Saturday, February 6, 2010

తెలుగు భాషకు 'వాచిపోతున్నది' ఇక్కడ....


భాషకు కూడా శుచి, శుభ్రతలు ఉన్నాయి. పరాయివైనా మంచి పదాలు వచ్చి చేరితే..సమస్య ఉండదు. పిచ్చి పదాలను జనంలో పదేపదే చెలామణీ చేసి భాషను సంకరం చేయడం తప్పు. 
సరైన అర్థమేనా కాదా అన్నదానితో సంబంధం లేకుండా.... కొన్ని సార్లు అర్థం తెలియకుండా మనం కొన్ని పదాలు వాడుతూ ఉంటాం. సినిమాలు, టీ.వీ.లు, పత్రికల పుణ్యాన అవి జనం వాడుకలోకి వచ్చి స్థిరపడతాయి. తీరా అవి స్థిరపడి జనం నోళ్ళల్లో నానాక...అరె..ఇందులో బూతు ధ్వనిస్తుందే...అని అనుకున్నా లాభం ఉండదు.

చూడక...చూడక...మళ్ళీ ఆదివారం ముందు రాత్రి తెలుగు ఛానళ్ళు చూశాక ఈ పోస్ట్ రాయాలనిపించింది. ఈ పద్నాలుగు ఛానెల్స్ లో ఎందులోనో కానీ...ఒక లేడి యాంకర్...వార్తలు చదువుతూ..."అలా చేయకపోతే...వాచిపోతుంది" అని చదివారు. ఆ పదం ఆమె చదివిన వాక్యంలో అతికినట్లు అనిపించకపోగా....భలే ఎబ్బెట్టుగా తోచింది. కనీసం బూతు మాటలైనా సరిగా రాని లేటెస్టు తరానికి అర్థం కాదు కానీ...ఇలాంటి మాటలు ఎందుకో సంసార పక్షంగా అనిపించవు. 

ఇక్కడ 'వాచిపోతుంది' అంటే...'అలా చేయకపోతే...ఇబ్బంది/ ప్రమాదం తప్పదు,' లేక 'శిక్ష పడుతుంది' అని అర్థం. "అబ్బ..డాడీ...నాకసలే వాచిపోయే హోం వర్క్ ఉంటే...వేరే పనులు చెబుతారేం?' అని ఒక స్కూలు విద్యార్థిని అనడం విన్నాను. ఇలాంటి పదాలను విరివిగా వాడి వాటిని వ్యవస్థీకృతం చేసే సినిమాలను అని తీరాలి. 

"ఆ సుత్తి (ఈ పదమూ సినిమా ప్రసాదమే) విని వినీ నా తల వాచిపోయింది," అంటే ఓకే. ఏమి వాచిందో చెప్పకపోతేనే చిక్కు వస్తుంది. "నువ్వు అన్నీ మూసుకో" అనడం వేరు..."నువ్వు నోరు మూసుకో," అనడం వేరు.
అలాగే...అద్దరకొట్టడం లేదా అదుర్స్. నిజానికి నాకు తెలిసినంత వరకు..."నువ్వు అదరకొట్టకురా...." అంటే.."నేను చెప్పేది కాదు అని తోసిపుచ్చి మాట్లాడకు" అని అర్థం. కన్ను అదరడం అంటే...అది అనుకోకుండా...జర్క్ ఇవ్వడం."అద్దిరిపోయింది" అంటే...చాలా బాగుందని అన్నమాట.

"ఆ మాట వినే సరికి ఆయనకు ఎక్కడో కాలింది," అన్న ద్వంద్వార్ధపు మాట చాలా చోట్ల తగులుతున్నదీ మధ్య. సినిమాలలో బ్రహ్మానందం బ్యాచ్ ఈ మాటకు విపరీతమైన ప్రాచుర్యం కల్పించింది. "దొబ్బమాకు లేదా దొబ్బకు" అనే పదం చిన్నప్పుడు ఒక బూతు అర్థంలో వాడే వాళ్ళం...ఇప్పుడది నిత్యజీవనంలో క్షణక్షణానికి పునరావృతమయ్యే మాటై కూర్చుంది. నూకడం/ దొబ్బడం అంటే 'నెట్టడం' అన్న అర్థం కొన్ని చోట్ల ఉంది.

"ఎంట్రా...వాడు పిలవగానే ఏంటీ అబ్బో తెగ ఎగేసుకుని పోతున్నావ్?" అన్న డైలాగు చాలా సార్లు వినివుంటాం. ఈ "ఎగేసుకు పోవడం" ఏమిటి? అలాగే..."ఏంటమ్మా...తెగ ఊపుకుంటూ వస్తున్నావ్?" అన్న మాట కూడా తరచూ వినేదే. ఈ 'ప'కారం పక్కన 'క'కారం పెడితే...మా గురువు గారు బూదరాజు రాధాకృష్ణ గారు మాటల తూటాలతో శిష్యహత్య చేసే వారు. దాన్ని పలికినప్పుడు బూతు మాట ధ్వనిస్తుంది కాబట్టి ఆ రూలు. 

(ఆయన దగ్గర అక్షరాలు నేర్చుకుంటున్నప్పుడు..'హీరో పుక్' అనే బండి మార్కెట్ లోకి వచ్చింది. ఇందులో 'ప'పక్కన 'క' వచ్చింది కాబట్టి...గురువు గారి రూలు కు అనుగుణంగా రెండు అక్షరాలను బ్రేక్ చేసి 'హీరో పునక్' అని పిలిచే వాళ్ళం.)

ఇలా బూత్వర్థంతోనో...బూతుకు సమాన అర్థంతోనో...కొన్ని పదాలు/ పదబంధాలు ఈ తియ్యని తెలుగుని సంకరం చేస్తున్నాయి. డొక్క శుద్ధి, సరైన శిక్షణ లేకపోయినా....సీ.ఈ.ఓ.ల బూట్లు నాకి...యజమానుల మెప్పు పొందిన పలువురు నయా మేధావులు మీడియాను దున్నేస్తున్నారు కాబట్టి...ఇలాంటి పదాలకు చాలా ప్రచారం లభిస్తున్నది. దీన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు.

ఇదేంట్రా....ఈ యాంకర్ పిల్ల....చాలా ఆలవోకగా...వాచిపోతుందని...వార్న్ చేస్తున్నదని...అనుకుని...ఛానల్ మార్చి zee-24 gantalu దగ్గర స్థిరపడితిని కదా...అక్కడొక వింత తప్పు దొరికింది. 
తెలుగులో...."చెవి కోసుకుంటాడు" అంటే...ఏదైనా ఆసక్తి కలిగించే అంశం అంటే సదరు మనిషికి చాలా ఆశక్తి/ శ్రద్ధ అని అర్థం. మన జీ-టీ.వీ.మిత్రుడు..సీ.పీ.ఐ.నారాయణ గారికి చికెన్ మీద ఉన్న ప్రీతిపై ఒక ఆఫ్-బీట్ స్టోరీ ప్రసారం చేస్తూ...."నారాయణ చికెన్ అంటే...చేవికోసుకుంటారు," అని చదివారు. కానివ్వండి బాబూ....తెలుగు భాషను కైమా కింద కొట్టి పారెయ్యండి.      

14 comments:

Ramu S said...

అది "ఆశక్తి" కాదు "ఆసక్తి". నేను భాషా పండితుడిని కాదు..సాధ్యమైనంత వరకూ తప్పులు లేకుండా రాయాలనే ఉంది.. పోస్టులో పేర్కొన్న ఇలాంటి పదాలు మీకు తెలిసివవి కొన్ని రాయండి. అలాగే పోస్టులో తప్పులు ఉన్నా...ఎత్తి చూపండి. అరరే...ఈ పదం (ఎత్తిచూపడం) గురించి పోస్టులో రాయడం మరిచి పోయాను. ఈనాడు లో అనుకుంటా...ఒక సారి వచ్చిన వార్తలో ఒక లైన్ లో 'కరుణానిధి చేసిన నీచ కామెంట్లను" అని...మరొక లైన్ లో "జయలలిత ఎత్తిచూపారు" అని ఉంది. ఇది చదవడానికి బాగోలేదు. ఎవరైనా...ఒక విషయాన్ని హై లైట్ చేస్తే..'ఎత్తిచూపడం' కన్నా మిన్న అయిన పదం వెదికితే బాగుంటుంది....రాము

సుజాత said...

మీతో పాటు కాసిన్న కన్నీళ్ళు రాలుస్తున్నా ఈ తెలుగు వినలేక!

ఇంకా "ఈ క్లిప్పింగ్ ఒకసారి చూడండి" అనడానిక్ " ఓ లుక్కేసుకోండి" (ఇందులో బూతు లేకపోయినా సరే), "ఆయనకు సీన్ సితారయింది" "బాక్స్ బద్దలైంది" ఇలాంటి మాటలు కూడా ముఖ్యంగా టీవీ 9 లో టీవీ 9 లో టీవీ 9లో(నొక్కి వక్కాణించాలని)ఎక్కువ. ఈ మధ్య మిగతా వాళ్ళు కూడా గొర్రెల్లాగా మేమేం తక్కువ తినలేదంటూ దాని వెనకే పోతున్నాయి.

ఇక సినిమా వాళ్ల గురించి చెప్పేటపుడు వీళ్ల నోళ్ళకి అద్దూ అదుపూ ఉండదు. "కుర్ర కారు కి కసెక్కిస్తున కత్రినా(గుండెల్లో గుబులు రేపుతున్న..అంటే ఏం?)వంటి మాటలు సిగ్గు లేకుండా వాడేస్తున్నారు. గొంగట్లో అన్నం తింటూ ఎన్ని వెంట్రుకలని ఏరతాం చెప్పండి

పత్రికల్లో అయితే చెప్పక్కర్లేదు. "మౌలిక సదుపాయాలు" అని రాసే జర్నలిస్టుని ఒక్కరిని చూపండి. ప్రతి వాళ్ళూ "మౌళిక" అనే రాస్తారు. వెదుకుతూ కూచుంటే పేపర్ నిండా బోలెడు తప్పులు ఉంటాయి.

SIVA said...

రామూ గారూ,

బాగున్నది మంచి వ్యాసం. ఒక్క మాట. మీరు ఇక్కడే వ్రాసి, ఇక్కడే మీ వ్యాఖ్యలు వ్రాస్తుంటారనుకుంటాను. ఇతరులు వ్రాసేవాటిని కూడ చూసి అక్కడే మీ అభిప్రాయాలు/విమర్శ తెలియచేస్తే బాగుంటుంది.

ఇక మాటల విషయంలో, వత్తులు పొల్లులు తప్పులకు కారణం తెలుగును ఆంగ్లంలో టైపు చెయ్యటం, ట్రాస్‌లిటరేషన్ వల్ల తెలుగు పదం ఊడిపడటం. అందుకనే ఈ రోజున చాలా మందికి 'ళ' కు 'ల' కు తేడా తెలియదు, అలాగే 'ణ' కు న కూ తేడాలేకుండా వాడేస్తున్నారు. ఇక వట్రసుడులు, విసర్గలు కనపడటం మానేశాయి. తప్పనిసరిగా తెలుగుకి సరిపోయే అన్ని అక్షరాలు, అవసరమైన వత్తులు పొల్లులు చూపీస్తూ మరింత బాగా ఆంగ్లంలో ట్రాన్స్‌లిటరేషన్ కొరకు వ్రాయటం అందరం నేర్చుకోవాలి. లేఖినిలో అన్ని ఉన్నాయి అతి కొద్ది తప్ప.

ఇక మీరు మాటలు వాటి అపభ్రంశపు వాడకం వ్రాసారు. అలాగే ఈరోజున మరొక పిచ్చి ఎక్కి పోతున్నారు కొంతమంది. ప్రతి మాటను తెలుగు చేయటం అనే పిచ్చలో పడి, చెత్త మాటలను సృష్టిస్తున్నారు. కొన్ని కొన్ని పదాలు ఆంగ్లంలో పుట్టినవి. ఉదాహరణకు కారు. కారుని మనం కనిపెట్టలేదు అందుకని మన భాషలో దానికి పేరు లేదు. ఆ మాటను యధాతధంగా వాడాలి కాని, కొత్త మాటను పుట్టిచే భ్రమలో, ఏదో ఒక కంకర్రాయి లాంటి మాటలను రెంటిని కలిపి కొత్త మాట అంటే, హాస్యం పుడుతుండే కాని, పదం పుట్టదు. ఇలాగే అనేకానేక ఉదాహరణలు ఇవ్వచ్చు. మాటలు అపభ్రంశపు ఉచ్చారణ మరియు వాడుకతో తెలుగుని ఎంత ఖూని చేస్తున్నారో, వచ్చీ రాని తెలుగు ఆంగ్ల పరిజ్ఞానంతో తెలుగు పదాలు పుట్టిస్తునామనుకుని, తెలుగుకు తీరని ధ్రోహం చేస్తున్నారు కొంతమంది. ఈ విషయం మీద కూడ మీరు ఒక వ్యాసం వ్రాయగలరు.

Anonymous said...

ceo's or owners of tvs search for killing looks of anchors, not for their language skills. ultimately skin colour desides. off course having seen good looking anchors their mouths are watered. Unfortunately we do not have good looking ones in telugu tvs except one or two. blame the ceos taste. Nachhindi rambha... munigindi ganga...

Ramu S said...

శివ గారూ...మీరు సూచించినట్లు చేస్తాను.
సుజాత గారూ...నిజమేనండి "బాక్స్ బద్దలు కావడం" అన్న ఒక దిక్కుమాలిన ప్రయోగం కూడా ఎక్కువగా చేస్తున్నారు. ఒక సభా మర్యాద...సమాజంలో పాటించాల్సిన సభ్యత...ఈ మీడియాకు పట్టడం లేదు. ఇలాంటి మాటలను వీళ్ళు శీర్షికలుగా వేసి మరింత ఎక్కువ ప్రాచుర్యం ఇస్తున్నారండీ. ఇలాంటి మీడియా వాళ్లకు పునశ్చరణ తరగతులు పెట్టు...అని ఒక సీనియర్ మిత్రుడు సలహా ఇచ్చాడు. నిజానికి ఆ పని చేసేందుకు మంచి జర్నలిస్టులను పోగు చేయడం, ఒక నిర్దిష్ట సిలబుస్ రూపొందించి శిక్షణ ఇవ్వడం కష్టం కాదు. కానీ...ప్రపంచంలో తమ అంత మేధావులు ఎవరూ లేరని విర్రవీగే రవి ప్రకాష్ లు,రాధాక్రిష్ణలు, రామ్ రెడ్లు, నరేన్ చౌదర్లు...ఈ పనికి సహకరిస్తారా?

సుజాత said...

http://manishi-manasulomaata.blogspot.com/2009/10/blog-post_19.html

రాము గారు,
టైమున్నపుడు పై టపా చూడండి ఒక సారి!
అలాగే మీ మిత్రుడు చెప్పినట్లు పునశ్చరణ తరగతులు పెట్టడం మంచి సూచనే! ఆసక్తి ఉన్నవాళ్ళే వస్తారు. కనీసం ప్రింట్ మీడియాలో వారికైనా ఉపయోగపడితే కాసిన్ని తక్కువ తప్పులతో పత్రికలు చదువుతాం!

శివరామ ప్రసాద్ గారూ,
మంచి విషయం చెప్పారు. కొత్త పదాలు పుట్టిస్తున్నామనే ఉత్సాహంతో సహజమైన తెలుగుకు ఎంత ద్రోహం చేస్తున్నారో గ్రహించనివాళ్ళు చాలా మంది ఉన్నారు. కొన్ని ఆంగ్ల పదాలు యధా తథంగా తెలుగులో అలానే వాడితే బావుంటుంది. మీరన్నట్లు ఇలాంటి పదాలు హాస్యాన్ని బాగానే సృష్టిస్తున్నాయి.
డెబిట్ కార్డుని -ఖాతా రేకు, క్రెడిట్ కార్డు ని ఋణ రేకు అని అంటే నవ్వు రాక ఏమవుతుంది?

Anonymous said...

అదిరింది బాసు

రవిచంద్ర said...

వార్తలు చదివే భాషను సంకరం చేయడానికి టీవీ 9 నాంది పలికిందన్న సుజాత గారి మాటలు అక్షర సత్యం. భాష విషయంలో ఇప్పటి వార్తా ఛానళ్ళలో నాకు నచ్చేది ఈటీవీ-2.

V.S.R.Nanduri. said...

అసలైన ఘోరం ఏమిటంటే ఆ పదాలు వాడే వాళ్ళకు వాటి అర్థం తెలియదు. అది సరైన సందర్భమో కాదో తెలియదు. పదం నచ్చింది కాబట్టి ఆ సమయానికి తోచింది కాబట్టి వాడేస్తుంటారు. ఒకరిని చూసి మరొకరు. ఎలక్ట్రానిక్ మాధ్యమాలలో వడబోతలు నామమాత్రం కావడంతో వస్తున్న చిక్కు ఇది. రిపోర్టర్లలో పుస్తకాలు చదివే అలవాటున్నవాళ్ళని వేళ్ళమీద లెక్కించ వచ్చు. సమయం సరిపోదనుకుంటా బహుశా..
తెలిసిన వాళ్ళకీ(ఉపసంపాదకులు గట్రా..) దాన్ని సరి చెయ్యడానికి బద్ధకం, నిర్లక్ష్యం పెరిగిపోతున్నాయి.
మనం వాడే/ మాట్లాడే భాష మన వ్యక్తిత్వాలకు ఒక కొలబద్ద అనే సంగతిని దాదాపుగా అందరూ విస్మరిస్తున్నారు. ముఖ్యంగా ఈ విషయాన్ని యువతరం బుర్రకెక్కేలా చెప్పాల్సిన బాధ్యత అందరి మీదా ఉంది. దానికి అందరం కలసి ఏదైనా ప్రయత్నం చేద్దాం!!

subhadra said...

'సినిమాలో, టీ.వీలో లేక అందరూ కలిసో చేసుకున్న పుణ్యం ఇది. వంకరా, సంకరా అనే మాటలు కూడా చాలా తక్కువ. 'ఇరగదీయడం', చింపెయ్యడం, కేక, ఇలాంటి అర్ధం లేని మాటలే కాదు, సినిమాలలో 'ఏమే' ఒరే ల నించి నా కొడు... అని ఆడపిల్లలు హీరోలనీ, విలన్లనీ ఒకేలా సంబోధించడం.. ఇవన్నీ చూస్తుంటే పరాయి రాష్త్రాలలోనూ, దేశాలలోనూ పెరిగిన పిల్లలు ఇదీ మన భాషే అనుకుంటే వాళ్ళదా తప్పు. ఆ మధ్యనేదో పనికిమాలిన సినిమా చూసాను టీ.వీలో నాకు పనిలేక.. అందులో సంభాషణలు ఇలా ఉన్నాయి.. 'ఒరే.. సచ్చినోడా.. నా గురించి బాడ్గా థింక్ చేస్తున్నావ్ కదూ.. " ఇది ఎం భాషో నాకు అర్ధం కాలేదు.. చెప్పే హీరొయిన్ కి రాదు సరే మాటల రచయతకీ తెలుగు రాదా? కానీ మనకి వచ్చు కదా. ఇంక ఇందాకా ఇంకో బ్లాగ్లో రాసిన 'దోమ కుడితే చికెన్ గున్యా.. ప్రేమ కుడితే సుఖంగున్యా' లాంటి పాటలగురించీ, ఆ చిత్ర విచిత్రమైన సాహిత్య ప్రక్రియలగురించీ చెప్పడానికి నా అర్హత సరిపోదు.. ఈ టీ వీ పిల్లలందరికీ ముందు భాష విషయంలో శిక్షణ ఇవ్వాలి, మొన్నెక్కడో చదివాను.. వీరికి కూడా డబ్బింగ్ చెప్పిస్తారుట అని.. ఇంక చెప్పేదేముందీ..

subhadra vedula said...

'సినిమాలో, టీ.వీలో లేక అందరూ కలిసో చేసుకున్న పుణ్యం ఇది. వంకరా, సంకరా అనే మాటలు కూడా చాలా తక్కువ. 'ఇరగదీయడం', చింపెయ్యడం, కేక, ఇలాంటి అర్ధం లేని మాటలే కాదు, సినిమాలలో 'ఏమే' ఒరే ల నించి నా కొడు... అని ఆడపిల్లలు హీరోలనీ, విలన్లనీ ఒకేలా సంబోధించడం.. ఇవన్నీ చూస్తుంటే పరాయి రాష్త్రాలలోనూ, దేశాలలోనూ పెరిగిన పిల్లలు ఇదీ మన భాషే అనుకుంటే వాళ్ళదా తప్పు. ఆ మధ్యనేదో పనికిమాలిన సినిమా చూసాను టీ.వీలో నాకు పనిలేక.. అందులో సంభాషణలు ఇలా ఉన్నాయి.. 'ఒరే.. సచ్చినోడా.. నా గురించి బాడ్గా థింక్ చేస్తున్నావ్ కదూ.. " ఇది ఎం భాషో నాకు అర్ధం కాలేదు.. చెప్పే హీరొయిన్ కి రాదు సరే మాటల రచయతకీ తెలుగు రాదా? కానీ మనకి వచ్చు కదా. ఇంక ఇందాకా ఇంకో బ్లాగ్లో రాసిన 'దోమ కుడితే చికెన్ గున్యా.. ప్రేమ కుడితే సుఖంగున్యా' లాంటి పాటలగురించీ, ఆ చిత్ర విచిత్రమైన సాహిత్య ప్రక్రియలగురించీ చెప్పడానికి నా అర్హత సరిపోదు.. ఈ టీ వీ పిల్లలందరికీ ముందు భాష విషయంలో శిక్షణ ఇవ్వాలి, మొన్నెక్కడో చదివాను.. వీరికి కూడా డబ్బింగ్ చెప్పిస్తారుట అని.. ఇంక చెప్పేదేముందీ..

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

మీరూ ఈనాడు జర్నలిజం స్కూలేనన్నమాట! :)
నేను 1991 బ్యాచ్.ఆనందంగా ఉంది మిమ్మల్నిక్కడ కలవటం.

Ramu S said...

Rajendra Kumar gaaru,
Mine is 1992 batch. I believe Dabberu Rajendra prasad of Eenadu internet desk is your batch mate. I was his room-mate and we are very good friends. ippudu yekkada vunnaru? You may reach me at mittu1996@gmail.com
cheers
ramu

Anonymous said...

idi chadavandi..

baboi tv9 : http://sodhana.blogspot.com/2006/10/9.html