మన దేశంలో, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో, క్రీడాభిమానులు కోకొల్లలు కానీ క్రీడాకారులు తక్కువ. అంతా ఆటలు చూసి ఎంజాయ్ చేయాలనుకుంటారు గానీ వాళ్ళ పిల్లల్ని ఆటల్లో పెట్టే సాహసం చేయరు. ఇంజినీరింగ్, మెడిసిన్ పిచ్చలో ఉంటారు చాలా మంది.
రాణిస్తున్న క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి కుటుంబం అతని ఆట కోసం పడిన కష్టం చదివితే మా కథ మేమే చదివినట్టు ఉంది. మధ్య తరగతి కుటుంబాలు పిల్లల్ని ఆటల్లో పెడితే పడే కష్టాలు నిజంగా సినిమా కష్టాలే. అయ్యో... అనేవాడు గానీ, మేమున్నాం... అనే వాళ్ళుగానీ దాదాపు ఉండరు. విజయం సాధించి మీడియాలో వస్తే మాత్రం...తాము ముందే ఊహించామని చెప్తారు. వావ్, సూపర్ అని ముఖస్తుతి కోసం అనేవాళ్లే అంతా.
హాయిగా ఇద్దరం రిపోర్టర్స్ గా (నేను ది హిందూ లో, ఆమె ఎన్ టీవీ లో) నల్గొండలో ఉండేవాళ్ళం. మా అబ్బాయిని టేబుల్ టెన్నిస్ లో పెట్టాక...అక్కడి కోచ్ Anand Baba Komarraju ఓనమాలు నేర్పారు. ఆయన మంచి కోచింగ్ ఇచ్చి ప్రోత్సహించినా ప్రాక్టీసింగ్ పార్టనర్స్ కోసం హైదరాబాద్ రావాలని నేను సుఖమైన ఉద్యోగం మారాను. అది చాలా కష్టమైన నిర్ణయం. కొన్నాళ్ళు హైదరాబాద్ లో పనిచేసాక తను ఉద్యోగం మానాల్సి వచ్చింది. రూరల్ జర్నలిజం లో మంచి పేరు తెచ్చుకున్న మేము ఈ హైదరాబాద్ హడావుడి జర్నలిజం లో నలిగిపోయాం. తృప్తి లేదు. జర్నలిజం మీద బుర్రలేని బాసుల మూలంగా అసహ్యం పెరిగింది. పక్కకు తప్పుకోవడంతో ఆర్థికంగా ఇబ్బంది అయ్యింది.
మూడెకరాలు కరిగించాల్సి వచ్చింది. తెలంగాణ లాంటి అననుకూల రాష్ట్రం నుంచి అంతర్జాతీయ ఆటగాడు కావాలంటే మన బాధ మనమే పడాలి. నరమానవుడు ఆదుకోడు. నా ప్రియ మిత్రుడు, నన్ను అనుసరించి నల్గొండ నుంచి ఇల్లు అమ్ముకుని వచ్చి ఇద్దరు పిల్లల్ని అంతర్జాతీయ స్థాయికి తెచ్చి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కొట్టిన Shiva Shanker, నాకు సాయం చేయాలని విఫల ప్రయత్నం చేసిన Marumamula Venkata Ramana Sharma గారు, Asci Hyd చైర్మన్ Kantipudi Padmanabhaiah గారు తప్ప ఒక్కరూ కనీసం పరిస్థితి ఏమిటని అడగలేదు. అది వారి తప్పు కూడా కాదు. మనకున్న సమాజం అలాంటిది. సంస్కృతి అలాంటిది.
అయినా మా వాడి విజయాల వల్ల ముందుకు సాగిపోయాం. కోచ్ ల గొడవ, అసోసియేషన్ లో ఉండే తొట్టి గ్యాంగ్ పాలిటిక్స్, తోటి ఆటగాళ్ళ తల్లిదండ్రుల ఏడుపులు ఒక పక్క దేశ, విదేశాల్లో కోచింగ్, టర్నమెంట్ల కోసం అయ్యే ఖర్చు...కుంగదీసినా ఎంతో నమ్మకంతో ముందుకు పోయాం. ఇప్పుడు స్నేహిత్ ఇండియా నెంబరు - 10, వరల్డ్ నంబర్ - 108 గా ఉన్నాడు. దాదాపు 40 దేశాలలో భారత్ కు ప్రాతినిధ్యం వహించాడు. కాగ్ లో ఆడిటర్ గా అక్టోబర్ లో స్పోర్ట్స్ కోటాలో జాయిన్ అయ్యాడు. No regrets.
స్పోర్ట్స్ పర్సన్ జీవితంలో డబ్బు సమకూరుస్తూ, పాలిటిక్స్ కాసే తండ్రి కన్నా తల్లి పాత్ర ఎంతో ఉంటుంది. ప్రతి తల్లి ఒక పెద్ద కౌన్సిలర్. ప్రేమగా పోషకాహారం పెడుతూ, అపజయాల సమయంలో అమ్మ ఇచ్చే ధైర్యమే ప్రతి ఆటగాడికి కొండంత బలం. సిబ్లింగ్ కూడా ఎంతో అండ ఇవ్వాల్సి ఉంటుంది.
కొవిడ్ తో పాటు ఆటల పట్ల కే సీ ఆర్ కున్న నిర్లిప్తత బాగా బాగా మమ్మల్ని దెబ్బతీసింది. తమిళ నాడు, గుజరాత్, హర్యానా లలో ప్రభుత్వాలు లక్షలుపెట్టి శిక్షణ ఇప్పిస్తుంటే తెలంగాణ లో నయా పైసా సాయం లేక ఇబ్బంది పడ్డాం. ఈ రేవంత్ ప్రభుత్వం కూడా అదే బాపతులా ఉంది. ఒక అంతర్జాతీయ మెడల్ వచ్చినప్పుడు సీఎం ను కలవాలని ప్రయత్నిస్తే వారు టైం ఇవ్వలేదు. అది మన సంస్కృతి.
నితీశ్ లాంటి ఆటగాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వారికి ప్రోత్సాహం కావాలి. ఇలాంటి ఆటగాళ్లను తయారుచేసే కుటుంబాలకు అండగా అందరూ ఉండాలి. ఆటగాడు సైనికుడిలా దేశం కోసం కష్టపడతాడు. అందుకోసం కుటుంబం నానా తంటాలు పడుతుంది. అలాంటి కుటుంబాలకు శాల్యూట్.
ఈ కథనానికి ప్రేరణ అయిన ఈనాడు పేపర్ క్లిప్పింగ్ జత చేస్తున్నా. దాంతో పాటు... Snehit గతవారం చైనా లో జరిగిన టోర్నమెంట్ లో పాల్గొన్నప్పటి ఫోటో కూడా ఉంది.
1 comments:
Recreational/ fitness Sports and competitive sports are two different things. If someone wants to pursue competitive sports they should be prepared for some sacrifices. It is a personal choice. Don't blame others that they are not helping. In fact undue importance is being given to medals and tournaments . IPL has resulted in crass commercialization of sports.
Sports and games for physical fitness is good.
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి