Saturday, September 7, 2024

తెలంగాణ నేతల చేతిలో దగాపడ్డ ముద్దు బిడ్డ... జిట్టా

An Obituary by Dr S.Ramu

(నోట్: దీని మొదటి వెర్షన్ ది ఫెడరల్ వెబ్ సైట్ లో నిన్న ప్రచురితమయింది.)

ప్రత్యేక తెలంగాణ వస్తోందో, రాదో తెలియని అనిశ్చితి ఉన్న కాలమది. గోడమీద పిల్లులే అధికంగా ఉన్న రోజులవి. తెలంగాణ కోసం వివిధ రూపాల్లో గళమెత్తడమే ఈ నేల మీద ఉన్న ప్రేమకు, చిత్తశుద్ధికి నిదర్శనమని అనుకునే వారు అధికంగా ఉండేవారు. అలాంటి ఉద్విగ్నభరిత  రోజుల్లో... తెలంగాణ వాదం వినిపిస్తూనే ప్రజలు ఎదుర్కొంటున్న సీరియస్ సమస్యలను గుర్తించి, వాటిని ప్రభుత్వ దృష్టికి తెచ్చి, పరిష్కారం కోసం అహరహం కృషిచేసిన అతి కొద్దిమంది నాయకుల్లో జిట్టా బాలక్రిష్ణారెడ్డి అగ్రస్థానంలో ఉంటారు. యువజన ఉద్యమానికి ఊపిరులూది నిజమైన ప్రజాసేవకుడు ఎలా ఉండాలో బతికి చూపించిన ఘనత తనది. జన శ్రేయస్సు కోసం, ఉద్యమం ఉద్ధృతి కోసం సన్నిహితులను, బంధువులను ప్రోత్సహించి, ముందూ వెనకా చూసుకోకుండా ఆస్థులు అమ్మి ఎటూకాకుండా పోయారాయన. తీవ్ర అనారోగ్యంతో నిన్న (సెప్టెంబర్ 6, 2024) కన్నుమూసిన జిట్టా ఒక 'నాచురల్ లీడర్.' 
పాపం, జిట్టా ఒకదగాపడ్డ నాయకుడు. దురదృష్టం వెన్నాడిన రాజకీయ నేత. సొమ్మొకడిది...సోకొకడిది బాపతు నాయకులు అనేకమంది జిట్టా చేసిన ఆర్ధిక సాయం నుంచి లాభం పొందారు. పొయ్యి దగ్గర పొగ ఊది తెలంగాణ సంస్కృతి, తెలంగాణ వంటను జిట్టా వండి వారిస్తే ఫుల్లుగా లాగించి బ్రేవ్ మని బైటికెళ్లి అయన సేవను మరిచినవారే దాదాపు అంతా.  సంపన్న కుటుంబలో పుట్టకపోయినా ప్రజా సేవలో మూడు దశాబ్దాలు కష్టపడి ఒక్క పదవైనా అనుభవించకుండా మరణించిన నాయకుడు. అలాంటి యువ నేతను తగు రీతిలో ప్రత్యేక రాష్ట్రం సత్కరించుకోలేకపోయింది. తన రాజకీయ ప్రస్థానం (టీ ఆర్ ఎస్, కాంగ్రెస్, వై ఎస్ ఆర్ సీ పీ, సొంత యువ తెలంగాణ పార్టీ, బీజేపీ, బీ ఆర్ ఎస్) తనను మంచి ఆర్గనైజర్ గా, ప్రతిభ గల నేతగా గౌరవించే మిత్రులను ఇచ్చింది కానీ ప్రజాసేవ కాంక్షించి తాను ఆశించిన ఒక్క పదవిని ఇవ్వకపోవడం జిట్టా అభిమానులకు వెలితిగానే ఉండిపోతుంది.  

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట పురిటి గడ్డ నల్గొండలో యువతకు సహజంగానే సామాజిక స్పృహ ఎక్కువ. అక్కడి నుంచి అందుకే ఎక్కువ సంఖ్యలో విద్యావేత్తలు, జర్నలిస్టులు,కార్టూనిస్టులు, మావోయిస్టులు పుట్టుకొచ్చారు. ఇప్పుడు పరిస్థితి కొద్దిగా మారింది కానీ, చెంతనే కృష్ణా పారుతున్నా అక్కడి ప్రజలకు శుద్ధమైన తాగునీరు కరువు. సామాజిక అంతరాలు, ఆర్థిక వైరుధ్యాలు పుష్కలం. తరచూ పలకరించే కరువు కాటకాలు సరేసరి. భాగ్యనగరం వదిలే మురుగునీరు మూసీని దోమల అడ్డాగా, జబ్బుల దిబ్బగా మార్చింది. అన్నిటికన్నా ముఖ్యంగా, అక్కడి ప్రతి పల్లె వెన్నును ఫ్లోరోసిస్ విరిచివేసింది. జనాల జవసత్వాలను హరించింది. 

ఇలాంటి సవాలక్ష సమస్యలకు ఆలవాలమైన నల్గొండ జిల్లాలో 1972 లో పుట్టిన జిట్టా తనకు ఇరవై ఏళ్ల వయస్సు ఉన్నపుడు (1992 లో) వివేకానంద యువజన సంఘం స్థాపించి సమాజ సేవకు నడుం బిగించారు. 2000 నాటికి ఆంధ్రప్రదేశ్ లో యువజన సంఘాల సమితిని స్థాపించి యూత్ కోసం వివిధ కార్యక్రమాలు పెద్ద సంఖ్యలో చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు పదివేల సంఘాలకు అయన మార్గదర్శకత్వం వహించేవారు. సాధారణ నేపథ్యం కలిగిన ఒక రిటైర్డ్ టీచర్ కుమారుడు పెద్దగా రాజకీయ దన్ను లేకుండానే స్వయం శక్తితో ఈ స్థాయికి చేరడం మామూలు విషయం కాదు. వివేకానందుడి స్పూర్తితో సామాజిక సేవా కార్యక్రమాలు, ఉచిత ఆరోగ్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, జాతీయ నేతల జయంతి కార్యక్రమాలు, క్రీడాపోటీలు నిర్వహించేవారు. క్రికెట్, వాలీబాల్ కిట్లు ఊళ్లలో పంచిపెట్టువారు. నల్గొండ జిల్లాలో నక్సలిజం ఊపందుకుంటున్న రోజుల్లో ఈ యువజన సంఘం యువకులు పెడదారి పట్టకుండా పరోక్షంగా సహకరించిందని చెబుతారు. 2003 లో తన మేనమామ (ప్రవాస భారతీయుడు) ఫౌండేషన్ సాయంతో కోటి రూపాయలకు పైగా వెచ్చించి భువనగిరి లో పేద, మధ్యతరగతి విద్యార్థుల కోసం ఒక కళాశాల స్థాపించడమే కాకుండా భోజన సదుపాయం కల్పించారు. వివిధ పాఠశాలలకు కూడా ఇతోధికంగా సాయం చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. 

2003 లో తెలంగాణ రాష్ట్ర సమితి లో చేరిన జిట్టా 2007 లో యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. పార్టీ అగ్ర నాయకత్వం నమ్మదగ్గ నాయకుడిగా వేగంగా అయన ఎదిగారు. ఒకప్పటి జీవనది మూసీ (ముచుకుంద) శుద్ధి కోసం జిట్టా చేసిన పోరాటం అపూర్వమయినది. మూసీ ని కాలుష్యం బారి నుంచి కాపాడి ప్రతి పల్లెకు రక్షిత మంచి నీరు అందించాలని డిమాండ్ చేస్తూ 2005 ఏప్రిల్ 10 నుంచి 17 వరకు వలిగొండ నుంచిహైదరాబాద్ వరకు చేపట్టిన 200 కిలోమీటర్ల పాదయాత్ర అప్పట్లో పాలకులను కదిలించింది. ఆ మరుసటి సంవత్సరం భువనగిరి నియోజవర్గంలో వందకు పైగా వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం మూలంగా చాలా మంది ప్రజలు ఫ్లోరోసిస్ దుష్ప్రభావాల నుంచి బయటపడ్డారు. ఇప్పటికే జిట్టాకు మంచి ప్రజాదరణ లభించింది.  తెలంగాణ ప్రత్యేకతను కళారూపాలు, వంటల రూపంలో షో కేస్ చేయడానికి అయన చాలా వ్యయప్రయాసలకు ఓర్చారు.  

2009 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశంతో టీ ఆర్ ఎస్ పొత్తు లేకుండా ఉన్నా, అదే ఏడాది అప్పటి ముఖ్యమంత్రి  రాజశేఖర్ రెడ్డి మరణించకుండా ఉన్నా జిట్టా రాజకీయ జీవితం వేరుగా ఉండేది. "2009 అయనను కోలుకోలేని దెబ్బ తీసింది. కేసీఆర్ దగ్గర ఆయనకు మంచి పేరుండేది. భువనగిరి సభలో కార్యకర్తల అతి మూలంగా పెద్దాయనకు జిట్టా మీద కోపం వచ్చిందని అంటారు. అది ఆయనకు చాలా నష్టం చేసింది," అని సీనియర్ జర్నలిస్టు క్రాంతి చెప్పారు. 2009 ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా రంగంలోకి దిగిన 37 ఏళ్ల జిట్టా 29.47 శాతం (43,720) ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచి అంతిమ విజేత ఉమా మాధవ రెడ్డికి (35.77 శాతంతో 53,073) గట్టి పోటీ ఇచ్చారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తన యువ తెలంగాణ పార్టీ తరఫున పోటీ చేసి 24.67 శాతం ఓట్లతో మళ్ళీ రెండో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ కంచుకోట అయిన నల్గొండ జిల్లాలో జిట్టా వ్యక్తిగత ప్రతిష్ఠ వల్ల ఆ ఆపార్టీ మూడో స్థానంతో తృప్తిపడాల్సి వచ్చింది. ఉద్యమ సమయంలో చిత్తశుద్ధితో తెలంగాణ కోసం నడుంబిగించి మంచి ఆర్గనైజర్ గా  జిట్టా మంచి పేరు సాధించి సేవలందించిన విధానాన్ని  ఉద్యమ కారులు చెరుకు సుధాకర్, వీరమళ్ళ ప్రకాష్ రావు, తీన్మార్ మల్లన్న మాత్రమే కాకుండా రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా నిన్న గుర్తుకు చేసుకున్నారు. 
రాజకీయ అంచనా సరిగా లేకకావచ్చు, జిట్టా 2023 అక్టోబర్ లో మళ్ళీ కేసీఆర్ దరిచేరారు. కానీ అప్పటికే రాజకీయ ఆలస్యం అయ్యింది.  

జిట్టా కు తీవ్ర అన్యాయం చేశారన్న విమర్శలు ఎదుర్కుంటున్న కే సీ ఆర్ భువనగిరి వెళ్లి అయన అంత్య క్రియల్లో పాల్గొంటే బాగుండేది. అలాగే, తెలంగాణ ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా  అయన అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో చేసినా సముచితంగా ఉండేది. మొదటి నుంచీ జాతీయ వాద భావజాలంతో ప్రజాసేవ చేసిన జిట్టా కు బీజేపీ నాయకులైనా నివాళులు అర్పించినట్లు అనిపించలేదు.  

ప్రజల కోసం కష్టపడి పనిచేసిన జిట్టాను దురదృష్టవశాత్తూ రాజకీయ అడ్డంకులు వివిధ రూపాల్లో ఎదగకుండా నిలువరించాయి. అయన ఒక దశలో నిస్పృహకు గురయినట్లుస్పష్టంగా అనిపించింది.ఆ మనోవ్యాకులత జిట్టా ఆరోగ్యాన్ని దెబ్బతీసిందని నమ్మేవారు కూడా ఉన్నారు. 
తెలంగాణ వ్యతిరేకులను, ఉద్యమంతో సంబంధం లేని వారిని ప్రత్యేక రాష్ట్రంలో పదవులు వరించాయి. కానీ, చట్ట సభల్లో ప్రవేశించి మరింత ప్రజాసేవ చేయాలనుకున్న తన సంకల్పం నెరవేరకుండానే యువనేత జిట్టా కన్నుమూయడం విషాదం.

0 comments:

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి