Friday, September 5, 2014

టీచర్స్ డే శుభాకాంక్షలు...

మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ... అని మనవాళ్ళు గురువుగారికి సముచిత ప్రాధాన్యం ఇచ్చారు. కానీ ఇప్పుడు మన స్కూళ్ళల్లో, కాలేజీల్లో, యూనివర్శిటీలలో పరిణామాలు చూస్తే... ఇలాంటి సన్నాసి రకాలకా... మనం ప్రాముఖ్యం ఇవ్వాల్సింది... అన్న బాధ కలుగుతుంది చాలాసార్లు. బహు తక్కువ మంది తప్ప టీచర్లు, ప్రొఫెసర్లు అంతా ఈ కేటగిరీ వాళ్ళే! దేశంలో క్రమశిక్షణ లేకపోవడానికి, నేరాలు పెరగడానికి, మానవీయ సంబంధాలు సవ్యంగా లేకపోవడానికి పరోక్ష బాధ్యత గురువులది కూడా ఉంటుందని వీళ్ళు గుర్తెరగకపోవడం బాధాకరం. 

భావి భారత పౌరులను తీర్చిదిద్దుతున్నామన్న గురుతర ఫీలింగ్ లేకపోవడం, ఇళ్ళలో ఉన్న ఫ్రస్ట్రేషన్ పిల్లల మీద చూపించడం, దండన పేరుతో గూండాల్లా దాడి చేయడం, అమానుష-పైశాచిక ప్రవర్తన, చదువుకోడానికి వచ్చిన ఆడపిల్లల మీద కన్నేసి పవిత్రమైన వృత్తికే మచ్చ తెచ్చే పిచ్చిపనులు చేయడం... టీచర్ల గురించి రోజూ పేపర్లలో వస్తున్నవే. అంతా అలా చేస్తారని కాకపోయినా... కొందరు చేసినా మొత్తం వృత్తికి చుట్టుకుంటుంది. ఈ వార్తలు చాలా బాధ కలిగిస్తాయి. గతంలో ప్రభుత్వ టీచర్లు... కొంత రహస్యంగా ఇళ్ళలో ట్యూషన్స్ నడిపి అదనపు ఆదాయం (అ ఆ) గడించేవారు. ఇప్పుడు చాలా మంది... అ ఆ కోసం చిట్టీ వ్యాపారాల్లో తలదూర్చారు. ఇది తప్పేలా అవుతుందని అంటే దానికి సమాధానం లేదు. పిల్లలు తమను అనుకరిస్తారనీ, తమ ప్రవర్తన, చర్యల ప్రభావం పసి హృదయాలపై కచ్చితంగా ఉంటుందని  అర్థం చేసుకోవాలి. 

యూనివర్శిటీలలో స్థితిగతులు దగ్గరి నుంచి చూశాక అర్థమయ్యింది ఏమిటంటే... చాలా మంది ప్రొఫెసర్లు (అసిస్టెంట్ ప్రొ  కావచ్చు, అసోసియేట్ ప్రొ కావచ్చు) పైరవీల మీద ఎంపికై విశ్వవిద్యాలయాల్లో దూరుతున్నారు. అక్కడి ఎంపికలు ఒక ఫార్సు వ్యవహారం, నిస్సందేహంగా. "ఆమె ఒక రోజు వంకాయలు కొనుక్కుంటూ మార్కెట్ లో కనిపించింది. ఏంటమ్మా... పీజీ తో ఆపావు.. పీ హెచ్ డీ చెయ్యి అని నేనే చెప్పి చేయించాను. ఏదో అవకాశం వచ్చి ఒక యూనివెర్సిటీ లో అసోసియేట్ ప్రొఫెసర్ గా వేయించా," అని ఒక పెద్ద సారు ఒకసారి పబ్లిగ్గా చెబితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. ఇలా ఎంపికైన మహాతల్లి...వృత్తిలో ప్రొఫెషనల్ గా ఉంటుందా? నో వే. తన చర్మాన్ని రక్షించుకునేందుకు నానా డ్రామాలు చేస్తుంది, నానా గడ్డి కరుస్తుంది. ఒక మహిళను ప్రోత్సహించి పీ హెచ్ డీ చేయించవచ్చు గానీ...పైరవీ తో నియామకాలు జరిపితే? ఇలాంటి వాటివల్ల కనిపించకుండా దారుణంగా దెబ్బతినేది భావితరాల విద్యార్ధులు. 

ఇక స్కూళ్ళలో, యూనివర్శిటీ లలో ఘోరంగా కులగజ్జి పెరుగింది. ఇది చాలా ప్రమాదకర స్థాయికి చేరుకున్నది. అగ్ర కులాలు, ముఖ్యంగా సో కాల్డ్ బ్రాహ్మణులు, ఎస్సీల మధ్య ఘోరమైన ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్నది. చాలా ఏళ్ళ కిందట విశ్వవిద్యాలయాల్లో చేరిన బ్రాహ్మణులు డీన్ లుగా, వీసీ లుగా ఎదిగారు. ఇందులో పలువురు నిజంగానే కులం ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకుని అంతేవాసులకు ఆశ్రయం (లక్షలు తెచ్చే ఉద్యోగాలు) ఇచ్చి, కులపు పిల్లలకు చేయూతనిస్తూ వచ్చారన్నది ప్రధాన ఆరోపణ. సొంత ప్రతిభతో గానీ, రిజర్వేషన్ల మూలంగా గానీ ఈ సంస్థల్లో పెద్ద సంఖ్యలో  చేరిన సో కాల్డ్ అణగారిన వర్గాల వారు, ముఖ్యంగా ఎస్సీ లు, ఈ అన్యాయాన్ని ఎదిరించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో జట్టు కట్టారు. ఇది అనేక విశ్వవిద్యాలయాల్లో, డిపార్ట్మెంట్ లలో ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. వాడు చేసాడని వీడు, వీడు చేయట్లేదా.. అని వాడు! బలయ్యేది పిల్లలు, దేశం. 

నాణ్యత కాకుండా.... ఇతరేతర సమీకరణాలను పరిగణలోకి తీసుకునే ఏ నిర్ణయమైనా... అది ఎవరు తీసుకున్నా తప్పే. ఏ కులాల వాళ్ళు ఆ కులపు బోధకులతో జట్టు కట్టడం, కుట్రలు చేయడం, అ కులపు విద్యార్ధులను మాత్రమే వారంతా ప్రోత్సహించడం...దారుణం, దేశద్రోహం. గురువులారా...మీది ఏ కులమైనా కావచ్చు. దాన్ని ఇంట్లో చక్కగా పాటించుకోండి, వ్యాపింపజేసుకోండి. ఈ పిచ్చి రాజకీయాలు, కుల పిచ్చి పక్కనబెట్టి అద్భుతమైన ఈ భారత దేశాన్ని అగ్రరాజ్యంగా మలచడంలో మీ భూమిక ఏమిటో తెలుసుకోండి. వ్యవస్థలను పటిష్ట పరిచే పనులు చేయండి, దేశ దిశానిర్దేశానికి మీ కార్తవ్యం ఏమిటో ఆలోచించండి. ఈ దేశ నిర్మాణంలో నిజమైన పాత్రధారులు, సూత్రధారులు కండి. గురువు... దేముడని మనసావాచా కర్మణా నమ్మే ఈ దేశాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి సార్.. ప్లీజ్. 

(నోట్: ఈ వ్యాసంలో వాక్యాలను బ్లాంకెట్ స్టేట్మెంట్ గా తీసుకోకండి. స్కూళ్ళలో, కాలేజీల్లో, యూనివర్శిటీ లలో మనం పైన చూసిన చెత్త అంశాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా... అత్యుత్తమ బోధనే ధ్యేయంగా భావి తరానికి స్ఫూర్తినిచ్చే మహనీయులు ఎందరో ఉన్నారు. వారందరికీ పాదాభివందనాలు, శుభాకాంక్షలు).    

3 comments:

katta jayaprakash said...

There is good,bad and ugly in every proffession including print and electronic media.Let us highlight the good on this day and try to rectIfy the bad and ugly with transformation of mindsets of teachers who are on wrong track with selfishness at the cost of the academic career of our students.
JP.

Blogger said...

సమాజంలోని ప్రతీ వృత్తీ కలుషితం అయిపోతుంది.. దీన్ని కలుషితం లేని మీడియా ఏదైనా బాధ్యత తన బుజాలపైన వేసుకుని నిర్మూలించే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ .. గురుదేవులకు అందరికీ వందనాలు

Krishna Gudelli said...

నేటి వస్తు వినియోగ సమాజంలో అందరూ డబ్బుకు , అది ఇచ్చే సుఖాలకు బానిసలు.దాని అవలక్షణాలన్నీ ఉపాధ్యాయులకు కూడా అంటాయి. అందుకే ఫ్రస్టేషన్, దండన, అమానుషం.
ఇక కుల గజ్జి యూనివర్సిటీల్లో ఉన్నదేమో గానీ మా ఉపాధ్యాయుల్లో ( అసలే లేదనను గానీ) అంతగా లేదు.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి