Tuesday, September 6, 2011

మా మంచి గురువర్యా...ఓ బూద..."రాజా..."


September 5, 2011
సోమవారం
డియర్ సర్...నమస్తే...  
అంతా టీచర్స్ డే జరుపుకుంటుంటే...మీరు గుర్తుకు వస్తున్నారు...పొద్దటి నుంచీ. సొర్గంలో ఒక చీమచెట్టు కింద ఒక బల్ల ముందు కుర్చీ వేసుకుని...భూతద్దాల కళ్ళజోడు సాయంతో ఏదో పదకోశమో, మీ సమకాలీనులు ఎవ్వరూ సాహసం చేయని ఏదో ప్రాజెక్టుతో బిజీ గా వున్నారని భావిస్తున్నాను. లేకపోతె అక్కడ శాసనాల పరిశీలన విశ్లేషణ హడావుడిలో ఉండి వుంటారు. మధ్య మధ్యలో మీకు నచ్చని ఏదో విషయంలో ఎవడ్నో బూతులు దోకుతున్నా...అక్కడ మీకు ఏర్పడిన శిష్యులతో చర్చలో ఉన్నా ఆపి ఇది కాస్త చదవండి సార్. ఇంకా పొద్దు పోలేదు  కాబట్టి, నేను పెద్ద పండితుణ్ణి గానీ, భాషా సామర్ధ్యం ఉన్నవాడిని గానీ కాదు కాబట్టి పోనీలే  వెధవ అని వదిలేస్తారని అనుకుని తెలిసిన తెలుగులో నాలుగు ముక్కలు రాస్తున్నా. బుర్ర తక్కువ 'కంత్రిబ్యూటార్ గాళ్ళ'లో నేనూ ఒకడ్ని. తప్పులుంటే క్షమించండి. 

  ఒక తొమ్మిది నెలల పాటు మీ శిష్యరికం చేసినందుకు...కాస్త లోకజ్ఞానం అబ్బడం సంగతి అలా ఉంచితే...మీ దగ్గర చదువుకున్నందుకు...' మీరు అదృష్టవంతులు' అని నేను మంచి ఎథికల్ ఎడిటర్ గా మొన్నీ మధ్య దాకా అనుకున్న ఒకాయన అంటే...మనసు ఉప్పొంగింది. అబద్ధాల ఇటుకలు పేర్చి, కుళ్ళు-రాజకీయం రంగరించి కెరీర్ బిల్డింగులు కట్టుకుంటున్న తుక్కు జర్నలిస్టులు కూడా మీ పేరు చెప్పగానీ...కొద్దిగా భక్తి తో మాట్లాడతారు. అది మరి మీ స్పెషాలిటీ. గురూజీ...మీరు దాన్ని ఒక సిలబస్ గా పెట్టలేదు కానీ....ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం మా అందరికీ నేర్పారు. శిష్యుల దగ్గర ఏదీ దాయకుండా...జీవితపు సారాన్ని రంగరించి భలే చెప్పేవారు. మీ మాటల విరుపులు, కళ్ళల్లో ఆ మెరుపులు నాకు ఎప్పుడూ గుర్తుకు వస్తాయి. దగ్గరుండి మీరు చెప్పిన అనువాదపు పాఠాలు...మధ్యాన్నపు అన్నపు బడలికను భలే పారదోలేవి. 

రామోజీకి కుల పిచ్చి వుందని ఎవడో అంటే...మీరు చెప్పిన మాట విని మీ కొత్త స్టూడెంట్ అయిన నాకు ఏమనాలో తెలియలేదు. "అదొట్టి పిచ్చి మాట. వాడికి (రామోజీకి) ఎవరు వంద రూపాయలు ఇచ్చినా తీసుకుంటాడు," అని జర్నలిజం స్కూలు ఆవరణలో సిగరెట్ కాలుస్తూ మీరు ఆలవోకగా అన్నమాట మాకు షాకిచ్చింది. మీరు ఏ మాటకు ఆ మాటే.    సినారె ను తిట్టకుండా మీకు రోజు వెళ్ళేది కాదు గదా. తర్కం అనే కత్తితో, వ్యంగ్యం అనే రంపంతో ఆయన్ను మీరు ఛీల్చినా అది మాకు తిట్టినట్లు మొట్టినట్లు అనిపించేది కాదు.  నోటి దురుసుతనం వల్ల మీకు అవార్డులు, పెద్ద పదవులు రాలేదని అంటున్నారు. బైటికి మంచిగా కనిపిస్తూ...లోకానికి నీతిమంతులని కలరిస్తూ...లోపల విషపు కుట్రలు చేసే సంపాదకుల కన్నా...ఏ అవార్డు రాకపోయినా మీరే బంగారం.
ఉద్యోగంలో చేరిన తర్వాత...కొందరు సీనియర్లు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినప్పుడు డెస్క్ కు వచ్చి...పక్కకు తీసుకుపోయి మీరు నాకు చెప్పిన జాగ్రత్తలు ఇప్పటికీ గుర్తే సార్. మీ సహృదయత నాకు నేర్పిన పాఠం ఇప్పుడు సెంట్రల్ యూనివెర్సిటీ లో ఎందరో నా శిష్యులకు మేలు చేస్తోంది. ఈ విషయంలో మీ నుంచి నేర్చుకున్న లక్షణం వల్ల ఇప్పుడు నా స్టూడెంట్స్ సెటిల్ అయ్యే దాకా నేను సహకరించకుండా ఉండలేక పోతున్నా. నా శిక్షణలో రాటు దేలి ఉద్యోగం పొందాక...వారు చేసే మొదటి ఫోను అందుకున్నప్పుడు మీరు అప్రయత్నంగా నాకు గుర్తుకు వస్తారు.

కంట్రిబ్యూటర్లు అంటే మీకున్న కోపం వల్ల నేను మిగిలిన కొందరిలా మీకు దగ్గర కాలేక పోయాను. మూడు నెల్ల పరీక్షలో నా ఆన్సర్ షీట్ మీద 'ప్రాణం లేచి వచ్చింది...తెలుగంటే ఇలా ఉండాలి...' అని మీరు చేసిన రిమార్కు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఆ వ్యాఖ్య ఇచ్చిన కిక్కు అలాంటి ఇలాంటిది కాదు సార్. మీరు నేర్పిన ముక్కుసూటి తనం వల్ల కావచ్చు సార్...మిత్రులు చాలా మంది పెద్దగా ఎదగలేక పోయారు. మీ శిష్యులని ముద్ర పడిన పాపానికి కొదరికి శిక్ష పడింది. ఏంటో సార్...ఏవేవో గుర్తుకు వస్తున్నాయ్. 

పట్టాల ప్రధానోత్సవం రోజు..."నలుగురు కూచుని నవ్వే వేళల నా పేరొక తరి తలవండి ' అని పుత్తడి బొమ్మ పూర్ణమ్మ నుంచి గురజాడ ను ఉటంకించి ప్రసంగం ముగించారు. మీ పేరు తలవకుండా మేము ఎప్పుడూ ఉండలేము సార్..ఇక ఉంటా... మీకు టీచర్స్ డే గ్రీటింగ్స్. 

అన్నట్టు మరిచి పోయాను సార్. మీరు క్షమించాలి. మీ గుర్తుగా యేవో ప్రోగ్రామ్స్ చేయాలని మీ శిష్యులందరం చాలా సార్లు అనుకున్నాం. నేనూ చాలా అనుకున్నా. మీటింగ్ లో చాలా కోతలు కోసాం. మీ చితి సాక్షిగా మేము వాయు వేగంతో ఒక పత్రిక తెచ్చాం. అది చూసి మేము మీ కోసం ఇంకా ఏదో అద్భుతం చేస్తామని పిచ్చి జనం భావించారు. సారీ సార్...మేము వృత్తిలో బిజీ. సంసార సాగరంలో, డబ్బు సంపాదనలో చాలాబిజీగా వున్నాం...మాకు తీరిక దొరికినప్పుడు...అవి చేస్తే చేస్తాం. మీరు మాత్రం మరోలా అనుకోకండి. 

మీ శిష్య పరమాణువు
రాము

8 comments:

Anonymous said...

very touching!

iammurali said...

బూదరాజు గారి గురించి మీరు చాలాబాగా రాసారు. మా ఇద్దరిదీ ఒకే వూరు అయినా జర్నలిజంలోకి వచ్చేవరకు ఆయన గురించి పెద్దగా తెలియదు. ఈనాడు సండే మాగజిన్ చివరి పేజీలో రాసే పెద్దమనిషి చదువుకున్నది మా స్కూల్లోనే అని మాత్రం తెలుసు. చీరాల హైస్కూల్లో టెన్త్ తెలుగులో ఫస్ట్ వచ్చేవాళ్ళకు తన తల్లి పేరుతో బహుమతి ఇస్తారు ఆయన. అదీ నేనే అందుకున్నా. ఇలా ఆయన చదివిన స్కూల్, ఆయన పనిచేసిన కాలేజీ, చివరికి ఆయన ప్రిన్సిపాల్ గా వున్న ఈజేఎస్... ఇలా సాగింది నా ప్రస్థానం ఆయన్ను కలవకుండానే, చూడకుండానే. నేను ఏకలవ్య శిష్యుడిగా మిగిలిపోయా. -మురళీ కృష్ణ.కే.

iammurali said...

బూదరాజు గారి గురించి మీరు చాలాబాగా రాసారు. మా ఇద్దరిదీ ఒకే వూరు అయినా జర్నలిజంలోకి వచ్చేవరకు ఆయన గురించి పెద్దగా తెలియదు. ఈనాడు సండే మాగజిన్ చివరి పేజీలో రాసే పెద్దమనిషి చదువుకున్నది మా స్కూల్లోనే అని మాత్రం తెలుసు. చీరాల హైస్కూల్లో టెన్త్ తెలుగులో ఫస్ట్ వచ్చేవాళ్ళకు తన తల్లి పేరుతో బహుమతి ఇస్తారు ఆయన. అదీ నేనే అందుకున్నా. ఇలా ఆయన చదివిన స్కూల్, ఆయన పనిచేసిన కాలేజీ, చివరికి ఆయన ప్రిన్సిపాల్ గా వున్న ఈజేఎస్... ఇలా సాగింది నా ప్రస్థానం ఆయన్ను కలవకుండానే, చూడకుండానే. నేను ఏకలవ్య శిష్యుడిగా మిగిలిపోయా. -మురళీ కృష్ణ.కే.

జర్నో ముచ్చట్లు said...

కళ్లు చెమర్చుతున్నాయి రా రామూ... నీవు చెప్పినప్పుడు లేదు గానీ.. చదువుతుంటే గుండె బరువెక్కుతోంది. మనం మేరు నగధీరుడి శిష్యులం. మనమెంత అదృష్టవంతులంరా..? పూర్వ జన్మల్లో ఎందరో గురువులకు వారు మెచ్చేలా శుశ్రూషలు చేసి ఉంటాం. అందుకే ఈ జన్మలో మనం బూదరాజు గారి శిష్యులమయ్యాం. నేనివాళ రాస్తున్న కొద్దిపాటి అర్థవంతమైన తెలుగు ఆ మహనీయుడి చలవే. ఎవరిమీదైనా కోపం వస్తే.. ఆయన నేర్పిన తద్ధితం పేరో తద్భవం పేరో.. మరీ ముదురు గాడైతే యత్తదర్థకం పేరో చెప్పి బెదిరించి పారేస్తున్నా. ఆమాత్రం దబాయింపు తత్వం ఆయన వల్ల కాక మరెవరి వల్ల అబ్బుతుంది చెప్పూ..? ఏంటో రాసుకుంటూ పోతే నా కామెంటే పెద్ద వ్యాసం అయ్యేలా ఉంది. ఉంటా మరి. ప్రియగురువుని హృదయానికి హత్తుకునేలా గుర్తు చేసినందుకు ప్రియ మిత్రమా నీకూ ధన్యవాదాలు. బై..

budaraju said...

tatayya garu great yes he is always great

Kishor said...

ఇప్పుడు కూడా వ్యాసంలో బాధపడడమేనా? ఎవరైనా ఆయనగురించి ఏదైనా చేసేది ఉందా?

నెలవంక said...

చాన్నాళ్ల తర్వాత, చాన్నేళ్ల తర్వాత గురుపూజా దినం సందర్భంగా యాంత్రికత్వానికి, మూసకు సంబంధంలేని కమనీయ కథనాన్ని చదివాను. మీ మీద మరో భారం. బూదరాజుగారితో మీ వృత్తిపర సాహచర్య విశేషాలను వీలైనంత వివరంగా మరో పెద్ద వ్యాసంలో పొందుపర్చగలరా. లేదంటే ఇప్పటికే మరోచోట రాసి ఉంటే నా జీమెయిల్ ఐడీకి లింక్ పంపగలరా?
krajasekhara@gmail.com

రామోజీకి కుల పిచ్చి వుందని ఎవడో అంటే...మీరు చెప్పిన మాట విని మీ కొత్త స్టూడెంట్ అయిన నాకు ఏమనాలో తెలియలేదు. "అదొట్టి పిచ్చి మాట. వాడికి (రామోజీకి) ఎవరు వంద రూపాయలు ఇచ్చినా తీసుకుంటాడు,"
తెలుగులో ఇంత శక్తివంతమైన, వాస్తవికమైన వాక్య ప్రయోగాన్ని ఈ మధ్య కాలంలో నేను చూడనేదు. మీ నిర్భీతికి, సాహస ప్రకటనకు జేజేలు. ప్రపంచంలో ఏ పెట్టుబడిదారుడికీ ధనార్జన విషయంలో కులపిచ్చి ఉండనే ఉండదు.
బూదరాజుగారూ, సంస్థలో పనిచేస్తూనే యజమాని గురించి ఇంత పచ్చి నిజాన్ని ప్రకటించినందుకు, మీ ప్రకటన మీ శిష్యుడి జ్ఞాపకాల్లో బతికి భద్రంగా ఉన్నందుకు, మరో పది కాలాలు మీ ప్రకటన చిరంజీవిత్వం పొందబోతున్నందుకు మీకు ఆ జన్మ కృతజ్ఞతలండీ..

Andhra Pradesh Live said...

jeevitam mottanni 6 nelallo cheppe tapatrayam aayana maatallo kanipinchedi. kadilinchina guruvu maatram talla pragade.