Monday, May 5, 2014

ఎన్నికల్లో మితిమీరిన ధన ప్రవాహం...

ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో మాదిరి ధన ప్రవాహం మరే రాష్ట్రంలోనూ జరగలేదు. పార్టీ ఏదైనా... డబ్బు బలం లేనిదే గెలవలేమని అభ్యర్ధులు నమ్మారు. డబ్బు అనగానే అతిశయోక్తి తో ప్రచారం చేయడం సహజమే అయినా... మన దగ్గర 150 నుంచి 200 కోట్లు అధికారికంగా పట్టుక్కున్నట్లు, ఇది దేశంలో ఎన్నికల సందర్భంగా పట్టుకున్న మొత్తంలో నలభై శాతమని అంటున్నారు. ఇది ప్రమాద సూచిక. 

ఏ పార్టీ చూసినా.... అభ్యర్థుల ఎంపికలో డబ్బు ను ఒక కారకంగా చూసిందే. జాతి పిత మహాత్మా గాంధీ గారు వచ్చినా... నాలుగు డబ్బులు ఖర్చు చేయనిదే గెలవలేని పరిస్థితి. డబ్బు ను బట్టి జనం ఓట్లు వేస్తారా? నేను నమ్మను... అని అనడం అమాయకత్వం. ప్రచారంలో హడావుడి చేయడానికి, ప్రజాదరణ గల నాయకుడహో... అని మీడియాలో ప్రచారం చేయించుకోవడానికి, ఓటర్లను ప్రలోభపెట్టి ఓట్లు కొనుక్కోవడానికి కరెన్సీ నోట్లే కీలకం. మన జనంలో అధికులు నోటును బట్టే ఓటు వేస్తున్నట్లు నాకు అనిపిస్తున్నది. 500 వందలకు కక్కుర్తి పడేది ఏమిటనో, ఇతరులకు తెలిస్తే పరువు తక్కువనో... కొద్దిగా మధ్య, ఎగువ తరగతి ప్రజలు ఆగుతారేమో గానీ... నాయకులు పధ్ధతి ప్రకారం కాలనీల్లో తయారు చేసుకునే ఓటర్లకు ఎన్నికలు ఒక పండగ కాలం. నాయకుల పుణ్యాన ఈ దుస్థితి.  

ఖైరతాబాద్ లో పార్టీలు ఎడాపెడా మార్చి... మార్చినప్పుడల్లా అధినేతను పొగిడి నేగ్గుకొచ్చే ఒక నాయకుడు... మా చుట్టుపక్కల కాలనీల్లో వాళ్లకు చేతినిండా పని కల్పించారు. "ప్రచారానికి రోజుకు 300, కాక బిర్యాని," అని మా పని అమ్మాయి చెప్పగా... కరెంటు రిపేర్ పనిమీద వచ్చిన ఎలక్ట్రీషియన్ దృవీకరించారు. అన్న ప్రకారం డబ్బు ఇవ్వడం లేదని, ట్రీట్ మెంట్ సరిగా లేదని మా పని అమ్మాయి ఫ్రెండ్స్ మధ్యలో ప్రచారం ఆపి వచ్చారు. కానీ  ఎలక్ట్రీషియన్ వారి భార్యను పంపారు. "వాడిది మోసం సార్. అన్న ప్రకారం డబ్బులు ఇవ్వలేదు ఈ సారి. ఓడి పోతడు," అన్నది మా పక్క కాలనీలో అరుగు మీద కూర్చొని కాలక్షేపపు కబుర్లు చెప్పే ఒక పెద్దమనిషి కథనమ్. పదవి లో ఉండగా పోగేసింది... ఎన్నికల్లో దానం చేసేయడం!

ఉస్మానియాలో మా జర్నలిజం ప్రొఫెసర్ కే నాగేశ్వర్, లోక్ సత్తా నాయకుడు జయప్రకాశ్ నారాయణ్ బరిలో ఉన్న మల్కాజ్ గిరిలో వీళ్ళిద్దరూ పెద్దగా ఖర్చుపెట్టలేదని అంటున్నారు. నిజమో కాదో తెలియదు. చివరకు...అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ గారి నుంచి గట్టి పోటీ ఎదుర్కుంటున్న మాజీ కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎన్నికల సందర్భంగా డబ్బు తరలిస్తున్న ఆరోపణపై బుక్కయ్యారు.

ఓటర్లతో పాటు... డబ్బు పంపిణీలో సింహభాగం పొందుతున్నది.... మీడియానే. దాదాపు అన్ని ఛానెల్స్ విలేకరులకు యాడ్ టార్గెట్ ఫిక్స్ చేసాయి. ఉన్నత ఆశయంతో ఏర్పడిన హెచ్ ఎం టీవీ, ప్రజల డబ్బు తో ఏర్పడిన 10 టీవీ వంటి ఛానెల్స్ కూడా విలేకరులకు కమిషన్ ఆశ చూపడం చాలా బాధాకరం, అభ్యంతరకరం. ఒక పత్రిక అధిపతి ఒక నెల కిందట స్వయంగా విలేకరులతో మీటింగ్స్ పెట్టి జిల్లాకు రెండు కోట్ల రూపాయల వరకు యాడ్ తేవాలని... అందులో పది శాతం విలేకర్లు తీసుకోవచ్చని చెప్పారు. విలేకరులు దీన్ని... 'గోల్డెన్ చాన్స్' అనుకుని రెచ్చిపోయి యాడ్స్ కలెక్ట్ చేస్తారా? లీక్ ఇలా యాడ్స్ తేక తప్పని చోట పనిచేయడం ఇష్టం లేక వేరే చోటికి మారతారా? చెప్పడం పెద్ద కష్టం కాదు. 

మా ఖమ్మం లో ఒక పార్లమెంటరీ అభ్యర్ధి డబ్బును నీళ్ళలా ఖర్చు పెట్టారని సమాచారం. "డబ్బు నీల్లలాగా ఖర్చు పెట్టారు. విలేకరులకు కూడా బాగానే ముట్టాయి," అని ఒక ఫోటోగ్రాఫర్ చెప్పగా విన్నాను. నల్గొండ లో 'ది హిందూ' విలేకరిగా ఉన్నప్పుడు... కనీసం ఇద్దరు అభ్యర్ధులు ఇంటికి నోట్ల కట్టలు పంపారు. వాటిని తిరస్కరించడం... అందువల్ల లోకల్ రిపోర్టర్స్ కు శత్రుఫు కావడం...డబ్బు తీసుకోలేదని చివరకు నిరూపించుకోవాల్సి రావడం సిన్సియర్ జర్నలిస్టులకు ఇబ్బంది కరంగా ఉంటాయి. అప్పట్లో నల్గొండ లో ఒక తెలుగు పత్రికలో ఉండి విలేకరిగా, రాజకీయ సలహాదారుగా బాగా సంపాదించిన ఒక జర్నలిస్టు ఇప్పుడు హైదరాబాద్ చేరి రెండు చేతులా సంపాదించి స్థితిమంతుడిగా ఎదగడం పెద్దగా అబ్బురపడకూడని విషయం. 

భవిష్యత్ సంపాదన కోసం ఈ ఎన్నికల్లో నాలుగు డబ్బుకు ఖర్చు పెట్టడం తప్పు కాదని రాజకీయ నేతలు, సంపాదనకు ఎన్నికలు ఉత్తమ మార్గమని మీడియా యాజమాన్యాలు-జర్నలిస్టులు నమ్ముతుంటే... ఆర్థికంగా లేమితనంతో ఉన్నవారిని ఈ ఎన్నికల సదర్భంగా తప్పుపట్టడం తప్పే కదా!

1 comments:

katta jayaprakash said...

Recently Sarve Satyanarayana,MP blasted media for the corruption and he said media is the most corrupt proffession in the society from a stringer to Editor.Media is a mafia fooling people in the name of freedom of press,dammunna channel,prajahitha channel etc.Most of the TV reporters and camera men are rich journalists with daily cash turn over.Who has to bell the cat?

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి