Sunday, February 28, 2010

డోలాయమానంలో జర్నలిస్టు జీవితం (సండే స్పెషల్)

విలేకరి అంటే పోలీసుకు కోపం, రాజకీయ నాయకుడికి పరాచకం, అధికారికి అసహ్యం. అందరూ విలేకరిని ఆడిపోసుకుంటున్నారు. వారిపట్ల కనికరం లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారు. (చాలా సందర్భాలలో) నిజాలను వెలికి తెచ్చే విలేకరి అందరికీ కరివేపాకుతో సమానం--యాజమాన్యాలకు కూడా.

నిజానికి జర్నలిస్టుల జీవితాలు మున్నెన్నడూ లేనంత డోలాయమానంలో ఉన్నాయి. ప్రొఫెషనలిజం ఏ మాత్రం లేని బ్లాక్ మనీ యాజమాన్యాలు... ఏకవ్యక్తి స్వామ్యం... నీతీ జాతి లేని  అబద్ధాల సీ.ఈ.ఓ.లు... కనికరం-డొక్కశుద్ధి లేని బాస్ లు... సరుకు లేకపోయినా మస్కా కొట్టి, బూట్లు నాకి పదవులు కొట్టేస్తూ మంచోళ్ళకు పొగబెట్టే నకిలీ జర్నలిస్టులు. ఈ విషవలయంలో చిక్కి నీతీ నిజాయితీతో జర్నలిజం సాగించాలనుకుంటున్న వారికి మున్నెన్నడూ లేనంత ఇబ్బంది ఉంది. మిగిలిన వారి సంగతి ఎలావున్నా...పెద్ద పదవుల కోసం 'ఈనాడు' గ్రూప్ నుంచి బైటికి వచ్చి వివిధ ఛానెల్స్ సరసన చేరిన జర్నలిస్టులు చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. వారిది ఎవ్వరికీ చెప్పుకోలేని మూగవేదన.

ఒకప్పుడు రామోజీ రావు గారి కుడి భుజాలుగానో, అత్యంత సన్నిహితులుగానో  ఉన్నవారు ఇప్పుడు టీ.వీ.ఛానెల్స్ లో పెద్ద పదవుల్లో ఉన్నారు.  ఏదో కులం, గోత్రం చెప్పుకొని ఏదో ఒక పార్టీ కొమ్ముకాస్తూ లక్షలు ఆర్జించే బ్యాచ్ కు రోజులు బాగున్నాయి కానీ....ఇతరులు..."ఎందుకు వచ్చాంరా బాబు..." అని అనుకుంటున్నారు.   

"నువ్వు ఎన్నైనా చెప్పు... రామోజీ రామోజీ నే. ఈ ఎదవలతో (అంటే..ఛానెల్స్ యజమానులు) ఆయన్ను పోల్చలేము," అని 'ఈ-టీవీ' నుంచి బైటికి వచ్చి ఒక మూడు ఛానెల్స్ మారిన ఒక సీనియర్ జర్నలిస్టు మొత్తుకుంటూ ఉంటాడు. డే టు డే జర్నలిజం లో రామోజీ వేలు పెట్టరనీ, దానికి భిన్నంగా ఈ యజమానులు ప్రతి వార్తలో వేలుపెట్టాలని చూస్తారని వీరు చెబుతున్నారు. పైగా వీరంతా బూతు కోసం వెంపర్లాడుతుంతారని చెబుతారు. 

HM-TV, Zee-TV లలో సీనియర్ ఉద్యోగులు పెద్దగా నసగడం లేదు. కారణం...యాజమాన్యాలు కాకుండా...అక్కడ రామచంద్ర మూర్తి గారు, ఇక్కడ శైలేష్ రెడ్డి గారు వ్యవస్థలు నిర్వహిస్తున్నారు. ఇద్దరూ హృదయం ఉన్న జర్నలిస్టులు. i-news లో కందుల రమేష్ గారు ఉన్నా...ఆ యాజమాన్యం ఒక గందరగోళంలో ఉంది. N-TV లో కూడా నికార్సైన జర్నలిస్టులు ఉన్నారు కానీ...పాపం ఉద్యోగ భద్రత లేక బిక్కుబిక్కున బతుకుతున్నారు. బూతు మీద బతికే TV-9, TV-5, ABN- ఆంధ్రజ్యోతి గురించి ఆదివారం పూట అనుకోవడమే పాపం. అక్కడ పనిచేసే నికార్సైన జర్నలిస్టులు ఇబ్బంది పడుతున్నారు.  యాడ్స్, సినిమాలలో ప్రవేశం ఉన్న రామ్ రెడ్డి గారు 'సాక్షి' లో కీలక భూమిక పోషిస్తున్నారు. ఆయనదంతా...వినూత్న పోకడ. ఈ మధ్యనే అక్కడ చేరిన స్వప్న మంచి జర్నలిస్టు గానీ...ఒక రాజకీయ ఛానల్ లో ఆమె ఏమి చేయగలరు?  


ప్రొఫెషనలిజం, జీతాల చెల్లింపు, ఆడ వాళ్ళతో వ్యవహరించే తీరు...అన్నీ వివిధ ఛానెల్స్ లో భిన్నంగా ఉండడం కొందరు మాజీ 'ఈనాడు' వారికి రుచించడం లేదు. అయినా ఏమీ చేయలేని దుస్థితి. "ఈ దరిద్రులు...దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఉద్యోగాలు పీకి పారెయ్యడంలో వీరికి కనికరం, దయ, జాలి లేనే లేవు. మా పరిస్థితి చాలా అనిశ్చితిలో ఉంది," అని మరొక సీనియర్ వాపోయాడు. 

మరి 'ఈ-టీవీ' నుంచి TV-9, I-News లలో పనిచేసిన యాన్డ్రపు రాజశేఖర్ పరిస్థితి బాగానే ఉంది కదా అంటే...ఒక సీనియర్ ఒక నవ్వు నవ్వాడు. 
మొత్తం మీద...నిజాయతీగా ఉండే జర్నలిస్టులకు ఏమవుతున్నదంటే...వీరు వృత్తిగత విషయాలలో రాజీ పడ్డారు కానీ...యజమానులను బుట్టలో వేసుకోలేక పోతున్నారు. వాళ్ళకు బూతు జోకులు చెప్పాలి...ఘడియఘడియకు పొగడాలి...ఇకా కొన్ని పాడుపనులు చేయడంలో వారికి సహకరించాలి. రామోజీ దగ్గర ఉన్నప్పుడు..ఒక పెగ్గు మందైనా వేయని వీళ్ళకు ఇవి చాతకావడం లేదు కొత్త యాజమాన్యాల దగ్గర.
సీనియర్ల పరిస్థితి ఇలా ఉంటే...కొత్తగా చేరిన వారు..."ఓర్నీ..ఇదా జర్నలిజం అంటే.." అని ముక్కున వేలేసుకుంటున్నారు.  మరి పరిస్థితి ఎప్పుడు మారుతుందో!

కొస మెరుపు 
 
ABN- ఆంధ్రజ్యోతి "Open Talk" అనే కార్యక్రమంలో ప్రశ్నలు అడిగే...మన వేమూరి  రాధాకృష్ణ గెస్టులను.."యహ...చెప్పండి..మీరు ఎవరితోనో...తిరిగి ఉంటారు. నిజంగా మీకు 'ఎవ్వారూ' లేరా?" అని పచ్చిగా అడుగుతాడు...తనంత నిజాయితీ పరుడు యవ్వడూ లేనట్లు ప్రకటనలు చేస్తాడు గానీ...జర్నలిస్టులకు కనీసం అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడంలేదట. అన్యాయాలను ప్రశ్నించే జర్నలిస్టులకే దారుణ అన్యాయం...అయినా ఎవ్వరూ కిమ్మనని ఆటవిక వైనం.

Saturday, February 27, 2010

బడుగు జీవి ఎట్లా బతుకుతున్నాడబ్బా!!!

అక్కడ ప్రణబ్, ఇక్కడ రోశయ్య. ఏంటో ఈ పిచ్చి లెక్కలు. దాని పేరు బడ్జెట్, దానికి మహా హంగామా. ఎన్నికల ముందు ఒకరకమైన లెక్కలు, ఎన్నికల ఏరు దాటాక మారిపోయే సమీకరణలు. ఇదంతా అంకెల గారడీ అనిపిస్తుంది. ఎవడేమి లెక్కలు కట్టినా మనబోటి సగటు మధ్యతరగతి మనిషికి, వేతన జీవికి కావలసింది ఏమిటండీ....నిత్యావసర ధరల తగ్గుదల. 

ఏదో తంతులాగా ఈ గణాంక మాంత్రికులు ఏటా సూట్కేసు పట్టుకుని హంగామాగా వచ్చి...సభలో నిల్చుని సొల్లు మాట్లాడి పోతారు. మనకు ధరలు తగ్గనప్పుడు ఈ తొక్కలో లెక్కలు డొక్కలు ఎన్నిచెప్పి ఏమిలాభం? ఏదో ఊరట కలిగిస్తాడనుకుంటే...ప్రణబ్ ముఖర్జీ పెట్రోల్, డీజిల్ ధర పెంచాడు. పైగా...పెంచడానికి ఇదే మంచి అదను అంటున్నాడు. 

ఈ ఒక్క అగ్గి చాలు కొంపంతా కాలడానికి. స్పైరల్ ఎఫెక్ట్ తో అన్ని ధరలు పెరుగుతాయి. ఒక పక్క వ్యవసాయం పరిస్థితి దారుణంగా ఉంది. ఉత్పత్తి తగ్గుతోంది. నీళ్ళు లేవు. విత్తనాలు, ఎరువులు కల్తీ. కొద్దోగొప్పో పంట పండించినా...మార్కెట్ సౌకర్యం సరిగా లేదు. మొత్తం మీద మనకు ఆయువుపట్టు లాంటి వ్యవసాయం సంక్షోభంలో ఉంది, మీకెందుకు మీమున్నాం అని విదేశీ సరుకులు మార్కెట్లను మున్చుతున్నాయ్. జేబులకు చిల్లులు పెడుతున్నాయ్. 

1993 లో 'ఈనాడు' లో ఉన్నప్పుడు Rs.4,000 తో మేము ముగ్గురం హాయిగా బతికే వాళ్ళం. సినిమాకు నూట యాభై అయితే గొప్ప. అప్పుడు గ్యాస్ బండ ధర ఇంత దారుణం కాదు. వెయ్యి పెడితే సరుకులు వచ్చేవి. బియ్యం అప్పుడు, ఇప్పుడు నాన్న పండిస్తుంటే...అమ్మ మిల్లాడించి పంపుతున్నవే.   


 2002 లో నల్గొండ వెళ్ళాం. Rs.10,000తో మొత్తం అవసరాలు తీరేవి. ఒక మూడేళ్ళ నుంచి ధరల సెగ నాకు తగులుతున్నది. మన పరిస్థితే ఇలా ఉంటే...బడుగు జీవుల గతి ఎలా వుందో అని తరచి చూస్తే...చాలా బాధ వేసేది. పౌష్టిక ఆహారం జనం తినడం లేదు. జ్వరం వస్తేనే పళ్ళు తింటున్నారు. మధ్యహ్న భోజన పథకం, పనికి ఆహార పథకం లేకపోతే చాలా కష్టమయ్యేది. ఒక పక్క వాళ్లకు ధరలు అందుబాటులోకి తేకుండా...వాళ్ళ ఆకలి తీర్చే మార్గం చూడడం...అది గొప్ప అని అనుకోవడం పిచ్చి, వెర్రి లెక్క కాక మరేమిటి.

2009 లో మళ్ళీ మహానగర ప్రవేశం చేశాం. అప్పట్లో ఉన్న ఏరియాలోనే ఇల్లు. ఇప్పుడు నలుగురికి హీనపక్షం Rs.30,000 లేనిది బండి నడవడం లేదు. భీమా, కారు వాయిదా పోతే...కనీసం Rs.22,000-25,000 ఉండాల్సిందే. ఇంటి అద్దె, స్కూల్ ఖర్చు, సరుకులు, పాలు...అన్ని ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. 

నాలుగు డబ్బులు వచ్చిపడే జనం పరిస్థితి ఒక రకంగా పర్వాలేదు. ఊళ్లలో, పట్టణాలలో సరైన అవకాశాలు లేక ఏదో ఒకటి చేద్దామని హైదరాబాద్ వచ్చి .5,000-10,000 జీతంతో పని చేస్తున్న వారు చాలా మంది తగిలారు నాకు. వారి పరిస్థితి దారుణంగా ఉంది. ఒకప్పుడు భారీ పర్సులతో కళ్ళు నెత్తిన పెట్టుకుని తిరిగిన ఐ.టీ. మిత్రులకు కూడా వేడి బాగా అంటుతున్నది. అసలు ఐ.టీ.బూమ్ వల్లనే కొత్త కల్చర్ వచ్చింది, దాన్ని మీడియా అందంగా చూపించి...బతికితే..ఇలా జల్సాగా బతకాలని నూరిపోసింది జనానికి. ఇప్పుడు కుటుంబం సినిమాకు వెళ్ళాలంటే Rs.1,000 తేలిగ్గా ఖర్చు అవుతోంది. 

బడ్జెట్ పేరుతో...పిచ్చి లెక్కలు కట్టే...ఈ సర్కార్లకు తెలియడం లేదు కానీ...జనంలో అశాంతి పెరుగుతున్నది. తెలంగాణా వంటి social conflicts వచ్చినప్పుడు జనం వెర్రెత్తినట్టు ప్రవర్తించడానికి, పుట్టింటి నుంచి ఇంకా డబ్బు తెమ్మని దమ్ములేని వెధవలు భార్యలను తన్ని తగలేయడానికి, అవినీతి  పెచ్చరిల్లడానికి, నేరాలు ఘోరాలు పెరగడానికి...ఈ జీవన వ్యయానికి ఒక ముడి ఉంది. రోశయ్య, ప్రణబ్...మీ పాడు లెక్కలు కట్టిపెట్టి...జనం కడుపారా అన్నం తినడానికి ఉన్న అవరోధాలను కనిపెట్టి పరిష్కరించండి స్వామీ!   

స్టూడియో-ఎన్ నుంచి ఐ.సత్యనారాయణ నిష్క్రమణ

ఇది నిజంగా దిగ్భ్రాంతి కలిగించే అంశం. తెలుగు జర్నలిజంలో (అటు ప్రింట్ లో, ఇటు ఎలెక్ట్రానిక్ లో) సుదీర్ఘ అనుభవం ఉన్న ఐ.సత్యనారాయణ గారు అనూహ్య పరిణామాల మధ్య స్టూడియో-ఎన్ నుంచి బైటకు వెళ్ళాల్సి వచ్చింది. ఇది జరిగి వారం అయినా నిజ నిర్ధారణ కోసం మేము వేచి చూశాం. ఆయనపై వేటుకు యాజమాన్యం కారణంగా చూపిన ఒక ఆరోపణ పై విచారణ జరగలేదు కాబట్టి, పరిశ్రమలో ఐ.ఎస్.గారికి అందించడం సబబుకాదని భావిస్తున్నాం.


'ఈనాడు'లో కెరీర్ ఆరంభించి ఆ తర్వాత 'ఈ-టీ.వీ.'కి మారిన ఐ.ఎస్.అక్కడి నుంచి బైట పడిన తర్వాత చాలా చోట్ల పనిచేసారు. మీడియా బూమ్ ఇప్పించిన ఆకర్షణీయమైన జీతాలు కానీ, కొత్త గొప్ప హోదాలు కానీ, పని చేసే వాతావరణం బాగుండడం/ బాగుండకపోవడం గానీ సత్యనారాయణ గారిని పరుగులు పెట్టించాయి. 

'విస్సా' ఛానల్ లో ఒక మంచి టీం ఏర్పరిచిన ఆయన తర్వాత నరేంద్రనాథ్ చౌదరి గారి N-TV కి సంస్థాపక సభ్యుడిగా పనిచేసారు. ఆప్పటికే 'ఈ-టీ.వీ.' నుంచి బైటికి వచ్చి...ఉద్యోగం కోసం ఇబ్బంది పడుతున్న ఒక సీనియర్ విషయంలో చౌదరి గారికి, ఐ.ఎస్.గారికి బెడిసింది. తప్పనిసరి పరిస్థితిలో ఐ.ఎస్.గారు బైటికి వచ్చి TV-5 లో పనిచేసారు. అక్కడ కూడా ఆ ఛానల్ ఆరంభంలో బాగా నిలదొక్కుకోవడానికి పాటుపడ్డారు. 

కొన్ని రోజులు 'ఆంధ్రజ్యోతి' పత్రికలో కూడా పనిచేశారని సమాచారం. తర్వాత zee- 24 గంటలు లో అవుట్ పుట్ ఎడిటర్ గా ఉన్నారు. శైలేష్ రెడ్డి బృందంలో ప్రశాంతంగా ఉండే ఆయన...ఉన్నట్టుండి ఇటీవలనే మంచి పదవి/జీతం తో నార్నే వారి Studio-N లో చేరారు. N-TV లో కీలక పదవిలో ఉన్న రామచంద్ర కూడా అక్కడ చేరడం, చంద్రబాబు తనయుడు ఈ ఛానల్ ను సీరియస్ గా తీసుకుని శ్రద్ధ పెట్టడం..వల్ల ఈ ఛానల్ ఇప్పుడిప్పుడే పైకి ఎగాబాకుతున్నది...టీ.ఆర్.పీ. రేటింగ్ లో. ఇంతలో ఈ పరిణామం.

"సార్ పై నార్నే వారు చేసిన ఆరోపణ విని నేను షాక్ తిన్నాను. ఆయనతో నేను చాలా ఏళ్ళు పనిచేసాను. ఆయన సౌమ్యుడు. జోవియల్గా ఉండే వ్యక్తి," అని ఒక సీనియర్ జర్నలిస్టు అన్నారు. ఒక సామాజిక వర్గానికి చెందిన వారిని ఐ.ఎస్. చేరదీయడం నార్నే వార్కి నచ్చలేదని కొందరు, Studio-N లో ఉన్న ముఠాలు ఈయనకు వ్యతిరేకంగా కుట్ర చేశాయని మరికొందరు అంటున్నారు. ఐ.ఎస్.గారికి మేలు జరగాలని కోరుకుందాం.

HM-TV లో రామానుజం గారి శిక్షణ?

తెలుగు మీడియా గురించి ఎవరైనా సీరియస్ గా పుస్తకం రాస్తే...శ్రీనివాస రామానుజం అనే తమిళుడి గురించి ఒక చాప్టర్ రాయాల్సి ఉంటుంది. రామోజీ కుడి భుజంగా, ఇప్పుడు మూత పడిన 'News Time' అనే ఆంగ్ల పత్రిక ఎడిటర్ గా ఆయన పనిచేసారు. కొందరికి ఉద్యోగాలు ఇచ్చారు, చాలా మంది ఉద్యోగాలు పీకి శాపనార్ధాలు మూట కట్టుకున్నారు. రామోజీ సలహా దారుల్లో ఈయన అత్యంత ముఖ్యులని చెబుతారు. 



ఈ-టీ.వీ., ఎన్.-టీ.వీ.లు నెలకొల్పడంలో కీలక భూమిక పోషించిన ఎస్.ఆర్.ఆర్. ఒక మంచి వెబ్ సైట్ (http://www.mediawhistle.org/) నిర్వహిస్తున్నారు. దాదాపు విశ్రాంత జీవితం గడుపుతున్న ఆయన కపిల్ చిట్ ఫండ్స్ వారు త్వరలో ఆరంభించబోయే జర్నలిజం కాలేజ్ నిర్వహణ బాధ్యతలు తీసుకున్నట్లు సమాచారం. 


ఒక ఈ-మెయిల్ లో దీన్ని సార్ నాకు నిర్ధారించారు. కానీ...నాకు నమ్మబుద్ధి కాలేదు. ఆ ఛానల్ వారి ఇంగ్లీష్ బులెటిన్ బాధ్యతలు ఎస్.ఆర్.గారు స్వీకరించే అవకాశం ఉంది. ఆ బాధ్యతలు చూసిన 'ది హిందూ' మాజీ న్యూస్ ఎడిటర్ కురియన్ అక్కడి నుంచి తప్పుకుని ఆ పత్రిక మాజీ జర్నలిస్టు సాయశేఖర్ మొదలెట్టిన ఒక బిజినెస్ పోర్టల్( http://www.andhrabusiness.com/) లో చేరారు. Wish you good luck Mr.SR.

Thursday, February 25, 2010

'ఈనాడు' స్పోర్ట్స్ ఎడిటర్ రేగళ్ళ సంతోష్...కీప్ ఇట్ అప్

'ఈనాడు' లో సాధారణ కంట్రిబ్యూటర్ గా జర్నలిజం లో కెరీర్ ఆరంభించి స్పోర్ట్స్ ఎడిటర్ స్థాయికి ఎదిగిన వ్యక్తి రేగళ్ళ సంతోష్ కుమార్. క్రీడల పట్ల మక్కువతో దాన్నే జర్నలిజంలో తన రంగంగా ఎన్నుకున్నాడు, అద్భుతంగా రాణిస్తున్నాడు.

సంతోష్ గురించి రాయడానికి కారణం.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. నిన్న సచిన్ 200 పరుగులతో ప్రపంచ రికార్డు సృష్టించడం...దాన్ని యావత్ క్రీడాలోకం ఆస్వాదించడం చూసాం. సచిన్ రికార్డు పై ఈ రోజు "నీవొక దుర్గం...మాకొక స్వర్గం!" అన్న శీర్షికతో 'ఈనాడు' బ్యానర్ గా ప్రచురించిన స్టోరీ నాకు చాలా నచ్చింది. ఇంత సృజనాత్మకంగా ఏ పేపర్ ఈ వార్తను ప్రచురించలేదు. "హిందూస్తాన్ టైమ్స్" లో అనిల్ కుంబ్లే చేత బ్యానర్ స్టోరీ రాయించారు గానీ నాకు పెద్దగా కిక్ ఇవ్వలేదు. మన సంతోష్ 'ఈనాడు'కు రాసిన స్టోరీలో చాలా లోతైన విశ్లేషణ, అంతకన్నా ఎక్కువ రసరమ్య తెలుగు ధార ఉంది. 

సంతోష్...అలగ్జాండర్ ఫ్లెమింగ్ నుంచి ప్రారంభించి...రాబోయే ప్రపంచ కప్ లో సచిన్ నుంచి ఆశిస్తున్నదేమిటో చెప్పి ముగించాడు. ఆద్యంతం ఇందులో మంచి ఊపు కనిపించింది. అయితే..మా ఇంట్లో ఇద్దరు చదవర్లు ఉన్నారు. ఏది చదివి వినిపించినా...అందులో లోపాన్ని/ తమ అభ్యంతరాలను చటక్కున చెప్పేస్తారు. ఇది వీరితో వచ్చిన తంటా..చిక్కు...తలనొప్పి. 

సంతోష్ రాసిన లీడ్లో ఫ్లెమింగ్, రైట్ బ్రదర్స్, ఆర్మ్ స్ట్రాంగ్, హిన్స్ లు అద్భుతాలు సృష్టించినప్పుడు..."ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆ క్షణాలను అనుభవించిన వారెంత పులకించారో తెలీదు కానీ..సచిన్ ద్విశతకాన్ని కనులారా చూసిన క్రీడా ప్రేమికులు మాత్రం అంతటి మహదానందాన్ని అనుభవించారు," అని  ఉంది.

"..అప్పటి జనం పులకరింత తెలియదు కదా...అంతటి మహదానందం ఇప్పుడు జనం అనుభవించారు....అనడంలో పొంతన లేదు," అని హేమ, మైత్రేయి వాదించారు. అలాగే..."అతని ఆటను...:" తో మొదలై "..ఎవ్వరూ అనుకోరు"తో మూడో కాలంలో ముగిసిన వాక్యం కూడా కొద్దిగా ఇబ్బంది ఉన్నదని, రచయిత మనసు ఆవిష్కృతం కాలేదనిపించింది. 

సరే...అన్వయం సంగతి ఎలా ఉన్నా...ఇందులో సెంట్రల్ ఐడియాలు ఐదు ఉన్నాయి. 1) ఒక అపూర్వ ఘట్టం జనానికి ఇచ్చిన మహదానందం 2) ఓపిక, తపన, ఏకాగ్రతతో ఏదైనా ఎలా సాధించ వచ్చో సచిన్ సాక్ష్యంగా చెప్పడం 3) అంత సాధించినా మిడిసి పడకూదదన్న సందేశం 4)  వయసు మీరినా కోడెద్దులా ఉరకలు వేసే సచిన్ ఉత్సాహం 5) జనం సచిన్ నుంచి ఏమి కోరుకుంటున్నారు. 

ఏ మాటకు ఆ మాట...'ఈనాడు' ఇంత మంచి జర్నలిస్టుకు సముచిత హోదాను ఇచ్చి ప్రోత్సహించింది. తనకు కూడా 'ఈనాడు' పట్ల మంచి నిబద్ధత ఉంది. "సంతోష్...కీప్ ఇట్ అప్. మంచి తెలుగు ధారతో క్రీడలపై ఒక పుస్తకం రాయవయ్యా బాబూ...," అని నేను సదుదేశ్యంతో సలహా ఇచ్చాను. 

Tuesday, February 23, 2010

TV-9 రవి ప్రకాష్, N-TV చౌదరిలపై MLA ఎదురుదాడి

ఏదో బూతు బొమ్మలు, పిచ్చి క్లిప్పింగ్స్ చూపి బతుకు వెళ్ళదీసుకునే TV-9 'మెరుగైన సమాజం' కోసం ఉన్నట్టుండి జూలు విదిలించిందని మనం పడుతున్న ఆనందాన్ని ప్రకాశం జిల్లా చీరాల ఎం.ఎల్.ఏ. ఆవిరి చేశాడు. TV-9 సీ.ఈ.ఓ.రవి ప్రకాష్, N-టీవీ అధిపతి నరేంద్రనాథ్ చౌదరి, 'హాత్ వే' కేబుల్ నెట్వర్క్ కు చెందిన రాజశేఖర్ ల పన్నాగం లో భాగంగానే తనను బద్నాం చేస్తున్నారని ఈ అధికార పార్టీ ఎం.ఎల్.ఏ. ఆమంచి క్రిష్ణ మోహన్ బల్ల గుద్ది మరీ వాదిస్తున్నారు. వారి గురువు గారు రోశయ్య గారు మాత్రం కిమ్మనడం లేదు.

"నేను ఏ విచారణకైనా సిద్ధం. ఆరోపణలు రుజువు చేస్తే...నా పదవికి రాజీనామా చేసి ఇదే అంశం (తన 'క్లీన్ ఇమేజ్') పై ఎన్నికలకు వెళ్తా. ఈ ముగ్గురిలో ఎవరైనా నాపై పోటీకి దిగవచ్చు," అని ఎం.ఎల్.ఏ. స్పష్టం చేస్తున్నారు. రవి ప్రకాష్ పొడ/ ఎదుగుదల గిట్టని ఛానెల్స్ ఆమంచికి మంచి కవరేజ్ ఇస్తున్నాయి. TV-5 ఏకంగా ఎం.ఎల్.ఏ.ను స్టూడియోలో కూచోబెట్టి సుదీర్ఘ ఇంటర్వ్యూ చేసింది. "మిమ్మల్ని TV-9 ఛానల్ లో దావూద్ ఇబ్రహీం తో పోల్చారు. దీనిపై మీరు ఏమంటారు?," అని మాటి మాటికీ మాటలు తడబడే ఒక ప్రజెంటర్ అడిగాడు.


నిజంగానే ఈ కేబుల్ వాళ్ళది రాష్ట్రంలో ఇక పెద్ద మాఫియా దందా. ఛానెల్స్ యజమానులు ఈ 'హాత్ వే' వాళ్లకు జీ హుజూర్ అని తీరాల్సిందే. వాళ్ళను ఖుషీ చేయకపోతే...ఛానల్ రేటింగ్స్ దారుణంగా పడిపోతాయి. ప్రకటనలు రాక ఆదాయం తగ్గుతుంది. అందుకే మరి...మందు, పొందు కూడా అందించి ఛానెల్స్ బాసులు ఈ కేబుల్ వాళ్ళను ప్రసన్నం చేసుకుంటారని మీడియా లో ఉన్న అందరికీ తెలిసిందే. 

కొన్ని సార్లు వాళ్ళు చెప్పిన వార్తలు కూడా వేయక తప్పదట. ఆ మధ్య విజయవాడ వివాహిత, కార్తీక్ అనే కుర్రోడి వ్యవహారం తెరకు ఎక్కడం వెనుక కేబుల్ నెట్ వర్క్ వాళ్ళు  హస్తం ఉందట. రవి, చౌదరి ఒత్తిడి తెచ్చినా...తాను 'హాత్ వే' వాళ్లకు సహకరించలేదు కాబట్టి...తనపై కక్ష కట్టారని, స్టింగ్ ఆపరేషన్ లో తన అన్న గొంతు మార్చారని ఎం.ఎల్.ఏ. గట్టిగా వాదిస్తున్నాడు. 


ఒక వ్యాఖ్యాత పేర్కొన్నట్లు, నిన్ననే వార్తతో పాటు ఛానెల్స్ ఆ ఎం.ఎల్.ఏ. వెర్షన్ తీసుకుని ఉంటే బాగుండేది. మరొక పక్క కత్తి పద్మా రావు వంటి నికార్సైన ఉద్యమకారుడు కూడా ఎం.ఎల్.ఏ.మీద విమర్శలు సంధించారు, గట్టి ఆరోపణలు చేసారు. 

అసలే...ఈ ప్రజాప్రతినిధి గారు ముదురు, ఆయన వల్ల ఇప్పుడు తీవ్ర ఆరోపణలు ఎదుర్కుంటున్న వాళ్ళు కూడా గాంధీజీ కేటగిరీ అనీ, వీళ్ళకు అస్సలు నేర చరిత లేదని మనం..అంటే..జనం...చెప్పే స్థితిలో లేరు. మరి దొంగోడెవడో! దొరగారు ఎవరో??

Monday, February 22, 2010

వెరీ వెల్ డన్......TV-9---కంగ్రాట్స్.... రిపోర్టర్ సాయీ

చాలా రోజుల తర్వాత TV-9 మెరుగైన సమాజం కోసం జూలు విదిల్చింది. ముఖ్యమంత్రి రోశయ్య శిష్యుడైన ప్రకాశం జిల్లా చీరాల ఎం.ఎల్.ఏ., ఆయన సోదరుడు, పోలీసులు కలిసి సామాన్య జనాన్ని వేధించి, పీల్చి పిప్పి చేస్తున్న వైనాన్ని ఈ రోజు సాయంత్రం చాలా అద్భుతంగా తెరకెక్కించి చర్చ జరిపింది ఈ ఛానల్.

"ముఖ్య మంత్రి కర్మభూమిలో రౌడీ రాజ్యం" శీర్షికన ప్రసారమైన ఈ కథనం చాలా చాలా బాగుంది. ఈ కథనానికి కారకుడైన బాధితుడు శ్రీనివాస్, కేసును చక్కగా డీల్ చేసిన టీ.వీ.-నైన్ విజయవాడ విలేకరి సాయి గార్లకు అభినందనలు. చదువుకున్నవాళ్ళు వ్యవస్థతో పోటీ ఎందుకని రాజీ పడకూడదని అసిస్టంట్ ప్రొఫెసర్ అయిన శ్రీనివాస్ నిరూపిస్తే, బూతు సహాయం లేకుండానే మంచి కథనాలతో జనం మదిని ఎలా దోచుకోవచ్చో సీనియర్ జర్నలిస్టు సాయి గారు చూపించారు.

బహుశా హైదరాబాద్ లో రోశయ్య అండ చూసుకొని కావచ్చు...ఈ ఎం.ఎల్.ఏ. బృందం చెలరేగి పోయి...సామాన్యులకు నరకం చూపిస్తున్నట్లు ఆ ఛానల్ ససాక్ష్యంగా ప్రసారం చేసింది. తమ మాట వినని వారిపై 'ఎస్.సీ., ఎస్.టీ.అట్రాసిటీస్ యాక్ట్' కింద దొంగ కేసులు బుక్ చేయించి, ఈ కేసు విచారణ అధికారి అయిన డీ.ఎస్.పీ. సహాయంతో వారిని ఇబ్బంది పెడుతున్నారని....పలువురు ఆ ఛానల్ కు మొర పెట్టుకున్నారు. 

మాజీ మంత్రి పాలేటి రామారావు వంటి వాళ్ళు కూడా ఫోన్ లైన్ లోకి వచ్చి...చీరాల పోలీసుల గురించి పూసగుచ్చినట్లు చెప్పారు. పలువురు బాధితులు తమ ఆస్తులను నామ మాత్రపు రెట్లు చెల్లించి రాజకీయ రాబందులు ఎలా దోచుకున్నదీ వెల్లడించారు. దళితులు కానివారిని ఆ యాక్టు కింద, దళితులైన వారిని మావోయిస్టు అనే ముద్ర వేసి...పోలీసుల సహాయంతో ఎం.ఎల్.ఏ. సంఘం ఎలా ఇరుకున పెట్టేదీ ఈ కథనం లో ఉంది. సాయి బృందం స్టింగ్ ఆపరేషన్ ద్వారా....ఆ పోలీసు అధికారుల బండారం బట్టబయలు చేసింది.

ఇలా ఎం.ఎల్.ఏ.లు పోలీసులను పోషించి పనులు చేయించుకోవడం మన రాష్ట్రంలో కొత్త కాదు. సూర్యాపేట డీ.ఎస్.పీ.గా పనిచేసిన ఒక అగ్రకుల వ్యక్తిని అక్కడి నుంచి బదిలీ చేయించడానికి నాకు తెలిసి ముగ్గురు ఎస్.పీ.లు నానా పాట్లు పడ్డారు. అయినా అతన్ని కదిలించ లేక పొయ్యారు. అక్కడి రాజకీయవేత్త, ఆ పోలీస్ అధికారి వాడుకున్న ఆయుధం కూడా...ఈ ఎస్.సీ., ఎస్.టీ.అట్రాసిటీస్ యాక్టే. నిజంగా దళితుల పాలిటి వరప్రసాదం అయిన ఈ చట్టాన్ని చాలా మంది దుర్వినియోగం చేస్తున్నారని అప్పటి ఎస్.సీ. కమిషన్ ఛైర్మన్ నాగార్జున వాపోయారు. దళితులకు నష్టం జరగకుండా చూస్తూనే ఈ చట్టంపై పూర్తి స్థాయిలో సమీక్ష జరపడానికి ఇంతకు మించి మరొక అవకాశం దొరకదు. 


వ్యవస్థ పోలీసుల మీద పూర్తిగా నమ్మకం కోల్పోతున్న దశలో TV-9 స్టింగ్ ఆపరేషన్ చేసి సమాజానికి మేలు చేసింది. దుర్మార్గులైన రాజకీయ నేతలు, వారి చెంచాలైన పోలీసుల నుంచి బాధితుడు శ్రీనివాస్ కు ఇతరులకు వెంటనే రక్షణ కల్పించాలి. మాటలతో జనాలను, జర్నలిస్టులను బురిడీ కొట్టిన్చానని భ్రమ పడే కొణిజేటి రోశయ్య తన ఇలాకాలో జరుగుతున్న ఈ దారుణంపై జవాబు ఇవ్వాలి. దీనికి నైతిక బాధ్యత వహించాలి.

Sunday, February 21, 2010

ముంబాయ్ మిర్రర్ Vs అమితాబ్ బచ్చన్

పేరుప్రఖ్యాతులు గడించిన వారు (celebrities) తుమ్మినా, దగ్గినా, డోక్కున్నా కొన్నిపత్రికలకు వార్త అవుతుంది. భాషా విన్యాసంతో ఆ విషయాన్ని అద్భుతంగా రాసి అందమైన ఫోటోతో కలర్ఫుల్ గా అచ్చొత్తి అదే జర్నలిజం అంటారు. అలాంటి పత్రికలలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 'టైమ్స్ అఫ్ ఇండియా' ప్రముఖమైనది. విలువలు, వలువలు లేని ఈ ఆంగ్ల పత్రిక ఆధ్వర్యంలో నడిచే 'ముంబాయ్ మిర్రర్' అనే మాసాలా టాబ్లాయిడ్ పత్రిక ఫిబ్రవరి 18 (గురువారం) 27 వ పేజిలో (ఎంటర్టైన్మెంట్ సెక్షన్) ప్రచురించిన వార్త బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కుటుంబాన్ని మానసిక క్షోభకు గురిచేసింది. ఆయన కోడలు ఐశ్వర్య రాయ్ బచ్చన్ హక్కులను పూర్తిగా మంటగలిపింది. వారి అభిమానులను నివ్వెర పరిచింది, గాయపరిచింది.

"Pregnant Pause" అనే శీర్షికతో ప్రచురించిన వార్త ప్రకారం....ఐశ్వర్య ఉదరకోశ క్షయ (టీ.బీ.) తో బాధపడుతున్నది...అందుకే ఆమె గర్భధారణను వాయిదా వేసుకుంటున్నది. మగ పిల్లవాడు కావాలని అమితాబ్ కోరుకుంటున్నాడని కూడా పేర్కొంది. "Aishwarya Roi Bachchan has been trying to become mother for some time now. The fact that she has so far not gotten pregnant is actually a cause for concern for the entire Bachchan parivar,"
అన్నది ఆ పత్రిక మొదటి పేరా (లీడ్). అమితాబ్ అంతకు మునుపు టీ.బీ. పై  తన బ్లాగ్లో రాసిన ఒక పోస్ట్ లో ప్రస్తావించిన అంశాలకు, ఐశ్వర్య ప్రెగ్నన్సీకి రిపోర్టర్ ముడిపెట్టే ప్రయత్నం చేశాడు/ చేసింది. ఇది ఒక ఆరేడు పేరాల వార్త అయినా...ఆ కుటుంబానికి చాలా ఇబ్బందికరంగా, బాధాకరంగా ఉంది. దీనిపై తన బ్లాగ్ లో బిగ్ బీ ఇలా స్పందించారు.
  

You make a series of allegations in the article, reiterated below as follows:
· Aishwarya Rai Bachchan has contracted tuberculosis of the stomach, a most serious disease
· As a consequence of this disease and its treatment, Aishwarya Rai Bachchan is unable to conceive and carry a pregnancy, hence bear a child
· Amitabh Bachchan wishes for a grandson and is therefore gender prejudiced not only in his discrimination against the girl child, but also against women, in particular their right to be considered a primary heir of a family
I refute these allegations as absolutely and categorically false in every detail.
These allegations you base on the following information:
· The opinion of an undisclosed and anonymous intimate friend of the Bachchan family
· The mention of tuberculosis on Day 667 of Amitabh Bachchan’s Blog, that tuberculosis is known as the ‘rich man’s disease’
· There is no stated source of information for the allegation that Amitabh Bachchan wishes for a grandson
I counter the legitimacy of these sources with the charge of slander with malicious intent. The reasons for this are the following:
· The opinion of the undisclosed and anonymous family friend of the Bachchan’s is not substantiated or confirmed. At no point has the Mumbai Mirror contacted the family, directly or indirectly, to query this information and verify its accuracy.
· The mention of tuberculosis on the Blog has been cut and pasted out of context. There was no reference in the said dated blog to anyone in the Bachchan family having any ailment whatsoever in the context in which tuberculosis was mentioned.

అమితాబ్ ఇంతలా మొత్తుకున్నా, ఐశ్వర్య ఖండించినా....ఆ పత్రిక సారీ చెప్పలేదు. ఖండనను మాత్రం ప్రచురించింది. దీనిపై అమితాబ్ ఘాటుగానే స్పందిస్తున్నారు. ఆ పత్రిక అంతే ప్రముఖంగా ఖండన ప్రచురించాలని, అప్పటి దాకా పోరాటం ఆగదని ఆయన అంటున్నారు. ఒక మహిళ మాతృత్వపు అంశంపై ఇంత నిస్సిగ్గుగా వార్త ప్రచురించడం ఏమి సమంజసం? వ్యక్తిగత జీవితాలలోకి చొచ్చుకుపోవడం టైమ్స్ గ్రూప్ కు కొత్త కాదు. ఈ సంస్థ భారత్ లో జర్నలిజాన్ని ఎంత నీచ స్థాయికి తీసుకెళ్ళింది కొందరు అమితాబ్ అభిమానులు వివరిస్తున్నారు...కామెంట్స్ సెక్షన్లో.  

ఈ వ్యవహారంపై వందలాది మంది స్పందిస్తూ...మొత్తం మీడియాపై దుమ్మెత్తి పోస్తున్నారు. కొందరు మంచి లాజిక్ తో రాస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు అమితాబ్ బ్లాగ్ ( http://bigb.bigadda.com/) లో చూడండి. అమితాబ్ కు మద్దతు పలకండి. మీడియా పెను పోకడలను ఏ ప్రభుత్వమూ ఆపలేదు, దీనికి కావలసింది శక్తిమంతమైన పౌర స్పందన మాత్రమే.

Saturday, February 20, 2010

సకాలంలో జీతాలు అందక i-news సిబ్బంది ఇబ్బందులు

ఎం.ఎన్.ఆర్.విద్యాసంస్థల వారు నిర్వహిస్తున్న i-news తెలుగు ఛానల్ లో పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది. యాజమాన్యం సరైన సమయంలో జీతాలు ఇవ్వకపోవడంతో ఉద్యోగులు తీవ్రమైన నిర్వేదం, నిరుత్సాహంలో ఉన్నారు. సాధ్యమైనంత త్వరగా ఏదో ఒక చానెల్ లో ఉద్యోగం చూసుకోవాలని సీనియర్లు సైతం ప్రయత్నాలు ఆరంభించడంతో ఈ ఛానల్ భవిత కొద్దిగా అగమ్య గోచరంగా మారింది.


TV-9 కు పోటీగా ఛానల్ తీసుకురావచ్చని, అందుకు తగ్గ ఐడియాలు తన దగ్గర పుష్కలంగా ఉన్నాయని ఎన్.ఎం.ఆర్. సంస్థల రాజులను రాజశేఖర్ అనే జర్నలిస్టు నమ్మించాడు. ఇప్పుడున్న చాలా మంది ఉన్నత స్థాయి ఎడిటర్లకన్నా నాణ్యమైన జర్నలిస్టు అయిన రాజశేఖర్.... అన్నంత పనీ చేశాడు. ఇది ఎన్.ఆర్.ఐ.ల ఛానల్ అని నమ్మబలికి పలువురు సీనియర్లను ఆకర్షించి, జూనియర్లకు తానే మంచి శిక్షణ ఇచ్చుకుని...ఛానల్ లాంచ్ చేశాడు రాజశేఖర్. నిజంగానే ఛానల్ క్లిక్ అయ్యింది. అంత వరకూ ఫస్టున జీతాలు ఇచ్చిన యాజమాన్యం తర్వాత పదో తారీఖున ఇవ్వడం మొదలెట్టింది.


ఇక్కడ రాయడానికి వీలు లేని పలు కారణాలవల్ల...యాజమాన్యంతో పడక రాజశేఖర్ i-news నుంచి చల్లగా జారుకుని N-TV లో చేరాడు. శ్యాం వంటి తన నమ్మిన బంట్లను అక్కడ చేర్చుకున్నాడు. రాజశేఖర్ కు పొగపెట్టే పనిలో భాగంగానే TV-5 లో చల్లగా పనిచేసుకుంటున్న కందుల రమేష్ ను i-news ఆకర్షించింది. రమేష్ రాక, రాజశేఖర్ పోక దాదాపుగా ఒకేసారి జరిగిపొయ్యాయి. రమేష్ ఏదో అద్భుతం చేస్తారని అంతా అనుకున్నారు కానీ...అలాంటిదేమీ జరగలేదు. కారణం...యాజమాన్యం దగ్గర డబ్బు లేకపోవడం...ఒక విజన్ అస్సలే లేకపోవడం.

"జీతాలు ఒక పధ్ధతి ప్రకారం ఇవ్వడం లేదు. రెండు నెలల కిందటి జీతం ఈ నెల ఇస్తారు. కొందరికి ఒక రోజు, మరికొందరికి మరొక రోజు ఇస్తున్నారు. బిల్లు ఇవ్వడం లేదు. ఛీ..దీనెమ్మ... ఇదో చెత్త సంస్థ," అని ఐ-న్యూస్ ఉద్యోగి ఒకరు  కోపంగా అన్నారు. అంచనాలు తలకిందులై రమేష్ కూడా తలపట్టుకున్నట్లు సమాచారం. ఎరక్క పోయి వచ్చి..ఇరుకున్నాను...అని ఆయన భావిస్తున్నట్లు భోగట్టా. స్వతహాగా....సున్నిత మనస్కుడైన రమేష్...తాను రప్పించిన ఉద్యోగులకు జీతాలు సకాలంలో అందక పోవడంతో చాలా అవమానంగా భావిస్తున్నారు. 

ఒక పక్క...రాజశేఖర్ తమ ఉద్యోగులను N-TV కి తీసుకుపోవడం, తమ కాన్సెప్ట్స్ ను కాపి చేసి ఆ ఛానల్ లో వాడుకోవడం....మరొక పక్క యాజమాన్యం కాసులు రాల్చకపోవడంతో సీనియర్ల పరిస్థితి క్లిష్టంగా తయారయ్యింది. యాజమాన్యం తీరు వల్ల దాదాపు 350 మంది ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు.

తెలుగు టీ.వీ.ఛానెల్స్ చేసే అతి వల్ల కీడా? మేలా?

ఒక క్రైం స్టోరీ విషయంలో N-TV ప్రజంటర్ పరితోష్ రెండు గంటలకు పైగా లైవ్ లో సృష్టించిన బీభత్సం గురించి...ఒక స్త్రీ, మరొక పురుషుడి మధ్య ఈ గొడవను మీడియా వినోదాత్మకంగా 'బహిరంగ విచారణ' జరపడం గురించి ఇంతకు ముందు "తెలుగు ఛానెల్స్ కు మరొక మాసాలా కేసు దొరికిన్దోచ్..." అన్న శీర్షికతో రాసాను. పరితోష్ ప్రశ్నలడిగిన తీరు పట్ల బైట చాలా చర్చ జరగడం నేను విన్నాను...పరాచకానికి ఆ అబ్బాయిని అనుకరిస్తూ (మిమిక్రీ) నేను కొందరు మిత్రులను ఆనంద పరిచాను. కానీ ఇప్పుడు నాకు ఒక సమస్య వచ్చి పడింది. నాది తప్పో, పరితోష్ ది తప్పో అర్ధం కావడం లేదు. 


మీడియా కనీస ప్రమాణాలు పాటించకుండా...ఒక బాధితురాలిని తెరకెక్కించి...పిచ్చి పిచ్చి ప్రశ్నలతో చాలా సేపు కథనాలు ప్రసారం చేయడం కదా మన ఏడుపు. మరి మీడియా చేసిన ఈ ఓవర్ యాక్షన్ (అతి) వల్లనో, కేసులో నిజంగా దమ్ము ఉండబట్టో...తీగ లాగితే డొంక అంతా కదిలింది. ఆ అమ్మాయి టీ.వీ.లకెక్కి నానా యాగీ చేయడం వల్ల మరికొంత మంది బాధితురాళ్ళు ముందుకు వచ్చి...ఆ ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తి తమను కూడా పెళ్లి చేసుకున్నాడని, దారుణంగా వంచించడంతో పాటు...హింసించాడని...వారు బహిరంగంగా ప్రకటించారు. దీనివల్ల...ఇదేదో చిన్న కేసు అనుకున్న నా బోటి వాళ్ళు...అది తీరా పెద్ద స్కాం గా బైటపడే సరికి నివ్వెర పోవాల్సి వచ్చింది. 

ఈ కేసులో ఒక ప్యాట్రను కనిపిస్తున్నది. ఈ అమ్మాయిలు (నిజంగానే చిన్న వయస్సు ఉన్న పేదింటి పిల్లలు వీరు) చెబుతున్నది నిజం అయితే...ఆ పురుష పుంగవుడు...ఇప్పటికి ఏడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. పేద పిల్లలను చూసి పెళ్ళాడడం...వారిని ఇంట్లోనే పెట్టుకుని...మరొకామెను చేసుకోవడం...ఇంతకుముందు చేసుకున్న ఆమెను పనిమనిషిగా నమ్మబలకడం...అయ్యగారు చేస్తున్న పనట. ఈ నేపథ్యంలో నా ఎదుట కొన్ని సందేహాలు నిలబడి నాట్యం చేస్తున్నాయి. అవి: 

1) ఈ కేసుకు అంతే ప్రాధాన్యత ఇచ్చి..మీడియా నానా యాగీ చేయడం నిజంగానే తప్పు అవుతుందా? తుది ఫలితం దృష్ట్యా చూస్తే...ఒక బాధిత మహిళకు విపరీతమైన వాయిస్ ఇవ్వడం వల్ల...మిగిలిన బాధితురాళ్ళు బైటికి వచ్చారు కదా! అదే మీడియా...రొటీన్ స్టోరీ గా దీన్ని చూపి...ఆ మొదటి మహిళను లైవ్ లో తీసుకోకపోతే మిగిలిన బాధితురాళ్ళు బైటికి వచ్చే వారు కాదా?


2) మీడియా...ఇలా ఒక కేసుని అప్పుడప్పుడు మాత్రమే హైలైట్ చేయడం సబబేనా? ఇప్పుడు...మీడియా యాగీ చేసిన కేసులు మాత్రమే టేకప్ చేద్దామని పోలీసు వ్యవస్థ అనుకునే ప్రమాదం ఉందా? అలాగే..ప్రతి సమస్య హై లైట్ కావడానికి మీడియాకు ఎక్కడం తప్ప మరొక గత్యంతరం లేదని బాధితులు కూడా భావిస్తారా?

3) నిజంగా ఇలాంటి ఎన్ని కేసులు మీడియా అంత చేటు..ఆ స్థాయిలో చూపగలదు? 

4) పోలీసు, న్యాయ వ్యవస్థలు సరిగా పనిచేయకపోవడం వల్లనే మీడియా ఇలా బాధ్యతను నెత్తికి ఎత్తుకోవాల్సి వస్తోందా? మీడియా చేస్తున్నది మంచి పనేనా?
 
5) ఇంత పెద్ద కేసులో...మీడియా ఇంత హడావుడి చేసినా...మన సంధ్య అక్క స్టూడియో చర్చలకు ఎందుకు రాలేదు? (ఇదో సిల్లీ ప్రశ్న. అయినా...నాకు విచిత్రంగా అనిపించి రాస్తున్నా).

Thursday, February 18, 2010

తెలుగు ఛానెల్స్ కు మరో మసాలా కేసు దొరికిందోచ్...

కోతికి కొబ్బరికాయ దొరికినట్లే... మన తెలుగు టెలివిజన్ ఛానెల్స్ కు మరొక గరం మసాల స్టోరీ దొరకడంతో పండగ చేసుకుంటున్నాయి. ఆ మధ్యన విజయవాడకు చెందిన ఒక వివాహిత...కార్తీక్ అనే కుర్రోడు తనపై సైబర్ క్రైం కు పాల్పడి మానసికంగా వేధిస్తున్నాడని ఛానెల్స్ గడప తొక్కి అల్లరి అల్లరి అయ్యింది. ఆమెను, కుర్రోడిని లైవ్ లో తీసుకుని...TV-9 రజనీకాంత్ లాంటి వాళ్ళు జడ్జి పాత్ర పోషించి నానా యాగీ చేసారు.

లేచిపోవడాలు, అక్రమ సంబంధాలు, ఆడవారి బాధలు, కన్నీళ్ళ తో వ్యాపారం చేసుకునే.... మన ఛానెల్స్ కు ఇలాంటి మరొక ఓవర్ డోస్ మాసాలా కథనం దొరికింది. ఈ కేసులో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మరొక వివాహిత...విశాఖపట్నం కు చెందిన ఒక సినిమా హాల్ యజమాని కొడుకును నవంబర్లో పెళ్లాడిందట. ఆ తర్వాత తెలుసుకుందట...సారుకు ఇది ఎనిమిదో పెళ్లి అని, అప్పటికే ఆయనకు ఒక పెళ్లీడు కూతురు కూడా వుందని. ఆమె కథనం ఎంతవరకూ నిజమో గానీ...న్యాయం కోసం ఆమె ఛానెల్స్ ని ఆశ్రయించింది.

ఇలాంటి కేసులలో బాధితులైన ఆడ పిల్లల ముఖాలు చూపకూడదన్నది జర్నలిజంలో మౌలిక సూత్రం. ఈ కథనం ముందుగా ప్రసారం చేసిన రవిప్రకాష్ బృందం మంగళవారం నాడు ఆ అమ్మాయి ముఖం చూపకుండా వార్త ప్రసారం చేసింది. అయినా...స్టోరీ కి ఊపు రాలేదని అనుకున్నదో ఏమో గానీ...ప్రైం టైం కల్లా ముసుగు తీసేసి...ఆ అమ్మాయిని డైరెక్టుగా చూపిస్తూ తన నైజం చాటుకుంది. 

ఆ మర్నాడు, అంటే బుధవారం, మరికొన్ని ఛానెల్స్ ఈ స్టోరీని ఫాలో అప్ చేసాయి. నేను...ABN- ఆంధ్రజ్యోతి చూసినప్పుడు మూర్తి అతగాడిని (అంటే...ఆరోపణలు ఎదుర్కుంటున్న వైజాగ్ బాబును) లైవ్ లో తీసుకుని...ఆ అమ్మాయిని ఫోన్ లో పలకరిస్తూ....పంచనామా చేస్తున్నారు. తనకు తెలిసిన నైతిక ప్రమాణాలను పాటిస్తూ మూర్తి ఈ కేసును డీల్ చేసారు. మిగిలిన ఛానెల్స్ కూడా ఇదే ఉత్సాహాన్ని ప్రదర్శించి ఉంటాయి...తప్పకుండా. ఎందుకంటే...కోతికి కొబ్బరికాయ దొరికితే ఆగలేదు కదా!

బుధవారం రాత్రి పొద్దుపొయ్యాక...ఒక పాత మిత్రుడు అలర్ట్ ఎస్.ఎం.ఎస్. ఇస్తే..గబాగబా వెళ్లి N-TV పెట్టాను. అప్పటికే...నవ నాగరికుడు (అంటే ఇంగ్లిష్ ను తెలుగుగా మాట్లాడే సార్) పరితోష్ ప్రజంటర్ ఉన్నారు. తెర మధ్యలో ఆయన ఉండగా ప.గో.జిల్లా పూళ్ళ నుంచి తల పట్టుకుని దీనంగా ఆ అమ్మాయి...విజయవాడ నుంచి తన తండ్రి, మరో మిత్రుడుతో కలిసి ఆ సో కాల్డ్ రసిక రాజు గారు లైవ్ లో ఉన్నారు. ఇక పరితోష్...భయంకరమైన జడ్జి పాత్ర పోషిస్తున్నారు. 

ఆ కార్యక్రమం...ఎలాంటి సెన్సార్ లేకుండా దారుణంగా నడిచింది. ఆ అమ్మాయి తమ ఇంట్లో 'హౌజ్ కీపర్' గా చేరి ఇప్పుడు యాగీ చేస్తున్నదని...అటు పక్క ఉన్న ముగ్గురు అంటుంటే..."కాదు...నేను..తాళి కట్టించుకున్న ఎనిమిదో భార్యను. మోసపోయిన దాన్ని," అని ఆమె వాదిస్తున్నారు. మధ్యమధ్య లో పరితోష్ ఒక జడ్జి లాగా తెలిసీ తెలియని వెర్రి ప్రశ్నలు వేస్తూ ప్రోగ్రాం రక్తికట్టించే ప్రయత్నం చేసారు. 

"ఏమండీ...ఈమే మీ పనిమనిషి అంటున్నారు కదా. పని మనిషికి ఇన్ని వ్యక్తిగత సన్నిహిత విషయాలు ఎలా చెప్పారు? అంత ఫ్రీ టైం ఉండేదా మీకు?", "పెళ్లి అయినట్లు చెబుతున్న సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకూ ఏ కార్యకలాపాలు చేసారు?," "మీ వీపు మీద పుట్టు మచ్చ ఉందని ఆమె అంటున్నారు. అసలు పుట్టు మచ్చ ఎలా చూసింది?," వంటి...పలు రకాల ప్రశ్నలు న్యాయమూర్తి పరితోష్ సంధించారు. అంతకు ముందు..ఆ వ్యక్తి తనకు పంపిన ఎస్.ఎం.ఎస్.లు చూపిందట. "మెసేజ్ లు N-TV కి చూపిన....(బాధితురాలు)" అని స్క్రీన్ లో పైన వేసుకున్నారు.

మరొక పక్క...ఆమె...వాడు ఏనుగులా ఉన్నాడని...కోస్తే...పది ఊళ్లకు సరిపోతాడని...అతని తండ్రి తనను లంజ (బ్లాగర్ నోట్: చేయక తప్పని ఈ పదప్రయోగానికి క్షంతవ్యుడిని) అని అనే వాడని...ఏకరువు పెట్టింది. 

"ఏమండీ..ఇప్పుడు కాపురం చేస్తానని ఆయన అంటే...వైజాగ్ వెళ్తారా?" అని కూడా పరితోష్ బాబు ప్రశ్నించాడు. ఇలా N-TV సుదీర్ఘ కాలం పాటు స్టూడియోలో పంచాయితీ  చేసింది. "రేపు (గురువారం) సాయంత్రానికి వాళ్ళను అరెస్ట్ చేయకపోతే...వైజాగ్ లో నా డెడ్ బాడి చూస్తారు," అని ఆమె మూడు నాలుగు సార్లు హెచ్చరించింది. కాస్త నాగరికుడు కాబట్టి పరితోష్..."మీకు న్యాయం జరుగుతుంది. పోలీసుల మీద నమ్మకం ఉంచండి," అని ఒక మంచి సలహా ఇస్తూనే..."వారికి వ్యతిరేకంగా మంచి ఆధారాలు ఉంటే మమ్మల్ని సంప్రదించండి," అని కూడా సెలవిచ్చారు. 

"ఇలా మాట్లాడితే మిమ్మల్ని బొక్కలో తోస్తారు," అని ఒక దశలో ఆ అమ్మాయి అంటే..."బొక్కా? బొక్క బొక్క అంటున్నావ్..బొక్క అంటే ఎలా వుంటుందసలు?," అని అబ్బాయి తండ్రి అతి తెలివితో వ్యంగ్యంగా అడిగారు. "శివ సుబ్రహ్మణ్యం (అమ్మాయి మొదటి భర్త) మెడలో వేసిన పుస్తెల తాడు ఎందుకు ఉంచుకున్నావ్? వెళ్లి అతనితో కాపురం చెయ్యి, పిల్లలను కను," అని ఆ ముసలోడు ఆ అమ్మాయికి సలహా ఇచ్చాడు.

ఏమిటండీ..ఈ దారుణం? ఆ చెత్త జనాలకు అవసరమా? మీవి 24 గంటల ఛానెల్స్ కాబట్టి, మీకు లైవ్ వ్యాన్స్ ఉన్నాయి కాబట్టి...ఈ చెత్త అంతా జనం భరించాలా? నిజంగా మీ 'స్టూడియో పంచాయితీ' వల్ల వాళ్లకు ఇసుమంత న్యాయమైనా జరుగుతుందా? 


చానళ్ళ యజమానుల కూతుళ్ళకో, ఇతర కుటుంబీకులకో ఇలాంటి అన్యాయం జరిగితే...ఇలాగే...బహిరంగ విచారణ చేస్తారా? ఒక బాధితురాలిని ట్రీట్ చేసే విధానం ఇదేనా? పోలీసులు, కోర్టులు చేయాల్సిన పనిని వినోదం కోసం మనం ఎందుకు ఇలా డీల్ చెయ్యాలి? పరిణామాలతో సంబంధం లేకుండా...ఇలా బరితెగిస్తే...సమాజానికి మనం ఏమి మెస్సేజ్ పంపుతున్నట్లు? మానవత్వం మారిస్తే....సిగ్గుఎగ్గూ విడిస్తే ఎలా?

Wednesday, February 17, 2010

యూనియన్ లీడర్స్ కు పట్టదా? ఎడిటర్లు ఏమయ్యారు??

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విలేకరులను పోలీసులు కావాలని నెత్తురోడేలా కొట్టడం మీడియాలోకాన్ని బాధకు గురిచేసింది. జర్నలిస్టులంతా ఈ పరిణామంతో విస్తుపొయ్యారు. ఇంత జరుగుతున్నా..జర్నలిస్టు సంఘాల నేతలు, ఎడిటర్లు పెద్దగా పట్టించుకోకపోవడం పట్ల సీనియర్ జర్నలిస్టు కే.వీ.రమణ ఆశ్చర్యం వ్యక్తం చేసారు. వృత్తిధర్మంలో భాగంగా అమెరికా వెళ్లి నిన్ననే వచ్చిన రమణ తాజా పరిణామంపై ఒక పోస్టుకు స్పందనగా రాసిపంపిన కామెంట్ ను ఇక్కడ ఇస్తున్నాము---రాము, హేమ
--------------------------------------------------------    
 

I agree with you that some individuals like Sailesh Reddy were quick to respond to the turn of events at the Osmania University. But where are the so called union leaders? By evening a 'leader' condemned the attack on mediamen. Nonsense. In fact, there is no scope for an apology from the police officers. That's typical call centre attitude. You do something and quickly tender an apology. That's it. 


I thought the reporters should black out coverage of any police event or for that matter any police version till the Shivannarayana committee submits its report on the incident. I also know that such a measure is not possible without the consent of the editors. So, where are the editors? Why do we need union leaders to respond on this? Just to give more confidence to the field staff, the editors of all the news papers and channels should have met by now and taken a stand on that. One of my friends in a newspaper told me that the editor was not willing to take any initiative on this since he is not very favourable to Telangana.

I thought it was a bloody joke. In this case, it is not about Telangana but about the reporters doing their job. Even if a paper/channel is against Telangana, they are still deploying reporters at the campus. Then these reporters have to be protected more from police in this condition than from the protestors. Why are these editors asking senior reporters or chiefs of bureaux to go and submit a memorandum to the home minister? Why can't the editors themselves go and meet the chief minister on this?

We all know by now what the union leaders are worth. With a shade lesser than small time politicians, the leaders are making use of every such opportunity to show themselves up on TVs with some sound bytes. Should not they go out of on field by now and conduct an independent enquiry on what happened at the campus? I was told that a CI of one of those police stations was keen on somehow beating up the OU campus stringers.

Some of them are also a part of the OU JAC. However, instead of just targeting the stringers, his team of cops beat up every media representative. If this is true, is not the responsibility of the leaders to work and establish it only to present a point to the Shivannarayana committee?
Please wake up and go beyond politics or netagiri. Protect us.
Ramana

Tuesday, February 16, 2010

యుద్ధకాండలో పనిచేసే మీడియా వారికి ప్రత్యేక జాకెట్స్.!

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోలీసులు మీడియా వారి మీద రెండు రోజులపాటు ప్రతాపం చూపించారు. దాదాపు పది మంది విలేకరులకు/ కెమెరామెన్ కు గాయాలు అయ్యాయి. కొందరి వాహనాలను, కెమెరాలను ధ్వంసం చేసారు. మరీ అమానుషంగా ఒక విలేకరిని మానవ కవచంగా వాడుకున్నారని 'ది హిందూ' కూడా రిపోర్ట్ చేసింది.

అడవుల్లో మావోయిస్టులను వెంటాడే...గ్రే హౌండ్స్ వాళ్ళను క్యాంపస్ లో పెట్టడం వల్ల వాళ్ళు ఇలా చెలరేగి విలేకరులను పిచ్చి కొట్టుడు కొట్టారని ఆ పత్రిక సీనియర్ జర్నలిస్టు కే.శ్రీనివాస రెడ్డి గారు రెండో పేజిలో ఒక విశ్లేషణ చేసారు. 

అసలు మొదటి సారి...పోలీసులు స్టూడెంట్స్ మీద పడి గొడ్లను బాదినట్లు బాదడం వల్లనే...తెలంగాణలో ఉద్యమం మరింత ఊపు అందుకుంది. మధ్య మధ్యలో పోలీసు అధికారులు మీడియా పట్ల అసహనం కనబరుస్తూ వస్తున్నారు. ఎవరో పైస్థాయి అధికారి నుంచి ఆదేశం లేకపోతే...ఈ పోలీసులు ఇంత ఘోరంగా ప్రవర్తించరు.

విలేకరులను కొట్టినట్లు తెలియగానే...zee- 24 గంటలు ఛానల్ హెడ్ ఆర్.శైలేష్ రెడ్డి చక్కగా స్పందించారు. జర్నలిస్టు నాయకుడిగా ఆయన పోషించిన భూమిక ఆహ్వానించదగింది. అలాగే..ABN- ఆంధ్రజ్యోతి మూర్తి కూడా మంత్రికి వాదన వినిపించే ప్రయత్నం చేసారు. రాంగ్ సోర్సుతో వార్త నడిపి జైలుకు వెళ్లివచ్చిన TV-5 వెంకటక్రిష్ణ కూడా నిరసన విరమించినప్పుడు బత్తాయి జ్యూస్ తాగుతూ కనిపించారు. దట్స్ గుడ్.

"రాష్ట్రంలో జర్నలిస్టులపై ఇదే చివరి దాడి కావాలి," అని శైలేష్ అన్న మాటలు స్ఫూర్తినిచ్చాయి. టీ.వీ.ఛానెల్స్ లో తరచూ కనిపించే యూనియన్ నేతలు ఈ మాట అనుకుని వుంటే...మీడియాపై మాటిమాటికీ ఇలా దాడులు జరిగేవి కావు. ఈ గొడవల నేపథ్యంలో వ్యవస్థ సజావుగా సాగడానికి కొన్ని సూచనలు....

* గొడవల వంటి యుద్ధకాండలలో పోలీసులు....విలేకరులు/ కెమెరామెన్ తో  ఘర్షణ పడకుండా ఉండేలా ఒక పధ్ధతి ఉండాలి. వృత్తి ధర్మం నిర్వహించే మీడియా వారికోసం ప్రత్యేకంగా సంస్థ లోగోతో జాకెట్లు ఇవ్వాలి. ఆ లోగోల ఆధారంగా నిరసనకారులు కొన్ని ఛానెల్స్ వారిని టార్గెట్ చేసే ప్రమాదం ఉందని అనుకుంటే...పోలీసులే ఆ జాకెట్లు సమకూర్చాలి. అందుకు అయ్యే ఖర్చు మీడియా యాజమాన్యాల నుంచి వసూలు చెయ్యాలి.

*లాకప్ డెత్ జరిగినప్పుడు జిల్లాల ఎస్.పీ.ల మీద చర్య తీసుకునేలా చట్టం ఉన్నట్లే...మీడియా వారి మీద దాడి జరిగితే...ఆ ప్రాంత పరిధిలోని ఉన్నత స్థాయి పోలీసు అధికారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి.

* మీడియా అందరికీ కరివేపాకు అయిపోయింది. కాబట్టి...కార్యక్షేత్రం లోని మీడియా వారి కోసం...వారి ప్రాణాలు కాపాడేందుకు ఒక ప్రత్యేక చట్టం తేవాలి. అందరివీ ఉద్యోగాలు...విలేకరులవి మాత్రం జాబులు కాదన్న ధోరణి అంతా విడనాడాలి.

*అన్ని ఛానెల్స్ విధిగా ఉద్యోగులకు భీమా చేయించాలి. హెల్తు స్కీములు అమలు చెయ్యాలి. (ఆంధ్రజ్యోతి లాంటి ఛానెల్స్ అప్పాయింట్మెంట్ లెటర్స్ అయినా ఇవ్వకుండా బండి నడుపుతున్నాయని భోగట్ట. అయినా అడిగే నాధుడే లేడు. జర్నలిస్టు యూనియన్ ప్రత్యేకంగా సమావేశమై ఈ అంశాలు పరిశీలించాలి.) 

*గాయాలు అయిన మీడియా వారికి నష్టపరిహారం ఇప్పించాలి.

*జర్నలిస్టుల రక్షణ కోసం...సదాలోచనపరులైన సీనియర్లతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలి. అది దాడులు జరిగినప్పుడు నిజ నిర్ధారణ కమిటీ గా కూడా వ్యవహరించే వెసులుబాటు కల్పించాలి.

*యుద్ధకాండ సందర్భంగా...జనాలను మరింత రెచ్చగొట్టే ఛానెల్స్ పై చర్యలు తీసుకోవాలి. ఆ ఛానల్ సీ.ఈ.ఓ.లను జైల్లో పెట్టాలి.

Monday, February 15, 2010

ఫ్లూక్ లో వచ్చే నేతలు... మనకు అచ్చిరారేమో!

గత రెండున్నర నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే...మృతుల వారసులు మనకు పనికిరారేమో అనిపిస్తున్నది. ఒక మూడు క్యారెక్టర్లను దృష్టిలో ఉంచుకుని ఈ మాట చెబుతున్నా. ఫ్లూక్ లో కొట్టుకొచ్చే నేతల వల్ల ఎంత ప్రమాదం ఉందో వీరు నిరూపిస్తున్నారు. అది నిజమో కాదో మీరే చూడండి.

1) సోనియా గాంధీ: ఈమె రాజీవ్ గాంధీ మరణించాక తెరమీదకు వచ్చారు. అంతవరకూ మహామహులు అనుకున్న కాంగ్రెస్ నేతలు రాజీవ్ పొయ్యక ఆమె కాళ్ళు మొక్కి...ఏకంగా ప్రధాని పదవి కట్టబెట్టే ప్రయత్నం చేసారు. ఇప్పుడు కాంగ్రెస్ లో తెలంగాణా పట్ల కాస్తంత సానుకూలంగా ఉన్నది ఈమె ఒక్కరే అని ఢిల్లీ వర్గాల కథనం. మాట ఇచ్చా కాబట్టి...రాష్ట్రం ఇద్దాం...అని ఆమె అన్నారట. సరే...మొత్తానికి డిసెంబర్ తొమ్మిదిన ఒక ప్రకటన వచ్చింది. ప్రతిగా ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలలో ఉద్యమాలు వచ్చాయి. 

 దాంతో...సోనియా బృందం ఏమి చెయ్యాలో పాలుపోక పిల్లిమొగ్గలు వేస్తున్నది. దాని వల్ల రాష్ట్రంలో పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రాష్ట్రం మండి పోతున్నది.  అయినా మేడం హస్తిన లో చిద్విలాసాలు చిందిస్తూ...ఇక్కడి కాంగ్రెస్ నేతలను బఫూన్లను చేసి ఆడుకుంటున్నారు. అయినా ఎదిరించే నాథుడే లేడు.
ఈ మహాతల్లి దేన్నీ పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. తనకు బురద అంటకుండా...చాణక్యుడు చిదంబరంతో కథ నడిపిస్తున్నారు. నిజంగా...రాజకీయంలో నలిగిన జాతీయ స్థాయి నేత వేరెవరైనా ఆ పదవిలో ఉంటే...ఇంత దారుణ మౌనం పాటిస్తారని నేను అనుకోను. ఏమీ తెలియని ఆమెకు పెద్ద పదవి కట్టబెడితే ఇలా కాక మరెలా ఉంటుంది?

2) కొణిజేటి రోశయ్య: అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.ఆర్.రెడ్డి మరణం తర్వాత అనూహ్య పరిస్థితుల నడుమ రోశయ్య ఆ పదవి చేపట్టారు. వై.ఎస్. నాచురల్ వారసుడిని తోసిరాజని సింహాసనం దక్కించుకున్నారు. ఆయనేదో ఊడబొడుస్తారని ఎవ్వరూ ఆశించలేదు కానీ...ఇంత నామ్ కే వాస్తే...సీ.ఏం.గా వ్యవహరిస్తారని అనుకోలేదు. పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయ్యాక సుఖంగా ఉన్న ఒక్క రోజూ నాకు కనిపించడంలేదు. తెలంగాణా విషయం నా చేతులో లేదు...అంటూ బేలగా ఢిల్లీ వైపు చూడడం ఆయనకు అలవాటయ్యింది.

 ఏదో...నాలుగు ఎకసెక్కెపు మాటలు మాట్లాడి బండి నెట్టుకొస్తున్నారాయన. ఈయన సోనియాలాగా రాజకీయాలకు కొత్తకాదు. అయినా...ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఇదొక వైపరీత్యం. సరే...ఆమె అయితే...ఎలా డీల్ చెయ్యాలో తెలియక మౌనముద్ర తో గడుపుతున్నారు. మరి..రోశయ్య గారిలో ఉన్న సీనియర్ రాజకీయ నేత...నేనేమీ చేయలేక పోతున్నానే అనుకోవడం లేదు.  అది మన ఖర్మ, విధి మనతో ఆడుకుంటున్న వింత ఆట.


3) సబితా ఇంద్రారెడ్డి: భర్త ఇంద్రరెడ్డి మరణం తర్వాత వై.ఎస్.దయతో ఈమె కీలకమైన హోం మంత్రి పదవి పొందారు. ఆమెకు ఈ పదవి ఇవ్వడం ఎంత తెలివిగల పనో గానీ...తెలంగాణా ఉద్యమం నేపథ్యంలో ఆమె రోజూ బద్నాం అవుతున్నారు. చేవెళ్ళ చెల్లెమ్మను అన్ని ప్రాంతాల వారూ 'ఛీ..వెళ్ళు' అని ఛీత్కరించుకుంటున్నారు
 అసలు...హోం శాఖలో ఏమి జరుగుతున్నదో ఈమెకు  అర్ధమవుతున్నట్లు లేదు. వ్యవస్థ నవ్వుల పాలవుతున్నది. అయినా...అన్నయ్య ఇచ్చిన పదవిని అంటిపెట్టుకుని కాలక్షేపం చేస్తున్నారు సబిత. ఈ సమయంలో ఒక దమ్మున్న ముఖ్యమంత్రి, హోం మంత్రి ఉంటే...పరిస్థితి మరోలా ఉండేదేమో! 

రాజీవ్ గాంధీ టైగర్ల ఆత్మాహుతి దళం చేతిలో హత్యకు గురైతే...ఇంద్రారెడ్డి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వై.ఎస్.ఆర్.హెలికాప్టర్ కూలడంతో కారడవిలో మృత్యువాత పడ్డారు. ఈ ముగ్గురు బతికి ఉంటే...పరిస్ధితులు ఎలా ఉండేవో?

Sunday, February 14, 2010

పువ్వంటి ప్రేమకు....పండంటి పెళ్లి జీవితానికి....5 సూత్రాలు

"వీడి తెలుగు చదివితే...ప్రాణం లేచివచ్చినట్లయింది," అని గురువు గారు బూదరాజు గారు ఒకసారి, "తెలుగంటే ఇలా రాయాలి," అని 'ఈనాడు' అధిపతి రామోజీ రావు గారు వేరొకసారి పొగిడితే...వాళ్లకు ఒక రహస్యం చెప్పెయ్యాలనిపించింది. పెద్దోళ్ళు కాబట్టి అప్పట్లో చెప్పలేకపోయాను. అదేమిటంటే...ఆరేడేళ్ళ ప్రేమ జీవితంలో నేను రాసిన నాలుగు వేల పైచిలుకు ప్రేమలేఖల మహత్యం. 

ఆదివారం నాడు 'వాలెంటైన్స్ డే' సందర్భంగా నిజమైన ప్రేమికులందరికీ శుభాకాంక్షలు చెబుతూ...పువ్వంటి ప్రేమ జీవితానికి, పండంటి లవ్ మ్యారేజ్ లైఫ్ కు స్వానుభవంతో నేర్చిన ఐదు ముఖ్యమైన సూత్రాలు అందించే ప్రయత్నమిది.

1) సినిమాలో లా....టాం..టాం చేసుకోవద్దు...
ప్రేమ నిజంగానే ఒక మధురం. సాధారణంగా కాలేజ్ లైఫ్ లో శరీరకంగా, మానసికంగా కలిగే మార్పుల వల్ల ఈ లవ్ డబ్ మొదలవుతుంది. మనసు ఎప్పుడు స్పందిస్తుందో మనం చెప్పలేం. ఇంటర్ చివర్లో ఒక మల్లె పందిరి కింద...ఆమెను చూసాను. అప్పుడే మనసు మునుపెన్నడూ లేని ఉద్వేగానికి లోనయ్యింది. 'బాస్..ఈమె నీ జీవిత భాగస్వామి' అని చెప్పింది మనసు.  రెచ్చిపోకుండా...చాల ప్రాక్టికల్గా విశ్లేషణ చేసి ఒక ఏడాది పొయ్యాక మనసులో మాట తెలియజేసా. 
ఈ తుక్కు సినిమాలలో...పోరంబోకు మిత్రబృందం లవర్లను ఎగదోయడం, సహకరించడం చూస్తే నాకు అసహ్యం వేస్తుంది. నేనొక సర్వే చేస్తే తేలింది ఏమిటంటే...ప్రేమ గురించి..సినిమాలలో లాగా పదిమందికి చెప్పుకుని...ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళు రియల్ లైఫ్ లో ఫెయిల్ అయ్యారు. ప్రేమ జంటలు ఆత్మహత్యలకు పాల్పడేది ఎందుకంటే...ప్రేమ విఫలం అయితే నలుగురిలో పలచన అవుతామన్న భయంతో.
ప్రేమ రెండు గుండెల మధ్య మొలకెత్తి...మొగ్గ తొడిగి..విరబూయాల్సిన ఒక అద్భుతమైన అనుభూతి. నేను కనీసం నాలుగేళ్ళు నరమానవుడికి చెప్పలేదు...విషయాన్ని. మా నాన్న కు మాత్రం చెప్పాను ఓ మూడేళ్ళు పొయ్యక. అద్భుతమైన వ్యక్తి...మా నాన్న...జీవితంలో నాకు ఇచ్చిన స్ఫూర్తి గురించి ఫాదర్స్ డే (జూన్ లో మూడో ఆదివారం) రోజు మరిన్ని వివరాలు రాస్తాను.


2) శారీరక సంబంధం...వద్దు...సంయమనం ముద్దు 
ప్రేమించేందుకు ఒక అమ్మాయి దొరగ్గానే...శరీరాలు గొడవ చేయడం ఆరంభిస్తాయి. కొద్దిగా టెంప్ట్ అయినా కొంప కొల్లేరు అవుతుంది. ప్రేమను విజయవంతం చేసుకోవాలంటే...శారీరక సంబంధాన్ని పెళ్లి దాక పూర్తిగా అవాయిడ్ చెయ్యాలి. సెక్స్ అనే అంశం మధ్యలో దూరిందంటే...సంబంధం మధ్యలోనే తెగతెంపులు అవుతుందనే. ఈ సినిమాలలో అన్నీ వక్రపు పనులు చూపిస్తూ...పిచ్చి పాటలతో మనలను తెగ రెచ్చగొడుతున్నారు. వాటి ప్రభావంలో పడవద్దు. ఒకటి రెండు సార్లు సెక్స్ లోకి దిగితే...వ్యామోహం తగ్గడం మొదలవుతుంది. ఆ శారీరక వ్యామోహాన్ని పెళ్లి అయ్యే వరకు భద్రంగా పదిలపరుచుకుంటే....ఆనక అద్భుతంగా ఆస్వాదించవచ్చు. 

3) సంపాదన లేకపోతే...ఇంతే సంగతులు...
మార్క్స్ చెప్పినట్లు...ఈ వ్యవస్థలో అన్ని సంబంధాలూ ఆర్ధిక సంబంధాలే. ఉజ్జోగం సజ్జోగం లేకుండా...పిల్లను/కుర్రాడిని వెంటేసుకుని...ఊర్లో తిరగడం ప్రమాదకరం. అప్పుచేసి పార్కులకు, సినిమాలకు, బీచులకు తిరగడం ముప్పు తెస్తుంది.
ప్రేమ పెళ్లి చేసుకుని సుఖంగా జీవించాలంటే...ముందు ఆర్ధికంగా స్థిరపడాలి. మనకొక మంచి ఉజ్జోగం ఉంటే...మిగిలిన అన్ని పరిస్ధితులు వాటంతట అవే సర్దుకుంటాయి. సినిమాలలో లాగా గూండా పనులు చేయకుండా..ఒక గౌరవప్రదమైన ఉద్యోగం సంపాదిస్తే...దర్జాగా బతకవచ్చు. నేను ప్రేమలో పడగానే...ఉజ్జోగం సాధించడం ధ్యేయంగా లక్ష్యాలు పెట్టుకున్నాను. అది వర్కౌట్ అయ్యింది. 
అంతా అనుకుంటున్నట్లు...తల్లిదండ్రులు కిరాతకులు కాదు. మన మంచి కోరే వ్యక్తులే వారు. సంపాదన, గౌరవం ఉన్న అబ్బాయి/ మంచి అమ్మాయి  దొరికితే...వాళ్ళేమీ అడ్డుపడరు. మనం స్వచ్ఛమైన ప్రేమతో వారిని జాగ్రత్తగా ఎలా ఒప్పిస్తామా? అన్నదే ప్రశ్న. తల్లితండ్రులతో తెగతెంపులు చేసుకోకుండా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి...ఎందుకంటే...కనిపెంచిన వారు వలచిన వారికన్నా ఏ మాత్రం తక్కువ కాదు.

4) కట్నం లేని వివాహం...ఆనందానికి సోపానం...
చాలా మంది లవర్స్ ఇబ్బంది పడేది ఇక్కడే. "ప్రేమించుకున్నాం...పెద్ద వాళ్ళు ఒప్పుకున్నారు. మీ వాళ్ళను కొద్దిగా కట్నం ఇవ్వమను...సమస్య సెటిల్ అవుతుంది," అని మగపిల్లలు ఒక డైలాగ్ కొడతారు. ఇది దారుణం. కట్నం తీసుకుని చేసుకుంటే...లవ్ మ్యారేజ్ సవ్యంగా సాగే అవకాశం తక్కువ. మనం సంపాదించిన డబ్బుతో మన పెళ్లి మనం చేసుకుంటే! చాలా మజా వుంటుంది. అత్తమామల నుంచి ఏ ప్రయోజనం ఆశించినా అది తప్పే. 
నా పెళ్ళికి మా నాన్న, నేను చెరిసగం ఖర్చులు భరించుకున్నాం. ఇప్పటి వరకూ మామ గారి నుంచి ఏ పండగకూ బట్టలు, కట్నకానుకలు (అంటే..మంచాలు కంచాలు వగైరా..) నేను స్వీకరించలేదు. డబ్బు వైపు మనసు మళ్ళింది అంటే...మన ప్రేమలో ఏదో లోపం ఉన్నట్లే. ఫ్రీగా వచ్చే డబ్బులో సుఖం లేదు బ్రదర్.

5) అడుగడుగునా..అవగాహన, నమ్మకం...
ఇక ప్రేమ, పెళ్లి అయిపోయాయి. ఇప్పుడు జీవితం ఆరంభమయ్యింది. పాపం..అమ్మాయి మనలను నమ్ముకుని...అయిన వాళ్ళను కాదని..జీవితం పంచుకునేందుకు వచ్చింది. ఏ క్షణంలోనూ ఆమెను నిరాశ పరచకూడదు. అది ఘోరం, పాపం. (నేను ఇక్కడ  మేల్ యాంగిల్ నుంచి ఇది రాస్తున్నా. అంతమాత్రాన ఆడ వారిని తక్కువ చేస్తున్నట్లు భావించకండి. మీరు ఎంత వాదించినా....ఈ ప్రేమ వ్యవహారంలో ఇద్దరి ప్లానింగ్ ముఖ్యం...అమలు బాధ్యత, ఎక్కువ చొరవ చూపాల్సింది జెంట్. పైగా మన సమాజంలో ఆడ పిల్లలు ఇలాంటి విషయాలను డీల్ చేసే శాతం బహు తక్కువని నా పరిశీలన.)
ప్రతి విషయాన్ని జీవిత భాగస్వామితో చర్చించడం చాలా ముఖ్యం. అబద్ధాలు అస్సలు చెప్పకూడదు. మోసం చేయకూడదు. కొన్ని సార్లు కుటుంబ సభ్యులు విచిత్రంగా బిహేవ్ చేస్తారు...అప్పుడు ప్రణాళికాబద్ధంగా, బ్యాలెన్సుడ్ గా వ్యవహరించాలి. ఎన్ని సమస్యలు వచ్చినా..ఇద్దరి మధ్య అవగాహన, నమ్మకం సడలకూడదు. సమస్యలన్నీ...దాపరికంలేకుండా...పంచుకొని..చర్చించుకుని...నిజాయితీతో వ్యవహరిస్తే ముందుకు సాగడం పెద్ద కష్టం కాదని చెప్పేందుకు నా దగ్గర చాలా ఉదాహరణలు ఉన్నాయి.
ఒక్కటి మాత్రం ముమ్మాటికీ నిజం...నిజాయితీగా ప్రేమించి...పెళ్లి చేసుకుంటే...చక్కటి ప్లానింగ్ తో హాయిగా చిలకా గోరింకల్లా జీవించవచ్చు. అయితే...ఇది చదివి ఆహా...ప్రేమ పెళ్లి పూల పాన్పు... అని భ్రమపడకండి. అందరి పెళ్లి జీవితాల్లో మాదిరిగానే...సమస్యలు ఉంటాయి. సంక్షోభాలు ఉంటాయి. వాటిని నెచ్చెలి/ చెలికాడి సంపూర్ణ సహకారంతో, సానుభూతితో...అధిగమించవచ్చు. జీవితాన్ని ప్రాక్టికల్ గా తీసుకుంటే...అటు లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా భేషుగ్గా సాగిపోతాయి.  

కుల మతాలకు అతీతంగా...స్వచ్ఛమైన ప్రేమతో దగ్గరై...ఆదర్శంగా బతుకుతున్న....బుడన్-పద్మశ్రీ, క్రాంతి-పద్మల వంటి జంటలకు ఆత్మీయ శుభాభివందనలు తెల్పుతూ ముగిస్తున్నా....హాపీ వాలెంటైన్స్ డే.   

Saturday, February 13, 2010

హెచ్.ఎం. టీవీ వార్షికోత్సవం...మూర్తి గారికి శుభాభివందనం

"ఈ మూర్తి గారు...చాలా స్ట్రిక్ట్. మొన్నీమధ్య ఒక బ్రా కంపెనీ యాడ్ సంపాదించాం. అది కాస్త అసభ్యంగా ఉందని ఆ ప్రకటనను ఛానల్ లో వాడడం కుదరదని మాకు చెప్పారు. ఒక నాలుగు లక్షల ఆదాయం తెచ్చే యాడ్ వద్దని ఆయన తేలిగ్గా అనేసారు," అని హెచ్.ఎం.టీవీ ఉద్యోగి ఒకరు ఒక ప్రింటింగ్ ప్రెస్ లో కనిపించి చెబితే...కొండుభట్ల రామచంద్ర మూర్తి గారి పట్ల అంతకు ముందు ఉన్న అభిమానం ఎంతగానో పెరిగింది.

అదే యాడ్...మన నైన్ వాడికో, ఫైవ్ వాడికో, ఎన్ వాడికో, ఐ వాడికో, ఐ బీ ఎన్ వాడికో ఇస్తే...ఒక్క బ్రా మాత్రమే తెచ్చారే...ప్యాంటీది కూడా తెండి...డబ్బులిస్తే...రోజంతా జనానికి చూపుతాం...అని అనివుండే వారేమో అనిపించింది. 

ఇప్పుడున్న ఛానెల్స్ లో కాస్త సంసార పక్షంగా ఉన్నది హెచ్.ఎం.టీవీ అని చెప్పడానికి నాకు మనసులో ఇసుమంత సంకోచమైనా లేదు. తెలంగాణా వార్తలు ఎక్కువ ఇస్తారు...అన్న అపవాదు మూటగట్టుకున్నా..'దశ దిశ' పేరిట మూర్తి గారు చేసిన ప్రయత్నం వారి ఉద్దేశ్యాన్ని చాటిచెప్పింది. సమస్యకు ఆజ్యం పోసే వారు, ఆ సమస్య మనకు లాభాలు ఎలా తెస్తుందా అని ఆలోచించే వారు అధికంగా ఉన్న ఈ మీడియా లో మూర్తి గారి సారధ్యంలోని బృందం విలువలకు ప్రాధాన్యం ఇస్తుందని అనిపిస్తున్నది. సముద్రపు ఒడ్డున బికినితో తడిసి ముద్దై వయ్యారాలు ఒలకబోసే భామలు, బట్టల్లేని అమ్మాయిల పాత క్లిప్పింగులు, ముద్దు సీన్లు...నాకు ఇంతవరకూ ఈ ఛానల్ లో కనిపించలేదు. ఏదో ఒక మిషతో బూతు చూపే ప్రయత్నం వీరు చేయలేదు...నేను చూడగా. మున్ముందు కూడా దీనికే కట్టుబడతారని నమ్ముతున్నా.

ఈ తెలంగాణా గొడవ సందర్భంగా...మీడియాకు దూరం కావడం బాధ కలిగి ఏదో ఒక ఛానల్ లో పనిచేస్తే బాగుండు కొన్నాళ్ళు...అని నాకు అనిపించింది. ఇప్పుడున్న ఎడిటర్లలో ప్రొఫెషనలిజం లేనివారు, ఫ్లూక్లో కొట్టుకొచ్చి స్థిరపడిన వారు, యాజమాన్యం తొత్తులు, కులగజ్జి గాళ్ళు, ముఠాలు మెయిన్ టైన్ చేసి నాణ్యతను తుంగలో తొక్కిపారేసే వారు...ఎక్కువగా  ఉన్నారని జనం భావన. నాకూ ఇందులో భిన్నాభిప్రాయం లేదు. కాస్త మనం పనిచేసే వాతావరణం ఉన్న ఛానల్ ఏమిటా అని ఆలోచన చేస్తే...హెచ్.ఎం.-టీవీ అనిపించింది. ఆ తర్వాతనే...మిగిలిన ఒకటి రెండు పేర్లు స్ఫురణకు వచ్చాయి.
మూర్తిగారు నేను ఈ-మెయిల్ లో పంపిన రెస్యుమేకి స్పందించకపోవడం...ఇంతలో పీ.హెచ్.డీ.మరో తొమ్మిది నెలల్లో పూర్తి చేయకపోతే...పేరు తొలగిస్తామని ఉస్మానియా వారు హెచ్చరించడంతో మారు మాట్లాడకుండా...పరిశోధన-బోధన పనికి పరిమితం అయ్యాననేది ఇక్కడ అప్రస్తుతం. మన తెలివి మీడియాకు పనికిరాదని మూర్తి గారు భావించినా...అది తప్పు కావచ్చు, కాకపోవచ్చు.

ముందుగా టీ.టీ.వీ.గా ఉన్న ఛానల్ను తెలంగాణా కలర్ రాకుండా ఉండేందుకు..హెచ్.ఎం.టీవీ గా మార్చి హంస బొమ్మతో లోగో రూపొందించారు. నీళ్ళను నీళ్ళుగా, పాలను పాలుగా విడదీసే హంస ను ఎంచుకోవడం...ఆ నియమానికి కట్టుబడి ఉండాలని ప్రయత్నించడం అభినందనీయం. ఒక చిట్ వ్యాపారి యజమానిగా ఉన్న ఛానల్...మూర్తి గారికి పూర్తి ఎడిటోరియల్ స్వేచ్ఛ ఇవ్వకపోతే...ఇలా నడపడం కుదరదు. 

వై.ఎస్.రాజశేఖర రెడ్డి గారి మరణం సందర్భంగా ఈ ఛానల్ మరీ ఓవర్ యాక్షన్ చేయకుండా...కథనాలు చూపింది. "శ్రీకాంత చారి తెలంగాణా కోసమని ఒంటికి నిప్పు అన్టించుకుంటే...అన్ని ఛానెల్స్ చాలా అతిగా చూపాయి. టీ.వీ-నైన్ వాడు...ప్రాణాపాయ స్థితిలో ఉన్న చారి మూతి దగ్గర గొట్టం పెట్టి ఏదో ప్రశ్న అడుగుతున్నాడు. మనసును కలిచివేసే ఈ సీన్ ను మాటి మాటికీ చూపవద్దని నేను అన్ని ఛానెల్స్ ను కోరాను. ఒక్క మూర్తి గారు మాత్రమే సానుకూలంగా స్పందించారు," అని నిఘా విభాగంలో ఉన్న ఒక ఉన్నత స్థాయి పోలీసు అధికారి చెప్పారు. మీడియాలో మృగ్యమవుతున్న విలువల మీద ఈ ఛానల్ పెట్టినన్ని చర్చలు మరే ఛానల్ పెట్టలేదనే చెప్పవచ్చు.

మూర్తి గారు పవర్ఫుల్ ప్రజెంటర్ కాకపోయినా...ఆయన వాక్యాలలో సమన్వయం ఉంది. నమ్రత ఉంది. మన నైన్ తదితరుల లాగా స్టూడియో లలో వెకిలి నవ్వులు, వెర్రి ప్రశ్నలు లేవు. నింపాదిగా అడగడం...ఇతరులకు మర్యాద ఇవ్వడం...సీనియారిటీ మీద వస్తుంది...నిగర్వులకు. 
నాకు బాగా నచ్చిన ప్రయోగం....ఈ ఛానల్లో మగ యాంకర్లు. ఇతర ఛానెల్స్ ఆడ యాంకర్స్ ను అందంగా చూపి జనం దృష్టిని ఆకర్షించాలని అనుకుంటున్నారు. ఒక కుక్కమూతి జర్నలిస్టు వార్తల మీద కాకుండా..యాంకర్ల దుస్తుల మీద మనసుపెట్టి...వాడే ఆ అమ్మాయిలకు కాస్త పలచటి, కురచ బట్టలు సెలెక్ట్ చేస్తూ ఉంటాడు. కానీ మూర్తి గారు ఇద్దరు ముగ్గురు చాకుల్లాంటి యాంకర్లను తయారు చేసారు. 
 
మరి...ఇలా సంసార పక్షంగా ఉంటే ఛానల్ నడుస్తుందో లేదో తెలియదు కానీ...విలువలను నమ్ముకున్న వారికి తాత్కాలికంగా నష్టం జరిగినా శాశ్వతంగా మంచి జరుగుతుందని నాకుంది. చేసింది తక్కువ...చెయ్యాల్సింది చాలావుంది. జర్నలిస్టుల జీవితాలలో అనిశ్చితి నింపకుండా...వృత్తిలో నీతీ నిబద్ధతలను మూర్తి గారు మరింత పెంచాలని, నైతికతతో ఛానల్ ఎలా నడపాలో ప్రపంచానికి చాటాలని ఆశిద్దాం. వుయ్ విష్ హెచ్.ఎం.టీవీ ఆల్ ది బెస్ట్.

Friday, February 12, 2010

'ఈనాడు' పేపర్--సీ.ఎం.రోశయ్య--సినీతార బూతుబొమ్మ

మళ్ళీ అదే ఫార్ములా! మొదటి పేజీలో ప్రముఖంగా ముఖ్యమంత్రి రోశయ్య బొమ్మ ప్లస్ వార్త, సినిమా పేజీలో ఒక బూతు బొమ్మ. కొత్త ఆలోచనలు, మంచి వార్తలు కరువైన 'ఈనాడు' పత్రిక గత కొన్ని రోజులుగా ఇదే ఫార్ములా మీద బతుకుతున్నది.

నిన్నా, మొన్నా..రోశయ్య గారు మంత్రులతో జరిపిన సమీక్ష సమావేశాలను బ్యానర్ గా ప్రచురించిన 'ఈనాడు' ఇవ్వాళ ఏకంగా ఆయన ఇంటర్వ్యూ ను ప్రముఖంగా ప్రచురించింది. అదేదో బ్రహ్మాండం బద్దలయ్యే ఇంటర్వ్యూ కాదు...."పరిస్ధితులు సర్దుకుంటాయి" అని ఆయన గారు భరోసా ఇచ్చిన ఇంటర్వ్యూ. మళ్ళీ ప్రాధాన్యతల సమస్య!


"అన్నం పెట్టే వాడికే కన్నం" అన్న శీర్షికన రైతులకు సంబంధించిన వార్త ఐదో పేజీకి పరిమితం అయ్యింది. ఒక మంత్రి సన్నిహితుడు అదేదో మోసానికి పాల్పడుతున్నట్లు ఉన్న వార్తకు మొదటి పేజీకి కావాల్సిన గుణాలు ఉన్నాయి. అలాగే...లోపలి పేజీలలో మొత్తం రోశయ్య ఫోటోలు నాలుగు వాడారు...కావాలనో, ముఖ్యమంత్రి కాబట్టో!

కామపిశాచులను మార్చలేంగదా. సహజశైలికి అనుగుణంగానే...సినిమా పేజీలో "నేను సర్దుకుపోలేను" అనే శీర్షిక కింద మమతా మోహన్ దాస్ ఇంటర్వ్యూ ప్రముఖంగా వేసింది 'ఈనాడు.' దానికోసం వాడిన ఫోటో అభ్యంతరకరంగా ఉంది. ఆ అమ్మాయిని సెక్సీ గా చూపే వెర్రి ప్రయత్నం. అందులో విలేకరి వేసిన చివరి ప్రశ్న, జవాబు ఇలా ఉన్నాయి.

ప్రశ్న: ప్రత్యేక గీతాలకీ, బికినీల విషయంలో మీ పద్ధతేమిటి? 
జవాబు: కోటి రూపాయలు ఇవ్వడానికి సిద్ధమేనా? సిద్ధమైతే ప్రత్యేక గీతాలకు ఆలోచిస్తాను. బికిని వేసుకోను. బికినీ వేసుకుని అంగాంగ ప్రదర్శనలిస్తేనే గ్లామర్ గా కనిపించినట్లు....అని ఏ శాస్త్రంలోనూ రాయలేదు. చీర కట్టుకున్న వారిని కూడా కెమెరా కన్ను అందంగా చూపుతుందని గ్రహించాలి.


ఈ ప్రశ్న వాక్య నిర్మాణంలో తప్పు ఉందన్న విషయం పక్కన పెడితే..."ప్రత్యేక గీతాలు" అంటే ఏమిటో? ఆమె కోటి అడిగింది కాబట్టి...అది బూతు తరహా ఆల్బం కావచ్చు. ఆ అమ్మాయి బికిని గురించి అంత బాగా చెప్పినా...ఆమె సెంటిమెంట్ ను గౌరవించకుండా....బూతు ఫోటో వాడడం ఏం మర్యాద?

Thursday, February 11, 2010

'ఈనాడు'కు ఏమయ్యింది? ఏంటీ...ప్రాధాన్యతలు?

'ఆంధ్రజ్యోతి', 'సాక్షి' వంటి పత్రికలు ఎన్ని ఉన్నా...'ఈనాడు' చదివితే తృప్తిగా ఉండేది--చాలా రోజుల కిందటి వరకు. కొన్ని రోజులుగా ఈ పత్రిక మొదటి పేజీ చూస్తే...అక్కడ 'సం థింగ్ ఈజ్ సీరియస్లీ గోయింగ్ రాంగ్' అని అనిపిస్తున్నది. 

మొన్ననే 'ముస్లిం కోటా' పై రిజర్వేషన్ల వార్త ప్రచురిస్తూ...మొదటి పేజీ లో ప్రముఖంగా జడ్జిల ఫోటోలు (చట్టాన్ని సమర్ధించిన వారు, వ్యతిరేకించిన వారు అని) తెలివితక్కువగా ప్రచురించారు. ఈ రోజు "మాతో ఆటలొద్దు" అన్న శీర్షిక కింద మొదటి పేజీలో ప్రచురించిన వార్తకు ఛీర్ లీడర్స్ గ్రూప్ ఫోటో ఒకటి వాడారు. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా జర్నలిజం, రవి బాబు జర్నలిజం....రామోజీ జర్నలిజం కాదు.

రామోజీ స్థానంలో ఇప్పుడు ఆ పత్రికను నడుపుతున్న కిరణ్ బాబు మార్కు జర్నలిజమేమో తెలియడం లేదు. గతంలో 'ఈనాడు' ఏదో పచ్చ పార్టీ భజన చేసేది కానీ...ఇలా ఛీప్ ట్రిక్స్ కు పాల్పడలేదు. సినిమా పేజీలో నిన్న వేసిన శివమణి ఫోటో, అంతకు ముందు వాడిన మరొక నటీమణి ఫోటో బరితెగింపు గా ఉన్నాయి. దీన్ని అక్కడ ఎవరూ పట్టించుకోవడం లేదనుకుంటా.
ఇప్పుడున్న పోటీ లో ఆడవాళ్ళ శరీరాలు చూపకుండా వ్యాపారం చేయలేమని కిరణ్ గారు తాను నమ్మే తిరుమల వెంకటేశ్వర స్వామి సాక్షిగా నమ్మితే ఆంధ్ర జనం ఏమీ చేయలేరు. కానీ....సార్..మీ నాన్న గారు ఈ పిచ్చి ఫోటోలు వాడకుండానే...పత్రికను చాలా ఏళ్ళు అగ్రస్థానంలో నిలిపారే!  ఇది ఫోటోల వ్యవహారం. ఇక ప్రాధాన్యతలు.

కావాలనో, ప్రయారిటీలు తెలిచ్చావకనో...ఈ మధ్య 'ఈనాడు' మొదటి పీజీని మన రోశయ్య బాబాయ్ తో నింపేస్తున్నారు. మీడియా రంగంలో ఏకు మేకై కూర్చున్న వై.ఎస్.ఆర్. కుమారుడు జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా అడ్డుకోవడానికి రోశయ్యని 'ఈనాడు' గ్రూపు భుజానవేసుకున్నదన్న మాట జనంలో నలుగుతున్నది.
ఇది నిజమేనా అన్నట్లు....నిన్న, ఇవ్వాళ రోశయ్య గారు మొదటి పేజీ శీర్షికను ఆక్రమించారు. 'సమష్టి బాధ్యత లేదా?' అని రోశయ్య మంత్రులపై గరం గరం అయినట్లు శీర్షిక ఇస్తూ..."అధికార పార్టీ ఎం.పీ.పత్రిక తీరుపై అసంతృప్తి" వెలిబుచ్చినట్లు ఒక డెక్ పాయింట్ పెట్టారు ఈ రోజు. రోశయ్య గారి ఫోటో పెద్దది ఒకటి, చిన్నది ఒకటి మొదటి పేజీలో వాడారు.

ఇక నిన్న..."ఢిల్లీ చూస్తోంది" శీర్షికతో రోశయ్య మంత్రివర్గ సహచరులతో మాట్లాడుతున్న ఫోటో..ఒక పెద్ద వార్త మొదటి పేజీలో ప్రచురించారు. మొన్న, నిన్న మంత్రులతో ఆయన మాట్లాడిందే...'ఈనాడు'కు మొదటి పేజీ వార్త అయ్యింది. మరీ ఘరంగా "మందుల్లేని రోగం" అనే శీర్షికతో...దవాఖానాల మీద "న్యూస్ టుడే" యంత్రాంగం చేసిన ఒక మంచి ప్రజోపయోగమైన వార్తను నిన్న రోశయ్య వార్త కింద వ్యాపార ప్రకటనల నడుమ సమాధి చేశారు. ప్చ్..'ఈనాడు.' 

నాణ్యమైన సీనియర్లను నాజూగ్గా సాగనంపి...ఉన్నవారికి ప్రమోషన్లు, అవకాశాలు ఇవ్వకుండా...మన కులం గోత్రం ఉన్న నయా మేధావి వర్గాన్ని కోర్ టీం గా ఏర్పరిచి...సరుకున్నా... లేక పోయినా పెద్ద పదవులు కట్టబెట్టి...వారే మహా మేధావులుగా నమ్ముతూ... మీడియా నడిపితే...జరిగే నష్టాలు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి 'ఈనాడు' ఇప్పుడు ఒక మంచి కేస్ స్టడీ.
-----------------------------------------------
నోట్: "ఈనాడు" సంపాదకీయం (ఎడిటోరియల్) లో పడిగట్టు పదాల భాషా విన్యాసంపై ప్రత్యేక కథనం...త్వరలో...

Wednesday, February 10, 2010

విలేకరులపై 'యాడ్స్' భారం--ప్రమాదంలో జర్నలిజం

వ్యాపారవేత్తలు ప్రెస్ అధిపతులైతే ముంచుకొచ్చే ప్రమాదాన్ని రెండో ప్రెస్ కమిషన్ ప్రస్తావించింది. బడా వ్యాపారులు మీడియాను గుప్పిట్లో పెట్టుకుంటే ప్రజాస్వామ్యానికి వచ్చే నష్టం ఊహించడం పెద్ద కష్టం కాదు. నల్లదో, తెల్లదో ఏదో ఒక డబ్బున్న మహారాజు అడుగులకు మడుగులొత్తే ఈ వ్యవస్థలో మీడియా చేతిలోఉన్నవాడు ఇప్పుడు కింగ్ ఆఫ్ ది కింగ్స్ అయిపోయాడు.

భూ దందాలు, భవన నిర్మాణాలు, చిట్టీ వ్యాపారాలు చేసుకునే వారు తెలుగు నాట మీడియా ప్రభువులుగా మారిపోయారు. విశాల దృక్పథంతో ఆలోచించి వీరికి ముకుతాడు వేసే యంత్రాంగం, దమ్మున్న జర్నలిస్టులు, మేథావులు, జర్నలిస్టు యూనుయన్లు లేకపోవడంతో...ప్రజాస్వామ్యానికి భయంకరమైన చేటు కలుగుతున్నది.

ప్రజా సేవతో పాటు...ప్రకటనల ద్వారా సంపాదించుకునేందుకు ఛానెల్స్ పెడితే సరే అనుకోవచ్చు. గత ఎన్నికలకు ఒకటి రెండు సంవత్సరాల ముందు పలువురు ధనిక స్వాములు వై.ఎస్.ఆర్. అండ చూసుకోనో, చంద్రబాబు దన్ను చూసుకొనో తెలుగులో ఛానెల్స్ పెట్టారు. మంది ఎక్కువయ్యేసరికి మజ్జిగ పలచన అయ్యింది. దానికి ఆర్ధిక మాంద్యం తోడయ్యింది. వై.ఎస్.ఆర్. మరణం, రాజకీయ పరిణామాలు కూడా తమవంతు ప్రభావం చూపాయి. ఇలా ఈ ఛానెల్స్ అనుకున్నంత గడించలేక గందరగోళంలో పడ్డాయి. దీంతో...ప్రకటనలు తెండని విలేకరుల మీద పెను భారం మోపుతున్నాయి.
విలేకరికి, ప్రకటనకు ముడి పెడితే...జర్నలిజం గోవిందే. ఈ తంతు ఎలా వుంటుందో చూడండి.  

N-TV విషయమే తీసుకుందాం. రియల్ ఎస్టేట్ రంగంలో అడ్డదిడ్డంగా సంపాదించిన నరేంద్రనాథ్ చౌదరి గారు ఈ ఛానల్ పెట్టారు. మీడియా బ్యారెన్ మాదిరిగా ఎన్-టీ.వీ.తో పారు "భక్తి", "వనిత" ఛానెల్స్ పెట్టారాయన. రామోజీ రావు దగ్గర పనిచేసి మీడియా గుట్టుమట్లు, లైసెన్సు కిటుకులు తెలిసిన రామానుజం గారు ఆయనకు సహకరించారు. బాడీలో కాంగ్రెస్ రక్తం ఉన్న చౌదరి గారు వై.ఎస్.ఆర్. మరణంతో చాలా కోల్పోయారు. ఎన్నికలు కాగానే..ఆయన పోగానే...ఆర్ధిక భారం పెరగకుండా చూసుకునేందుకు ఆయన పంచన చేరిన వారు సలహా ఇచ్చారు. అదే...విలేకరులను ప్రకటనల సేకరణకు వాడుకోవడం.

"N-TV ది మరీ దారుణం. భక్తి ఛానల్ పేరిట యాడ్స్ వసూలు చేయమంటున్నారు. విలేకరులకు టార్గేట్స్ నిర్దేశించి...చిత్రహింసకు గురిచేస్తున్నారు," అని ఒక జర్నలిస్టు చెప్పారు. చివరకు మండల స్థాయి విలేకరినైనా వదలడం లేదు. ఇంకా ఘోరం ఏమిటంటే...మంచి స్టోరీలు రాబట్టేందుకు...జిల్లాలలో విలేకరుల కోసం పెట్టే సమావేశంలో ఒక సీనియర్ జర్నలిస్టు హైదరాబాద్ నుంచి వెళ్లి సిగ్గూ ఎగ్గూ లేకుండా..ప్రకటనలపై ప్రసంగించి...ఒత్తిడి తెస్తున్నాడు. 

ఇది ఒక్క చౌదరి గారి ఛానల్ లో మాత్రమే కాదు. 90 శాతం ఛానెల్స్ లో ఇదే తంతు కొనసాగుతున్నది. దీనివల్ల జర్నలిస్టులు ఒత్తిడికి లోనవుతున్నారు, జర్నలిజం ప్రమాదంలో పడింది. ఈ ధోరణిని జర్నలిస్టు సంఘాలు వెంటనే పట్టించుకోవాలి.

ఇలా ప్రకటనలు వసూలు చేయమంటే ఎమిజరుగుతుంది? ప్రకటనల సేకరణ ఒత్తిడి వల్ల విలేకరి రాజకీయ నేతతో లాలూచీ పడతాడు. నేతలపై ఆధారపడ్డ గుండాలు, అవినీతిపరులు కూడా దీని వల్ల తప్పించుకుంటారు. విలేకరులు ఒక్క పరిశోధనాత్మక స్టోరీ అయినా చేయలేరు. విలేకరికి దొరికిన వాడు కూడా..ప్రకటన ఇస్తా...అని తప్పించుకోవచ్చు. ఈ ధోరణి వల్ల...విలేకరి-నేత-అధికారి-వ్యాపారి-పోలీసు-గూండా సభ్యులుగా నయా మాఫియా ఏర్పడుతుంది.  ఇది సమాజానికి మంచిది కాదు.

Tuesday, February 9, 2010

ముస్లిం కోటాపై 'ఈనాడు' ఓవర్ యాక్షన్

'ముస్లిం కోటా చెల్లదు' అనే వార్తకు ఈరోజు 'ఈనాడు' పత్రిక సముచిత ప్రాధాన్యం ఇస్తూనే..పతాక కథనం (బ్యానర్ స్టోరీ) గా ప్రచురించింది. కానీ..అది వాడిన ఒక ఏడుగురు న్యాయమూర్తుల ఫోటోలు అభ్యంతరకరంగా ఉన్నాయి. 

జడ్జీలు వృత్తిధర్మంలో భాగంగా...కేసును అధ్యయనం చేసి ఒక తీర్పు ఇస్తారు. ఒక బెంచిలో భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. వార్తకు ప్రాణం...కేసులో అంశాలను ఎవరు సమర్ధించారు, ఎవరు వ్యతిరేకించారు? అన్న పాయింట్ కాదు. తీర్పు సారం ఏమిటన్నది వార్త. అలాంటిది 'ఈనాడు' వారు..."చట్టాన్ని కొట్టివేస్తూ తీర్పునిచ్చిన న్యాయమూర్తులు" అనే శీర్షిక కింద ఒక ఐదుగురు జడ్జిల ఫోటోలు, "సమర్ధించిన న్యాయమూర్తులు' శీర్షిక కింద మరొక ఇద్దరి ఫోటోలు మొదటిపేజీలో ప్రముఖంగా ప్రచురించారు.

ఇది నాకు అభ్యంతరకరంగా తోచింది. ఇంత సున్నిత అంశంపై ఇచ్చిన తీర్పుకు ఇలాంటి డిస్ ప్లే ఇవ్వడం మంచిది కాదు. ఆ ఫోటోలు అంత ప్రముఖంగా ప్రచురించేటంత రిలవన్సు కలిగి వున్నాయని అనిపించడం లేదు. మరే పత్రికా...ఇలాంటి సాహసం చేయలేదు. జడ్జిలూ మానవమాత్రులే...వారి మీదకు ఒక వర్గం వారిని ఉసికొల్పేలా ఫోటోలు వాడడం బాగోలేదు. అది బాధ్యతాయుతమైన పని కాదు.

Sunday, February 7, 2010

అవినీతి డబ్బు వల్ల జబ్బు చేస్తుందా? జీవితంలో గబ్బు లేస్తుందా??

ఈ ఆదివారం రోజు తిండి (వెల్లుల్లి, శనగపప్పు దట్టించిన కాకరకాయలు సైడ్ డిష్ గా తోటకూర, మెంతికూర పప్పు ప్లస్ మజ్జిగ చారు...వగైరా) గురించి రాయడానికి పసందైన దినుసులు ఉన్నా...'ఫర్ గాడ్స్ సేక్..ఇలాంటి రాతలు వద్దు బాబోయ్' అని మొత్తుకుంటున్న రమణన్నకు  భయపడి భుక్తాయసంతో కొత్త టాపిక్ మొదలెట్టాను. అదే..నీతీ నిజాయితీ--అవినీతీ. 


మంత్రులూ...వ్యాపారాలు వద్దు..అని ప్రధాని మన్మోహన్ సింగ్ ఉద్బోధ చేస్తే...నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కావడంలేదు. ఆదర్శప్రాయమైన పటాటోపం లేని జీవితం గడపండి అంటే..ఆ పార్లమెంట్ లో ఒక పది మంది ఎం.పీ.లైనా మిగలరు. సగం మంది రాజకీయంలోకి వచ్చేది ఒక పది తరాల మందం వెనకేసుకోవడానికి. నాకు అవినీతి విషయంలో ఒక ధర్మ సందేహం ఎప్పుడూ కలుగుతుంది. 'ధర్మో రక్షతి రక్షితః' అన్న మాట ఎందుకో గానీ మనసులో నాటుకుపోయింది. అది అక్షర సత్యం అని నాకు చాలా సార్లు నిరూపితమయ్యింది. 
'ది హిందూ' లో పనిచేస్తున్నప్పుడు...ఈ ధర్మం, అధర్మం మీద ఒక ప్రయోగం చేసి కొన్ని విషయాలు తెలుసుకున్నాను. అది మంచి సంస్థే కానీ...జిల్లాలో రిపోర్టర్ కు ఆఫీసు ఇవ్వరు. మన ఇంట్లో ముందు గదే ఆఫీసు. కరంటు బిల్ ఇవ్వరు. అదొక రాయల్ దోపిడీ. ఇదేంటి సార్...దారుణం...అంటే.."ఒకటి రెండు టూర్ బిల్లులు పెట్టుకో...నేను పాస్ చేస్తాను. దానికి దానికి సరిపోతుంది," అని ఒక బాస్ చెప్పీ చెప్పనట్లు చెప్పారు. 

ఈ దొడ్డిదారి ఏర్పాటులో భాగంగా నేను కొన్ని టూర్ బిల్లులు (అంటే...దొంగ బిల్లులన్న మాట) అప్పుడప్పుడు పెట్టేవాడిని. నన్ను నమ్మండి...దొంగ బిల్లు పెట్టి ఒక రెండు వేలో, మూడు వేలో పోగేస్తే...కచ్చితంగా ఆ మొత్తానికి సరిపోను అదనపు ఖర్చు ఆ నెల వచ్చి తీరేది. ఎప్పుడు ఆ టూర్ బిల్ పెట్టినా...ఏదో ఒక నష్టం వచ్చి...ఆ అదనపు సంపాదన మేర జేబుకు చిల్లు పడేది. ఈ పాట్రన్ ను జాగ్రత్తగా స్టడీ చేసి అలాంటి బిల్స్ పెట్టకుండా...వచ్చిన జీతంతో సరిపుచ్చుకున్నాను, హాప్పీ గా బతికాను.
ముందు నుంచీ.. అబద్ధాలు చెప్పడం మహా దారుణం అన్న స్పృహ ఉంది. 'ది హిందూ' లో అనుభవాలు నేర్పిన పాఠాలతో ధర్మం పై మరింత నమ్మకం కుదిరింది. ఒకడి సొమ్ము ఆశించకుండా...ఎవ్వరినీ మోసం చేయకుండా, అబద్ధాలు చెప్పకుండా..నీతీ నిజాయితీ గా బతకడం వల్ల జీవితం సుఖంగా సాగిపోతుందని...పెద్దగా కష్టాలు దరిచేరవని నిర్ధారణకు వచ్చాను. అందుకే...అబద్ధాలు లేని జీవితం కోసం ఒక సంస్థ స్థాపిస్తే...ఒక్కడంటే ఒక్కడైనా అందులో చేరలేదు. అది వేరే విషయం. 


అయితే...నా పరిశీలనలో తేలింది ఏమిటంటే...అవినీతి మార్గాల ద్వారా సొమ్ము సంపాదించిన వాళ్ళలో చాలా మందికి అనారోగ్యం ఉన్నది. వాళ్లకు బీ.పీ., షుగర్, ఇంట్లో భార్యకు నలత, పిల్లలకు ఏదో లోపం, వారి కుటుంబంలో ఏదో తెలియని దిగులు ఉంటున్నాయి. మీ చుట్టూ ఉన్న అవినీతిపరుల కేసి ఒకసారి చూడండి, నిజం తెలుస్తుంది. నల్గొండ బీ.ఎస్.ఎన్.ఎల్.లో భారీ కుంభకోణానికి పాల్పడిన ఒక సీనియర్ అధికారిని ఒక పరిశీలనలో భాగంగా కలిసాను. వాడికి విచిత్రంగా అర చేతిలో నుంచి చీము వచ్చే ఒక జబ్బు సోకింది.  ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. 
మరి అందరు అవినీతి పరులకు అలా జరుగుతున్నదో లేదో నాకు తెలియదు. ఎందుకంటే...దానికి ఒక శాస్త్రీయ అధ్యయనం అవసరం. అలాగే ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు అంతా అవినీతి పరులని అనడమూ తార్కికం కాదు. ఇది కొంత ఆధ్యాత్మిక చింతనగా తోచినా...అవినీతికి ఆరోగ్యానికి ఏదో సహ సంబంధం లేదా కార్యకారం సంబంధం ఉందని నేను గట్టిగా నమ్మే పరిస్థితికి వచ్చాను. హిందూ శాస్త్రాలు, ఇతర మతాలలో పాపం-శిక్ష గురించి చదివాను కానీ..ఇక్కడి పాపానికి ఇక్కడే శిక్ష ఉన్నట్లు నాకు అనిపిస్తున్నది.  ఈ అంశంపై మీ అభిప్రాయలు కూడా తెలియజేయండి. 

ఈ రోజు తేజ ఛానల్ లో వచ్చిన "బ్రహ్మర్షి విశ్వామిత్ర' సినిమాలో సత్య హరిశ్చంద్రుడు ఒక మాట అంటాడు: "సత్యం పలకడం అనేది పరులకోసం చేసే పని కాదు. ఇది మానవ జీవిత గమనానికి సంబంధించిన అంశం."
గ్రీకు వీరుడు అలగ్జాండర్ మరణ శయ్య పై ఉండి తన మిలిటరీ జనరల్స్ ను ఒక మూడు కోరికలు కోరతాడట. అవి:
1) నా శవ పేటికను నా వైద్యుడు మొయ్యాలి
2) నా శవ యాత్ర జరుగుతున్నప్పుడు...నేను ఇన్నాళ్ళు సంపాదించిన వజ్రాలు, బంగారం, సంపద..రోడ్డు మీద చల్లుతూ పోవాలి 
3) నా రెండు చేతులు శవ పేటిక లోపల కాకుండా..బైట ప్రజలంతా చూసేలా వుంచి ఊరేగించాలి. .
ఎందుకిలా అని జనరల్స్ అడిగితే..."నా వైద్యుడు మోయాలని ఎందుకు అన్నానంటే...మరణాన్ని ఎవ్వరూ తప్పించలేరని జనానికి తెలియజెప్పడానికి. ఇంత సంపద ఉన్నా...నా చావు ఆగలేదని చెప్పేందుకు రెండో కోరిక కోరాను. ఇక మూడో కోరిక అంటారా...ఇన్ని ఘోర యుద్ధాలు చేసి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పరిచిన నేను పొయ్యేటప్పుడు...ఒట్టి చేతులతో పోతున్నానని ప్రజలకు తెలియాలి." 
మన ఎం.పీ.లు, రాజకీయ నాయకులు, పేరాశ అధికారులు, జనం మెదళ్ళను బ్రష్టు పట్టిస్తున్న మీడియా జనం...ఇవి గుర్తుపెట్టుకుని...జీవిస్తే...అందరం సుఖంగా ఉండ వచ్చేమో!

Saturday, February 6, 2010

తెలుగు భాషకు 'వాచిపోతున్నది' ఇక్కడ....


భాషకు కూడా శుచి, శుభ్రతలు ఉన్నాయి. పరాయివైనా మంచి పదాలు వచ్చి చేరితే..సమస్య ఉండదు. పిచ్చి పదాలను జనంలో పదేపదే చెలామణీ చేసి భాషను సంకరం చేయడం తప్పు. 
సరైన అర్థమేనా కాదా అన్నదానితో సంబంధం లేకుండా.... కొన్ని సార్లు అర్థం తెలియకుండా మనం కొన్ని పదాలు వాడుతూ ఉంటాం. సినిమాలు, టీ.వీ.లు, పత్రికల పుణ్యాన అవి జనం వాడుకలోకి వచ్చి స్థిరపడతాయి. తీరా అవి స్థిరపడి జనం నోళ్ళల్లో నానాక...అరె..ఇందులో బూతు ధ్వనిస్తుందే...అని అనుకున్నా లాభం ఉండదు.

చూడక...చూడక...మళ్ళీ ఆదివారం ముందు రాత్రి తెలుగు ఛానళ్ళు చూశాక ఈ పోస్ట్ రాయాలనిపించింది. ఈ పద్నాలుగు ఛానెల్స్ లో ఎందులోనో కానీ...ఒక లేడి యాంకర్...వార్తలు చదువుతూ..."అలా చేయకపోతే...వాచిపోతుంది" అని చదివారు. ఆ పదం ఆమె చదివిన వాక్యంలో అతికినట్లు అనిపించకపోగా....భలే ఎబ్బెట్టుగా తోచింది. కనీసం బూతు మాటలైనా సరిగా రాని లేటెస్టు తరానికి అర్థం కాదు కానీ...ఇలాంటి మాటలు ఎందుకో సంసార పక్షంగా అనిపించవు. 

ఇక్కడ 'వాచిపోతుంది' అంటే...'అలా చేయకపోతే...ఇబ్బంది/ ప్రమాదం తప్పదు,' లేక 'శిక్ష పడుతుంది' అని అర్థం. "అబ్బ..డాడీ...నాకసలే వాచిపోయే హోం వర్క్ ఉంటే...వేరే పనులు చెబుతారేం?' అని ఒక స్కూలు విద్యార్థిని అనడం విన్నాను. ఇలాంటి పదాలను విరివిగా వాడి వాటిని వ్యవస్థీకృతం చేసే సినిమాలను అని తీరాలి. 

"ఆ సుత్తి (ఈ పదమూ సినిమా ప్రసాదమే) విని వినీ నా తల వాచిపోయింది," అంటే ఓకే. ఏమి వాచిందో చెప్పకపోతేనే చిక్కు వస్తుంది. "నువ్వు అన్నీ మూసుకో" అనడం వేరు..."నువ్వు నోరు మూసుకో," అనడం వేరు.
అలాగే...అద్దరకొట్టడం లేదా అదుర్స్. నిజానికి నాకు తెలిసినంత వరకు..."నువ్వు అదరకొట్టకురా...." అంటే.."నేను చెప్పేది కాదు అని తోసిపుచ్చి మాట్లాడకు" అని అర్థం. కన్ను అదరడం అంటే...అది అనుకోకుండా...జర్క్ ఇవ్వడం."అద్దిరిపోయింది" అంటే...చాలా బాగుందని అన్నమాట.

"ఆ మాట వినే సరికి ఆయనకు ఎక్కడో కాలింది," అన్న ద్వంద్వార్ధపు మాట చాలా చోట్ల తగులుతున్నదీ మధ్య. సినిమాలలో బ్రహ్మానందం బ్యాచ్ ఈ మాటకు విపరీతమైన ప్రాచుర్యం కల్పించింది. "దొబ్బమాకు లేదా దొబ్బకు" అనే పదం చిన్నప్పుడు ఒక బూతు అర్థంలో వాడే వాళ్ళం...ఇప్పుడది నిత్యజీవనంలో క్షణక్షణానికి పునరావృతమయ్యే మాటై కూర్చుంది. నూకడం/ దొబ్బడం అంటే 'నెట్టడం' అన్న అర్థం కొన్ని చోట్ల ఉంది.

"ఎంట్రా...వాడు పిలవగానే ఏంటీ అబ్బో తెగ ఎగేసుకుని పోతున్నావ్?" అన్న డైలాగు చాలా సార్లు వినివుంటాం. ఈ "ఎగేసుకు పోవడం" ఏమిటి? అలాగే..."ఏంటమ్మా...తెగ ఊపుకుంటూ వస్తున్నావ్?" అన్న మాట కూడా తరచూ వినేదే. ఈ 'ప'కారం పక్కన 'క'కారం పెడితే...మా గురువు గారు బూదరాజు రాధాకృష్ణ గారు మాటల తూటాలతో శిష్యహత్య చేసే వారు. దాన్ని పలికినప్పుడు బూతు మాట ధ్వనిస్తుంది కాబట్టి ఆ రూలు. 

(ఆయన దగ్గర అక్షరాలు నేర్చుకుంటున్నప్పుడు..'హీరో పుక్' అనే బండి మార్కెట్ లోకి వచ్చింది. ఇందులో 'ప'పక్కన 'క' వచ్చింది కాబట్టి...గురువు గారి రూలు కు అనుగుణంగా రెండు అక్షరాలను బ్రేక్ చేసి 'హీరో పునక్' అని పిలిచే వాళ్ళం.)

ఇలా బూత్వర్థంతోనో...బూతుకు సమాన అర్థంతోనో...కొన్ని పదాలు/ పదబంధాలు ఈ తియ్యని తెలుగుని సంకరం చేస్తున్నాయి. డొక్క శుద్ధి, సరైన శిక్షణ లేకపోయినా....సీ.ఈ.ఓ.ల బూట్లు నాకి...యజమానుల మెప్పు పొందిన పలువురు నయా మేధావులు మీడియాను దున్నేస్తున్నారు కాబట్టి...ఇలాంటి పదాలకు చాలా ప్రచారం లభిస్తున్నది. దీన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు.

ఇదేంట్రా....ఈ యాంకర్ పిల్ల....చాలా ఆలవోకగా...వాచిపోతుందని...వార్న్ చేస్తున్నదని...అనుకుని...ఛానల్ మార్చి zee-24 gantalu దగ్గర స్థిరపడితిని కదా...అక్కడొక వింత తప్పు దొరికింది. 
తెలుగులో...."చెవి కోసుకుంటాడు" అంటే...ఏదైనా ఆసక్తి కలిగించే అంశం అంటే సదరు మనిషికి చాలా ఆశక్తి/ శ్రద్ధ అని అర్థం. మన జీ-టీ.వీ.మిత్రుడు..సీ.పీ.ఐ.నారాయణ గారికి చికెన్ మీద ఉన్న ప్రీతిపై ఒక ఆఫ్-బీట్ స్టోరీ ప్రసారం చేస్తూ...."నారాయణ చికెన్ అంటే...చేవికోసుకుంటారు," అని చదివారు. కానివ్వండి బాబూ....తెలుగు భాషను కైమా కింద కొట్టి పారెయ్యండి.      

ఎన్-టీ.వీ. అరుణా? కాంగ్రెస్ స్పోక్స్ ఉమనా?

ఎన్-టీ.వీ.కి దేశ రాజధానిలో ప్రతినిధి గా ఉన్న అరుణ గారు పలు సందర్భాలలో ఫక్తు కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నారు. కొద్ది నిమిషాల కిందట పరకాల ప్రభాకర్ గారి "నమస్తే ఆంధ్రప్రదేశ్" షో లో ఢిల్లీ నుంచి లైవ్ లో ఆమె ఇచ్చిన విశ్లేషణ ఈ అనుమానానికి మరింత ఊతం ఇచ్చేదిగా ఉంది. 
కాంగ్రెస్ కమిటీ లో వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డితో పాటు ఆయన తండ్రి నమ్మిన బంటు కే.వీ.పీ.రామ చంద్ర రావుకూ ఎందుకు చోటు కల్పించినట్లు అని ప్రభాకర్ గారు అడిగితే...ఆమె విశ్లేషణను అందిస్తూ...."జగన్ క్రౌడ్ పుల్లర్. ఈ ప్రాంతంలో అయినా...ఆయన జనాలను ఆకర్షించగలరు," అని అరుణ గారు తేల్చేసారు. 
"మనం అలా చూడడం కరక్ట్ కాదు ప్రభాకర్ గారు.." అని ఒక దశలో ఆమె చెప్పారు. ఏ.ఐ.సీ.సీ.కి సొంత లాభాల దృష్ట్యా...భవిషత్తులో వీరిద్దరి వల్ల కలిగే మేలు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె చెప్పారు. అదేదో...తాను భావిస్తున్నట్లో...అలా అని సోర్సులు చెప్పాయనో...ఎవరో అనుకుంటూ ఉన్నారనో చెబితే...సరే అనుకోవచ్చు. అలా కాకుండా...రిపోర్టర్ ఒక పార్టీ అధికార ప్రతినిధిగా మాట్లాడితే ఎలా?
అరుణ గారే కాదు...ఏ రిపోర్టర్ అయినా..ఈ విశ్లేషణల పేరిట నోటికొచ్చింది చెప్పడం బాగుండదు. జనం నవ్వుకుంటారు. లైవ్ లో ఏదో హడావుడిగా నోటికి ఏది వస్తే అది...బాస్ కు నచ్చే నాలుగు మాటలు చెప్పడం...ఢిల్లీ రిపోర్టర్ లకు ఎక్కువయ్యిందని ఆరోపణలు ఉన్నాయి. వారు మరోలా అనుకోకుండా...కాస్త డొక్క శుద్ధి పెంచుకుని, వృత్తిలో రాణించాలని మనవి.

ఈ మధ్య ఎన్-టీ.వీ. ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న డిబేట్లు కూడా సమంగా లేవనిపిస్తున్నది. ఒక ప్రాంతం నేతను ఒక ప్రశ్న అడగడం...ఆయన అది చెప్పగానే..."మరి ఆయన అలా అంటున్నారు..మరి మీరు ఏమనుకుంటున్నారు" అని వేరే ప్రాంత నేతను అనడం...మాటిమాటికీ ఈ ప్రక్రియ సాగడం చూపరులకు ఇబ్బందిగా ఉంటుంది. ఒక మహిళా రిపోర్టర్ దేశ రాజధానిలో వివిధ ఛానెల్స్ లో పనిచేసిన అనుభవంతో దూసుకుపోవడం గర్వకారణమే. అయినా...మన మిత్రులు మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి...స్కిల్ల్స్ పెంచుకోవడానికి....పని తీరు మెరుగు పరుచుకోవడానికి...యాజమాన్యాలు కూడా సహకరిస్తే...బాగుంటుంది.

Friday, February 5, 2010

గిల్లి కజ్జం పెట్టిన 'ఆంధ్రజ్యోతి'--పిచ్చి ఫోటోతో 'ది హిందూ'

ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ సమైక్యంగానే ఉంది. ప్రత్యేక రాష్ట్రం కావాలని తెలంగాణా ప్రజలు, వద్దు..సమైక్యతే ముద్దు...అని ఇతర రెండు ప్రాంతాల వారు కోరుకుంటున్నారు. రెండు పక్కలా వాతావరణం ఉద్విగ్నంగా ఉన్న సమయంలో మీడియా చాలా బాధ్యతగా వ్యవహరించాలి. కానీ...ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో "వేమన వర్సిటీకి తెలంగాణా వీ.సీ." అనే స్టోరీ ప్రచురించి...ఆ నిర్ణయం ఏదో భయంకరమైన తప్పు అన్న కలర్ ఇచ్చింది. 

కడపలో ఉన్న యోగి వేమన విశ్వ విద్యాలయం వీ.సీ.గా ఇంతకు ముందు  ప్రొఫెసర్ అర్జుల రామచంద్ర రెడ్డి ఉన్నారు. ఆయన మంత్రి పొన్నాల గారికి దగ్గర. ఆ విశ్వ విద్యాలయం కొత్తగా ఏర్పడినప్పుడు ఉన్న సమస్యలను ఆయన చాకచక్యంగా సరిచేసారు. రాజకీయ ఒత్తిళ్ళు ఉన్న జిల్లా అయినా...చేతనైనంత బాగానే వ్యవహారం నడిపారు. 
అలాంటి వ్యక్తిని మళ్ళీ వీ.సీ.ని చేయాలని గవర్నర్ గారు నిర్ణయించినట్లు ఆ పత్రిక కథనం. ఎందువల్ల గవర్నర్ ఆ నిర్ణయానికి వచ్చారో రాస్తే బాగుంటుంది కానీ...గిల్లి కజ్జం పెట్టినట్లు...."తెలంగాణా వ్యక్తికి అక్కడి పదవి ఇవ్వటమా!" అనే రీతిలో రాయడం తప్పు. పైగా...రెడ్డిగారు ఎక్కడ పుట్టింది...వంటి సూక్ష్మ వివరాలు ఇస్తే ఏమిటన్నట్లు? "ఒరేయ్ బాబు...రాయలసీమలో ఉన్న విశ్వ విద్యాలయానికి తెలంగాణా వాడు వస్తున్నాడు...మరి చూసుకోండి," అని అక్కడి జనాలను రెచ్చగొట్టినట్లు కాదా? 

"రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణా, సమైక్యాంధ్ర ఉద్యమాలు కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో తెలంగాణా ప్రాంతానికి చెందిన వ్యక్తిని కడప కేంద్రంగా ఉన్న వర్సిటీకి వీ.సీ.గా నియమించడంలో...." అన్న వాక్యం కూడా ఈ వార్తలో ఉంది.
 "ది హిందూ' ఫోటో కౌశలం

జర్నలిజంలో ఫోటోల ప్రచురుణలో ఎడిటర్లు తప్పనిసరిగా కొన్ని నైతిక విలువలు పాటించాలి. ఒక రాజకీయ నాయకుడో, అధికారో వేదికపై తన పక్క సీట్లో కూర్చున్న మరొక ప్రముఖురాలిని చూస్తున్నప్పుడు ఒక కోణంలో ఫోటో తీసి..."వేదికపై ఉన్న స్త్రీని ఓరకంట చూస్తున్న ప్రముఖుడు" అని కాప్షన్ రాయవచ్చు. అలాగే...దీర్ఘాలోచనలో ఉన్న ప్రముఖుడి ఫోటో మరొక యాంగిల్ లో తీసి....ఆయన మీటింగ్ లో ఒక కునుకు తీస్తున్నట్లు కాప్షన్ రాయవచ్చు. ఇవన్నీ...ఫోటోగ్రాఫర్ ప్రతిభ, అతితెలివి మీద ఆధారపడే అంశాలు. 

ఈ రోజు మన 'ది హిందూ' ప్రొఫెసర్ కోదండ రామ్ గారు ఎక్కడో రోడ్డు మీద సహపంక్తి భోజనం చేస్తున్న ఫోటో ప్రచురించింది. కోదండ రామ్ గారు ముద్ద నోట్లో పెట్టుకుంటూ ఉండగా ఫోటో గ్రాఫర్ నగర గోపాల్ కింది నుంచి (లో యాంగిల్) ఈ ఫోటో తీసారు. ప్రచురితమైన ఫోటో చూస్తే ఎలా ఉంది అంటే...కోదండ రామ్ గారు పిచ్చి ఆకలితో చాలా ఆబగా తింటున్నట్లు ఉంది. ఇలాంటి ఫోటోలు ప్రచురించేటప్పుడు పేజి ఎడిటర్లు జాగ్రత్త పడాలి. 

Thursday, February 4, 2010

తెలుగు టీ వీ చానెళ్లకు బ్యాక్ గ్రౌండ్ పాటల పిచ్చి

సాధారణంగా ఇంట్లో ఎవరైనా తనువు చాలిస్తే...కుటుంబ సభ్యులకు దుఃఖం కలుగుతుంది. అదే కుటుంబ పెద్ద అకాల మరణం చెందితే ఆ ఫ్యామిలీ కి  కలిగే బాధ అంతా ఇంతా కాదు. అయితే...మంచికైనా..చెడుకైనా...గరిష్ట స్థాయిలో ప్రభావం (మాక్జిమం ఇంపాక్ట్) ఉండేలా కార్యక్రమాలు రూపొందించాలని...అది..ప్రేక్షకుల మనసులు దోచుకుంటుందని తెలుగు టీ.వీ.ఛానెల్స్ నమ్మకం.
మొన్నకు మొన్న విజయవాడలో ఒక పసిపాప నాగ వైష్ణవిని మామ వరస అయ్యే వ్యక్తి ఒక హంతక ముఠాతో కిడ్నాప్ చేయించి అత్యంత కిరాతకంగా చంపించి...మృత దేహాన్ని ఒక కొలిమిలో పడేసి సంచలనం సృష్టించాడు. ఈ వార్త విన్న మనిషి ఎవరికైనా గుండె బరువు ఎక్కుతుంది. బెజవాడలో ఇలాంటి నికృష్ట పనులు చేసే బ్యాచులు ఉన్నట్లు అందరికీ తెలుసు కానీ...మరీ ఒక చిన్నారిని ఇంత కిరాతకంగా చేస్తారని ఎవరు మాత్రం అనుకుంటారు?

సినిమా..క్రైం వార్తలు దొరికితే పండగ చేసుకునే తెలుగు మీడియా...కారు డ్రైవర్ హత్యను, ఆ పాప హత్యను, ఆ తర్వాత పాప తండ్రి ప్రభాకర్ మరణాన్ని చాలా ప్రభావశీలంగా ప్రజలకు అందించాయి. ఈ ఉదంతం మానవత్వానికి మచ్చ తెచ్చేది కాబట్టి....ఇందులో  ఒక పెద్ద డ్రామా ఉంది  కాబట్టి...సహజంగానే టీ.వీక్షకులు ఈ కార్యక్రమాన్ని తిలకించారు. ఇక...ఈ వార్తను, సంబంధిత స్టోరీ లను అత్యంత ప్రభావశీలంగా అందించేందుకు అన్ని తెలుగు ఛానెల్స్ పోటీ పడ్డాయి.

ఈ పోటీ నుంచి పుట్టిందే...బాక్ గ్రౌండ్ పాటల పిచ్చి.  తెర నిండా...నవ్వులు చిందిస్తున్న వైష్ణవి ఫోటో...తను పుట్టినరోజు నాడు తండ్రికి ముద్దు ఇస్తున్న వీడియో క్లిప్పింగ్...జనం వారి ఇంటి దగ్గర భారీగా గుమి కూడిన దృశ్యం చూపిస్తూ....కొన్ని ఛానెల్స్ విషాదం వర్షంలా కురిసే తెలుగు సినిమా పాటలు వేసాయి. zee-Telugu మిత్రులు ఇంకాస్త ఎక్కువ స్పందించారు.

ప్రత్యేకంగా...ఈ దారుణం పైనే ఒక పాట రాయించినట్లు ఉన్నారు వీరు. "ఏ పాపం ఎరుగని చిన్నతల్లీ..చిరునవ్వులే మాయం చేసారా తల్లీ..." అని డప్పు కొట్టుకుంటూ ఒక తెలంగాణా గాయకుడు పాడుతుంటే....అప్పటికే ఈ ఘోరంతో గుండె పగిలిన జనం తల్లడిల్లిపొయ్యారు. అది గుండె, మెదడు, నరాల మీద చాలా ప్రభావం చూపేదిగా ఉంది. అసలు డప్పు పాట అంటేనే గుండె కదిలించే సాధనం. 
రిపోర్టింగ్ లో ఎన్నో మరణాలు చూసిన నాకే...ఈ పాట..ఆ దృశ్యాలు గుండె మీద పని చేసాయి. ఒక్క క్షణం గుండె కలుక్కు మంటే....లేనిపోనిది...మనం కూడా పోతామేమో అని...ఒక ఆటల ఛానల్ పెట్టుకుని విషాదాన్ని దిగమింగుకున్నా. "బాల్యమందే నిన్ను చంపిందా...ఈ పాపిష్టి లోకం తల్లీ," "కొలిమిలో వేసి నను చంపారా తల్లీ.." వంటి విషాదకర చరణాలు ఆ సాంగ్ లో ఉన్నాయి.
సాక్షి, TV-1 వంటి ఛానెల్స్ కూడా బాక్గ్రౌండ్ పాటలు ధాటిగా వచ్చాయి. ఆ పాటలు నోట్ చేసుకున్న పేపర్ పోబట్టి అవి ఇక్కడ రాయలేక పోతున్నాను. ఇలా పాటలు వేయడంలో N-TV, TV-5, i-news కూడా చాలా ముందు ఉంటాయి. బోరు బావిలో పడి బాలుడు మరణించినప్పుడు, వై.ఎస్.ఆర్.మరణం తర్వాత కూడా ఛానెల్స్ ఇలాంటి పాటలే వేసాయి. 
నిజంగా ఒక విషయాన్ని ఇంత ప్రభావశీలంగా చూపించాల్సిన అవసరం ఉందా? ఒక మంచి స్క్రిప్టుతో వాస్తవాన్ని వాస్తవంగా చూపితే జనం చూడరా? ఏమో!
కాస్త సంసార పక్షంగా నడిచే ఇంగ్లీష్ ఛానెల్స్ లో ఇలా సినిమా పాటల మీద ఆధారపడి టీ.వీ.లు కార్యక్రమాలు చేయడం అరుదు. ఇదే విషయం ఒక సీనియర్ జర్నలిజం టీచెర్ తో నేను ప్రస్తావిస్తే....ఆయన భలే మాట చెప్పారు. దీన్ని 'wailing widow syndrome' (భర్త చనిపోతే భార్య పడే  అలవిగాని బాధ) అంటారనీ,  ఇది తెలుగు ఛానెల్స్ లో పతాక స్థాయికి చేరిందని ఆయన చక్కగా చెప్పారు. 
------------------------------------------
నోట్: పీహెచ్.డీ. పని ఒత్తిడి, ఉజ్జోగం, డెస్క్ టాప్ దెబ్బతినడం, మొన్నటి వరకూ టీ.వీ.కనెక్షన్ లేకపోవడం... వల్ల కొత్త పోస్టులు పెట్టలేదు.అంతే తప్ప కొందరు భావించినట్లు బెదిరింపులు...హెచ్చరికలు కారణం కాదు. మనం కూడా సై అంతే సై రకమే. ఇక క్రమం తప్పకుండా పోస్టులు ఉంటాయి. థాంక్స్  

Monday, February 1, 2010

హైదరాబాదీ 'ఇరానీ చాయ్': నో లింగవివక్ష భాయ్

హైదరాబాద్ అనగానే మొఘలాయీ బిర్యాని, ఇరానీ చాయ్ స్ఫురణకు వస్తాయని అంతా చెబుతారు. భీకరంగా ఆకలి వేస్తున్నప్పుడు నిమ్మరసం పిండిన ఉల్లిగడ్డ, పచ్చి మిర్చి నంజుకుంటూ బిర్యాని లాగిస్తే నా సామిరంగా స్వర్గం కనిపించాల. హైదరాబాద్ హౌజ్ లో ఆలస్యంగా సర్వ్ చేస్తారు గానీ... అక్కడ చికెన్ బిర్యాని చాలా రుచికరంగా ఉంటుంది. ఆడా మగా వెళ్లి హోటళ్ళలో ఈ బిర్యాని ఆస్వాదిస్తూ హైదరాబాద్ పేరును దేశ విదేశాలలో మార్మోగేలా చేస్తారు.

ఇక రోడ్లపక్క ఉండే ఇరానీ చాయ్ కూడా భలే కమ్మగా ఉంటుంది. అక్కడ దొరికే ఉస్మానియా బిస్కట్లు నంజుకుంటూ చాయ్ తాగితే...మజా వస్తుంది. (అక్కడ ప్లేటులో పెట్టిన బిస్కట్లు అన్నీ పూర్తిగా తినాలి కాబోలు అని పొరపడి ఆకలి లేకపోయినా...తిన్న సోదరులున్నారు. అలాగే...'ఉస్మానియా లావ్ భాయ్' అని ఆర్డర్ ఇస్తే...ఇదేంట్రా...అని వెర్రి చూపులు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు.)   
సరే...తిండి బాగున్నప్పుడు భార్యా, బిడ్డలు పక్కన వుండాలని, వారితో కలిసి తినడం, తాగడం చేయాలని ఎవ్వరికైనా అనిపిస్తుంది.
రోడ్డు పక్క హోటల్ లో దొరికే ఇరాని చాయ్ లాగించడానికి వెళ్ళినప్పుడల్లా...నాకు లింగ వివక్ష స్పష్టంగా కనిపిస్తుంది. దానికి ఆ పదం అటుకుతుందో అతకదో కానీ...అక్కడైతే..అంతా మగ వాళ్ళే. ఒక ఆడ పురుగూ కనిపించదు. ఇది నాకు నచ్చలేదు. సంధ్యక్క లాంటి ఫెమినిస్టులు ఉన్న నేలపై ఇదేమి దారుణం?
ఈ హోటల్ వాళ్ళు లేడీస్ రావద్దు....అని చెప్తారంటే నేను నమ్మను. మరి ఎందుకో...ఐ.టీ.లో పనిచేస్తూ బాగా సంపాదిస్తున్న ఆడపిల్లలు సైతం నాకు అక్కడ కనిపించలేదు. ఇరాని చాయ్ నచ్చకనే వారు రావడంలేదేమో నాకు తెలియదు.
ఈ ఆదివారం బాపట్ల నుంచి విష్ణు ఫాదర్ షణ్ముఖ రావు గారు తెప్పించి ఇచ్చిన గుత్తి వంకాయతో హేమ చేసిన కూర తిని....ఒక కునుకు తీసి నేను ఆమె సాయంత్రం వాకింగ్ కు బయలుదేరాము. ఆ కూడా ఫెయిల్ అయ్యింది...'తిండి విషయాలు బ్లాగ్లో రాయడం ఏమిటి?' అని కుటుంబ  సభ్యులు మూకుమ్మడిగా నిరసన తెలపడం వల్ల దాని గురించి రాయడం లేదు.   
ఇంట్లో పాలు ఎందుకో మాడు వాసన వస్తున్నాయని హేమ  అనగానే...ఎలాగైనా...ఇరాని చాయ్ తాగించాలని అనుకున్నాను. ఇంతలో నాకు అత్యంత సన్నిహితుడైన జర్నలిస్టు పంతంగి శంకర్ ఆదివారం ఒకసారి పలకరించి పోదామని వచ్చారు. ముగ్గురం కలిసి ఖైరతాబాద్ చౌరస్తా పక్కన ఉన్న "సర్వి" హోటల్ లో ఇరాని చాయ్ కోసం వెళ్ళాం. అక్కడ ఒక్క ఆడ మనిషీ లేరు. హేమ దర్జాగా వచ్చి టీ తాగుతుంటే...జనం గుడ్లుఅప్పగించి చూడడం ఆరంభించారు. అది నాకే కొంచం ఇబ్బంది అనిపించింది.
మనం ఇవేవీ పట్టించుకునే రకం కాదు కాబట్టి...కాసేపు అక్కడ ఉండి  ఇంటికి వెళ్ళాం. తీరా...చూస్తే...ఆ చాయ్ చల్లగా...తియ్యగా...ఘోరంగా ఏడ్చింది. ఇలా మంచి ఇరాని చాయ్ హేమకు తాగించాలన్న నా కోరిక తీరలేదు. ఈ సారి సికింద్రాబాద్ లో ఉన్న ఒక  ప్రసిద్ధ హోటల్ లో ఆమెకు ఈ చాయ్ తాగించాలని నిర్ణయించుకున్నా.
ఇరాని చాయ్ హోటళ్లు...అందులో కనిపించని  స్త్రీలు...గురించి మా మహాలక్ష్మి మేడం తో కొద్ది సేపు కిందట చెప్పాను. నాకు ఏషియన్ కాలేజ్ అఫ్ జర్నలిజం (చెన్నై) లో చదువు చెప్పిన ఆమె...సెంట్రల్ యూనివెర్సిటీ లో కొన్ని క్లాసులు తీసుకోవడానికి చెన్నై నుంచి వచ్చారు. ఆదివారం ఆమె చార్మినార్ ఏరియాకు వెళ్లారట. 
"నువన్నది నిజమే...మీ హైదరాబాద్లో నేను కూడా గమనించాను. కొన్ని బేకరీ షాప్స్ లో మహిళలు కనిపించలేదు. ఇదే విషయం నాకు ఆశ్చర్యం కలిగించింది," అని మహాలక్ష్మి మేడం చెప్పారు.  మనం ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది.