Sunday, February 7, 2010

అవినీతి డబ్బు వల్ల జబ్బు చేస్తుందా? జీవితంలో గబ్బు లేస్తుందా??

ఈ ఆదివారం రోజు తిండి (వెల్లుల్లి, శనగపప్పు దట్టించిన కాకరకాయలు సైడ్ డిష్ గా తోటకూర, మెంతికూర పప్పు ప్లస్ మజ్జిగ చారు...వగైరా) గురించి రాయడానికి పసందైన దినుసులు ఉన్నా...'ఫర్ గాడ్స్ సేక్..ఇలాంటి రాతలు వద్దు బాబోయ్' అని మొత్తుకుంటున్న రమణన్నకు  భయపడి భుక్తాయసంతో కొత్త టాపిక్ మొదలెట్టాను. అదే..నీతీ నిజాయితీ--అవినీతీ. 


మంత్రులూ...వ్యాపారాలు వద్దు..అని ప్రధాని మన్మోహన్ సింగ్ ఉద్బోధ చేస్తే...నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కావడంలేదు. ఆదర్శప్రాయమైన పటాటోపం లేని జీవితం గడపండి అంటే..ఆ పార్లమెంట్ లో ఒక పది మంది ఎం.పీ.లైనా మిగలరు. సగం మంది రాజకీయంలోకి వచ్చేది ఒక పది తరాల మందం వెనకేసుకోవడానికి. నాకు అవినీతి విషయంలో ఒక ధర్మ సందేహం ఎప్పుడూ కలుగుతుంది. 'ధర్మో రక్షతి రక్షితః' అన్న మాట ఎందుకో గానీ మనసులో నాటుకుపోయింది. అది అక్షర సత్యం అని నాకు చాలా సార్లు నిరూపితమయ్యింది. 
'ది హిందూ' లో పనిచేస్తున్నప్పుడు...ఈ ధర్మం, అధర్మం మీద ఒక ప్రయోగం చేసి కొన్ని విషయాలు తెలుసుకున్నాను. అది మంచి సంస్థే కానీ...జిల్లాలో రిపోర్టర్ కు ఆఫీసు ఇవ్వరు. మన ఇంట్లో ముందు గదే ఆఫీసు. కరంటు బిల్ ఇవ్వరు. అదొక రాయల్ దోపిడీ. ఇదేంటి సార్...దారుణం...అంటే.."ఒకటి రెండు టూర్ బిల్లులు పెట్టుకో...నేను పాస్ చేస్తాను. దానికి దానికి సరిపోతుంది," అని ఒక బాస్ చెప్పీ చెప్పనట్లు చెప్పారు. 

ఈ దొడ్డిదారి ఏర్పాటులో భాగంగా నేను కొన్ని టూర్ బిల్లులు (అంటే...దొంగ బిల్లులన్న మాట) అప్పుడప్పుడు పెట్టేవాడిని. నన్ను నమ్మండి...దొంగ బిల్లు పెట్టి ఒక రెండు వేలో, మూడు వేలో పోగేస్తే...కచ్చితంగా ఆ మొత్తానికి సరిపోను అదనపు ఖర్చు ఆ నెల వచ్చి తీరేది. ఎప్పుడు ఆ టూర్ బిల్ పెట్టినా...ఏదో ఒక నష్టం వచ్చి...ఆ అదనపు సంపాదన మేర జేబుకు చిల్లు పడేది. ఈ పాట్రన్ ను జాగ్రత్తగా స్టడీ చేసి అలాంటి బిల్స్ పెట్టకుండా...వచ్చిన జీతంతో సరిపుచ్చుకున్నాను, హాప్పీ గా బతికాను.
ముందు నుంచీ.. అబద్ధాలు చెప్పడం మహా దారుణం అన్న స్పృహ ఉంది. 'ది హిందూ' లో అనుభవాలు నేర్పిన పాఠాలతో ధర్మం పై మరింత నమ్మకం కుదిరింది. ఒకడి సొమ్ము ఆశించకుండా...ఎవ్వరినీ మోసం చేయకుండా, అబద్ధాలు చెప్పకుండా..నీతీ నిజాయితీ గా బతకడం వల్ల జీవితం సుఖంగా సాగిపోతుందని...పెద్దగా కష్టాలు దరిచేరవని నిర్ధారణకు వచ్చాను. అందుకే...అబద్ధాలు లేని జీవితం కోసం ఒక సంస్థ స్థాపిస్తే...ఒక్కడంటే ఒక్కడైనా అందులో చేరలేదు. అది వేరే విషయం. 


అయితే...నా పరిశీలనలో తేలింది ఏమిటంటే...అవినీతి మార్గాల ద్వారా సొమ్ము సంపాదించిన వాళ్ళలో చాలా మందికి అనారోగ్యం ఉన్నది. వాళ్లకు బీ.పీ., షుగర్, ఇంట్లో భార్యకు నలత, పిల్లలకు ఏదో లోపం, వారి కుటుంబంలో ఏదో తెలియని దిగులు ఉంటున్నాయి. మీ చుట్టూ ఉన్న అవినీతిపరుల కేసి ఒకసారి చూడండి, నిజం తెలుస్తుంది. నల్గొండ బీ.ఎస్.ఎన్.ఎల్.లో భారీ కుంభకోణానికి పాల్పడిన ఒక సీనియర్ అధికారిని ఒక పరిశీలనలో భాగంగా కలిసాను. వాడికి విచిత్రంగా అర చేతిలో నుంచి చీము వచ్చే ఒక జబ్బు సోకింది.  ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. 
మరి అందరు అవినీతి పరులకు అలా జరుగుతున్నదో లేదో నాకు తెలియదు. ఎందుకంటే...దానికి ఒక శాస్త్రీయ అధ్యయనం అవసరం. అలాగే ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు అంతా అవినీతి పరులని అనడమూ తార్కికం కాదు. ఇది కొంత ఆధ్యాత్మిక చింతనగా తోచినా...అవినీతికి ఆరోగ్యానికి ఏదో సహ సంబంధం లేదా కార్యకారం సంబంధం ఉందని నేను గట్టిగా నమ్మే పరిస్థితికి వచ్చాను. హిందూ శాస్త్రాలు, ఇతర మతాలలో పాపం-శిక్ష గురించి చదివాను కానీ..ఇక్కడి పాపానికి ఇక్కడే శిక్ష ఉన్నట్లు నాకు అనిపిస్తున్నది.  ఈ అంశంపై మీ అభిప్రాయలు కూడా తెలియజేయండి. 

ఈ రోజు తేజ ఛానల్ లో వచ్చిన "బ్రహ్మర్షి విశ్వామిత్ర' సినిమాలో సత్య హరిశ్చంద్రుడు ఒక మాట అంటాడు: "సత్యం పలకడం అనేది పరులకోసం చేసే పని కాదు. ఇది మానవ జీవిత గమనానికి సంబంధించిన అంశం."
గ్రీకు వీరుడు అలగ్జాండర్ మరణ శయ్య పై ఉండి తన మిలిటరీ జనరల్స్ ను ఒక మూడు కోరికలు కోరతాడట. అవి:
1) నా శవ పేటికను నా వైద్యుడు మొయ్యాలి
2) నా శవ యాత్ర జరుగుతున్నప్పుడు...నేను ఇన్నాళ్ళు సంపాదించిన వజ్రాలు, బంగారం, సంపద..రోడ్డు మీద చల్లుతూ పోవాలి 
3) నా రెండు చేతులు శవ పేటిక లోపల కాకుండా..బైట ప్రజలంతా చూసేలా వుంచి ఊరేగించాలి. .
ఎందుకిలా అని జనరల్స్ అడిగితే..."నా వైద్యుడు మోయాలని ఎందుకు అన్నానంటే...మరణాన్ని ఎవ్వరూ తప్పించలేరని జనానికి తెలియజెప్పడానికి. ఇంత సంపద ఉన్నా...నా చావు ఆగలేదని చెప్పేందుకు రెండో కోరిక కోరాను. ఇక మూడో కోరిక అంటారా...ఇన్ని ఘోర యుద్ధాలు చేసి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పరిచిన నేను పొయ్యేటప్పుడు...ఒట్టి చేతులతో పోతున్నానని ప్రజలకు తెలియాలి." 
మన ఎం.పీ.లు, రాజకీయ నాయకులు, పేరాశ అధికారులు, జనం మెదళ్ళను బ్రష్టు పట్టిస్తున్న మీడియా జనం...ఇవి గుర్తుపెట్టుకుని...జీవిస్తే...అందరం సుఖంగా ఉండ వచ్చేమో!

16 comments:

నండూరి వెంకట సుబ్బారావు said...

రామూ గారూ,
నాకూ మీలాంటి అనుభవాలు ఉన్నాయి. నేను మీ సిద్ధాంతాన్ని బలపరుస్తున్నాను. నీతీ నిజాయితీగా బతికినప్పుడు మన అవసరాలకు సరిపడా మరొకరివద్ద చెయ్యి చాచకుండా సొమ్ము లభ్యమవుతుందనే నా విశ్వాసం. ఇది జాగ్రత్తగా పరిశీలిస్తే గానీ నమ్మకం కుదరని అంశమే. మొత్తం మీద మంచి సిద్ధాంతాన్ని చర్చకు పెట్టారు. ఎంత మంది విజ్ఞులు దీన్ని సమర్ధిస్తారో, ఎంతమంది వ్యతిరేకిస్తారో చూద్దాం.

పదనిసలు said...

You are absolutely right..!! [Its not a lie..;)]

Saahitya Abhimaani said...

రామూ రారూ,

అవినీతి అంటే ఏమిటి. మీడియా అంటే ఏమిటి అని నిర్వచించాల్సిన అవసరం ఎంతగా ఉన్నదో, అలాగే అవినీతి అంటే ఏమిటి అనికూడ తప్పనిసరిగా నిర్వచించాలి. ఆ తరువాత అవినీతి ఎవరిది? లంచాలు తీసుకునేవాడిదేనా. ఇంకెవరిదీ కాదా? ఇచ్చేవాడుంటే పుచ్చుకునే వాడుంటాడని గడుసుగా తప్పించుకునే అధామధులకు మద్దతుగా అనటం లేదు. కాని, అవినీతిలో పెద్ద ఖాతాలన్ని కూడ, పుచ్చుకునేవాడితో పాటు ఇచ్చేవాడు కూడ ఆ పాపాన్ని సగం కంటే ఎక్కువే భరించాలి. ఈ విషయం మీద గొల్లపూడి మారుతీ రావుగారు తన బ్లాగ్ మారుతీయంలో అవినీతికి పట్టాభిషేకం పేరుతో వ్రాశారు. ఆ వ్యాసానికి నా స్పందన ఈ కింద ఇస్తున్నాను.

మారుతీ రావుగారి బ్లాగును ఈ కింది లింకుతో చూడవచ్చు.


http://koumudi.net/gollapudi/010410_corruption.html

అవినీతికి కారణాలు అనేకం. అందులో ముఖ్యమైనది లంచాలు ఇచ్చేవాడే. వీడికి ఎంత ఉపయోగం లేకపోతే అంతంత లంచాలు ఇస్తాడు. సమాజంలో ఇప్పుడు ప్రతివాడూ అవినీతి గురించి నీతులు వల్లించేవారే. కాని, ఎంతమంది, నిబంధనల ప్రకారo వాళ్ళ వాళ్ళ డ్రైవింగు లైసెన్సు తీసుకున్నారు. ఇళ్ళు కట్టుకునేప్పుడు, ఎంతమంది పూర్తిగా నిబంధనలను అనుసరించి కట్టుకుంటున్నారు. ఎంతమంది అసలు అనుమతి తీసుకుని కట్టుకుంటున్నారు. మనకు వెను వెంటనే పనులు అయిపోవాలి, నిబంధనల ప్రకారం పనులుచేసుకునే ఓపిక ఆ నిబంధనల మీద గౌరవం మనకు లేదు. ఒక వేళ ఆనిబంధనలు అసంబధ్ధంగా ఉన్నాయనుకున్నాపుడు, ఏనాడన్నా ఎవరన్నా వాటిగురించి అభ్యంతరం చెప్తారా? లేనేలేదు. మన లెజిస్లేటర్లు అలా చట్టాలను చేసిపారేస్తూ ఉంటారు. ఆ లెజిస్లేటర్లను ఎన్నుకోవటానికి ఓటు వెయ్యటానికే మనకు టైము లేదు, ఓపిక లేదు, ఓటు వెయ్యలేదని గొప్పగా చెప్పుకోవటమే ఫ్యాషన్.

అలెగ్జాండరు సోలెజెత్సియాన్, ఒక సందర్భంగా ఇలా అన్నాడు, "మనం పొరబాట్లు చేస్తున్నది, మనకి తెలియక కాదు, అలా చెయ్యటం సౌకర్యంగా ఉండటం" వల్ల అని, ఇది మనకు పూర్తిగా వర్తిస్తుంది.

కూతురికి పెళ్ళి చెయ్యాల్సి వచ్చినప్పుడు, ఒక పట్టభద్ర యువకుడు, జనాభా లెక్కల ఆఫీసులో యు డి సి గా పనిచేసేవాడు ఒకడు, పదో క్లాసు ప్యాసయ్యి, చెక్‌పోస్టులో ప్యూనుగా పనిచేసే కుర్రాడు సంబంధాలు వచ్చాయనుకుందాము. ఎవరికిచ్చి చేస్తారు? తప్పనిసరిగా పదోక్లాసు చదివి ప్యూను ఉద్యోగం చేసేవాడికే!! కారణం వాడు రెండుచేతులా, సంపాయిస్తాడు, అమ్మాయి సుఖపడుతుంది, జనాభా లెక్కల ఆఫీసులో ఏముంది నా బొంద! ఇదీ ఒక సగటుమనిషి అలోచన. ఎవరిగురుంచో ఎందుకు, ఎవరికి వారు వారి బంధువులలో ఉన్న అవినీతి పరులైన అధికారులు ఉండేఉంటారు. వాడు (చేసేది గుమాస్తా లేకపోతే సెక్షన్ అఫీసరు ఉద్యోగం) కట్టిన మూడో అంతస్తుకి గృహప్రవేశానికి వెళ్ళి ఆనందిస్తారుకాని, వీడేమిటి ఎలా సంపాయించాడు అని నిలదీస్తారా (ఏదో అప్పుడప్పుడు అసూయ పెల్లుబికినప్పుడు అక్కసుతో వాడిని ఆడిపోసుకోవటాం తప్ప).

అవినీతి పూర్తి జనాభాలో ఉన్నది. మనకు అవసరమైనప్పుడు అది అవినీతి కాదు. మరెవడో చేస్తుంటే అది అవినీతి. గొల్లపూడిగారు సరిగ్గా చెప్పారు "ఈ దేశంలో చెల్లిపోయే అవినీతి, చెల్లించుకునే అవినీతి, నిరూపించలేని అవినీతి, నిస్సహాయంగా తలవొంచాల్సిన అవినీతి, నిలదొక్కుకున్న అవినీతి, నిలదీసే అవినీతి, పబ్బం గడుపుకునే అవినీతి-ఇలా కోకొల్లలు ఉన్నాయి. నిజానికి ఒకే ముఖం. అబద్దానికి అరవై ముఖాలు"

అవును "చికిత్స మరెక్కడో ప్రారంభం కావాలి" నిజమే. ఎక్కడనుంచి?? సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళనుంచి. ప్రతి ఒక్కరూ, మనకున్న నిబంధనల ప్రకారం నడుచుకుందాము, నిబంధనల ప్రకారం కట్టవలసినవి కట్టేద్దం అనుకుంటే 80 శాతం అవినీతి పోతుంది. మిగిలినది, సరైన పోషణ లేక కాలక్రమేణా నశిస్తుంది. ఏవైనా నిభంధనలు దుర్మార్గంగా ఉన్నాయని, అసంబధ్ధంగా ఉన్నాయని అనుకున్నప్పుడు, నలుగురిని కూడతీసుకుని వాటి సవరించే/తీసేసే వరకు ఒక పధ్ధతి ప్రకారం కృషి చెయ్యగలిగే ఓపిక, సమయం మన దగ్గర ఉన్నప్పుడు, అవినీతికి అవకాశం ఉన్న నిబంధనలను తగ్గించవచ్చు. అసలు, కీలకం 100 శాతం ఓటింగు చెయ్యటం. అది సాధిస్తే అవినీతి పిశాచి ఢడుచుకుంటుంది.

Ramu S said...

"భుక్తాయసం" బదులు "భుక్తాయాసం" అనీ..."కార్యకారం" బదులు "కార్యకారక" అని చదువుకోగలరు. తప్పులకు సారీలు...రాము

చిలమకూరు విజయమోహన్ said...

నేను కూడా మీ సిద్ధాంతాన్ని బలపరుస్తున్నాను

nomi said...

శివ గారితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. మార్పు మననుండే మొదలు కావాలి.

Jagadeesh Reddy said...

రామూ గారిని నేను 100% బలపరుస్తున్నాను. నా అనుభవంలో కూడా ఇలాగే జరిగింది. నేను ఒక ఇండస్ట్రీ పెడదామని తిరుగుతున్నపుడు చాలా డిపార్ట్‌మెంట్ వాళ్ళని కలిసాను. అందరు పెద్ద పెద్ద ఆఫీసర్లే. వారితో మాటలు కలిపినప్పుడు, నేను స్వయంగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అక్కడి పరిస్తితులు పరిశీలించినపుడు వాళ్ళందరూ (ప్రత్యేకించి లంచాలు ఎక్కువ డిమాండ్ చేసే వాళ్ళని) నాకు ఎన్నొ విస్తుపోయే వాస్తవాలు కనిపించాయి. అటువంటి ఆఫీసర్లకి గాని, వాళ్ళ ఇంట్లో మరొకరికి గాని రాము గారు చెప్పినట్లు ఏదో ఒక తీరని సమస్య వుండేది. ఇలా ఒక అయిదారుగురిని పరిశిలించిన మీదట రాము గారికి కలిగిన అనుమానమే నాకూ కలిగింది. మరి కొందరితో పోల్చి చూసుకుని నా అనుమానాన్ని నిర్ధరించుకున్నాను. ఇన్నాళ్ళకి మళ్ళా నా ఆలోచనల నుంచి మంచి విషయం బయటకి వచ్చింది. స్వర్గం, నరకం ఎక్కడో మరో లోకంలో లేవు. ఏ మనిషయినా తను చేసిన మంచి / చెడు ఇక్కడే అనుభవించి పోతాడు. ఒకరికి హాని చేసి కూడా నేను బాగానే వున్నాను, ఇంకెప్పటికీ ఇలానే వుంటాను అని ఎవరయినా అనుకుంటే వాడంత వెర్రిబాగులవాడు ఈ లోకంలో వుండడు.

రవిచంద్ర said...

మీరు చెప్పిన అలెగ్జాండర్ కథ నా బ్లాగులో కూడా రాశానండీ..

VENKATA SUBA RAO KAVURI said...

otti asaastreeyam.

ramjee said...

yes 100%correct am agreee with you

Anonymous said...

100 % correct

విజయ క్రాంతి said...

ఒక చిన్న సలహా ... తప్పు గా అనుకోకండి ...
మీరు ఇంతకు ముందో టపా రాసారు .
భాష ని సరిగా వాడటం లేదు అని . మీరు పెట్టిన టైటిల్ ఈ టపాకి ఎలా వుందో గమనించార ?

గబ్బు లేచిపోవటం ఎంటండి ? ఇది కూడా ఇలా ప్రచార సాధనాల భాష నుండి వచ్చిందే అనుకుంటా ..
నాశనం అవుతుందా అంటే బావుంటుందేమో ?

మిమ్మల్ని అవమానించటం నా ఉద్దేశ్యం కాదు . ఏదో తోచింది చెప్పాను. క్షమించండి

Unknown said...

Corruption is a universal phenomenon.We have to swim,live and die with it.We are leading our lives in the sea of corruption and every citizen one time or other had got the things done by bribing and done the things by taking bribes.Let us leave the after effects of the corruption to their fate whether in this birth or next.It is true the money earned through corrupt means will never stay with any one and one day or other the corrupt money will be drained out.No one on earth can eradicate corruption but it can be contained and controlled a bit only through various means by the govt,the voluntary organisations and spiritual awareness to become a good citizen.Whatever it may be let us forget aboput the corruption and try to get adjusted,compromised and live with it otherwise we cannot survive in this country as to have a divine darshan of GOD we have to bribe the poojari.

JP Reddy

Unknown said...

Corruption is a universal phenomenon.We have to swim,live and die with it.We are leading our lives in the sea of corruption and every citizen one time or other had got the things done by bribing and done the things by taking bribes.Let us leave the after effects of the corruption to their fate whether in this birth or next.It is true the money earned through corrupt means will never stay with any one and one day or other the corrupt money will be drained out.No one on earth can eradicate corruption but it can be contained and controlled a bit only through various means by the govt,the voluntary organisations and spiritual awareness to become a good citizen.Whatever it may be let us forget aboput the corruption and try to get adjusted,compromised and live with it otherwise we cannot survive in this country as to have a divine darshan of GOD we have to bribe the poojari.

JP Reddy

Ramu S said...

"తెలుగు భాషకు 'వాచిపోతున్నది' ఇక్కడ' అని నేను పెట్టిన ఇంతకు మునుపు శీర్షికకు నాకు అభ్యంతరాలు వస్తాయని అనుకున్నాను. అలాంటి పదాలు వాడుతున్న వాళ్ళను తిడుతూ...నేనూ అదే వాడడం తప్పు...తప్పున్నర. కానీ..."గబ్బు లేవడం/గబ్బు కొట్టడం" అన్న పదాలు అభ్యంతరకరం కాదనే అనుకుంటున్నాను. తెలుగులో సాధికారికంగా ఇదే కరెక్టు అనే పరిజ్ఞానం నాకు లేదు కానీ...నాకు తెలిసినంత వరకు కంపు కొడుతుందన్న భావనలో 'గబ్బు లేవడం' అని వాడాను. విజయ క్రాంతి గారైనా...మరెవరైనా...ఆ శీర్షిక ఎందుకు తప్పో చెబితే...సంతోషం. ఒక రాయలసీమ మిత్రుడు ఈ ప్రయోగం చేయడం తరచూ వినేవాడిని...
థాంక్స్
రాము

Anonymous said...

That particular usage is there in Raayalaseema. We have to respect the language and expressions of all regions.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి