Monday, December 27, 2010

తెలుగు మీడియాకు స్వీయనియంత్రణ కీలకం

వివాదాస్పద తెలంగాణా అంశంపై శ్రీ కృష్ణ కమిటీ నివేదిక రానున్న నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ చుట్టూ...హైదరాబాద్ లో భారీ ఎత్తున బలగాలు దిగుతున్నాయి. రాష్ట్ర రాజధానిలోని కాలనీలలో ఉండే కమ్యూనిటీ హాల్స్ ను   కూడా పోలీసులు తమ అధీనంలోకి తీసుకుంటున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారేట్లు ఉంది.

కమిటీ ఏమిచెప్పినా, దాని అభిప్రాయంతో ఏకీభవించినా ఏకీభవించకపోయినా ఒక్క ప్రాణమైన పోవడానికి వీల్లేదు. ప్రాంతీయ విద్వేషాలకు తావు లేకుండా ప్రజలు కలిసిమెలిసి ఉండాలి.  ముఖ్యంగా మీడియా సొంత అజెండాలు మాని...శాంతిని కాపాడాలి. ఇప్పుడున్న పరిస్థితులలో మీడియాను నియంత్రించడం చాలా కష్టం కాబట్టి...ఎడిటర్లు, జర్నలిస్టులు స్వీయనియంత్రణ పాటించాలి. యాజమాన్యాలను రెచ్చగొట్టి అగ్గికి ఆజ్యం పోయకుండా...శాంతిని కాపాడడమే అందరి కర్తవ్యం కావాలి. 

'ఆచితూచి వ్యవహరించండి' అని పిలుపునిచ్చిన న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపును తు.చ.తప్పకుండా పాటించాలని ఛానెల్స్ కు  విజ్ఞప్తి చేస్తున్నాం. నాగరికంగా ఎలా మెలగాలో...మనకు మనం నిరూపించుకోవడానికి...ఇది మంచి తరుణం. ప్రజాస్వామ్యయుతంగానే గళం విప్పి...సామరస్యంతో మెలుగుదాం. శాంతి భద్రతలను కాపాడుకుందాం.
---------------------------------------------------------------------------
ఈ పోస్టు పెట్టిన తర్వాత...ప్రముఖ బ్లాగర్ (సాహిత్యాభిమాని) శివ గారు ఈ కింది సూచనలు పంపించారు...రాము 
మీరుచేప్పే స్వయం నియంత్రణకు నాకు తోచిన పది సూత్రాలు.
1. న్యూస్ లైవ్ కార్యక్రమాలను పూర్తిగా మానెయ్యాలి. ఈ లైవ్ కార్యక్రమాల వల్ల అదుపులేని వాగుడు ప్రసారం అవుతున్నది. కొన్నిసార్లు ఈ వాగుడే ఉద్రిక్తలకు దారి తీస్తాయి.
2. ఏమాత్రం కూడ అపార్ధం చేసుకోవటానికి వీలులేని భాషలోనే వార్తలను వ్రాయాలి చదవాలి. ఈపని లైవ్ లో మన వాళ్ళకు చేతకాదు. నోటికొచ్చినట్టు వాగుతారు. అందుకని లైవ్ ఉండకూడదు. నిష్ణాతులైన సంపాదకుల ఆధ్వర్యంలోనే వార్తలను ప్రసారం చెయ్యాలి.
3. విలేఖరి తన వార్తను లేదా రిపోర్టరుగా పిలవబడుతున్న అతని/ఆమె మాటలను రికార్డుచేసి అప్‌లింక్ ద్వారా పంపితే అందులో అతను/ఆమె చెప్పిన విషయాలు చూసి ప్రసారం చెయ్యోచ్చా లేదా నిర్ణయించి సంపాదకులు అనుమతించినాకే ప్రసారం చెయ్యాలి.
4. బ్రేకింగు న్యూస్ అనే మాట వాడకాన్ని, పదే పదే బ్రేకింగు న్యూస్ అంటూ ఏదో జరిగిపొయ్యింది అన్న భయానక వాతావరణాన్ని సృష్టిస్తూ ప్రసారాలు చెయ్యటం నిషేధించాలి.
5. పొరబాటున ఏ ప్రాంతలోనైనా ఏదైనా సంఘటన జరిగితే, ఆ విషయం వెనువెంటనే రాష్ట్రం అంతా చాటింపు వెయ్యక్కర్లేదు. అక్కడకు వెళ్ళి నిజానిజాలు కనుక్కుని, ఒక సమగ్రమైన వార్తగా రూపొందించి, ఎడిట్ చేసి, ఎంతవరకూ చూపించాలో అంతవరకే చూపించాలి. ఎంతవరకు అన్న విషయం అంభువజ్ఞులైన సీనియర్ సంపాదకులకు తెలుసు. వాళ్ళకు వదిలెయ్యాలి. యాజమాన్యం తరఫున ఉండే కుర్ర ఎం బి ఏలు మానెజర్లుగా పిలవబడే వాళ్ళు ఈ ప్రొఫెషనల్ విషయాల్లో తల దూర్చకూడదు. వితండవాదం చేస్తూ తా బట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే జర్నలిస్టులకు ఈ సంపాదకత్వం ఇవ్వటం మానాలి.
6. పోలీసులను మాటి మాటికి చూప కూడదు. వారి దగ్గర ఉన్న ఆయుధాలు, ఎక్కడ ఉంటున్నారు వంటి విషయాలు చూపే ప్రయత్నాలు మానాలి. టివి లు అసాంఘిక శక్తులకు గూఢచారులు కాదు, కాకూడదు కదా!
7. ఎక్కడన్నా విధ్వంసం జరుగుతుంటే ఆ పని చేస్తున్న వ్యక్తుల ముఖాలు స్పష్టంగా చిత్రీకరించి చూపాలి. టి.వి రిపోర్టింగులో వీళ్ళకి ఉన్న నైపుణ్యమంతా ఇలాంటి విధ్వంసకారులను పట్టుకోవటానికి వీలుగా వీరి కవరేజి ఉండేట్టు చూసుకోవాలి. అంతేకాని ఊరికే మండుతున్న బస్సులు, పగిలిపోయిన షాపు అద్దాలు చూపించటాలు మానాలి. ఈ ఊళ్ళొ ఇన్ని బస్సులు, ఆ ఊళ్ళొ ఇన్ని బస్సులు అని లెక్కలు కట్టి ప్రసారం చెయ్యకూడదు. రాయలసీమలో ఒక ఫ్యాక్షనిస్టు(2005 జనవరిలో అనుకుంటాను)హత్య జరిగినప్పుడు ఇలాంటి భాధ్యతలేని అనవసరపు లైవ్ టెలికాస్ట్ వల్ల అనేక సంబంధం లేని ప్రదేశాల్లో హింస చెలరేగింది.
8. ఒక నాయకుడో, మంత్రో ఒక మాట అనంగానే, అది పట్టుకుని పరుగులు పెట్టుకుంటూ ఆ వ్యక్తి ప్రతిపక్షం దగ్గరకు వెళ్ళి చూడండి అతను ఇలా అన్నాడు, మీ అభిప్రాయం ఏమిటి? మీ స్పందన ఏమిటి అని అడుగుతూ తంపులు పెట్టే జర్నలిజం మానాలి. మీడియా వార్తలను రిపోర్టుచెయ్యాలికాని, వార్తలను తమకు తామే వండకూడదు, తయారుచెయ్యకూడదు.
9. ఎజెండాలు పెట్టుకుని ఒక వర్గం వైపో లేదా ఒక పార్టీ వైపో వాలిపొయ్యి ప్రసారాలు, వ్రాతలు లేకుండా చూసుకోవాలి. ఇది చేస్తే దాదాపు అన్ని పేపర్లు మూసెయ్యాలి, అన్ని చానెళ్ళు భక్తి గీతాలు చూపాలి ఇవ్వాళ. ఖర్మ!
10. నాయకులు అని చెప్పుకునేవాళ్ళు బాధ్యత లేగుండా గాలిగా, చెత్త వాగుడు వాగుతుంటే, అమాయక ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నంగా ఉన్నవి లేనివి కల్పించి విద్వేషాలు చెలరేగేట్టుగా ప్రవర్తిస్తుంటే వాళ్ళకు కవరేజీ ఏమాత్రం ఇవ్వకూడదు.

ఇవన్ని నాకు అనిపించిన కొన్ని సూత్రాలు. ఒక్క తెలంగాణా ఉద్యమం, శ్రీ కృష్ణా కమిషన్ రిపోర్టు సమర్పణ సమయం దగ్గరపడేప్పుడు మాత్రమే కాకుండా, మీడియా అని పిలవబడుతున్న ఈనాటి కాయితాల మీద అక్షరాలు ప్రింటుకొట్టే యాజమాన్యాలు, సాటిలైటు సమయం కొనుక్కుని, తమ చిత్తం వచ్చినట్టు ప్రసారాలు చేస్తూ ఇవ్వే వార్తలు అని చెప్పుకునే చానేళ్ళు సదా పాటించాలి. భారత దేశంలో మీడియా ఇంత గొప్పగా ఉన్నది, ప్రజల మధ్య సామరస్యాన్ని పెంపొందించటంలో ఎంతో కృషి చేసింది అన్న పేరు తెచ్చుకోవాలి కాని, వాళ్ళే గొడవలకు కారణం అయ్యారు, గొడవలని ఇంకా ప్రేరేపించి పెంపొందించారు తద్వారా వాళ్ళు టి ఫి ఆర్ రేటింగులు పెంచుకున్నారు అన్న ఆరోపణలకు గురికాకూడదు.
 

Sunday, December 26, 2010

అన్నిటా...అపార్థమే భాయ్...(Sunday Special)

క్రిస్మస్ శుభదినాన ఒక రెండు రౌండ్లు ఎక్కువ వాకింగ్ చేద్దామని ఖైరతాబాద్ వైపు నడక మొదలెట్టి...తలకు బొప్పి కట్టించుకున్నాను. నాసర్ స్కూలు పక్కన పిల్లలు రోడ్డు మీద క్రికెట్ ఆడుతుంటే...నిలబడ్డాను. బంతి వేగంగా గాల్లో ఎగురుతూ నా వైపు వచ్చింది. నేను చటక్కున దాన్ని పట్టుకున్నాను. మనమింకా ఫిట్ గానే ఉన్నామని అనుకుంటుండగానే...'వెరీ గుడ్ కాచ్...తాతా' అని వెనుక నుంచి ఒక కుర్ర వెధవ అరిచాడు. ఏడవలేక నవ్వుతూ వాడి వైపు చూసి మళ్ళీ నడక మొదలెట్టాను. పాపం....ఈ రాబోయే జనవరి ఫస్టుకు గానీ నాకు నలభై ఏళ్ళు రావని వాడికేమి తెలుసు? మన వయసును వాడు అపార్థం చేసుకున్నాడు....కుర్రకుంక.

ఈ మధ్యన లాల్ బహదూర్ స్టేడియంలో ఇలాంటి అనుభవమే ఎదురైంది. తమ్ముడి కవల పిల్లల (ఆరేళ్ళు) ను తీసుకుని టీ.టీ.అరేనా నుంచి బైటికి వస్తుండగా....ఒకడొచ్చి...'మనవరాళ్ళా?' అని అమాయకంగా అడిగాడు. హతవిధీ....ఇక్కడ కూడా మన వయసు అపార్థం చేసుకోబడింది. ప్చ్...ఏమి చేస్తాం? ఒరిజినాలిటీ కొనసాగించాలన్న సంకల్పంతో...సగం వెండి పూసలుగా మారిన బొచ్చుకు రంగు వేయకపోవడం వల్ల వస్తున్న చిక్కిది కాబోలు. 

మన వయసు విషయంలోనే కాకుండా...మౌనాన్ని, అభిప్రాయాలను, చర్యలను, వాదనను...జనం అపార్థం చేసుకోవడాన్ని బట్టి చూస్తే...వినాయక చవితి రోజు చంద్రుడ్ని చూసానేమో అనిపిస్తున్నది. చివరకు పూణే ఫణి బాబాయ్ కూడా నన్ను అపార్థం చేసుకుని మొన్న ఒక భయానక్ మెయిల్ పంపారు. నేను నీకు ఎందుకు 'అవాంఛిత  వ్యక్తి (పెర్సొన నాన్ గ్రాటా)' అయ్యానో చెప్పమని ఆయన నిలదీశారు. అంత పెద్ద మనిషి...నొచ్చుకునేలా నేనేమి చేసానా? అని ఆత్మపరిశీలన చేసుకుని....ఒక మెయిల్ కొట్టి క్రిస్మస్ శుభదినాన ఫోన్ చేశాను--నాసర్ స్కూలు పక్కన 'ఏజ్ బౌల్డ్' అయిన ఒక గంటకే. ఆయన పంపిన మూడు కామెంట్స్ కు, ఫోన్ కాల్స్ కు నేను స్పందించనందు వల్ల అలా అనుకోవాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. 

నన్ను బండ బూతులు తిట్టే తిక్క వెధవల కామెంట్స్ కూడా పోస్ట్ చేసే ఉదార వాదిని...నేను అభిమానించే బాబాయ్ కామెంట్స్ ఎలా మిస్ అయ్యానో తెలియడం లేదు. నిజానికి ఆయన కామెంట్స్ ఏవీ నాకు అందలేదు, ఆయన ఫోన్ కాల్ కూడా రాలేదు. ఎక్కడో ఏదో జరిగి...ఈ దారుణ అపార్థానికి కారణమయ్యింది. ఈ విషయాలన్నీ పెద్దాయనకు చెప్పి ఆయన బోసి నవ్వులు విన్నాక మనసు కుదుటపడింది. ఈ శరత్ బాబు కూడా అపార్థం వలలో చిక్కి విలవిలలాడుతున్నట్లు తోస్తున్నది.

అందరితో మంచిగా ఉండాలని ఎంతగా అనుకున్నా...అపార్థాలు ఎక్కువవుతున్నాయి ఈ జీవితంలో. 'మీ పోస్టులో కామెంటు నన్ను ఉద్దేశించి రాసారా? నేను అలాంటి వాడిని కాను,' అని మా కాలనీ లో ఉన్న ఒక హై కోర్టు లాయరు గారు ఫోన్ చేస్తే....ఎందుకొచ్చిన అపార్థంరా నాయనా....అంటూ నా పోస్టులో 'హై కోర్టు' అనే పదాన్ని తొలగించాల్సివచ్చింది. ఈ లాయర్ గారి పేరు ఎత్తితే టీ.టీ.గుర్తుకు వచ్చి చస్తుంది.

ఈ మధ్యన టేబుల్ టెన్నిస్ విషయంలో కూడా ఈ అపార్థం కొంత గందరగోళానికి దారితీసింది. ఏదో ప్రపంచ స్థాయి టోర్నమెంట్ కవరేజ్ కోసం సాయం చేయమని...ఒక పెద్ద మనిషి అడిగితే...నాకు తెలిసిన టీ.వీ. ఛానెల్స్ వాళ్లకు చెప్పాను. కవర్ చేశారు. అందులో హెచ్.ఎం.టీ.వీ. వాళ్ళు...."సమన్వయలోపం వల్ల ఈ టోర్నమెంట్ ప్రజాదరణకు నోచుకోలేదు..." అన్న ఒక వాక్యం రాసారు. అది...రామూ గాడే రాయించాడనో, రాశాడనో  పక్కనున్న అబద్ధాల మరియన్నో, హడావుడి అక్కన్నో ఎక్కిన్చినట్లున్నారు...మన పెద్ద మనిషి చప్పిడి చేయడం లేదు. పుణ్యానికి పోతే పాపం ఎదురైంది. మనం వాడి కాళ్ళు...వీడి కాళ్ళు పట్టుకునే వాళ్ళం కాదు కాబట్టి...చూపరా...నీ తడాఖా...అని మన సత్యం బాబు అలియాస్ ధర్మ దేవతను అడిగాను.

మా పదేళ్ళ పిల్లవాడిని ఆడించుకుందామని...ఒక టీ.టీ.అకాడమీ పక్కనే ఇల్లు తీసుకుని  నా బాధ నేను పడుతుంటే...దేవుడు నన్ను అపార్థం చేసుకున్నాడు. అకాడమీ హాల్లో సాయంత్రంవేళ రేగే దుమ్ము వల్ల పిల్లవాడికి రెండు నెలలకు ఒక సారి...జ్వరం రావడం మొదలయ్యింది. డాక్టరు డస్ట్ ఎలర్జీ అని తేల్చడంతో....సాయంత్రం వేళ లాల్ బహదూర్ స్టేడియం లో ఆడించడం మొదలుపెట్టాను. అక్కడ వేరే కోచ్ తో ప్రాక్టిస్ చేయిస్తుంటే....ఈ అకాడమీ వాళ్ళు అపార్థం చేసుకున్నారు. ఆడిస్తే అక్కడ ఆడించండి...లేదంటే ఇక్కడ ఆడించండని తెగేసి చెప్పారు. ఇక్కడ ఎవరు ఏమి అపార్థం చేసుకున్నా...కుర్రవాడి ఆరోగ్యం ముఖ్యం కాబట్టి....ఎంతో బాధను, ఆవేశాన్ని, కసిని దిగమింగుకొని...వేరే ఏర్పాటు చేసుకుంటున్నాను. దుమ్ము పెద్దగా ఉండని ఉదయం పూట అయినా ఇక్కడ ఆడనివ్వరట. 'ఇది దారుణం అన్నా...ఒకసారి సుభాషణ్ రెడ్డికి ఈ విషయం చెబుదాం. మీ ఏరియా ఎం.ఎల్.ఏ., మంత్రి నాగేందర్ దగ్గరకు పోదాం..రా...' అని ఒకరిద్దరు జర్నలిస్టు యూనియన్ నేతలు అన్నా...ఒక మంచి వ్యవస్థను మనం డిస్ట్రబ్ చేయకూడదని నేనే కొంత రిస్క్ తీసుకుని అక్కడా ఇక్కడా ఆడించుకుంటున్నాను.

నా బాధలు, వేదనలు అర్థం చేసుకుని...అయ్యో...అలాగా...అనేవారు మీలో ఎవరైనా ఉంటే...చెప్పండి...ఖైరతాబాద్ చౌరస్తాలో వున్న ఇరానీ కఫే లో కలుద్దాం. చాయ్ తాగుతూ మాట్లాడుకుందాం రండి. సర్వే జనా సుఖినో భవంతు.
(నోట్: ఈ మధ్యన టీ.టీ.మీద కావాలనే ఎక్కువ రాస్తున్నాను. నేను బాగా అపార్థం చేసుకుని మొదట్లో ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చిన ఒకాయన, ఆయన కొడుకు, మరి కొందరు... "వీడేమి రాస్తాడా...." అని రోజూ బ్లాగ్ చూస్తున్నట్లు వేగుల ద్వారా తెలిసింది. వారిలో మానసిక పరివర్తన తేవడం...మంచిని పెంచడం....గుండె మంటలార్పుకోవడం...పనిలో పనిగా కొన్ని మౌలిక అంశాలు టచ్ చేస్తూ మనుషుల మనస్తత్వాలు మీ అందరి ముందు ప్రస్తావించడం మన ఉద్దేశం. అంతే.)

Friday, December 24, 2010

శరత్ ఆవేదనకు పరిష్కారం ఏమిటి చెప్మా?

ప్రముఖ బ్లాగర్ శరత్ గారిది న్నది ఉన్నట్లు కుండ బద్దలుకొట్టినట్లు చెప్పే మనస్తత్వం. జనం సభ్యత, సంస్కారం ముసుగువేసి మేకప్ తో కప్పేసే పలు అంశాలకు ఆయన తనదైన భాషలో తన భాష్యం చెబుతారు. ఆయనీ మధ్యన హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఆఫీసుకు ఆహ్వానించాను. ఒక గంట పాటు మాట్లాడాను. ఆయన నిర్మొహమాటత్వం, విషయాల పట్ల క్లారిటీ నాకు బాగా నచ్చాయి. ఆయన ఇంటర్వ్యూ  హెచ్.ఎం.-టీ.వీ.లో వచ్చేట్లు చేయాలని చాలా ప్రయత్నించాను కానీ....కుదరలేదు. 
తను నాకు ఆ రోజు చెప్పిన పలు అంశాలతో 'పెళ్ళయిన బ్రహ్మచారిని నేను!' అన్న శీర్షికతో ప్రచురించిన అత్యంత డేరింగ్ పోస్టు చూసి మా అబ్రకదబ్ర ఆగలేక రాసి పంపిన పోస్టు ఇది. 'వాడొక పెంట వెధవ' అని ఒకప్పుడు తిట్టిన ఒక మహిళా బ్లాగరు...'మీరు ఏమైనా అనుకోండి...ఆ శరతే బెటర్ అనిపిస్తున్నది నాకు. ఉన్నది వున్నట్లు రాస్తాడు,' అని ఈ మధ్యన అన్న విషయం గుర్తుకు వచ్చింది...ఈ పోస్టు పబ్లిష్ చేస్తుంటే. మా అబ్రకదబ్ర గాడి ఆత్మఘోష ఇప్పుడు చదవండి...రాము
--------------------------------------------------------------------------------
శరత్ 'కాలం' ఇవ్వాళ చాలా మందికి పెద్ద హాట్ టాపిక్ అనిపించవచ్చు. శరత్ మీద మంట వున్న వాళ్ళు కూడా....బాధపడేట్లు ఉందా కథనం. ఒక ముఖ్యమైన విషయాన్ని ఈయన ప్రస్తావించాడు. మగ వల్ల ఆడకు గానీ, ఆడ వల్ల మగ కు గానీ ఇలా జరగడం గృహహింస కిందికే వస్తుంది. 

దంపతుల మధ్య గుట్టుగా ఉండాల్సిన విషయాన్ని ఇలా బహిర్గతం చేయవచ్చా? ఈ పోస్టు రాయడానికి ముందు శరత్ తన శ్రీమతి అనుమతి తీసుకున్నారా? ఈ పోస్టు గురించి తెలిస్తే ఆమె ఎలా ఫీలవుతారు? నిజంగా శరత్ వైపు నుంచి ఏమీ తప్పులేకుండానే ఆమె అలా ప్రవర్తిస్తున్నారా? నిజంగానే విడాకులు ఇచ్చి పారేస్తాడా? పెళ్లి కాకముందు మనోడు పిచ్చి తిరుగుళ్ళు తిరిగిన విషయం తెలిసినందునే శరత్ పట్ల మేడం అలా ప్రవర్తిస్తున్నారా? ఇత్యాది ప్రశ్నల జోలికివెళ్ళకుండా ఉంటే...ఒక్కటి మాత్రం నిజం: నిజానికి శరత్ బాధ....ఈ ఇండియాలో మెజారిటీ మెజారిటీ వివాహితుల బాధ. పెళ్ళయిన బ్రహ్మచారులే తొంభై శాతం మంది. పెళ్లి బాసలు, కట్టుబాట్లు వంటి నైతిక సంకెళ్ళ మధ్య నలుగుతూ మూసుకు కూర్చున్న వారే అధికం. ప్రేమపెళ్లి చేసుకున్న జంటలలో కూడా ఈ పరిస్థితి ఉండడం విచిత్రం. మగవాడి అనాసక్తి వల్ల ఉస్సురుమనే మహిళలూ ఉండకపోరు. ఇలాంటి కీలక విషయాల మీద చర్చ జరగకపోవడం, జరిపితే...తప్పన్నట్లు చూడడం మన విషాదం. 

ఈ తొక్కలో జీవితంలో...సెక్స్ ఎంతో ముఖ్యం. మనిషన్న ప్రతి వాడికీ ఇది అనుభవంలోకి వచ్చే సత్యమే. కానీ...పిల్లలు పుట్టగానే ఇక పని అయిపోయిందన్న భావన పెరగడం సాధారణం అయిపోయింది. నాలుగు పదులు దాటక ముందే...'ఇంత వయస్సు వచ్చినా...ఇంకా ఏమిటీ....పాడుపని' అనుకునే వారే అధికం.
సెక్స్ కు దూరంగా వుంచబట్టే...కుటుంబాలకు దూరంగా ఉండే సైనికులు కనిపించిన మహిళలను రేప్ చేయడం చూస్తున్నాం. సెక్స్ కు దూరంగా ఉండే మనిషి ప్రవర్తనకు, కనీసం రెండు మూడు రోజులకొకసారైనా సెక్స్ సుఖం వున్న వ్యక్తి ప్రవర్తనకు మధ్య తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. 

అన్నం, నిద్ర లాగా ఈ సుఖం చాలా ముఖ్యం, అది నిత్య సత్యం. ఇంత ముఖ్యమైన విషయాన్ని పిల్లలకు బోధించకుండా...పెళ్ళిళ్ళు చేస్తారు. దోస్తుల ద్వారా...బూతు పుస్తకాలు, నీలి చిత్రాల ద్వారా 'విషయ'జ్ఞానం పెరిగిన మగవాడి కోరికకు...సంప్రదాయం బుట్టలో తరలివచ్చిన ఆమె అవగాహనకు మధ్య పొంతన కుదరడం లేదు. సెక్స్ లేక మాడే వారే దొంగ పనులు, వైవాహికేతర సంబంధాలు పెట్టుకునే అవకాశం ఉంది. అందుకే శరత్ లేవనెత్తిన అంశం కీలకమైనది. సెక్స్ లో పాల్గొన్న తర్వాత రెండు రోజుల పాటు నాకైతే...ఆడ పురుగు వైపు చూడబుద్ధి కాదు. నా ఫ్రెండ్స్ చాలా మంది ఇదే చెబుతారు.

ఈ సమస్య పోవాలంటే....మన విద్యావ్యవస్థ, కుటుంబ వ్యవస్థలో బలమైన మార్పులు రావాలి. సెక్స్ పట్ల అందరికీ మంచి అవగాహన పెరగాలి. సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచం తలరాతను మారుస్తుంటే...ఎంతో కీలమైన ఆనందం విషయంలో మాత్రం మనం అనుకూలమైన వ్యవస్థను నిర్మించుకోలేకపోతున్నాం. ఇదొక విషాదం. మహా విషాదం. 

ఇప్పుడు శరత్ పోస్టు చదివిన కపుల్స్ చేయాల్సింది ఒక్కటే: కనీసం పక్షానికి ఒకసారైనా కూర్చొని సెక్స్ గురించి మాట్లాడుకోవాలి. పరస్పర అవసరం గురించి సమీక్షించుకుంటూ....సవరణలు చేసుకుంటూ...పథ(డ)క రచన చేసుకోవడమే. లేదంటే....ప్రతి జంటా....కొత్త సంవత్సరపు తీర్మానాల జాబితాలో సెక్స్ ను చేర్చాలి. శరత్ సమస్య కూడా శరవేగంతో పరిష్కారమై...మనోడు ఇంటికిపోవడానికి కూడా భయపడే ఒక విచిత్ర  పరిస్థితి రావాలని ఆశిద్దాం. 

Wish you good luck Mr&Mrs Sharat

--With love.... Abrakadabra

Wednesday, December 22, 2010

దివాకర్-శైలేష్ ప్యానల్ ఘనవిజయం--'ఈనాడు' బృందానికి షాక్

నిన్నటి పోస్టులో ఊహించినట్లే దివాకర్-శైలేష్ రెడ్డి ప్యానల్ 'జర్నలిస్ట్ కో-ఆపరేటివ్ హౌసింగ్  సొసైటీ లిమిటెడ్' ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. అత్యంత కోలాహలంగా ఈ ఉదయం జూబిలీ హిల్స్ లో సొసైటీ కార్యాలయం దగ్గర జరిగిన ఎన్నికల్లో ఈ ప్యానల్ కు చెందిన తొమ్మిది మందిలో ఏడుగురు విజయం సాధించారు. 'ఈనాడు-ప్రజాశక్తి' జర్నలిస్టుల ప్యానల్ ఘోరంగా దెబ్బతిన్నది. అయితే...ఆ ప్యానల్ కు నేతృత్వం వహించిన వేణుగోపాల రావు మాత్రం అందరికన్నా అత్యల్ప ఓట్లతో గట్టెక్కారు. నాకు బాగా పరిచయం వున్న సుబ్బారావు  (ఈనాడు), హరీందర్ (టీ.వీ.-9), పోటీలో వున్న ఏకైక మహిళా అభ్యర్థి (పేరు గుర్తు లేదు) ఓడిపోయారు.

ప్రస్తుత కమిటీ కి కార్యదర్శిగా వున్న వేణుగోపాల రావు పాత్ర సొసైటీ లో అంత ప్రభావశీలంగా ఉండే అవకాశం లేదు. ప్రస్తుత అధ్యక్షుడు దివాకర్ మరొకసారి అదే పదవిలో, శైలేష్ రెడ్డి కార్యదర్శి అయ్యే అవకాశాలు వున్నాయి. రావు గారి ప్యానల్ విజయం కోసం 'ఈనాడు' న్యూస్ ఎడిటర్ హోదాలో వున్న ఎన్.రాహుల్ కుమార్ ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది.  మొత్తం 763 ఓట్లకు గానూ 418 పోలయ్యాయి.

విజేతల వివరాలు, వారి సంస్థ, వారు పొందిన ఓట్లు ఇలా వున్నాయి...
1) దివాకర్--ఇండియన్ ఎక్స్ ప్రెస్--242
2) శైలేష్ రెడ్డి--జీ- 24 గంటలు--241
3) శ్రీనివాస రెడ్డి--సాక్షి--208
4) నరేందర్ రెడ్డి--సాక్షి--194
5) వైశాఖి--డెక్కన్ క్రానికల్--178
6) జయప్రసాద్--లోకల్ టీ.వీ.--177
7) వెంకటాచారి--విశాలాంధ్ర--174
8) హాష్మి--సియాసత్--174
9) వేణుగోపాల రావు--ప్రజాశక్తి-- 173

Tuesday, December 21, 2010

జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ ఎన్నికలకు రంగం సిద్ధం

ఐదేళ్లకొకసారి జరిగే 'జర్నలిస్ట్ కో-ఆపరేటివ్ హౌసింగ్  సొసైటీ లిమిటెడ్' ఎన్నికలకు రంగం సిద్ధమయ్యింది.769 మంది సభ్యులు తొమ్మిది మంది డైరెక్టర్స్ ను బుధవారం హైదరాబాద్ లోని జూబిలీ హిల్స్ లో ఉన్న సొసైటీ కార్యాలయంలో జరిగే ఎన్నికల్లో ఎన్నుకోబోతున్నారు. ఇప్పుడు అధ్యక్షుడిగా వున్న దివాకర్, కార్యదర్శి గా వున్న వేణుగోపాల్ ల నాయకత్వాలలోని ప్యానల్స్ హోరాహోరీ తలపడుతున్నాయి. నాన్-అలాటీస్ పక్షాన పోరాడతామని చెబుతున్న వీరాంజనేయులు ప్యానల్ కూడా రంగంలో వుంది. దివాకర్ ప్యానల్ లో జీ-ఛానెల్ హెడ్ ఆర్.శైలేష్ రెడ్డి వుండగా, వేణు గోపాల్ ప్యానల్ కు 'ఈనాడు' న్యూస్ ఎడిటర్ హోదాలో వున్న ఎన్.రాహుల్ కుమార్ మద్దతు ఇస్తున్నారని చెబుతున్నారు. తాను పనిచేస్తున్న ప్రజాశక్తి లో వున్న 29 ఓట్లకు తోడు 'ఈనాడు' జర్నలిస్టుల ఓట్ల తో తాను నెట్టుకు రాగలనని వేణుగోపాల్ వర్గం భావిస్తున్నది. 

"దివాకర్ ది బ్రాహ్మణ-రెడ్డి ప్యానల్ కాగా, వేణుగోపాల్ ది పక్కా కమ్మ ప్యానల్. వీరాంజనేయులు వీకర్ సెక్షన్ ప్రతినిధిగా ప్రచారం చేసుకుంటున్నారు. దివాకర్ ను తిట్టిపోసినా...ఇండియన్ ఎక్స్ ప్రెస్, ది హిందూ లోని బ్రాహ్మణ జర్నలిస్టులు దివాకర్ కు ఓటు వేస్తారు. ఆ ప్యానల్ కే విజయావకాశాలు ఎక్కువగా వున్నాయి," అని ఈ ప్రచారాన్ని దగ్గరి నుంచి చూసిన ఒక సీనియర్ పాత్రికేయుడు చెప్పారు. 

గత ఎన్నికలు జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు గోపనపల్లి స్థలాన్ని అభివృద్ధి చేసే విషయంలో మీరేమి చేశారు? అని అడిగితే అటు దివాకర్ గానీ, ఇటు వేణుగోపాల్ గానీ ఏమీ చెప్పుకోలేరు. అక్కడ ఒక ఆర్చ్ నిర్మించాలన్న ప్రతిపాదన ఒక అడుగైనా ముందుకు సాగలేదు.

గోపనపల్లి దగ్గర జర్నలిస్టుల కోసం స్థలం కేటాయించి పదహారు ఏళ్ళు అయినా...ఇంతవరకూ అక్కడ జర్నలిస్టులు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. "అధునాతన షాపింగ్ కాంప్లెక్స్, స్కూల్ నిర్మాణం జరగాలి. లేకపోతే....జర్నలిస్టులకు స్థలాలు ఇవ్వడం వెనుక ఉద్దేశం నెరవేరదు," అని శైలేష్ చెప్పారు. నాన్-అలాటీ లకు స్థలం పొందడం కోసం ప్రభుత్వం పై ఒత్తిడి తేవడం, ప్రత్యామ్నాయం గా సభ్యులకు అపార్ట్ మెంట్స్ నిర్మించడం...వంటి ప్రణాళికతో తాము ప్రచారం చేసామని ఆయన చెప్పారు. తాము చేసిన అభివృద్ధి ను చూసి తమను గెలిపించాలని వేణుగోపాల్ బృందం కోరుతున్నది. ఓటర్ల వివరాల కోసం ఈ వెబ్సైటు చూడండి. 

Sunday, December 12, 2010

HM-TV పై కోపం అమానుషం... దారుణం...

హంస...పాలను, నీళ్ళను వేరుచేసినట్లు వార్తను, వ్యాఖ్యను వేరుచేసి చూపిస్తామని స్పష్టంగా ప్రజలకు భరోసా ఇచ్చేందుకే అనుకుంటా....హెచ్.ఎం.-టీ.వీ.కి ఆ పక్షిరాజం గుర్తును  లోగోగా వాడారు. టీ.ఆర్.పీ.రేటింగు గొడవలో పడి దాదాపు అన్ని ప్రధాన ఛానెల్స్ నీతిని గాలికి వదిలేసి, రాజకీయ జెండాలు నిస్సిగ్గుగా భుజానికి ఎత్తుకుని గర్వంగా స్వైరవిహారం చేస్తున్న వేళ ఈ ఛానెల్ భిన్నంగా వ్యవహరిస్తున్నది. "హింస, అశ్లీలం మా ఛానెల్ లో చూపబోము," అని పబ్లిగ్గా ధైర్యంగా ప్రకటించి ఆ మాటకు కట్టుబడే ఒకే ఒక్క ఎడిటర్ కే.రామచంద్రమూర్తి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఛానల్ అందుకే అనూహ్యంగా ప్రజాభిమానం పొందింది. గత కొన్ని నెలలుగా ఛానెల్ ఆపరేషన్స్ దగ్గరి నుంచి చూస్తున్నవాడిగా నాకు అనిపించింది ఏమిటంటే...ఇప్పుడున్న ఛానెల్స్ లో ఇది చెప్పుకోదగినది, భిన్నమైనది.

అలాంటి ఛానెల్ వారి ప్రధాన కార్యాలయం దగ్గర పార్క్ చేసిన వ్యాన్ మీద కాషాయ సేన దాడిచేసిందంటే...ఆవేదన కలిగింది. ఇది దారుణం, అమానుషం. అభ్యంతరాలు ఉంటే...వచ్చి మూర్తి గారిని గానీ...మరొక సీనియర్ ఎడిటర్ ను గానే కలిసే అవకాశం ఉన్నా ఛానెల్ పై దాడికి దిగడం హేయమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. శివసేన తరహా శైలితో బెదిరించాలని చూడడం మంచిది కాదు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి దోషులను శిక్షించాలి. 

ఎందుకు ఈ కాషాయ సేనకు కోపం వచ్చిందో చర్చించాలి. ఈ మధ్యన మూర్తి గారు ఒక పది రోజుల పాటు కాశ్మీర్ లో పర్యటించి వచ్చి...అక్కడి ముఖ్య నేతలను ఇంటర్వ్యూ చేసి 'మండుతున్న మంచు కాశ్మీర్' అన్న శీర్షికతో గత కొన్ని రోజులుగా ప్రత్యేక కథనాలు ప్రసారం చేస్తున్నారు. రాష్ట్ర విభజన డిమాండ్, భయం తో రాష్ట్రం అట్టుడుకుతున్నప్పుడు ఈ ఛానల్ చొరవతో అన్ని ప్రాంతాలలో ఏర్పాటు చేసిన 'దశ-దిశ' కార్యక్రమం తర్వాత...'మండుతున్న మంచు...కాశ్మీర్' మరొక గొప్ప ప్రయత్నం అనిపించింది. ప్రోగ్రాం నాణ్యత విషయంలో నాకు కొంత అభ్యంతరం వున్నా...ఒక సీనియర్ ఎడిటర్...ఇటీవల బాగా ఇబ్బందిపెట్టిన అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా...ఒక ముఖ్య సమస్యను దగ్గరి నుంచి పరిశీలించి ప్రత్యేక కథనాలు ఇవ్వడం సంతోషదాయకం అనిపించింది. ఈ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. మీ కోసం.....కాశ్మీర్ పర్యటన విశేషాలతో ఈ బ్లాగ్ కు ఒక పీస్ రాయాల్సిందిగా నేనీ మధ్యన మూర్తి గారికి ఒక మెయిల్ పంపాను కూడా.

మూర్తి గారు ఇంటర్వ్యూ చేసిన వారివీ, తమవీ అభిప్రాయాలు ఒకటే కాదు కాబట్టి కాషాయసేన కక్షకట్టింది. ఇదొక హాస్యాస్పదమైన విషయం. ఒక సీనియర్ ఎడిటర్ కథనాన్ని అర్థం చేసుకోకుండా కొందరు శుక్రవారం నాడు ఈ ఛానెల్ కు శ్రీనగర్ (హైదరాబాద్) కాలనీలో ఉన్న ఆఫీసు ఎదుట ధర్నాకు దిగారట. మర్నాడు, అంటే నిన్న రాత్రి ఛానల్ వారి హెడ్ ఆఫీసు దగ్గర మెరుపు దాడి చేసి...డీ.ఎస్.ఎన్.జీ. వ్యాను ను ధ్వంసం చేసి పారిపోయారు. ఇది మంచి పద్ధతి కాదు. దాడికి దిగింది...భజరంగ్ దళ్ వారు కాదని ఆ సంస్థ ప్రకటించింది. మరెవరు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారు? వారిని గుర్తించి శిక్షించాలి.
(Note: ప్రతి దాంట్లో పెడార్థాలు, కంతలు వెతికే మితృలారా...నేనేదో ఈ ఛానెల్ వారి ఆఫీసులో వున్న జర్నలిజం స్కూల్లో పనిచేస్తున్నాను కాబట్టి...పాజిటివ్ గా రాసానని అనుకోకండి. రాగద్వేషాలకు అతీతంగా బ్లాగ్ నిర్వహించడం నా కర్తవ్యం, బాధ్యత. నా అభిప్రాయాలు ఏ మాత్రం దాచుకోకుండా రాయడమే ఉద్దేశం. ఈ అంశంపై మీ విమర్శలు, అభిప్రాయాలు జంకు లేకుండా రాయండి....చర్చ జరుపుదాం--రాము)       

Tuesday, December 7, 2010

సత్యానిదే ఏనాటికైనా విజయం: జూలియన్ అస్సాంజే

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అస్సాంజే 'ది ఆస్ట్రేలియన్' పత్రికలో రాసిన వ్యాసం ఆసక్తికరంగా ఉంది. సత్యాన్ని వెలికితీయడానికి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కొత్త దారులు వెతుక్కోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.  ఈ కొత్త తరహా జర్నలిజాన్ని అతను 'సైంటిఫిక్ జర్నలిజం' అంటున్నాడు. అనువాదం చేసే సమయం లేక...ఆ ఆంగ్ల వ్యాసాన్ని యథాతథంగా మీకు అందిస్తున్నాను. వీలుచూసుకుని దీని తెలుగు కాపీ కూడా పోస్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. మనలాగానే...మన అస్సాన్జే కూడా 'సత్యమేవజయతే' అనడం ఆనందదాయకం...
"The swirling storm around WikiLeaks today reinforces the need to defend the right of all media to reveal the truth," అని అనడం కూడా నాకు నచ్చింది...రాము
---------------------------------------------------------
IN 1958 a young Rupert Murdoch, then owner and editor of Adelaide’s The News, wrote: “In the race between secrecy and truth, it seems inevitable that truth will always win.”
His observation perhaps reflected his father Keith Murdoch’s expose that Australian troops were being needlessly sacrificed by incompetent British commanders on the shores of Gallipoli. The British tried to shut him up but Keith Murdoch would not be silenced and his efforts led to the termination of the disastrous Gallipoli campaign.
Nearly a century later, WikiLeaks is also fearlessly publishing facts that need to be made public.
I grew up in a Queensland country town where people spoke their minds bluntly. They distrusted big government as something that could be corrupted if not watched carefully. The dark days of corruption in the Queensland government before the Fitzgerald inquiry are testimony to what happens when the politicians gag the media from reporting the truth.
These things have stayed with me. WikiLeaks was created around these core values. The idea, conceived in Australia , was to use internet technologies in new ways to report the truth.
WikiLeaks coined a new type of journalism: scientific journalism. We work with other media outlets to bring people the news, but also to prove it is true. Scientific journalism allows you to read a news story, then to click online to see the original document it is based on. That way you can judge for yourself: Is the story true? Did the journalist report it accurately?
Democratic societies need a strong media and WikiLeaks is part of that media. The media helps keep government honest. WikiLeaks has revealed some hard truths about the Iraq and Afghan wars, and broken stories about corporate corruption.
People have said I am anti-war: for the record, I am not. Sometimes nations need to go to war, and there are just wars. But there is nothing more wrong than a government lying to its people about those wars, then asking these same citizens to put their lives and their taxes on the line for those lies. If a war is justified, then tell the truth and the people will decide whether to support it.
If you have read any of the Afghan or Iraq war logs, any of the US embassy cables or any of the stories about the things WikiLeaks has reported, consider how important it is for all media to be able to report these things freely. 

WikiLeaks is not the only publisher of the US embassy cables. Other media outlets, including Britain ‘s The Guardian, The New York Times, El Pais in Spain and Der Spiegel in Germany have published the same redacted cables.
Yet it is WikiLeaks, as the co-ordinator of these other groups, that has copped the most vicious attacks and accusations from the US government and its acolytes. I have been accused of treason, even though I am an Australian, not a US, citizen. There have been dozens of serious calls in the US for me to be “taken out” by US special forces. Sarah Palin says I should be “hunted down like Osama bin Laden”, a Republican bill sits before the US Senate seeking to have me declared a “transnational threat” and disposed of accordingly. An adviser to the Canadian Prime Minister’s office has called on national television for me to be assassinated. An American blogger has called for my 20-year-old son, here in Australia, to be kidnapped and harmed for no other reason than to get at me.
And Australians should observe with no pride the disgraceful pandering to these sentiments by Prime Minister Gillard and US Secretary of State Hillary Clinton have not had a word of criticism for the other media organisations. That is because The Guardian, The New York Times and Der Spiegel are old and large, while WikiLeaks is as yet young and small.
We are the underdogs. The Gillard government is trying to shoot the messenger because it doesn’t want the truth revealed, including information about its own diplomatic and political dealings.
Has there been any response from the Australian government to the numerous public threats of violence against me and other WikiLeaks personnel? One might have thought an Australian prime minister would be defending her citizens against such things, but there have only been wholly unsubstantiated claims of illegality. The Prime Minister and especially the Attorney-General are meant to carry out their duties with dignity and above the fray. Rest assured, these two mean to save their own skins. They will not.
Every time WikiLeaks publishes the truth about abuses committed by US agencies, Australian politicians chant a provably false chorus with the State Department: “You’ll risk lives! National security! You’ll endanger troops!” Then they say there is nothing of importance in what WikiLeaks publishes. It can’t be both. Which is it?
It is neither. WikiLeaks has a four-year publishing history. During that time we have changed whole governments, but not a single person, as far as anyone is aware, has been harmed. But the US , with Australian government connivance, has killed thousands in the past few months alone.
US Secretary of Defence Robert Gates admitted in a letter to the US congress that no sensitive intelligence sources or methods had been compromised by the Afghan war logs disclosure. The Pentagon stated there was no evidence the WikiLeaks reports had led to anyone being harmed in Afghanistan . NATO in Kabul told CNN it couldn’t find a single person who needed protecting. The Australian Department of Defence said the same. No Australian troops or sources have been hurt by anything we have published.
But our publications have been far from unimportant. The US diplomatic cables reveal some startling facts:
The US asked its diplomats to steal personal human material and information from UN officials and human rights groups, including DNA, fingerprints, iris scans, credit card numbers, internet passwords and ID photos, in violation of international treaties. Presumably Australian UN diplomats may be targeted, too.
King Abdullah of Saudi Arabia asked the US Officials in Jordan and Bahrain want Iran ‘s nuclear program stopped by any means available.
Britain’s Iraq inquiry was fixed to protect “US interests”.
Sweden is a covert member of NATO and US intelligence sharing is kept from parliament.
The US is playing hardball to get other countries to take freed detainees from Guantanamo Bay . Barack Obama agreed to meet the Slovenian President only if Slovenia took a prisoner. Our Pacific neighbour Kiribati was offered millions of dollars to accept detainees.
In its landmark ruling in the Pentagon Papers case, the US Supreme Court said “only a free and unrestrained press can effectively expose deception in government”. The swirling storm around WikiLeaks today reinforces the need to defend the right of all media to reveal the truth. 

Julian Assange is the editor-in-chief of WikiLeaks.

Sunday, December 5, 2010

గొంగళిలో అన్నం తింటూ వెంట్రుకలు ఏరనేల?:: Sunday Special

జర్నలిజం కాలేజీలలో సీటుకోసం దరఖాస్తు చేసుకునే అమ్మాయిలను...'తల్లీ...నీ రోల్ మోడల్ ఎవరు?' అని అడిగితే...తొభై శాతం మంది బర్ఖాదత్ పేరు చెబుతారు. అలాగే ఆమె పేరు చెప్పి..."ఇండియన్ జర్నలిజం స్కూల్"లో సీటు పొందిన ఒక ఉత్సాహవంతురాలైన విద్యార్థిని నిన్న నాతో మాట్లాడుతూ..."సార్...మీరు అడిగినప్పుడు బర్ఖా దత్ పేరు చెప్పాను. ఈ టేపుల గొడవ చూశాక నా గుండె పగిలిపోయింది సార్...." అని  అమాయకంగా చెప్పింది. 
ఇప్పుడంతా బర్ఖా మీద పడి ఏడుస్తున్నారు కానీ...నాకు తెలిసి అత్యధిక సంఖ్యలో జర్నలిస్టులు ఇలాంటి లాబీ వ్యవహారాలు చేస్తూ...తాము పనిచేసే సంస్థకో, తమకో లాభం కలిగేలా చూసుకుంటారు. గాస్ సిలిండర్ సైతం పైరవీతో కాకుండా...క్యూలో నిల్చుని తెచ్చుకోవాలని అనుకునే నాలాంటి వాళ్ళను ఇదే జర్నలిస్టులు....పిచ్చి నాయాళ్ళుగా, పనికిరాని వెధవలుగా చూస్తారు. 

అంతదాకా ఎందుకు? మీకు అందుబాటులో వున్న 'ఈనాడు' లేదా 'ఆంధ్రజ్యోతి' విలేకరులతో మాట్లాడండి. వారితో వారి యాజమాన్యాలు ఎలా పనులు చేయిన్చుకున్నాయో చెబుతారు. అన్ని పత్రికలు నేతలను, పోలీసులను, అధికారులను అడ్డంపెట్టుకుని ప్రతి జిల్లా కేంద్రంలో ఛీప్ రేటుకు పెద్ద మొత్తంలో స్థలాలు కొన్నాయి. ఒక రామోజీ, ఒక రాధాక్రిష్ణ లాబీయింగ్ చేయకుండానే ఈ స్థాయికి వచ్చారా? ఆగస్టు సంక్షోభం ఒక పెద్ద మీడియా-పొలిటికల్ లాబీయింగ్ లో భాగం కాదా? పుష్కరాల కవరేజ్ కు కూడా మీడియా లాబీయింగ్ చేసిన ఘనత చంద్రబాబు గారిది. ఎన్.డీ.-టీ.వీ.యాజమాన్యానికి, ప్రనోయ్ రాయ్ కు తెలీకుండా ఇదంతా జరిగిందని అనుకోవడం ఒక పిచ్చితనం. ఇక్కడ దొరికినోడు మాత్రమే దొంగ సార్. 

నాకు తెలిసి...ప్రతి విలేకరి తమ సంస్థ కోసం పైరవి చేస్తాడు. నేను....అలా చేసే వాడిని కాదు...అన్న పిచ్చి మారాజులు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది.  అలాంటి వాడికి చెత్త బీట్ దొరుకుతుంది. పనికిరానివాడన్న ముద్ర బోనస్ గా లభిస్తుంది. విలేకరులు అంతా....వ్యాపార ప్రకటనల కోసం గడ్డి కరుస్తూ...లాబీ చక్రవలయంలో చిక్కుకుంటున్నారు. రాజకీయ తీట వున్న తాను ఇచ్చే ప్రకటన, ఫోటో పత్రికలో వేసి మర్నాడు...ఒక పచ్చ గాంధీ (ఐదొందలు) కోసం తన దగ్గరకు వచ్చే విలేకరుల గురించి ఒక న్యాయవాది చెబితే మొదట్లో నేను ఆశ్చర్యపోయాను. యాజమాన్యాలు సరిగా డబ్బులివ్వవు, మన లాయర్ లాంటి వాళ్ళు వ్యవస్థను కరప్ట్ చేస్తారు, ఈ కక్కుర్తిగాళ్ళు (విలేకరులు) గడ్డి తింటారు. ఇక్కడ మేత బాగుందని గ్రహించి...వేరే పనిచేసుకునే దొంగ వెధవలు కూడా విలేకరులు, విశ్లేషకులు, మేథావుల అవతారాలు ఎత్తి జర్నలిజాన్ని మరీ పలచన చేస్తారు.    

నిజానికి జిల్లాల్లో విలేకరులు చాలా మంది ఏదో ఒక రాజకీయవేత్తకు బంటుగా పనిచేస్తారు. ఆ దన్నుతో అధికారులను బెదిరించి దండుకుంటారు. అయినా...పత్రికలు, ఛానెల్స్ పార్టీల వారీగా చీలిపోయినప్పుడు, ప్రకటనల కోసం విలేకరులకు టార్గెట్ లు ఉన్నప్పుడు....ఇంకా జర్నలిజంలో విలువలు ఉంటాయని అనుకోవడం ఒక భ్రమ, దురాశ. దురదృష్టవశాత్తూ మన దగ్గర జర్నలిస్టు యూనియన్ నేతలు కూడా మాంచి లాబీయిస్టులు. వారిని నమ్ముకోకపోతే....తర్వాత ప్రెస్ అకాడమీ ఛైర్మన్ వంటి పదవులకు లాబీయింగ్ కష్టమవుతుందని మన ఎడిటర్లు భావించాల్సిన పరిస్థితి. కాబట్టి....గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఏరుకోవడం దేనికి? కుళ్ళి కంపుకొడుతున్న వ్యవస్థను బాగుచేయడానికి దివి నుంచి భువికేగిన వ్యవస్థ...ఈ మీడియా అనుకోవడం దేనికి? 

Saturday, December 4, 2010

'రాడియా గేటు' పై టీవీ చర్చల్లో లాబీయిస్టులకు పెద్దపీట

వైష్ణవి కమ్యూనికేషన్స్ అధినేత్రి, కార్పోరేట్ లాబీయిస్ట్ నీరా రాడియా...ప్రసిద్ధ జర్నలిస్టులు బర్ఖాదత్, వీర్ సంఘ్వి లతో తెరవెనుక నడిపిన మంత్రాంగం విషయంలో తెలుగు టెలివిజన్ చానెళ్ళు చేస్తున్న చర్చలు చూస్తే బాధ కలుగుతున్నది. 

తెలుగు జర్నలిజాన్ని బాహాటంగా అమ్ముకుని బాగా సంపాదించిన వారిని, యూనియన్ను అడ్డం పెట్టుకుని అడ్డదిడ్డంగా పదవులు, ఆస్తులు సంపాదించిన వారిని, జర్నలిజంలో నైతిక విలువలు పూర్తిగా నాశనం కావడానికి కారణమైన వారిని చర్చలకు పిలుస్తున్నారు. ఇది అభ్యంతరకరం, దారుణం, ప్రజలను మోసం చేయడం. పొట్టకోస్తే అక్షరం ముక్క బైటపడని ఈ పండితులు...టీ.వీ.స్టూడియోలలో కూర్చుని జర్నలిజం విలువల గురించి మాట్లాడుతున్నారు. ఎన్నో చిలకపలుకులు పలుకుతున్నారు. 

అధికారంలో ఎవరుంటే...వారి భజన చేసి నాలుగు రాళ్ళు వెనుక వేసుకుని, తమ్ములకు అన్నలకు అత్తమామలకు మేళ్ళు చేసే ఈ బ్యాచు రాడియా ఉదంతం పై తీర్పులు చెబుతుంటే...అసహ్యం వేస్తోంది. ఈ బాపతు గాళ్ళు సచివాలయంలోపల, వెలుపల ఎలాంటి లాబీయింగ్ చేసి ఎంత సంపాదిస్తారో సీనియర్ జర్నలిస్టులను ఎవరిని అడిగినా చెబుతారు. సీనియర్ ఎడిటర్లు...దయచేసి చర్చలకైనా నికార్సైన నిజాయితీపరులైన జర్నలిస్టులను పిలిస్తే బాగుంటుంది. 

Friday, December 3, 2010

శ్రీకాంతా చారికి విగ్రహం ఎంతవరకు సమంజసం?

సరిగ్గా ఏడాది కిందట...తెలంగాణా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సందర్భంలో....ఇదే రోజు...తమ్ముడు శ్రీకాంతాచారి అందరూ చూస్తుండగా ఆత్మాహుతికి పాల్పడ్డాడు. కాలిన గాయాలతో పోలీసు జీప్ లో కూర్చున్న ఆ యువకుడి మొహం నాకు ఎప్పటికీ గుర్తువుండి పోతుంది. తను నమ్మిన ఒక డిమాండ్ సాధనలో జాప్యాన్ని సహించలేక...అతను ఆ అఘాయిత్యానికి పాల్పడి సమిధ అయ్యాడు. తెలంగాణలో పుట్టిన ఎవరైనా అతని గురించి కన్నీరు పెట్టకుండా ఉండలేరు...అతడు అమరుడని అనకుండా ఉండలేరు. ఒక రోజు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజ్ మీద పెట్టిన నిలువెత్తు శ్రీకాంత్ ఫ్లెక్సీ చూసి నాకు దుఃఖం ఆగలేదు.

అయితే...ప్రథమ వర్థంతి సందర్భంగా అతని స్వగ్రామం నల్గొండ జిల్లా మోత్కూరు మండలం పొడిచేడు గ్రామంలో ఈ రోజు కే.సీ.ఆర్.శ్రీకాంతా చారి విగ్రహాన్ని ఆవిష్కరించారన్న వార్త విని నాకు చాలా బాధ వేసింది. ఈ కార్యక్రమం నాకు నచ్చలేదు. ఆవేశంలో ఆ చర్యకు పాల్పడిన ఆ విద్యావంతుడి కుటుంబానికి చేయూత ఇవ్వడం సముచితం తప్ప ఈ అంశం నుంచి లబ్ది పొందాలని చూడడం మంచిది కాదు.

శ్రీకృష్ణ కమిటీ నివేదిక కోసం తెలంగాణా ఎదురుచూస్తున్నది. మంచికో చెడుకో ఇన్ని రోజులు ఆగాం...ఆ నివేదిక న్యాయం చేస్తుందన్న భావనలో ప్రజలున్నారు. విద్యార్థులు ఒక పెద్ద పోరాటానికి సిద్ధమవుతున్నారు. నివేదిక తర్వాత ప్రత్యేక తెలంగాణా ఏర్పడకపోతే...కనీసం ఒక నెలపాటు తెలంగాణా భగ్గుమనబోతున్నది. ఇక్కడ తర్క వితర్కాలతో సంబంధం లేని విషయంగా ఇది మారింది. డిసెంబర్ తొమ్మిది ప్రకటనకు ముందు....ఎందుకొచ్చిన తెలంగాణ లొల్లి, మన బతుకులు మారతాయా...పాడా.. అనుకున్న తెలంగాణా వాసులు సైతం...తమకు తీవ్ర అన్యాయం జరిగిందని, కేంద్రం తొండిచేసిందని నమ్ముతున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, విద్యావంతుల గుండెలు రగులుతున్నాయి. 

ఈ పరిస్థితిలో శ్రీకాంతా చారి విగ్రహం ఏర్పాటు ఒక తప్పుగా తోస్తున్నది. ఇప్పటికే వందల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, చేతికందిన కుమారులు ప్రాణాలు కోల్పోవడంతో వందల కుటుంబాలు దిక్కు కోల్పోయాయి. పుత్రశోకం వారి తల్లిదండ్రులను దహిస్తున్నది. కేంద్రం కమిటీ ప్రకటించగానే....అంతా మిన్నకుండి పోయారు. దానివల్ల వారి 'త్యాగం' వృథా పోయింది. ఈ పరిస్థితిలో ఈ విగ్రహం ఏర్పాటు వల్ల....మనం ప్రజలకు (ముఖ్యంగా ఉడుకు రక్తపు యువతకు) ఏమని సందేశం ఇస్తున్నట్లు? శ్రీకాంతా చారి బాటలో మీరూ పయనించండని చెప్పినట్లు కాదా? అతనిలా చేస్తే...మీరూ విగ్రహాల రూపంలో చిరస్మరణీయులు అవుతారన్న సందేశం ఇందులో లేదా? ఇది సమంజసమా? ఈ ఉద్యమం కోసం ఎంతమందిని బలి చేయదలిచారు? మీ నేతలు చేసిన తప్పుకు ఈ యువతరం ఎందుకు మూల్యం చెల్లించాలి? 
తెలంగాణా ఉద్యమానికి (ఆ మాటకొస్తే ఏ ఉద్యమానికైనా) కావలసింది ఆత్మహత్యలు కాదు, పోరాట పటిమ. మడమతిప్పని చిత్తశుద్ధి. నిజమైన వీరులు పోరాటంలో మరణిస్తారు తప్ప...ఒట్టిగానే ప్రాణాలు సమర్పించుకోరు. ప్రాణాలు తీసుకోవడం....పోరుబాట నుంచి వైదొలగడం. కాదంటారా?

Thursday, December 2, 2010

"ఆరెంజ్" సినిమా పై పసునూరు శ్రీధర్ బాబు గారి సమీక్ష

నేను అభిమానించే మంచి జర్నలిస్టు మిత్రులలో పసునూరు శ్రీధర్ బాబు గారు ఒకరు. ఆయన ఇండియా టుడే పత్రిక లో పనిచేసారు. ఇప్పుడు హెచ్.ఎం.-టీ.వీ.లో ఉన్నారు. అయన నిర్వహించే బ్లాగు (అనేకవచనం) చాలా మంది రచయితలకు, కవులకు పరిచయం వుంటుంది. ఆరెంజ్ అనే సినిమాపై ఆయన తన బ్లాగులో చేసిన సమీక్ష బాగుందని 'ది సండే ఇండియన్' పత్రిక ఎడిటర్ నరేష్ నున్న చెప్పారు. సమీక్ష నాకు కూడా నచ్చింది. అందుకే...శ్రీధర్ కు చెప్పకుండానే...అనేకవచనం నుంచి దీన్ని కాపీ చేసి కింద పేస్ట్ చేశాను- మిత్రుల మధ్య ప్లేజరిజం గొడవలు/ పాపం ఉండవనే భావంతో....రాము
-----------------------------------------------------------------------------------------------

కొత్త కథలు ఎక్కడ్నించి వస్తాయి? పాత కథల్నే అటూ ఇటూ మార్చడమే కదా కొత్త కథ అంటే? కథ ఎలా ఉందన్నది కాదు కథనం కొత్తగా ఉండాలి, ట్రీట్ మెంట్ లోనే డైరెక్టర్ టచ్ ఏమిటో తెలుస్తుంది. ఇలాంటి మాటలు మన దర్శక వరేణ్యులు ఎన్నోసార్లు అనగా విన్నాం. ఎన్నో హిట్ చిత్రాలు అందించిన దర్శకులు కూడా అలాగే అనగా అనగా విని.. ప్రేక్షకులుగా అందుకు ట్యూనై పోవాలని కూడా ప్రయత్నించాం. అలా సృజనాత్మక దివాళాకోరుతనమనే ప్రమాదాన్ని తెలిసో తెలియకో ఆహ్వానించి భరిస్తున్నాం.

కొందరు దర్శకులైతే అన్ని కథలూ రామాయణంలో, మహాభారతంలో ఉన్నవే అని గంభీరంగా సెలవిచ్చారు కూడా. అలాంటి వాళ్ళు రామాయణ, మహాభారతాలను సరిగ్గా చదవని వాళ్ళయినా అయి ఉండాలి లేదంటే.. మానసికంగా ఆ కాలంలోనే జీవిస్తున్న వారైనా అయి ఉండాలి. కాలం మారుతోంది. జీవితం మనిషికి కొత్త పాఠాలు నేర్పుతోంది. మార్పు మనిషిని కొత్త సంఘర్షణలకు గురి చేస్తోంది. ఇవేవీ గమనించకుండా స్టూడియో గోడల మధ్య పరిభ్రమిస్తూ, గంతలు కట్టిన ఖరీదైన కార్లలో ప్రయాణించే వారికి జీవితం ఇంకా అశోకవనంలో మగ్గిపోతున్నట్లే ఉంటుంది. కురుక్షేత్ర సీమ రక్తంతో మరిగిపోతున్నట్లే కనిపిస్తుంది. పుస్తకాలనే కిటికీలు ఉన్నాయని, వాటిని తెరిస్తే ఎంతో కొంత కొత్త ప్రపంచం కనిపిస్తుందని తెలిసినా మన దర్శకులు చాలా మందికి అంత తీరిక లేదు, ఓపిక అంతకన్నా లేదు.పాపులర్ సినిమా పరిధిలోనే, పరిమితుల్లోనే మారుతున్న ప్రపంచాన్ని, మారుతున్న మానవ సంబంధాల్ని, సంబంధాల మధ్య ఉన్న ఘర్షణల్ని ఎంతో కొంత సున్నితంగా ఆవిష్కరించవచ్చని బొమ్మరిల్టు కట్టి చూపించిన దర్శకుడు భాస్కర్. ఆధునిక ఇన్ఫర్మేషన్ యుగంలో జీవిస్తున్న కొత్త తరం.. తల్లితండ్రుల ప్రేమ, పెంపకాలకు ఇస్తున్న సరికొత్త నిర్వచనాన్ని బొమ్మరిల్లు సినిమా బొమ్మ కట్టి చూపించింది. పరుగు చిత్రంలోనూ భాస్కర్ తన కథానాయకుడి సంఘర్షణను కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేశారు. ప్రేమించిన అమ్మాయిని ఆమె కుటుంబానికి దూరం చేస్తే.. ఆ కుటుంబం పడే బాధను చూసి హీరో సంఘర్షణకు గురి కావడమన్నది కొత్త కాన్సెప్ట్. ఇప్పుడు భాస్కర్.. మరో సున్నితమైన అంశాన్ని ఆరెంజ్ పేరుతో తెరకెక్కించాడు. ప్రేమను కన్స్యూమర్ డ్యూరబుల్స్ లో ఒకటిగా మార్చేసిన నేటి ప్రాక్టికల్ ప్రపంచంలో జీవితాంతం ప్రేమించడమన్నది సాధ్యమా అన్న ప్రశ్నను రెండున్నర గంటలు ట్రెండీగా అనలైజ్ చేయడమే ఆరెంజ్.
ప్రేమ చుట్టూ అల్లుకునే మార్మికత, తీయని మాయ, వ్యామోహాలను ఆవిరి చేసే సందర్భాలను ఆధునిక ప్రపంచం అతి తరచుగా ఆఫర్ చేస్తుంటుంది. వాటిని తట్టుకుని నిలబడడానికి ఏం చేయాలి? ప్రేమ పుట్టడానికి ఓ క్షణం చాలు. అలాగే ప్రేమికులు విడిపోవడానికి ఓ కారణం చాలు. ఆ కారణాన్ని ప్రేమికులు ఉపయోగించుకోకుండా ప్రేమరాహిత్యాన్ని భరిస్తుంటారని అనుభవంతో తెలుసుకుంటాడు భాస్కర్ సృష్టించిన ఆరెంజ్ కథానాయకుడు రామ్. ఇన్ సెక్యూరిటీ, ఓవర్ పొసెసివ్ నేచర్, ఇన్ ఫెడిలిటీ, వ్యక్తిగతాన్ని ఆక్రమించే అనుబంధాల చట్రంలో ఇప్పుడు ప్రేమ.. రోజుకు నాలుగు ఎస్.ఎం.ఎస్ లు, రెండు కుళ్ళు జోకులు.. మరికొన్ని తీపి అబద్ధాల కాంబినేషన్ గా మారిపోయిన నేటి కాలేజ్ ఏజ్ ప్రేమల ప్రపంచంలోకి నిజంగా, నిజాయితీ, అంతఃకరణ ప్రకారం నడుచుకునే హీరోను ప్రవేశపెడతాడు దర్శకుడు భాస్కర్. జీవితాంతం ప్రేమించడం సాధ్యమా అని ఆరెంజ్ హీరో రామ్ అడిగిన ప్రశ్న కొత్తగా పుట్టిన ప్రశ్నేమీ కాదు. ఈ ప్రశ్నకు కనీసం రెండు దశాబ్దాల వయసుంది? ఈ ప్రశ్నకు సిన్సియర్ గా జవాబు చెప్పుకోవడానికి.. ప్రేమను ఆరాధనగా కీర్తించే హిపోక్రాట్స్ కు చాలా కష్టం. ప్రేమ అంటే ఒకరి పట్ల మరొకరికి కలిగే అపారమైన ఇష్టం. ఇష్టమైన వస్తువును తింటున్నప్పుడు విటమిన్ల గోల కానీ, షుగర్ కంటెంట్ కు సంబంధించిన దిగులు కానీ ఉండదు. ఒక ఎగ్జయిటెడ్ స్టేజ్ లో ఐ లవ్ యూ చెబుతుంది జెనీలియా రూపంలో ఉన్న జాహ్నవి. ఈ ప్రేమ నాకు జీవితాంతం కావాలని చెబుతుంది. అప్పుడు హీరో రామ్ ఏమంటాడు? నేను కూడా నిన్ను ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నానంటాడు. కానీ, జీవితాంతం ప్రేమించలేను.. కొంతకాలం ప్రేమిస్తాను.. అంటాడు. అలా చెప్పడంతో హీరోయిన్ షాక్ అవుతుంది. అలా అని అతడిని వదలి వెళ్ళలేదు. తన ప్రేమ కోసం క్యూ కట్టిన ముగ్గురు కుర్రాళ్ళలో ఎవరో ఒకరిని ఎంచుకోలేదు. అలా ఎంచుకుంటే నేనూ ప్రేమలో పడ్డానూ, నాకూ ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పుకోవడానికి తప్ప మరే మానసిక ఉపయోగమూ లేదు. అందుకని, జాహ్నవి తన క్లాస్ మేట్స్ లాగా సోకాల్డ్ లవ్ ట్రాప్ కు దూరంగా.. రామ్ అప్రోచ్ కు తన మైండ్ లో చాలా స్పేస్ ఇస్తుంది. అలా ఆ సంఘర్షణ కొనసాగుతుంది.
ఒక లాజికల్ కంక్లూజన్ దిశగా సినిమాను తీసుకువెళ్ళడానికి దర్శకుడు కొంచెం తగ్గి, కొంచెం వెనక్కి వెళ్ళి హీరో ఫ్లాష్ బ్యాక్ ను ప్రజెంట్ చేస్తాడు. ప్రేమలో తనను తాను మిస్ అవడం వద్ద తీవ్రంగా డిస్టర్బ్ అయిన హీరో.. రూబా రూబా.. తూహై మేరీ దిల్రూబా అని పల్లవించినందుకు పరితపిస్తాడు. శాశ్వత ప్రేమ ఒక మిథ్య అని నిర్థారణకు వచ్చిన ప్రేమికుడు.. ఐలవ్ యూ ఫరెవర్ అనే అబద్ధంతో ప్రేమను కొనసాగించలేక తొమ్మిది మందిని దూరం చేసుకుంటాడు. లవర్ నెంబర్ టెన్ జాహ్నవితో జరిపిన కెమిస్ట్రీలో.. హీరో మనసు కూడా రసాయినిక చర్యలకు గురి కావడం ఈ కథను ఆసక్తికరంగా ముందుకు నడిపిస్తుంది.ప్రేమ శాశ్వతంగా ఉండడమన్నది ఆచరణాత్మకంగా సాధ్యం కాకపోవచ్చన్నది ఎంత నిజమో, శాశ్వత ప్రేమ కూడా ఉంటుందన్నది అంతే నిజం. అయితే, మొదటి నిజం మీద రెండో నిజానిది పైచేయి ఎప్పుడవుతుంది? ఈ ప్రశ్నకు జవాబు కూడా భాస్కర్ స్క్రిప్టులో స్పష్టంగానే ఉంది. తరచూ అనుమానంతో తిట్ల దండకాన్ని మొదలుపెట్టి బాల్కనీ లోంచి పూల కుండీ విసిరేసే భార్య కోసం.. నాగబాబు మళ్ళీ సాయంత్రానికి కొత్త పూలకుండీ కొనుక్కుని తీసుకువెళ్ళే దృశ్యాన్ని పాసింగ్ సీన్ లా వదిలేసే ప్రేక్షకులు దర్శకుడు సినిమాకు ముగింపు ఇవ్వడంలో కన్ఫ్యూజ్ అయ్యాడనే ఆరోపిస్తారు. దృశ్య వ్యాకరణం అంతో ఇంతో తెలిసిన వారెవరూ నాగబాబు పాత్రకున్న ఇంపార్టెన్స్ ను విస్మరించడానికి వీల్లేదు. బొమ్మరిల్లు క్లయిమాక్స్ లో చూపించిన తండ్రీ కొడుకుల సుదీర్ఘ సంభాషణను.. దర్శకుడు ఈ చిత్రంలో నాలుగైదు నిమిషాలు మాత్రమే కనిపించే నాగబాబు పాత్రతో సాధించాడు. కారణాలతో విడిపోవడం కాదు.. ప్రేమించడానికి కారణాలు కొత్తవి ఎప్పుడూ ఉంటాయి.. వాటిని గుర్తిస్తూ పోవాలనే అర్థంలో హీరో రామ్ తన బావతో చెప్పిన మాటలు.. మానసికంగా అతడిలో వచ్చిన మార్పును సూచిస్తాయి. అంతా జరిగాక, చివర్లో హీరో మళ్ళీ ఈ అమ్మాయి అప్పుడెలా ఉండేది.. ఎంత అల్లరిగా అమాయకంగా నవ్వేది.. అదంతా ఇప్పుడుందా అని ప్రశ్నించే సన్నివేశమే కొంత అబ్సర్డ్. జీవితం నిన్నలా ఉండదు. అలాగే ప్రేమ కూడా. ప్రేయసి నవ్వు కూడా..నిజానికి ఈ కథను.. నాగబాబు పూల కుండీని కొనుక్కుని ఇంటికి వెళ్ళే దగ్గరే ఆపేయొచ్చు. కానీ, పాపులర్ ఫార్మాట్ లో ఇంకొంత క్లారిటీ అవసరం అనుకున్నాడు భాస్కర్. ఎంతకాలం కలిసి ఉంటారో తెలియదు.. ఉన్నన్నాళ్ళూ ప్రేమగా జీవిస్తారు.. వాళ్ళనలా వదిలేద్దామని హీరోయిన్ తండ్రితో చెప్పిస్తాడు. కథకంతా.. ఒక సూత్రంగా నిలిచిన ప్రకాశ్ రాజ్.. చివరి దృశ్యంలో ఇప్పుడు నేను నా భార్య దగ్గరకు వెళ్ళాలి అని కారెక్కుతాడు. ఇంకెంత క్లారిటీ కావాలి?
ఇక.. మేకింగా వాల్యూస్ విషయానికి వస్తే.. ఆరెంజ్ ను భాస్కర్ అప్ టు డేట్ మల్లీ ప్లెక్స్ స్టాండర్డ్స్ లో రూపొందించారు. టేకింగ్ వాల్యూస్ విషయంలో వంక పెట్టాల్సిన పని లేదు. కలర్ ఫుల్ ఇమాజినేషన్, ఈస్తటిక్స్ సినిమా అంతటా ఫ్రేమ్ బై ఫ్రేమ్ కనిపిస్తాయి. స్క్రిప్ట్ నిర్మాణం.. బొమ్మరిల్లు తరహాలోనే సాగింది. హీరోను గ్రాఫిటీ ఆర్టిస్ట్ గా, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా చూపించడం ఓ వెరైటీ. ఆస్ట్రేలియాలో ఇప్పుడు భారతీయ విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది కాబట్టి.. సిడ్నీ కాలేజి బ్యాక్ డ్రాప్ కూడా నప్పినట్లే అనుకోవాలి. కమర్షియల్ అట్రాక్షన్స్ కోసం నేపథ్యాన్ని లావిష్ గా చూపించే ప్రయత్నం చేసినా చెప్పదలచుకున్న కథ విషయంలో అప్రమత్తంగానే వ్యవహరించాడు దర్శకుడు భాస్కర్. రాజే శేఖర్, కిరణ్ రెడ్డిల సినిమాటోగ్రఫీ ల్యాండ్ స్కేప్స్ క్యాప్చర్ చేయడంలో గొప్పగా ఉంది. కళాదర్శకుడు ఆనంద్ సాయి పనితనం ఇంటీరియర్స్ తో పాటు ఔట్ డోర్ సాంగ్స్ లోనూ కనిపిస్తుంది. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ నైపుణ్యానికి.. నువ్వే నేనంటూ.. పాట, టైటింగ్ సాంగ్ కు ముందు క్లబ్ లో జరిగిన బాటిల్ గేమ్ సీన్లు మేలైన మచ్చుతునకలు.
నువ్వు చెప్పింది అర్థమైంది.. కానీ, చెప్పిన దాంట్లోనే అర్థం లేదనిపిస్తుంది వంటి మెరుపుల్ని డైలాగ్ రైటర్స్ తోట ప్రసాద్,  సురేంద్ర కృష్ణలు చాలో చోట్ల కురిపించారు. ఇక.. ఆరెంజ్ కు హారిస్ జయరాజ్ ఇచ్చిన మ్యూజిక్ కచ్చితంగా ఓ రేంజ్ లో ఉంది. నరేష్ అయ్యర్, నదీశ్ పాడిన నేనూ నువ్వంటూ.. కారుణ్య సిడ్నీ నగరం, విజయ్ ప్రకాశ్-దేవన్ లు పాడిన హలో రమ్మంటె వచ్చేసిందా చెలీ నీపైన నా ప్రేమ., శైలేష్ అదా-చిన్మయి శ్రీపాదల రూబా రూబ రూబా.. పాటలు చాలా కాలం వినాలనిపించేలా ఉన్నాయి. నేపథ్య సంగీతంలోనూ హారిస్ స్పెషాలిటీ చాలా చోట్ల కొట్టొచ్చినట్లు వినిపిస్తుంది. ఇక, ఆర్టిస్ట్స్ పర్మార్ఫెన్స్ విషయానికి వద్దాం. కొత్త లుక్ తో రామ్ చరణ్ చాలా బాగా కనిపించడమే కాదు. కొత్త తరం కుర్రాడిగా చాలా బాగా యాక్ట్ చేశాడు. మెగా హిట్ అయిన మగధీర చిత్రం ఆరెంజ్ చూస్తున్నంత సేపు ఏమాత్రం గుర్తుకు రాకపోవడం రామ్ చరణ్ చూపించిన వైవిధ్యానికి నిదర్శనం. జెనీలియా నటన.. సినిమా ఫస్టాప్ కు బాగా సూట్ అయింది. సెకండాఫ్ లో మారిన పాత్ర స్వభావానికి.. ఆమెకు మధ్య కొంత గ్యాప్ కనిపిస్తుంది. అందమైన ముంబయ్ అమ్మాయి రూబాగా షాజాన్ పదంసీ ప్రామిసింగ్ గా మెరిసింది. యాక్షన్ సన్నివేశాల్లో గ్రాఫిటి వాల్స్ మధ్య సాగిన స్టంట్స్ కట్టిపడేసాలా ఉన్నాయి. స్కై డైవింగ్ స్టంట్స్ చెప్పుకోదగిన స్థాయిలో రాలేదు.
ముఖ్యంగా, ఆరెంజ్ చూసిన తరువాత రామ్ చరణ్, మేకోవర్ ను, కాస్య్టూమ్స్ ను మెచ్చుకోకుండా ఉండలేం. ఫ్రేమ్ లోకి వచ్చే ప్రతి పాత్ర, ప్రతి వస్తువు కొత్తగా ఉండేలా చూసుకోవడంలో డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్లు చాలా కేర్ తీసుకున్నారు. అవన్నీ కలసి ఆరెంజ్ ను ఒక ఫీల్ గుడ్ మూవీగా మార్చేశాయి.మొత్తంగా చూస్తే.. దర్శకుడు భాస్కర్ మరోసారి ఓ సున్నితమైన అంశాన్ని.. కమర్షియల్ ఫార్మాట్ లో భారీగా డీల్ చేయడానికి సాహసించి.. సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఈ చిత్రంలో హీరో చెప్పినట్లు జీవితాంతం ప్రేమిస్తాను అనే అబద్ధంతో ప్రేమను మొదలు పెట్టడం కరెక్ట్ కాకపోవచ్చు. కానీ, ఈ ప్రేమ జీవితాంతం ఉండదనే అపనమ్మకంతోనూ ప్రేమను ప్రారంభించడం కూడా కరెక్టు కాదు. దర్శకుడు కథను రెండవ లాజిక్ దిశగా నడిపించడం ఆరెంజ్ సినిమాను టైటిల్ స్పిరిట్ కు తగినట్లుగా ఉత్తేజంగా సాగింది. మండే సూర్యుడికి సంకేతం ఎరుపు రంగు అయితే, ఉదయించే సూర్యుడి వెచ్చదనానికి నారింజ రంగు ప్రతీక. ఆరెంజ్ అంటే.. యౌవనం.. కొత్తదనం.. ఉత్సాహం. . వీటన్నింటి అందమైన కలయికే ఆరెంజ్.
***