Wednesday, June 30, 2010

స్టూడియో-ఎన్ కు మసాజ్ తీట: ఛీ..ఛీ..థూ..థూ...జర్నలిజం


మసాజ్ పేరిట సెక్స్ సేవ అందించే వారిది బతుకు పోరాటం కావచ్చు.
మసాజ్ చేయించుకునే వారిది కండరాల నొప్పో, తీటో, ఒళ్ళు బలుపో కావచ్చు.

మరి...నీలి మసాజ్ సెంటర్లపై ప్రత్యేక స్టోరీ పేరుతో బూతు క్లిప్పులు, తిక్క బాక్ గ్రౌండ్ పాటలు, అమానుషపు బొమ్మలు చూపే ఛానల్ ను ఏమనాలి?

పసుపు రంగు ఛానల్ చేసిన నీలి రంగు జర్నలిజం ఇది. అదే...స్టూడియో-ఎన్ ఛానల్. అది ఈ రాత్రి 'ఫోకస్' పేరిట 'మసాజా? మజాకా?' అనే శీర్షికతో ప్రసారం చేసిన కార్యక్రమం ఫక్తు బాధ్యతారహిత జర్నలిజం. ఆ మిషతో...కుటుంబంతో కలిసి కూర్చొని చూడడానికి వీలు లేని బూతు బొమ్మలు చూపడం...ఒక వికారపు పని, మానసిక వైకల్యం, టీ.ఆర్.పీ. వేటలో చేసిన ఒక నీచ ప్రయత్నం. 

పోలీసోడికి...రాంగ్ రూట్ లో పోతున్న అర్భకుడు దొరికినట్లు ఈ మధ్యన ఈ టీ.వీ.ఛానెల్స్ కు మసాజ్ కేంద్రాలు దొరుకుతున్నాయి. మీరు గమనించారో లేదో... పుట్టగొడుగుల్లా ఈ ఛానెల్స్ పుట్టుకొచ్చాక పోలీసులు, ఛానెల్స్ కలివిడిగా, విడివిడిగా ఈ మసాజ్ కేంద్రాలను ఒక పెద్ద సబ్జెక్టుగా తెరమీదికి తెస్తున్నాయి...క్రమం తప్పకుండా. ప్రజల మానసిక బలహీనతను సొమ్ము చేసుకునే దారుణ ప్రయత్నమిది. ప్రతి పదిహేను రోజులకొకసారి....మసాజ్ సెంటర్లపై దాడులు, వార్తలు! ముఖం కనిపించకుండా కప్పుకుని ఆ గృహాల నుంచి మహిళలు వస్తుండడం, వారిని కెమెరా వీరులు వెంటాడి షూట్ చేయడం...దాన్ని నిస్సిగ్గుగా గంటల తరబడి చూపించడం....రెగ్యులర్ ఫీచర్ అయ్యింది. 

ఈ ఛానెల్స్ నిజంగానే సామాజిక ఉద్ధరణకు నడుం బిగించాయి...సాంస్కృతిక పోలీసింగ్ కు పాల్పడుతున్నాయి...అనుకోవడానికి వీల్లేదు. వార్తను వార్తలా కాకుండా...మసాలా దట్టించి ఈ కథనాలు పసారం చేస్తున్నాయి. దాడులు జరిపి ఆ అభాగినులను పట్టుకున్న ప్రతిసారి...బూతు క్లిప్స్ చూపించి ఛానెల్స్ హడావుడి చేస్తున్నాయి. 

ఇది ఛానల్ బాసులకున్న చిత్తకార్తె కక్కుర్తి వ్యవహారం...మనమేమీ చేయలేం...అనుకుందామా? ఆ పరిధులను కూడా మించి ఈ రాత్రి స్టూడియో-ఎన్ ఈ 'ఫోకస్' ను ప్రసారం చేసింది. ఇందులో...ఒక పురుషుడి మీద కూర్చున్న ఒక మహిళ వివస్త్ర కావడం, మరొక ఆమె సెక్సీగా ఒకడికి మసాజ్ చేయడం...వంటి తీవ్ర అసభ్య క్లిప్స్ పదే పదే చూపారు. దానికి తోడు..."యహ...యమ డూపు...యమ డూపు...ఎం.-టీ.వీ సుబ్బలక్ష్మిదే..." అంటూ ఒక దరిద్రపుగొట్టు బూతు సాంగు...బాక్ గ్రౌండ్ లో. 

సాధ్యమైనంత ఎక్కువ బూతు చూపడానికే మొత్తం కథనాన్ని సాగ తీసి కంపు కంపు చేశారు. టీ.ఆర్.పీ. రేటింగ్ సరిగా రాక నిస్పృహలో ఉన్న బాసులు మరీ ఇంతగా దిగజారారు. ఇది విచారకరం. బాసులూ...మీ తల్లి, మీ కూతురు, మీ కొడుకు, మీ పేరెంట్స్ కూచొని చూస్తున్నప్పుడు ఇదే బూతు మీ టీ.వీ.లో వస్తే....మీరు చూపితే ఎలా ఉంటుందో ఒక్క సారి ఆలోచించండి. మరీ...బరితెగించవద్దు. కాస్త సభ్యతతో ఉండవచ్చేమో చూడండి.   

ఈ బూతు వ్యవహారానికి మహిళా సంఘం నాయకురాలు సంధ్యక్క బైట్ ఒకటి. ఛానల్ చూపాల్సిన బూతు వివిధ యాంగిల్స్ లో, వివిధ ఎఫెక్ట్స్ తో చూపాక....ఆమె తెర మీదికి వచ్చి...'ఇది (మసాజ్ సెంటర్లలో చీకటి పనుల నిర్వహణ)దారుణం, ఘోరం, పాశవికం,' అని దంచుకున్నారు...సహజ శైలిలో. ఛానల్ వాళ్ళు గొట్టం నోటి దగ్గర పెట్టగానే ఉపన్యాసాలు దంచడం కాదు...వారు చేసే నీలి అకృత్యాన్ని కాస్త గమనించి....ఆ దారుణంపై ఉద్యమించి...మమ్మాదుకో...మహా తల్లీ.  బూతు పని చేస్తున్నది...ఆ ఆడ తల్లులు కాదమ్మా....ఈ బ్లూ ఛానెల్స్. 

ABN- ఆంధ్రజ్యోతి కథనాన్నిఖండించిన జర్నలిస్టులు

ABN- ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనాన్ని కర్నూలు భూ వివాదంలో చిక్కుకున్న జర్నలిస్టులు ఖండించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే తాము స్థలాలు కొనుగోలు చేసినా...తాము అక్రమాలకు పాల్పడినట్లు ప్రసారం చేయడం దారుణమని అంకం రవి (ఐ-న్యూస్) తదితరులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఆ ఛానల్ ఉద్దేశ్యపూర్వకంగానే తప్పుడు ప్రచారం చేసిందని ధ్వజమెత్తారు.

జూబ్లి హిల్స్ లో ఏ.బీ.ఎన్. కార్యాలయాన్ని నిబంధనలకు విరుద్ధంగా నిర్మించలేదా? ఆంధ్రజ్యోతిలో నాలుగో ఫ్లోర్ కు అనుమతి లేకపోయినా ఎలా నిర్మించారు? వంటి ప్రశ్నలు ఆ జర్నలిస్టులు వేశారు. ఈ విలేకరుల సమావేశంలో రవి తో పాటు...చంద్రశేఖర్ (ఎన్.-టీ.వీ.), టి.మద్దిలేటి, మౌలాలి (వార్త), గోరంట్లప్ప (ప్రజాశక్తి), హుస్సేన్ (సాక్షి), సత్యన్న (ఐ-న్యూస్) తదితరులు పాల్గొన్నారు.

ఈ అంశంపై "రాధాకృష్ణా...ఇదేం జర్నలిజం" అనే శీర్షికతో సాక్షి పత్రికలో వచ్చిన వార్త కోసం ఈ లింక్ చూడండి. మిగిలిన పేపర్స్ కూడా ఈ వార్తను ప్రచురిస్తే బాగుండేది.

స్వప్న అన్వేషణ: కొలిక్కి వస్తున్న "జీ-24 గంటలు" ప్రయత్నం...

చిన్ననాట హైదరాబాద్ లో తప్పిపోయి కేరళలో తేలి, అక్కడే డాన్ బాస్కో వారి సంరక్షణలో పెరిగి తన వాళ్ళు దొరుకుతారేమో అని భాగ్యనగరం వచ్చిన టీనేజ్ అమ్మాయి స్వప్నకు Zee-24 గంటలు బాసటగా నిలిచిన సంగతి తెలిసిందే. "జీ-ఛానెల్ లో మానవాసక్తికర కథనం: అమ్మకోసం" అన్న శీర్షికతో ఏప్రిల్ లో మేము పోస్ట్ చేసిన కథనాన్ని మీరు ఇక్కడ చదివే ఉంటారు. 

ఈ మధ్యనే ఇదే ఛానల్ మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ కారు డ్రైవర్ పై ఉపయోగకరమైన మరో మానవాసక్తి కర కథనం ప్రసారం చేస్తే...మరొక బిట్ రాసి..."మరి స్వప్న సంగతి ఏమి చేశారు బాస్?" అని నేను ప్రశ్నించాను. ఆ పోస్ట్ రాసిన మర్నాడే  Zee-24 గంటలు స్వప్నపై...'నెరవేరనున్న స్వప్నం' పేరిట ప్రసారం చేసిన ఒక కార్యక్రమాన్ని చూస్తే....ఈ ఛానల్ వారు ఆ అమ్మాయి తల్లి దండ్రుల వేటలో చాలా ప్రశంసనీయమైన పాత్ర పోషిస్తున్నారని తెలిసింది. ఈ పని మీద నేను నిన్న రాత్రి వారి ఆఫీసుకు వెళ్లి కొంత సమాచారం సేకరించాను.

Zee-24 గంటలులో వచ్చిన కథనం చూసి పలువురు...'మా అమ్మాయేమో అనిపిస్తున్నది' అంటూ ఛానల్ ను సంప్రదించారట. రంగారెడ్డి జిల్లా సిరిపురంకు చెందిన వెంకటయ్య, పద్మలు స్వప్న తమ బిడ్డే అని వాదిస్తున్నారు. ఎనిమిదేళ్ళ కిందట కోఠి లో గుజరాత్ గల్లీ లో ఉన్న తమ బంధువుల ఇంటికి వచినప్పుడు షాప్ కు వెళ్ళిన పాప తప్పిపోయిందని, దానిపై తాము పోలీసులకు ఫిర్యాదు కూడా చేసామని ఆ దంపతులు అంటున్నారు. 


స్వప్న మెడ మీద చిన్నప్పుడు అయిన గాయం, పుట్టు మచ్చలు, ముఖకవళికలు వంటి ఆధారాలను బట్టి చూస్తే...స్వప్న వీరి కూతురే అని అనిపిస్తున్నదని ఈ ఛానల్ ఒక కథనాన్ని ప్రసారం చేసింది. అయితే...ఆ అమ్మాయికి తెలుగు రాదు, వీళ్ళకు మలయాళం రాదు. అయినా సరే....శాస్త్రీయ నిర్ధారణ కోసం DNA పరీక్షలు చేయిస్తున్నారు.

"మేము ఏప్రిల్ లో స్వప్నతో చేసిన లైవ్ ప్రసారానికి విశేష స్పందన లభించింది. ఇప్పుడు ఆ అమ్మాయి తల్లిదండ్రులను చేరితే...ఈ విషయంలో మా సామాజిక బాధ్యత మేము నేరవేర్చినట్లు భావిస్తాం," అని ఛానల్ అవుట్ పుట్ వ్యవహారాలు చూస్తున్న గోపాల రమేష్ అన్నారు. ప్రస్తుతానికి స్వప్న డాన్ బాస్కో వారి సంరక్షణలో కేరళ వెళ్లి చదువు కొనసాగిస్తున్నది. ఈ కథ త్వరగా సుఖాంతం కావాలని ఆశిద్దాం.
పద్మ, వెంకటయ్య లతో ఉన్న స్వప్న ఫోటోలు పైన చూడవచ్చు. 
ఈ ఫోటోలు నాకు సమకూర్చిన జీ-బృందానికి కృతజ్ఞతలు. 

Monday, June 28, 2010

కర్నూలు లో బైట పడిన విలేకర్ల భూభాగోతం

*'The Hindu' శ్రీనివాసులు, 'I-news' అంకం రవి హస్తం?
*దొరికిపోయిన మరో 12 మంది కలం వీరులు
*ABN-AJ పరిశోధనాత్మక కథనం
* అన్ని జిల్లాల్లో భూ గుట్లు తేల్చాల్సిన తరుణమిది 

ఊళ్లలో విలేకర్లు మాఫియా స్థాయికి చేరుకున్నారని...భూ భాగోతాలలో వీరి అదృశ్య హస్తం ఉందని గతంలో ఈ బ్లాగ్ లో మేం ప్రస్తావించాం. కర్నూలు జర్నలిస్టులు 14 మంది సిండికేట్ అయి 2004 లో అధికారులు, పోలీసుల సాయంతో అసైన్డ్ భూమి కొని, దాన్ని భార్యల పేరు మీదకు బదలాయించి GPA ద్వారా దాన్ని ఒక సంస్థకు అమ్మి డబ్బు చేసుకునేందుకు చేసిన యత్నాన్ని ABN- ఆంధ్రజ్యోతి ఛానల్ ఈ రోజు బట్టబయలు చేసింది. దానికి ఆ ఛానల్ పెట్టిన శీర్షిక--"దెబ్బకు ఠా...జర్నలిస్టుల ముఠా."

ఈ ముఠా లో... 'హార్డ్ కోర్ టాక్' పేరిట అన్యాయాలు, అక్రమాల గురించి మేథావులతో రోజూ ఐ-న్యూస్ లో చర్చల మీద చర్చలు దంచి కొట్టే అంకం రవి, ఎన్నో స్కాంలు బైటికి తెచ్చిన సత్యనారాయణ రాజు (ప్రస్తుతం TV-5), సంసార పక్షం లాంటి 'ది హిందూ' విలేకరి శ్రీనివాసులు వంటి వారు ఉండడం విశేషం. 
N-TV రిపోర్టర్ చంద్రశేఖర్ ఈ వ్యవహారం లో కీలక పాత్ర పోషించినట్లు ఛానల్ తెలిపింది. 

గణేష్ నగర్ లోని ఆ భూమి హక్కుదారును తానని ఒక దళితుడు కోర్టు చుట్టూ తిరుగుతుంటే...ఈ జర్నలిస్టులు అధికార గణం అండతో 85 సెంట్ల ఈ భూమిని సెంటు 11,714 రూపాయల చొప్పున ఆరేళ్ళ కిందట కొన్నారని, ఆ పక్కది, ఈ పక్కది కలిపేసుకుని దాన్ని ఇప్పటికి 114 సెంట్లు చేసారని కూడా ఆ ఛానల్ తెలిపింది. భూముల ధరలు పెరగడంతో డెవలప్ మెంట్ కు ఇచ్చి సొమ్ము చేసుకోవాలని ఆశపడి జర్నలిస్టులు దొరికిపోయారని, తమ సంస్థకు చెందిన సత్తెన్న అనే జర్నలిస్టుకు గతంలోనే ఉద్వాసన పలికినట్లు కూడా ప్రకటించింది. 

ఆ ఛానల్ కథనం ప్రకారం--ఈ భూ వివాదంలో పాలు పంచుకున్న జర్నలిస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
N-TV                    జి.చంద్ర శేఖర్
I-News                 అంకం రవి
The Hindu            డి.శ్రీనివాసులు
Saakshi                 బాల కోటేశ్వర రావు 

I-News                  సత్తెన్న 
Saakshi                 డి.హుస్సేన్ (photographer)
Eenadu                 మురళి (photographer)
Times of India (ex) వీరభద్ర రావు
Andhrajyothi         ఎం.వి.రామారావు

Andhra Prabha      గిడ్డయ్య
TV-5                      సత్యనారాయణ రాజు
Vaartha                  మౌలాలి
Vaartha                  టి.మద్దిలేటి

Prajashakti             గోరంట్లప్ప

అయితే...ఈ కథనం చూసి ...జర్నలిస్టుల కోటా కింద ప్రభుత్వ భూమి తీసుకున్నరేమో అని ముందుగా భావించాం. అయితే...ఈ జర్నలిస్టులలో పలువురు అప్పటికే మరొక చోట ప్రభుత్వ భూమి కారుచౌకకు తీసుకుని ఉన్నట్లు ఈ ఛానల్ చెబుతున్నది.

ఇప్పుడు జర్నలిస్టులు....ఈ ఛానల్ ఓనర్ వేమూరి రాధాకృష్ణ ఎక్కడైనా భూ ఆక్రమణలకు, పైరవీలకు తెగపడ్డారేమో  చూసి...పట్టుకుని...ప్రతి పరిశోధన చూసి సత్తా నిరూపించుకోవాలి. నిజంగానే ఈ పోటీ అభినందనీయం. ఈ ఛానెల్స్, పత్రికలు దీనిపై వెంటనే దర్యాప్తు జరిపి నేరం రుజువైతే...ఈ కలం వీరులను వెంటనే సస్పెండ్ చేయాలి. వీరికి మరే మీడియా సంస్థ ఉద్యోగాలు ఇవ్వకుండా....ఒక మంచి సందేశం ఇవ్వాలి. అయితే...భూ కబ్జాకోర్లు, నీతిమాలిన రియల్టర్లు యజమానులుగా ఉన్న ఛానెల్స్, పత్రికలు వీరిపై చర్య తీసుకుంటాయని అనుకోవడం భ్రమే. 'ది హిందూ' మాత్రం వెంటనే స్పందించే అవకాశం వుంది.
Note: దీనిపై... ఆరోపణలు ఎదుర్కుంటున్న జర్నలిస్టులు ప్రజలకు చెప్పదలుచుకున్నది ఏమైనా వుంటే...మాకు రాయవచ్చు. మీరు బహిరంగంగా తప్పు ఒప్పుకోవడానికి లేదా మీ వాదన వినిపించడానికి దీన్ని ఒక వేదికగా వినియోగించుకోవచ్చు.

Saturday, June 26, 2010

పశు సంతతి కోసం రైతన్నల 'ఏరొక్క పండగ'...నేడు

పల్లెలో పుట్టి...పల్లెల్లో కూడా పెరిగి...పల్లె మీద ప్రేమతో ప్రతి మూల మూలా తనవితీరా  రిపోర్టింగ్ చేసానని తృప్తిపడే నాకు...ఈ ఉదయం మెదక్ జిల్లాలో రైతులకు సంబంధించి నేను కనీవినీ ఎరుగని ఒక కొత్త పండగ ఎదురయ్యింది. ఒక అంతర్జాతీయ సర్వే టీం సభ్యుడిగా ఒక సీనియర్ ప్రొఫెసర్, ఒక డాటా అలనిస్ట్ తో కలిసి.... అక్కడ "డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ" నిర్వహిస్తున్న 'సంగం రేడియో' పల్లె జనంలో తెచ్చిన సాధికారికత భావనను అధ్యయనం చేయడానికి వెళ్ళినప్పుడు ఇది జరిగింది.

మణయ్య అనే ఒక రైతు...రిన్ సబ్బు తీసుకుని ఒక తెల్లని ఎద్దును పెద్ద నీటి తొట్టి దగ్గర శ్రద్ధతో స్నానం చేయిస్తుండగా...ఒక వేప చెట్టు కింద ఉన్న నల్ల ఎద్దు...నా వంతు ఎప్పుడు? అన్నట్లు ఎదురు చూస్తున్నది. మణయ్య చుట్టూచేరిన పిల్లమూక పరాచకాలు ఆడుతుండగా...నేను సీన్ లోకి ఎంటర్ అయ్యాను. 
మణయ్య చెప్పిన దాని ప్రకారం---దీన్ని 'ఏరొక్క పండగ' (ఏరువాక పున్నమి) అంటారు. ఈ రోజు ప్రతి రైతు ఎద్దులను, ఆవులను బాగా నీటితో కడిగి...రంగులతో తీర్చి దిద్దుతాడు. కడిగిన ఎద్దులను, కోడెలను, ఆవులను మువ్వలు, మెడ గంటలతో అలంకరించడమే కాకుండా...కొమ్ములు మెరిసేలా వార్నిష్ వేసి ముస్తాబు చేస్తారు.  బండ్లను కూడా కడగడం పండగలో ఒక భాగం. విచిత్రంగా....బర్రెలు/గేదెలు ఈ పండగలో భాగం కాదు.

అప్పుడు అర్థమయ్యింది...రేడియో స్టేషన్లో పనిచేసే...అలుగొలు నరసమ్మ గారు పండగ వుంది...సోమారం రండి..అని చెప్పడానికి కారణమేమిటో. "సాయంత్రం తోర్నం కడ్తం. పసూలు దాటుతున్నప్పుడు...ఆ తోర్నం తెంపి అన్మాన్ చుట్టూ తిప్పుతం," అని మణయ్య బాబాయ్ నాకు చెప్పాడు. ఆ రెండు గిత్తలను కడుగుతున్నప్పుడు ఈ నాలుగెకరాల ఆసామిలో శ్రద్ధాసక్తులు దగ్గరి నుంచి చూడాల్సిందే. అన్మాన్ చుట్టూ తిప్పడమంటే...ఆ ఊర్లోని హనుమంతుడి ఆలయం దగ్గరకు తీసుకువెళ్ళి ప్రదక్షిణం చేయించడం. 

తొలకరి పడ్డాక...పశు సంతతి కోసం అంటూ...ఒక పండగ ఉండడం...విచిత్రంగా అనిపించింది. "వీటికి సొమ్ములతో సోకులు చేసి...బొబ్బట్లు, ఉల్లి వంటి ఇష్టమైన పదార్ధాలు పెడతారు. ఈ ఏరువాక పండగతో...ఉగాది తర్వాత ముగిసిన పండగల సీజన్ మొదలవుతుంది," అని నరసమ్మ గారు ఆ తర్వాత వివరించారు. ఈ పండగ సందర్భంగా...డప్పులు, మేళాలతో పిల్లా పాపా రైతులు సాయంత్రం పశువులను ఆడిస్తారట. అదొక కోలాహలం, వేడుక. ఈ పండగపై ఆమె ఒక ప్రోగ్రాం చేసి ప్రసారం కూడా  చేసారట. నన్ను నమ్మండి....మన టింగ్లిష్ యాంకర్స్ కన్నా చాలా స్వచ్ఛమైన తెలుగు తడుముకోకుండా మాట్లాడుతున్నది...పదో తరగతి మాత్రమే చదివిన నరసమ్మ. 

ఇంత మంచి ప్రత్యేకమైన పండగ...మన వైపు ఎందుకు లేదని...వచ్చాక మా నాన్నకు ఫోన్ చేసి అడిగాను. 'ఇలాంటి పండగ మహారాష్ట్ర వైపు జరుపుకుంటారని విన్నాను. మన దగ్గర ప్రభలు కడతారు, తిర్నాళ్ళకు ఎడ్లను అలంకరిస్తారు కానీ...ఇలా పండగ చేయరు,' అని ఆయన చెప్పారు. పశు సంపద బాగా ఉన్న రైతులు...తమ ప్రాంతంలో కొన్ని చోట్ల ఈ పండగ చేస్తారని ప్రకాశం జిల్లా ఒంగోలు లో వ్యవసాయం చేయించే బంధువుల అబ్బాయి శంకర్ చెప్పాడు. సరే...మనకిది కొత్త అయినా...ఈ పండగ లగాయితూ రైతన్నలకు పాడిపంటలు సమృద్ధిగా కలగాలని ఆశిద్దాం. మీడియా మహా ప్రభువులు ఇలాంటి ప్రాక్టికల్ పండగలకు మంచి కవరేజ్ ఇచ్చి...ఈ సంస్కృతిని పది కాల పాటు బతికించాలని మనవి చేసుకుందాం. 

Friday, June 25, 2010

ఇందిర కారు డ్రైవర్ దుస్థితికి 'జీ-24 గంటలు' చొరవతో తెర!

ఒకొక్క సారి ఈ న్యూస్ ఛానెల్స్ ఏదైనా విషయాన్ని పట్టుకుంటే...దానికి శుభం కార్డు పడే వరకు భలే కృషి చేస్తాయి. పోయిన పిల్లలను వెతకడం, తప్పిపోయిన వారి జాడ తెలియజెప్పడం వంటి పనులు రిపోర్టర్లు పూర్తిగా లీనమై చేస్తారు. నిజానికిది 'పుణ్యం-పురుషార్థం జర్నలిజం.'

ఈ మధ్యన అన్ని పత్రికలు, ఛానెల్స్ దీనావస్థలో ఉన్న కముజు సత్యనారాయణ అనే ఒక వృద్ధుడిని చూపి...అతను ఇందిరా గాంధీ కార్ డ్రైవర్ అని, ఆదరణ కరువై స్వగ్రామమైన తూ.గో.జిల్లా లక్ష్మీదేవి లంకలో దుర్భర స్థితి లో ఉన్నాడని చూపాయి. ఆ మర్నాడు మీడియా నాడి పసిగట్టిన కాంగ్రెసోళ్ళు వెళ్లి ఆయన్ను ఆప్యాయంగా పలకరించి....అక్కున చేర్చుకున్నట్లు మీడియాలో చదివాం/చూసాం. 


కొడుకు ఈ వృద్ధుడిని వదిలి హైదరాబాద్ వెళ్ళిపోవడం, పెన్షన్ను బంధువులు అనే రాబందులు కొట్టేయడం, దీంతో సత్యనారాయణ గారు గుడి మెట్ల దగ్గర అడుక్కోవాల్సిన పరిస్థితి రావడంపై 2009 మే నెల లోనే జీ- 24 గంటలు ఛానల్ రిపోర్టర్ శివన్నారాయణ రెడ్డి ఒక కథనం ప్రసారం చేశారు. అది అప్పట్లో జనాలకు అంటలేదు కానీ...ఇప్పుడు ఎందుకో బాగా అంటింది.

"ఫాలో ఆప్ గా మా రిపోర్టర్ మళ్ళీ ఈ జూన్ రెండున ఒక స్టోరీ చేశారు. మిగిలిన ఛానెల్స్ కూడా ఆ స్టోరీ కి ప్రాముఖ్యం ఇచ్చాయి. ఈ కథనానికి ఎందరో స్పందించారు. హైదరాబాద్ వలస వచ్చిన ఆయన కొడుకును మా బృందం వెతికి పట్టుకుంది," అని ఆ ఛానల్ ముఖ్యుడు ఒకరు చెప్పారు. 

తండ్రీ కొడుకులు 'ఫాదర్స్ డే' రోజున ఒకటయ్యారు, తండ్రిని ఇక ఎప్పుడూ వదలనని కొడుకు బాస చేశాడు. 

ఇలా...కేసును ఒక లాజికల్ ఎండ్ కు తెచ్చిన జీ--బృందానికి అభినందనలు. మానవీయ కథనాల విషయంలో ఛానెల్స్ ఇలా చొరవ కనబరిస్తే బాగుంటుంది. కొన్ని కుటుంబాలకు మేలు జరుగుతుంది. 

మర్చిపోయాను, ఎప్పుడో తప్పిపోయి హైదరాబాద్ చేరిన పాప తల్లిదండ్రులను వెతికే వరకు నిద్రపోబోమని ఒక రెండు నెలల కిందట ఇదే జీ- 24 గంటలు ఛానల్ వారు ప్రకటించారు. మరి ఆ కేసు ఏమయ్యిందో....వారే చెప్పాలి.

Thursday, June 24, 2010

అగ్రి గోల్డ్ వారి RK-news: రూపు మారనున్న జెమిని-న్యూస్

చాలా ఏళ్ళుగా పలు రంగాలలో వ్యాపారం చేస్తూ స్థిరపడి మంచి బ్రాండ్ నేం సాధించిన 'అగ్రి గోల్డ్' సంస్థ ఇప్పుడు సమాచార రంగంలోకి అడుగుపెట్టబోతున్నది. ఆగస్టు 15 న RK-న్యూస్ పేరిట ఉపగ్రహ ఛానల్ ను ఆరంభిస్తున్నది. ఈ పేరిట ఇప్పటి వరకు కేబుల్ టీ.వీ.నడుస్తున్నది.
 

మూతపడిన ఒక ఛానల్ లైసెన్స్ తో అగ్రి గోల్డ్ వారు రంగప్రవేశం చేస్తున్నారు. ఇందుకోసం బిర్లా ప్లానిటోరియం ప్రాంగణంలో ఒక ఆఫీసు అద్దెకు తీసుకుని ఆపరేషన్ ఆరంభించారు. సిబ్బంది నియామకం కూడా ఆరంభించినట్లు సమాచారం. 'సాక్షి' ఛానల్ లో అన్నయ్య తీరు భరించలేక బైటికి వచ్చిన ఒక సీనియర్ జర్నలిస్టు ఇందులో చేరుతున్నట్లు తెలిసింది. 

విజయవాడ దగ్గర 'హాయ్..లాండ్' పేరిట ఆగ్రి గోల్డ్ ఇటీవలనే ఒక భారీ వెంచర్ దిగ్విజయంగా ఆరంభించింది. ఈ మీడియా వెంచర్ వెనుక ఎవరు ఉన్నదీ, ఉద్దేశాలు ఏమిటీ తెలియాల్సివుంది.   
మరొక పక్క జెమిని ఛానల్ వారు న్యూస్ ను మరింత పకడ్బందీగా తేవాలని నిశ్చయించారు. ఇందులో భాగంగా దాదాపు పది కోట్ల విలువ చేసే ఆధునిక పరికరాలు తెప్పించారు. కీలక పదవుల్లోకి సీనియర్లను తీసుకోవాలని భావిస్తున్నారు. 

TV-9 లో ఇన్ పుట్ ఎడిటర్ స్థానం లో ఉండి...తాజా బదిలీలలో నేషనల్ కో ఆర్డినేటర్ అయిన దినేష్ ను తీసుకోవాలని జెమిని యాజమాన్యం భావిస్తున్నది. రవి ప్రకాష్ తో తన తాజా సంబంధాల నేపథ్యంలో దినేష్ ఈ బాధ్యతను స్వీకరించవచ్చని అనుకుంటున్నారు.   

పూనా బ్లాగ్ దంపతులతో...మాటామంతీ....

కనిపించిన ప్రతి ఒక్కరినీ, అవసరం ఉన్నా...లేకపోయినా, నవ్వుతూ పలకరించడం...వాళ్ళు ప్రతినవ్వు విసిరితే...'హౌ ఆర్ యు' అని అడగడం మనకో అలవాటు. వాళ్ళు 'హౌ ఆర్ యూ'కు స్పందిస్తే...ఒక రెండు మాటలైనా మాట్లాడడం మనకు ఇష్టం. 
 
రోడ్డు మీద పోతూ...దీనంగా, ఏదో పోగొట్టుకున్నట్లు ఉన్నవారిని....'బీ చీర్ఫుల్. థిస్ ఈజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్,' అని ఉత్సాహపరిచిన సందర్భాలు అనేకం. అలాగే...ఒక అరవై ఏళ్ళు దాటిన వారు దారి వెంటనో, ప్రయాణంలోనో కనిపిస్తే....'మీరు నేర్చుకున్న జీవిత పాఠాలు ఏమిటి?', 'జీవితంలో చాలా ముఖ్య మైనది ఏమిటని మీకు స్వానుభవం లో తేలింది?', 'డబ్బు వల్ల సుఖం వస్తుందా?', 'జీవితం సుఖంగా ఉండాలంటే కావలసినవి ఏమిటి?,' వంటి సవాలక్ష ప్రశ్నలు వేసి...సమాచారం రాబడతాను. ఇలా సీనియర్లను కలిసి మాట్లాడితే అదొక తృప్తి.

ఈ బ్లాగ్ ల పుణ్యాన...గత ఆదివారం నాడు పూణే కు చెందిన అలాంటి సీనియర్ సిటిజెన్ ఫణి బాబు గారిని, వారి సతీమణి లక్ష్మి గారిని కలుసుకున్నాను. PHANI BABU-MUSINGS అనే బ్లాగ్ లో మంచి ప్రవాహంలా సాగే తెలుగు చదివి...ఆయన రాస్తున్న స్వానుభవాలకు ముచ్చటపడి...ఆయన్ను కలవాలని ఎప్పుడో అనుకున్నాను. ఆయన రాతలను బట్టి అర్థమయ్యింది...అయన సతీమణి కూడా 'ఇదీ సంగతి' పేరిట ఒక బ్లాగ్ నిర్వహిస్తున్నారని. వీరిద్దరి తెలుగు ఫ్లో మీరు ఒక్కసారి చవిచూడండి...తప్పక ఆనందిస్తారు.

తనను ఒక పెళ్ళిలో 'లక్ష్మి మొగుడు' అన్నారని 'నొచ్చుకుంటూ' అయన ఒక పోస్ట్ రాయడం, అది 'ఉత్తి ఉడుకుమోత్తనం' అని ఆమె కడిగిపారెయ్యడం...మీరు చూడవచ్చు లేటెస్ట్ పోస్టులలో. అది నిజ్జంగా  భావ ప్రకటన స్వేచ్ఛనో, మాచ్ ఫిక్సిన్గో ఆ పోస్టులు చదివి మీకు మీరు నిర్ణయించుకోవాలి. వారిద్దరి మధ్య ఉన్నది తూ.గో., ప.గో. పోరాటమని, ఇంట్లో దేని మీద ఈయన బ్లాగులో పోస్టు కుమ్మేస్తారో అని కుటుంబ సభ్యులు జడుస్తున్నారని....ఒక గంటన్నర వారితో ఉన్నాక నాకు అర్థమయ్యింది. 
65 ఏళ్ళ ఫణిబాబు గారు నాకు ఒక 20 ఏళ్ళ తుంటరి మిత్రుడిగా అనిపించారు. అయన సమయస్ఫూర్తి, చలాకీతనం, హాస్యప్రియత్వం, ముక్కుసూటితనం...నాకు నచ్చాయి. చాలా ఏళ్ళుగా పరిచయం ఉన్న వ్యక్తిగా అనిపించారు. "ఐ యాం మాడ్ ఆఫ్ గోదావరి," అంటూ మొదలుపెట్టి...42 ఏళ్ళ పాటు పూణే లో ఉద్యోగ రీత్యా ఉన్న తాను గోదావరిని తనవి తీరా చూసేందుకు రిటైర్ అయ్యాక...రాజమహేంద్రి కి వెళ్లి కిటికీ తలుపులు తీస్తే గోదావరి కనిపించేలా ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఒక ఏడాదిన్నర ఎంజాయ్ చేసిన విధానం చెప్పారాయన. ఈ పై ఫోటోలో ఇద్దరు బ్లాగ్ దంపతులు, వారి బుల్లి మనవడు అగస్థ్య నాతో పాటు ఉన్నారు.

ఫాదర్స్ డే రోజు...మా నాన్నే చాలా గొప్ప అని పోస్టు రాసాక ఆయనను నేను కలిసాను. వాళ్ళ పిల్లలను ఆయన పెంచిన విధానం, వారి ఇష్టాలకు ఆయన ఇచ్చిన విలువ గురించి తెలుసుకున్నాక...'అద్భుతమైన తండ్రి,' అనిపించారు...ఫణి బాబు గారు. ఉన్న కాసేపట్లో...ఆయన తన జీవన చిత్రాన్ని ఆవిష్కరించి...ఎన్నో విషయాల మీద తన అభిప్రాయాలు చెప్పారు. ఏమాటకు...ఆ మాటే....మా సంభాషణలో నా వాటా ఒక ట్వెంటీ పెర్సంటే! అయినా...నాకు ఆనందమే అనిపించింది. "నేను ఎక్కువ మాట్లాడతానని మా ఇంటావిడ (ఫణి గారి ట్రేడ్ మార్క్ సంబోధన) అంటూ వుంటుంది," అని కూడా ఆయన బోసి నవ్వుతో చెప్పారు. 

బ్లాగ్ వల్ల తాము ఎంత తృప్తిని అనుభవిస్తున్నది వారిద్దరూ తెలిపారు. బ్లాగ్ చేతిలో ఉందికదా అని ఒకరిపై ఒకరు బురద చల్లుకోవడం బాధిస్తుందని, యాత్రా విశేషాలు రాసే ఒక బ్లాగర్ పై వచ్చిన విమర్శలు చివరకు ఆమె రాయడం ఆపే వరకు వెళ్ళడం బాధాకరమని చెప్పారు. 'సాహిత్యాభిమాని' శివ గారిని కలిసినప్పుడు కూడా ఇలాగే చాలా ఆనందం అనిపించింది నాకు.

బ్లాగ్ మితృలారా....మీరు కూడా హైదరాబాద్ వస్తే...నాకు ఒక్క ఫోన్ కొట్టండి. లేదా మెయిల్ ఇవ్వండి. మనం సరదాగా కలుద్దాం, కూర్చొని మాట్లాడుకుందాం. ఒక మంచి స్నేహ సామ్రాజ్యాన్ని ఈ నెట్ ప్రపంచంలో నెలకొల్పుదాం. నా రాతల మీద కోపం ఎందుకు ఉందో చెప్పిన వారికి ఒక హైదరాబాద్ బిర్యానీ....పోస్టులు బాగున్నాయని చెప్పే వారికి ఉస్మానియా బిస్కట్ ప్లస్ చాయ్. ఆర్ యూ రెడీ?

Wednesday, June 23, 2010

ఒక మాజీ జర్నలిస్టు స్వీయ అనుభవాలు-II

MBA చదివి 'ఈనాడు జర్నలిజం స్కూల్'లో చేరి E-TV2 లో పనిచేసి తర్వాత గూగుల్ కంపనీలో చేరిన మాజీ జర్నలిస్టు తిరుమల రెడ్డి గారు. ఆయన జర్నలిజంలో తన అనుభవాలను మొదటి పార్టు లో మొన్న పంచుకున్నారు. "Inside Media" సిరీస్ లో ఇది మరొక భాగం. మీడియాలో వ్యక్తుల గురించి ఇది చక్కని విశ్లేషణ. మీడియాలో  పనిచేసి ఈ ఉద్యోగం నచ్చకో, మరొక మంచి అవకాశం వచ్చో ఈ రంగాన్ని వీడిన వారు తమ అనుభవాలు మాకు పంపండి. అబద్ధాలు, అతిశయోక్తులు కాకుండా....స్వీయ అనుభవాలు రాస్తే...మీ ఫోటో తో సహా పోస్ట్ చేస్తాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆహ్వానం...రాము, హేమ
-------------------------------------------------------------

 (తిరుమల రెడ్డి, ETV-2 మాజీ జర్నలిస్టు)
జర్నలిజంలో మనుషులు, మనస్తత్వాల విషయానికి వస్తే స్థూలంగా నేను చూసింది మూడు రకాల వ్యక్తులను.  
ఒకటి- పాత్రికేయ వృత్తిలో అంతగా గ్లామర్ లేని రోజుల్లో చేరి, పగలు రాత్రి తేడా లేకుండా తక్కువ జీతానికే గొడ్డు చాకిరి చేసి, కులాలు గ్రూపు రాజకీయాలు నెరిపి ఇప్పటికి మంచి స్థాయిలోకి వచ్చినవారు. వీళ్ళు తమ మెదడు ఇంకా 1980 దశకం లోనే వదిలేసి బతికేస్తుంటారు. కొత్తగా మీడియాలోకి వచ్చేవారి టాలెంట్ని అస్సలు సహించలేరు. తమ ఈగోని సంతృప్తిపరిస్తే సరి, లేదా రెబెల్ అనే ముద్రవేసో లేక మరో రకంగానో పిల్ల జర్నలిస్టు బతుకు బస్టాండు చేయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. అంటే అవసరం లేకపోయినా డబల్ షిఫ్టు వేయడం, ఎమర్జెన్సీలో కూడా సెలవు ఇవ్వకపోవడం, జూనియర్ కింద పనిచేయించడం లాంటివన్నమాట. నిఖార్సయిన జర్నలిస్టుగా పేరుతెచ్చుకున్న చాలా మంది పెద్దలు ఇలాంటి కోవకి చెందుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. 

ఇక రెండో రకం - పైన చెప్పిన పెద్దలకు రేపటి వారసులు. 30 ఏళ్ళ కింద బాసులు ఎలా ఉండేవారో ఇప్పుడు వీళ్ళు కూడా అదే టైపు. (అదో టైపు లెండి). సొంత వ్యక్తిత్వాన్ని కూడా మర్చిపోయి బాసుల సేవలో తరించడం వీరి దినచర్య. జర్నలిజం అనే పదాన్ని మర్చిపోయి బాసిజమే అసలు పాత్రికేయమని నమ్మే మనుషులు. ఇలాంటి వాళ్ళు అంటే ఆ బాసులకు చాలా ఇష్టం. ఇద్దరి కులమో, ప్రాంతమో ఒకటే అయితే ఇక తిరుగులేదు. నిన్నటి దాక నాతో కలీగ్గా ఉన్న మనిషి కాస్త బాసుకి ఏజెంట్గా మారిపోయి, 'నువ్వూ పెద్ద వాళ్ళని మంచిచేసుకో....' అనే సలహా ఇస్తే ఇక ఏమి చెప్పమంటారు? అంతటితో సరిపెట్టకుండా, బాసిజం ఎలా చేలాయిన్చాలో జూనియర్ల మీద ప్రాక్టీస్ చేస్తుంటారు ఈ బాపతు. ఎవడయినా ఎదురు తిరిగితే, వీడు పనికిరాడు సార్.... అని పెద్దల దగ్గర నెగటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంటారు. కరీర్ నాశనం చేస్తారు.

మూడో రకం - కొన్నాళ్ళు జర్నలిజం మోజులో.... ఇలా చేద్దాం, ఆ న్యూస్ కి  ప్రాధాన్యత ఇద్దాం, ఫలానా వార్తను మరింత బాగా ఇవ్వచ్చు... అని ఎంతో ఉత్సాహంతో పని చేస్తారు. వీళ్ళలో ఉత్సాహం త్వరలోనే ఆవిరైపోతుంది. కారణం... పైన చెప్పిన బాసులకు వీరు రాసే వార్తల్లో అన్నీ తప్పులే కనిపిస్తాయి (ఉదయం ఆఫీసుకు రాగానే బాస్ కి  నమస్కారం చేయకపోవడం అసలు కారణం) లేదా, బాసు ఏజెంట్లు వేసిన ఆర్డర్ పాటించకపోవటం లాంటి తప్పులు చేయడం. ఇలాంటి పరిస్థితుల్లో, ఇష్టపడ్డ జర్నలిజానికి న్యాయం చేయలేక, ఉన్న ఉద్యోగం వదలలేక నిత్యం మానసిక సంఘర్షణకు లోనవుతుంటారు. అర్హతలున్నవారు మరో ఉద్యోగానికి మారిపోతే, అలాంటి అవకాశం లేనివారు ఉన్న ఉద్యోగం కాపాడుకోవడానికి పాట్లు పడుతుంటారు. వారిలో చాల మంది అనానిమస్ వ్యాఖ్యలతో మీడియా బ్లాగుల్లో  తమ గోడు ఇప్పటికీ వెళ్ళబోసుకుంటూనే ఉన్నారు. 

మొత్తం మీద, తెలుగు మీడియాలో నేను ప్రత్యక్షంగా ఉన్నది నాలుగేళ్లే
అయినా... ఓ జీవిత కాలానికి సరిపడా అనుభవం సంపాదించుకున్నా. పాలగుమ్మి సాయినాథ్ గారు చెప్పినట్టు... "There are two kinds of journalists. One kind are journalists, the other are 
stenographers". ఈ స్టేనోగ్రాఫర్స్ కి నిజమైన జర్నలిస్టులుగా పని చేసే 
అవకాశం రావాలని, "The Emperor Has No Clothes At All" అని 
నిర్భయంగా చెప్పే పాత్రికేయులు ఈ రంగంలోకి అడుగుపెట్టాలని 
కోరుకుంటున్నాను. 
తిరుమల రెడ్డి 
(ETV-2 మాజీ జర్నలిస్టు) 
ఆన్లైన్ అడ్వర్టైజింగ్ ఆపరేషన్స్ 
గూగుల్

Tuesday, June 22, 2010

చెన్నై జర్నలిస్టుల మానవతా స్ఫూర్తికి జోహార్....

సీనియర్ జర్నలిస్టు యోగేశ్వర రావు గారి ఏకైక కుమారుడు గౌతం దయనీయమైన ఆరోగ్య స్థితి విషయంలో చెన్నై జర్నలిస్టులు స్పందించిన తీరు నిజంగా అభినందనీయం. సోదరులు సురేంద్ర ('ది హిందూ' కార్టూనిస్ట్), నర్సిం ('ఇండియా టుడే' కార్టూనిస్ట్) మానవత్వంతో చాలా వేగంగా స్పందించారు. వారిద్దరూ పని తీరిక చేసుకుని స్వయంగా...బాబు చికిత్స పొందుతున్న వెల్లూరు వెళ్లి పరామర్శించి వచ్చారు. 

"నేను ఎంతో నిస్పృహతో కుమిలి పోతున్నప్పుడు వాళ్ళు వచ్చారు. మానవత్వం బతికి ఉన్నదని మీరంతా నిరూపిస్తున్నారు," అని యోగేశ్వర్ రావు గారు ఆ తర్వాత నాతో అన్నారు. తనతో పనిచేసిన వాళ్ళు, తన వల్ల ప్రయోజనం పొందిన జర్నలిస్టులు ఈ కష్టకాలంలో మొహం చాటేయడంపై ఆయన పడుతున్న వేదన చెప్పలేనిది. సాక్షి యాజమాన్యానికి ఆయన కృతఙ్ఞతలు తెలిపారు. 

వెల్లూరు వెళ్లి వచ్చాక...నర్సిం గారు...తన మిత్రులకు ఒక మెయిల్ కూడా పంపారు. ఈ మెయిల్ ఒక్క సారి చదవండి. దయచేసి ఆ కుటుంబాన్ని ఆదుకోండి. మీరు పంపే ప్రతి రూపాయి....యోగేశ్వర్ రావు గారికి ఎంతో ఉపకరిస్తుంది. తనకు కచ్చితంగా నయమవుతుందని, తాను మళ్ళీ కాలేజ్ కు వెళ్ళగలుగుతానని, క్రికెట్ ఆడగలుగుతానని గౌతమ్ కలలు నెరవేరాలని ఆశిద్దాం. ఈ పోస్టును దయచేసి సహృదయులైన ఎన్.ఆర్.ఐ.మిత్రులకు గానీ, ఢిల్లీ జర్నలిస్టులకు గానీ, మంచి వ్యక్తులకు గానీ పంపండి. ఈ చిత్రంలో ఉన్నది....గౌతమ్, యోగేశ్వర్ రావు గార్లు. వెల్లూరు లో బాబు చికిత్స పొందుతున్నప్పుడు పది రోజుల కిందట తీసిన చిత్రమిది....రాము, హేమ 
-------------------------------------------------------------------------------------------

Dear all,
A journalist friend in Hyderabad, Y. Yogeswara Rao, is fighting for his 19-year-old son Gowtham's life. Gowtham, an alrounder in cricket, was in 2nd year B.tech when this rare neurological problem 'Transverse Myelitis' struck him. Since September 2009, he is confined to bed with his lower half is completely paralysed.

Yogeswara rao (yogi) took him to various hospitals in hyd and then to Kerala. Now he is in CMC, Vellore. There was a talk of stem cell treatment but the CMC doctors ruled it out. Now he is treated with steroids and  physiotherapy.

Its going  to be a long way and he may have to be in hospital for a few months more.. Yogi has spent all he had and he is in a hopeless condition as for as money concerned. I went to see Gowtham at CMC along with my cartoonist freind Surendra from "The Hindu". Yogi is a distraught man but you should see Gowtham's confidence!!  Even after confining to bed for ten months he still believes he can walk up the mark and bowl, tomorrow morning! 


As I witness the situation I can vouch for it  this kind of supreme confidence and high morale means half the battle is won. Please do help him win this battle. A few more months of treatment and he will be out this.

Y.Gowtham's bank a/c number is  62110246948, SBH, (P&HB) Branch, kukatpally, Hyderabd.
Y.Yogeswara rao a/c number is  000801531273 , ICICI, Khairatabad, Hyderabad 



Goutham's A/c:(P&SB) branch.It is student a/c.
Yogeswar Rao: IFC code: ICICOSF0002


Resi.address: Plot no:C-10,Allwyn colony, 2nd phase, Kukatpally, Hyderabad-500072, Ph:04023066461
Thanks,
narsim (India Today)

Monday, June 21, 2010

TV-9 రవి ప్రకాష్ కు ఒక నాయుడి గారి హితవు....

నోట్: చేయితిరిగిన జర్నలిస్టులా ఉన్న ఒకాయన...సింగమనేని శ్రీనివాస నాయుడు అనే పేరు మీద ఈ కింది వ్యాసం పంపారు. అది నిజం పేరో కాదో చెప్పలేం. ఇది TV-9 రవిప్రకాష్ ను ఉద్దేశించినట్లు అనిపించింది. ఆ ఛానల్ లో ఆసక్తికర పరిణామాల నేపథ్యంలో ఈ లేఖలో కొన్ని అభ్యంతరకర పదాలు తొలగించి ఇక్కడ అందిస్తున్నాము. ఎవ్వరినీ నొప్పించడం దీని ఉద్దేశం కాదు...రాము, హేమ--------------------------------------------------------  ఒక చరిత్రను ఎన్ని సిరాలతో రాయవచ్చునో `మెరుగైన సమాజం' కోసం పరితపించే రవిప్రకాష్ కు తెలిసినంతగా బహుశా మరెవరికీ తెలియకపోవచ్చునేమో..? అలాగే `పరుల' అవినీతిపైన ...పరుల కుల తత్వంపైన అలుపెరుగకుండా పోరాడే రవిప్రకాష్ కు ఈ మధ్య కాలంలో అనుకోకుండా వరుస గా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.  తెలుగు విజువల్ మీడియా కు నామకరణం చేసి, చరిత్ర సృష్టించిన చెరుకూరు రామోజీ ని తలదన్నే అద్భుతమైన ఐయిడియాలతో...tv 9 పేరిట తాను సృష్టించిన సంచలనాలతో పాటే..అప్రతిష్ట ను మూటగట్టుకున్న రవిప్రకాష్ ఇప్పుడు డిఫెన్సు లో పడ్డాడు. తాను పట్టిందల్లా బంగారమనుకునే రోజులు హఠాత్తుగా మాయమైపోయి...గడ్డుకాలం ఎదురవడంతో...బిత్తర చూపులు చూసే రోజులు వస్తాయని ఆయన బహుశా అనుకుని ఉండకపోవచ్చు...కానీ....కళ్ళెదుట కనిపిస్తున్న వాస్తవం అదే. సంచలనాల పేరిట అడ్డగోలు రిపోర్టింగ్ ను ఆయుధంగా చేసుకుని, అడపాదడపా అరుణారుణ సాగరుడి మార్కు బూతు 30 మినిట్స్ ప్రోగ్రామ్స్ తో ఆంధ్రదేశం లోని అలగా వ్యవహారాలని బుల్లి తెరమీద కెక్కించి...ఇప్పటి వరకూ నెట్టుకొచ్చిన టీ.ఆర్.పీ. రేటింగ్ కు ఒక్కసారిగా చిల్లు పడటం రవిప్రకాష్ ఆందోళనకు అసలు కారణం.. 
దానికి తోడు...కనక వర్షం కురిపిస్తాయనుకున్న tv 9 గుజరాతీ, మరాఠీ చానల్స్ నెత్తిన చెంగేసుకుని చాప చుట్టేయడంతో రవిప్రకాష్ లో అంతర్మథనం మొదలైంది..రిపోర్టర్ల భుజాల మీద వార్తల తుపాకులెక్కుపెట్టి ఆయన సాగించినట్టుగా అభియోగాలేదుర్కున్నఎన్నో వివాదాస్పద వార్తకధనాలకు..కొందరు నిజయితీపరులైన రిపోర్టర్లు ఆ తర్వాత సభ్యసమాజంలో ఎంతగా పలుచనైపోయారో వేరే చెప్పనక్కర్లేదు. tv 9 సాగించిన ఈ దూకుడు వార్తకథనాల ప్రసారానికి `మంత్రసాని తనం' ఒప్పుకున్న ఆలపాటి సురేష్ లాంటి సీనియర్ జర్నలిస్టులకు డోర్స్ చూపించి చేతులు దులుపుకున్న రవిప్రకాష్,, ఆయన స్థానం లో తీసుకొచ్చి కుర్చోపెట్టిన రెడ్డి గారికి ఎలాంటి విశ్వసనీయత ఉందని మీడియా లోకానికి చెప్పదలుచుకున్నారో వేరే చెప్పనవసరం లేదేమో...
ఒక్కటిమాత్రం నిజం..నిలబడి మంచినీళ్ళు తాగే e tv మార్కు జర్నలిజాన్ని అపహాస్యం చెస్తూ రవిప్రకాష్ బృందం సాగించిన తిక్కరకం జర్నలిజానికి కాలం చెల్లిపోయింది.. మార్కెట్లో ఉన్న తెలుగు చానల్స్ అన్నింటిలో ఈ వేల్టికీ అద్భుతమైన రిపోర్టింగ్ చేయగల సమర్దులున్నారు..అంతకి మించి సుస్పష్టమైన స్క్రిప్ట్ ఇవ్వగల దక్షులైన డెస్క్ జర్నలి స్టులు ఉన్నారు.. ఈలాంటి వారి సంఖ్యా బహు స్వల్పంగా ఉన్న tv 9 ఇకమీదట కుడా అదే రకం TRP హవా కొనసాగిస్తుందని అనుకోవటం భ్రమ..
 ఒక వేళ అలాంటి భ్రమలే రవిప్రకాష్ కు ఉంటె...లేదా ఆ గ్రూప్ చైర్మన్ శ్రీని రాజు కు ఉంటె...అర్జెంట్ గా ఉన్న టీం ను శుద్ధి చేసుకోవటం అవసరం. మెరికల్లాంటి టీం మెంబెర్స్ ని బయటకి పంపేస్తే... tv 9 రేటింగ్ అమాంతం పెరిగిపోతుందని విపరీతంగా ఊదర గొట్టి..కాస్తో కూస్తో పని చేసే జూనియర్స్ కి ఉద్వాసన పలికించిన తెలుగు రాని ఆకుల గారు కూడా...హఠాత్తుగా చీఫ్ న్యూస్ కో ఆర్డినేటర్ అవతారమెత్తి ...ఫేస్ బుక్ స్టేటస్ మెసేజ్ లో...తాను కొన్నాళ్ళు మిత్రులేవరికీ అందుబాటులో ఉండనని చెప్పుకుని అదృశ్యమవ్వాల్సిన ఆపత్కాలం దాపురించిందంటే...ఇది కచ్చితంగా రవిప్రకాష్ కాల పరీక్ష కి నిలబడాల్సిన సందర్భమే. నిజాన్ని ఒప్పుకుని...నిర్భీతిగా రవి అడుగులు వేస్తె అది ఆయనకు మంచే చేస్తుంది..కానీ..దానికి కావలసినదల్లా...ఆయన చేయాల్సింది...తన వెంట ఉన్న `భట్రాజు' లను సాగనంపి ...నికార్సైన జర్నలిస్టులను తిరిగి తన దగ్గరికి ఆహ్వానించటం...చూద్దాం.. రవి ఏమి చేస్తారో..!!!!!...
సింగమనేని శ్రీనివాస నాయుడు, మాజీ జర్నలిస్టు

ఒక మాజీ జర్నలిస్టు స్వీయానుభవాలు-I

'Inside Media' సిరీస్ లో మొదటి భాగం ఇది. దీని రచయిత తిరుమల రెడ్డి గారు. ఆయన అనుభవాలు ఇక్కడ పంచుకుంటారు. మీడియాలో కొన్నాళ్ళు ఉండి...నచ్చక వేరే ఉద్యోగాలు వెతుక్కున్న వారు ఇలా స్వీయానుభవాలు పంపితే...ఫోటోతో సహా ఈ బ్లాగ్ లో ప్రచురిస్తామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఈ ఫోటోలు తిరుమల్, ఆయన సతీమణి సుమ గార్లవి.--Ramu, Hema
----------------------------------------------------------

MBA (మార్కెటింగ్చేసి చిన్నా చితకా ఉద్యోగాలు వెలగబెట్టి ఇది ఇక 
నావల్ల  కాదనుకునే  సమయానికి 'ఈనాడు జర్నలిజంస్కూలు'  ప్రకటన నాలో కొత్త ఆశలు రేపింది. టీవీ జర్నలిజంలో మొదటి సారిగా డిప్లొమా అందిస్తున్నామనే మాట ఆకర్షించింది.మీడియాలోకి అడుగుపెట్టే సమయానికి  పాలగుమ్మి సాయినాథ్ లాంటి వారు మాత్రమే ఉంటారనే భ్రమ ఉండేది. ఈనాడు జర్నలిజం స్కూలు (2003) మొదటి టీవీ బ్యాచ్లో చేరినప్పుడు ఈ భ్రమ కాస్త గర్వంగా మారింది. 

ఒక గొప్ప సంస్థలో పనిచేయబోతున్నా అనే ఆనందం ఉక్కిరిబిక్కిరి చేసేది. ఆర్నెల్ల శిక్షణ  పూర్తయిన తరువాత డెస్క్ లో చేరగానే బుడన్ (అప్పుడు ఈటీవి-2, ఇప్పుడు Studio-N)  గారి వద్ద పని చేసే ఆవకాశం దొరికింది. బుల్లెటిన్లో వార్త ప్రాధ్యానత నుంచి రన్ ఆర్డర్ తయారు చేసే వరకు అంతా ఆయనే నేర్పించారు.

నేను చేసే బుల్లెటిన్ లక్షల మంది చూస్తారనే ఆలోచన ఎంతో తృప్తినిచ్చేది. అయినా ఏదో తెలియని ఒత్తిడి నా మీద పడుతున్న భావన కలిగేది. ముందు ముందు నువ్వే తెలుసుకుంటావు అని బుడన్ గారు అంటుంటే అర్ధమయ్యేది కాదు. MBA చేసి ఈ రంగంలోకి ఎలా వచ్చావు ?అని తరుచు ప్రశ్నించే వారు. అలా అయనతో (2004) ఎలక్షన్ బుల్లెటిన్ సమర్ధంగా నిర్వహించాను. బుల్లెటిన్ పూర్తైన తర్వాత పోస్ట్ మార్టెం పేరిట ఛానల్ కి హెడ్ స్థాయిలో ఉండే వ్యక్తి అనవసర వ్యాఖ్యలు చేయడం, అది నచ్చక బుడన్ గారు ETV-2 నుంచి వెళ్ళిపోవడం చకచక జరిగిపోయాయి. అప్పుడు మొదలైంది నా కష్ట కాలం. 

సదరు హెడ్ గారు నన్ను నేషనల్ న్యూస్ లో పడేసి గంటకోసారి ఫోన్ చేసి న్యూస్ గురించి వాకబు చేసేవారు. సర్లే అనుకుంటూనే అక్షర ధామ్ పేలుళ్లు, ఇరాక్ ఫై అమెరికా దాడి లాంటి అంశాలు కవర్ చేసాను. ఇక్కడో ముఖ్య విషయం ఏమిటంటే, నేషనల్, ఇంటర్నేషనల్, అంశాలు కవర్ చేయడానికి మనకంటూ రిపోర్టర్లు ఉండరు. అంతా న్యూస్ ఏజెన్సీలపై ఆధారపడాల్సిందే. రాయిటర్స్ లో వార్త లేట్ అయితే బుల్లెటిన్ లో తేడా వస్తుంది. వెంటనే పైనుంచి అచ్చ తెలుగు బూతులు వినాల్సివచ్చేది. Marlon Brando, Hrishikesh Mukherjee ల మృతిఫై స్టొరీ చేస్తే "వాడి గురించి స్టొరీ ఎందుకు" అని ప్రశ్నించిన బాస్, మరుసటి రోజు అవే వార్తలు "ఈనాడు" మెయిన్ పేజీలో చూసి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం  నవ్వు తెప్పించింది. అయినా బండి నడిపించాలి. ఇందులో నాకు తెలిసొచ్చింది ఏమిటంటే మనకంటూ ఒక టీం ఉండాలి అని. అప్పట్నుంచి నాకు సరైన సపోర్ట్ ఇవ్వగల (బుల్లెటిన్లో మాత్రమే, ఇతరత్రా కాదు)  జూనియర్లను తయారు చేసుకున్నా. ఇప్పుడు నా టీం సభ్యులంతా  MAHA-TV, Zee-24, Saakshiలో సొంతగా బుల్లెటిన్లు చేస్తుండడం నాకు గర్వకారణం. 

ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే, ఆంధ్రావని జడిలో నేషనల్ న్యూస్ కొట్టుకుపోయేది. కొంత మనసు చివుక్కుమన్నా, నేషనల్ న్యూస్ సత్తా చూపే అవకాశం 2004 లో సునామి రూపంలో వచ్చింది. అంతర్జాతీయ వార్త కావడంతో, ఒక పది రోజులపాటు నిద్రాహారాలు మాని వార్తలు కవర్ చేసాము. జర్నలిస్టుగా నాకు అత్యంత సంతృప్తినిచ్చింది సునామి కవరేజ్. తరుచూ మారుతున్న సమీకరణాల్లో భాగంగా నన్ను ఆంధ్రావనికి మార్చారు. స్వతహాగా రాష్ట్ర వ్యవహారాలపై ఆసక్తి ఉండడంతో అక్కడా నా వంతు కృషి చేసాను. తేడాఅల్లా ఫీల్డ్ లో రిపోర్టర్లతో అనుక్షణం కాంటాక్ట్ లో ఉండాలి. అదో కొత్త అనుభూతి. ఏడాదిన్నర పాటు ప్రాంతీయ వార్తల్లో మునిగి తేలాను. అనుక్షణం అప్రమత్తతతో వ్యవహారం నడపాలి. అప్పటికి రెండు న్యూస్ చానెళ్ళు మాత్రమే ఉన్నా,  మీడియా అవేర్నెస్ ఊపందుకుంది. ఈ క్రమంలో న్యూస్ బుల్లెటిన్ మీద పట్టు సాధిస్తూనే, నన్ను, నాలాంటి వాళ్ళను సాధించుకు తినే పెద్దలను తట్టుకోవడం అలవాటు చేసుకున్నాను. పైగా, మనం కొమ్ముకాస్తున్న పార్టీ ఘోరంగా ఓడిపోయినా దాన్ని పక్కనపెట్టి, ఎదుటి పార్టీ తూతూ మంత్రంగా గెలించిందని చెప్పాలి. 

ఇదెక్కడి జర్నలిజం రా బాబు, జర్నలిజం స్కూల్లో నేర్పిందేమిటి ఇక్కడ నాతో చేయించే పనేంటి అనే ఆత్మశోధనతో నలిగిన సందర్భాలు అనేకం.  కాకపోతే పూర్తిగా న్యూస్ పైనే దృష్టి పెట్టాలనుకునే వారికి ఇలాంటి పెద్దల వ్యవహారం
చికాకు తెప్పిస్తుంది. జర్నలిజంలో పని సంతృప్తిని మాటేమో కాని, బాసుల
ఇగోలు సంతృప్తి పరచటంలో కూడా కొంత సమయాన్ని వెచ్చించాల్సి
వచ్చేది.  

వీటన్నిటిని దాటుకుంటూ నాలుగేళ్ళు పూర్తి చేసాక, నేను ఇంత
చదువు చదివింది ఇలాంటి హర్రాస్మేంట్ భరించటానిక  అనిపించి మళ్లీ ఉద్యోగ
ప్రయత్నాలు మొదలుపెట్టి చివరికి గూగుల్ సంస్థలో ఆన్లైన్ అడ్వర్టైజింగ్లో 
చేరాను. అయితే అక్కడితో నా యాక్టివ్ జర్నలిజానికి తెర పడినా, ప్యాసివ్ 
పాత్రికేయం అప్పుడప్పుడూ వెలగాబెడుతూనే ఉన్నా. నా జీవిత భాగస్వామి 
(Sumalatha Reddy) కూడా ఫ్రీలాన్స్ యాంకర్ కావడంతో మీడియా 
సంబంధాలు ఇంకా కొనసాగుతున్నాయి. 

తిరుమల రెడ్డి 
(ETV-2 మాజీ జర్నలిస్టు) 
ఆన్లైన్ అడ్వర్టైజింగ్ ఆపరేషన్స్ 
గూగుల్

Saturday, June 19, 2010

నాన్న జీవితం ఓ అద్భుత పాఠం.. సందేశం (ఫాదర్స్ డే ప్రత్యేకం)

పెద్ద పేద కుటుంబంలో పుట్టి...బాల్యంలో అష్టకష్టాలు పడి పదేళ్ళ లోపు వయసులో తల్లిదండ్రులను వదిలి ఒంటరిగా విద్యార్జన కోసం పట్నానికి పయనమైన బాలుడు. అతనంటే నాకిష్టం. ఎందుకంటే...జీవన సమరం ఎలా చేయాలో నాకు నేర్పాడు.
*     *     *     *     *     *     *     *     *     *
ఆ పట్నంలో ఆర్థిక ఇబ్బందులతో..ఆ ఇంట్లో ఈ ఇంట్లో వారాలు చేసుకుని తింటూ...సంస్కృతం నేర్చుకుని, ఈ చదువుతో భవిష్యత్తులో లాభం లేదని ఎవరో చెబితే...ఒక పంతులు గారికి శుశ్రూష చేసి ABCD లు నేర్చుకుని, ఆ మరుసటి సంవత్సరమే...మెట్రిక్యులేషన్ పరీక్ష రాసిన విద్యార్థి. అతనంటే నాకిష్టం. ఎందుకంటే...ఏ పనైనా చిత్తశుద్ధితో చేస్తే సాధించ వచ్చని నాకు అమూల్యమైన పాఠం నేర్పాడు.
*     *     *     *     *      *     *     *     *     *
వచ్చిన చిన్నపాటి ఉద్యోగంలో...మూగ జీవాలకు సేవ చేసుకుంటూ...ఎంతో సంతృప్తి పొందిన ఉద్యోగి. ఆయనంటే నాకిష్టం. ఎందుకంటే...విధినిర్వహణలో బద్ధకం పనికిరాదని, చిత్తశుద్ధితో విధి నిర్వర్తించాలని నేర్పారాయన. 
*     *     *     *     *      *     *     *     *     *
వృత్తికి దగ్గరి వ్యాపారం కదా అని...కోళ్ళఫారం పెట్టి లక్షల్లో చేతులు కాల్చుకుని ఆర్థికంగా బాగా నలిగిపోయిన వ్యక్తి. ఆయనంటే నాకిష్టం. ఎందుకంటే...జీవితంలో ఓటమిని ఎలా స్వీకరించాలో చెప్పకనే చెప్పారాయన.
*     *     *     *     *      *     *     *     *     *
వూర్లో ఆరో తరగతిలో ఉన్న కొడుకు ఒక స్నేహితుడితో కలిసి బీడీలు, సిగరెట్లు తాగుతున్నాడని తెలిసి...కొట్టకుండా, తిట్టకుండా...వేరే ఊరికి తీసుకెళ్ళి ఏకాంతంలో రోడ్డు పక్క నడుస్తూ కౌన్సిలింగ్ ఇచ్చిన తండ్రి. ఆయనంటే నాకిష్టం. ఎందుకంటే...పిల్లల్లో  పరివర్తనకు మార్గం దండన కాదని రుజువు చేసారాయన.
*     *     *     *     *      *     *     *     *     *
ఇంటర్మీడియేట్ చదువుతున్న కొడుకు ఇంటి ఓనర్ గారి అమ్మాయిని ప్రేమిస్తున్నాని....చెబితే...."ఒకే...ముందు చదువు సంగతి చూడు...తర్వాత పెళ్లి సంగతి...." అని మళ్ళీ కౌన్సిలింగ్, మనోస్థైర్యం ఇచ్చి...కొడుకు స్థిరపడిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం...ఎలాంటి కొర్రి పెట్టకుండా, రాద్ధాంతం చేయకుండా, ఆ అమ్మాయితోనే కొడుకు పెళ్లి అయ్యేలా చూసి పెద్దరికం నిలుపుకున్న తండ్రి. ఆయనంటే నాకిష్టం. ఎందుకంటే....జీవితంలో ఎంతో కీలకమైన విషయాలను ఓపికతో, ప్రాక్టికల్ గా పరిష్కరించడం నేర్పారాయన.
*     *     *     *     *      *     *     *     *     *
కట్నం తీసుకోవడం ఇష్టం లేదని కొడుకు స్పష్టం చేస్తే...అప్పుచేసి మరీ...తన సొంత వూర్లో కొడుకు పెళ్లి చేసిన పెద్ద మనిషి. ఆయనంటే నాకిష్టం. ఎందుకంటే....ఇతరులు పెట్టుకున్న సిద్ధాంతాన్ని, నిబంధనలను గౌరవించడం ఎలానో ఆచరించి చూపారాయన.
*     *     *     *     *      *     *     *     *     *
సొంత తమ్ముడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే...తాను కష్టపడి కూడగట్టి...ఆదుకున్న మంచి అన్న. ఆయనంటే నాకిష్టం. ఎందుకంటే...అనుబంధం, ఆప్యాయతల ముందు డబ్బు గడ్డిపోచతో సమానమని నేర్పారాయన.
*     *     *     *     *      *     *     *     *     *
ముగ్గురు కొడుకులను చదివించి....ఇన్నాళ్ళూ...పెద్దగా సంపాదించింది ఏమీ లేకపోయినా...తృప్తిగా ఉద్యోగ విరమణ చేసి ఆరోగ్యం కోసం వ్యవసాయం, ఆత్మానందం కోసం భక్తి పుస్తక రచన చేసిన పెద్ద మనిషి. ఆయనంటే నాకిష్టం. ఎందుకంటే...గడిచిన దాని గురించి వగచకుండా...శేషజీవితం ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలని నేర్పుతున్నారాయన.
*     *     *     *     *      *     *     *     *     *
అరవై ఆరేళ్ళ వయస్సులో...మొన్ననే...'మన వూర్లో ఒక వృద్ధాశ్రమం పెడితే ఎలా వుంటుంది?' అని ప్రశ్నించిన ఆ మనీషి. ఆయనంటే నాకిష్టం. ఎందుకంటే...విపరిణామాలకు బెదరకుండా....సేవా తత్పరత ఎలా కొనసాగించాలో చెబుతున్నారాయన.


---ఆ బాలుడు, ఆ విద్యార్ధి, ఆ ఉద్యోగి, ఆ పెద్ద మనిషి, ఆ తండ్రి, ఆ అన్న, ఆ మనీషి....ఆయనే మా నాన్న..వెంకటేశ్వర్లు గారు. ఆయన నాకు ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్. ఏ తండ్రి జీవితం అయినా...కొడుకులు, కూతుళ్ళకు ఒక పెద్ద సందేశం. తల్లి ప్రేమను, ఫుడ్ ను పంచి పెంచితే...నాన్న మౌనంగా జీవన పోరాటం, ఒడిదొడుకులను ఎదుర్కునే...శక్తి సామర్ధ్యం ఇస్తాడు. మా నాన్న కూడా అంతే. ఇంకా అంతకన్నా ఎక్కువే. అన్యాయం, దారుణంపై నిర్మొహమాటంగా గొంతెత్తడం, నిష్టురమైనా, ఎందరు నొచ్చుకున్నా...నిజాన్ని ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం...ఆయన నుంచి అబ్బిన లక్షణాలు. ఈ కింది ఫోటోలో ఎడమ వైపున ఉన్నది మా నాన్న, కుడి వైపున ఉన్నది హేమ నాన్న, మధ్యలో ఉన్నది నా పుత్రరత్నం ఫిదెల్.
రెక్కలు వచ్చి గూడు వదిలి రావడానికి ముందు నేను, తమ్ముడు, అన్నయ్య, నాన్న...కొన్నేళ్ళ పాటు ఇంటి ముందో, పక్కనో బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళం. ఆ రోజులు తడి ఆరని తీపి గుర్తులు. జీవితం లో నాకు ఒక దాని వెంట ఒకటి విజయాలు లభించినప్పుడు...ఆ సమాచారం తెలుసుకునేటప్పుడు మా నాన్న కళ్ళలో వెలుగు, పెదాలపై నవ్వు కోట్ల పెట్టు. అలాగే...వివిధ గ్రంథాల సారాన్ని, తన అనుభవాలను కలిపి తాను రూపొందించిన "ఆత్మ శోధన--యోగ సాధన" పుస్తకాన్ని నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట లో పండితుల చేతుల మీదుగా ఆవిష్కరించినప్పుడు కూడా ఆయన పడిన ఆనందం ఎంతో తృప్తినిచ్చేది. నేను, నాన్న, ఫిదెల్, తమ్ముడు కలిసి కూచొని క్రికెట్ లేదా ఫుట్ బాల్ మ్యాచ్ టీ.వీ.లో చూడడం నాకు అత్యంత ఇష్టమైన పనుల్లో ఒకటి.

తల్లులను తక్కువ చేయడం కాదు కానీ...జీవితం లో తండ్రి పంచే వాత్సల్యం, నేర్పే జీవిత పాఠాలు అమూల్యం, అద్భుతం. తల్లి ప్రేమకు గానీ తండ్రి వాత్సల్యానికి గానీ సాటి వచ్చేవి ఈ ప్రపంచంలో ఏమీ లేవు. మన తల్లిదండ్రులు నిండునూరేళ్లు ఆనందంగా జీవించాలని, వారికి దగ్గరుండి సేవ చేసుకునే బుద్ధి, శక్తి సామర్ధ్యాలు పుత్రులలో పెరగాలని ఆశిస్తూ..... అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు.

TV-9 నుంచి ఆలపాటి అవుట్-ఇన్ పుట్ ఎడిటర్ గా శ్రీనివాస రెడ్డి

TV-9 పొలిటికల్ ఎడిటర్ గా ఉన్న సీనియర్ జర్నలిస్టు ఆలపాటి సురేష్ ఆ ఛానల్ కు రాజీనామా చేశారు. తిరుమలలో విజిలెన్స్ కు దొరికిపోయిన 'ఆ విలేకరి' విషయం కారణంగా సురేష్ సంస్థ నుంచి వైదొలగక తప్పని పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం. పూర్తి వివరాలు అందాల్సి వుంది.

అలాగే...ఆ ఛానెల్ ఇన్ పుట్ ఎడిటర్ గా ఉన్న దినేష్ ను ఆ పదవి నుంచి తొలగించి మళ్ళీ నేషనల్ కో-ఆర్డినేటర్ గా నియమించారు. ఇప్పటి వరకు TV-1 వ్యవహారాలు చూస్తున్న...శ్రీనివాస రెడ్డి ని కొత్తగా ఇన్ పుట్ ఎడిటర్ను చేశారు. రవిప్రకాష్ నమ్మిన బంటు అయిన శ్రీనివాస రెడ్డి వివాదాస్పద పరిస్థితుల మధ్య 'సాక్షి ఛానల్' నుంచి వచ్చాక వెంటనే TV-9 లో కీలక పదవి పొందుతారు అనుకున్నారు కానీ...అందుకు ఇంత ఆలస్యమయ్యింది. 

ఈ పరిణామం మింగుడుపడకనో, సొంత పనులు చక్కబెట్టుకోవడానికో..
దినేష్ ఒక వారం రోజుల పాటు సెలవలో వెళ్ళినట్లు తెలిసింది. కారణాలు ఏవైనా కావచ్చు కానీ...సంస్థలోని జర్నలిస్టులతో ఈ మధ్య రవిప్రకాష్ వ్యవహార శైలి చర్చనియాంశంగా మారింది. "ఎందుకో ఆయన నిస్పృహతో ఉన్నట్లు కనిపిస్తున్నారు. చీకాకు ఎక్కువయ్యింది," అని ఒక ముఖ్యుడు వ్యాఖ్యానించారు. TV-9 లో ఇటీవల బదిలీ అయిన జర్నలిస్టుల తో కూడా రవి ఎన్నడూ లేనంత కఠినం గా మాట్లాడినట్లు సమాచారం.

Thursday, June 17, 2010

మరీ బరితెగిస్తున్న....Studio-N?

ఇన్నాళ్ళూ..... సిగ్గూ, ఎగ్గూ లేకుండా బూతు చూపించడంలో, జర్నలిజాన్ని గంగలో కలపడంలో TV-9 ఛానెల్ ముందు ఉండేదని అనుకుంటున్నాం. దానికి పోటీగా ఇప్పుడొక ఛానల్ ఇరగదీస్తున్నది. దాని పేరు...తెలుగు దేశం పార్టీ వారి studio-N.

రాత్రి పొద్దుపొయ్యాక....మసాలా ప్రోగ్రాం ద్వారా సుఖిస్తున్న ఈ ఛానెల్ హెడ్లు...ఈ రాత్రి బులెటిన్ లో ఒక బుద్ధితక్కువ తక్కువ పనిచేసారు. ఈ విషయంలో కనీసం TV-9 కు ఉన్న ఇంగితం కందుల రమేష్ గారి బృందానికి లేకపోవడం శోచనీయం.

21-ఏళ్ళ కడప అమ్మాయి ఒక విధివంచిత. పెళ్ళిచేసుకుంటానని బాసచేసిన వాడు తనతో వ్యభిచారం చేయించి....సొమ్ము కూడబెట్టుకుని చివరకు పో..పొమ్మని మోసం చేశాడు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ ప్రాంతంలో ఆ ప్రియుడి ఇంటి ముందు దీక్షకు కూర్చుంటే...ఒక పొగరుబోతు పోలీసోడు...'జీవితాలతో ఆడుకుంటావా? వ్యభిచారం చేసుకుంటున్నావు...కదా..పోయి చేసుకో,' అని తనతో అన్నాడు. అందుకు వీడియో సాక్ష్యం ఉంది. ప్రియుడితో పెళ్ళైనా చేయండి లేదా వ్యభిచారం చేసుకోవడానికి లైసెన్స్ అయినా ఇవ్వండి....అని ఆ అమ్మాయి డిమాండ్ చేస్తున్నది.


బుధవారం రాత్రి TV-9 ఈ స్టోరీ ప్రసారం చేసింది. టీ.వీ.ఛానెల్స్ ఏదో మేలు చేస్తాయని ఇలాంటి ఆడవాళ్ళు స్టూడియోలకు వస్తారు. అలాగే ఆ పిచ్చితల్లి నిన్న ఆ ఛానల్ లో లైవ్ లో మాట్లాడింది. TV-9 సోదరులు...ఆ అమ్మాయి మొహం చూపించకుండా నల్ల క్లాత్ ఏర్పాటు చేశారు. ఆమెను పోల్చుకోవడానికి వీలు లేకుండా.... విజువల్స్ లో బ్లర్ చేశారు.  ఇది జర్నలిజం మౌలిక సూత్రం. ఇది మరిచి ఆ అమ్మాయి మొహాన్ని చూపడం తుక్కు జర్నలిస్టులు చేసే పని...అని నా వ్యక్తిగత అభిప్రాయం. 

అదే స్టోరీని ఒక రోజు అయ్యాక పట్టుకున్న studio-N మహానుభావులు కనీస మర్యాద పాటించకుండా...ఆ అమ్మాయి మొహం చూపి....డైరెక్ట్ గా బైట్ వేశారు ఈ రోజు రాత్రి. ఆ అమ్మాయి అసహనంగా కదలడం...వంటి అన్నీ విజువల్స్ చూపారు. ఇది చాలా అభ్యంతరకరం. సీనియర్ ఇన్ పుట్ ఎడిటర్ గా అక్కడ చేరిన మా బుడన్ భాయ్ డ్యూటీ లో లేనప్పుడు ఇది జరిగి ఉండవచ్చు.

'అయితే...ఏమయ్యింది...ఆమే లైసెన్స్ కావాలని అడుగుతుంది కదా...మీకెందుకు బాధ' అన్న సందేహం కొందరికి రావచ్చు. అయినా సరే...అది తప్పే. ఆమె వంచిత. చదువుకొని అభాగ్యురాలు. తీవ్ర నిస్పృహతో ఆమె ఆ డిమాండ్ చేస్తున్నది. ఇవ్వాళ విలేకరులు ఆమె మొహం లోకానికి చూపితే...రేపు ఆమె రోడ్డు మీద తలెత్తుకు తిరగలేని పరిస్థితి రావచ్చు. జులాయిల వల్ల ఆమె జీవితం మరింత దుర్భరం కావచ్చు. బాధిత...పిల్లలు, మహిళల విషయంలో ఛానెల్స్ కాస్త సంయమనం పాటించడం....కనీస మర్యాద, బాధ్యత, మానవత్వం.  

Wednesday, June 16, 2010

TV-5 డేరింగ్ "డైమండ్ ఆపరేషన్"కు అభినందనలు...

TV-5 ఛానల్ లో బుధవారం సాయంత్రం ప్రసారమైన ఒక డేరింగ్ పరిశోధనాత్మక కథనానికి...ఆ ఛానల్ టాస్క్ ఫోర్స్ కు, ఇతర సిబ్బందికి ముందుగా అభినందనలు. ఇప్పటికే...ప్రథమ స్థానం కోసం TV-9 తో పోటీ పడుతున్న TV-5 మున్ముందు మరిన్ని ఇలాంటి అద్భుతమైన కథనాలు చేసి, ప్రసారం చేసి...చచ్చుపుచ్చుగా మారిన తెలుగు టీ.వీ.జర్నలిజానికి ఒక కొత్త ఊపు తేవాలని మా ఆకాంక్ష.
 అసలు కథ ఏమిటంటే....చిత్తూరు జిల్లాలో ఒక ముఠా చాలా పురాతనమైన పచ్చని వజ్రాన్ని అమ్ముతున్నట్లు TV-5 బృందానికి సమాచారం అందింది. బంగారు తాబేలు లో నిక్షిప్తం చేసి ఉన్న ఆ డైమండ్ క్రిష్ణ దేవరాయలు కాలం నాటిదని, దాని ఖరీదు వందల కొట్లలో ఉంటుందని ప్రాథమిక అంచనా. ఈ బండారం బైటపెట్టి...ఆ ముఠా ఆటకట్టించాలని హైదరాబాద్ నుంచి 'టాస్క్ ఫోర్స్' బృందాన్ని ఆ జిల్లాకు పంపిందీ చానల్ యాజమాన్యం. స్థానిక విలేకరులు కూడా ఈ ఆపరేషన్ లో పాల్గొన్నట్లు ఉన్నారు.

ఈ రిపోర్టర్లు ప్రాణాలకు తెగించి....ఆ ముఠా తో బేరానికి దిగారు. 'ఇది నిజమైనదో కాదో...అన్న అనుమానం మా యజమానికి వస్తుంది కాబట్టి...ఆయనకు పంపాలి' అని చెప్పి ఫోటోలు కూడా తీసుకున్నారు. ఇదంతా వారు ఏర్పరుచుకున్న రహస్య కెమెరా బంధించినట్లు ఉంది. ఒక రాత్రి అంతా...ఈ ముఠా డేగ కళ్ళ పహారా మధ్య రిపోర్టర్లు యజమాని రాక కోసం అన్న మిషతో ఒక హోటల్ లో ఉన్నారు. ఒక మెరిక లాంటి పోలీసును వజ్రం ధర, నాణ్యత నిర్ధారించే నిపుణుడిగా రంగంలోకి దించారు. 

మర్నాడు...ఉదయం పోలీసులు ఆ ప్రదేశాన్ని రైడ్ చేసే విధంగా రంగం సిద్ధం చేసుకున్నారు జర్నలిస్టులు. అనుకున్న ప్రకారం అంతా సవ్యంగా జరిగి...పోలీసులు ఒక ఇంటి పై రైడ్ చేసి బంగారు తాబేలు లో ఉంచిన పచ్చని వజ్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ వజ్రం ఒక టీ.టీ.డీ.ఉద్యోగో, మాజీ వుద్యోగో ఇంట్లో దొరకడం విశేషం.

ఈ జర్నలిస్టుల ధైర్యానికి నిజంగా జోహార్లు. 'ఆపరేషన్ గోవిందా' అన్న శీర్షికతో దీన్ని ప్రసారం చేశారు కానీ....ఆ కాపీ ని ఇంకా అద్భుతంగా రాయవచ్చేమో అనిపించింది. రిపోర్టర్లు చేసిన అద్భుత కృషి, ఈ స్టోరీలో నాటకీయత కథనంలో ప్రతిబింబించలేదు. బుర్ర పెట్టి చేస్తే...దీన్ని ఒక పూటంతా జనాన్ని కట్టిపడేసే స్టోరీగా మలచవచ్చు అనిపించింది. 

ముఠాతో కాంటాక్ట్ లోకి వచ్చిన దగ్గరి నుంచి...పోలీసులు రైడ్ చేసే దాకా...ఇది ప్రాణాలతో తెగించి పనిచేయడమే. ఈ క్రమం లో కథ కొద్దిగా బెడిసినా...రిపోర్టర్ల ప్రాణాలకు ముప్పు వస్తుంది. ఈ ఛానల్ టాస్క్ ఫోర్స్ లో ముఖ్యుడైన రామకృష్ణ అనే రిపోర్టర్ ఒక మూడు నాలుగు నెల్ల కిందట ఇలానే ప్రాణాలకు తెగించి ఇలాంటి ఆపరేషన్ చేశారు. 

We appreciate TV-5 for its wonderful investigative journalism.  బూతు బొమ్మలేమి చూపిస్తారు బాస్!....చేయండి...ఇలాంటి దమ్మున్న స్టోరీలు.
---------------------------------------------------
ముఖ్య వివరణ: TV-5 నిన్న ప్రసారం చేసిన కథనాన్ని చూసి నేను ఈ పోస్ట్ రాసాను. ఇది బ్లఫ్ స్టోరీ అనీ, టీ.ఆర్.పీ.రేటింగ్స్ పెంచుకునేందుకు ఆ ఛానల్ ఆడిన డ్రామా అని మర్నాడు కొన్ని ఛానెల్స్ లో వచ్చినట్లు కొందరు నాకు తెలిపారు. నిజంగా ఆ ఛానల్ అలా చేసి వుంటే...అది దారుణం, ఘోరం. ఎవరి మాట నమ్మవచ్చో, ఎవరిది నమ్మకూడదో తెలియనంతగా నైతికంగా దిగజారాయి ఛానెల్స్. తెర మీద కనిపించిన దాని ఆధారంగా ఈ పోస్ట్ రాసిన మేము.....ఈ కథనం వెనుక కథ కోసం కూడా ప్రయత్నిస్తాను. ఒక వేళ TV-5 దురుద్దేశంతో ఈ స్టోరీ ని కుకప్ చేసి వుంటే...ఆ పాపంలో మాకు భాగం లేదని మనవి.

కెమెరా ముందు లైవ్ లో....అంత వీజీ కాదు బాబాయ్...

తనదాకా వస్తేగానీ తత్వం బోధపడదు. 'ఆ యాంకర్ ఇట్లా...ఈ యాంకర్ అట్లా....' అని కూల్ గా కంప్యూటర్ ముందు కూర్చుని రాసే నాకు నిన్న...మంగళవారం స్టూడియోలో కూర్చుని జీవితంలో మొదటి సారి లైవ్ లో కెమెరాను ఎదుర్కోవాల్సిన స్థితి ఏర్పడింది. 'ఇండియన్ స్కూల్ అఫ్ జర్నలిజం' డీన్ హోదాలో హెచ్.ఎం.టీ వీ లో....'మీడియాలో ఉపాధి అవకాశాలు' అన్న అంశంపై  మంగళవారం సాయంత్రం నాలుగున్నర నుంచి ఐదింటి దాకా మాట్లాడాలని, కొన్ని కాల్స్ తీసుకోవాలని ఆ వ్యవహారాలు చూసే మిత్రుడు చెప్పారు...సోమవారం సాయంత్రం.

ఇక అప్పుడు మొదలయ్యింది దడ, ఎవ్వరికీ చెప్పుకోలేని టెన్షన్. క్లాస్ రూంలో లెక్చర్ దంచమంటే ఇంగ్లిష్ లేదా తెలుగులో ఒక రెండు గంటలు ఏకధాటిగా లాగించగలం కానీ...స్టూడియోలో కూర్చొని షో చేయడం మనకు కష్టమని నా ఉద్దేశం. గతంలో...ఒకటి రెండు ఛానెల్స్ వాళ్ళు...స్టూడియోలకు రమ్మంటే....నేను కుదరదన్నాను. అందుకు కారణాలు రెండు. ఒకటి, కెమెరా ముందు తడబడి పరువు పోగొట్టుకుంటామేమో అన్న భయం. రెండు, కంచిగరుడ సేవ చేయడానికి మనం వ్యతిరేకం.

స్టూడియోలలో కూర్చుని అన్యాయాలు, అక్రమాల మీద ఉపన్యాసాలు దంచుతూ....వెళ్ళే వాళ్లకు ఛానెల్స్ యజమానులు ఒక్క పైసా అయినా ఇవ్వరని, అది వారి తీట వ్యవహారమని తెలిసి నేను అవాక్కయ్యాను ఒక ఏడాది కిందట. అప్పటి నుంచి ఒక్కటే లెక్క పెట్టుకున్నాను...ఏ స్టూడియో కైనా ఫ్రీగా వెళ్లకూడదని. ఛానల్ వాళ్ళేమో...మన సొల్లు కబుర్లతో కాలక్షేపం చేస్తారు...మనమేమో...పనీపాటా మానుకుని...స్టూడియోల చుట్టూ తిరిగి 'ఓహో...గోప్పోడ్ని అయిపోయా..' అని చంకలు గుద్దుకోవాలి?....ఇది మన ఒంటికి పడని ఎవ్వారం. 

స్టేజ్ భయం పోవడానికి ఖమ్మం జిల్లా వైరా స్కూల్లో వక్తృత్వం పోటీలకు పేరు ఇవ్వడం.... పెద్ద చెట్టుకింద పెట్టిన ఆ పోటీలో సారు పేరు పిలవగానే గుండె గుభేల్ మానడం...కాస్త ధైర్యం చేసి వెళ్లి మైకు పట్టుకోగానే బట్టలు తడవడం...మైకు కూయ్...మని విచిత్రమైన పిల్లికూత  చేయగానే గూబ గుయ్యి మనడం....గుండె అరికాల్లోకి జారి...నాలుక పిడచకట్టుకుపోవడం....చెప్పదలుచుకున్న నాలుగు మాటలు నాభి నుంచి బయలుదేరి ఎవడో కావాలని ఆపినట్లు గొంతు దగ్గర జాం అయిపోవడం....ఈ విచిత్ర సంకట స్థితి నుంచి తేరుకునే లోపు కోపిస్టి మాస్టారు మరొక అభ్యర్ధి పేరు పిలవడం....మిత్రులు...'క్లాస్ పరువు తీసావు....ఏమి పుట్టిన్దిరా నీకు' అని తిట్టడం...అన్నీ సోమవారం రాత్రి పడుకునేప్పుడు, మంగళవారం లేచాక గుర్తుకు వచ్చాయి. ఇంతలో...పుత్ర రత్నం స్కూల్ బస్ మిస్సయి ఇంటికి వస్తే....వాడి మీద ఎన్నడూ లేని వెర్రికోపంతో బలప్రయోగం చేసి, విసురుగా బండి తీసి స్కూల్లో దిగబెట్టి వస్తున్నప్పుడు అర్థమయ్యింది...'లైవ్ షో' మనసులో పనిచేస్తున్నదని.


సరే అని రోజుకన్నా ఓవర్ గా ముస్తాబై...హేమ జాగ్రత్తగా సెలెక్ట్ చేసిన డ్రస్ వేసుకుని ఆఫీసుకు బయలు దేరా. టీ.వీ.రంగం లో ఐదేళ్ళ అనుభవం ఉన్న హేమ కొన్ని టిప్స్ ఇచ్చింది, ధైర్య వచనాలు పలికింది. కారు రివర్స్ చేస్తుంటే...ఎన్నడూ లేనిది... వెళ్లి వెనక గోడను గుద్దుకుంది. డామేజ్ తీవ్రత చూద్దామని దిగుతుంటే...పక్కన వున్న టూ వీలర్ కిక్ రాడ్ తగిలి చీలమండలం కణుపు దగ్గర స్వల్ప గాయమయ్యింది. మా గుండె గారు కెమేరాకు భయపడి చస్తున్నారని, అందుకే...ఇలాంటివి జరుగుతున్నాయని బుర్ర వారు చెప్పారు.
ఈ షో గురించి ఆలోచించకుండా....ఎఫ్.ఎం.లో పాటలు వింటూ బయలుదేరా.

ఎలాగోలా సేఫుగా ఆఫీసుకు వచ్చా. సరే...ఇలాంటి ప్రోగ్రామ్స్ లో కొంత డాటా ఇవ్వడం బాగుంటుందని....మా సారు డాక్టర్ కే.నాగేశ్వర్ గారిని చూసి అర్థం చేసుకున్న వాడిని కాబట్టి....గూగుల్ వారి సాయంతో కొన్ని సర్వే లు, మా స్కూల్ ను బాగా ప్రొజెక్ట్ చేయడానికి ఉపకరించే పాయింట్స్ రాసుకున్నా. హేమ ఇచ్చిన ఇడ్లీలు తిందామని డబ్బా తీస్తే...అవి సహించలేదు. ఆ తెల్ల ఇడ్లీలు నాలుగూ...పచ్చని 'సాఫ్ట్ లాఫింగ్ బాల్స్' లా కనిపించి...'హ..హ.హ్హా..' అని నవ్వుతున్నట్లు అనిపించాయి. దెబ్బకు మూత మూసి కంప్యూటర్ ఆన్ చేశాను. సరే ప్రోగ్రాం లో పాల్గొనడం నుంచి  తప్పించుకోలేము కనుక....ఫీడ్ బాక్ తీసుకోవడానికని కొందరు మిత్రులకు మెయిల్ ఇచ్చా....చూడండహూ...అని.

ఈ ప్రోగ్రాం ఫిక్స్ చేసిన సోదరుడు చక్రపాణి అసలే.... యెటకారం డాట్ కామ్. ఏవో సటైర్లు వేస్తూనే వున్నాడు మన మన బట్ట తల, బట్టల గురించి...ఉదయం నుంచి.  మొత్తం మీద చాలా భారంగా మనం ఎదురు చూస్తున్న ఆ ఘడియ రానే వచ్చింది. అప్పుడు నేను అభిమానించే ఒక సీనియర్ జర్నలిస్టు ఆఖరి నిమిషంలో చెప్పారు....కోటు వేసుకోవాలని. నా టెన్షన్ కనిపెట్టిన మిత్రుడు బ్రహ్మచారి గారి సహకారంతో టై, కోటు వ్యవహారం చూసుకుని, కాస్త రంగు అద్దించుకుని...స్టూడియోలో కూర్చుంటే....మళ్ళీ  వైరాలో చెట్టు కింద సీను కళ్ళ ముందు కదలాడింది. నిజానికది అశుభ
సూచకం కానీ....ఇప్పుడు గుండె, నాలుక పెద్ద గొడవ చేయలేదు. ఇది శుభసూచకం. ఎస్...స్టేజ్ ఫియర్ను జయించామన్న మాట. 

యాంకర్ కిరణ్ గారు చాలా ఫ్రెండ్లీ గా ఉండడం....ఇద్దరం కాసేపు ముందే మాట్లాడుకోవడం...వల్ల  అర్థగంట ప్రోగ్రాం రెండు నిమిషాలలో అయినట్లు అనిపించింది. నాకు కూడా మధ్యలో పెద్దగా ఇబ్బంది కలగలేదు. కొత్తవాళ్ళు కెమెరా ముందు పడే తడబాటు ఏదీ నాలో కనిపించలేదని....ఈజ్, ఫ్లో బాగానే వున్నాయని మిత్రులు అన్నారు. హమ్మయ్య....ఒక అనుభవం మిగిలింది. స్టూడియో నుంచి బైటికి వస్తుంటే...వాడు గుర్తుకు వచ్చాడు. సారీ ఫిదెల్...ఈ చెత్త టెన్షన్ వల్ల ఓపిక కాస్త నశించింది. 

బాగుందంటూ ఫ్రెండ్స్ నుంచి ఫోన్లు వచ్చాయి. ప్రోగ్రాం చేసి వెళుతుంటే....గేటు దగ్గర సెక్యూరిటీ గార్డ్ గారు (ఒక పెద్దాయన) బలవంతంగా చేయి గుంజుకొని...'మీరు చాలా బాగా మాట్లాడారు...సార్. బాగుంది,' అని ప్రేమతో అన్నారు. తమ్ముడి ఇంట్లో నిన్న ఈ ప్రోగ్రాం చూసి  ఈ రోజు ఉదయం ఇంటికి వచ్చిన అమ్మ...వస్తూనే....షేక్ హ్యాండ్ ఇచ్చి నుదుటి మీద ముద్దు పెట్టుకుని...'బాగుంది నాన్నా' అన్నది. ఏంటో...అదొక తృప్తి. 

తిరుమల స్కాం లో పాలుపంచుకున్న'ఆ విలేకరి' ఎవరు?

తిరుమలలో టికెట్స్ స్కామ్ లో ఒక 'ప్రముఖ' ఛానల్ విలేకరి హస్తం ఉన్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించినట్లు నిన్న రాత్రి అన్ని ఛానెల్స్ స్క్రాల్స్ (తెర మీద రీల్ లా తిరిగే అక్షరాలు) చూపించాయి. 

ఇది నాకు పెద్ద విచిత్రం అనిపించలేదు. ఆలయాలలో విలేకరుల  అఘాయిత్యాలు అన్నీ ఇన్నీ కావు. కానీ...ఏ ఛానల్ ఆ 'ప్రముఖ' ఛానల్ పేరు గానీ, ఆ విలేకరి మహాశేయుడి పేరు గానీ చూపించలేదు/ చెప్పలేదు. తెలిసిన సత్యాన్ని జనాలకు చెప్పకపోవడం లేదా సమాచారాన్ని తొక్కిపట్టడం కూడా అనైతిక జర్నలిజమే. ఆ విలేకరి స్థానం లో వేరే అధికారో, నాయకుడో ఉన్నాడనుకోండి. 

అప్పుడు మన ఛానెల్స్...రెచ్చిపోయి...వాడి పేరు, ఊరు, భార్య పేరు, ఆస్తుల వివరాలు వంటి సమాచారాన్ని ఆఘమేఘాల మీద అందించే ప్రయత్నం చేస్తాయి. ఆ నిందిత నేతో, అధికారో కనిపిస్తే...గొట్టం మూతి ముందు పెట్టి...'దీనిపై మీరేమంటారు?' అని గద్దించి మరీ అడుగుతాయి. విలేకరి అవినీతి చేస్తే ఎందుకు ఉపేక్షించాలి? తనయుడు...తప్పు చేసినా...తొక్కిపారేసే భారతీయులను మనం తయారుచేయలేమా? 

మొత్తానికి...నిన్న రాత్రి...'ఎవరీ ఛానల్?', 'ఎవరీ విలేకరి?' అన్న దాని మీద దర్యాప్తు మొదలు పెట్టాను. దాని మీద సమగ్ర సమాచారం అందిస్తాను. ఈ లోపు....తిరుమల తతంగం తెలిసిన విలేకరులు...ఆ వివరాలు srsethicalmedia@gmail.com కు మెయిల్ చేస్తే...థాంక్స్. 

Tuesday, June 15, 2010

రాజమహేంద్రి...టేబుల్ టెన్నిస్...భాస్కర్ రామ్....

వేదంలా ఘోషించే గోదావరీ...
అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రీ....
శతాబ్దాల చరితగల సుందరనగరం.....

 'ఆంధ్రకేసరి' సినిమాలోని ఈ పాట...ఎప్పుడు రాజమండ్రి పొలిమేరల్లోకి వెళ్ళినా చెవుల్లో అప్రయత్నంగా మార్మోగుతుంది. శుక్రవారం ఉదయం...రాజమండ్రిలో అడుగుపెట్టగానే...మళ్ళీ అదే భావన కలిగింది. తెలుగు నేల మీద రాజమహేంద్రవరం ప్రాముఖ్యం, ప్రాభవం, గతవైభవ దీప్తులు...గుర్తుకు వచ్చాయి. 

టేబుల్ టెన్నిస్ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ లో పాల్గొన్న నా పదేళ్ళ పుత్రుడికి తోడుగా వెళ్లి, మూడు రోజులు ఉండి, పలు వీధులు తిరిగాక అనిపించింది...ఈ ఊళ్ళో ఏదో ప్రత్యేకత ఉందని. ముఖ్యంగా అక్కడి ఆటో డ్రైవర్స్ నాకు బాగా నచ్చారు. వారు ఎంతో కలివిడిగా...ప్రేమతో మాట్లాడడం...అడిగిన ప్రతి ప్రశ్నకు విసుగు లేకుండా సమాధానం చెప్పడం గమనించాను. ఇక సొంత ఖర్చులతో ఆ టోర్నమెంట్ నిర్వహించిన క్రీడాప్రియులను చూస్తే ఇంకా ముచ్చటేసింది.

తమ ఎదుగుదలకు తోడ్పడిన రంగం ఋణం తీర్చుకోవడానికి ఏదో ఒకటి చేయాలనుకునే వారు అరుదుగా కనిపిస్తారు. రాజమండ్రి ఎందరో టీ.టీ.క్రీడాకారులను తయారుచేసింది. ఈ ఆట వల్లనే అక్కడ చాలా మందికి మంచి ఉద్యోగాలు వచ్చాయి. గత ఐదేళ్లుగా జాతీయ ఛాంపియన్ గా ఉన్న ఆచంట శరత్ కమల్ కుటుంబం కూడా ఇక్కడి నుంచి చెన్నై వలస వెళ్ళింది. శరత్ తండ్రి శ్రీనివాసరావు, బాబాయ్ (చిన్నాన్న) మురళి గారు ఈ క్రీడ వల్లనే జీవితంలో స్థిరపడి...తమ అకాడమీ లో అక్కడ ఆణిముత్యాలను తయారు చేస్తున్నారు.

నేను గత ఇరవై ఏళ్ళలో ఎన్నో టోర్నమెంట్లు కవర్ చేశాను, చూశాను....కానీ ఇంత అద్భుతంగా...ఒక రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ నిర్వహించడం మొదటి సారి చూశాను రాజమండ్రిలో. అక్కడి టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు, క్రీడాభిమానులు దాదాపు వారం పది రోజులు శ్రమించి రాష్ట్రం నలు మూలల నుంచి వచ్చిన 400 మంది ఆటగాళ్ళు, అంపైర్లకు ఆతిథ్యమిచ్చారు. ఆర్గనైజర్స్ లో ఉన్న టీం స్పిరిట్ చూస్తే...ఆనందం అనిపించింది. టౌన్ హాల్ లో ఆడే ఆటగాళ్ళు, తమ పిల్లలను అక్కడ ఆడిస్తున్న వారు...మన పని అనుకుని అన్ని ఏర్పాట్లు చేశారు. ఆదరించారు. మనకేమి దురద...అనుకోకుండా....ఇంకా పెద్ద స్థాయి పోటీలను నిర్వహించడానికి తాము సిద్ధం అని వారు ప్రకటించారు.

నిర్వాహకులు అందరికీ...మంచి వసతి, భోజన సౌకర్యం కల్పించారు. కొన్ని చోట్ల ఆర్గనైజర్స్ పిల్లలకు మంచి నీళ్ళైనా ఏర్పాటు చేయరు. అలాంటిది...వీరు పిల్లలకు హార్లిక్స్, వేసవి తాపం తట్టుకోవడానికి శీతల పానీయాలు ఉచితంగా అందజేశారు. పేపర్ మిల్ల్స్ లో నిర్వహించిన ఈ పోటీలలో విజేతలకు భారీ స్థాయిలో నగదు బహుమతులు ఇచ్చారు. క్వార్టర్ ఫైనల్స్ కు చేరిన క్రీడాకారులకు కూడా ఒక షీల్డు, క్యాష్ బహుమతి ఇచ్చారు. మెన్స్ విభాగం లో విజేత సోమ నాథ్ ఘోష్ కు....పది వేల రూపాయల ప్రైజ్ ఇవ్వడం విశేషం. సోమ నాథ్ ఘోష్ (రైల్వేస్), కృష్ణకిరీటి (పోస్టల్) మధ్య ఆద్యంతం రసవత్తరంగా జరిగిన ఈ పోటీ జీవితంలో చాలా రోజులు గుర్తు ఉంటుంది.
క్యాడెట్ బాయెస్ సెమీ ఫైనల్స్ కు చేరిన మా ఫిదెల్ కు ఒక ప్రైజు, ఒక వెయ్యి రూపాయల బహుమతి వచ్చాయి. ఇక్కడ డబ్బు ముఖ్యం కాదు గానీ...ఆటగాళ్లను ప్రోత్సహించాలన్న నిర్వాహకుల భావన అభినందనీయమైనది. 

బహుమతి ప్రదానం చేసిన స్థానిక ఎం.పీ.ఉండవల్లి అరుణ్ కుమార్ క్లుప్తంగా చేసిన తన ప్రసంగంలో...పిల్లలను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను అభినందిస్తూ ఒక రెండు ముక్కలు చెప్పడం విశేషం. దేశం కోసం ఏదో చేయాలన్న తపనతో....పిల్లలను ఇలాంటి ఆటల్లో పెట్టి...ఎలాగైనా బాగా ఆడించాలనుకునే తల్లిదండ్రుల బాధలు, వేదనల గురించి మనం పుంఖానుపుంఖంగా రాసుకోవచ్చు. ఇక...ఈ టోర్నమెంట్ లో ఒక వ్యక్తి గురించి తప్పనిసరిగా చెప్పి తీరాలి. ఆయనే...వి.భాస్కర్ రామ్ గారు.

బాస్కర్ రామ్ గారు స్థానికంగా ఒక చార్టెడ్ అకౌంటెంట్. ఆయన ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షుడు. సాధారణంగా టోర్నమెంట్ అంటే...నిర్వాహకులు చీకాకుగా వుండి....హడావుడి పడుతూ...అందుబాటులో లోకువగా ఉన్నవారిని తిట్టి బీ.పీ.పెంచుకుంటూ ఉంటారు. దానికి భిన్నంగా...భాస్కర్ రామ్ గారు ఎప్పుడూ ప్రశాంతంగా...నవ్వుతూ కనిపించారు. అదే స్థాయిలో కూల్ గా ఉండే...టీ.టీ.అసోసియేషన్ కార్యదర్శి ఎస్.ఎం.సుల్తాన్ గారు నాకు రామ్ గారిని పరిచయం చేశారు. అప్పుడు తెలిసింది...లోకల్ గా CCC అనే ఛానల్ ను రామ్ బృందం నిర్వహిస్తున్నదని.

మీడియాలో పరిస్ధితులు, 'ది హిందూ'లో కూడా పడిపోతున్న విలువలు, ఛానెల్స్ మధ్య పోటీ...వంటి అంశాల గురించి రామ్ వివరించారు. తాను ఇప్పటికీ...అభిమానించే పత్రిక 'ది హిందూ' అని ఆయన చెప్పారు. భాస్కర్ రామ్ తన చేతి నుంచి ఈ టోర్నమెంట్ కోసం చాలా డబ్బు ఖర్చు చేసి ఉంటారు. లేకపోతే ఇంత ఘనంగా నిర్వహించడం సాధ్యంకాదు. ఇప్పుడు మన క్రీడారంగానికి కావలసింది...ఇలాంటి క్రీడాపోషకులే.
(నోట్: సినీ తారల క్రికెట్ సందడి, ప్రపంచ కప్ ఫుట్ బాల్ పోటీల వల్ల ఈ టోర్నమెంట్ కు ప్రెస్ లో సరైన ప్రాధాన్యం లభించలేదని భావించి...ఇక్కడ పోస్ట్ గా ఇస్తున్నాను. మీడియా సంబంధం కాని దాని గురించి ఎందుకు రాశావ్....అని అడగవద్దని మనవి.) 

Monday, June 14, 2010

నేతల విగ్రహాల ధ్వంసంపై మీడియా ఇంత హడావుడి చేయాలా?

ఈ రోజు 'ఈనాడు' పేపర్ లో ఐదో పేజీలో...'ఎన్టీఆర్ విగ్రహం పాక్షికంగా ధ్వంసం' అన్న శీర్షికతో ఒక వార్త వచ్చింది. ఆరు లైన్లతో ఉన్న రెండు కాలమ్స్ వార్త అది. దాదాపు ఆరు సెంటీమీటర్ల పొడవైన ఫోటో కూడా వాడారు. ఎన్టీఅర్ విగ్రహం చేతి వేళ్ళు మూడు తొలగించిన దృశ్యాన్ని ఎర్రటి సర్కిల్ లో చూపారు. 

"దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఅర్ విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేసిన సంఘటన మెదక్ జిల్లా మెదక్ మండలం మాచారంలో శనివారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన పోచయ్య, రామకిష్టయ్య, శేకయ్య విగ్రహం ధ్వంసం చేసి పారిపోయారని గ్రామస్థులు చెప్పారు. ఆదివారం రాత్రి నిందితులను ముగ్గురినీ అదుపులో తీసుకుని రిమాండ్ కు తరలించామని పోలీసులు తెలిపారు." --ఇందండీ వార్త. 

మొన్నీ మధ్య అదేదో ఊళ్ళో గాంధీ గారి మెడలో ఎవడో చెప్పుల దండ వేశాడట. అంతకు ముందు అంబేద్కర్ విగ్రహానికి ఎవడో నల్ల రంగు పూసినట్లు వచ్చిన వార్త కూడా చదివాను. ఈ మధ్య కాలంలో పొట్టి శ్రీరాములు విగ్రహాలు చాలాచోట్ల ఇలాంటి దాడికి గురయ్యాయి. అసలు ఇలాంటి సంఘటనలకు ...ఏదో కొంపలు మునిగినట్లు పేపర్లు, ఛానెల్స్ ప్రాముఖ్యం ఇవ్వాలా?
గాంధీ గారి విషయంలో అయితే ఛానెల్స్ పిచ్చెక్కినట్లు రోజంతా చూపి...నానా హడావుడి చేస్తాయి. ఇలాంటి విగ్రహాలు ధ్వంసం అయినప్పుడు ఏమి జరుగుతుందో చూడండి.

ఎవడో...తాగుబోతో, ఉన్మాదో, తిక్కలోడో...కావాలని కసితోనో, మత్తు మీదనో ఇలా కనిపించిన విగ్రహాన్ని 'ధ్వంసం' చేస్తాడు. విగ్రహంలో ఒకటి రెండు వేళ్ళు తొలగిస్తేనో, ముక్కు చెక్కేస్తోనో మన లోకల్ విలేకరి మిత్రులు వెంటనే...రంగంలోకి దిగుతారు. ఫోటోలు తీస్తారు. అది పొట్టి శ్రీరాములు గారిదైతే....కుల ప్రాతిపదికన...లోకల్ వ్యాపారులు కొందరు కుల సంఘం తరఫున రంగప్రవేశం చేయడం చాలా చోట్ల నేను చూశాను. గాంధీ గారిదైతే....కాంగ్రెస్ వాళ్ళు, సమర యోధులు అక్కడ చేరుకుంటారు. 


బతికున్న జనం మీద (ముఖ్యంగా ఒంటరిగా తిరిగే ఆడ పిల్లల మీద) దాడులు జరుగుతుంటే...పెద్దగా మాట్లాడని జనం....ప్రాణంలేని రాతి విగ్రహాలు 'ధ్వంసం' అయ్యేసరికి పొలో మంటూ అక్కడికి చేరుకుంటారు. నిరసన తెలిపి, ఒక ఇరవై లీటర్ల పాలు తెప్పించి...పాలాభిషేకం చేస్తారు, ఆ విగ్రహాన్ని పూల దండలతో ముఖం కూడా కనిపించనంతగా ముంచేస్తారు. ఆ తర్వాత ఆ విగ్రహం మొహం ఒక్కడైనా చూడడు. 

మొత్తం మీద మన విలేకరి మిత్రులకు మూడు వార్తలు దొరికాయి--ఇలాంటి ఒక ఘటనతో. మొదటి రోజు--విగ్రహం ధ్వంసం. రెండో రోజు--నిరసన. మూడో రోజు--అభిషేకం, దండలు. నా మీద దయతలిచి పోనీలే...అని ఎవరైనా ప్రధాన మంత్రి పదవి ఇస్తే....ఈ విగ్రహాల విషయంలో నా ప్రోగ్రాం ఇలా వుంటుంది.


1) ఇక మీదట ఎక్కడా ఎవరి విగ్రహాలూ ఆవిష్కరించకూడదు. ఈ రూల్ ఉల్లంఘిస్తే....ఐదేళ్ళు జైలుకు పోతారు.
2) ఎవరైనా విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలంటే....వారు కొన్ని నిబంధనలు పాటించాలి. ఆ వూళ్ళో ఒక వెయ్యి వేప చెట్లు ఉండడం...వేస్ట్ మానేజ్మెంట్ వ్యవస్థ ఉండడం...వంటి పర్యావరణ సంబంధ నిబంధనలవి.
3) ఊరికి రెండు విగ్రహాలకు మించి ఉండకూడదు. ప్రస్తుతం ఊళ్ళో...ఒక పది  విగ్రహాలు వుంటే...అందులో రెండింటిని ఎంచుకోవడానికి స్థానికంగా రిఫరండం నిర్వహించి....మిగిలిన విగ్రహాలను రాత్రికి రాత్రి పొక్లైన్ తో కూల్చిపారేస్తాం.
4) సారా తాగని ఊళ్ళో మాత్రమే గాంధీ గారి విగ్రహం ఉంటుంది. ఊళ్ళో పది వైన్ షాప్స్, మరొక నలభై బెల్టు షాప్స్ వుంటే...అక్కడ ఉన్న గాంధీ విగ్రహాన్ని వెంటనే కూల్చిపారేయడమే. గాంధీ విగ్రహం కావాలా? మందు కావాలా? గ్రామస్థులే తేల్చుకోవాలి.
5) అంటరానితనం, రెండు గ్లాసుల పధ్ధతి, దళితుల దేవాలయ ప్రవేశ నిషిద్ధం అమల్లో ఉన్న గ్రామాలలో గాంధీ, వై.ఎస్. సహా అన్ని విగ్రహాలను కూల్చేయడమే. ఈ మహానుభావులు చెప్పినది పాటించకుండా విగ్రహాలు ఎందుకండీ?

6) కార్పోరేటర్స్, ఎం.ఎల్.ఏ.ల విగ్రహాలు తీసిపారేయ్యడమే.
7) ఏదో విగ్రహాన్ని ఎవడో తలమాసినోడు 'ధ్వంసం' చేస్తే...అది పత్రికలు/ఛానెల్స్ వార్తగా వేయకూడదు. ఈ అనవసరమైన సమాచారం చేరవేసి...ఇతర ప్రాంతాల వారిలో అపోహలు కలిగించినందుకు గానూ ఆ వార్త రాసిన సారును, వేసిన సారును అరెస్టు చేస్తారు.
8) నేతల జయంతులు, వర్ధంతుల నాడు...నివాళి అర్పించి, దండ వేసి...ప్రెస్ కోసం నేతలు ఫోటోలు దిగాలి కాబట్టి జిల్లా కేంద్రం లో మాత్రం కొన్ని విగ్రహాలు ఉంచుతాం. అన్ని ఊళ్లలో, గల్లీలలో ఈ సభలు వుండవు, నివాళి అర్పించాలి...అనుకున్న వాళ్ళు ఒక్క చోట చేరి నివాళి అర్పించాలి.

అదీ సంగతి. నిజమైన నేతలు....జన హృదయాలలో ఉంటారు. ఇలా నచ్చినోడి విగ్రహమల్లా పెడుతూ పోవడం దండగ. ఎంతమంది....నిజంగా ఈ విగ్రహాలను చూసి స్ఫూర్తి పొందుతున్నారు? 


నన్నడిగితే---"మీరు బస్టాండ్ బైటికి రండి. లెఫ్ట్ లో డైరెక్ట్ గా వస్తే....రాజీవ్ విగ్రం వస్తుంది. అక్కడి నుంచి కుడికి తిరిగి నేరుగా వస్తే....ఎన్టీఆర్ విగ్రహం దాటాక గాంధీ విగ్రహం వస్తుంది..." అని లాండ్ మార్క్స్ గా చెప్పుకోవడానికి తప్ప ఈ విగ్రహాలతో నయా పైసా ఉపయోగం ఉందా? అన్నది అంతు చిక్కని ప్రశ్న.

Thursday, June 10, 2010

ముగ్గురు ఉత్తమ యాంకర్లకు చిరు బహుమతులు

'ఉత్తమ యాంకర్స్' గా మీరు ఎంపిక చేసిన ముగ్గురికీ (రోజా, సౌజన్య, రజనీకాంత్) మొత్తంమీద చిరు కానుకలు అందజేశామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము.  ఇవి నిజంగానే చిరు కానుకలు కానీ...ఒక కొత్త సంప్రదాయానికి పెద్ద ఆరంభం అని అనిపించింది.

వీళ్ళ ఫోన్ నంబర్స్ పట్టడం, వీరికి ఉపకరిస్తాయని అనిపించే పుస్తకాలు వెతకడం, ప్రశంసా పత్రం కంపోజ్ చేయించడం, వాళ్ళతో ఫోన్ లో మాట్లాడి అపాయింట్ మెంట్ తీసుకుని వారి ఆఫీసులకు వెళ్లి ఒక పూల గుత్తితో పాటు ఇద్దామనుకున్నవి ఇచ్చిరావడం....ఈ కార్యక్రమాలకు ఒక రోజు పట్టింది. 

మంగళవారం నాటికి మూడు ఫోన్ నంబర్స్ దొరికాయి. ఆ రోజు ఫోన్ చేస్తే...సౌజన్య గారు గుంటూరులో ఉన్నానని, మర్నాడు వస్తానని చెప్పారు. కాబట్టి బుధవారం నాటికి కార్యక్రమాలు వాయిదా వేసుకున్నాను. ఆమె వచ్చి ఉంటారు కదా...అని సాయంత్రం అన్ని ఏర్పాట్లూ చేసుకుని హేమ, నేను ముందుగా i-news ఆఫీసుకు వెళ్లాం. ముందుగా ఫోన్ చేసాం కాబట్టి...రోజా గారు బైటికి వచ్చి బొకే, చిరు కానుక తీసుకున్నారు. పాపం...ఆమె టీ కోసం లోపలకు రమ్మన్నారు కానీ....మేము సున్నితంగా తిరస్కరించాల్సి వచ్చింది. 

'మరోలా అనుకోకండి. మేమేమో యాజమాన్యాల మీద ఎక్కువగా రాస్తున్నాం. భవిష్యత్తులో రాస్తాం. అప్పుడు సమాచారం మీరు ఇచ్చారేమో అన్న అనుమానం కలుగుతుంది కాబట్టి...మీ ఆఫీసులోకి వచ్చి మీ ఆతిధ్యం స్వీకరించలేక పోతున్నాం," అని ఫోన్ లో రోజా గారికి చెప్పాం. ఆమె బ్లాగ్ రెగ్యులర్ గా చదువుతున్నారని అర్థమయ్యింది. 

TV-9 స్టార్ యాంకర్ రజనీకాంత్ కు ఫోన్ చేస్తే...రాత్రి 9.30 తర్వాత కలవవచ్చని చెప్పారు. సరే కదా...అని ఆ Mahaa-TV ఆఫీసుకు వెళ్ళాం. దాని దారి తెలుసుకోవడానికి చాలా కష్టమయ్యింది. ఒక పదిహేను సార్లు ఫోన్ చేసాం...సౌజన్య గారికి. N-TV లో ఉండగా....రిపోర్టర్ గా హేమకు, యాంకర్ గా సౌజన్య గారికి పరిచయం ఉంది. హేమా ఫోన్ చేసినా లాభం లేక పోయింది. సెక్యూరిటీ మిత్రుడు చెప్పాడు...మేడం ఈ రోజు రావడం లేదని. రాత్రికి సౌజన్య గారు కాల్ బాక్ చేసి...సారీ చెప్పారు. 

హేమ, నేను దగ్గరుండి మరీ కట్టించిన అందమైన బొకేలు పాడవుతాయి కదా....అనే బాధ కాసేపు తొలిచింది. ఇక ఈ ఉదయాన్నే...ఎస్.ఎం.ఎస్.ల మీద వ్యవహారం నడిపాను. ఉదయం 8.30 గంటలకు రజనీకాంత్ రమ్మన్నారు. కానీ...తాను  సాయంత్రం 4 గంటల దాకా...రానని సౌజన్య మెసేజ్ పెట్టారు. ఇక లాభం లేదని...ముందుగా TV-9 కు వెళ్లి రజనీని కలిసి చిరు కానుక అందజేసి...ఒక రెండు నిమిషాలు మాట్లాడి...అటు నుంచి అటు Mahaa-TV కి వెళ్ళాను. అక్కడ సెక్యూరిటీ లో ప్యాక్ ఇచ్చి...సౌజన్య గారికి మెసేజ్ పెట్టి...గట్టిగా ఊపిరి పీల్చుకుని ఇంటికి వచ్చాను. ఇదొక తృప్తి కరమైన సంఘటన/ అనుభూతి. 

ఈ పాట్లు తెలుసుకుని...'అన్నా...అంతచేసినోడివి...ఒక ప్రజెన్టేషన్ ఫంక్షన్ ఏర్పాటు చేయవచ్చు కదా...' అని సోదరుడు క్రాంతి అన్నాడు. నిజంగా నా మదిలో అదే ఉంది. బ్లాగ్ ద్వారా.....మరికొన్ని పోటీలు నిర్వహించి...ఒక మంచి వాతావరణం ఏర్పరచాలని, ప్రతిభావంతులను ప్రోత్సహించాలని అనుకుంటున్నాను. అందుకే....ముగ్గురికీ ఈ కింది మెసేజ్ ఇచ్చాను-క్రాంతి ఫోన్ రాకముందే. 
"It is the smallest prize but the greatest beginning."

TV-9 లో భారీగా బదిలీలు...జిల్లా రిపోర్టర్ లకు షాక్...

తెలుగులో నంబెర్ వన్ ఛానల్ TV-9 లో భారీగా బదిలీలు జరిగాయి. ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేనివిధంగా...జిల్లా రిపోర్టర్లను పెద్ద ఎత్తున మార్చారు. ఈ నిర్ణయం....జిల్లాలలో అప్పటికే 'బాగా' స్థిరపడిన పలువురు రిపోర్టర్ లకు ఒక షాక్ ఇచ్చింది. 

మొత్తం మీద 14 మంది జిల్లా రిపోర్టర్ లతో పాటు హైదరాబాద్ బ్యూరో లో ఆరుగురు రిపోర్టర్లను, ఆరుగురు సబ్ ఎడిటర్లను TV-1 కు అటాచ్ చేసారు. చంద్రకాంత్, భావన, ఫణికుమార్, జయప్రకాశ్ వంటి రిపోర్టర్లు ఇక TV-1 లో పనిచేస్తారు. బదిలీ అయిన జిల్లా రిపోర్టర్ల వివరాలు ఇలా వున్నాయి.

రిపోర్టర్ పేరు-----బదిలీ కాకముందు-----బదిలీ అయ్యాక 
నాగిరెడ్డి------------అనంతపురం-----------నిజామాబాద్
రాజు----------------
నిజామాబాద్-----------అనంతపురం
రేవన్ రెడ్డి------------నల్గొండ---------------వరంగల్

పెద్దేష్----------------వరంగల్---------------నల్గొండ
శ్రీనివాస్------------ఆదిలాబాద్------------కర్నూల్
లక్ష్మికాంత రెడ్డి-------కర్నూల్-------------ఆదిలాబాద్
గిరిధర్----------------మెదక్----------------ప్రకాశం
ఫైరోజ్----------------ప్రకాశం---------------మెదక్
రాజు----------------ఏలూరు--------------చిత్తూరు
మూర్తి--------------చిత్తూరు--------------ఏలూరు
నరసింహారావు-----తిరుపతి------------విజయనగరం 
శేషగిరిరావు------విజయనగరం---------తిరుపతి
నాగరాజు----------గుంటూరు------------శ్రీకాకుళం
(పేరు తెలియదు)----
శ్రీకాకుళం----------గుంటూరు

ఈ బదిలీలు చూస్తే కొందరిని పొమ్మనలేక పొగపెట్టినట్లు వుందని భావిస్తున్నారు. మీడియా మార్కెట్ బాగోలేక పోవడం...టైం కు జీతాలు చెల్లిస్తున్న ఛానెల్స్ లో TV-9 కూడా ముందు ఉండడంతో....బదిలీ అయిన రిపోర్టర్లు తమను బదిలీ చేసిన ప్రాంతాలలో చేరేందుకు సమాయత్తమవుతున్నారు. అయినా....సొంత వూరు వదలడం ఇష్టం లేని ఒక ముగ్గురు, నలుగురు రిపోర్టర్లు వేరే ఛానెల్స్ లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలిసింది. ఈ బదిలీలు ఈ వారం నుంచే అమల్లోకి వస్తాయి.

Wednesday, June 9, 2010

తెలుగు మీడియాలో బాసుల స్వరూప స్వభావాలు- పార్ట్ II

"ఐడియాలు ప్రపంచాన్ని శాసిస్తాయి," అని నమ్ముతూ.. గత పది పదిహేనేళ్ళుగా కనిపించిన ప్రతివాడినీ కాస్త పరిచయం కాగానే...'మీ బాస్ ఎవరు? అతనెలా ఉంటాడు?' అని అడుగుతున్నాను. "మా బాస్ అద్భుతమైన మనిషి, ఐడియాలను స్వాగతిస్తాడు. కొత్త ఆలోచనలను ప్రోత్సహిస్తాడు," అని చెప్పినవాడు ఒక్కడూ కనిపించలేదు. "ఆయన చెప్పింది చేస్తే...మన జోలికి రాడు. వాడితో మనకెందుకు, మనశాంతి కరువు," అన్న వాళ్ళే ఎక్కువ. 

నిజమే, బావిలో కప్పలా ఆలోచించాల్సిన పనిలేదు. అన్ని రంగాలలో బాసుల రూపురేఖా విలాసాలు ఒక్కటే అయినా అందర్నీ ఒకే గాటన కట్టడం...అశాస్త్రీయం అన్నది కూడా నిజమే. అయినా...మీడియాలో...బాసులందు పుణ్య బాసులు వేరు అనుకోవడానికి లేకుండా వుంది తాజా పరిస్థితి. 

బాసులు యాసులైతే...సృజనాత్మకత ఎలా దెబ్బ తింటుందో, కింది ఉద్యోగులు ఎలా మానసికంగా దెబ్బతింటారో...నిన్న మాట్లాడుకున్నాం. 'నమస్తే...సర్..' అని కనిపించిన ప్రతి సారీ వినయంగా అనలేదని, తన గుడ్డి ఐడియాలు....బాగున్నాయని పొగడలేదని....ఎంతో ప్రతిభగల వాళ్ళను మీడియా బాసులు పనికిరాని వారిగా ముద్రవేసి ఇళ్ళకు పంపించిన సంఘటనలు చాలా వున్నాయి. ఈ బాధలు పడలేక మంచి జర్నలిస్టులు పూర్తిగా ప్రొఫెషన్ నుంచి తప్పుకుని....చిన్నా చితకా పనులు చేసుకోవడం పరోక్షంగా వృత్తిలో నాణ్యతను దెబ్బతీసింది. ఇలా దెబ్బతిన్న సీనియర్లు ఎక్కడ కనిపించినా....తరిగిపోతున్న విలువలు, జర్నలిజంలో అనైతికత గురించి వాపోతుంటారు. మీడియా లో నిర్దిష్టమైన 'ప్రమోషన్ పాలసీ' ఉండకపోవడం వల్ల పెద్ద చిక్కు వస్తున్నది. ఆ తీవ్రత దృష్ట్యా నే ఈ పోస్టులు రాయాల్సివస్తున్నది. 

ఇతర రంగాలో బాసులు బుర్రతక్కువ వాళ్ళు అయితే, కిరాతకులైతే......నష్టం పరిమితంగా ఉంటుంది. మహా అయితే...వారి నిర్ణయాల వల్ల ఆర్థిక నష్టం జరుగుతుంది. కానీ ఒక సిరా చుక్క...వేన వేల మెదళ్ళకు కదలిక నిస్తుంది. ఇక్కడ నాణ్యత లేని బాసుల వల్ల సమాజం మీద తీవ్ర ప్రభావం ఉంటుంది. సమాజం సెన్సిటివిటీని వీరు తమ చెత్త నిర్ణయాలతో చంపేస్తారు, విలువలను మార్చేస్తారు, 'ఈ రోజుల్లో ఇది మామూలే...నీ పిచ్చి గానీ,' అనే ధోరణి పెంచుతారు. ఇది ఇప్పటికే జరుగుతున్నది. ఈ పేరా మళ్ళీ చదివి ఒక క్షణం ఆలోచించండి...సమస్య తీవ్రత మీకు అర్థమవుతుంది. ఇది కనిపించని మహా ఉపద్రవమని మీకు ఇంకా ప్రభావశీలంగా ఎలా చెప్పాలో తెలియడంలేదు.


ఈ రోజు కష్టపడకుండా...ప్రతిభ వల్ల కాకుండా...కులాన్నో, ప్రాంతాన్నో, బంధుత్వాన్నో ఆసరాగా చేసుకుని బాసై కూర్చున్న వాడి వల్ల మీడియా రంగంలో జరిగే నష్టం గురించి చూద్దాం. మీడియా ఏమిటి ఇలా అఘోరించింది? అని మాటల్లో, రాతల్లో కన్నీరు కార్చేవారు తేలిగ్గా తీసుకోకుండా....అర్థం చేసుకోవాల్సిన విషయం. 

పునాది గట్టిగా లేని, వృత్తిలో పెద్దగా నలగని బుర్రతక్కువ బాసు త్వరితగతిన ఫలితాలు ఆశిస్తాడు. అంతా...క్విక్ గా కావాలి. వాడు యాజమాన్యాన్ని సంతృప్తి పరచాలి. అప్పుడుగానీ...వాడి పరపతి పెరగదు. ఎథిక్స్ వంటివి పట్టించుకుంటే...కుదరదు. ఇది అన్ని రంగాలకూ వర్తిస్తుంది. మీడియాలో ఇది ఇంకా ఎక్కువ ప్రమాదకర స్థాయికి చేరింది. ఇందుకు ఒక కేస్ స్టడీ ఇక్కడ ప్రస్తావనార్హం.

ఒక రియల్టర్ పెట్టిన ఛానల్ అది. అందులో ఒక 30, 35 ఏళ్ళ మీడియా అనుభవం ఉన్న సీనియర్ ఒకరు. ఆయన పేరు A అనుకుందాం. చాలా కష్టపడి కింది నుంచి పైకి వచ్చిన వ్యక్తి ఆయన. ఇంకొకడు...ఒక 16 ఏళ్ళ సీనియర్. వీడు B. నిజాయితీపరుడైన ఈ A రోజూ ఆఫీసుకు వెళ్లి...అన్ని పేపర్స్ చదివి...టీ.వీ.లు చూసి...సొంత ఆలోచనలు జోడించి....ఒక 20, 30 స్టోరీ ఐడియాలు లిస్టు అవుట్ చేస్తాడు. అందులో...ప్రజోపయోగమైన అంశాలు చాలా వుంటాయి. అది నికార్సైన జర్నలిజం. 

మరీ అంత పెద్దగా కష్టపడకుండా....అప్పటికే అక్రమంగా సంపాదించి....'tricks of the trade' బాగా వంట పట్టించుకున్న B ఆఫీసుకు వచ్చి నేరుగా ఛైర్మన్ గారి చాంబర్ కు వెళ్లి...కాసేపు జోగి..."ఈ రోజు చూడండి...సార్...అద్భుతమైన ఐడియా వచ్చింది..." అని చెప్పి వస్తాడు. ముద్దుల మీదనో, హీరోయిన్స్ వేసుకునే లో దుస్తుల మీదనో పచ్చి బూతు ప్రోగ్రాంలు చేసి ఛైర్మన్ కు, జనాలకు కనువిందు కలిగిస్తాడు. సహజంగానే ఇప్పటి సమాజం B బెటర్ అని అంటుంది. ఇలాంటి B లు మీడియాను శాసిస్తునందువల్లనే...మీడియాలో విపరీత ధోరణులు పెచ్చరిల్లుతున్నాయి. పొగడ్తలతో యాజమాన్యాలను ఖుషీ చేసే ఈ రకపు జర్నలిస్టు జాతి విస్తరిస్తున్నది.

అలాగే...మరొక ప్రముఖమైన ఛానెల్ లో చేరి బాసు స్థాయికి ఎదిగి ఒక్క సారిగా నేలకూలిన ఒక కేబుల్ టీ.వీ.రిపోర్టర్, చెన్నై లో చిన్న పాటి ఉద్యోగి నుంచి ఛానల్ లో జనాలను వేధించుకు తినే స్థాయికి ఎదిగిన మరొకడు...ఇలా ప్రొఫెషనలిజం లేని వారి వల్ల మీడియాకు, సమాజానికి జరుగుతున్న నష్టం కొలవడానికి వల్ల కాదు. 

ఏ పనీ చేయలేని చెత్తగాళ్ళ చివరి మజిలీ...రాజకీయాలు...అంటారు. ఆ నానుడి మారింది...అలాంటి వాళ్ళ తక్షణ మజిలీ మీడియాగా తయారయ్యింది. ఇలాంటి మీడియా బాసులను ఉద్యోగులు ఎలా తట్టుకోవాలో...మరొక పోస్టులో చూద్దాం.

Tuesday, June 8, 2010

TV-1 లో మతిలేని....చెత్త ప్రోగ్రాం....'మారో..మారో..మస్కా మారో'

మీరు రోడ్డు మీద యథాలాపంగా వెళుతూ ఉంటారు. చెట్టుపక్కన కోతివేషం వేసుకుని దాక్కున్న ఒక కొండముచ్చు లాంటి మనిషి ఒక్కసారిగా మీ మీదకు దూసుకొస్తాడు. మీరు భయపడి దూరంగా పోతుంటే...వాడు కోతి విగ్గు తీసి వెకిలిగా నవ్వి కెమెరా వైపు చూపిస్తాడు. 

మీరు బిజీగా ఫుట్ పాత్ మీద నడుస్తుంటారు. మీ ఆలోచనలు, సమస్యలతో మీరుంటారు. ఒకడు ఒక బకెట్ తీసుకుని మీ మీదకు అందులో ఉన్నది గుమ్మరించేందుకు దూసుకుని వస్తాడు. రావడమేమిటి...ఆ బకెట్ ను మీ మీదికి వచ్చి గుమ్మరిస్తాడు. అది ఖాళీ బకెట్, అందులో ఏమీ వుండదు కానీ....ఎవడో బకెట్ తీసుకుని మీదికి వస్తే గుండె జలదరిస్తుంది కదా!

రోడ్డుపక్కన ఒకడు షాక్ కొట్టినట్లు గిలగిలలాడుతూ ఉంటాడు. జాలితో మీరు తనను ఆదుకునేందుకు వెళ్తారు...ఎంతో ఆతృతతో. వాడు...కాసేపు ఉలకడు, పలకడు. మీరు కంగారు పడుతుంటే...ఒక్క సారి ఇకిలిస్తూ లేస్తాడు.

ఇవి, ఇవి కాక ఇంకొన్ని ఇలాంటి వెకిలి చేష్టలు, భయంగొలిపే, గుండె వేగం పెంచే ప్రోగ్రామ్స్ చేసి ప్రసారం చేస్తున్నది...TV-9 అనుబంధ ఛానెల్ TV-1. గతంలో తెలుగు ఛానెల్స్ ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసి చాలా అపవాదుపాలయ్యాయి. జెమిని లో...ఇలాంటి క్రూడ్ జోక్ కు బలైన ఒక సీనియర్ సిటిజన్ మాట్లాడుతూ....''బాబూ...నేను హార్ట్ పేషెంట్ ను. నువ్వు చేసిన దానికి నాకేమైనా అయితే..." అని అడిగారు. అయినా....మనోళ్ళకు సిగ్గూ లేదు, ఎగ్గూ లేదు.

ఇందాక ఒక మిక్కీ మౌజ్ చెట్టు చాటునుంచి ఒక్క ఉదుటున దూకడంతో...అటు వైపు తల్లిదండ్రులతో వెళుతున్న ముగ్గురు చిన్న పిల్లలు జడుసుకున్నారు. వాళ్ళు కెమెరా...వారి వైపు చూపలేదు కాబట్టి...ఆ పిల్లల ఫీలింగ్ చూడలేక పోయాం, కానీ ఆ భయాన్ని ఊహించవచ్చు. జనాన్ని ఇలా భయపెట్టి చంపే...ప్రోగ్రామ్స్ ను నిలిపివేసి...ఆ చెత్త పనులు చేస్తున్న యాక్టర్స్, ప్రోగ్రాం హెడ్ లను అరెస్టు చేసి జైల్లో వేయాలి.