Sunday, July 3, 2016

పాతికేళ్ల తర్వాత కొత్తగూడెం డిగ్రీ మిత్రుల కలయిక

జీవితంలో పావు శతాబ్దం (పాతికేళ్ళు) చిన్న లెక్క కాదు; పెద్ద విషయం. కాలేజీలో ఉన్నప్పటి అప్పటి గుర్తులు ఎప్పటికీ చాలా వరకు తీపిగానే ఉంటాయి. ఒంటి నిండా శక్తి, ఎదగాలన్న తపన, కష్టపడాలన్న స్పృహ, బుర్ర నిండా ఏవేవో ఆలోచనలు... ఉన్న రోజులల్లో  మనం చూసిన వాళ్ళను పాతికేళ్ల తర్వాత ... జీవితంలో స్థిరపడి యమ వేగంతో సంసార సాగరాన్ని ఈదుతున్న సమయంలో చూడడం, విశేషాలు పంచుకోవడం ఒక అనిర్వచనీయమైన అనుభూతి.



25 సంవత్సరాల కిందట (1989-92) ఖమ్మం జిల్లా కొత్తగూడెం లోని రామవరం లో ఉన్న శ్రీ రామచంద్రా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ లో బీ ఎస్సీ (బీ జడ్ సి) చదువుకున్న ఒక ఐదుగురం మిత్రులం ఈ రోజు హైదరాబాద్ లో కలిసాం. ఎన్నో రీ యూనియన్ల గురించి రాసిన నా మనసు... వారిని కలిసే కొన్ని నిమిషాల ముందు ఒక తీయని అనుభూతికి గురయ్యింది. కలయికకు ఒక అర్థ గంట ముందు నేను డిగ్రీ కాలేజ్ స్మృతులను అప్రయత్నంగా నెమరేసుకున్నాను. వారిని కలిసిన గంటా గంటన్నర పాటు ప్రపంచాన్ని అందరం దాదాపు మరిచి పోయాం. అప్పటి చదువులు, మిత్రులు, టీచర్ల విషయాలు గుర్తు తెచ్చుకుంటూ.. ప్రస్తుత వృత్తి, జీవిత విశేషాలు పంచుకుంటూ గడిపాము. 'ఒకరిది అతివృష్టి, మరొకరిది అనావృష్టి' అని గడ్డం బాగా పెంచిన రఫీ ని, తల మీద వెంట్రుకలు పోయిన నన్ను ఉద్దేశించి రాము అనే మిత్రుడు చేసిన వ్యాఖ్య కు మేమంతా నవ్వుకున్నాం. డిగ్రీ లో సమృద్ధిగా ఉన్న జుట్టు పోతే మరి అట్లా అనరా?

ఆ బ్యాచ్ లో ఉండగానే మనసులు కలిసి ఆ తర్వాత పెళ్లి చేసుకున్న భూషణం, అమీనా లను కలవడం చాలా ఆనందం గా అనిపించింది. "మాకు మతం పట్టింపులు లేవు. మా ఇంట్లో అన్ని పండగలు చేసుకుంటాం," అని భూషణం ఏ మాత్రం గర్వం లేకుండా చెప్పారు. భూషణం బాగా కష్టపడి చదివే తత్వం ఉన్న వ్య్తకి. మతానికి అతీతంగా జీవితాలు పంచుకుంటూ ముగ్గురు బిడ్డలకు మంచి చదువులు అందిస్తున్న వారిద్దరూ  ఆదర్శప్రాయులు.

రసాయన శాస్త్రం లో పీ హెచ్ డీ చేయడమే కాకుండా, కెనడా లో పోస్ట్ డాక్టోరల్ డిగ్రీ చేసి ప్రస్తుతం ఒక ఇంజినీరింగ్ కాలేజీ లో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ శ్రీధరాల రాము, జైళ్ల విభాగంలో ఉద్యోగం చేస్తున్న మహమ్మద్ రఫీ కూడా నా లాగానే  స్నేహామృతం లో తన్మయత్వం పొందారు. రఫీ ని నేను కలుస్తూనే ఉంటాను గానే అందరం కావడం ఇదే ప్రథమం.
ఈ రీ యూనియన్ ఆధారంగా మిగిలిన అందరు మిత్రుల సమాచారం సేకరించి.... త్వరలో అందరం తప్పక కలవాలని అనుకుంటున్నాం. మంచి స్నేహశీలురైన మిత్రులున్న మా బ్యాచ్ అది చేసి చూపిస్తారనడంలో నాకు సందేహం లేదు.
సాంకేతిక పరిజ్ఞానం పుణ్యమా అని వాట్సాప్ లో ఒక గ్రూపు ఏర్పాటు చేశారు మావాళ్లు. మా కలయికను వెంటనే మనోళ్లు పోస్ట్ చేశారు. మిగిలిన మిత్రులు అది చూసి ఆనందించారు. వాట్సాప్ లో, ఫోన్లలో అంతా చిన్న పిల్లల మాదిరిగా తమ పాతికేళ్ల ప్రయాణంలో అనుభవాలు, అనుభూతులు పంచుకోవడం గమ్మత్తు గా ఉంది.
ఏది ఏమైనా ... మిత్రత్వంలో ఉన్న ఆనందమే వేరప్పా!
అది తెలిసే కదప్పా..స్నేహితురాలిని పెళ్ళాడి అమ్మాయికి 'మైత్రేయి' అని అబ్బాయికి 'స్నేహిత్' అని పేరుపెట్టాం!!


0 comments:

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి