Saturday, October 28, 2017

మీ సెల్ ఫోన్లు తగలెయ్య... రేప్ ఘోరాన్ని చిత్రీకరిస్తార్రా?

వద్దు... ప్లీజ్... అని ప్రాధేయపడుతున్న ఒక టీనేజ్ అమ్మాయిని ఒక పోకిరీగాడు వెకిలిగా నవ్వుతూ హత్తుకుంటాడు. దాన్ని ఆపడానికి ఇంకో అమ్మాయి ప్రయత్నిస్తుండగా... ఇంకొక దగుల్బాజీగాడు... 'ఇప్పరా... తియ్యరా' అని అంటుంటే... ఆ పోకిరీ గాడు ఆ పిల్ల జాకెట్ తొలగించాలని  ప్రయత్నిస్తాడు. 'నన్నే మోసం చేస్తావే... తియ్యరా... తియ్యి' అని ఆ దగుల్బాజీగాడు ఎగతోస్తుంటాడు-ఒక పక్కన ఈ ఘోరాన్ని సెల్ ఫోన్లో చిత్రీకరిస్తూ.  పాపం.. ఆ అమ్మాయి నిస్సహాయంగా ఏడుస్తూ పెనుగులాడుతుంది.
ఒక రెండు నెలల కిందట, సెల్ ఫోన్లో తీసిన ఈ వీడియో ఫీడ్ ను వాట్సప్ గ్రూప్ లో పెట్టి ఈ రోగ్స్ పైశాచిక ఆనందం పొందితే... విషయం బైటపడి వాళ్ళ అరెస్టుకు దారితీసింది.

ఇప్పుడు విశాఖపట్నంలో.. అచేతనంగా పడి ఉన్న ఒక మహిళను ఒక యువకుడు అత్యాచారం చేస్తుండగా... ఇంకొకడు సెల్ ఫోన్లో చిత్రీకరించి ఇతరులతో షేర్ చేసుకున్నాడు. అదీ వైరల్ అయి ప్రపంచమంతా పాకి ఆంధ్ర ప్రదేశ్ పరువు పంచనామా అయ్యింది. ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి గారు అన్నట్టు ఇది భయంకరమైన నీతిబాహ్య చర్య.
సహజంగానే టీవీ వాళ్ళు ఇలాంటి క్లిప్స్ ను విజువల్స్ కనిపించీ కనిపించకుండా చేసి రెండు మూడు రోజులు ఆడించి... చర్చలు జరిపి నానాయాగీ చేసి... ఆ తర్వాత మరిచి పోయారు.

సెల్ ఫోన్లలో వీడియో చిత్రీకరణ చట్టానికి ఉపకరించే సాక్ష్యంగా ఉండడం వేరు కానీ పైశాచిక పనులకు వాడడం అమానుషం, దారుణం, హేయం. నిజానికి ఈ వీడియో ఫెసిలిటీ ఎవడి చేతులో పడితే వాడి చేతులోకి పోవడంతో చిక్కువస్తోంది. వాట్సప్ ప్రతొక్కడి ఫోన్ లోకి వచ్చిపడ్డాక.. ఈ వికృతం ఎక్కువయ్యింది. ఘోరం జరుగుతుంటే.. ఒక పౌరుడిగా స్పందించాల్సింది పోయి, నేరాన్ని నిరోధించే బలం లేకపోతే... ఇతరులను అప్రమత్తం చేయాల్సింది పోయి... వీడియో చిత్రీకరణ యావలో పడ్డం ఒక మానసిక జాడ్యంకాక మరేమిటి? ఇది మనుషులు చేసే పనేనా?

టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో-పౌరులను మానసికంగా సిద్ధం చేసే మెకానిజం మన దగ్గర లేదు. ఇట్లా వీడియో లు తీసి వైరల్ చేస్తే... ఏ ఏ చట్టాల కింద అరెస్టు చేస్తారో, శిక్షలు ఏమిటో విస్తృతంగా ప్రచారం చేయాలి.  పొగ, పాన్, గుట్కా వంటిస్లోగన్స్ కన్నా వంద రెట్ల విస్తృత ప్రచారం కల్పించాలి దీనికి.
బ్లూవేల్స్ గేమ్ కు వ్యతిరేకంగా దూరదర్శన్ ఒక ప్రత్యేక కార్యక్రమం రూపొందించి ప్రసారం చేయాలని నిన్న సుప్రీంకోర్టు ఆదేశించింది. అదేవిధంగా, ఇలాంటి టెక్నాలజీ సంబంధ వికృతాల (సైబర్ క్రయిం) ను అరికట్టే చర్యలు ప్రసార మాధ్యమాల సాయంతో పెద్ద ఎత్తున చేయాలి. ఇది తక్షణావసరం.

ముఖ్యంగా-కుటుంబాల్లో ఇలాంటి వికృతాలకు వ్యతిరేకంగా  తల్లిదండ్రులు కూడా చర్యలు తీసుకోవాలి. ఎవడైనా.. పిచ్చి వీడియోలు పోస్టు చేస్తే అడ్మిన్స్ వేగంగా స్పందించడం కూడా అవసరం. సామాజిక బాధ్యతగా మనం అందరం భావించకపోతే... కనిపించకుండా విస్తరిస్తున్న ఈ అమానుష కాండ రేపు మనను, మన కుటుంబ సభ్యులనూ బలితీసుకోవచ్చు. 

Wednesday, October 25, 2017

దెయ్యంతో సెల్ఫీ....భూతంతో భోజనం...


సర్కార్ చేయాల్సిన పని.. గోగినేని బాబు బృందం చేసింది!

తెలంగాణా లో ప్రబలంగా ఉన్న మూఢనమ్మకాలు అన్నీ ఇన్నీ కావు. చేతబడి చేశారని పాపం... పేద, వెనుకబడిన సామాజిక వర్గాలకు చెందిన మహిళలను కొట్టి చంపుతూ ఉంటారు. అందులో ప్రతి ఒక్కటీ దారుణ హత్యే కానీ నిందితులకు శిక్షలు పెద్దగా ఉండవు.

మాబ్ ఎటాక్స్ (గుంపులుగా వెళ్లి దాడి చేయడం) కావడాన సాక్ష్యాలు సేకరించడం కష్టం. న్యాయం కోసం పోరాడే శక్తి సామర్ధ్యాలు బాధిత కుటుంబాలను ఉండదు కాబట్టి హంతకులు తప్పించుకుంటారు. నల్గొండ జిల్లాలో మేము రిపోర్టింగ్ లో ఉన్నప్పుడు ఇలాంటి కేసులు ఎన్నో కవర్ చేశాం. అవన్నీ బాధాకర  మైన అమానుష సంఘటనలు.


మూఢనమ్మకాలు పోవడానికి తెలంగాణా ప్రభుత్వం పెద్దగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కనిపించడం లేదు. హైదరాబాద్ ను గ్లోబల్ సిటీ గా మార్చే బృహత్ కార్యక్రమంలో పాలకులు బిజీగా ఉండడం వల్ల పౌరులు కొంత చొరవ చూపి తమ వంతు బాధ్యత నెరవేర్చడం బాగుంది.

హైదరాబాద్‌కు దాదాపు 240 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలంలోని కాశీగూడ లో ప్రజల్లో పాతుకుపోయిన దయ్యం భయాన్ని పోగొట్టడానికి 
'దెయ్యంతో సెల్ఫీ (సెల్ఫీ విత్ ఘోస్ట్)', 'భూతంతో భోజనం (డిన్నర్ విత్ డెవిల్)' పేర్లతో బాధ్యతాయుతమైనహేతువాద బృందం వినూత్న కార్యక్రమాలు చేపట్టాయి. 

ఊళ్ళో తిరుగుతున్న ఒక ఆడ దయ్యం మూలంగా జనం భయపడుతున్నారని, కొందరు దీని మూలంగా ఇళ్ళు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారని తెలిసి వీరీ పని చేశారు. సైన్స్‌ ఫర్‌ సొసైటీ, ఇండియన్‌ హ్యూమనిస్ట్స్, జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు, బాబు గోగినేని ఫేస్‌బుక్ గ్రూప్ ప్రతినిధులు ఇందులో ఉన్నారు. బాబు గారు (పై సెల్ఫీ చూడండి) హేతువాది, టీవీ షోలలో తర్కవితర్కాలతో బాబాలు, స్వామీజీలను కుమ్మేసే ఉత్సాహవంతుడు. ఆయనతో పాటు ఆయన చిన్నారి కుమారుడు అరుణ్, విజయవాడకు చెందిన ఒక జర్నలిస్టుల బృందం కూడా ఉందని బీబీసీ తెలుగు ఒక ప్రత్యేక కథనం లో పేర్కొంది. 

భయం నీడన బతుకుతున్న స్థానికుల్లో అవగాహన కల్పించేందుకు వీళ్ళు ఇంద్రజాలం, నిప్పుల మీద నడక వంటి  కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా.. న్యూరో సైకియాట్రిస్ట్ ఒకరితో గ్రామస్థులకు కౌన్సెలింగ్ ఇప్పించారు. రాత్రి పూట శ్మశానంతోపాటు దెయ్యం ఉందని ప్రచారం జరుగుతున్న ప్రదేశాల్లో కలియదిరిగారు, శ్మశానం నుంచి ఫేస్‌బుక్ లైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వీరు తయారుచేసిన ఫ్లెక్సీ లు చాలా బాగున్నాయి. 
''మాతో సెల్ఫీ దిగాలని దెయ్యాన్ని కోరాం. తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్- నాలుగు భాషల్లో పిలిచినా 'దెయ్యం' రాలేదు. అసలు ఉంటేగా రావడానికి..'' అని బాబు గారు బీబీసీ ఇంటర్వ్యూ లో వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ఆయన చెప్పినట్లు ఇదొక సామాజిక సంక్షోభం. దీన్నుంచి అమాయక ప్రజలను రక్షించేందుకు మంత్రి కే టీ ఆర్ లాంటి వాళ్ళు పూనుకోవాలి. హైదరాబాద్ విశ్వ ప్రపంచమై... తెలంగాణా పల్లెలు.. మూఢనమ్మకాల కోరల్లో చిక్కుకుని ఉంటే చూడ్డానికి/వినడానికి అస్సలు బాగోదు!
ఇలాంటి కథనాలు విస్తృతంగా ప్రచురించి/ ప్రసారం చేసి మీడియా సామాజిక బాధ్యతను నిర్వర్తించాలి. 
(నోట్: ఈ కథనానికి ప్రేరణ బీబీసీ తెలుగు సైట్. కథనం లింకు ఇది: 
చాలా విషయాలు, ఈ ఫోటో కూడా అక్కడినుంచే సంగ్రహించాం. వారికి కృతజ్ఞతలు) 

Tuesday, October 24, 2017

రామోజీ రావుతో జగన్ మోహన్ రెడ్డి భేటీ

తన తండ్రి రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చిన మహా పాదయాత్ర లాంటి పాదయాత్రకు నవంబర్ 6 నుంచి సిద్ధమవుతున్న వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సాక్షి మీడియా అధిపతి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సోమవారం (అక్టోబర్ 23, 2017) సాయంత్రం...  ఈనాడు సంస్థల అధిపతి చెరుకూరి రామోజీ రావు గారిని కలుసుకున్నారు.

రామోజీ ఫిల్మ్ సిటీ కి వెళ్లిన జగన్ పెద్దాయన యోగక్షేమాలు తెలుసుకున్నాక... తన పాదయాత్ర ఉద్దేశాన్ని వివరించినట్లు పార్టీ వర్గాలు ధృవీకరించాయి. "పాదయాత్ర కు ఫెయిర్ కవరేజ్ ఇవ్వాలని అడగడానికి జగన్ వెళ్లారు. రామోజీ కూడా మర్యాదపూర్వకంగా వ్యవహరించారు," అని ఆ వర్గాలు తెలిపాయి. ఒక గంట పాటు ఈ సమావేశం జరిగినట్లు చెబుతున్నారు.

2015 అక్టోబర్ లో ఒకసారి గుంటూరు లో తలపెట్టిన నిరశనకు ముందు జగన్ వెళ్లి రామోజీ రావు గారిని కలిసి వచ్చారు. ఈ మధ్యన  రామోజీ గారు కింద పడి రెస్ట్ తీసుకుంటున్నప్పుడు బేగంపేట్ లోని నివాసానికి కూడా జగన్ వెళ్లి పరామర్శించి వచ్చారని పార్టీ వర్గాలు గుర్తుచేశాయి. అపుడప్పుడు పెద్దోళ్ల పెళ్లిళ్లలో కలుసుకున్నప్పుడు కక్షలూ కార్పణ్యాలూ లేకుండా వీరిద్దరూ మాట్లాడుకుంటూ వస్తున్నారు.

గతంలో 'ఈనాడు' 'సాక్షి' పేపర్లు ఒక దాని మీద ఒకటి అవినీతి ఆరోపణలు చేసుకుని మొదటి పేజీల్లో పెద్ద పెద్ద వార్తలు ప్రచురించుకున్నప్పటకీ, ఇరు పక్షాలూ ఏ విషయానికి ఆ విషయం గానే వుండాలని భావిస్తున్నాయి.

ఫెయిర్ కవరేజి కోసం 'ఈనాడు' అధిపతి ని కలిసిన జగన్ గారు 'ఆంధ్రజ్యోతి' అధిపతి వేమూరి రాధాకృష్ణ గారిని ఎప్పుడు కలుస్తారన్నది తెలియరాలేదు. రామోజీ గారికున్నట్లే రాధాకృష్ణ గారికి కూడా ఒక పేపర్, దమ్మున్న ఛానెల్ ఉన్నాయి. 

Monday, October 23, 2017

క్రీడాభిమానులకు భలే... పసందైన సండే!

అక్టోబర్ 22, 2017, ఆదివారం, క్రీడాప్రియులకు నిజంగా పసందైన రోజుగా గుర్తుండి పోతుంది. నాలుగు క్రీడల్లో (హాకీ, బాడ్మింటన్, క్రికెట్, టేబుల్ టెన్నిస్) మంచి మ్యాచ్ లు కనువిందు కలిగించాయి. టెలివిజన్ లైవ్, లైవ్ వెబ్ స్ట్రీమింగ్ ద్వారా ఏకకాలంలో ఇంట్లో కూర్చుని ఈ నాలుగు ఫైనల్స్ చూసే మహద్భాగ్యం కలిగింది.

ఆసియా ఛాంప్స్... మన హాకీ వీరులు 

బంగ్లాదేశ్ రాజధాని ఢాకా లో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో భారత హాకీ ఆటగాళ్లు చెలరేగి ఆడి 2-1 స్కోరుతో మలేషియాను మట్టికరిపించి... టైటిల్ స్వాధీనం చేసుకున్నారు. ఒక దశాబ్ద కాలం తర్వాత గానీ మనకీ భాగ్యం దక్కలేదు! కిందటి డిసెంబర్ నుంచి భారత మహిళల జట్టుకు కోచ్ గా ఉన్న Sjoerd Marijne (నెదర్లాండ్స్) పురుషుల జట్టు కోచ్ గా ప్రమోషన్ పొందిన కొన్ని రోజులకే నమోదైన మధుర విజయం ఇది.  నాలుగున్నర సంవత్సరాల పాటు హాకీ ఇండియాకు సేవలందించిన డచ్ కోచ్ Roelant Oltmans ను అర్థంతరంగా తొలగించి Marijne కు అవకాశం ఇచ్చారు ఈ సెప్టెంబర్ లో.  
సూపర్-4 దశలో నే మన ఆటగాళ్లు తడాఖా చూపించి 6-2 తో మలేషియాకు షాకిచ్చి తమ సత్తా చాటడంతో ఫైనల్ లో విజయం అంత పెద్ద కష్టం కాదని ముందే అనిపించింది. అంతకు ముందు కాంస్య పతకం కోసం పాకిస్థాన్  జట్టు కొరియాపై ఆడిన మ్యాచ్ కూడా అద్భుతంగా జరిగింది. మన సోదరులు 6-3 స్కోరుతో కొరియాను ఓడించి మెడల్ తో ఇంటికి వెళ్లారు. మొత్తం టోర్నమెంట్ లో దాయాదుల ప్రదర్శన చాలా బాగుంది. 

డెన్మార్క్ ఓపెన్ లో... శ్రీకాంత్ అదరహో

మంచి ఊపు మీద ఉన్న హైదరాబాద్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ డెన్మార్క్ బాడ్మింటన్ ఓపెన్ ఫైనల్లో తన కన్నా 12 సంవత్సరాల పెద్ద వాడైన కొరియన్ ఆటగాడు లిన్ హ్యూన్ ను అలవోకగా  ఓడించి... ఈ ఏడాది మూడో టైటిల్ ను కైవశం చేసుకున్నాడు. రెండో రౌండ్ లో జిన్ (కొరియా) ను 21-13, 8-21, 21-18 స్కోరుతో, క్వార్టర్ ఫైనల్ లో ప్రపంచ చాంపియన్ విక్టర్ ఆగ్జల్ సన్ (డెన్మార్క్) ను 14-21, 22-20, 21-7 స్కోరుతో  ఓడించిన శ్రీకాంత్ కు ఫైనల్స్ లో ప్రత్యర్థి నుంచి ఏ మాత్రం పోటీ లేకుండా పోయింది. అద్భుతమైన విజయాలు నమోదు చేసుకుని ఫైనల్స్ చేరుకున్న లిన్ కోర్టులో ఏ మాత్రం కదల్లేకపోవడం, పోటీ ఏకపక్షం కావడం.... అభిమానులకు నిరాశ కలిగించినా, తెలుగు ఆటగాడి  విజయం పరమానందం కలిగించింది. 

క్రికెట్ లో విరాట్ విశ్వరూపం...  

ముంబాయి లో న్యూజిలాండ్ తో జరిగిన మొదటి వన్డే క్రికెట్ మ్యాచ్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీ తన 200 మ్యాచ్ లో వీరోచితంగా ఆడి 121 పరుగులు చేసి మొనగాడినని నిరూపించుకున్నాడు. సచిన్ తర్వాత (49 సెంచరీలు) అత్యధిక వందలు (31) సాధించిన బ్యాట్స్  మ్యాన్ గా రికార్డు కెక్కాడు. అయితే... ఈ మ్యాచ్ లో ఇద్దరు కివీస్ ఆటగాళ్లు టామ్ లేథమ్ (103 నాటౌట్), రాస్ టేలర్ (95) అద్భుతంగా ఆడి విరాట్ సేనకు విజయానందం దక్కనివ్వలేదు. 

టేబుల్ టెన్నిస్ లో జర్మన్ల సంచలనం 

ఆదివారం నాడే బెల్జియం లో జరిగిన పురుషుల ప్రపంచ కప్ లో పెను సంచలనం నమోదయ్యింది. 36 ఏళ్ళ జర్మనీ ఆటగాడు టిమో బోల్.. సెమి ఫైనల్స్ లో వరల్డ్ నంబర్-1 మా లాంగ్ (చైనా) కు భారీ షాక్ ఇచ్చాడు. 1-3 సెట్ల తేడాతో వెనుకబడి ఉన్న టిమో అద్భుతమైన పోరాట పటిమ కనబరిచి 4-3 తేడాతో సెమీస్ లో గెలిచాడు. విదేశీ ఆటగాడితో టీటీ కింగ్ మా లాంగ్ ఓడిపోవడం 2012 తర్వాత ఇదే ప్రథమం!

జర్మనీ కే చెందిన దిమిత్రిజ్ చేతిలో ఫైనల్స్ లో టిమో 2-4 తో ఓడిపోయినా... ఈ టోర్నమెంటు లో తనదైన ముద్ర వేసాడు... టిమో. క్వార్టర్ ఫైనల్ లో టిమో చైనా ఆటగాడు.. లిన్ మీద డిసైడర్ లో 4-10 తో వెనుకబడి ఉన్నా 13-11 తో గెలిచి సెమీస్ కు చేరుకున్నాడు. మొత్తంమీద వెటరన్ టిమో ప్రదర్శన, పోరాట పటిమ యావత్ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకం. టీటీఎఫ్ఐ వెబ్ సైట్ లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించిన వారికి ఈ మ్యాచ్ లు మధురానుభూతిని కలిగించాయి. 

Sunday, October 22, 2017

బాధిత మహిళల సుదీర్ఘ మౌనం... ఎంత ప్రమాదకరం!

హాలీవుడ్ లో ప్రసిద్ధ డైరెక్టర్ హార్వీ వెయిన్స్టీన్ (Harvey Weinstein) మీద నటీమణులు చేస్తున్న లైంగిక ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దాదాపు మూడు దశాబ్దాలుగా అయనపెద్ద సంఖ్యలో మహిళల మీద చేసిన అఘాయిత్యాలు ఒకటికటి బైటికి వస్తున్నాయి. హాలీవుడ్ లో తన ప్రతిభను, పలుకుబడిని, డబ్బును అడ్డం పెట్టుకుని చేసిన అఘాయిత్యాలు మనందరికీ నిజంగా మేలుకొలుపు!

హార్వీ బాధితుల కథనం ఒకటే. 30 లేదా 20 లేదా 10 ఏళ్ళ కిందట.. మహిళ హార్వీ దగ్గరుకు వెళ్లడం. అయన బాత్ రూమ్ లోకి వెళ్లి డ్రస్ మార్చుకోవడం, వచ్చి మసాజ్ చేయమనడం, ఎదురు తిరిగి పారిపోయిన ఆమెకు పరిశ్రమలో అవకాశాలు రాకుండా చేయడం, ఇష్టం లేకపోయినా వృత్తిలో అవకాశాలు కోల్పోవడం ఇష్టంలేని ఆమెతో పైశాచికంగా వాంఛ తీర్చుకోవడం, ఆ బాధ వారిని జీవిత కాలం పాటు వెంటాడడం.



కొన్ని సంవత్సరాల కిందట జరిగిన ఈ అఘాయిత్యాలు ఒకటొక్కటి బైటికి వస్తుంటే... హార్వీచేసిన అమానుష పనులకు బాధ కలుగుతుంది. యాభై మంది ఇప్పటి వరకు వీడి మద పిచ్చి గురించి చెప్పగా, అందులో కనీసం ఆరుగురు తమను వాడు ఎలా రేప్ చేసిందీ వివరించారు. ఇప్పటికే ఈయన కంపెనీ తీసిన సినిమాలు పెద్ద సంఖ్యలో ఆస్కార్ అవార్డులు పొందడం, హార్వీ సహకరిస్తే స్టారై పోవచ్చని నటులు, నటీ మణులు గట్టిగా నమ్మడం వల్ల ఇన్ని రోజులు తన హవా నడిచింది.

ఇప్పుడు లైంగిక ఆరోపణలు చేస్తున్న వారు కాక... కనీసం ఒక ఎనిమిది మందిని చెరిచి డబ్బులిచ్చి 'సెటిల్మెంట్' చేసుకున్నాడని కూడా కథనాలు వినవస్తున్నాయి. ఫ్యాషన్ ను ప్రోత్సహించే 'ప్రాజెక్ట్ రన్ వే" అనే టెలివిజన్ షో ను అడ్డం పెట్టుకుని మహిళలను దోచుకునే వాడని కూడా వార్తలు వస్తున్నాయి. 2004 లో ఆరంభమైన ఈ షో ద్వారా ఆయన 200 అందగత్తెలను పరిచయం చేసాడని చెబుతారు. 16, 17 సంవత్సరాల వయస్సున్న నటీమణులు కూడా కొందరు వీడి బారిన పడిన వారిలో ఉన్నారు.

ఆరోపణలు నేపథ్యంలో హార్వీ చేసిన ప్రకటన ఇంకా ఘోరంగా ఉంది. "నేను 60, 70 దశకాలకు చెందిన వాడ్ని. వర్క్ ప్లేస్, బిహేవియర్ లకు సంబంధించిన అన్ని రూల్స్ భిన్నంగా ఉండేవి. అప్పటి సంస్కృతి అది," అని చెప్పుకొచ్చాడు. హార్వే దురాగతాలు బైటికి వస్తున్న నేపథ్యంలో  'మీ టూ' హాష్ టాగ్ తో సోషల్ మీడియా లో వస్తున్న కథనాలు మహిళలపై ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న లైంగిక అఘాయిత్యాలను బట్టబయలు చేస్తున్నాయి. 

ఫాక్స్ న్యూస్ లో పేరెన్నికగన్న హోస్ట్ బిల్ ఓ రియల్లీ తదితర దుర్మార్గుల కేసు కూడా ఇలాంటిదే. ధైర్యం చేసి మహిళలు బైటికి రావడం మంచి విషయమే. కాకపొతే... వీటన్నిటిలో బాధ కలిగించే అంశం ఒక్కటే. అవకాశాల కోసం ఈ మహిళలు... ఇన్నాళ్లూ మౌనం వహించడం. అప్పట్లోనే వీళ్ళలో కొందరైనా ఏదో ఒక మార్గం ద్వారా... ఎవరో ఒకరి సహాయంతో ఈ మానవ మృగాల నీచ కృత్యాలను బట్టబయలు చేసి ఉంటే... ఇతరులకు అలాంటి మర్చిపోలేని చేదు అనుభవాలు తప్పేవి కదా! 'Conspiracy of Silence' చాలా ప్రమాదకరం. అవకాశాల కోసం హార్వీ కి సహకరించిన కొందరుఆడ స్త్రీలు, వీడితోమనకెందుకు వచ్చిన గొడవని... చోద్యం చూసిన మగ పురుషులూ పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి మౌనం... నేరంతో సమానమే! ఇది మనకు మంచిది కాదు.

అవకాశాలను ఎరగా వేసి, అధికార దర్పాన్ని అడ్డం పెట్టుకుని, మనీ పవర్ తో  చెలరేగే ఇలాంటి మృగాళ్లు మన తెలుగు సినీ, టెలివిజన్, మీడియా పరిశ్రమలోనే కాకుండా చాలా చోట్ల పెద్ద సంఖ్యలో ఉంటారు. ఇలాంటి వారి దారుణాలను మౌనంగా భరించాల్సిన పనిలేదు.బాధితుల మౌనం వారికి పెద్ద ఆయుధం. మెరుగైన సమాజం కోసం, మన పిల్లలకు ఇలాంటి దారుణ వాతావరణం ఎదురుకాకుండా చూడడం కోసం పౌరులమంతా మన పాత్ర మనం పోషించాలి.

మీడియా లో ఇలాంటి దగుల్బాజీ గాళ్ళ గురించి మాకు లేఖలు రాసిన వారికి మేము ఈ బ్లాగ్ తరఫున రహస్యంగా బాసటగా నిలిచాం. మీడియా పవర్ ను అడ్డం పెట్టుకుని చెలరేగే దరిద్రుల ఆట కట్టించాం.
మీలో బాధితులు ఎవరైనా ఉంటే.. మౌనంగా దీన్ని భరించ వద్దు. "మీ టూ" హాష్ టాగ్ సంగతి తర్వాత. వాళ్ళ గురించి మాకు వాస్తవాలు రాయండి. వాళ్ళ ఆట ఎలా కట్టించాలో మేము మీకు  చెబుతాం. మా మెయిల్ ఐ డీ: srsethicalmedia@gmail.com. 

Thursday, October 19, 2017

బిత్తిరి సత్తి: దీపావళి రోజున "మాన్ అఫ్ ది మ్యాచ్"

గత మూడేళ్ళుగా తెలుగు టెలివిజన్ న్యూస్ లో ఒక సంచలనం సృష్టించిన బిత్తిరి సత్తి (వీ-6 fame) ఈ దీపావళి రోజున వివిధ చానెల్స్ లో తన ప్రదర్శనలతో తెలుగు ప్రేక్షకులను బాగా అలరించారు.
దాదాపు 15 ఏళ్ళు సినిమాలో అవకాశాల కోసం ఎంతో కష్టపడి కింది నుంచి పైకిఎదిగిన ఈ చేవెళ్ల మండలం పామెన కుర్రోడికి (అసలు పేరు రవి కుమార్)... ఇన్నాళ్లు పడిన కష్టానికి ఈ రోజు ఒక మంచి ఫలితం లభించట్లు అనిపించింది. ముఖ్యంగా... ఈ టీవీ  లో 'పండగ చేస్కో' ప్రోగ్రాం లో సైకియాట్రిస్ట్ గా మంచి హాస్యం పండించాడు. ఈ మొత్తం ప్రోగ్రామ్ కి సత్తి 'జస్ట్ కిడ్డింగ్', 'చిల్...' అంటూ వాస్తవానికి దగ్గరగా ఉన్న ప్రశ్నలతో హైలైట్ గా నిలిచాడు. ఈ కింది ఫోటో ఆ ప్రోగ్రాంకు సంబంధించిందే. తన తండ్రి కావలి నరసింహులు యక్షగానం, భాగోతాలు, భజనల్లో దిట్ట అనీ, కళాకారునికి పుట్టిన కళాకారుడైన తనకు ఎంతో కసి ఉందని రవి చెబుతాడు. 

అంతకుముందు జీ టీవీ వాళ్ళ దుబాయ్ ప్రోగామ్ లో కూడా పారడీ డాన్స్ లతో ఇరగదీసాడు.

పల్లెలో పుట్టి... తన టాలెంట్ తానెరిగి... అవకాశాల కోసం కింద పడి... మీద పడి... తమకు తాము ఎస్టాబ్లిష్ అయి పేరు తెచ్చుకునే ఇలాంటి ఆర్టిస్టులు స్ఫూర్తి ప్రదాతలు. సత్తి లాంటి కళాకారులు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్, బ్రదర్. 

తీన్మార్ వార్తలు సృష్టించి తెలుగు వార్తల ప్రపంచంలో వినూత్నత్వానికి తెరలు తీసి... సత్తి లాంటి పాత్రలు పోషించిన వీ-6 ఛానెల్ హెడ్ అంకం రవికి కూడా ప్రత్యేక అభినందనలు తెలపాలి.    

Wednesday, October 18, 2017

'ది హిందుస్థాన్ టైమ్స్'ను అభినందించాల్సిందే!

అధికారం లో ఉన్న పార్టీ...  మీడియాను గుప్పెట్లో పెట్టుకోవడం రానురాను మరీ ఎక్కువయ్యింది. పాలకులు ఆశించిన దానికన్నా ఎక్కువగా మీడియా యజమానులు అడుగులకు మడుగులొత్తడం ఇబ్బంది కలిగిస్తుంది. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు తెలంగాణా ముఖ్యమంత్రి అయ్యాక...మీడియా ఆయనకు, కుమారుడికి, కుమార్తె కు, సర్కార్ కు బ్రహ్మరథం పట్టడం నిత్యకృత్యమయ్యింది. మంచి రాసినప్పుడు పొగడడంలో తప్పు లేదు, రాజకీయ-ఆర్ధిక కారణాల రీత్యా పరిశోధనాత్మక జర్నలిజాన్ని మరిచిపోవడం ఘోరం కాకపోవచ్చు కానీ... పాలకుల వ్యతిరేకుల వార్తలను సమాధి చేయడం అన్యాయం.

తెలంగాణా వస్తే రామోజీ ఫిలిం సిటీ ని దున్నేస్తా... అన్న కే సీ ఆర్ గారు  ఒక సుముహుర్తాన వెళ్లి రామోజీ రావు గారి స్వాగత సత్కారాలు అందుకొని వచ్చారు. రామోజీ ఘన కార్యక్రమాలను ఆయన ఘనంగా ప్రస్తుతించారు. కాలక్రమేణా తెలంగాణా ప్రభుత్వం విషయంలో'ఈనాడు మరియు ఈ-టీవీ చాలా అనుకూల ధోరణి అవలంభిస్తున్నవ న్న ప్రచారం జారుగుతోంది.  'జగన్ మోహన్ రెడ్డిగారి సాక్షి 'పత్రిక' ముందునుంచీ కే సీ ఆర్ గారికి 'ఎస్ సార్' అంటూనే ఉంది. వీళ్ళు వివిధ డిపార్ట్మెంట్స్ లో చీడపీడ ల గురించి రాస్తున్నారు కానీ బలంగా ప్రభుత్వాన్ని కుదిపే పనిచేయయడం లేదు... బహుశా ఉద్దేశపూర్వకంగానే.

 'నమస్తే తెలంగాణా' అజెండా నే ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల దగ్గరకు తీసుకుపోవడం కాబట్టి.. వాళ్ళ గురించి అనుకుని లాభం లేదు. 'వుయ్ రిపోర్ట్... యూ డిసైడ్' అని చెప్పే 'ఆంధ్ర జ్యోతి' కూడా ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాయకుండా/ ప్రసారం చేయకుండా... గుంపులో గోవిందయ్య లా ఉన్నదన్న అపవాదు మూటగట్టుకుంది. మిగిలిన పత్రికలు--ఆంధ్ర భూమి, ప్రభ, వార్త కూడా దాదాపుగా అంతే అని ఆ పత్రికలు కూడా తిరగేసే జర్నలిస్టు మిత్రులు చెబుతారు. ఈ క్రమంలో ఫోర్త్ ఎస్టేట్ నగుబాటు అవుతున్నది.

కొద్దో గొప్పో వున్నది ఉన్నట్లు రాస్తున్నది.... ప్రభుత్వాన్ని విసిగిస్తున్నది కమ్యూనిస్టుల పత్రికలు.. 'నవ తెలంగాణా' (సీపీఎమ్ వాళ్ళది) , 'మన తెలంగాణా' (సీపీఐ వాళ్ళది). కానీ వాళ్ళ సర్క్యులేషన్ స్వల్పం.

తెలంగాణా ఉద్యమం లో జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) చైర్మన్ గా కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండ రామ్ గారిని యాత్ర జరపకుండా ప్రభుత్వం అరెస్టు చేయించిన వార్త పెద్దదే అయినా... తగిన ట్రీట్మెంట్ పొందలేదు. అరెస్టుపై కోదండ రామ్ గారి ఇంటర్వ్యూ చేసి పెద్ద వార్త ఎవ్వరూ వేసినట్లు లేదు. జేఏసీ గొంతు పెద్దగా కనిపించకుండా పత్రికలూ జాగ్రత్త పడడం విశేషం.
ఇంగ్లిష్ పత్రికలు కూడా ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాసే పరిస్థితి ఉన్నట్లయితే మాకు కనిపించడం లేదు. ఆ సమయంలో 'ది హిందుస్థాన్ టైమ్స్' పత్రిక ప్రతినిధి శ్రీనివాస రావు గారు ఈ వార్త ప్రచురించారు. వై ఎస్ ఆర్ చనిపోయాక వందల మంది గుడెలాగి మరణించారన్న వార్తలు ఒట్టిదే నని నిరూపిస్తూ 'మెయిల్ టుడే' అనే పత్రికలో సంచలనాత్మక వార్త ప్రచురించిన రావు గారు ఈ విషయంలో ఉన్నది ఉన్నట్టు రాయడం బాగుంది.



Saturday, October 14, 2017

స్వీట్ సిక్స్టీన్ 'ఆంధ్ర జ్యోతి'... కంగ్రాట్స్


ఆయన... 'ఈనాడు' రామోజీ రావు గారి లాగా పట్టిందల్లా బంగారం చేసే రకం కాదు.

ఆయన... 'సాక్షి' జగన్ మోహన్ రెడ్డి గారి లాగా నోట్లో బంగారు చెంచా తో పుట్టలేదు.

అయన... 'టీవీ-9' రవి ప్రకాష్ లాగా నిండు విగ్రహం కాదు.

అయన... 'డీ సీ' జయంతి గారి లాగా బుర్రతో జర్నలిజం నడిపే బాపతు కాదు.

నమ్మింది ఆచరించే సత్తా, మనసులో మాట కుండబద్దలు కొట్టే తెగువ, సిగ్గూ ఎగ్గూ లేకుండా కలిసిపోయే తత్త్వం, నిర్భయత్వం, అన్నింటికీ మించి సూపర్ మొండితనం, మొరటుతనం ఆయన సొంతం.

తెలుగు జర్నలిజం లో తనకంటూ ఒక ఎగ్జిక్యూటివ్ బాండ్ పేపెర్తో చాఫ్టర్ సృష్టించుకుని, తన కుంచెతో తానే రంగులు అద్దుకుని, తనకు తానే మురిపెంగా రాసుకుంటున్న వ్యక్తి. ఇద్దరు శక్తిమంతులైన ముఖ్యమంత్రులను విసిగించి, రాజకీయ మదాంధులైన వారి బలగాలను తట్టుకుని, బలవంతులైన వాళ్ళ కొడుకులతో చెడుగుడు ఆడుకుని, కులసంఘాలను గోకి, జర్నలిస్టు సంఘాలను బే ఖాతరు చేసి, రాజకీయ శత్రువులను సృష్టించుకుని కూడా బస్తీ మే  సవాల్ అంటూ హైదరాబాద్ నడిబొడ్డున దర్జాగా జర్నలిజం చేస్తున్న దొరబాబు.

ఆయనే... ఆంధ్ర జ్యోతి, ఏ బీ ఎన్ ఆంధ్ర జ్యోతి యజమాని వేమూరి రాధాకృష గారు.

1999 లో మూతపడిన 'ఆంధ్ర జ్యోతి' ని మళ్ళీ తెరిపించి.... ప్రస్తుతం తెలుగు జర్నలిజం లో  వందలమంది కి అన్నం పెడుతున్న రాధా కృష్ణ గారికి ఆయన సిబ్బందికి పత్రిక పదిహేనేళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు.

ఒక వివరణ: మేము ఎప్పుడూ 'వే...రా' అంటూ పిలుస్తూ... ఆయన తప్పులు ఎత్తిచూపాం. కానీ, ఇప్పుడున్న వాతావరణంలో మిగిలిన ప్రధాన పత్రికలకన్నా, వాటి ఓనర్ల కన్నా రాధాకృష్ణ గారు చాలా రెట్లు నయం. మిగిలిన యాజమాన్యాలు జర్నలిస్టులను నిర్దాక్షిణ్యంగా ఉద్యోగాల నుంచి తొలగించి సంక్షోభాలు సృష్టిస్తున్నా... దానికి భిన్నంగా ఉద్యోగుల పొట్ట కొట్టకుండా.. తన పని తాను చేసుకుపోయే ఆయన గుణం, తాను నమ్మింది నమ్మినట్లు చెప్పే తత్వం మాకు నచ్చాయి. ఇలాంటోడు ఒకడుండాలహే!!!

హైదరాబాద్ లో ఇంగ్లీష్ పేపర్లకు సరుకున్న జర్నలిస్టుల కొరత!

దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో ప్రతి చోటా జర్నలిజం కోర్సులున్నాయి. జర్నలిజం బోధన కోసమే ప్రత్యేకించి ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం వంటి సంస్థలూ వెలిశాయి. ప్రతి ఏడాదీ వీటిలోంచి పెద్ద సంఖ్యలో శిక్షణ పొందిన జర్నలిస్టులు బైటికి వస్తుంటారు.

అయినా... హైదరాబాద్ లో ఇంగ్లిష్ మీడియాను సరుకున్న జర్నలిస్టుల కొరత పట్టి పీడిస్తున్నది చాలా ఏళ్లుగా. రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఇది మరీ ఎక్కువయ్యింది. ఏ ఎడిటర్ ను చూసినా... 'మంచోళ్ళు ఉంటే పంపండి... తీసుకుంటాం," అని చెబుతుంటారు. పత్రికల వారీగా ఆరు ఇంగ్లిష్ పత్రికల్లో  ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో చూద్దాం.

ది  హన్స్ ఇండియా  

ఇప్పుడు 'ది హన్స్ ఇండియా' ఎడిటర్ పదవికి  ప్రొ. నాగేశ్వర్ రాజీనామా చేశారు కదా... మరి ఆయన స్థానంలో ఇంకో ఎడిటర్ ఎవరైనా ఉన్నారా? అన్నది పెద్ద ప్రశ్న. అప్పటిదాకా అక్కడ బ్యూరో చీఫ్ గా ఉన్న రామూ శర్మ గారి స్థానంలో బ్యూరో చీఫ్ కోసం హన్స్ ఇండియా ఒక 8-9 నెలలుగా వెతుకుతున్నా ఎవ్వరూ దొరకలేదు.
నవంబర్ లో ఇంటికెళ్ళ బోతున్న రామూ శర్మ గారినే ప్రస్తుతానికి పత్రిక బాధ్యతలు చూడాల్సిందిగా యాజమాన్యం కోరినట్లు తెలిసింది. జాక్పాట్ అంటే ఇదే కదా! ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హనుమంత రావు నిన్న ఆఫీసు కు వచ్చి రామూ శర్మ గారే ఎడిటర్ అన్నట్లు ఒక ప్రకటన చేసి వెళ్లినట్లు సమాచారం. ఓనర్ వామనరావు గారి సలహాదారు కింగ్ షుక్ నాగ్ (టైమ్స్ ఆఫ్ ఇండియా మాజీ ఎడిటర్) గారి సూచన మేరకు ఈ నిర్ణయం జరిగిందన్న దాన్ని అనుమానించాల్సిన పనిలేదు. రామూ శర్మ గారు కూడా మాజీ టైమ్స్ జర్నలిస్టే.

తెలంగాణా టుడే

హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న తెలంగాణా టుడే ఎలాంటి ఇబ్బందులు లేకుండానే.. ఎడిటర్ ను, జర్నలిస్టులను అమర్చుకుంది. ది హిందూ లో ఒక వెలుగు వెలిగి ఎడిటర్ మాలినితో వేగలేక బైటికొచ్చిన శ్రీనివాస రెడ్డి గారు దొరకడం, ఆయన నికార్సైన తెలంగాణా బిడ్డ కావడంతో నమస్తే తెలంగాణా తెలుగు పత్రిక వారి ఇంగ్లిష్ పేపర్ కు పెద్ద సమస్య లేకుండా పోయింది. మీడియా మార్కెట్ లో శ్రీనివాస రెడ్డి గారికి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. కింది నుంచి కష్టపడి తనను తాను నిరూపించుకున్న మనిషి కూడా కావడంతో ఆయన్ను నమ్ముకుని ఏకంగా 'ది హిందూ' నుంచి జర్నలిస్టుల పటాలం దిగిపోయింది.  ఒకప్పుడు ది హిందూ లో ఉద్యోగం అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనుకునే వారు, గుర్తుందా!
ఈ పత్రికకు ఇంకొక కలిసొచ్చిన అంశం ఏమిటంటే... అదే క్యాంపస్ లో 'మెట్రో ఇండియా' అనే పత్రిక మూతపడి కొంతమంది మంచి జర్నలిస్టులు దొరకడం. శ్రీనివాస రెడ్డి గారు... అప్పుడే ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో పదవీ విరమణ చేసిన మంచి స్పోర్ట్స్ రిపోర్టర్ దాసు గారిని స్పోర్ట్స్ ఎడిటర్ గా నియమించడం ఒకమంచి పని. ఇలా ప్రతిభ ఆధారంగా ఇక్కడ మంచి టీమ్ తయారయ్యింది. అధికార పార్టీ దీవెనలు ఉండబట్టి... మరొక ఏడెనిమిదేళ్లు జీతాలకు భరోసా ఉండదని ఇందులో పనిచేసే జర్నలిస్టులు భావిస్తారు.

డెక్కన్ క్రానికల్ 

హైదరాబాదీల మనసు చూరగొన్న డెక్కన్ క్రానికల్ లో కొంత గందరగోళం నెలకొంది. ఆ పత్రికలో 17 ఏళ్ళు పనిచేసి తనకంటూ ఒక ప్రత్యేకత తెచ్చుకున్న ఉడుముల సుధాకర్ రెడ్డి గారు ఆ పత్రికకు ఈ మధ్యనే రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. సీనియర్ జర్నలిస్టులను నియమించే, తొలగించే స్థాయిలో ఉండి... ఎడిటర్ జయంతి గారి మద్దతు ఉన్న సుధాకర్ రెడ్డి గారు ఒక అరుదైన బ్రిటిష్ స్కాలర్షిప్ పొంది వచ్చాక కొన్ని రోజులకే ఆ పత్రికను వదిలేశారు. ఇది కచ్చితంగా డెక్కన్ క్రానికల్ కు దెబ్బే. క్రైమ్, సైన్స్ రిపోర్టింగ్ లో సుధాకర్ రెడ్డి నంబర్ -1 అని చెప్పడంలో సందేహ పడాల్సిన పనిలేదు. ఈనాడు జర్నలిజం స్కూల్ టాపర్ ఆయన.
డీ సీ వదిలిన ఆయన వెంటనే టైమ్స్ ఆఫ్ ఇండియా లో చేరారు. ఇప్పుడు డెక్కన్ క్రానికల్ లో ఆయన ఖాళీని  భర్తీ చేసే వారికోసం వెతుకుతున్నారు. జయంతి గారి కింద, క్రిష్ణారావు గారి ఆధ్వర్యంలో  పనిచేసే వారు ఎవరు చేస్తారో చూడాలని... ఆ పత్రికలో పనిచేసిన ఒక మిత్రుడు సరదాగా అన్నారు.
పైగా... ఇప్పుడు డీ సీ లో జీతాలు ఆలస్యంగా ఇవ్వడం ఉద్యోగుల్లో అభద్రతను పెంచింది.

ద న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ 
తెలుగు బిడ్డ జీ ఎస్ వాసు గారు చెన్నై కేంద్రంగా ఉన్న ద న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ కు ఎడిటర్ గా రెండేళ్లుగా పనిచేస్తున్నారు. అంతకు ముందు ఆయన హైదరాబాద్ లో సుందరంగా గారి దగ్గర పనిచేసి ఉన్నత స్థాయికి చేరుకున్నారు. పొట్ట నిండా పాలు తాగిన పిల్లి లాగా సాఫీగా ఇక్కడ జర్నలిజం జరిగిపోతున్నది. హన్స్ ఇండియా ఆరంభం లో మాగజీన్ సెక్షన్ చూసిన మంజులత కళానిధి (రైస్ బకెట్ పోటీ ఆరంభకురాలు) గారు ఈ పత్రికలో కూడా మేగజీన్ నిర్వహిస్తున్నారు.  

టైమ్స్ ఆఫ్ ఇండియా 

మలయాళీలు, బెంగాలీలు ఎక్కువ సంఖ్యలో ఉండే టైమ్స్ ఆఫ్ ఇండియా కు ఎప్పుడూ మనుషుల కొరత, డబ్బుల ఇబ్బంది ఉండవు. అక్కడ ఎడిటర్ తో కాస్త అడ్జెస్ట్ అయితే చాలు... ఏళ్లకు ఏళ్ళు గడపవచ్చు. అందుకే... పైన పేర్కొన్న మొదటి మూడు పత్రికలు పెద్ద పదవి, ప్యాకేజి ఇస్తామని ఆహ్వానించినా... టైమ్స్ నుంచి పోయే  తెలుగు జర్నలిస్టులు అరుదు.

ది హిందూ 

ప్రస్తుతం తెలంగాణా టుడే ఎడిటర్ గా ఉన్న  శ్రీనివాస రెడ్డి గారు తన హయాంలో ది హిందూలో ఒక గట్టి వ్యవస్థను ఏర్పాటు చేశారు. సిటీ ఎడిటర్ పదవి తీసేసి... సిటీ రిపోర్టింగ్ ను స్టేట్ బ్యూరో కిందికి తెచ్చి, కొత్త నియామకాలు లేకుండానే ఇప్పుడు పత్రిక నడుస్తోంది. మిగిలిన పత్రికలకు తీసిపోకుండానే బండి నడుపుతున్నారు. ఈ పత్రికలో పనిచేసిన సీనియర్ జర్నలిస్టు సురేష్ కృష్ణమూర్తి గారు గత నెల్లో మరణించడం ఇక్కడ పనిచేసే చాలా మంది జర్నలిస్టులకు జీర్ణించుకోలేని వాస్తవం అయ్యిందనేది వేరే విషయం. 

Friday, October 13, 2017

"ది హన్స్ ఇండియా" కు ప్రొ. నాగేశ్వర్ గుడ్ బై

"ది హన్స్ ఇండియా" పత్రికను ఒక గాట్లోకి తెచ్చిన ప్రముఖ జర్నలిజం ఆచార్యుడు, రాజకీయ-సామాజిక-ఆర్థిక విశ్లేషణలో దిట్ట  ప్రొ. కె . నాగేశ్వర్ ఆ పత్రికకు నిన్న గుడ్ బై చెప్పారు. పత్రిక యజమాని వామన రావు గారు (కపిల్ గ్రూప్ ఛైర్మన్) సేల్స్, సర్క్యులేషన్ కు సంబంధించిన ఒక మీటింగ్ లో చేసిన వ్యాఖ్యలకు నొచ్చుకొని నాగేశ్వర్ గారు అక్కడికక్కడే రాజీనామా ప్రకటన చేశారు. బోర్డు మీటింగ్ లో కాకుండా... ఒక సాధారణ మీటింగ్ లో తనతో రావు గారు ఎన్నడూ లేనివిధంగా అనుచితంగా మాట్లాడారని నాగేశ్వర్ గారు సన్నిహితుల దగ్గర చెప్పారు. 

గురువారం నాడు ఆఫీసుకు వచ్చిన నాగేశ్వర్ గారు ఎడిటోరియల్ మీటింగ్ లో తన రాజీనామా విషయాన్ని ప్రకటించడంతో ఆశ్చర్యపోవడం సీనియర్ల వంతు అయ్యింది. నిన్నటిదాకా ఎడిటోరియల్ కింద తన ఫోటో, డేసిగ్నేషన్ (ఫోటో చూడండి) ప్రచురించిన ఆయన ఈ రోజు ఎడిషన్ లో దాన్ని తొలగించారు. కానీ, ఇంప్రింట్ లో మాత్రం పేరు ఉన్నది. 

2011 లో మొదలైన ది హన్స్ ఇండియా కు మొదటి మూడేళ్లు నాయర్ గారు ఎడిటర్ గా ఉండగా, మిగిలిన దాదాపు మూడేళ్లు నాగేశ్వర్ ఆ బాధ్యతలు మరింత సమర్ధవంతంగా, చాకచక్యంగా నిర్వహించి పత్రికకు ఒక పేరు రావడంలో కీలక పాత్ర పోషించారు. పత్రిక సర్క్యులేషన్ పెరిగింది. ప్రకటనలూ బాగానే వస్తున్నాయి. 
ఈ మధ్యన...  టైమ్స్ ఆఫ్ ఇండియా కు రెసిడెంట్ ఎడిటర్ గా ఉండి వయసు రీత్యా పదవీ విరామణ చేసిన కింగ్ షుక్ నాగ్ గారిని వామన రావు గారు సలహాదారుగా నియమించిన నాటి నుంచీ ది హన్స్ ఇండియాలో ఒక రకమైన ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది. నాగ్ వ్యవహారం, ధోరణి అంటే పడని జర్నలిస్టులు చాలా మంది మీడియా ప్రపంచం లో ఉన్నారు. అయితే... రోజు వారీ ఎడిటోరియల్ వ్యవహారాల్లో నాగ్ జోక్యం ఉండదని యాజమాన్యం చెప్పాక సీనియర్లు అక్కడ కొద్దిగా కుదుటపడ్డారు. ఇంతలో ఈ పరిణామం జరిగింది. 

మితభాషి, సాదు స్వభావి అయిన వామన రావు గారు  కింగ్ షుక్ నాగ్ ను ఎడిటర్ గా చేయాలన్న ఆలోచనతోనే కావాలని ప్రొ. నాగేశ్వర్ ను విసిగించినట్లు కూడా సీనియర్లు భావిస్తున్నారు. నాగేశ్వర్ స్థానంలో నాగ్ కాకపొతే... మార్కెట్లో ఎడిటర్ స్టేచర్ ఉన్న వ్యక్తి ఎవరా? అన్న చర్చ మొదలయ్యింది. 

Thursday, October 12, 2017

'ది హన్స్ ఇండియా' వెబ్ సైట్ వాళ్ళు ఇంకా మేలుకో లేదు...

ఇది రాసే సమయానికి సమయం నాలుగున్నరదాటింది. తొమ్మిదేళ్ల కిందట సంచలనం సృష్టించిన ఆరుషి తల్వార్ హత్య కేసులో ఆమె తల్లిదండ్రులు రాజేష్, నుపుర్ లను నిర్దోషులుగా తెలుస్తూ అలహాబాద్ హై కోర్టు తీర్పు ఇచ్చి చాలా సేపు అయ్యింది.

అయినా... ది హన్స్ ఇండియా వెబ్ సైట్ లో ఇంకా పాత వార్తే...పైగా తీర్పు కు విరుద్ధమైన అర్థం వచ్చేది... నడుస్తోంది. ఆ స్క్రీన్ షాట్ ఇక్కడ చూడండి. వెబ్ సైట్లు ఉన్నదే ఎప్పటికప్పుడు తాజా వార్తలు ఇవ్వడానికి. 'కుమార్తెను తల్లిదండ్రులే చంపారా?' అన్న వార్త పెట్టినప్పుడు... అప్ డేట్ మీద కూడా శ్రద్ధ పెడితే బాగుండేది!
మిగిలిన మీడియా వెబ్ సైట్లు (ఉదాహరకు... కింద ఉన్న ఈనాడు, ది హిందూ) ఈ వార్త కు ప్రాధాన్యం ఇచ్చి నెట్ ఎడిషన్స్ లో అప్ డేట్స్ ఇస్తున్నాయి.







"ఈనాడు" లో సొల్లు వార్తలకు మంచి ఉదాహరణిదీ!

మీడియా కట్టు కథలు, అర్థ సత్యాలు, అసత్యాలతో వర్ధిల్లడం సహజం! తమ తమ కులాలకు చెందిన రాజకీయ పార్టీల జెండా మోయడం, అధికార పార్టీల అడుగులకు మడుగులొత్తడం తప్పనిసరైన వాతావరణంలో ఉన్నాం మనం.

సంప్రదాయ పత్రికలను తలదన్ని ఆధునిక తెలుగు జర్నలిజంలో ఒక చరిత్ర సృష్టించిన 'ఈనాడు' ఈ మధ్యన మరీ సిల్లీ వార్తలు ప్రచురిస్తూ... చవకబారు పత్రికలతో పోటీ పడడం ఆ పత్రిక అభిమానులకు బాధకలిగిస్తుంది. నాగ చైతన్య, సమంత ల పెళ్లి గురించి అందరికన్నా ఉత్సాహంగా 'ఈనాడు' ఎక్కువ వార్తలు, ఫోటోలు, వీడియోలు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. సరే, వివిధ కారణాల రీత్యా అది వారిష్టం. కానీ ఈ రోజున పత్రిక వెబ్ ఎడిషన్ లో ప్రముఖంగా కనిపిస్తున్న ఈ వార్త (స్రీన్ షాట్ ఇక్కడే ఉంది) చూడండి. దీని శీర్షిక: సామ్, చై కి వూహించని సర్ ప్రైజ్. 


నవ దంపతులకు హీరో పవన్ కళ్యాణ్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ప్రత్యేకంగా తయారుచేయించిన ఉంగరాలు పంపారన్నది దీని సారాంశం. సరిగ్గా పెళ్లి సమయానికి  అందేట్లు చేశారని టాలీవుడ్ వర్గాలను ఉటంకించారు. ఈ గిఫ్ట్ చూసి ఇద్దరూ సర్ ప్రైజ్ అయ్యారని కూడా చెప్పారు.
కానీ ఇదే వార్త చివరి పేరా ఇలా ఉంది:
... అయితే అందులో ఏమాత్రం నిజం లేదని మరికొందరి వాదన. పవన్‌ కానీ త్రివిక్రమ్‌ కానీ వారిద్దరికీ ఎలాంటి కానుకలు పంపలేదని ఇతర వర్గాలు అంటున్నాయి. 
ఇలాంటి విషయాల్లో.... బహుమతి ఇవ్వడమో, ఇవ్వకపోవడం... రెండే ఉంటాయి. ఇచ్చారని ఘనంగా శీర్షిక పెట్టి... వార్త వండి వార్చి... చివరకు ఈ వార్తలో ఎంత మాత్రం నిజం లేదన్న వాదన ఉన్నట్లు చెప్పడం! ఇదేమి జర్నలిజం రా నాయనా.... 

చీఫ్ ఆఫ్ బ్యూరో కోసం 'ది హన్స్ ఇండియా' వెదుకులాట!

హైదరాబాదు కేంద్రంగా ఆనతి కాలంలోనే వినుతికెక్కిన 'ది హన్స్ ఇండియా' ఆంగ్ల పత్రిక పరిణామాలు ఎప్పుడూ గమ్మత్తుగానే ఉంటాయి. కపిల్ గ్రూప్ మీడియా బాధ్యతలు చూస్తున్నపుడు ప్రసిద్ధ తెలుగు ఎడిటర్ కొండుభట్ల రామచంద్ర మూర్తి గారి  మస్తిష్కంలో మొగ్గతొడిగిన ఆలోచనే 'ది హన్స్ ఇండియా'. కృష్ణా రామా అంటూ  ఎక్కడో కూర్చున్న  డెక్కన్ క్రానికల్ ఫేమ్ నాయర్ గారిని పూర్ణకుంభ స్వాగతం పలికి మూర్తి గారు పత్రిక ఎడిటర్ బాధ్యతలు అప్పగించారు.

విధివశాత్తూ... మూర్తిగారు అక్కడినుంచి వచ్చేసి సాక్షిలో చేరారు. నాయర్ గారూ నిష్క్రమించారు. ఈ లోపు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జర్నలిజం బోధకుడిగా, ఎమ్ ఎల్ సి గా ఉన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎడిటర్ గా 'ది హన్స్' పగ్గాలు స్వీకరించారు. ఎడిటోరియల్ పేజీలో సంపాదకీయం కింద తన ఫోటో కూడా వేసుకుని పత్రికకు నూత్న రూపు ఇచ్చి కొత్తపుంతలు తొక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు తక్కువ ఖర్చుతో కొద్దో గొప్పో నాణ్యతతో వస్తున్న పత్రికల్లో ఒకటిగా నిలుస్తోంది... హన్స్ ఇండియా.

గతంలో టైమ్స్ ఆఫ్ ఇండియా లో పనిచేసిన రామూ శర్మ గారు ఆ పత్రిక చీఫ్ ఆఫ్ బ్యూరో గా ఇంతకాలం పనిచేశారు. వివిధ కారణాల రీత్యా ఆయన ఈ మధ్యన రాజీనామా చేశారట. నోటీసు సర్వ్ చేసి నవంబర్ దాకా ఆయన ఎదురుచూస్తున్నట్లు చెబుతున్నారు.

రామూ శర్మ గారి స్థానంలో చీఫ్ ఆఫ్ బ్యూరో కోసం ప్రొ. నాగేశ్వర్ బృందం అన్వేషిస్తున్నది. మంచి జర్నలిస్టులు దొరకడం కష్టంగా ఉన్నదని సమాచారం. "నిజంగానే, సరుకున్న  సీనియర్ జర్నలిస్టుల కొరత బాగా ఉంది మన మార్కెట్ లో," అని అక్కడి వారు ఒకరన్నారు.
పైగా ప్రొ. నాగేశ్వర్ ఆలోచనా వేగాన్ని,  ఒత్తిడిని తట్టుకుని నిలబడి...  శక్తి సామర్ధ్యాలు నిరూపించుకునే జర్నలిస్టు ఎవరు దొరుకుతారో వేచి చూడాలి.

హన్స్ ఇండియా సలహాదారు గా ఆ మధ్యన టైమ్స్ ఆఫ్ ఇండియా మాజీ ఎడిటర్ కింగ్ షుక్ నాగ్ చేరారు. ఇది ఆ పత్రికలో కొంత కలకలానికి దారి తీసింది. అయినా... నాగ్ గారు కొన్ని సమావేశాలకు, సూచనలకు పరిమితమవుతున్నారని సమాచారం. 

Saturday, October 7, 2017

'ది హిందూ' కు ప్రెస్ కౌన్సిల్ అఫ్ ఇండియా నోటీసు

దక్షిణాదిలో ప్రతి విద్యావంతుల కుటుంబం, విద్యార్థులు, ఉద్యోగార్థులు తప్పక చదివే 'ది హిందూ' దినపత్రిక రిపోర్టర్ వేదికా చౌబే  బాధ్యతారాహిత్యం వల్ల విమర్శలు ఎదుర్కొంటోంది. చివరకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి షో కాజ్ నోటీస్ అందుకోవాల్సి వచ్చింది.

ముంబాయి ఎల్ఫీన్ స్టోన్ రైల్వే దగ్గర తొక్కిసలాటలో చిక్కుకున్న ఒక మహిళకు మానవత్వంతో సహాయపడుతున్న ఒక వ్యక్తి ఆమెతో  పిచ్చిగా వ్యవహరించినట్లు ఒక ఎనిమిది సెకండ్స్ నిడివి గల వీడియో ఆధారంగా ఆ జర్నలిస్టు రాసిన వార్త ( శీర్షిక: Dying woman molested, video shows) పత్రికకు చెడ్డ పేరు తెచ్చి చిక్కుల్లో పడేసింది.  దాన్ని పత్రిక ముంబయి ఎడిషన్ లో ప్రచురించింది. కొన్ని అంతర్జాతీయ పత్రికలు కూడా దీన్ని తమ నివేదికల్లో ప్రస్తావించాయట. వార్త చదివిన వారికి జుగుప్స కలగడం, మానవత్వంపై నమ్మకం సన్నగిల్లడం కనిపించకుండా జరిగే నష్టాలు. 
నిజానికి ఆ పూర్తి నిడివి (40 సెకండ్స్) వీడియో చూస్తే ఆ యువకుడు తొక్కిసలాటలో చిక్కుకున్న మహిళను రక్షించే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టంగా తేలింది. పోలీసులు కూడా ఇదే నిర్ధారించారు. ఈ విషయంలో విమర్శలు వెల్లువెత్తడంతో వెంటనే 'ది హిందూ' ఒక క్షమాపణ ప్రచురించింది.

ఈ తప్పుడు వార్తపై కేంద్ర సమాచార ప్రసార శాఖ సూచన మేరకు ప్రెస్ కౌన్సిల్ షో కాజ్ నోటీస్ జారీ చేసింది. 14 రోజుల్లో వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది.

సోర్స్: http://www.opindia.com
(Note: Since this is a very good case study for journalism students and journalists, in view of public purpose we have taken the show-cause notice from opindia.com with a sincere thanks).

Thursday, October 5, 2017

పాపమ్ ... రాజమ్; మరొక పేపర్ సాహసమ్ !

జర్నలిజం ఒక వ్యసనం. జర్నలిజం లోకి అడుగుపెట్టిన వాళ్ళు దాని నుంచి బైట పడలేరు. సంఘోద్ధరణ చేస్తున్నామన్న భ్రమ, ఇంత గొప్ప భావప్రకటన వేదిక ఇంక ఎక్కడా ఉండదన్న నిజం, నేతలు-పోలీసులు నిజంగానే అభిమానిస్తున్నారన్న అబద్ధం, పైరవీకి పనికి రాకపోతారా అన్న భావంతో మన చుట్టూ చేరి భజనపరులు చేసే యాగీ, బైలైన్స్ ఇచ్చే కిక్కు, ఇంకో రంగంలో ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు లేకపోవడం... తదితరాల వల్ల జర్నలిజంలో పడి కొట్టుకునే వారే అధికంగా ఉంటారు. జర్నలిజంలో నీతితో బతకాలనుకునే సత్తెకాలపు మనుషులు పడే ఘోష చెప్పనలవి కానిది. స్వానుభవం చెప్పింది ఏమిటంటే... జర్నలిజం నుంచి తొందరగా బైటపడాలంటే చాలా ఆధ్యాత్మిక చింతన అవసరం. 

కానీ, కొంతమందికి జర్నలిజం కిక్కు తలకెక్కితే అది దిగడం కష్టం. ఏదో భవన నిర్మాణ రంగంలో నాలుగు డబ్బులు వెనకేసుకున్న సీ లక్ష్మీ రాజమ్ గారు జర్నలిజం రుచిమరిగారని చెప్పుకోవచ్చు. ఇష్టమైన రుచిని ఆస్వాదించే హక్కు ఎవ్వరికైనా ఉంటుంది. 

తెలంగాణా ఉద్యమ సమయంలో 'నమస్తే తెలంగాణా' పత్రిక నడిపి, టీ ఆర్ ఎస్ అధికారం కి రాగానే దాన్ని కోల్పోయి (http://apmediakaburlu.blogspot.in/2014/05/blog-post_27.html), ఆ లోపలనే ఆంగ్ల దినపత్రిక మెట్రో ఇండియా పెట్టి, ఒక సారి మూసేసి, చివరకు పూర్తిగా మూసేసిన రాజమ్ గారు ఇప్పుడు తెలంగాణా కేంద్రంగా ఒక తెలుగు పత్రిక పెట్టబోతున్నారట. ఇది నిష్పాక్షిక పత్రికా? లేక టీ ఆర్ ఎస్ ను వీడి బీ జే పీ లో చేరిన ఆయన కాషాయ సేనకు అనుకూలంగా దీన్ని తెస్తారా? అన్నవి తేలాల్సి ఉంది. సీనియర్ జర్నలిస్టు దివాకర్ గారిని ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దసరా రోజు అయన తెలుగు పత్రిక పనులు ప్రారంభించినట్లు సమాచారం. 

నిజం చెప్పాలంటే... అన్ని పార్టీలకు మాదిరిగానే తెలుగు నేల మీద బీ జే పీ కి ఒక సొంత పత్రిక లేకపోవడం పెద్ద లోటుగానే చెప్పుకోవాలి. దేశ వ్యాప్తంగా పలు ప్రధాన పత్రికలూ, ఛానెల్స్ కిమ్మనకుండా మోడీ జీ కి జై కొడుతున్నా... సొంత మీడియా హౌస్ ఉండడం అవసరమని భావించి కమలనాథులు రాజమ్ గారిని పురమాయించారేమో తెలియదు. పేపర్ మూలంగా కనీసం ఒక రెండొందల మంది జర్నలిస్టులకు భుక్తి దొరకడం ఆనందదాయకం. 

Wednesday, October 4, 2017

బూతు వెబ్ సైట్స్ మీద 'మా' చేసింది మంచిదే... కానీ...

ఈ రోజున అంటే అక్టోబర్ నాలుగో తేదీన సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) బూతుపై సమరం ప్రకటించింది. బూతు వెబ్ సైట్స్ మీద చర్య తీసుకోండని కోరుతూ సైబర్ క్రైమ్ కు 'మా' బృందం ఒక పిటిషన్ సమర్పించింది. ఇంతకన్నా గొప్ప వార్త ఇంకోటి ఉంటుందా?

నిజంగానే కొన్ని సైట్లు ఘోరంగా రాస్తున్నాయి. పిచ్చి బొమ్మలు జమ చేసి, మార్ఫింగ్ చేసి, బూతు మాటలు చేర్చి, పుకార్లు రాయడం.. వాటిని యూ ట్యూబ్ లో పెట్టి ప్రసారం చేయడం ఎక్కువయ్యింది. జనం కూడా చిత్రంగా వీటిని ఆదరిస్తున్నారు. ఈ మధ్యనైతే పాపం.. టీవీ ఆర్టిస్టులు, చిన్న నటుల మీద కూడా ఇష్టమొచ్చినట్లు రోత రాతలు రాస్తున్నారు. ఇలాంటి వెబ్ సైట్స్ దాదాపు 250 దాకా ఉన్నట్లు గుర్తించారు.  కొంత మంది హీరోయిన్స్ మీద వెబ్సైట్స్ పచ్చి బూతు రాయడంతో 'మా' కు వేడి తగిలింది. అందుకే 'మా' బృందం పోలీసులను ఆశ్రయించింది. 

ఈ అంశం మీద 'బూతుకి వాత' అంటూ టీవీ-9 ఈ రాత్రికి ఒక చర్చ జరిపింది. పిటిషన్ సమర్పించిన వారిలో ఒకరైన 'మా' అధ్యక్షుడు శివాజీ రాజా ఇలాంటి అడ్డగోలు రాతల మీద చాలా ఆవేదన వెలిబుచ్చారు. 'మాకు చాలా ఫిర్యాదులు వచ్చాయి. అవి చూస్తే చాలా బాధేస్తుంది," అని చెప్పారు. ఈ విషయంలో ఒక  ఫిర్యాదు రావడం తో హ్యాపీ గా ఫీల్ అవుతున్నట్లు సైబర్ క్రైమ్ ఎస్. పీ. రామ్మోహన్ చెప్పారు. సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ మాట్లాడుతూ... కంటెంట్ తో పాటు ఇంటెంట్ కూడా ముఖ్యమని చెప్పారు. 

అయ్యా సినీ మహానుభావులూ... ఈ సమాజంలో నేర ప్రవృత్తి, బూతు పెరగడానికి, విలువుల క్షీణత లో సినిమాల పాత్ర ఏమిటో ఒక్కసారి ఆలోచించండి. మీరు చేస్తే... అది కళా పోషణ. ఇతరులు టెక్నాలజీ ఉపయోగించి చేస్తే అది నేరం. హతవిధీ! టీవీ నైన్ వారి చర్చలో.. సినీ ప్రపంచం సినిమాల్లో చూపిస్తున్న బూతు సీన్లు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ గురించి ప్రస్తావన రాకపోవడం విచారకరం. జర్నలిజం చదువుకున్న కత్తి మహేష్ కనీసం దీన్ని ప్రస్తావించపోవడం బాధాకరం. 

'మేమూ మా సినిమాల్లో బూతు చూపబోము. ఆడ పిల్లల ను చీప్ గా చూపబోము. ఇలా వచ్చే సినిమాల మీద చర్య తీసుకుంటాం," అని 'మా' ఒక డిక్లరేషన్ ఇస్తే బాగుండు.  కుటుంబాలు పిల్లలతో కలిసి చూసే సినిమాలు తీయలేక సెక్స్, వైలెన్స్ మీద ఆధారపడి బతికే వాళ్ళు నీతులు వల్లిస్తే బాగుండదని అనుకోడానికి వీల్లేదు.  

ఆంధ్రజ్యోతి 'వివరణ'--ది హిందూ 'క్షమాపణ'

జర్నలిస్టులు, ఎడిటర్లు కూడా మానవ మాత్రులే. వృత్తిలో భాగంగా వారు కొన్ని తప్పిదాలకు పాల్పడడం సహజం. చేసింది తప్పని నిరూపితమైతే/ తెలిసిపోతే వెంటనే తప్పయ్యిందని ప్రకటించి క్షమాపణలు కోరడం మంచి సంప్రదాయం.

తాము దైవంశ సంభూతులమని నమ్మే ఎడిటర్లు ఎక్కువగా ఉన్న తెలుగు మీడియా లో... చేసిన తప్పులకు చెంపలు వేసుకునే సంస్కారులు పెద్దగా కనిపించరు. కొద్దో గొప్పో... నైతిక జర్నలిజానికి విలువ ఇచ్చే 'ది హిందూ' పత్రిక కరెక్షన్స్ కు పెద్ద పీట వేస్తున్నది, ఆదర్శంగా నిలుస్తున్నది.

ప్రముఖ కార్టూనిస్టు మోహన్ గారి విషయంలో ఎక్కడలేని తొందరపాటు కనబరిచిన 'సాక్షి' వాళ్ళు సారీ చెప్పారో లేదో తెలియదు. కానీ, ఈ రోజు విచిత్రంగా... 'వివరణ'పేరిట ఆంధ్రజ్యోతి ఒక విచిత్రమైన బిట్ ప్రచురించింది. అది ఇలా వుంది:

2005 జూన్ లో జరిగిన చర్చ సందర్భంగా ఒక పెద్దాయనకు మానసిక ఆందోళన, బాధ కలిగించినందుకు ఎడిటర్ తాపీ గా ఇప్పుడు విచారం వ్యక్తం చేయడం విశేషం. 2005 విషయం ఇప్పుడు ఎందుకు వచ్చిందో, దీని పూర్వ రంగం ఏమిటో తెలియదు. ఇలాంటి వివరణ ను వివరం సొవరం లేని వివరణ అంటారు. అయినా... మంచి విషయమే కదా!

ఈ రోజే ది హిందూ ఇంటర్నెట్ ఎడిషన్ లో ఇలాంటిదే ఒక బిట్ ప్రచురించింది. కానీ దానికి ఏకంగా 'క్షమాపణ (అపాలజీ)' అని శీర్షిక ఇచ్చారు. ఇందులో తాము చేసిన తప్పు, రిపోర్టర్ పేరు కూడా రాశారు. ఒక వీడియా క్లిప్ ఆధారంగా రిపోర్టర్ రాసిన వార్తలో దురుద్దేశం ఆపాదించబడడం పట్ల ఎడిటర్ బాధ వ్యక్తం చేశారు.
వివరణ అంటే కంటి తుడుపు చర్య కాదు, పాప పరిహారార్ధం చేసే ఒక మంచి పని అని, ఒక మంచి సంప్రదాయమని తెలియజేయడం కోసం ఆ బిట్ కూడా ఇక్కడ ఇస్తున్నాం.

MUMBAI

Apology




The report titled ‘Dying woman molested, video shows’ (October 1, Mumbai edition) by Vedika Chaubey stated that a video clip showed a bystander molesting a woman who was breathing her last in the stampede at Elphinstone station.
A perusal of the clip does not warrant such a conclusion. We regret the publication of this report, which was the result of the failure to adhere to journalistic norms in both reporting and editorial supervision.
This story is being withdrawn from all online platforms of The Hindu.
Editor

Tuesday, October 3, 2017

ఆర్టిస్టు మోహన్ గారిని ముందే చంపేసిన మీడియా కు శిక్ష ఏదీ?

ఘోరమైన తప్పులు చేసినా తప్పించుకునే వెసులుబాటు మీడియా లో ఉంటుంది. తెలుగు మీడియా లో అయితే ఆ సౌలభ్యం ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. వీళ్ళను అడిగే నాథుడే లేడు.

తెలుగు జాతి గర్వపడే ఆర్టిస్టు మోహన్ గారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగానే ఆయన తనువు చాలించినట్లు ఇంటర్నెట్ లో, వాట్సప్ గ్రూపుల్లోనే కాకుండా... పలు తెలుగు ఛానెల్స్ లో స్క్రోలింగ్స్ వచ్చాయి. ఎవడైనా తప్పు చేస్తే నానా యాగీ చేసే మీడియా తాను చేసిన తప్పుకు కనీసం క్షమాపణ అయినా అడక్కుండా... ఆ మహా పాతకపు వార్తను విత్ డ్రా చేసుకుని గప్చిప్ గా  ఉండిపోతాయి.
మోహన్ గారు ఆసుపత్రిలో ఉండగానే సెప్టెంబర్ 15 సాయంత్రం 6.27 కి సాక్షి ఇంటర్నెట్ ఎడిషన్ లో మోహన్ ఇక లేరంటూ వార్తగా వచ్చింది (స్క్రీన్ షాట్ చూడండి). 

మరికొన్ని ఛానల్స్ లో స్క్రోలింగ్ గా ఇదే వచ్చింది. టీవీ ల్లో వచ్చేది పరమ సత్యం అని భావించే అమాయకపు జీవులు కొందరు ఫేసుబుక్కు పోస్టింగ్స్ గా, వాట్సాప్ మెసేజ్ లు గా ఈ 'వార్త' ను ప్రసారం చేయడం, వెంటనే 'రిప్' అంటూ జనం ప్రకటించడం... జరిగిపోయాయి. 

నిజానికి ఆయన సెప్టెంబర్ 21 అర్ధరాత్రి 1.10 కి మరణించినట్లు డాక్టర్ల ప్రకటించారు. 

ఇలాంటి తప్పులు చేసినప్పుడు మీడియాకు ఏమి శిక్ష వేయాలి? ఎవరు శిక్ష వేయాలి? 

Monday, October 2, 2017

బిబిసి తెలుగు వెబ్ సైట్ ఆరంభం: 'ఈ-టీవీ' లో బులిటిన్ ప్రసారాలు

బీబీసీ అనగానే... సాధారణ పాఠకులకు 'నిష్పాక్షికత', 'వృత్తి నిబద్ధత' వంటివి గుర్తుకు వస్తాయి. అలాంటి బీబీసీ తెలుగు వార్తా ప్రపంచంలో కొత్త శకం ప్రారంభించింది... ఈ రోజున. అదే తెలుగు వెబ్ సైట్ ఆవిష్కరణ. 

బీబీసీ కాచివడపోసిన మంచి జర్నలిస్టుల బృందం... ప్రత్యేక తర్ఫీదు పొంది... ఒక రెండు మూడు నెలలుగా దేశ రాజధానిలో ఇందుకు వేదిక సిద్ధం చేసింది. తెలుగు జర్నలిజం లో తమకంటూ ఒక స్థానం ఏర్పరుచుకున్న సీనియర్ జర్నలిస్టులు ఈ బృందంలో ఉన్నారు. దాదాపు 35 మంది వృత్తి నిపుణులతో బీబీసీ ప్రసారాలు ఆరంభించింది. 

వెబ్సైట్ (పై ఫోటో హోమ్ పేజీ) మెనూ లో పెద్ద హడావుడి లేకుండా న్యూస్, స్పోర్ట్స్, వెదర్, రేడియో ఉన్నాయి. లాస్ వేగాస్ లో కాల్పులకు సంబంధించిన వార్త, దాని ఫోటోలు సింహభాగం ఆక్రమించుకున్నాయి. 
భజన పత్రికలు తమ వెబ్ ఎడిషన్స్ లో కూడా ఆ కార్యక్రమాన్ని సాగిస్తూ... విసుగు పుట్టిస్తున్న ఈ తరుణంలో బిబిసి తెలుగు వెబ్ సైట్ ప్రపంచంలోని తెలుగు వార్తాప్రియుల వార్తల దాహాన్ని తీరుస్తుందని ఆశిద్దాం. 
"నిఖార్సయిన వార్తలకు, విశ్లేషణాత్మక కథనాలకు నమ్మకమైన వేదిక.. బిబిసి తెలుగు. లైక్.. చేయండి.. షేర్ చేయండి... అభినందనల వర్షం కురిపించండి. విలువైన సూచనలతో బిబిసి తెలుగు జర్నలిస్ట్ మిత్రులను ముందుకు నడిపించండి," అని మిత్రుడు పసునూరి శ్రీధర్ బాబు తన పేస్ బుక్ పేజీలో పేర్కొన్నారు. ఇండియా టుడే తెలుగు మాగజీన్, హెచ్ ఎం టీవీ, వీ 6 వంటి ఛానెల్స్ లో కీలక భూమిక పోషించిన ఆయన బీబీసీ టీమ్ లో కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మరొక సీనియర్ ఎడిటర్ జీ ఎస్ రామ్ మోహన్ ఆధ్వర్యంలో ఈ బృందం కష్టపడుతున్నది. 

అంతేకాకుండా... రోజూ రాత్రి పదిన్నర కు బీబీసీ బృందం రూపొందించిన బులిటిన్ "బీబీసీ ప్రపంచం" శీర్షికతో 'ఈ-టీవీ' తెలంగాణా,  ఆంధ్రప్రదేశ్ లో అర్థగంట పాటు ప్రసారమవుతాయట. 
గాంధీ గారి జయంతి రోజు కూడా అయిన ఈ రోజు టీవీ 5 వారి కన్నడ ప్రసారాలు కూడా మొదలు కాబోతున్నాయండోయ్. 

అల్ ద బెస్ట్... 

Sunday, October 1, 2017

పరిటాల వారి పెళ్ళిలో వే.రా. గారి సందడి


ఆంధ్రప్రదేశ్‌ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్‌- జ్ఞాన వివాహ వేడుక సందర్భంగా ఈ ఉదయం (అక్టోబర్ 1, 2017) తీసిన ఫోటో ఇది. ఆంధ్రజ్యోతి పేపర్-ఛానల్ యజమాని వేమూరి రాధాకృష్ణ గారు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. వివాహ వేడుకలో పాల్గొనేందుకు అనంతపురం జిల్లా వెంకటాపురం వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వచ్చినప్పుడు వే.రా. హడావుడిగా కనిపించారు. హెలిపాడ్ దగ్గర్నించి వివాహ వేదిక దగ్గరి వరకూ కేసీఆర్‌ గారి పక్కనే ఆయన ఉన్నారు. తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసినప్పుడు, పరిటాల రవి ఘాట్‌ను కేసీఆర్‌ సందర్శించిన్నప్పుడు కూడా ఆంధ్రజ్యోతి ఓనర్ కనిపించారు. మొన్నామధ్య వరకూ వే.రా. గురించి కేసీఆర్‌, ఆయన కుమారుడు కేటీఆర్‌, టీ ఆర్ ఎస్ నేతలు 'అవాకులు చెవాకులు' పేలేవారు. పెళ్లిళ్లు, విందులు, వినోదాల్లో మనస్పర్థలు ఖతంచేసుకోవడాకే తప్పేమీ కాదు!