Monday, October 23, 2017

క్రీడాభిమానులకు భలే... పసందైన సండే!

అక్టోబర్ 22, 2017, ఆదివారం, క్రీడాప్రియులకు నిజంగా పసందైన రోజుగా గుర్తుండి పోతుంది. నాలుగు క్రీడల్లో (హాకీ, బాడ్మింటన్, క్రికెట్, టేబుల్ టెన్నిస్) మంచి మ్యాచ్ లు కనువిందు కలిగించాయి. టెలివిజన్ లైవ్, లైవ్ వెబ్ స్ట్రీమింగ్ ద్వారా ఏకకాలంలో ఇంట్లో కూర్చుని ఈ నాలుగు ఫైనల్స్ చూసే మహద్భాగ్యం కలిగింది.

ఆసియా ఛాంప్స్... మన హాకీ వీరులు 

బంగ్లాదేశ్ రాజధాని ఢాకా లో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో భారత హాకీ ఆటగాళ్లు చెలరేగి ఆడి 2-1 స్కోరుతో మలేషియాను మట్టికరిపించి... టైటిల్ స్వాధీనం చేసుకున్నారు. ఒక దశాబ్ద కాలం తర్వాత గానీ మనకీ భాగ్యం దక్కలేదు! కిందటి డిసెంబర్ నుంచి భారత మహిళల జట్టుకు కోచ్ గా ఉన్న Sjoerd Marijne (నెదర్లాండ్స్) పురుషుల జట్టు కోచ్ గా ప్రమోషన్ పొందిన కొన్ని రోజులకే నమోదైన మధుర విజయం ఇది.  నాలుగున్నర సంవత్సరాల పాటు హాకీ ఇండియాకు సేవలందించిన డచ్ కోచ్ Roelant Oltmans ను అర్థంతరంగా తొలగించి Marijne కు అవకాశం ఇచ్చారు ఈ సెప్టెంబర్ లో.  
సూపర్-4 దశలో నే మన ఆటగాళ్లు తడాఖా చూపించి 6-2 తో మలేషియాకు షాకిచ్చి తమ సత్తా చాటడంతో ఫైనల్ లో విజయం అంత పెద్ద కష్టం కాదని ముందే అనిపించింది. అంతకు ముందు కాంస్య పతకం కోసం పాకిస్థాన్  జట్టు కొరియాపై ఆడిన మ్యాచ్ కూడా అద్భుతంగా జరిగింది. మన సోదరులు 6-3 స్కోరుతో కొరియాను ఓడించి మెడల్ తో ఇంటికి వెళ్లారు. మొత్తం టోర్నమెంట్ లో దాయాదుల ప్రదర్శన చాలా బాగుంది. 

డెన్మార్క్ ఓపెన్ లో... శ్రీకాంత్ అదరహో

మంచి ఊపు మీద ఉన్న హైదరాబాద్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ డెన్మార్క్ బాడ్మింటన్ ఓపెన్ ఫైనల్లో తన కన్నా 12 సంవత్సరాల పెద్ద వాడైన కొరియన్ ఆటగాడు లిన్ హ్యూన్ ను అలవోకగా  ఓడించి... ఈ ఏడాది మూడో టైటిల్ ను కైవశం చేసుకున్నాడు. రెండో రౌండ్ లో జిన్ (కొరియా) ను 21-13, 8-21, 21-18 స్కోరుతో, క్వార్టర్ ఫైనల్ లో ప్రపంచ చాంపియన్ విక్టర్ ఆగ్జల్ సన్ (డెన్మార్క్) ను 14-21, 22-20, 21-7 స్కోరుతో  ఓడించిన శ్రీకాంత్ కు ఫైనల్స్ లో ప్రత్యర్థి నుంచి ఏ మాత్రం పోటీ లేకుండా పోయింది. అద్భుతమైన విజయాలు నమోదు చేసుకుని ఫైనల్స్ చేరుకున్న లిన్ కోర్టులో ఏ మాత్రం కదల్లేకపోవడం, పోటీ ఏకపక్షం కావడం.... అభిమానులకు నిరాశ కలిగించినా, తెలుగు ఆటగాడి  విజయం పరమానందం కలిగించింది. 

క్రికెట్ లో విరాట్ విశ్వరూపం...  

ముంబాయి లో న్యూజిలాండ్ తో జరిగిన మొదటి వన్డే క్రికెట్ మ్యాచ్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీ తన 200 మ్యాచ్ లో వీరోచితంగా ఆడి 121 పరుగులు చేసి మొనగాడినని నిరూపించుకున్నాడు. సచిన్ తర్వాత (49 సెంచరీలు) అత్యధిక వందలు (31) సాధించిన బ్యాట్స్  మ్యాన్ గా రికార్డు కెక్కాడు. అయితే... ఈ మ్యాచ్ లో ఇద్దరు కివీస్ ఆటగాళ్లు టామ్ లేథమ్ (103 నాటౌట్), రాస్ టేలర్ (95) అద్భుతంగా ఆడి విరాట్ సేనకు విజయానందం దక్కనివ్వలేదు. 

టేబుల్ టెన్నిస్ లో జర్మన్ల సంచలనం 

ఆదివారం నాడే బెల్జియం లో జరిగిన పురుషుల ప్రపంచ కప్ లో పెను సంచలనం నమోదయ్యింది. 36 ఏళ్ళ జర్మనీ ఆటగాడు టిమో బోల్.. సెమి ఫైనల్స్ లో వరల్డ్ నంబర్-1 మా లాంగ్ (చైనా) కు భారీ షాక్ ఇచ్చాడు. 1-3 సెట్ల తేడాతో వెనుకబడి ఉన్న టిమో అద్భుతమైన పోరాట పటిమ కనబరిచి 4-3 తేడాతో సెమీస్ లో గెలిచాడు. విదేశీ ఆటగాడితో టీటీ కింగ్ మా లాంగ్ ఓడిపోవడం 2012 తర్వాత ఇదే ప్రథమం!

జర్మనీ కే చెందిన దిమిత్రిజ్ చేతిలో ఫైనల్స్ లో టిమో 2-4 తో ఓడిపోయినా... ఈ టోర్నమెంటు లో తనదైన ముద్ర వేసాడు... టిమో. క్వార్టర్ ఫైనల్ లో టిమో చైనా ఆటగాడు.. లిన్ మీద డిసైడర్ లో 4-10 తో వెనుకబడి ఉన్నా 13-11 తో గెలిచి సెమీస్ కు చేరుకున్నాడు. మొత్తంమీద వెటరన్ టిమో ప్రదర్శన, పోరాట పటిమ యావత్ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకం. టీటీఎఫ్ఐ వెబ్ సైట్ లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించిన వారికి ఈ మ్యాచ్ లు మధురానుభూతిని కలిగించాయి. 

0 comments:

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి