేన్ సాగర్ లో పడేశారు" అని ఒక ఫ్రెండ్  నుంచి ఫోన్ రాగానే గుండె నిజంగానే ఆగిపోయింది.  వెంటనే టివి పెట్టాను. 

గద్దర్ నిన్న సాయంత్రం టీవీలో మాట్లాడిన మాట విని కళ్ళలోంచి వచ్చింది హృదయం ఛిద్రమై కారిన రక్తమే!

"ఆ విగ్రహాలకు ప్రాణముంటదా? పోతే మళ్ళీ పెట్టుకోవచ్చు"

మళ్ళీ పెట్టుకునే అవకాశం ఎలాగూ లేదని తెలుసు! కానీ విగ్రహాలకు ప్రాణముంటదా అంటే?

ఉండదా? ఆ విగ్రహాలకు ప్రాణమే కాదు,  తెలుగు ప్రజల ఆత్మ ఆ విగ్రహాల్లో ఉంది. తెలుగు ప్రజల సంస్కృతిని నిర్వచించి, తెలుగు జీవితాల్ని సంస్కరించి తెలుగు జీవనంలో వెలుగులు నింపిన వైతాళికులు వాళ్ళు! అందుకే ....అందుకే ఆ విగ్రహాల్లో మా అందరి ఆత్మ ఉంది. నిన్న ధ్వంసం చేసింది కేవలం విగ్రహాలని కాదు, కోట్లాది తెలుగు ప్రజల ఆత్మలను, ప్రేమని,భక్తిని,గౌరవాన్ని, హృదయాలను!
గుర్తించండి విధ్వంస కారులారా గుర్తించండి!
సిద్ధేంద్ర యోగికీ,ఎర్రాప్రగడకీ,శ్రీకృష్ణ దేవరాయలకీ ప్రాంతీయతను అంటగట్టి వారి ప్రతిమల్ని ధ్వంసం చేసిన ఉన్మాదులారా....గుర్తించండి! తెలుగు గుండె ఘోష గుర్తించండి!

కాంగ్రెస్ ని ఎదిరించి నిలబడ్డ ఒక్క మగాడు NTR ఆ విగ్రహాలను పెట్టించినందుకు ఆయనకు  తెలుగు జాతి అంతా ఋణపడి ఉండాలని అనుకుంటూ ఉండేదాన్ని! టాంక్ బండ్ మీద వెళుతుంటే కావాలని నెమ్మదిగా వెళుతూ ప్రతి విగ్రహాన్నీ ఇప్పటికీ ఎంతో అబ్బురంగా చూస్తాను. మొదటి సారి ఎనిమిదో తరగతి  సెలవుల్లో వాటిని చూడ్డానికి వెళ్ళినపుడు నన్నయ విగ్రహం చూడ్డానికి పరుగెడుతుంటే "నన్నయ దగ్గరికి చెప్పుల్తో వెళ్తార్టే?" అని నాన్న పెట్టిన కేక మనసులో అలా ఉండిపోయిందేమో ఆ తరవాత ఎన్ని సార్లు వెళ్ళినా అప్రయత్నంగా చెప్పులు విడిచి మరీ వెళ్ళి కూచుంటాం మేము!
కృష్ణ దేవరాయలు, బ్రహ్మనాయుడు విగ్రహాల్లో తన పోలికలు వచ్చేట్లు NTR చెక్కించుకున్నట్లు అప్పట్లో గుసగుసలొచ్చాయిట. అవును, ఆ ఇద్దరి రూపాలూ మాకు NTR తోనే పరిచయం! వాటిల్లో ఆయన పోలికలు లేకపోతే నిరాశ పడేవాళ్ళం!  
ఒక అంబేద్కర్ విగ్రహానికో, రాజశేఖర్ రెడ్డి విగ్రహానికో వేలో కాలో విరిస్తేనో,చెప్పుల దండ వేస్తేనో ఎందుకు గర్హిస్తాం? ఎందుకు "పాలాభిషేకాలు" చేసి పవిత్రీకరిస్తాం? ఆ విగ్రహాల్లో ప్రాణం ఉందని నమ్మబట్టేగా? ఆయా వ్యక్తుల పట్ల ప్రేమ గౌరవం ఉంటుంది కాబట్టేగా? మరి విగ్రహాలకు ప్రాణం ఉంటదా అని ఏ ధైర్యంతో, ఏ హక్కుతో అడుగుతున్నాడో గద్దర్ నాకు అంతుపట్టడం లేదు.

నిజమే! నా ప్రశ్నలోనే జవాబుంది. ఆయా వ్యక్తుల మీద ప్రేమ, గౌరవం ఉండాలి.వాళ్ళు ఎవరో, వారి సాహిత్యంతో తెలుగు ప్రజల జీవితం ఎంతగా పెనవేసుకుపోయిందో,వారి సంస్కరణలతో ఎన్ని లక్షల జీవితాల్లో వెలుగు నిండిందో,తెలుగు జనజీవితంతో వారెలా మమేకమయ్యారో,మరణించినా  మా గుండెల్లో ఎలా అమృత మూర్తులై  కొలువున్నారో......ఇవన్నీ వాళ్ళకు, ఆ ఉన్మాదులకు తెలీదు..అర్థం కాదు! అర్థం చేసుకోరు!
నన్నయ మిమ్మల్నేం  చేశాడు? జాషువా ఏం చేశాడు? లాంటి ప్రశ్నలు మిమ్మల్ని అడగను. వాళ్ళు ఎవరో, తెలుగు జాతికి వారికి ఉన్న అనుబంధం ఏమిటో మీకు తెలీదు. మీ దృష్టిలో వాళ్ళ గుర్తింపు కేవలం సీమాంధ్రులుగానే కదా! ఎలా అడుగుతాను?
శ్రీ శ్రీ కాళ్ళు విరగ్గొట్టి కూల్చేస్తారు. కృష్ణదేవరాయలని, ఎర్రాప్రగడని,బ్రహ్మనాయుడిని మురుక్కాలవలో పారేస్తారు,వేమన నోటికి ప్లాస్టర్ వేసి మెళ్ళో గులాబీ జెండా వేస్తారు.

దీనివల్ల ఆ వైతాళికులకు తగిన శాస్తి జరిగిందనో,సీమాంధ్రులను అవమానించామనో మీరు సంతృప్తి పడొచ్చు! కానీ మీరు చేసింది ఒక్కటే...

నడి వీధిలో మీ సంస్కృతిని మీరు నగ్నంగా నిలబెట్టి నిర్వచించారు!
మీరేమిటో  ప్రపంచానికి చాటారు !
మీ సంస్కారాన్ని బట్టలు విప్పి టాంక్ బండ్ మీద ఊరేగించారు.  !
మీ అంతిమ  లక్ష్యమేమిటో చూపించారు.మీరు హుసేన్ సాగర్లో వేసింది కేవలం విగ్రహాలను కాదు, తెలుగు ప్రజల ఆత్మని!
తెలుగు వెలుగులారా..! క్షమించండి! 
తన ముద్దు బిడ్డలకు పట్టిన గతి చూసి అల్లంత దూరాన ప్రభుత్వ భవనం ముందు.... నోట్లో చెంగు కుక్కుకుని గోలుగోలున ఏడుస్తున్న తెలుగు తల్లి సాక్షిగా
మేము...చచ్చిపోయాం!
మా రక్తంలో వేడి చల్లారిపోయింది.
మిమ్మల్ని కాపాడుకోలేక ఇళ్ళలో టీవీల ముందు కూచుని కళ్ళు తుడుచుకున్నాం! 
 NTR.... క్షమించు మమ్మల్ని! 
తెలుగు ఆత్మగౌరవం నినాదాన్ని నువ్వు వినిపించినా, దాన్ని ఇవాళ మేము నినదించలేకపోయాం! ........
ఆత్మలు చచ్చిన వాళ్లకు గౌరవం ఎందుకని!
 పోలీసుల సాక్షిగా సాగిన దమనకాండ ని చూస్తూ కృష్ణ దేవరాయలకు,బ్రహ్మనాయుడికి హుసేన్ సాగర్ నీళ్లతో తర్పణాలు విడిచాం!
మహనీయులను సదా స్మరించుకునే అవకాశం నువ్విచ్చినా మేము నిలుపుకోలేకపోయాం!
ఎముకలు కుళ్ళి,శక్తులు చచ్చిన వాళ్ళం...క్షమించు

Thursday, March 10, 2011

సోంపేట దగ్గర సముద్రుడి హొయలు...అరకులోయలో థింసా

నా పెళ్లిరోజు అయిన మార్చి రెండు మర్నాడు కొందరు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్ధులను  వెంటబెట్టుకుని ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లాను. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో విపరీతంగా తిరిగాను. అక్కడ థర్మల్ పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారిని పలువురిని కలుసుకుని మేము నిజనిర్ధారణ చేసుకున్నాం. 

అప్పట్లో పోలీసు ఫైరింగ్ జరిగిన సోంపేట, మొన్నీమధ్య మళ్ళీ కాల్పులు జరిగి ఇద్దరు బలైన కాకరాపల్లి వెళ్లి చాలా విషయాలు తెలుసుకున్నాం. సోంపేట దగ్గర ఈ రోజుకూ ప్రజల సత్యాగ్రహం జరుగుతున్నది. అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బతుకుతున్నారు. తమ ఇళ్ళలో మహిళల మీద చేయి చేసుకున్న పోలీసులపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అరకులో ఒక బగత తెగ వారి ఇంట్లో పెళ్లి కూడా చూసాము, జీలుగు కల్లు లాగించాము. తేలినీలాపురం అనే గ్రామంలో సైబీరియా నుంచి వచ్చే పక్షులను, వాటికి-గ్రామస్థులకు ఉన్న బంధాన్ని చూస్తే ముచ్చటేసింది. ఇలాంటి కొన్ని వివరాలను ఒక పత్రికలో ఎలాగూ రాస్తాను కాబట్టి...ఆటలో అరటిపండుగా ఈ రెండు చిత్రాలు పోస్ట్ చేస్తున్నాను.  
 
ఇందులో ఈ పైది  సోంపేట దగ్గర సముద్ర తీరంలో ...మియామి లో మాదిరిగా అదే టీ-షర్టు తో పోజిచ్చి బ్లాగులో పోస్టు చేయడం కోసం ప్రత్యేకంగా దిగాను. ఇక రెండోది ఆదివారం సాయంత్రం అరకులో గిరిజనులతో ధింసా డాన్స్ వేస్తున్నది. చూసి ఆనందించండి. ఈ టూర్ లో ఒక సీనియర్ బ్లాగర్ గారిని కలిసాను కానీ...వారి అభ్యర్ధన మేరకు వారి గురించి నేను ఏమీ రాయకూడదని నిర్ణయించుకున్నాను. ఈ టూర్ ముగించుకొని....మా అమ్మాయి మైత్రేయి బర్త్ డే అయిన 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం' నాడు తిరిగి ఇంటికి చేరుకున్నాను.

Wednesday, March 9, 2011

మా మిత్రుడు ఇప్పుడు.... డా.జయదేవ రెంటాల

 ప్రముఖ జర్నలిస్టు, నా మిత్రుడు రెంటాల జయదేవకు డాక్టరేట్ ప్రదానం చేసారని ఒక మిత్రుడు మెయిల్ పంపితే గానీ తెలియలేదు. ఐదు రోజుల ఉత్తరాంధ్ర పర్యటన వల్ల నేను ఇలాంటి విషయాలు తెలుసుకోలేక పోయాను.  జయదేవ దిగ్విజయంగా పీ.హెచ్.డీ.పూర్తి చేయడం నాకు ఆనందం కలిగించిన విషయం. బుర్ర బద్దలయ్యే పని ఒత్తిడి, వేధించి విసిగించి బుర్రతినే జనం, తప్పని కుటుంబ బాధ్యతలు- వీటి మధ్యన అధ్యయనం చేయడం పెద్ద భారమైన వ్యవహారం. వృత్తిలో ఉంటూ పీ.హెచ్ డీ చేయడం  అంత తేలికైన విషయం ఏ మాత్రం కాదు. నేను ఆ పనిలో ఐదేళ్ళ నుంచి కుక్క చావు చస్తున్నా.

జయదేవ 'ఈనాడు జర్నలిజం స్కూల్' లో  నాకు మంచి మిత్రుడు. చెన్నై వెళ్ళినప్పుడు ఆతిథ్యం ఇచ్చేవాడు. 'ఈనాడు' లో మొదట, 'ఇండియా టుడే' లో ఇప్పుడు పనిచేస్తున్న తాను ఈ డాక్టరేట్ విషయం నా లాంటి నలుగురు మిత్రులతో పంచుకోవడానికి సైతం సిగ్గుపడే గడసరి. అందుకే కనీసం తనకు నేరుగా అభినందనలు తెలియజేయకుండా...బ్లాగ్ లో ఒక పోస్ట్ రాస్తున్నాను. మేమందరం గర్వపడే వీడు రెంటాల గోపాలకృష్ణ గారి పుత్రుడు, రెంటాల కల్పన గారి తమ్ముడు. తన జర్నలిస్టు జీవిత గమనం గురించి నా మెయిల్ కు వచ్చిన ఒక పరిచయ పత్రాన్ని దిగువున ఇస్తున్నాను. 

ఎప్పుడూ కిలకిలా నవ్వుతూ, ప్రతి విషయంలో భయంకరంగా ఆచితూచి అడుగువేసే, చాలా విషయాల్లో 'మనకు ఎందుకొచ్చిన గొడవలే బాబూ...' అని తప్పుకునే జయదేవ అంటే మా బ్యాచులో చాలా మందికి ప్రేమ, గౌరవం. పై ఫోటోలో ఉన్నది జయదేవే. ఈ కింది ఫోటో: గవర్నర్ సుర్జిత్ సింగ్ బర్నాలా నుంచి మార్చ్ ఐదున చెన్నైలో తను పట్టా తీసుకుంటున్న దృశ్యం.
కంగ్రాట్స్ బ్రదర్. నాకన్నా ముందు నువ్వు డాక్టరేట్ కొట్టేసావ్...రాము