ఆసక్తితో జర్నలిజంలోకి వచ్చిన వాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారిలో చాలా మంది ప్రింట్ జర్నలిజం నుంచి వచ్చి ఇప్పుడు తల పండిన వారు లేదా అస్త్ర సన్యాసం చేసిన వారు ఉన్నారు. వారిని నడిపించింది: మెంటారింగ్. సీనియర్లను చూసి నేర్చుకుని వృత్తి నైపుణ్యం పెంచుకుని పేరు పొందిన వారు అనేకమంది ఉన్నారు.
నేను 1989 ప్రాంతంలో ఈ వృత్తిలోకి వచ్చి ఎక్కువకాలం ప్రింట్ జర్నలిజంలో ఉన్నా 20 ఏళ్ళుగా బ్లాగర్ గా రాస్తూ, రెండేళ్లుగా యూ ట్యూబర్ గా వీలున్నప్పుడల్లా వీడియోలు చేస్తూ ఉన్నా. సీనియర్ల నుంచి ఎంతో నేర్చుకున్నా నేను. నాకు వార్త రాయడం నేర్పిన సూర్యదేవర శ్రీకాంత్ గారు, ఎడిటింగ్ ఎట్లా ఉండాలో చెప్పకనే చెప్పిన కల్లూరి కృష్ణయ్య గారు (ఫోటో), మంచి శీర్షికలు ఎట్లా పెట్టాలో, ఇంట్రో లు ఎట్లా రాయాలో నేర్పిన దత్తారాం ఖత్రి గారు, వేగంగా పనిచేస్తూ మైండ్ ను చురుగ్గా ఎట్లా ఉంచుకోవాలో వీ ఎస్ ఆర్ శాస్త్రి గారు, బాస్ గా ఉంటూనే ప్రేమ ఎట్లా పంచాలో దాసు కేశవరావు గారు నేర్పించారు. స్టోరీ ఐడియా ల మీద బ్రెయిన్ స్టామింగ్ నేను పర్వతం మూర్తి గారి నుంచి నేర్చుకున్నాను. అట్లాగే ఎన్నికల పేజీలు నడపడంలో సాధక బాధకాలు ఇప్పుడు ఈనాడు ఎడిటర్ గా ఉన్న ఎం. నాగేశ్వర రావు గారి నుంచి ప్రత్యక్షంగా తెలుసుకున్నా.
నేర్పించడం అంటే... ఒక సిలబస్ పాటించి కాదు. వారిని చూసి నేర్చుకున్నది ఎంతో ఉంది. అట్లానే తోటి జర్నలిస్టులు, సీనియర్లు కూడా వారి నడవడికతో, ప్రవర్తనతో ఎంతో నేర్పారు. ఇది మెంటారింగ్ అంటే. నేను కూడా నాకు తెలిసింది నేర్పిన వాళ్ళు జర్నలిజంలో ఒక డజను దాకా మంచి పొజిషన్లలో ఉన్నారు. జర్నలిజం బోధకుడిగా అర్హతలు (PhD) సాధించాక నేను ప్రాణం పెట్టి నాకున్న కొద్దిపాటి జ్ఞానాన్ని పంచుకున్నారు ఒక పాతిక, ముప్ఫై మంది ఉంటారు. వాళ్ళు బాగానే చేస్తున్నారు.
నేను ఒక్కడినే కాదు, మీడియాలో ఒక ఇరవై ఏళ్ళ అనుభవం ఉన్న ఎవరిని పలకరించినా తాము రుణపడి ఉండే మెంటార్స్ ను తలచుకుంటారు. ఇప్పుడు ఏదైనా రాసినా నచ్చినా, నచ్చకపోయినా ఫోన్ చేసి మాట్లాడే సీనియర్లు ఉండడం నాకైతే ఆనందంగా ఉంటుంది. కొందరు కామెంట్స్ రూపంలో చెబుతారు. మన ఐడియా కరెక్టేనా? అన్న సందేహం వచ్చినప్పుడు నేను విశ్వసించే సీనియర్లకు ఫోన్ చేసి correct me if i am wrong అని అడుగుతాను. ఇది ఎంతో ముఖ్యమైన కసరత్తుగా నేను భావిస్తాను. ఒక్క వాక్యం తేడా రాసినా వెంటనే అలెర్ట్ చేసే సీనియర్లు ఉండడం నిజంగా అదృష్టం. ఆ మర్యాద, కుషన్ మనం వారికి ఇస్తేనే వారు సహకరిస్తారు.
యూట్యూబ్ ద్వారా సంపాదన వస్తున్న ఈ రోజుల్లో మెంటారింగ్ లేదూ, పాడూ లేదు అనుకుంటా. ఎవరికి ఎక్కువ subscribers ఉంటే ఆయన లేదా ఆమె గొప్ప. మీ వాదన సరిగా లేదు అని మన అనుభవంతో చెబితే అఫెండ్ అయ్యేవాళ్ళు, మన మీద బండలు వేయాలని అనుకునేవారు ఎక్కువ. ఇలాంటి వాళ్ళను చూస్తే జాలివేస్తుంది. నిన్న అరెస్ట్ అయిన ప్రశ్న జోసఫ్ అలియాస్ రావణ్ గారికి నేను కొన్ని జాగ్రత్తలు చెప్పాలని ఎన్నాళ్ల నుంచో అనుకున్నా కానీ నాకు ఆయన పరిచయం లేడు. ఎప్పుడో ఒకప్పుడు పెద్ద ఊబిలో పడే ఒక ఐదారుగురు మహిళా జర్నలిస్టులు కళ్ళ ముందు కనిపిస్తున్నారు. ప్రెస్ క్లబ్ లేదా మీడియా అకాడమీ ఇలాంటి వారి కోసం ప్రత్యేక మీటింగ్స్ నిర్వహించాలి. రౌండ్ టేబుల్స్ జరగాల్సింది ఇలాంటి వాటి మీద, కేవలం బూతులు దోకడానికి మాత్రమే కాదు.
ఇప్పుడు ట్రోలింగ్ గురించి లోపల ఖుషీ అవుతూ బైటికి హడావిడి చేసే జర్నలిస్టులు (ముఖ్యంగా playing to the gallery type సోదరీమణులు) ఉన్నట్లు నాకు అర్థమయ్యింది. కావాలని రెచ్చగొట్టే స్టోరీలు చేసేవారికి సూచనలు, సలహాలు ఏమి ఇవ్వగలం? కొందరి స్టోరీ యాంగిల్, పదాల వాడకం, నిష్పాక్షిత అన్న బేసిక్ రూల్ లేకుండా చేసే హడావుడి చూస్తే అయ్యో అనిపిస్తుంది.
ఈ వర్తమాన సున్నిత రాజకీయ వాతావరణంలో కేసులు పడకుండా ఉండాలంటే వర్ధమాన జర్నలిస్టులు, యాక్టివిస్టులు పాటించాలి.
1) నాకే అన్నీ తెలుసు అన్న మూర్ఖపు భావన వదలండి.
2) మెంటార్స్ ఇద్దరు, ముగ్గురిని అందుబాటులో ఉంచుకోండి.
3) మెంటార్స్ తో తరచూ మాట్లాడండి. వారి ఫీడ్ బ్యాక్ తీసుకోండి.
4) మెంటార్స్ సూచించే పుస్తకాలు చదవండి. వ్యక్తులను ఫాలో కండి.
5) జర్నలిజం మౌలిక సూత్రాల విషయంలో రాజీ పడి చెడ్డపేరు తెచ్చుకోకండి.
6) తప్పు చేసినట్లు అర్థం కాగానే సారీ చెప్పండి.
7) జర్నలిజం విషయంలో మీ కులాన్ని, లింగాన్ని, ప్రాంతాన్ని డాలు గా వాడుకోకండి.
8) మీరు చేస్తున్నది జర్నలిజమా? యాక్టివిజమా? అన్న అనుమానం ఉంటే నా లాంటి వాళ్ళని సంప్రదించండి.
9) జర్నలిజం ముసుగులో యాక్టివిజం, పెయిడ్ ప్రచారం చేస్తే ఇవ్వాళ కాకపోతే రేపైనా దొరికిపోతామని, చరిత్ర హీనులుగా మిగిలిపోతామని గుర్తుంచుకోండి.
#తెలుగు #జర్నలిజం #మీడియా #ఈనాడు #
#ఆంధ్రజ్యోతి #సాక్షి

0 comments:
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి