Wednesday, December 11, 2024

నోటికొచ్చింది మాట్లాడి/రాసి ఇరుక్కోకండి....

 వాక్ స్వాత్రంత్య్రం. సోషల్ మీడియా. 

ఈ రెండూ ఫ్రీగా దొరికాయ్ కదా...అని మనకు నచ్చని వారిమీద రెచ్చిపోతే గట్టిగా ఇరుక్కుంటాం. తిట్లు తినే వాళ్లు పట్టించుకోకపోబట్టి, కోర్టుకు ఈడ్చే తీరికా, ఓపికా లేకపోబట్టి నోటి తీట/ చేతి గుల మహనీయులు బతికిపోతున్నారు కానీ లేకపోతే తలనొప్పి, తలబొప్పి ఖాయమయ్యేవి. ఇందుకు ఒక క్లాసిక్ కేసు ఇది. ఈ రోజు ది హిందూ మొదటి పేజీల్లో 'Unconditional Public Apology' అన్న శీర్షిక కింద వచ్చిన ఒక ప్రకటన చూడండి. దాని కథాకమామీషు ఇదండీ.



హైదరాబాద్ లో మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ అనే గొప్ప విద్యా సంస్థ ఉంది. దాని మాజీ ఛాన్సలర్ గారికి ఎందుకో ఒళ్ళు మండి జర్నలిజం శాఖలో పనిచేసే ప్రొఫెసర్ మీద 2019 లో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రొఫెసర్ పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగేలా మీడియా ముందు అన్నారట. గతంలో ఉన్న లైంగిక వేధింపుల కేసు నుంచి విముక్తి లభించాక కూడా తనను ఆ అర్థం వచ్చేలా ఘాటైన మాట అనడం మీద జర్నలిజం ప్రొఫెసర్ గారు కోర్టుకు వెళ్లారు. ఛాన్సలర్ గారు అడ్డంగా దొరికిపోవడంతో సుప్రీం కోర్టులో సారీ చెప్పారు. తన క్లయింట్ 'emotional outburst (భావోద్వేగ విస్ఫోటం)' తో అన్నారే తప్ప ప్రొఫెసర్ ను బద్నాం చేయాలని కాదని ఛాన్సలర్ తరఫు న్యాయవాది విన్నవించారు. ఆయనకు మెడిసిన్ చేస్తున్న ఇద్దరు పిల్లలు ఉన్నందున జరిమానా విషయంలో దయ చూపాలని కూడా ఆ న్యాయవాది కోర్టును కోరారు. దానిపై స్పందిస్తూ.... ప్రొఫెసర్ గారికి Unconditional Public Apology ప్రకటన రూపంలో చెప్పాలని, మనో వేదన కలిగించినందుకు ఒక లక్ష రూపాయలు చెల్లించాలని సుప్రీం కోర్టు బెంచ్ అక్టోబర్ లో ఆదేశించింది.

దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశం మేరకు ఈ రోజు మాజీ ఛాన్సలర్ గారు Unconditional Public Apology ప్రచురించారు The Hindu లో. నా లెక్క ప్రకారం, లాయర్లకు, ఈ ప్రకటన వేయడానికి ఛాన్సలర్ గారికి కనీసం 7-8 లక్షలు వదిలి ఉంటాయి. పైగా అందరి ముందు చులకన అయ్యే పరిస్థితి.  

This is a case of defamation by libel filed by Journalism Professor in 2019.

First a criminal complaint with police, then criminal proceedings before a Junior Civil Judge, then a Original Suit with Addl Dist Judge, then a Criminal Petition before a single Judge of TS High Court and finally a Spl Leave Petition before a Division Bench of Supreme Court. 

"A 6 year litigation of defamation not only defamed 2 professors but also brought disrepute to MANUU, a Temple of learning," అని సీనియర్ అడ్వకేట్ Babji Yana గారు చెప్పారు. 

అదీ సంగతి... ఇది అందరికీ గుణపాఠం. మీడియా ముందు, వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియా మాధ్యమాల్లో ఇతరులపై రెచ్చిపోయి రాయడం గానీ, వీడియోలు చేయడం గానీ చేయకండి. చట్టాలు టైట్ అవుతున్నాయి. మీ అభిప్రాయాలు చెప్పడం వేరు, చెలరేగిపోయి పిచ్చపిచ్చ ఆరోపణలు చేయడం వేరు. 

భద్రం బీ కేర్ ఫుల్ బ్రదర్/ సిస్టర్.

Sunday, December 8, 2024

ఘంటా చక్రపాణి గారికి వీసీ పదవి: శభాష్... రేవంత్ జీ!

 ఒక పార్టీ హయాంలో పదవి అనుభవించిన వారిని వైరి పార్టీ పవర్ లోకి రాగానే ఇంటికి సాగనంపడం మనం తరచూ చూస్తాం. ప్రతిభ, అర్హతలతో సంబంధం లేకుండా కేవలం పొలిటికల్ ఈక్వేషన్ కారణంగా ఇట్లా పాత వారికి పాతరేసి కొత్తవారి జాతర మొదలు పెడతారు. ఇదో దిక్కుమాలిన పద్ధతి. దానికి పూర్తి భిన్నంగా...కేసీఆర్ గారి హయాంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా పనిచేసిన విద్యావేత్త, మేధావి, రాజకీయ - సామాజిక - సాంస్కృతిక విశ్లేషకుడు Chakrapani Ghanta గారిని కాంగ్రెస్ ప్రభుత్వ సారథి రేవంత్ రెడ్డి గారు ప్రతిష్ఠాత్మకమైన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా నియమించడం నాకు మంచిగా అనిపించింది. ఇలాంటి అసాధారణ చర్యలే తెలంగాణ పునర్నిర్మాణానికి కావలసింది. ప్రతిభను కాకుండా భజనను ప్రాతిపదికగా చేసుకునే పాత సీఎం ఇలాంటి పని కలలో అయినా చేయరు. మేధావులను వాడుకోవడం చేతగాక ఎన్నో బ్రిలియంట్ బ్రెయిన్స్ ను దూరం చేసుకుని అవమానించి చెడ్డపేరు తెచ్చుకుని ఫలితం అనుభవించిన కేసీఆర్ గారు రేవంత్ గారి నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప అంశం ఇదని నాకు అనిపిస్తున్నది. 

మూడు దశాబ్దాలకు పైగా అదే యూనివర్శిటీ కి సేవలు అందించిన చక్రపాణి గారు వీసీ కావడం మంచి పరిణామం. లక్షల మంది ఇంటి గడపల చెంతకు చదువును చేర్చిన ఒక గొప్ప విద్యా సంస్థ అంబేద్కర్ విశ్వవిద్యాలయం. చక్రపాణి గారి సమర్ధ నాయకత్వంలో అది కాలానికి అనుగుణంగా ఉపాధి కల్పన పెంచే కోర్సులు ప్రవేశపెట్టి మేలు చేస్తుందని, ప్రతిభకు పెద్దపీట వేస్తుందని భావించవచ్చు. బీ.ఆర్ ఎస్ హయాంలో...పదవి ఉంది కదా...అని నోటికి వచ్చింది మాట్లాడకుండా తనకు అప్పగించిన పని మీదనే ఆయన దృష్టి పెట్టబట్టి మర్యాద నిలిచి ఇప్పుడు కాంగ్రెస్ పాలనలోనూ మంచి పోస్టు వరించింది.  


చక్రపాణి గారికి శుభకామనలు. 
శుభకామనలు. 
నిజానికి వీసీలను డైరెక్టుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించదు. నిపుణులతో 
కూడిన సెర్చ్ కమిటీ సిఫార్సు మేరకు గవర్నర్ నియమిస్తారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం వద్దనుకునే వారు వీసీ గా నియమితులవడం ఈ రోజుల్లో దుర్లభం.

తేడా వస్తే తోలు తీసే Murali Akunuri లాంటి వారికి విద్యా కమిషన్ పగ్గాలు అప్పజెప్పడం కూడా బాగుంది. అందులో మా గురువు గారు PL Vishweshwer Rao లాంటి వారికి స్థానం కల్పించారు. నిజానికి PLV సార్ 15 ఏళ్ల కిందటనే వీసీ కావలసిన విద్యావేత్త, మేధావి.

Saturday, December 7, 2024

ఆటగాళ్ళ కుటుంబాల కష్టాలు!

మన దేశంలో, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో, క్రీడాభిమానులు కోకొల్లలు కానీ క్రీడాకారులు తక్కువ. అంతా ఆటలు చూసి ఎంజాయ్ చేయాలనుకుంటారు గానీ వాళ్ళ పిల్లల్ని ఆటల్లో పెట్టే సాహసం చేయరు.  ఇంజినీరింగ్, మెడిసిన్ పిచ్చలో ఉంటారు చాలా మంది. 

రాణిస్తున్న క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి కుటుంబం అతని ఆట కోసం పడిన కష్టం చదివితే మా కథ మేమే చదివినట్టు ఉంది. మధ్య తరగతి కుటుంబాలు పిల్లల్ని ఆటల్లో పెడితే పడే కష్టాలు నిజంగా సినిమా కష్టాలే. అయ్యో... అనేవాడు గానీ, మేమున్నాం... అనే వాళ్ళుగానీ దాదాపు ఉండరు. విజయం సాధించి మీడియాలో వస్తే మాత్రం...తాము ముందే ఊహించామని చెప్తారు. వావ్, సూపర్ అని ముఖస్తుతి కోసం అనేవాళ్లే అంతా. 



హాయిగా ఇద్దరం రిపోర్టర్స్ గా (నేను ది హిందూ లో, ఆమె ఎన్ టీవీ లో) నల్గొండలో ఉండేవాళ్ళం. మా అబ్బాయిని టేబుల్ టెన్నిస్ లో పెట్టాక...అక్కడి కోచ్ Anand Baba Komarraju ఓనమాలు నేర్పారు. ఆయన  మంచి కోచింగ్ ఇచ్చి ప్రోత్సహించినా ప్రాక్టీసింగ్ పార్టనర్స్ కోసం హైదరాబాద్ రావాలని నేను సుఖమైన ఉద్యోగం మారాను. అది చాలా కష్టమైన నిర్ణయం. కొన్నాళ్ళు హైదరాబాద్ లో పనిచేసాక తను ఉద్యోగం మానాల్సి వచ్చింది. రూరల్ జర్నలిజం లో మంచి పేరు తెచ్చుకున్న మేము ఈ హైదరాబాద్ హడావుడి జర్నలిజం లో నలిగిపోయాం. తృప్తి లేదు. జర్నలిజం మీద బుర్రలేని బాసుల మూలంగా అసహ్యం పెరిగింది. పక్కకు తప్పుకోవడంతో ఆర్థికంగా ఇబ్బంది అయ్యింది. 



మూడెకరాలు కరిగించాల్సి వచ్చింది. తెలంగాణ లాంటి అననుకూల రాష్ట్రం నుంచి అంతర్జాతీయ ఆటగాడు కావాలంటే మన బాధ మనమే పడాలి. నరమానవుడు ఆదుకోడు. నా ప్రియ మిత్రుడు, నన్ను అనుసరించి నల్గొండ నుంచి ఇల్లు అమ్ముకుని వచ్చి ఇద్దరు పిల్లల్ని అంతర్జాతీయ స్థాయికి తెచ్చి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కొట్టిన Shiva Shanker, నాకు సాయం చేయాలని విఫల ప్రయత్నం చేసిన Marumamula Venkata Ramana Sharma గారు, Asci Hyd చైర్మన్ Kantipudi Padmanabhaiah గారు తప్ప ఒక్కరూ కనీసం పరిస్థితి ఏమిటని అడగలేదు. అది వారి తప్పు కూడా కాదు. మనకున్న సమాజం అలాంటిది. సంస్కృతి అలాంటిది. 

అయినా మా వాడి విజయాల వల్ల ముందుకు సాగిపోయాం. కోచ్ ల గొడవ, అసోసియేషన్ లో ఉండే తొట్టి గ్యాంగ్ పాలిటిక్స్, తోటి ఆటగాళ్ళ తల్లిదండ్రుల ఏడుపులు ఒక పక్క దేశ, విదేశాల్లో కోచింగ్, టర్నమెంట్ల కోసం అయ్యే ఖర్చు...కుంగదీసినా ఎంతో నమ్మకంతో ముందుకు పోయాం. ఇప్పుడు స్నేహిత్ ఇండియా నెంబరు - 10, వరల్డ్ నంబర్ - 108 గా ఉన్నాడు. దాదాపు 40 దేశాలలో భారత్ కు ప్రాతినిధ్యం వహించాడు.  కాగ్ లో ఆడిటర్ గా అక్టోబర్ లో స్పోర్ట్స్ కోటాలో జాయిన్ అయ్యాడు. No regrets. 

స్పోర్ట్స్ పర్సన్ జీవితంలో డబ్బు సమకూరుస్తూ, పాలిటిక్స్ కాసే తండ్రి కన్నా తల్లి పాత్ర ఎంతో ఉంటుంది. ప్రతి తల్లి ఒక పెద్ద కౌన్సిలర్. ప్రేమగా పోషకాహారం పెడుతూ, అపజయాల సమయంలో అమ్మ ఇచ్చే ధైర్యమే ప్రతి ఆటగాడికి కొండంత బలం. సిబ్లింగ్ కూడా ఎంతో అండ ఇవ్వాల్సి ఉంటుంది. 

కొవిడ్ తో పాటు ఆటల పట్ల కే సీ ఆర్ కున్న నిర్లిప్తత బాగా బాగా మమ్మల్ని దెబ్బతీసింది. తమిళ నాడు, గుజరాత్, హర్యానా లలో ప్రభుత్వాలు లక్షలుపెట్టి శిక్షణ ఇప్పిస్తుంటే తెలంగాణ లో నయా పైసా సాయం లేక ఇబ్బంది పడ్డాం. ఈ రేవంత్ ప్రభుత్వం కూడా అదే బాపతులా ఉంది. ఒక అంతర్జాతీయ మెడల్ వచ్చినప్పుడు సీఎం ను కలవాలని ప్రయత్నిస్తే వారు టైం ఇవ్వలేదు. అది మన సంస్కృతి. 

నితీశ్ లాంటి ఆటగాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వారికి ప్రోత్సాహం కావాలి. ఇలాంటి ఆటగాళ్లను తయారుచేసే కుటుంబాలకు అండగా అందరూ ఉండాలి. ఆటగాడు సైనికుడిలా దేశం కోసం కష్టపడతాడు. అందుకోసం కుటుంబం నానా తంటాలు పడుతుంది. అలాంటి కుటుంబాలకు శాల్యూట్.

ఈ కథనానికి ప్రేరణ అయిన ఈనాడు పేపర్ క్లిప్పింగ్ జత చేస్తున్నా. దాంతో పాటు... Snehit గతవారం చైనా లో జరిగిన టోర్నమెంట్ లో పాల్గొన్నప్పటి ఫోటో కూడా ఉంది.