Tuesday, December 9, 2014

ఈ కుల జాడ్యం, కుల గజ్జి పోయేవేనా?

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (NCAER) అనే సంస్థ భారత దేశంలో కులం మీద జరిపిన తాజా సర్వే ఫలితాలు సంచలనం కలిగిస్తున్నాయి. భారత రాజ్యాంగం 64 ఏళ్ళ కిందటే అస్పృస్యతను రద్దు చేసినా...భారతీయుల్లో పావు సగానికి పైగా జనం తాము ఇప్పటికీ దీన్ని పాటిస్తున్నట్లు తేలింది. కులాన్ని బట్టి ఇతరులను ముట్టుకోకూడదని అనుకునే వాళ్ళు కూడా ఈ రోజుల్లో ఉండడం బాధాకరం. "ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని వంటింట్లో కి రానిస్తారా? మీ పాత్రలు ముట్టుకోనిస్తారా?"  అన్న ప్రశ్నకు వచ్చిన సమాధానం ఈ కింది బొమ్మల్లో చూడవచ్చు (మూలం:  India Human Development Survey (IHDS-2) 
బ్రాహ్మణులు, ఓ బీ సీ లు అస్పృస్యతను ఎక్కువగా పాటిస్తున్నారని... ముస్లింలు, ఎస్సీ లు, ఎస్టీలలో కూడా ఇది ఉందని సర్వే లో తేలింది. 


యూనివెర్సిటీ ఆఫ్ మేరీలాండ్ మద్దతుతో వివిధ రాష్ట్రాల్లో 42 వేల ఇళ్ళలో ఈ సర్వే చేసారు.  పూర్తి సర్వే ఫలితాలు 2015 లో విడుదలవుతాయి. 
అస్పృస్యత జాడ్యం ఎక్కువగా హిందీ హార్ట్ లాండ్ లో ఉందని  ఇందులో తేలింది. మధ్యప్రదేశ్ (53 శాతం), హిమాచల్ ప్రదేశ్ (50), చత్తీస్ గడ్  (48), రాజస్థాన్, బీహార్ (47), ఉత్తర ప్రదేశ్ (43), ఉత్తరాఖండ్ (40) ఈ జాబితాలో ముందువున్నాయి.
పశ్చిమ బెంగాల్ లో ఒక్క శాతం మంది అస్పృస్యతను పాటిస్తున్నట్లు సర్వే లో తేలింది. కేరళ (2 శాతం), మహారాష్ట్ర (4), ఈశాన్యం (7), ఆంధ్రప్రదేశ్ (10) ఆ తర్వాతి స్థానాన్నిపొందాయి. 
"ఒక కోటీశ్వరుడైన ఎస్సీ ని వంటింట్లోకి రానిస్తారా? ఆయనతో కరచాలనం చేయడానికి ఇష్టపడరా?" అని కూడా జనాలను అడగాలి. భారతీయ సమాజంలో జనాలు కులం విషయంలో ఫక్తు స్వార్ధం తో బతుకున్నారు. డబ్బు, అధికారం ఉన్న నిమ్న కులస్థులను అహో ఓహో అని ఆలింగనం చేసుకోవడానికి, ఇంటికి ఆహ్వానించి వంటింట్లో కలిసి తినడానికి ఏ సో కాల్డ్ అగ్రవర్ణాల వారూ ఎవ్వరూవెనుకాడరు. అదే... రోజు కూలీ తో పొట్ట పోసుకుని చిరిగిపోయిన బట్టలతో ఉండే ఎస్సీ ని అగ్ర కులాల వాళ్ళే కాదు... అదే సామాజిక వర్గానికి చెందిన ధనిక స్వాములు సైతం ఇంట్లోకి రానివ్వరు. ఇక్కడ ముఖ్యం సోషల్ స్టేటస్, పర్స్. అదే సమయంలో....అవసరాన్ని బట్టి, కలగచేసే మేలును బట్టి కులం కార్డును అంతా నిస్సిగ్గుగా వాడుకుంటారు. తరచి చూస్తే... ఇప్పుడు ఏర్పడినవి రెండే కులాలు: ఉన్నోళ్ళు, లేనోళ్ళు... అని అనిపిస్తుంది.  ఈ విషయంలో వాదోపవాదాలు ఎలా ఉన్నా.... కులం ప్రాతిపదికన సాటి మనిషిని ఇంట్లోకి రానివ్వకపోవడం, తాకకుండా ఉండడం,  మనిషిగా చూడలేకపోవడం పరమ ఘోరం. కుల గజ్జి ఈ స్థాయిలో పెట్టుకుని మనం ఎంత అభివృద్ధి సాధించినా అది సమగ్ర, సంపూర్ణ అభివృద్ధి కాదు, కాబోదు. 

2 comments:

swarajya lakshmi mallampalli said...

కాదూ,కాబోదూ అని మీరూ నేనూ ఎంత గగ్గోలు పెట్టినా జరిగేవి జరుగక మానవుకదండి. కులజాడ్యం రోజు రోజుకీ ముదిరిపోతూఉంది అనటానికి వేరే సర్వేలెందుకు?నిన్న కాక మొన్న జరిగిపోయిన నెలలో జాతరలా జరిగిన కులభోజనాలు చూడలా! అవే పెద్ద ఉదాహరణలు. సామూహిక,సహపంక్తిభోజనాల స్తానే ఈ జాడ్యపు భోజనాలు మొదలయ్యాయి. శుచి,శుభ్రత అంటే వేరు, ఆవిషయంలో అందరం ప్రాదాన్యతనెరిగి కలవలేరా?కలసి ఆనందాలను పంచుకోలేరా?దానికి అదేకులంవాళ్ళు కావాలా?.నవ్వినా,ఏడ్చినా అందరికీ కన్నీళ్ళేవచ్చినట్లు కష్టాలు,కదగండ్లు అందరికీ ఒకటే. అందరం అదే తోవపట్టవలసినవాళ్ళం. మద్యలో ఈ ఈగజ్జి తామరలెందుకు చెప్పండి.మనిషి మనుగడ పురోగమించేలా ఉండాలి కానీ నేడు ఈ వెర్రి చేష్టలు తిరోగమనానికి దారితీసేందుకు కారణమౌతున్నయ్.అదిగుర్తెరిగి అందరం మసలుకోవలసిన తరుణం ఆసన్నమైనది. ఆనక అభివృద్ధి సంగతి దేవుడెరుగు,మనిషి మనుగడే ప్రశ్నార్ధకమౌతుంది.

vruttanti.blogspot.com said...

గతంతో పొలిస్తే చాలానే మార్పు వచ్చిందని చెప్పాలి. ప్రస్తుతం కులాంతర వివాహాల సంఖ్య కూడా పెరిగింది. ఇంకొక 25 సంవత్సరాలలో ఈ పరిస్తితిలో మార్పు ఆశిద్దాం