Thursday, July 31, 2014

హమ్మయ్య ... జులై నెల గడిచింది

కాస్తంత జర్నలిజం, ఇంకాస్త అకడమిక్స్, పీకల్లోతు స్పోర్ట్స్... తో మునిగి పోయిన నాకు (రాము) ఈ జులై నెల కొంత సంతోషం పంచుతూనే షాకుల మీద షాకులు ఇచ్చింది. కొన్ని పరిస్థితులు నా చేతి నుంచి జారిపోయి... విపరిణామం గా మారి వెక్కిరించి వెళ్ళిపోయాయి. అందుకే... ప్రతిదీ ఉపకరించే అనుభవం అని మరో సారి అనుకుంటూ.... కాస్త ఊపిరి పీల్చుకుంటూ...ఈ నెలకు ఇలా వీడ్కోలు పలకాలని అనుకుంటున్నాను.  ఆప్తులైన మీతో ఇవన్నీ పంచుకోవాలన్న వెర్రి తలంపు ఫలితమే... ఈ పోస్టు. మీరు భరించక తప్పదు. అందుకు ముందే థాంక్స్. 
1) జులై 2, మాసాబ్ టాంక్ (హేమ కు సన్మానం) 
క్రీడాభివృద్ధికి పాటుపడే సంస్థలు కరువైన ఈ రోజుల్లో మాజీ రంజీ క్రికెటర్ సాయిబాబా గారు మాసాబ్ ట్యాంక్ లో నిర్వహించే "స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్" వరల్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ డే సందర్భంగా... జర్నలిస్టులకు సన్మానం చేసింది. అదీ ఉమెన్ స్పోర్ట్స్ జర్నలిస్టుల కు దీన్ని పరిమితం చేసారు. నిజానికి.... రెండు రాష్ట్రాల్లో ప్రత్యేకించి మహిళా స్పోర్ట్స్ జర్నలిస్టు ఎవరైనా ఉన్నారంటే... హేమ ఒక్కతే. అయినా... సాయిబాబా కష్టపడి మహిళా జర్నలిస్టులను పది, పన్నెండు మందిని ఆహ్వానించి సన్మానం చేశారు. 
సన్మానాలకువ్యతిరేకమైనా... రిపోర్టర్ గా హేమ ను చూస్తూ ఆనందించే నేను...ఈ ప్రోగ్రాం కు హాజరై... సాయిబాబా గారి అభ్యర్ధన మేరకు ప్రసంగించి ఆనందించాను. 
2) జులై 3-6, కలకత్తా (కోచ్ సోమ నాథ్ ఘోష్ పెళ్లి)
ఆటలకోసం ఏదో చేయాలని, పిల్లవాడు ఆడుతున్నాడు కాబట్టి మనకంటూ ఒక అకాడమీ ఉండాలని మేము ఒక నాలుగేళ్ళ కిందట పెట్టిన గ్లోబల్ టేబుల్ టెన్నిస్ అకాడమీ (జీ టీ టీ ఏ) కు అనతి కాలం లోనే మంచి పేరు తెచ్చిన మా పిల్లల కోచ్ పేరు సోమ నాథ్ ఘోష్, ఒక బెంగాలీ. నా పుత్రరత్నం స్నేహిత్ తో పాటు శ్రీజ అనే మరొక  క్రీడాకారిణి ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన ఘనత అతనిది. అతని పెళ్లి మాకు ఒక కుటుంబ కార్యక్రమం. 

పై సన్మానానికి ఉండాల్సిందే అని నిర్వాహకులు కోరడం వల్ల హేమ ట్రైన్ టికెట్ కాన్సిల్ చేయించుకుని స్నేహిత్ ను ఒక రెండు రోజుల ముందు ఫ్రెండ్స్ తో రైల్లో పంపింది కలకత్తా కు. నేను మూడో తేదీన... ఎప్పుడు కూలుతుందో, ముక్కలు ముక్కలై ఆకాశంలోనే చస్తామేమో అనిపించిన డుగుడుగు డుగ్ విమానం (స్పైస్ జెట్)లో కలకత్తా చేరుకున్నాను. పెళ్లి బాగా జరిగింది... వర్షం లో. 
మరొక గంటలో రిసెప్షన్ అనగా ఐదో తేదీ సాయంత్రం... ఒక విచిత్రమైన ఇబ్బంది వచ్చి పడింది. మేము ఉండడానికి ఇచ్చిన అద్భుతమైన విడిదిలో (ఎయిర్ పోర్ట్ దగ్గర కొత్త అపార్ట్మెంట్) సోగ్గా రడీ అవుదామని స్నానం చేసి వచ్చే లోపు నా బట్టల పెట్టె ఉన్న గది తలుపు గాలికి కొట్టుకుని లోపలి నుంచి లాక్ అయ్యింది. ఒంటి మీద టవల్ తప్ప నా అని చెప్పుకునే ఒక్క బట్ట ముక్కా బైట లేవు. కిటికీ లోంచి చూస్తే అవన్నీ నా ఎర్ర సూట్ కేస్ లో నుంచి నా వైపు చూస్తూ వెక్కిరిస్తూ కనిపించాయి. తాళం కోసం చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అయినా లాభం లేదు. అప్పుడు నాకు, నా మిత్రుడు శంకర్ కు ఒక మంచి ఐడియా వచ్చింది. మేమిద్దరం కర్రకు చిల్ల కట్టి ఊళ్ళో గుబ్బకాయలు ఉరఫ్ చీమ చింతకాయలు కొట్టిన బ్యాచ్. ఆలోచన వచ్చిందే తడవుగా.... ఒక కర్ర సాధించి చిల్ల కట్టి... కిటికీ లోంచి సూట్ కేస్ ను కిటికీ దాగా గుంజి... చేయి లోపలికి దూర్చి... అందులోని లో దుస్తులు, ప్యాంటు షర్టు పీకి ధరించి... విజయ గర్వంతో రిసెప్షన్ కు వెళ్లాను.

మర్నాడు, ఆదివారం, మళ్ళీ తిరుగు విమాన ప్రయాణం. ఓనర్ నుంచి కీ వచ్చినా అరిచి గీ పెట్టినా డోర్ రాలేదు. ఎందుకైనా మంచిదని... కిటికీ నుంచి చిల్ల కర్ర సాయంతో రెండున్నర గంటలు కష్టపడి నా బట్టలు అన్నీ బైటికి తీశాను. చివరకు కొద్దిగా బుర్ర పెడితే... నా బుజ్జి సూట్ కేస్ కూడా వచ్చింది, థాంక్స్ టు కొత్తింటి పెద్ద కిటికీ. ఈ కసరత్తు కారణంగా చేతులు జీవితంలో ఎప్పడు లేని విధంగా నొప్పి పెట్టాయి. అంతా అయ్యాక...మరో గంటలో మేము విమానం ఎక్కుతామనగా.. తీరిగ్గా వచ్చిన గోడ్రేస్ కంపెనీ మెకానిక్ చేయి పడగానే లాకు ఓపెన్ అయి డోరు తెరుచుకుని నన్ను బైట వెర్రి గంగన్న లాగా ఉన్న నన్ను చూసి వికటాట్టహాసం చేసింది.        
3) జులై 2-9, హైదరాబాద్ (మిత్రుడితో మెయిల్ గొడవ):
నన్ను అపార్ధం చేసుకున్న ఒక మిత్రుడు నాకు పంపిన ఒక మెయిల్ ఇబ్బందిగా అనిపించి.... "between you and me" అని ఒక మెయిల్ పంపాను కాస్త ఘాటుగా. అది చినికి చినికి గాలి వానై... ముఖం ముఖం చూసుకొని పరిస్థితికి దారి తీసింది. నాకీ పరిస్థితి సాధారంగా రాదు, కానీ గ్రహచారం బాగోలేకపోతే... మెయిలు పామై కరవదా మరి! 
ఒక వారం పాటు నేను, ఆయనా పరస్పర వాదనలతో ఇబ్బంది పడ్డాక... నాకు అర్థమయ్యింది... మనం ఓవర్ రియాక్ట్ అవుతున్నామని. ఆ మాటే ఆ మిత్రుడికి చెప్పి వ్యవహారం క్లోజ్ చేశాను.. నా వైపు వాదన బలంగా ఉన్నప్పటికీ. అప్పటికే జరగాల్సిన డామేజ్ జరిగిపోయింది. 
ఒక వ్యవస్థ కోసం ఎక్కువ తపన పడడం వల్ల ఈ దుస్థితి అని అర్థమై.... కొంత వైరాగ్యం మనసు మీదికి తీసుకున్నాక... వ్యవహారం సద్దుమణిగింది.  

4) జులై 10-13, హైదర్ గూడ (మొదటి స్టేట్ రాంకింగ్ టీటీ టోర్నమెంట్):
తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన మొదటి స్టేట్ రాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ ఒక మంచి అనుభూతిని మిగిల్చింది. ఇప్పటికే రెండు ఇంటర్ నేషనల్ టోర్నమెంట్స్ ఆడిన స్నేహిత్ ను నిర్వాహకులు (సెయింట్ పాల్స్-స్టాగ్ టీటీ అకాడెమీ) సన్మానించారు. నిర్వాహకుల్లో ఒకరైన ఇబ్రహీం ఖాన్ అనే కోచ్ నా ఆఫీసు కు వచ్చి మరీ ఆహ్వానించారు. మళ్ళీ...వద్దనలేని సన్మానం ఇది. తనతో పాటు మరో ముగ్గురు క్రీడాకారులకు కూడా సన్మానం జరిగింది. 
కానీ వాళ్ళు మా కోచ్ సోమనాథ్ పేరు సరిగా ప్రస్తావించక పోవడం నాకు నచ్చలేదు. ఊరికి వెళ్ళే ప్రోగ్రాం రెండు రోజులు వాయిదా వేసుకుని అమ్మా నాన్నా ఉండి... ఈ కార్యక్రమానికి హాజరు కావడం...మనమడిని చూసి మురవడం నాకు ఆనందాన్ని ఇచ్చింది. 

5) జులై 15-19, HICC (ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్)
ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న రోజులివి. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ మీడియా అండ్ కమ్యూనికేషన్ రీసెర్చ్ (IAMCR) అంతర్జాతీయ కాన్ఫరెన్స్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, నోవాటెల్, లో అద్భుతంగా జరిగింది. అరవై కి పైగా దేశాల నుంచి దాదాపు 800 మంది పరిశోధకులు వచ్చారు. మూడో రోజైన 17 న నేను ఎథిక్స్ వర్కింగ్ గ్రూప్ లో నా పేపర్ ప్రజెంట్ చేశాను. బ్రెజిల్, ఫ్రాన్స్ తదితర దేశాల పరిశోధకులు, ప్రొఫెసర్లు అందులో పాల్గొన్నారు. ఒక అంతర్జాతీయ కాన్ఫరెన్స్ లో పేపర్ ప్రజెంట్ చేయడం నేను ఇదే ప్రథమం. ఒక మంచి అనుభవం. 
నాకు సన్నిహితురాలైన మియామి యూనివెర్సిటీ ప్రొఫెసర్ జ్యోతికా రమాప్రసాద్ తో పాటు పలువురు అంతర్జాతీయ ప్రతినిధులను కలిసి వివిధ అంశాల గురించి చర్చించే అవకాశం దొరికింది. ఒక ఒక పరిశోధనలో భాగంగా... ఏడాది గా నేను దగ్గర పెట్టుకుని ఉన్న నింపిన  ప్రశ్నావళి పత్రాలు జ్యోతిక గారికి తిరిగి ఇవ్వడం తో పెద్ద భారం తొలిగినట్లు అయ్యింది.   
 మీడియా, కమ్యూనికేషన్ కు సంబంధించి దాదాపు 100 అంశాల మీద ఈ కాన్ఫరెన్స్ లో చర్చ జరిగింది. ఇది మరిచి పోలేని అనుభవం. దీన్ని ఇంత ఘనంగా నిర్వహించిన సెంట్రల్ యూనివెర్సిటీ జర్నలిజం ప్రొఫెసర్ డాక్టర్ ఉషా రామన్ (ఫోటో) గారికి ప్రత్యేక ధన్యవాదాలు. 
ఇది ఒక రకంగా కాస్ట్లీ కాన్ఫరెన్స్. ఇందుకోసం అయ్యే పార్టిసిపేషన్ ఫీ 19,000 (అదీ ముందు వాలే పక్షులకు... అంటే ఎర్లీ బర్డ్స్). కానీ అనూహ్యంగా మా సంస్థ వారు... ఆ మొత్తాన్ని నాకు తిరిగి చెల్లించడం, ఆ ఐదు రోజులను ఆన్ డ్యూటీ గా పరిగణించడం ఆనందం కలిగించింది.  

6) జులై 21-24, ఆస్కీ (ICFJ వర్క్ షాప్)
జీవితాంతం గుర్తుండే ఒక మంచి పని ఈ నెలలో చేశాను. అదే ఒక  రెండు నెలలు ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జర్నలిస్ట్స్ (ICFJ) సీనియర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జోహాన్నా కొరిల్లొ సమన్వయంతో ఆస్కీ ఎడిటర్ కమ్ మీడియా ఆఫీసర్ గా నేను చేసిన సంప్రదింపులు, చర్చల ఫలితం. హైదరాబాద్ లోని తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ జర్నలిస్టుల కోసం నాలుగు రోజుల వర్క్ షాప్ అది... బాగా జరిగింది. 10 టీవీ జర్నలిస్టుగా హేమ కూడా అందుకు దరఖాస్తు చేస్తే... అమెరికన్ కాన్సులేట్ ఎంపిక చేసిన 32 మందిలో తన పేరు కూడా ఉంది. 
హేమ నా అర్ధాంగి అని వర్క్ షాప్ ముందు రోజు చెప్పే వరకూ ఎవ్వరికీ తెలియదు. పలువురు ప్రముఖ ప్రొఫెసర్ల తో పాటు మీడియా ముఖ్యులు సిద్దార్థ్ వరదరాజన్, బహర్ దత్, శ్రీనివాస రెడ్డి వంటి వాళ్ళు మాట్లాడారు. వర్క్ షాప్ ద్వారా మా సంస్థకు కొద్ది పాటి మంచి ఆదాయం రావడం, సంస్థ చరిత్రలో లేని విధంగా అద్భుతంగా నిర్వహించారంటూ కింది స్థాయి ఉద్యోగులు కూడా అభినందించడం ఒక ఎత్తైతే... వర్క్ షాప్ చివరి రోజు అమెరికా రాయబారి కాథ్లీన్ స్టీఫెన్స్ రావడం... ప్రసంగించడం మరొక ఎత్తు. 
ఇంత మంచి ప్రోగ్రాం లో కూడా నాకో షాక్ తగిలింది. నేను చేసిన ఈ మొట్టమొదటి వర్క్ షాప్ కు సహకరించిన వాళ్ళకు పేరు పేరునా థాంక్స్ చెబుతూ ఒక మెయిల్ రాసాను. అందులో అందరికీ గౌరవ వాచకం చేర్చి... తనకు మాత్రం Mrs/Ms పెట్టలేదని... నేను మంచి ఫ్రెండ్స్ అనుకున్న ఒక మహిళ వచ్చి నా రూం లో గొంతు చించుకుంది. అయ్యో.. మీరు మంచి ఫ్రెండ్ కాబట్టి ఆ ఆవసరం లేదనుకున్నా... దానికి సారీ అని లిటరల్ గా చెంపలు వేసుకున్నా పట్టించుకోకుండా బోరున ఏడ్చింది. నా తలరాత బాగోలేక కాకపొతే... గౌరవ వాచకం లేదని సహోద్యోగులు రూం లోకి వచ్చి ఏడుస్తారా? శివ శివా!

ఇక, ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ ఉండే అమెరికా లో స్థిర పడిన చిలీ యువతి జొహన్నా మాకు మంచి ఫామిలీ ఫ్రెండ్స్ అయ్యింది. చార్మినార్ చూడాలన్న ఆమె కోరిక వర్షం వల్ల, ట్రాఫిక్ వల్ల తీరదేమో అనుకున్నాం. కానీ ఒక వర్షపు సాయంత్రం పూట నేను, హేమ కలిసి నా కారులో

చార్మినార్ దగ్గరకు జోహన్నాను తీసుకు వెళ్లాం. 
కిక్కిరిసిన సంతలు, రద్దీ రోడ్లు తనకు ఇష్టమని మాకు అర్థమయ్యింది. వచ్చే తక్కువ జీతంతో తను, జర్నలిస్టు అయిన తన భర్త ఇద్దరు పిల్లలు సహా ప్రపంచాన్ని చుట్టి వస్తామని, ఈ కారణంగా వాషింగ్టన్ లో ఇల్లైనా కొనుక్కోలేకపోయామని తెలిపింది. సేమ్ టు సేమ్. అక్కయ్య టూర్స్ కయితే... మేము స్పోర్ట్స్ కు. చార్మినార్ దగ్గర ఆమె ఆనందానికి అవధులు లేవు. చిరు జల్లుల నడుమ చార్మినార్ పక్కన మేము ఇరానీ చాయ్, ఆమె సిగరెట్ తాగుతూ రెండు దేశాల కల్చర్స్ గురించి మాట్లాడుకున్నాం.   

7) జులై 25-29, హైదర్ గూడ (టీటీ టోర్నమెంట్)
ఈ నెలలో జరిగిన రెండో స్టేట్ రాంకింగ్ టోర్నమెంట్...సెయింట్ పాల్స్ స్కూల్లోనే జరిగింది. ఇక్కడ... మొత్తం పది ఈవెంట్లలో మా GTTA ఆటగాళ్ళు (కోచ్ సోమనాథ్ సహా) ఎనిమిది ఫైనల్స్ ఆడారు. గడిచిన ఎనిమిదేళ్ళలో ప్రధమంగా స్నేహిత్ మూడు టైటిల్స్ సాధించాడు. నేను మూడేళ్ళు గా స్నేహిత్ ను ఈ కోరిక కోరుతున్నాను. "ట్రై ఫర్ ట్రిపుల్ టైటిల్స్," అన్నది నా సూచన. తన ఈవెంట్ సబ్ జూనియర్ (అండర్ 15), అంతకు పైన ఈవెంట్ జూనియర్స్ (అండర్ 18), అంతకన్నా పైన ఈవెంట్ యూత్ (అండర్ 21) లలో విజేతగా నిలిచాడు. ఈ అరుదైన విషయం గురించి అన్ని పేపర్లు బాగా రాసాయి కూడా. 
27 న ఉదయం నేను ఆదివారం కదా... అని ఆటలు జరిగే చోటికి వెళ్లాను. వాళ్ళ పిల్లల స్కూల్ పేరు పేపర్లలో తప్పు వచ్చిందని ఒక మహిళామణి నా మీద శివాలెత్తింది. మహా తల్లీ... నాకూ ఆ క్రైమ్ కూ సంబంధం లేదని మొత్తుకున్నా వినదే. ఆ టాపిక్ మార్చి... మీ అకాడమీ లో ఓవర్ ఏజ్ పిల్లలను మీరు కవర్ చేస్తున్నారని ఆరోపించి అరిచింది. ఇది పచ్చి అబద్ధం. మళ్ళీ ఇక్కడ తప్పు పట్టాల్సింది నిస్పృహనే! ఇదెక్కడి గొడవరా బాబూ...మన పంచె వెళ్లి కంప మీద పడిందని బాధపడుతూ... టీ తాగడానికి బైటికి వెళితే... సదరు మహిళ భర్త నా మీద రెచ్చిపోయాడు. 'I suggest you not to talk to kids and women," అని వార్న్ చేశాడు. నేను షాక్ అయ్యాను. 'అయ్యా... మీ భార్య గారే నన్ను అందరి ముందు తిట్టారు..." అని చెప్పినా వినలేదు. నీ సంగతి చూస్తా... అన్నట్లు ఒక పోజిచ్చి వెళ్ళాడు. నా సుడి బాగోలేదు కదా మరి!  
   
అయితే... మా శ్రీజ చేతిలో ఓడిన ఒక ప్లేయర్ తండ్రి వచ్చి మా కోచ్ మీద బూతుల పంచాంగం మొదలు పెట్టాడు, బెదిరించాడు. ఇది నిజానికి మాకు సాధారణం అయ్యింది. ఈ గొడవ విషయం తెలిసి అక్కడకు చేరుకున్న నేను సమస్యను చక్కబరిచే ప్రయత్నం చేస్తుంటే.. పైన ప్రస్తావించిన కోచ్ ఇబ్రహీం ఖాన్ నన్ను అపార్ధం చేసుకుని రెండు మూడు మాటలు తూలాడు. తను చాలా సార్లు తేడా మనిషి అని అనిపించినా మన ఆఫీసుకు కూడా వచ్చాడు... కదా అని కొద్దిగా గౌరవం ఇచ్చాను. తన ధోరణి నాకు బాగా బాధ కలిగించింది. ఇబ్రహీం ఖాన్ కు గాంధేయ మార్గంలో బుద్ధి చెప్పాలని గట్టి నిర్ణయం తెసుకున్నాను. కానీ, మా కోచ్ అభ్యర్ధన మేరకు ఎంతో బాధను దిగమింగి ఆ నిర్ణయం వాయిదా వేసుకున్నాను. 
ఆ గొడవలో నన్ను నెట్టిన ఒకడి మీద, నేను లేనప్పుడు నన్ను వాడూ వీడూ అని వాగిన వాడి భార్య మీద చర్య కోసం ఒక పోలీసు అధికారి తో  సంప్రదించి చర్యకు ఉపక్రమించాను కానీ... మళ్ళీ మా కోచ్ వద్దని కోరాడు. మూర్ఖులను ఆ అల్లా క్షమించు గాక! 
8) జులై చివర్లో (అవీ, ఇవీ, అన్నీ...)
ఇవన్నీ కాక... ఒక కుటుంబ సభ్యుడి ఫామిలీ గురించి నా గుండె బద్దలు కావడం, పుట్టెడు అబద్ధాలు చెప్పి వెంకటేశ్వర స్వామి మీద ఒట్టు వేసుకున్న ఒక తలతిక్కల మిత్రుడు, తొక్కలోదీ క్రీడా వ్యవస్థ... మనకేల ఈ గొడవ...ప్రతి బఫూన్ గాడు/బఫూన్ ణి  తో మాటలు పడాల్సి వస్తుందన్న బాధ తాలూకు వైరాగ్యం.... జులై నెలలో బోనస్ లు. ఛీ దరిద్రపుగొట్టు వెధవలని రియాక్ట్ అయి కొన్నిచోట్ల చేయి కాల్చుకున్నాను. రోజులు బాగోలేవని అర్థమై కొన్ని చోట్ల...  నోరు మూసుకుని కూర్చున్నాను.     
ఇక ఈ నెలకు సంబంధించిన కొస మెరుపు ఏమిటంటే...ఈ రోజు ఉదయం మా వాడి స్కూల్ లో మాథ్స్ టీచర్ తో నా సంభాషణ. టోర్నమెంట్ల కారణంగా స్నేహిత్ రీ టెస్ట్ కూడా మిస్ అయ్యాడు. ఈ ఉదయం ఫిట్నెస్ కు వెళ్లి వచ్చాక... స్కూల్ కు వెళ్ళాల్సిన తను.... హేమను కూడా స్కూల్ కు రమ్మని అంటుంటే.. బాధేసింది. ఆఫీసు హడావుడి లో ఉన్నా... స్కూలుకెళ్ళి టీచర్ కోసం వెయిట్ చేసి కలిశాను. "స్టోరీ లు చెప్పక పోతే.. ఒక లెటర్ పంపవచ్చు గా..." అన్నది మేడం. నాకు చుర్రున బాగా కాలింది... కానీ...."ఒరేయ్ బాబూ బుద్ధి లేదురా? ఇది జులై నెల... మహిళల విషయంలో జాగ్రత్తగా ఉండరా బాబూ... సిచుఏషణ్ బాగోలేదు..." అని అంతరాత్మ లోపలి నుంచి గొంతు చించుకుని మొత్తుకుంది. అందుకే... తిక్క రేగినా... మూసుకుని... ఒక లెటర్ ఇచ్చి... మేడం గారికి థాంక్స్ చెప్పి బైట పడ్డాను. పో... అమ్మ పో... జులై.

1 comments:

Tejaswi said...

అన్ని సందర్భాలలోనూ మీరు సంయమనం పాటించి హీరో అనిపించుకున్నారు. కంగ్రాట్స్!

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి