Monday, September 1, 2014

బాపు గారి పై భమిడిపాటి ఫణిబాబు గారి వ్యాసం

తెలుగు భాష మీద అమితమైన గౌరవంతో, సాహిత్యాభిమానంతో, మానవత్వంతో, నైతికతతో, మనస్ఫూర్తిగా రచనలు చేసే బ్లాగర్లలో భమిడిపాటి ఫణిబాబు గారు (harephala.wordpress.com) ముఖ్యులు. బాపు గారు మనకిక లేరు... అన్న వార్త తెలియగానే... నాకీ పెద్దాయన గుర్తుకు వచ్చారు. పాపం... ఈయన ఎంతగా నొచ్చుకుని ఉంటారో కదా! అనిపించింది. బాపు గారి మీద ఫణిబాబు గారు ఏమి రాస్తారో చూడాలని అనుకున్నాను. ఆ నిజమైన నివాళి కోసం ఎదురుచూస్తున్నాను. బాపు గారితో సహా తేట తెలుగు ప్రముఖులను కలిసి భాష, సంస్కృతుల తియ్యందనాలను ఆస్వాదించి, బ్లాగులో మనకు పంచడమనే మంచి పనిని పూణే లో నివసిస్తున్న ఫణిబాబు గారు చేస్తూ స్పూర్తినిస్తారు. 

బాపు గారు ఎనభై వసంతాలు పూర్తిచేసుకున్న రోజున-- గత ఏడాది డిసెంబర్ 14 న--ఫణిబాబు గారు బాపు గారి గురించి రాసిన సింపుల్ వ్యాసం నాకు నచ్చిన వ్యాసాల్లో ఒకటి.   "తెలుగువారు ప్రస్థుత వాతావరణం లో కూడా సిగ్గూ ఎగ్గూ వదిలిపెట్టేసి పరిసరాలు కూడా మర్చిపోయి మనసారా నవ్వుకోగలుగుతున్నారంటే దానికి ఒకేఒక్క కారణం మన బాపు గారే అనడంలో సందేహమేమీ లేదు..." అనే ఒక బోల్డ్ స్టేట్మెంట్ తో ఆ వ్యాసం ఆరంభమవుతుంది. 
"ఇలాటి జన్మదినాలు ఎన్నో...ఎన్నెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడిని మనసారా ప్రార్ధిస్తూ…శ్రీ బాపు గారికి.. హృదయపూర్వక శుభాకాంక్షలు"  అని ఫణిబాబు ముగించారు. కానీ విధివశాత్తూ శ్రీ బాపు మన మధ్య నుంచి వెళ్ళిపోయారు. 

ఈ సందర్భంగా ఫణిబాబు గారు రాసిన వ్యాసం ('బాపు'రే... ఎక్కణ్ణించి వస్తాయో ఆ ఆలోచనలు)  మీ కోసం దిగువన ఇస్తున్నాను. బాపు గారి గురించి అంత అద్భుతంగా మనసుకు హతుకునేలా రాసే శక్తి సామర్ధ్యాలు, అర్హతలు మాకు లేక... ఫణిబాబు గారి వ్యాసం తస్కరించి ఇస్తున్నాం తప్ప మరొకటి కాదని మనవి చేస్తున్నాం.  ఫణిబాబు గారికి కృతఙ్ఞతలు. 

తెలుగువారు ప్రస్థుత వాతావరణం లో కూడా సిగ్గూ ఎగ్గూ వదిలిపెట్టేసి పరిసరాలు కూడా మర్చిపోయి మనసారా నవ్వుకోగలుగుతున్నారంటే దానికి ఒకేఒక్క కారణం మన బాపు గారే అనడంలో సందేహమేమీ లేదు. అసలు ఆయన వేసే కార్టూన్లు చూడ్డంతోటే నవ్వొచ్చేస్తుంది. ఇంక వాటికి వ్రాసిన కాప్షన్లైతే మరీనూ. ఆ బుర్రలోకి అలాటి ఆలోచనలు ఎలా వచ్చికూర్చుంటాయో తెలియదు. ఈ టపాలో పెట్టిన ఫొటో ఎప్పుడో “హంస” పత్రిక కి ముఖచిత్రంగా వేశారు. మరి దానికి సంబంధించిన వ్యాసం కూడా చదివేయండి..మన బాపు
    తెలుగు ఆడబడుచుకి నిర్వచనం చెప్పి, తెలుగమ్మాయి ఎలాఉండాలో చూపించిన ఘనత ఆయనదే. ఓ అమ్మాయి అంటే ఓ benchmark సృష్టించి అమ్మాయంటే ఇలాగుండాలీ అని ఓ ఆర్డరు పాస్ చేసేశారు.తెలుగు ఆడబడుచుకి ముగ్ధమనోహరరూపం సృష్టించింది “ఆంధ్రసచిత్రవారపత్రిక” కి ” ముఖపత్రచిత్రం వెనక కథ ఏమిటో కూడా చదివి ఆనందించండి.
ముఖపత్ర చిత్రం
    ఆరోజుల్లో శ్రీబాపు గారు “తెలుగువెలుగు” శీర్షికతో పాటు కొన్ని కథలు చిన్నపిల్లలకోసం వ్రాసేవారు. మచ్చుకి ఓ జపనీస్ కథ ఆధారంగా వ్రాసిన కథ కూడా చదవొద్దూ మరి..అమ్మ బొమ్మ– శ్రీ బాపు
    అసలు తాము తీసిన సినిమాలమీద వ్యంగ్యాస్త్రాలు వేయడం ఎప్పుడైనా విన్నామా? మరి అదే శ్రీ బాపు గారి ఖలేజా..మా సినిమాలు-బాపు( This link may take some time to open.. please bear with me. Be patient..its worth the delay)
    అసలు ఎన్నో ఎన్నెన్నో వ్రాయాలనుకున్నాను. కానీ ఆయన గురించి వ్రాయడానికి మనకి ఓ అర్హత కూడా ఉండాలిగా. అది లేకే ఇంకెవరెవరో వ్రాసినవి మీ అందరితోనూ పంచుకుంటున్నాను.ఈ సందర్భంలోనే , శ్రీ బాపు గారి “గొప్ప మనసు” గురించి, తన అనుభవాన్ని, మా మిత్రులు శ్రీ కృష్ణమోహన్ గారి అక్షరరూపంలో ఉంచారు. చదవండి.satamanam
    అఛ్ఛా Also ran.. అని ఎప్పుడంటారో విన్నారా? ఇదిగో ఇలాటప్పుడు– ప్రముఖులకి సంబంధించిన విషయాలలో ఇంకో అర్భకుడి గురించి చెప్పాల్సొస్తే, ఇలా Also ran.. అని అంటూంటారు.ఇక్కడ ఆ అర్భకుడికి ఎటువంటి ప్రాముఖ్యతా ఉండదు ఏదో ఓ ఒక్క విషయంలో తప్పించి..అదిగో అలాటి సందర్భంలోనే నేను కూడా Also ran. గురువుగారు డిశంబరు 15 న ఎనభైయ్యో సంవత్సరం పూర్తి చేసికుంటూంటే నేను డెభైయ్యో పడిలోకి అడుగెడుతున్నాను, అది నేను చేసికున్న అదృష్టం.
    ఇలాటి జన్మదినాలు ఎన్నో..ఎన్నెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడిని మనసారా ప్రార్ధిస్తూ…
     శ్రీ బాపు గారికి
     హృదయపూర్వక శుభాకాంక్షలు

3 comments:

డా.ఆచార్య ఫణీంద్ర said...

పరమపదించె నయ్యొ మన 'బాపు ' - మహోన్నత కార్టునిస్టు; చి
త్తరువుల సృష్టిలో యశము దాల్చు మహాద్భుత శిల్పి; అక్షరాల్
పరువపు కన్నె సోయగపు వంపుల రీతి లిఖించు స్రష్టయున్;
తెర పయి తెల్గు సంస్కృతికి దృశ్య మనోజ్ఞత గూర్చు దర్శకుం
డరయ - తెలుంగు లోకమున అంద మికెట్టుల బట్ట గట్టురో!

శ్యామలీయం said...

ఆ.వె. రాత ఘనుడు రమణ గీత ఘనుడు బాపు
రాత గీత భువిని రాజ్యమేలె
రాత నిన్న చనెను గీత నేడు చనెను
రాత గీత దివిని రాజ్యమేలు

Hari Babu Suraneni said...

నాకు బాపు సినిమా లన్నింటి లోనూ స్రీనాధ కవి సార్వభౌముడు చాలా ఇష్టం.రామారావు చాలా సహజంగా నటించిన గొప్ప సినిమాల్లో ఇది నెంబర్ వన్. ముఖ్యంగా చివర్లో రాజు గారి దగ్గిర్నించి మళ్ళీ ఆహ్వానం వస్తుందని తెలిసి పాత శాలువా దులిపి వేసుకునే సన్నివేశంలో రామారావు అద్భుతంగా జీవించాడు. ఒక మహాకవి ప్రాభవాన్ని పోగొట్తుకుని బతికి చెడ్ద స్థితిలో మళ్ళీ పాతరోజులు వస్తాయేమోనని సంబర పడే సన్నివేశాన్ని దర్సకుడూ నటుదూ చాలా గొప్పగా చూపించారు.ఇద్దరూ ఇద్దరే!