Friday, May 31, 2019

ఎన్నికలు: మీడియా బాద్షాలు.. బద్మాష్ లు..

నిష్పాక్షికత, సత్యసంధత- ఈ రెండూ జర్నలిజానికి కీలకం. ఈ రెండింటి కోసం ఇప్పటి మీడియాలో హై పవర్ భూతద్దాలు పెట్టుకుని వెతికినా కనిపించవు. కట్టుకథలకు, పెట్టుబడికి పుట్టిన విషపుత్రికలు పత్రికలని మహా కవి అన్న మాట మన పత్రికాధిపతులు, ఎడిటర్లు, జర్నలిస్టులు ప్రతిరోజూ నిరూపిస్తుండబట్టి వృత్తి గౌరవం బొత్తిగా లేని వృత్తుల జాబితాలో జర్నలిజం ఏనాడో చేరిపోయింది.  ఇటీవల జరిగిన ఎన్నికల్లోనైతే మీడియా ఘోరంగా బరితెగించి పరువు ఇంకా పోగొట్టుకుంది.

ప్రధాన పత్రికలు బాహాటంగా ఏదో ఒక పార్టీ కి కొమ్ముకాయడం స్పష్టంగా కనిపించడం ఒక ఎత్తైతే...ఎడిటర్లు, యాంకర్లు నిర్మొహమాటంగా పార్టీ కండువాలు కప్పుకుని 'యాక్టివిస్ట్ జర్నలిజం' నెరపడం మరొక ఎత్తు. ఈ అవాంఛిత ధోరణి అంతకంతకూ ఎక్కువ అవుతున్నది. 

తెలంగాణలో జరిగిన ముందస్తు అసెంబ్లీ  ఎన్నికలు గానీ, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ, వివిధ రాష్ట్రాలతో పాటు రెండు రాష్ట్రాల్లో జరిగిన పార్లమెంటరీ ఎన్నికలు గానీ తరచి చూస్తే  మీడియా ఏ విధంగా తమకు అనుకూలమైన రాజకీయ పార్టీలకు మేలు జరిగేలా, వ్యతిరేక పార్టీలకు కీడు జరిగేలా కథనాలు గుప్పించాయో తెలుగు జనం చూసారు. ఏ మీడియా హౌస్ ఎటువైపు అన్నదాన్ని గురించి మాట్లాడుకోవడం అనవసరం కానీ,  ఎన్నికల నేపథ్యంలో మీడియా లో రెండు మూడు పరిణామాలను చూద్దాం.

 తెలంగాణా రాకముందు... ఉద్యమ కాలంలో అంతా నిజంగానే... కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు రామోజీ ఫిల్మ్ సిటీ ని వెయ్యి నాగళ్లతో దున్నిస్తాడేమో అని అనుకున్నారు. ఆ తర్వాత కేసీఆర్ గారిని రామోజీ గారు  ఆహ్వానించడం, అంతా భేషుగ్గా ఉందని ఇద్దరూ తేల్చేయడం తో కథముగిసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా 'ఈనాడు' ఒక్క నికార్సైన వ్యతిరేకవార్తను ఇవ్వకపోగా, అమ్మాయి అబ్బాయిలకు మాంఛి కవరేజ్ అందిస్తూ వస్తోంది.  

అనాలోచిత వ్యాఖ్య చేసిన మీడియా ఛానెల్స్ ను కేబుల్ ఆపరేటర్ల ద్వారా ప్రభుత్వం ఒక నొక్కుడు నొక్కడంతో తెలుగు మీడియా అంతా సెట్ అయ్యింది. అడపా దడపా ప్రింట్ జర్నలిజం పోసాని (వేమూరి రాధాకృష్ణ గారు) తన కాలమ్ లో ఉన్నది ఉన్నట్లు మాట్లాడే ప్రయత్నం చేసినా అన్ని మీడియా హౌస్ లు కిమ్మనకుండా ప్రభుత్వాన్ని పల్లకిలో మోసాయి. దానికి తోడు ప్రభుత్వ అనుకూల మూడు సంస్థలు-- నమస్తే తెలంగాణా, తెలంగాణా టుడే, టీ న్యూస్--అద్భుతంగా పనిచేసాయి. ఇవి కాక, 10 టీవీ, టీవీ 9, ఎన్ టీవీ లు ప్రభుత్వానికి 'మై హోమ్' అయిపోగా, శక్తివంతమైన సాక్షి ఛానెల్, పేపర్ ఫ్రెండ్లీ మద్దతు అందించాయి. 

కేసీఆర్ గారి విషయంలో తోకముడిచిన పసుపు పత్రికలు...బాబు గారికిప్రమాదంగా మారిన జగన్ విషయంలో విశ్వరూప ప్రదర్శన చేశాయి. అయినా...సాక్షి సంస్థలు విరుగుడు ప్రచారంతో పెద్దగా డామేజ్ కాకుండా చూసుకున్నాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పుకోవాలి.... జగన్ శిబిరం లో ఉన్న రెండు సామాజిక వర్గాలకు చెందిన జర్నలిస్టులు, నాయకులు నేరుగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా కసికొద్దీ చంద్రబాబు, లోకేష్ లను కుమ్మేసారు. ఒకప్పుడు 'ఈనాడు'లో పనిచేసి రాజశేఖర్ రెడ్డి గారి పుణ్యాన మంచి స్థితికి చేరుకున్న రెడ్డి జర్నలిస్టులు ఒక ఉద్యమంగా పనిచేసి జగన్ అనుకూల పవనాలు ఉధృతంగా వేయడంలో కీలకపాత్రపోషించారు. చాలా ఏళ్ళు రామోజీ రావు గారి దగ్గర పనిచేసి కారణాంతరాల వల్ల చంద్రబాబు పగకు గురైన కొమ్మినేని శ్రీనివాసరావు గారు కులానికి అతీతంగా తెలుగుదేశం గాలి తీయడంలో పోషించిన పాత్ర మామూలుది కాదు. జర్నలిస్టు నేత దేవులపల్లి అమర్ గారు రాత్రి పూట చేసిన చర్చలు ప్రభుత్వ వ్యతిరేక పవనాలు సృష్టించి కొనసాగించడంలో ప్రధాన భూమిక పోషించాయి. 

అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు..చంద్రబాబు, వేమూరి మధ్య స్థూడియోలో జరిగినట్లు చెబుతున్న ప్రయివేట్ సంభాషణ చూస్తే దిమ్మతిరుగుతుందనేది వేరే విషయం. మీడియా సంకుల సమరంలో ఎల్లో లాబీ నేలమట్టమైనా... ప్రమాణ స్వీకార మహోత్సవం నాడు ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు కనీసం ఒక ఏడాది పాటు పనిచేస్తాయోమో వేచిచూడాలి!

ఎన్నికల క్రతువు ముగిసింది కాబట్టి... అటు మీడియా యజమానులు, ఇటు పాలకులు.. ఫోర్త్ ఎస్టేట్ శ్రేయస్సు దృష్ట్యా సంయమనం పాటించి ప్రజలకు మీడియా పట్ల మరింత ఏహ్యభావం కలగకుండా చూడాలని అభ్యర్థిస్తున్నాం. 

Thursday, May 30, 2019

జగన్ వ్యాఖ్యపై ఆంధ్రజ్యోతి 'షాకింగ్' వార్త!

జనం అన్నారని కాదు గానీ, ఆంధ్రజ్యోతికి అత్యుత్సాహం/ మూర్ఖత్వం ఎక్కువ. పదవి పోయిన చంద్రబాబు నాయుడును జర్నలిజం నియమాలను గాలికొదిలేసి భుజాన మోసినట్లు అభియోగం ఎదుర్కుంటున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి యాజమాన్యాలతో పాటు టీవీ 5ల గురించి  ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవ ప్రసంగంలో ప్రస్తావన తెచ్చిన విషయం తెలిసిందే. 
తాము చేపట్టే టెండర్ల ప్రక్రియ విషయంలో ఈ మీడియా రచ్చ చేస్తుంది కాబట్టి.. ఒక జుడీషియల్ కమిషన్ సాయం తీసుకుంటామని, అప్పటికీ ఈ పత్రికలు వార్తలు రాస్తే పరువు నష్టం దావా వేస్తానని జగన్ హెచ్చరించారు.
దీనిపై ఆంధ్రజ్యోతి వెబ్సైట్ లో ఈ ఇంగ్లిష్ వార్త వచ్చింది. నిజానికి ఇందులో షాకింగ్ ఏముంది? మీడియా గురించి ఇట్లా మాట్లాడతారా? అని వార్తలో రాసి ఉంటే ఆ శీర్షికకు కొద్దిగా అర్థం ఉండేది. జగన్ మొత్తం మీడియాను అనకపోయినా.. మీడియా మీద షాకింగ్ కామెంట్ చేసినట్లు రాసిపారేసారు. ఈ విషయంలో.. ఓనర్ రాధాకృష్ణ గారు ఇట్లాచేయండని చెప్పి ఉండకపోవచ్చు. సరైన శిక్షణ లేని జర్నలిస్టుల వల్ల వచ్చే  చిక్కు ఇది.


ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 లను ప్రస్తావించిన జగన్

తమ సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబు నాయుడును జర్నలిజం నియమాలను గాలికొదిలేసి భుజాన మోసినట్లు అభియోగం ఎదుర్కుంటున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి యాజమాన్యాలతో పాటు టీవీ 5ల గురించి  ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవ ప్రసంగంలో ప్రస్తావన తెచ్చారు. 
ఎల్లో మీడియా గా విమర్శకులు పిలిచే ఈ సంస్థల కంటికి చంద్రబాబు తప్ప మరొకరు  కానరారని ఆయన స్పష్టంచేశారు. 
తాము చేపట్టే టెండర్ల ప్రక్రియ విషయంలో ఈ మీడియా రచ్చ చేస్తుంది కాబట్టి.. ఒక జుడీషియల్ కమిషన్ సాయం తీసుకుంటామని, అప్పటికీ ఈ పత్రికలు వార్తలు రాస్తే పరువు నష్టం దావా వేస్తానని జగన్ హెచ్చరించారు. 
ప్రమాణ స్వీకారంలో కొత్త ముఖ్యమంత్రి వ్యతిరేక మీడియా పై ప్రస్తావన చేసిన నేపథ్యంలో ఏపీ లో మీడియా పరంగా పరిణామాలు ఆసక్తి గా వుండే అవకాశం ఉంది. 
చంద్రబాబు ముఖ్యమంత్రి అయి ఉండివుంటే కనబడి వుండే ఉత్సాహం, ఊపు లేకుండా ఎల్లో మీడియా జగన్ ప్రమాణస్వీకార ఉత్సవాన్ని బాగానే ప్రసారం చేసాయి. 

Monday, May 27, 2019

యూట్యూబ్ హీరోలు... జర్నలిస్ట్ సాయి, ప్రొ. నాగేశ్వర్

జర్నలిజం వృత్తిగా స్వీకరిస్తే... ''మన అభిప్రాయం ఉన్నది ఉన్నట్లు చెప్పాలి. సర్వ జన సంక్షేమం కోసం ఇది చాలా ముఖ్యం... " అన్నది కలం వీరులను నడిపిస్తూ, పీడిస్తూ, బాధిస్తూ  ఉంటుంది. పేపర్లు, టీవీ ఛానల్స్, బ్లాగ్స్, పేస్ బుక్ లు అయ్యాక ఇప్పుడు యూట్యూబ్ హవా నడుస్తున్నది. పుణ్యం, పురుషార్థం రెండూ ఇమిడి ఉన్న నూతన జర్నలిజం లో బాగా వృత్తి నిబద్ధతతో పనిచేస్తున్న ఇద్దరి గురించి ఈ పోస్టు. వర్తమాన అంశాలపై వీరిద్దరి కామెంట్స్ కు ప్రజాదరణ పెరుగుతున్నది. అదే సమయంలో వారి శ్రమ వృథా పోకుండా బాగానే డబ్బులు సంపాందించి పెడుతున్నది యూ ట్యూబ్. 

అవకాశాలు అందిపుచ్చుకుని దోసుకుపోవడం ఎలాగో వీరిద్దరూ నిరూపిస్తున్నారు. జర్నలిజమే ప్రాణంగా బతికి, ఫీల్డులో నానా ఢక్కామొక్కీలు తిని రాటుదేలిన సాయి ఇప్పుడు యూ ట్యూబ్ ఛానెల్ లో తనదైన ముద్ర వేసుకుంటున్నారు.  అలాగే.. ప్రింట్, టీవీ జర్నలిజాల్లో సంచలనం సృష్టించి, టీవీ చర్చల్లో తిరుగులేని మేథావి ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కే నాగేశ్వర్, మాజీ ఎం ఎల్ సీ, కూడా ఆనతి కాలంలోని ప్రజాదరణ పొందారు.
ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే... వృత్తిలో షాక్ తిన్నాక... భావ ప్రకటనకు మనకంటూ ఒక వేదిక ఉండాలని వీరిద్దరూ యూ ట్యూబ్ ను ఎంచుకున్నారు. వివిధ వర్తమాన అంశాలపై వాగ్ధాటి తో ప్రజల మనసులు చూరగొనేలా అర్థవంతమైన విశ్లేషణ చేయడం అంత తేలికైన విషయం కాదు.  తక్కువ ఖర్చుతో చక్కగా నడుస్తున్న జెమిని నుంచి యాజమాన్యం న్యూస్ సెక్షన్ ఎట్టేసాక సాయి ఈ కొత్త మాధ్యమాన్ని ఎంచుకుని ప్రజాదరణ పొందారు. 
అలాగే... తన బ్రాన్డ్ ఇమేజ్ తో  లాభాల బాట పట్టించిన  ''హన్స్ ఇండియా'' పత్రిక నుంచి ఉన్నట్టుండి నిష్క్రమించాల్సి రావడం వల్ల ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈ కొత్త వేదికను అందిపుచ్చుకున్నారు. 

సాయి గారితో పోలిస్తే.. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి ఒక అనుకూలత ఉంది. వివిధ ఛానెల్స్ లో తాను చేసే విశ్లేషణలను ఎడిట్ చేసుకుని ఆయన తన ఛానెల్ లో పెట్టుకుని కుమ్మేస్తున్నారు. వీరిద్దరూ సెలిబ్రిటీ ల స్థాయికి చేరుకున్నారు. వీరికి మరింత ప్రజాదరణ.... తద్వారా ఆదాయం పెరగాలని కోరుకుందాం. 

(నోట్: వివిధ యూ ట్యూబ్ ఛానెల్స్ మీద సమీక్షలు జరిపి వార్తలుగా  ప్రచురించబోతున్నాం. మీకు సొంతగా యూ ట్యూబ్ ఛానెల్ ఉంటే మాకు రాయండి. srsethicalmedia@gmail.com)  

Sunday, May 26, 2019

టీవీ 9 రవిప్రకాష్ కు ఒక ఉచిత సలహా!

తెలుగు మీడియా చరిత్రలో ప్రధాన మైలురాళ్లుగా చెప్పుకోదగ్గవి...రామోజీరావు గారు 'ఈనాడు' ఆరంభించి ప్రింట్ మీడియాను కొత్తపుంతలు తొక్కించడం, రవిప్రకాష్ గారు 'టీవీ -9' ను మొదలుపెట్టి ఎలక్ట్రానిక్ మీడియా అంటే ఏమిటో చూపించడం. అప్పటిదాకా ఉన్న నియమాలను వీళ్ళు పునర్వచించి చరిత్ర సృష్టించారు.  మీకు నచ్చినా, నచ్చకున్నా.. వాళ్లకు హాట్సాఫ్ అనాల్సిందే. వీరిమూలంగా వేలమంది జర్నలిజాన్ని కెరీర్ గా ఎంచుకుని, స్థిరపడి, జీవితాలు వెళ్లదీస్తున్నారు. 'ఈనాడు', 'టీవీ 9' కథనాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎందరికో వెలుగు చూపాయి. ఇది వాస్తవం.

ఇంత పెద్ద మీడియా వ్యాపార సామ్రాజ్యాలను స్థాపించాక, గొడవలు, వివాదాలు, వ్యవహారాలూ ఉండకుండా ఉండవు. అప్పటిదాకా హీరోలు అని పొగిడిన వాళ్లే వీరిని విలన్లని  తూలనాడడం సహజం. అలాగని వీరు పత్తిత్తులు కాదు. తాము, తమ సంస్థ ఎదిగే క్రమంలో ఎందరినో తొక్కేసి ఉంటారు, బైటికి చెప్పే నీతులను తుంగలో తొక్కివుంటారు. ప్రతిభావంతులైన సహచరులను స్వప్రయోజనం కోసం బైటికి గెంటి వుంటారు.  అక్రమాలకూ పాల్పడి వుంటారు. కానీ పరిస్థితులు అనుకూలించనపుడు విజ్ఞతతో వ్యవహరించడాన్ని బట్టి వీరిలో నాయకత్వ లక్షణాలు బయటపడతాయి.

ఇప్పుడు టీవీ -9 సీఈ ఓ పదవి పోయిన రవిప్రకాష్ ధోరణి చూస్తుంటే... వింతగా అనిపిస్తున్నది. కంపెనీలు చేతులు మారాక.. పదవులు పోయాక ఉండాల్సిన హుందాతనం, పరిణతి  రవిప్రకాష్  కనపర్చలేకపోతున్నారు. ఈయనా...అంత పెద్ద మీడియా సంస్థను నెలకొల్పి విస్తరించింది? అన్న అనుమానం కలుగుతున్నది. నటుడు  శివాజీ తో జరిపిన డీల్, చేసిన పంచాయితీ చీప్ గా ఉన్నాయి. లోగోకు నేనే ఓనర్ను అని వాదించడం... పారిపోయి రికార్డెడ్ స్టేట్మెంట్స్ పంపడం... అవాయిడ్ చేయదగిన విషయాలు. ఇప్పటికే... సముద్రం మధ్య అలల్లో చిక్కుకున్న రవిప్రకాష్ పరువు మరింత పంచనామా కావడం ఖాయం. ఆయన భ్రమిస్తున్నట్లు తన మీద జరుగుతున్న 'దాడి' ని జార్నలిస్టులు పత్రికా స్వేచ్ఛ మీద దాడిగా ఏమీ భావించడం లేదు. ఆ టీవీ -9 లో పనిచేసే ఒక డజను మంది, తన మోజో టీవీ లో కొందరు తప్ప ఇతరులు రవిప్రకాష్ కు అన్యాయం జరిగిందని భావిస్తున్నట్లు కనిపించడం లేదు.

కాబట్టి ఈ పరిస్థితుత్లో... పోలీసులకు లొంగిపోయి, న్యాయస్థానం లో వాదన వినిపించుకుని... ఈ పెంట నుంచి బైటపడి, కొంత రెస్ట్ తీసుకుని మార్కెట్లోకి వస్తే... రవిప్రకాష్ ను చూసి పెట్టుబడి పెట్టేవాళ్ళు బొచ్చడుమంది వుంటారు.  భారతీయ టెలివిజన్ రంగం చరిత్ర సృష్టించిన అర్ణబ్ గోస్వామి కూడా ఇలాంటి సీరియస్ పరిస్థితిని ఎదుర్కొని... తాను స్వశక్తితో కని పెంచిన టైమ్స్ నౌ ను వీడాల్సి వచ్చింది. హుందాగా.. వైదొలిగి రిపబ్లిక్ ఛానల్ పెట్టి తన సత్తా ఏమిటో ఆయన నిరూపించుకున్నారు. దీన్ని రవి ఒక పాఠం గా తీసుకోవడం మంచిది.

బ్రదర్... రవీ! మీరు ఈ ఘనాపాఠీలను ఎదురొడ్డి పోరాడలేరు. పైగా మీ వాదనలో పస ఉన్నట్లు కనిపించడం లేదు. మీ పూర్ పీఆర్ అనండి... మీరు కనబరిచిన తలపొగరు అనండి... కారణం ఏదైనా...  జర్నలిస్టులు మీ కోసం రోడ్ల మీదకు వచ్చే పరిస్థితి లేదు. అలల ఉదృతి చూసి కొద్దిసేపు తలవంచుకుంటే మళ్ళీ మిమ్మల్ని మీరు నిరూపించుకోవచ్చు.  ఆ అవకాశం మా లాంటి మీడియా విశ్లేషకులకు స్పష్టంగా కనిపిస్తున్నది.

'బాధితుడు రవి ప్రకాష్' అన్న టాగ్ తో గౌరవప్రదంగా బైటికి రండి. మీకు తెలుగు మీడియాలో ఇంకో పాతికేళ్ల భవిష్యత్ వుంది. దీన్ని చెడగొట్టుకుని లోగో కోసం, పోగో కోసం రచ్చ చేసుకుని పలచన కావడం మీకే నష్టం.

Saturday, May 25, 2019

గాడితప్పిన కారుకు ఓటర్ల ఝలక్...ఐదు కారణాలు

అధికారమదం తలకెక్కి ఒళ్ళుబలిసి కొట్టుకుంటే ఓటు మందుతో కాయకల్ప చికిత్స చేసే చతురత మన ఓటర్లది. రాజకీయ చాణక్యం వల్ల ముందస్తు ఎన్నికలకు వెళ్ళబెట్టి కేసీఆర్ సేన బతికిపోయింది. లేకపోతే, ఆంధ్రాలో లాగా అయ్యా కొడుకులు తలమీద తెల్ల కర్చీఫ్ వేసుకుని కూర్చోవాల్సి వచ్చేది మే 23 తర్వాత... అన్న వాదన కొట్టిపారెయ్యలేనిది.  "కారు.. సారు.. పదహారు .. ఢిల్లీ లో సర్కారు..."  అంటూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొట్టిన డప్పు మోగలేదు.  ఎగ్జిట్ పోల్స్ బోల్తా కొట్టించడం, సొంత కూతురు కవిత ఘోర పరాజయం పొందడం నుంచి కోలుకోవడానికి సారుకు కొంత కాలం పట్టవచ్చు. ఇప్పటికే ఆయన దులుపుడు కార్యక్రమం మొదలు పెట్టినట్లు సమాచారం. 
అసెంబ్లీ ఎన్నికల్లో సూపర్ డూపర్ హిట్ అయిన గులాబీ దళం పార్లమెంటరీ ఎన్నికల్లో కుదేలు కావడానికి కారణాలు ఉన్నాయి. 
1) పొగరుబోతుతనం: అసెంబ్లీ ఎన్నికలు అయ్యాక... కేబినెట్ లేకుండా పాలన సాగిస్తే యావత్ దేశం విస్తుపోయింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన కిక్ తో కేసీఆర్ విర్రవీగుతున్నారని జనం బాహాటంగానే అనుకున్నారు. పార్లమెంటరీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే... వ్యూహాత్మకంగా పెద్దాయన ఆ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో ఇలాంటి ప్రయోగాలు బెడిసికొడతాయి. ఇప్పటికీ కేబినెట్ కూర్పు సరిగా జరగలేదు. సగం తెలుగుదేశం నేతలతో కారు యాత్ర సాగుతున్నది. 

2) అడ్డగోలు నిర్ణయాలు: కొడుకును పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన కేసీఆర్... వ్యూహాత్మకంగా మేనల్లుడు హరీష్ రావును నొక్కేశారు. ఇది కూడా ప్రజల్లో చర్చకు దారితీసింది. కే టీ ఆర్ అంటే లేని సానుభూతి  మేథావులు, నాయకులు, జర్నలిస్టులలో హరీశ్ పట్ల ఉంది. డబ్బు ప్రభావంతో టికెట్లు ఇచ్చారన్న చర్చ బాహాటంగానే జరిగింది. ఉదాహరణకు: ఎం ఎల్ ఆర్ కాలేజీల అధిపతి కుమారుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి మల్కాజ్ గిరిలో ఏ ప్రాతిపదికన టికెట్ ఇచ్చారు? పారిశ్రామికవేత్త నామా నాగేశ్వర్ రావు పార్టీలో చేరిన రోజునే టికెట్ ఇచ్చారు. రాజధానిలో తిష్ట వేసే రేణుకా చౌదరి ప్రత్యర్థి కాబట్టి నామా బతికి పోయారు గానీ లేకపోతే ఖమ్మం ఓటర్లు గట్టి బుద్ధే చెప్పేవారు. ఇట్లాంటి పిచ్చపనులు చేసి దెబ్బతిన్నది టీఆర్ఎస్. 
   
3) ఉద్యోగుల మంట: ఈ ప్రభుత్వం పట్ల ఉద్యోగులలో అసంతృప్తి బాగా ఉంది. వేతనాలు, బిల్లుల చెల్లింపులు, ఆర్థిక స్థితిగతుల పట్ల మంచి అవగాహన ఉన్న ఉద్యోగులు బాహాటంగానే టీఆర్ఎస్ భంగపాటును కోరుకున్నారు. కేసీఆర్ మీద కోపంతో బీజేపీ కి ఓట్లు వేసిన వాళ్ళూ ఉన్నారు. 

4) యువతలో నైరాశ్యం: ఉద్యమ కాలంలో టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చిన యువతకు ఇప్పుడు భ్రమలు తొలిగాయి. ఉద్యోగాలు అనుకున్న స్థాయిలో లేవు. ఉస్మానియా లాంటి విశ్వ విద్యాలయాలకు నిధులు ఇవ్వకుండా దెబ్బతీస్తున్నారు. మోడీ పట్ల యువతకు ఉన్న సదభిప్రాయం, తండ్రీకొడుకుల మీద పెరుగుతున్న ఏహ్యభావం టీఆర్ఎస్ ను దెబ్బతీయడంలో కీలకపాత్ర పోషించాయి. 
   
5) హస్తినపై  కన్ను: తెలంగాణా ను కొడుక్కు వదిలి కేసీఆర్ కేంద్రంలో సెటిల్ కావాలని భావిస్తున్నారని ఓటర్లకు అర్థమయ్యింది. తెలంగాణా పునర్నిర్మాణానికి చేసింది ఏమీ లేదు గానీ... ఈయనకు అక్కడ పదవి మీద కన్ను పడిందని బాహాటంగా మాట్లాడుకున్నారు. 
ఇది జరగడానికి వీల్లేదని, ఈ ఎన్నికల్లో కారు గాలితీయకపోతే కేసీఆర్ ను పట్టుకోవడం తరంకాదని  ఓటర్లు గట్టిగా భావించారు.

మీడియా విషయంలో ప్రభుత్వ ధోరణి కూడా ఆరో కారణంగా చెప్పుకోవచ్చు గానీ, మీడియా అంటే జనాలకు ఉన్న అసహ్యం మూలంగా దాన్ని ఒక అంశంగా చెప్పుకోనక్కర్లేదు.
మోడీ ప్రభంజనం మూలంగా.... తానూ అనుకున్న 16 బదులు.. కేవలం 9 సీట్లు రావడం వల్ల టీఆర్ఎస్ కు కొంపలు మునిగిపోయింది ఏమీలేదు. కానీ ఇది ముందస్తు హెచ్చరిక అని మాత్రం చెప్పుకోవచ్చు. ఎవరెంత సంపాదిస్తున్నది, ఎవరేమి చేస్తున్నది జనం గమనిస్తారు. మే 23, 2019 కి ముందు ఉన్నట్లు గానే కేసీఆర్, కేటీఆర్ వ్యవహరిస్తే... వచ్చే ఎన్నికల్లో శంకరగిరి మాన్యాలే! 

ఏపీలో నలుగురు జోకర్లు: కేఏపీ, పీకే, ఎన్ఎల్, ఎల్ఆర్!

మండే ఎండల్లో ఓట్ల పండగ చవిచూసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆటలో అరటిపండులా మంచి వినోదం పంచిన నలుగురు నేతల గురించి మాట్లాడుకోకపోతే సున్నా సంపూర్ణం కాదు. గెలుపు ఓటములు సహజమని నమ్మడం మన ధర్మం కాబట్టి... ఈ నలుగురి ఫలితాల గురించి కాకుండా వీరి ధోరణుల గురించి మాట్లాడుకోవడం సముచితం. 

ముందుగా, కేఏపీ (మత ప్రచారకుడు కే ఏ పాల్). ఈ మధ్యకాలంలో పాలిటిక్స్ లో ఇంత కామిడీ పండించిన మనిషి మరొకరు లేరు. విధవరాండ్రు, అనాథల కోసం పనిచేస్తూ...అందరు  ప్రపంచ దేశాల అధినేతలతో నిత్యం టచ్ లో ఉంటానని మొహమాటం లేకుండా చెప్పుకునే ప్రజాశాంతి పార్టీ అధినేత అమాయకపు  పాల్ గారిని బాగా బ్రష్ట్రు పట్టించింది... టీవీ -9. ఉన్నది ఉన్నట్టు మాట్లాడే ఆయన  లైవ్ కోసం ఎంత మొత్తుకున్నా... ఒక్కళ్ళూ సరిగా ప్రత్యక్ష ప్రసార యోగం కల్పించకుండా... పాల్ గారిని తొక్కేశారు! పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం అసెంబ్లీ కి పోటీపడిన ఆయనకు 281 ఓట్లు రాగా, అదే లోక్ సభ సీటుకు పోటీ పడిన ఆయనకు 2987 ఓట్లు వచ్చి డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. రాజకీయ విషయ పరిజ్ఞానం పెద్దగా లేకుండా, మీడియా మీద, మతం మీద  నమ్మకంతో దూసుకుపోదామని అనుకున్న పాల్ గారికి ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి పట్టించారు ఆంధ్రా ఓటర్లు. ఓటేశాక... ఉరుక్కుంటూ కుప్పిగంతులు వేసుకుంటూ వెళ్లి కారెక్కిన పాల్ గారు... మీడియా మెట్లు ఎక్కకుండా... కామిడీ చేయకుండా....ఉండివుంటే ఒకటి రెండు చోట్లయినా పరువు నిలిచేదేమో! ఉత్తరాదిన అంత కామిడీ చేసే లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఆ రసాన్ని ఎప్పుడు వాడాలో అప్పుడే మితంగా వాడేవారు. 

ఇక, పీకే (పవర్ స్టార్ పవన్ కళ్యాణ్). చేగువేరా స్పూర్తితో.. వ్యవస్థ మీద కసితో...సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఎన్నికల రణంలో దిగిన ఈయన అసందర్భ ప్రేలాపనలతో పలచనయ్యారు. అధికారంలో ఉన్న తెలుగు దేశం పార్టీని, చంద్రబాబు ను కాకుండా... ప్రతిపక్ష నేత మీద దాడి చేస్తుంటే...నమ్మడానికి జనం సినిమా పిచ్చోళ్ళు కాదు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి  మనసులు గెలుచుకోవచ్చని అనుకున్న ఆయన ఒక దశలో తెలంగాణాలో ఆంధ్రా వాళ్ళపై దాడి చేస్తున్నట్లు ప్రచారం చేయడం, దానికి ఆ కుటుంబపు అభిమాన తార శ్రీరెడ్డి వంటి వాళ్ళు సోషల్ మీడియాలో కుమ్మేయడం గణనీయంగా దెబ్బకొట్టి ఉండవచ్చు. ఒక సారి అన్నయ్య, మరొకసారి తమ్మయ్య కాపుల్లో ఆశ కల్పించి నీరుగార్చారు. చిన్న అన్నయ్య  నాగబాబు యూట్యూబ్ ఛానెల్ లో రెచ్చిపోతూ..  'తాట వొలుస్తాం' అన్నదాన్ని జనం తప్పు అర్థం చేసుకుని తాట తీశారు. భీమవరం, గాజువాకల్లో ఈయన ఎనిమిది వేల పైచిలుకు ఓట్ల తేడాతో కంగుతిన్నాడు. తనకన్నా... తన అన్న చిరంజీవే బెటరని పీకే నిరూపించాడు. పాలిటిక్స్ లో ఓపిక, మన టర్న్ కోసం అలసిపోకుండా ఎదురుచూడడం అవసరం. ఆనాడు చిరంజీవి ఠక్కున కాంగ్రెస్ తీర్థం తీసుకోకుండా ఉండి ఉంటే... ఈ రోజు ఒక ప్రబల శక్తిలా ఎదిగి ఉండేవాడు. కాపుల కలను నెరవేర్చేవాడు.  ఇప్పుడు... ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్లు కనిపించని పీకే వచ్చే ఎన్నికల దాకా శ్రమకోర్చి  ప్రాక్టికల్ గా వ్యవహరిస్తే కచ్చితంగా ఒక అవకాశం దొరుకుతుంది. కానీ, మనోడికి అంత ఓపిక ఉందా అన్నది పెద్ద ప్రశ్న. 
 ఎన్ ఎల్ (మంత్రి నారా లోకేష్ బాబు). తెలుగు కు పట్టిన గబ్బు మన బుజ్జి  బాబు. మంగళగిరి అనడమే  రాకపోవడానికి నాలుక తిరగకపోవడం కారణం కావచ్చు గానీ, ప్రచారంలో డొక్క శుద్ధి మాత్రమే కాకుండా ఒక వ్యూహం అంటూ ఏదీ లేకుండా...నోటికొచ్చింది వాగి  దూసుకుపోయాడు. సోషల్ మీడియాలో పాల్ గారి తర్వాత.. లోకేష్ మీద, రాహుల్ మీద పంచ్ ల మీద పంచ్ లు ప్రచారమయ్యాయి.  లోకేష్ కు సుస్థిర రాజకీయ జీవితం ఇవ్వడానికి చంద్రబాబు కు ఈ ఎన్నికలు చాలా అవసరం. కానీ, పథకం దెబ్బతిన్నది. చాలా మంది మంత్రులతో పాటు లోకేష్ కు కూడా జనం షాక్ ఇవ్వడం తన తండ్రికి మింగుడుపడని అంశం. ఈ దెబ్బ నుంచి కోలుకుని ఆ విధంగా ముందుకు పోవడానికి లోకేష్ కు చాలా సమయం పడుతుంది. 
 
ఇక చివరాఖరుకు, ఎల్ఆర్ (ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్). ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినాక రాజకీయ సన్యాసం చేసిన లగడపాటి తన చిలక జోస్యాలతో జనాలకు వింత, వినోదం కొంత పంచారు. మీడియా అటెన్షన్ కోసం మాత్రమే... శాస్త్రీయత లేకుండా... జోస్యం చెప్పి మరొకసారి ఈ పారిశ్రామిక వేత్త బోర్లా పడ్డారు.