Sunday, December 26, 2010

అన్నిటా...అపార్థమే భాయ్...(Sunday Special)

క్రిస్మస్ శుభదినాన ఒక రెండు రౌండ్లు ఎక్కువ వాకింగ్ చేద్దామని ఖైరతాబాద్ వైపు నడక మొదలెట్టి...తలకు బొప్పి కట్టించుకున్నాను. నాసర్ స్కూలు పక్కన పిల్లలు రోడ్డు మీద క్రికెట్ ఆడుతుంటే...నిలబడ్డాను. బంతి వేగంగా గాల్లో ఎగురుతూ నా వైపు వచ్చింది. నేను చటక్కున దాన్ని పట్టుకున్నాను. మనమింకా ఫిట్ గానే ఉన్నామని అనుకుంటుండగానే...'వెరీ గుడ్ కాచ్...తాతా' అని వెనుక నుంచి ఒక కుర్ర వెధవ అరిచాడు. ఏడవలేక నవ్వుతూ వాడి వైపు చూసి మళ్ళీ నడక మొదలెట్టాను. పాపం....ఈ రాబోయే జనవరి ఫస్టుకు గానీ నాకు నలభై ఏళ్ళు రావని వాడికేమి తెలుసు? మన వయసును వాడు అపార్థం చేసుకున్నాడు....కుర్రకుంక.

ఈ మధ్యన లాల్ బహదూర్ స్టేడియంలో ఇలాంటి అనుభవమే ఎదురైంది. తమ్ముడి కవల పిల్లల (ఆరేళ్ళు) ను తీసుకుని టీ.టీ.అరేనా నుంచి బైటికి వస్తుండగా....ఒకడొచ్చి...'మనవరాళ్ళా?' అని అమాయకంగా అడిగాడు. హతవిధీ....ఇక్కడ కూడా మన వయసు అపార్థం చేసుకోబడింది. ప్చ్...ఏమి చేస్తాం? ఒరిజినాలిటీ కొనసాగించాలన్న సంకల్పంతో...సగం వెండి పూసలుగా మారిన బొచ్చుకు రంగు వేయకపోవడం వల్ల వస్తున్న చిక్కిది కాబోలు. 

మన వయసు విషయంలోనే కాకుండా...మౌనాన్ని, అభిప్రాయాలను, చర్యలను, వాదనను...జనం అపార్థం చేసుకోవడాన్ని బట్టి చూస్తే...వినాయక చవితి రోజు చంద్రుడ్ని చూసానేమో అనిపిస్తున్నది. చివరకు పూణే ఫణి బాబాయ్ కూడా నన్ను అపార్థం చేసుకుని మొన్న ఒక భయానక్ మెయిల్ పంపారు. నేను నీకు ఎందుకు 'అవాంఛిత  వ్యక్తి (పెర్సొన నాన్ గ్రాటా)' అయ్యానో చెప్పమని ఆయన నిలదీశారు. అంత పెద్ద మనిషి...నొచ్చుకునేలా నేనేమి చేసానా? అని ఆత్మపరిశీలన చేసుకుని....ఒక మెయిల్ కొట్టి క్రిస్మస్ శుభదినాన ఫోన్ చేశాను--నాసర్ స్కూలు పక్కన 'ఏజ్ బౌల్డ్' అయిన ఒక గంటకే. ఆయన పంపిన మూడు కామెంట్స్ కు, ఫోన్ కాల్స్ కు నేను స్పందించనందు వల్ల అలా అనుకోవాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. 

నన్ను బండ బూతులు తిట్టే తిక్క వెధవల కామెంట్స్ కూడా పోస్ట్ చేసే ఉదార వాదిని...నేను అభిమానించే బాబాయ్ కామెంట్స్ ఎలా మిస్ అయ్యానో తెలియడం లేదు. నిజానికి ఆయన కామెంట్స్ ఏవీ నాకు అందలేదు, ఆయన ఫోన్ కాల్ కూడా రాలేదు. ఎక్కడో ఏదో జరిగి...ఈ దారుణ అపార్థానికి కారణమయ్యింది. ఈ విషయాలన్నీ పెద్దాయనకు చెప్పి ఆయన బోసి నవ్వులు విన్నాక మనసు కుదుటపడింది. ఈ శరత్ బాబు కూడా అపార్థం వలలో చిక్కి విలవిలలాడుతున్నట్లు తోస్తున్నది.

అందరితో మంచిగా ఉండాలని ఎంతగా అనుకున్నా...అపార్థాలు ఎక్కువవుతున్నాయి ఈ జీవితంలో. 'మీ పోస్టులో కామెంటు నన్ను ఉద్దేశించి రాసారా? నేను అలాంటి వాడిని కాను,' అని మా కాలనీ లో ఉన్న ఒక హై కోర్టు లాయరు గారు ఫోన్ చేస్తే....ఎందుకొచ్చిన అపార్థంరా నాయనా....అంటూ నా పోస్టులో 'హై కోర్టు' అనే పదాన్ని తొలగించాల్సివచ్చింది. ఈ లాయర్ గారి పేరు ఎత్తితే టీ.టీ.గుర్తుకు వచ్చి చస్తుంది.

ఈ మధ్యన టేబుల్ టెన్నిస్ విషయంలో కూడా ఈ అపార్థం కొంత గందరగోళానికి దారితీసింది. ఏదో ప్రపంచ స్థాయి టోర్నమెంట్ కవరేజ్ కోసం సాయం చేయమని...ఒక పెద్ద మనిషి అడిగితే...నాకు తెలిసిన టీ.వీ. ఛానెల్స్ వాళ్లకు చెప్పాను. కవర్ చేశారు. అందులో హెచ్.ఎం.టీ.వీ. వాళ్ళు...."సమన్వయలోపం వల్ల ఈ టోర్నమెంట్ ప్రజాదరణకు నోచుకోలేదు..." అన్న ఒక వాక్యం రాసారు. అది...రామూ గాడే రాయించాడనో, రాశాడనో  పక్కనున్న అబద్ధాల మరియన్నో, హడావుడి అక్కన్నో ఎక్కిన్చినట్లున్నారు...మన పెద్ద మనిషి చప్పిడి చేయడం లేదు. పుణ్యానికి పోతే పాపం ఎదురైంది. మనం వాడి కాళ్ళు...వీడి కాళ్ళు పట్టుకునే వాళ్ళం కాదు కాబట్టి...చూపరా...నీ తడాఖా...అని మన సత్యం బాబు అలియాస్ ధర్మ దేవతను అడిగాను.

మా పదేళ్ళ పిల్లవాడిని ఆడించుకుందామని...ఒక టీ.టీ.అకాడమీ పక్కనే ఇల్లు తీసుకుని  నా బాధ నేను పడుతుంటే...దేవుడు నన్ను అపార్థం చేసుకున్నాడు. అకాడమీ హాల్లో సాయంత్రంవేళ రేగే దుమ్ము వల్ల పిల్లవాడికి రెండు నెలలకు ఒక సారి...జ్వరం రావడం మొదలయ్యింది. డాక్టరు డస్ట్ ఎలర్జీ అని తేల్చడంతో....సాయంత్రం వేళ లాల్ బహదూర్ స్టేడియం లో ఆడించడం మొదలుపెట్టాను. అక్కడ వేరే కోచ్ తో ప్రాక్టిస్ చేయిస్తుంటే....ఈ అకాడమీ వాళ్ళు అపార్థం చేసుకున్నారు. ఆడిస్తే అక్కడ ఆడించండి...లేదంటే ఇక్కడ ఆడించండని తెగేసి చెప్పారు. ఇక్కడ ఎవరు ఏమి అపార్థం చేసుకున్నా...కుర్రవాడి ఆరోగ్యం ముఖ్యం కాబట్టి....ఎంతో బాధను, ఆవేశాన్ని, కసిని దిగమింగుకొని...వేరే ఏర్పాటు చేసుకుంటున్నాను. దుమ్ము పెద్దగా ఉండని ఉదయం పూట అయినా ఇక్కడ ఆడనివ్వరట. 'ఇది దారుణం అన్నా...ఒకసారి సుభాషణ్ రెడ్డికి ఈ విషయం చెబుదాం. మీ ఏరియా ఎం.ఎల్.ఏ., మంత్రి నాగేందర్ దగ్గరకు పోదాం..రా...' అని ఒకరిద్దరు జర్నలిస్టు యూనియన్ నేతలు అన్నా...ఒక మంచి వ్యవస్థను మనం డిస్ట్రబ్ చేయకూడదని నేనే కొంత రిస్క్ తీసుకుని అక్కడా ఇక్కడా ఆడించుకుంటున్నాను.

నా బాధలు, వేదనలు అర్థం చేసుకుని...అయ్యో...అలాగా...అనేవారు మీలో ఎవరైనా ఉంటే...చెప్పండి...ఖైరతాబాద్ చౌరస్తాలో వున్న ఇరానీ కఫే లో కలుద్దాం. చాయ్ తాగుతూ మాట్లాడుకుందాం రండి. సర్వే జనా సుఖినో భవంతు.
(నోట్: ఈ మధ్యన టీ.టీ.మీద కావాలనే ఎక్కువ రాస్తున్నాను. నేను బాగా అపార్థం చేసుకుని మొదట్లో ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చిన ఒకాయన, ఆయన కొడుకు, మరి కొందరు... "వీడేమి రాస్తాడా...." అని రోజూ బ్లాగ్ చూస్తున్నట్లు వేగుల ద్వారా తెలిసింది. వారిలో మానసిక పరివర్తన తేవడం...మంచిని పెంచడం....గుండె మంటలార్పుకోవడం...పనిలో పనిగా కొన్ని మౌలిక అంశాలు టచ్ చేస్తూ మనుషుల మనస్తత్వాలు మీ అందరి ముందు ప్రస్తావించడం మన ఉద్దేశం. అంతే.)

24 comments:

Rajesh T said...

మొన్నీమద్యే ఒక షాపుకి వెళ్తే, షాపు లో ఉన్న ఒక పెద్ద పిల్ల (20 సంవత్సరాలు ఉంటాయి అనుకుంటా) పెళ్లి కూడా కాని నన్ను అంకుల్ అని పిలిచింది. నేను తనకి అంకుల్లా కనిపిస్తున్నానా అని రెండు కనీటి చుక్కలు మనసులో కార్చుకొని బయట పడ్డా.

ఒక ముఖ్య విషయం. నాకూ మీ అబ్బాయికి లాగానే డస్ట్ ఎలర్జీ ఉండేది. ఈ డస్ట్ ఎలర్జీ వల్ల వారానికి లేదా రెండు వారాలకు ఒకసారి జలుబు చేసేది. ఇక స్కూల్ లో వెళ్తే నిమిషానికి ఒకసారికి తగ్గకుండా తుమ్మి విశ్వామిత్రుడి తపస్సుని ఊర్వసి భగ్నం చేసినట్టు, నేను అందరి పిల్లల ఏకాగ్రతని నా తుమ్మలతో భగ్నం చేసేవాణ్ణి. తరువాత నేను హోమియోపతి మెడిసిన్ వాడాను. ఆ దెబ్బతో డస్ట్ ఎలర్జీ పారిపోయింది. వీలైతే మీ అబ్బాయికి కూడా మంచి హోమియోపతి డాక్టర్ కి చూపించండి.

katta jayaprakash said...

Your embarassment with grey hair is indeed very humourous and I just laughed and laughed at these two incidents.Really black and grey hair make a lot of difference.Grey hair depresses one and black hair enhances the confidence.

JP.

శరత్ 'కాలమ్' said...

:))

జర్నో ముచ్చట్లు said...

బాబాయ్‌.. నువ్వు అదృష్టవంతుడివి. జుట్టు నెరిసినా కాస్త స్లిమ్‌గా (నాతో పోలిస్తే) ఉంటావు. నేనైతే ఆరేడేళ్లుగా ఈ బాధ అనుభవిస్తున్నా. కాస్త బొద్దుగా కూడా ఉంటా కదా.. నాకు తమ్ముడి వయసున్న వాళ్లు కూడా నన్ను అంకుల్‌ అని సంబోధించడమే. బొచ్చు నల్లబరచుకోవడం అంటే అలర్జీ. రంగేసుకోవడం కన్నా..అంకుల్‌ అని పిలిపించుకోవడమే బెటర్‌ అని నిర్ధరించుకున్నా. అయినా ఈ పిలుపు వల్ల ఒకింత పెద్దరికం కూడా వెలగబెట్టొచ్చేమో కదా.. (సమర్థన.. సమర్థన..)
ఏమంటావ్‌..?
విజయ్‌

astrojoyd said...

నేనే కొంత రిస్క్ తీసుకుని అక్కడా ఇక్కడా ఆడించుకుంటున్నాను-idi apaardham kaadu..sapaardhame....

kasturimuralikrishna said...

.అయ్యో...అలాగా.

చిలమకూరు విజయమోహన్ said...

దాదాపు 65సంవత్సరాల తలకు రంగు వేసుకున్నాయనను అంకుల్ అని పిలిచి 50సంవత్సరాల రంగు వేసుకోని నన్ను చూసి తాతా అన్నారు. :)

Anonymous said...

మరీ అంత బాధపడిపొతే ఎలాగ? మీ టపా చదివి, మా ఇంటావిడ తన అనుభవం చెప్పింది- తను రంగులాటివేవీ వేసుకోదు. తనకంటె వయస్సులో కనీసం, 7-8 ఏళ్లు పెద్దయినవారు, రంగువేసిన జుట్టు కారణంగా, తన కాళ్ళకి దండాలు పెట్టడం!! ఇది మీకు జరిగినదానికన్నా అన్యాయం!

Ramu S said...

కస్తూరి మురళీకృష్ణ గారూ...
చాయ్ తాగుదాం రండి. ఏ సాయంత్రం పూట అయినా...ఈ కామెంట్ బాక్స్ లో టైం, మిమ్మల్ని గుర్తు పట్టడానికి క్లూస్ ఇచ్చి రండి. మనం కలవచ్చు. మీకు మంచి బిస్కెట్స్ కూడా బోనస్. బిల్లు నాదే.
రాము

suravajjula said...

అయ్యో...అలాగా

శరత్ 'కాలమ్' said...

మీ టపాలో ఉదహరించిన శరత్ బాబు నేనేనా? నేనే అయితే మన మధ్య ఏం అపార్ధాలు వున్నాయి చెప్మా? కాస్త తీరిక లేక అనగా నా బ్లాగులు నేనే చదువుకునే సమయం లేక, నా బ్లాగులోని స్పందనలకే ప్రతి స్పందించే తీరిక వుండక కెలుకుడు టపాలు తప్ప మంచి టపాలు చదవడం బొత్తిగా కుదరడం లేదు. పైగా మీరు చాలావరకు ఏవో మీ ప్రొఫెషనుకి సంబంధించిన టపాలు వేస్తున్నారాయే. అందుకే ఇటువైపుకి రాకడ తగ్గించాను. అందువల్ల కాస్త గ్యాప్ వచ్చింది.

అన్నట్లు నా హైదరబాద్ బ్లాగర్ల జ్ఞాపకాల సిరీసులో ఇంకో ముగ్గురిని కవర్ చెయ్యడం అలా అలా ఆలస్యం అయిపోతోంది. అందులో మీరు ఒకరు. ఇంకా భవదీయులు, నెలబాలుడు గురించి కూడా వ్రాయాల్సివుంది.

శరత్ 'కాలమ్' said...

ఇహ నా తెల్లజుట్టు గురించి చెప్పాల్సివస్తే దాని గురించి ఈ మేధావికి తలంటు పేరిట అనుకుంటాను - ఓ పొస్ట్ వేసినట్లు గుర్తు. నాకు అక్కడక్కడ చెదురుముదురుగా తప్ప ఎక్కువగా తెల్లబడలేదు లెండి. ఆమాత్రం తెల్ల వెంట్రుకలు లేకపోతే జనాలు మనని మేధావిగా గుర్తించరేమోనని రంగేసుకోవడానికి ససేమిరా ఇష్టపడను. ... కానీ నా మేధావితనం ఎక్కడ అందరికీ తెలిసిపోతుందో హేమిటో అన్న ఈర్ష్యా అసూయా ద్వేషంతో మా ఆవిడ అప్పుడప్పుడు ముఖ్యమయిన వేడుకలకి ముందుగా నన్ను బరబరా బాతురూముకి లక్కెళ్ళీ కుదేసి నా జుట్టుకి రంగు కొడుతుంది :( మా ఆవిడకి సహాయంగా మా అమ్మలు ఏమో ఒక చేత నా పెడరెక్కలు విరిచి పట్టుకుంటుంది - మరో చేత నేను లబలబలాడకుండా నోరు మూసేస్తుంది. వా.

జ్యోతి said...

అయ్యో...అలాగా

Thirmal Reddy said...

Sir jee,

మీరు మరీనండి.... మీతో పోలిస్తే మీడియాలో, జీవితంలోను నిజంగానే కుర్ర కుంకను, జస్ట్ ఆర్నెల్ల క్రితమే మూడో దశాబ్ధంలోకి అడుగుపెట్టానో లేదో, నాకంటే బహుశా ఓ ఏడాది పెద్ద వయసుండే నర్సుగారు నన్ను 'అంకుల్' అని మా అమ్మ, నాన్నల ముందే నిర్మొహమాటంగా పిలిస్తే ఏమి చెయ్యలేకపోయాను. సరే సందర్భం వచ్చిందా కాబట్టి చెప్పాల్సిందే. వారం కిందట నాకు కూతురు పుట్టింది. బుజ్జిది పుట్టడానికి ఒక రోజు ముందు మా ఆవిడను హాస్పిటల్ లో చేర్చేటప్పుడు అదే సదరు నర్సులుంగారు "బాబు ఈ ఇంజెక్షన్ అర్జంటుగా తీస్కురా" అని చెప్పింది. 24 గంటల తర్వాత నా కూతుర్ని చూద్దామని వెళ్లేసరికి "అంకుల్... ఇప్పుడు పేషెంట్ ని డిస్టర్బ్ చెయ్యొద్దు" అంది. దాని తల్లి... నాకు తల నేరుపూ లేదు, బాణ పొట్టా లేదు, కాస్తో కూస్తో ఫిగరు కాన్షియస్సు ఉన్నవానే, అదేమీ మాయరోగమో గానీ ఈ అంకుల్, తాత, అంటి జాడ్యం మరీ పెరిగిపోయింది. అసలు వయసు, వరస అనే ఆలోచనే లేకుండా పోతుంది.

Thirmal Reddy
thirmal.reddy@gmail.com

Sasidhar said...

బాగుంది మీ పోస్ట్ . రంగేయడం ఇష్టం లేకపోతే ఇంకో రెండు మార్గాలున్నాయి. ఒకటి, అనుపమ్ ఖేర్ లాగా గుండు మైన్టైన్ చెయ్యడం, రెండోది, "Middle Age Starts at 80" అని పాడుకోవడం.
గమనిక: మొదటి ఆప్షన్ మొగవాళ్ళకు మాత్రమే

~ శశిధర్ సంగరాజు.

www.sasidharsangaraju.blogspot.com

విజయ్ అనంగి said...

ఎర్లీవర్రీ... నాకే అనుకున్నా... ఇప్పటిదాకా... కాదు.. 'పెద్ద'లు చాలామందే ఉన్నారు...! అయితే... మీఅందరికీ ఫార్టీ,థర్టీల్లో వినిపించిన 'తెలిమంత్రం' నాకు టెన్తనంతరఏడాదికే... గూబగుయ్యిమనిపించింది. 15 ఏళ్లకు ముందే నెత్తిన వెండిగంటలు మోగాయ్ మరి. పదిఫస్టులోనే కొట్టి... చదువు'కొన'లేక... పనికి కుదురుకున్నా. భద్రాచలంలో.. ఓ వీడియో లైబ్రరీషాప్. అందులో పని నాది. రోజూ షాపుకొచ్చే ఓ ఎర్రతోలుపాప ఆరోజుకూడా టకటకా మెట్లెక్కి వచ్చి.. 'బ్లూలాగూన్ ప్రింట్ బాగోలేదటంకుల్... మాడాడి డబ్బులివ్వొద్దన్నారంది'. పదిపోతే పోయాయ్..!! పాప ఎంతమాటంది...!? ఇక అప్పుడు మొదలైన వర్రీ... ఇప్పటికీ అప్పులోడిలా వెంటాడుతూనే ఉంది. అదీ సంగతి అంకుల్ సర్... మీరేమి బాధపడొద్దేం..!! ఎర్లీవర్రీ అందరికీ కొర్రీనే మరి..

పిఆర్ తమిరి said...

నేను ఉద్యోగ రీత్యా రేణిగుంటలో పనిచేస్తున్నపుడు మొదట్లో అక్కడి వారి పిలుపులు ఆశ్చర్యం కలిగించాయి. నన్ను పక్కింటి పిల్లాడు అన్నా అని పిలిచాడు. మా అవిడిని అక్కా అన్నాడు. ఆ పిల్లాడు సరే .. వాడి తండ్రి కూడా నన్ను అన్నా అన్నాడు. షరా మామూలుగా మా ఆవిడినీ అక్కా అని సంబోధించాడు.. ఇలాంటివే మరిన్నో... ఇలాంటి వరుసలను నిజమైన వరుసలుగా పరిగణించకూడదని, అవి కేవలం సంబోధనలుగానే స్వీకరించాలని తర్వాత అర్థం ఆయింది.. మన పేరు తెలీనపుడు ఇలాంటి పిలుపులు మేలు కదా?-- ఓయ్... ఏమోయ్... ఇదిగో....ఏమండోయ్...తదితరాల్ కంటే..

RSReddy said...

@Thirumal
24 గంటల తర్వాత నా కూతుర్ని చూద్దామని వెళ్లేసరికి "అంకుల్... ఇప్పుడు పేషెంట్ ని డిస్టర్బ్ చెయ్యొద్దు" అంది.
ఆ నర్సు 'పాప ' కరక్ట్‌గానే పిలిచిందనుకోవాలి:) ఎందుకంటే 24గంటలకుముందు మీరింకా పాప తండ్రి కాదు కనుక బాబు/ తమ్మీ/అన్న. తర్వాత ఓ పాప తండ్రిగా ఈ పాపకు:) అంకుల్:)?!
ఇంకా- ఈ'పాప ' గోల ఏంటంటే నన్నుగానీ, మా ఆవిడనుగానీ ఇలాగే ఎవరైన పిలిచినప్పుడు మేం వెంటనే ఏవమ్మా నువ్వేమైనా చిన్న పాప(ఒక్కోసారి బొప్పెమ్మ)వనుకుంటున్నావా, మేం నీకు అంకుల్/ ఆంటీ లాగా అనిపిస్తున్నామా? అంటూ ఏమాత్రం మొహమాటపడకుండా క్లాసులు పీకేస్తాం:) ఇద్దరూ ఇద్దరమే. తగ్గేదేలేదు. ఇకముందు అలా మరొకర్ని పిలవొద్దు అనికూడా హెచ్చరిస్తాం.
అన్నట్లు తిరుమల్ సోదరా వెల్‌కం టూ థ వాల్డ్ ఆఫ్ "ఆడపిల్ల ఫాదర్స్"!
ఎందుకంటే నాకు ఆడపిల్ల అంటే ఎంత ఇష్టం అంటే మనలాంటి (కాస్త స్థితి/ జ్ఞానమంతులందరికీ) వారందరికీ ఆడపిల్లలే పుట్టాలనే వింత కోరిక నాది. లాజిక్ ఏమిటంటే అలా కాకుండా పాపం కాస్త పేదరికంలో ఉండే ఇంట్లో ఆడపిల్ల పుడితే ఎన్నో కష్టాలెదుర్కోవలసి వస్తుంది:
మరిన్ని వివరాలకు నా పోస్ట్ "ఆడపిల్ల దేశానికి గర్వకారణం"చూడండి@http://dare2questionnow.blogspot.com/2010/11/blog-post_24.html

RSReddy said...

@పిఆర్ తమిరి
" మన పేరు తెలీనపుడు ఇలాంటి పిలుపులు మేలు కదా?-- ఓయ్... ఏమోయ్... ఇదిగో....ఏమండోయ్...తదితరాల్ కంటే.."
కాదు గురూజీ. సార్, మేడం అనే రెండు ఆంగ్ల అరువు పదాలుండనే ఉన్నాయిగదా. అవి వాడితే చూసేవాళ్ళముందు మనకూ గౌరవం, మనమూ హ్యాపీ కదా:)

ఆ.సౌమ్య said...

హా మీదాక ఎందుకు.....నాకన్నా కనీసం 10-15 వయసు పెద్దవారైన వాళ్ళు కూడా ఆంటీ అంటూ ఉంటే కక్కలేక మింగలేక చస్తున్నాను. బ్లాగుల్లో ఈ గోడు చాలామంది వెళ్ళబోసుకున్నారు. మనసులో మాట సుజాత గారు, వికటకవి శ్రీనివాస్ ఇలా అందరూ తమ బాధని బ్లాగుల్లో కక్కేసారు. ప్చ్ ఇంకేమీ చెయ్యలేము. మీకు జుట్టు నెరిసింది కాబట్టి అలా అనిపిస్తున్నాదేమో...నన్నెందుకు ఆంటీ అంటున్నారో తెలియక చస్తున్నా నేను.

నరేష్ నందం (Naresh Nandam) said...

బాగుంది.. బాగుంది.. ఎక్కడో ఒకటో రెండో.. 40ఏళ్లు దాటాక సగం తలో.. తెల్ల జుట్టు వచ్చిన మీరే అలా అనుకుంటే నేనేమనాలి?
ఒక్కొక్కరూ పెళ్లయి పిల్లలు పుట్టిన తర్వాత అంకుల్స్ అని పిలిపించుకుంటున్నామని బాధ పడుతున్నారు. మరి నా సంగతేంటి?
నిండా 27 లేవు..
88కేజీల బరువుతో.. గుండ్రాయిలా తిరిగే నన్ను చూసి అందరూ అంకుల్ అనటమే! మా పెదనాన్న కొడుక్కి కొడుకు.. అంటే వరసకు నా కొడుక్కి.. ఇప్పుడు 15ఏళ్లు. వాడు చక్కగా బాబాయ్ అంటాడు. నాకూ అదే ఇష్టం కాబట్టి నో ప్రాబ్లెమ్.
బాబాయ్=అంకుల్ కనుక నేనూ అంకుల్‌నే అని సరిపెట్టుకుంటున్నా..
అయినా మన పిచ్చి కాని.. ఇప్పుడు (నా) కొడుకుల్ని, కోడళ్లని లెక్క వేస్తే ఎంతమంది అవుతారో మరి.


మనలో మనమాట..
నన్ను చూసి మీరేమనుకున్నారు?
రిప్లై కామెంట్ కాకుండా.. సెల్లుకి ఓ మెసేజ్ పెట్టండి. ఇప్పటికి అందరినీ నవ్వించింది చాలు! ఇక మిగతా బ్లాగుల్లో కూడా మన మీద డిస్కషన్ మొదలవుతుంది.

kvramana said...

అంకుల్ బూతు కాదు. అది వయసునూ తెలియచెసే సంబోధన కాదు. ఈ రొజుల్లో ఇంగ్లీష్ లో మాట్లాడే ప్రయత్నం లో భాగంగా అందరూ అలా అంటున్నారని నాకు అర్ధం ఐంది.

premade jayam said...

10 ఏళ్ళ క్రితం నా పెళ్ళికి నేనే దండలు కొనుక్కుందామని వెళ్లి 28 ఏళ్ళ వయస్సులోనే పూల పాప దగ్గర అంకుల్ అయ్యాను. ఆ పిల్ల మాయావిడ కన్నా నాలుగైదు ఏళ్ళు ముదురు. అప్పటి నుంచి పదోన్నతి లేకుండా అంకుల్ గానే ఉన్నా.

జ్ఞానం ఎక్కువైతే కళ్ళల్లో ఆసక్తి తగ్గి పోతుంది. లౌకిక వ్యవహారాలపై పట్టు తగ్గుతుంది. అప్పుడు జుట్టు నల్లగా ఉన్నా చూసే వాళ్లకు తాతయ్య లాగా కనబడతాం.

నేను కొన్నేళ్లుగా జ్ఞానం విషయంలో జాగ్రత్త పాటిస్తున్నా.

Krupal kasyap said...

నా కైతే మాత్రము ఎవరనా పదిహేను - ఇరవై సంవత్సరాల వయసు పిల్లలు నన్ను అంకుల్ అని పిలిస్తే ఎంచక్కా వాళ్ళని ఎత్తుకొని ముద్దాడి ఒక చాక్లెట్ / లాలిపాప్ కొని ఇవ్వాలనిపిస్తుంది ;)