Wednesday, October 25, 2017

దెయ్యంతో సెల్ఫీ....భూతంతో భోజనం...


సర్కార్ చేయాల్సిన పని.. గోగినేని బాబు బృందం చేసింది!

తెలంగాణా లో ప్రబలంగా ఉన్న మూఢనమ్మకాలు అన్నీ ఇన్నీ కావు. చేతబడి చేశారని పాపం... పేద, వెనుకబడిన సామాజిక వర్గాలకు చెందిన మహిళలను కొట్టి చంపుతూ ఉంటారు. అందులో ప్రతి ఒక్కటీ దారుణ హత్యే కానీ నిందితులకు శిక్షలు పెద్దగా ఉండవు.

మాబ్ ఎటాక్స్ (గుంపులుగా వెళ్లి దాడి చేయడం) కావడాన సాక్ష్యాలు సేకరించడం కష్టం. న్యాయం కోసం పోరాడే శక్తి సామర్ధ్యాలు బాధిత కుటుంబాలను ఉండదు కాబట్టి హంతకులు తప్పించుకుంటారు. నల్గొండ జిల్లాలో మేము రిపోర్టింగ్ లో ఉన్నప్పుడు ఇలాంటి కేసులు ఎన్నో కవర్ చేశాం. అవన్నీ బాధాకర  మైన అమానుష సంఘటనలు.


మూఢనమ్మకాలు పోవడానికి తెలంగాణా ప్రభుత్వం పెద్దగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కనిపించడం లేదు. హైదరాబాద్ ను గ్లోబల్ సిటీ గా మార్చే బృహత్ కార్యక్రమంలో పాలకులు బిజీగా ఉండడం వల్ల పౌరులు కొంత చొరవ చూపి తమ వంతు బాధ్యత నెరవేర్చడం బాగుంది.

హైదరాబాద్‌కు దాదాపు 240 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలంలోని కాశీగూడ లో ప్రజల్లో పాతుకుపోయిన దయ్యం భయాన్ని పోగొట్టడానికి 
'దెయ్యంతో సెల్ఫీ (సెల్ఫీ విత్ ఘోస్ట్)', 'భూతంతో భోజనం (డిన్నర్ విత్ డెవిల్)' పేర్లతో బాధ్యతాయుతమైనహేతువాద బృందం వినూత్న కార్యక్రమాలు చేపట్టాయి. 

ఊళ్ళో తిరుగుతున్న ఒక ఆడ దయ్యం మూలంగా జనం భయపడుతున్నారని, కొందరు దీని మూలంగా ఇళ్ళు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారని తెలిసి వీరీ పని చేశారు. సైన్స్‌ ఫర్‌ సొసైటీ, ఇండియన్‌ హ్యూమనిస్ట్స్, జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు, బాబు గోగినేని ఫేస్‌బుక్ గ్రూప్ ప్రతినిధులు ఇందులో ఉన్నారు. బాబు గారు (పై సెల్ఫీ చూడండి) హేతువాది, టీవీ షోలలో తర్కవితర్కాలతో బాబాలు, స్వామీజీలను కుమ్మేసే ఉత్సాహవంతుడు. ఆయనతో పాటు ఆయన చిన్నారి కుమారుడు అరుణ్, విజయవాడకు చెందిన ఒక జర్నలిస్టుల బృందం కూడా ఉందని బీబీసీ తెలుగు ఒక ప్రత్యేక కథనం లో పేర్కొంది. 

భయం నీడన బతుకుతున్న స్థానికుల్లో అవగాహన కల్పించేందుకు వీళ్ళు ఇంద్రజాలం, నిప్పుల మీద నడక వంటి  కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా.. న్యూరో సైకియాట్రిస్ట్ ఒకరితో గ్రామస్థులకు కౌన్సెలింగ్ ఇప్పించారు. రాత్రి పూట శ్మశానంతోపాటు దెయ్యం ఉందని ప్రచారం జరుగుతున్న ప్రదేశాల్లో కలియదిరిగారు, శ్మశానం నుంచి ఫేస్‌బుక్ లైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వీరు తయారుచేసిన ఫ్లెక్సీ లు చాలా బాగున్నాయి. 
''మాతో సెల్ఫీ దిగాలని దెయ్యాన్ని కోరాం. తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్- నాలుగు భాషల్లో పిలిచినా 'దెయ్యం' రాలేదు. అసలు ఉంటేగా రావడానికి..'' అని బాబు గారు బీబీసీ ఇంటర్వ్యూ లో వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ఆయన చెప్పినట్లు ఇదొక సామాజిక సంక్షోభం. దీన్నుంచి అమాయక ప్రజలను రక్షించేందుకు మంత్రి కే టీ ఆర్ లాంటి వాళ్ళు పూనుకోవాలి. హైదరాబాద్ విశ్వ ప్రపంచమై... తెలంగాణా పల్లెలు.. మూఢనమ్మకాల కోరల్లో చిక్కుకుని ఉంటే చూడ్డానికి/వినడానికి అస్సలు బాగోదు!
ఇలాంటి కథనాలు విస్తృతంగా ప్రచురించి/ ప్రసారం చేసి మీడియా సామాజిక బాధ్యతను నిర్వర్తించాలి. 
(నోట్: ఈ కథనానికి ప్రేరణ బీబీసీ తెలుగు సైట్. కథనం లింకు ఇది: 
చాలా విషయాలు, ఈ ఫోటో కూడా అక్కడినుంచే సంగ్రహించాం. వారికి కృతజ్ఞతలు) 

3 comments:

Zilebi said...


భళి కే టీ యార్ ని పిలిచి
దయ్యాలకోసం ఓ యైటీ కారిడార్ పెట్టిచ్చేస్తే సరి
అన్నీ సర్దుకుంటాయ్ పనీపాటలతో దయ్యాలు‌
బిజీ‌ యైపోతాయ్ :)

జిలేబి

Haribabu Suranenii said...

very nice advise rom jilebi:-)

సన్నాయి said...

చాలా మంచి ప్రయత్నమ్ . అలానే గుడ్డి వాళ్లకి చూపు తెప్పిస్తాం , కుంటి వాళ్ళని నడిపిస్తాం , నపుంసకులకి 'అది' తెప్పిస్తాం అంటూ ప్రచారం చేసే వాళ్ళని కూడా అడ్డుకోవాలి . రాష్ట్రం లో ఎదో ఒక చోట రోజు ఇవే ప్రదర్శనలు.