Saturday, March 2, 2019

మితిమీరిన రోషం...కుతితీరిన తెలకపల్లి ద్వేషం!.

'వామపక్షం... ఒక నమ్మకం' అన్న శీర్షికతో 'చెవిలో చిన్నమాట' అన్న కాలమ్ లో ఆంధ్రజ్యోతి లో ఫిబ్రవరి 24 న, ఆదివారం, కృ.తి. (కృష్ణమూర్తి తిగుళ్ల అనుకుంటా) రాసిన వ్యాసం కమ్యూనిస్టుల చెవి మెలేసి, చెంప పగలగొట్టి, గూబ గుయ్యుమనిపించేట్లు కఠినంగా ఉంది. అభిప్రాయాలను వెల్లడించే, వాదించే కాలమ్ అయినా... కమ్యూనిస్టులకు అది మింగుడు పడడం కష్టమే. అందుకే దానికి ముఖాముఖి ఖండనగా  ప్రముఖ ఎడిటర్, రాజకీయ విశ్లేషణా నిపుణుడు తెలకపల్లి రవి గారు 'నవ తెలంగాణా' లో ఒక స్పందన ప్రచురించారు.  దానికి 'కుతి తీరని ద్వేషం... మతిమాలిన హాస్యం!' అని శీర్షిక పెట్టారు.   

నిజానికి కమ్యూనిజం ఒక అద్భుతమైన సిద్ధాంతం. కార్మిక, కర్షక, బడుగు బలహీన, రైతు కూలీల కోసం పోరాటం, సమసమాజం కోసం ఆరాటం దానికి ఆలంబనలు.... సూక్ష్మంగా చెప్పుకోవాలంటే.   ప్రపంచ చరిత్రలో, అంత దాకా ఎందుకు... తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం లో, కమ్యూనిస్టుల పాత్ర మహోన్నతమైనది. ఈ సిద్దాంతం ఎందరినో ఉత్తేజ పరిచి... పెట్టుబడిదారీ వ్యవస్థ విధ్వంసకాండను, ధనిక బూర్జువా స్వామ్యపు నరహంతక దౌర్జన్యకాండలను, పెట్టుబడి దారుల పంచన రాజ్య వ్యవస్థ సాగించే విశృంఖల దమన నీతిని ఎదిరించి... బడుగుల కోసం, సామాన్యుడి కోసం పోరాడేలా చేసింది. కమ్యూనిజం అనేదే లేకపోతే... యావత్ ప్రపంచంలో సామాజిక ఆర్థిక సమతుల్యం దెబ్బతిని హింస పెరిగి యావత్ మానవజాతి కొన్ని శతాబ్దాలు వెనక్కు వెళ్ళేది. క్యూబా వంటి దేశాలు కమ్యూనిజం ఛత్రఛాయలో గణనీయమైన పురోగతినే సాధించాయి. అయితే... మార్కెట్ శక్తుల మహోధృత హోరులో కొట్టుకుపోయే తరం కమ్యూనిజానికి ఛీకొడతారన్నది, కొన్నేళ్ల తర్వాత ఈ వ్యవస్థపై ఈసడింపు, ఏవగింపు పెరిగి మళ్ళీ ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిస్టు పవనాలు వీస్తాయన్నది సిద్ధాంతంలో భాగమైన అవగాహన.    

అయితే... ఎలక్ట్రోరల్ పాలిటిక్స్  విషవలయంలో, కులం కంపులో,  ఇతరేతర జాడ్యాల రొచ్చులో పడి  తెలుగు నేల మీద కమ్యూనిస్టులు అభాసుపాలయ్యారన్నది అక్షరసత్యం. బెంగాల్, కేరళలల్లో ఎర్ర ప్రభుత్వాలు తెలుగు కామ్రేడ్ల ఛాతీ ఉబ్బేట్లు చేశాయి. బెంగాల్ లో చావుదెబ్బ తిన్నదరిమిలా సమాంతరంగా మనదగ్గర కామ్రేడ్స్ ప్రభ తగ్గడం మొదలయ్యింది. కమ్యూనిజం సిద్ధాంతాల కోసం జీవితాలను, ఆస్థులను త్యాగం చేసిన ఎందరో మహానుభావుల వారసులు కూడా మార్కెట్ శక్తుల సుడిలో చిక్కి, సంపద సృష్టి కి పిచ్చిపిచ్చి మార్గాలు ఎంచుకుంటూ  మంచి సిద్ధాంతాన్ని పలచన చేశారు. చట్టసభల్లో నాలుగైదు సీట్ల కోసం ఒక సారి ఒక పార్టీ తో, మరొక సారి మరో పార్టీతో అంటకాగి, జనాల్లో ఓటు కు పెరిగిన రేటు డిమాండ్ తట్టుకోలేక... ఇప్పుడు కమ్యూనిస్టులు చిక్కిశల్యమయ్యారు. ఇక్కడ టీ ఆర్ ఎస్ హవా కు ఎర్ర చొక్కాలు గులాబీ రూపు దాల్చాయి. 

ఈ నేపథ్యంలో అనుకుంటా... కృ.తి. కమ్యూనిస్టులను కడిగేసాడు. శబరిమల పరిణామాలు, పుల్వామా దాడి పై కామ్రేడ్స్ తీరు, సీపీఎమ్ లో వర్గపోరు, మన దగ్గర 10 టీవీ విషయంలో కామ్రేడ్స్ ధోరణి, బత్తిన సోదరుల చేప మందుపై వారి శైలి... వంటి కీలక అంశాలను అందులో ప్రస్తావించి... లెఫ్టిస్టుల గందరగోళాన్ని ఒక జోక్ రూపంలో ఏకేసి ముగించారు. 
దీనిపై తెలకపల్లి రవి గారి లాంటి పుస్తక రచయిత స్పందన తార్కికంగా ఉంటే బాగుండేది. ఆయన భాష మొరటుగా ఉండడం, అక్కసు అక్షరాల రూపంలో బైట పడడం అలా ఉంచితే... 10 టీవీ గురించి ఆయన తప్పులో కాలేసి అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. 

"టీవీ పెట్టింది... పాలక వర్గాల కుటిల రాజకీయాలు, కార్పొరేట్ దోపిళ్లపై పోరాడడానికి, ఈ పని ఐదేళ్ల పాటు బాగానే సాగింది. ఎవ్వరికీ తాకట్టు పడి తప్పుడు కథనాలు ఇవ్వలేదు," అని రవి గారు శలవిచ్చారు. రిపోర్టర్స్ కు యాడ్స్ బాధ్యతలు ఇవ్వడం తాకట్టు పడడం కాదా?  ఏ కార్పొరేట్ దోపిడీపై మీరు పోరాడారు సారూ? 

వేరే విషయాలు ఎందుకు గానీ, వందల మంది జర్నలిస్టులను ఈ కార్పొరేట్ మీడియా ఉద్యోగాల నుంచి తొలగిస్తే మీ ఛానెల్ లో, పేపర్లో ఎన్ని వార్తలు ఇచ్చారు స్వామీ? పైగా, కాస్ట్ కటింగ్ పేరిట మీరూ, జర్నలిజం ఓనమాలు తెలియని వేణుగోపాల్ రావు ఎంతమందిని ఉద్యోగాల నుంచి తొలగించి వీధులపాలు చేశారు? 
పదాల పటాటోపంతో ఇష్టమొచ్చినట్లు చెలరేగడం రవి గారి లాంటి  విజ్ఞులకు తగదు. 

(Note: A piece in muchhata.com prompted us to write this since we missed the development.) 

0 comments:

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి