యుగాంతం అయిపోయి ఛస్తామేమో చూద్దాం...రాయడం ఎందుకు దండగ? అనుకుని ఈ రోజు దాకా ఆగాను. హమ్మయ్య...బతికిపోయాం. మళ్ళీ ఏ తలమాసిన సన్నాసో బ్రహ్మాండం బద్దలై పోతుందని పిచ్చి లెక్కలతో ముందుకొస్తాడు. సంచలనం మాత్రమే ఊపిరిగా బతికే టీ వీ చానెల్స్ వాళ్ళకు మసాలా దొరుకుతుంది. మనకు సస్పెన్స్ తో కూడిన కాలక్షేపం లభిస్తుంది. అప్పటి దాకా వేచిచూస్తూ...మన పని మనం చేసుకోవడం ఉత్తమం.
'ఈనాడు' యాజమాన్యం జిల్లా పేజీలు (మినీలు) ఆరంభించడానికి రెండు నెలల ముందు...బహుశా 1989 అనుకుంటా...నేను ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో స్పోర్ట్స్ కంట్రీబ్యూటర్ గా జర్నలిజం జీవితం ఆరంభించాను. లెక్కలేనన్ని ఆటల పోటీలు కవర్ చేసేవాడిని. దాంతో పాటు ఆలిండియా రేడియో ఎఫ్.ఎం. స్టేషన్ వారికీ స్పోర్ట్స్ కవర్ చేస్తూ ఆనందించేవాడిని. అప్పట్లో జనాలకు స్పోర్ట్స్ జర్నలిజం కొత్త. సాయంత్రం కాలేజీ కాగానే నేను క్రీడా మైదానాలలో తిరుగుతూ...ఆటగాళ్ళతో కలివిడిగా ఉంటూ వినూత్న స్టోరీలతో రెచ్చిపోయేవాడిని. అదృష్టవశాత్తూ 'ఈనాడు' లో అప్పటి స్టాఫర్ సూర్యదేవర శ్రీకాంత్, డెస్క్ లో వుండే రమేష్, కృష్ణయ్య గార్లు నాకు బాగా సహకరించి ప్రోత్సహించే వారు. జిల్లాలో ఎక్కడ పెద్ద స్థాయి పోటీలు జరిగినా నన్ను పంపేవారు. మార్షల్ ఆర్ట్స్ నిపుణుల గురించి బాగా రాసేవాడిని. అదొక అందమైన అనుభవం. క్రీడా నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రిపోర్టింగ్ చేసే వాడిని. మరీ అవసరం అనుకుంటే మాత్రం నెగిటివ్ స్టోరీ రాసేవాడిని..ఆచి తూచి. పోటీలు విజయవంతం కావడం రిపోర్టర్ గా నా విధి అని భావించేవాడిని.
ఆ తర్వాత 'ఈనాడు', 'ది హిందూ', 'మెయిల్ టుడే' లలో శాశ్వత ఉద్యోగిగా పనిచేసినా...అప్పటి ఆనందం పొందలేకపోయాను స్పోర్ట్స్ జర్నలిజంలో. ఈనాడు లో ఉండగా స్పోర్ట్స్ రిపోర్టర్ కావాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఆ తర్వాత పొలిటికల్, క్రైమ్, అగ్రికల్చర్ వంటి రంగాలపైన ఎక్కువ దృష్టి పెట్టాల్సి వచ్చింది. అయినా...స్పోర్ట్స్ గురించి వీలున్నప్పుడల్లా రాసాను ది హిందూ లో. ఇప్పుడు టీచింగ్ లో పడినా...స్పోర్ట్స్ రిపోర్టింగ్ మీద చింత చావలేదు.
అలాంటి నేను డిసెంబర్ 9 నుంచి 16 వరకు గచిబౌలి ఇండోర్ స్టేడియం లో జరిగిన ప్రపంచ స్థాయి జూనియర్ టేబుల్ టెన్నిస్ పోటీలలో మీడియా కమిటిలో పనిచేసాను. నవంబర్ 19 న నా పీ.హెచ్ డీ పూర్తయ్యింది. ఆ మర్నాడు...టోర్నమెంట్ డైరెక్టర్ వి.భాస్కర్ రామ్ గారికిచ్చిన మాట ప్రకారం...టోర్నమెంట్ సన్నాహక ఏర్పాట్లలో పనిచేసాను. అక్కడ ఆరంభమై...కొన్ని సమీకరణాల నేపథ్యంలో నేను మీడియా కమిటీ చైర్మన్ అయ్యాను. అక్కడ ఆరంభమయ్యింది మన పోరాటం. ఒక పిల్లకాకి కావాలని నాతో గొడవ పెట్టుకోవడంతో అవమానాలు ఆరంభమయ్యాయి. అక్కడ పలు సందర్భాలలో పలువురి సర్కస్ చూసి నవ్వుకోవడం మినహా ఏమీ చేయదలుచుకోలేదు.
యూనివెర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లోని నా స్టూడెంట్స్ సహకారంతో...ఎనిమిది రోజులలో 'టాప్ స్పిన్ టైమ్స్' పేరిట నాలుగు న్యూస్ బులిటిన్స్ తెచ్చి అంతర్జాతీయ క్రీడాకారులు, కోచ్ లకు, అధికారులకు పంచడం ఒక గొప్ప అనుభూతిని మిగిల్చింది. ఈ ప్రచురుణకు భాస్కర్ రామ్ గారి నుంచి పూర్తి సహకారం లభించింది, ఇంటర్ నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ అధికారుల నుంచి, జర్నలిస్టు మిత్రుల నుంచి ప్రసంశలు లభించాయి.
The ITTF chief Adham Sharara's comment on 'Topspin Times'.
"One of the great features of the Championships was the "Topspin Times" periodical bulletin that came out 4 times during the Championships. This glossy colour publication was chockfull of news, features and photos that brought us a special insight in the event and the participants. Personally, I learnt facts about some of the young players that I did not know before. The journalistic quality of this publication was excellent and kudos to the enthusiastic team of journalists that put it together and produced it at the highest standards."
మా బృందమే...భాస్కర్ రామ్ గారి ఆధ్వర్యంలో సూవనీర్ కూడా తెచ్చింది. అయ్యా...మీ సందేశం కూడా అందులో ఉంటే బాగుంటుందని...ఎన్ని సార్లు చెప్పినా ఆయన వినలేదు. అది తెలియక...దాన్ని ఒక ఇష్యూ చేసి కసి తీర్చుకోవాలనే ఒక వర్గం సిద్ధమయ్యింది. ఏదో మంచి చేద్దామని ముందుకు పోతే...ఇలాంటి సమస్యలు సృష్టించే మహానుభావులు చాలామంది ఉంటారని, దాన్ని సీరియస్ గా తీసుకోవడం టైం వేస్ట్ అని మిన్నకున్నాను. అలాకాకుండా...మన నిజమైన టెంపర్ మెంట్ ప్రకారం వ్యవహరిస్తే...కొంప కొల్లేరు అయ్యేది. ఒక ముగ్గురు మూర్ఖుల విషయంలో నా ఓపికకు నాకే ఆశ్చర్యం అనిపించింది. తొమ్మిది పది రోజుల పాటు నాకు వెన్నంటి ఉండి...అసలు మీడియా వాళ్ళు, నకిలీ మీడియా గాళ్ళు పెట్టిన హింసలు, చిత్ర హింసల నుంచి కాపాడిన నా మంచి మిత్రుడు శివ శంకర్ కు ప్రత్యేక అభినందనలు, కృతఙ్ఞతలు. ఆయన దివ్య బోధ చేసి ఉండకపోతే...అక్కడ ఒక నకిలీ జర్నలిస్టు యూనియన్ లీడర్ బజ్జీలు బద్దలయ్యేవే.
ఈ టోర్నమెంట్ ను ఇంగ్లిష్ జర్నలిస్టులు కవర్ చేసిన విధానం నిజంగా నన్ను ఆకట్టుకుంది. వాళ్ళు అన్ని మ్యాచులు చూసి రిపోర్ట్ చేసే వారు. తెలుగు మిత్రులలో కొందరు రిజల్ట్ కు మాత్రం పరిమితమయ్యారు. వాళ్లకు స్పేస్ ప్రాబ్లం. ఎలక్ట్రానిక్ మీడియా బాధ ఎలక్ట్రానిక్ మీడియాది. ఈ చాంపియన్ షిప్ లో వివిధ చానల్స్ రిపోర్టర్స్ తో మాట్లాడాక....నాకు చాలా విషయాలు బోధ పడ్డాయి. మేము నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ కు రావద్దని ప్రచారం చేసిన వైనం, డబ్బు వ్యవహారం, ఒక కుళ్ళు గురవయ్య నా మీద వారి ముందు చేసిన కామెంట్స్ నోట్ చేసాను. ఈ బ్లాగు చదవడం ద్వారా పరిచయం అయిన మిత్రులు నాకు ఫీల్డులో కొందరు దళార్ల తెంపరితనం గురించి చెప్పిన విషయాలు రికార్డ్ చేసాను. The Hans India, HM TV ఎడిటర్ ఇన్ చీఫ్ కె.రామచంద్ర మూర్తి గారు ఒక రోజు ప్రత్యేకంగా వచ్చి ITTF చీఫ్ Adham Sharara ను ఇంటర్వ్యూ చేయడం నాకు ఆనందం కలిగించింది. ఆయన లాంటి ఎడిటర్ నుంచి ఈ తరం జర్నలిస్టులు నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది.
ఇదిలా వుండగా...ఒక ప్రముఖ పత్రిక..."ప్రచారం లేక" జనం చూడ్డానికి రావడం లేదని రాసింది. "బాబూ...టోర్నమెంట్ కు సంబంధించి ఒక్క కర్టెన్ రైజర్ అయినా మీరు రాయలేదు కదా. మీరు ప్రచారం కలిగించకపోతే...ఎవరు కల్పిస్తారు? ఒక్క సారి ఆలోచించండి" అని నేను నా ధర్మంగా అది రాసిన రిపోర్టర్ గారితో చెప్పాను. తను దాన్ని పాజిటివ్ గా తీసుకుని ఉంటారని భావిస్తాను.
క్రీడల పట్ల జనంలో ఆసక్తి కలిగించాలంటే...నిర్వాహకులు, మీడియా కలిసి పనిచేయాలి. ఇక్కడ లాభాపేక్ష చూసుకో కూడదు. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి, అమూల్యమైన సమయాన్ని వెచ్చించి కేవలం ఆటల పట్ల ఆసక్తి తో ప్రపంచ స్థాయి పోటీలు నిర్వహిస్తే...మీడియా నిర్వహించాల్సిన పాత్ర ఎంతో ఉన్నతమైనదిగా ఉంటుంది. స్పోర్ట్స్ జర్నలిస్టులు తలచుకుంటే...జనాలలో కూడా ఆసక్తి కలిగించేలా కథనాలు రాయవచ్చు. అయితే....విధి నిర్వహణలో ఎవరి పరిమితులు వారికి ఉంటాయి. అభిరుచి, వృత్తి నిబద్ధత, స్వప్రయోజన కాంక్ష, అజ్ఞానం, అపోహలు వంటి అంశాలు ఎవరి పని తీరు మీదనైనా ప్రభావం చూపుతాయి. రిపోర్టర్లు కాస్త పెద్ద మనసుతో వ్యవహరిస్తే...అందరం కలిసి ప్రజల్లో క్రీడాభిలాషను పెంచవచ్చు, క్రీడానందాన్ని పంచవచ్చు.
మొత్తం మీద ఇంట పెద్ద టోర్నమెంట్ నిర్వహించిన APTTA సారధులు భాస్కర్ రామ్, ఎస్.ఎం.సుల్తాన్, నరసింహారావు, ప్రకాష్ రాజు గార్లకు వారి బృందానికి, ఈ టోర్నమెంట్ విజయం కోసం రాజమండ్రి నుంచి వచ్చి పది రోజులు ఇక్కడే ఉండి సహకరించిన వారికి తదితరులకు అభినందనలు. ఈ పోటీలు ప్రపంచ స్థాయిలోనే ఉండాలని అణువణువునా తపించి, డబ్బు విషయంలో రాజీ పడకుండా నిద్రాహారాలు మాని పనిచేసిన భాస్కర్ రామ్ గారి క్రీడాభిమానానికి మరొక సారి జేజేలు.
Photo caption: I, as the Editor of 'Topspin Times', was discussing point with Mr.Bhaskar Ram V, Editor-in-Chief, in Room No-53 (the office of our newsletter team) in Gachobowli stadium on December 13, 2012.
2 comments:
A good job done by you Ramu garu.It is a variety in the proffession and I hope you continue to bring new pages in the journalism as per the needs.
JP.
ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు.. అని మీలాంటి వాళ్ల గురించే సిరివెన్నెల రాశారు. టీటీ విషయం మీరు వేస్తున్న అడుగులు.. ఆ క్రీడకు రాష్ట్రంలో మంచి ఆదరణ తేవాలని కోరుకుంటూ
వె.రా
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి