Tuesday, December 6, 2011

విష్ యు ఆల్ ద బెస్ట్.....డియర్ ఫిదెల్ & సోమ్

మరీ సొంత విషయాలు బ్లాగులో రాయడమెందుకు అని అనిపిస్తుంది చాలా సార్లు. కానీ, నా సన్నిహిత మిత్రులతో కొన్ని విషయాలు పంచుకోవడానికి ఈ వేదికను వాడుకోవడంలో తప్పులేదనిపిస్తుంటుంది. పైగా ఈ బ్లాగు వల్ల...నైతికత, విలువలు వంటి అజెండాలతో పనిచేయడం వల్ల బావుకునేదేమీ లేదని బోధపడింది. ఇదివరకు తమ పత్రికాఫీసులకు సాదరంగా ఆహ్వానించిన మిత్రులు...ఇపుడు నన్ను రమ్మనడానికి భయపడుతున్నారు. పైగా ఇంకొక పీకులాట వచ్చిపడింది. ఎవడో నాది పోలిన ప్రొఫైల్ ను పెట్టుకుని దొంగపేర్లతో చెత్తరాతలు రాయడంతో వాడి దగుల్బాజీ బ్లాగులూ నేనే నడుపుతున్నానేమో కనుక్కుందామని సైబర్ క్రైం సోదరులు ఈ మధ్యన తమ కార్యాలయానికి నన్ను సాదరంగా ఆహ్వానించారు. 'ఆంధ్రజ్యోతి' రాధాకృష్ణ గారి లాగా "నాది దమ్మున్న బ్లాగు...అలాంటి దొంగచాటు వ్యవహారాలు మనం చేయం" అని చెప్పి శీల పరీక్షలో నెగ్గివచ్చాను. ఈ కార్యక్రమం కారణంగా బ్లాగు మీద, కొందరు మిత్రులని అనుకున్న వారి మీద మనసు విరిగినా...ఒక మంచి విషయాన్ని మీ అందరితో పంచుకోవాలని ఈ పోస్టు రాస్తున్నాను. నా సొంత సొద కాబట్టి...ఆసక్తిలేని వారు ఇక్కడే ఆపేసి మీ పనిచూసుకోగలరు.

"టేబుల్ టెన్నిస్ లో ఫిదెల్ ఎక్కడిదాకా వచ్చాడు?" "వాడి గురించి రాయడం లేదేమిటి?" అని నేను అభిమానించే మిత్రులు అడుగుతూ వస్తున్నారు కాబట్టి...ఈ పోస్టు రాయక తప్పడం లేదు. పదకొండేళ్లు నిండిన ఫిదెల్ ఈ ఏడాది నా అంచనాలకు తగినట్లు కష్టపడుతున్నాడు. కాశ్మీర్ (నార్త్ జోన్), బెంగాల్ (ఈస్ట్ జోన్), మహారాష్ట్ర (వెస్ట్ జోన్), గుజరాత్ (సెంట్రల్ జోన్) లలో జరిగిన జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని కేడెట్ క్యాటగిరీలో ప్రతిసారీ క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్నాడు. గాంధీధామ్ లో జరిగిన పోటీల్లో సెమీ ఫైనల్ కు వెళ్లే అవకాశం జేజారింది. ఈ ప్రతిభ వల్ల మనవాడు ఇప్పడు ఇండియా నెంబర్..5 అయ్యాడు. గత పుష్కరకాలంలో ఇంత నిలకడగా రాణించి ఆ స్థాయికి చేరుకున్న మగధీరుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవ్వరూ లేరని ఒక మిత్రుడు చెప్పాడు. అది నిజమో కాదో మనకు తెలియదు. కానీ...సొంతగా నవీన్ నగర్లో ఒక అకాడమీ (గ్లోబల్ టేబుల్ టెన్నిస్ అకాడమీ)ని పెట్టుకోవడం...అదృష్టవశాత్తూ....బాగా కష్టపడే సోమ్ నాథ్ ఘోష్ అనే కమిటెడ్ బెంగాల్ కోచ్ ఫిదెల్ కు కోచింగ్ ఇవ్వడం, నా సన్నిహిత మిత్రుడు రాందాస్ భరతన్ ల వల్ల ఇది జరిగింది. వారిద్దరికీ ఫిదెల్, నేను రుణపడి ఉంటాము.


ఫిదెల్ కేడెట్ క్యాటగిరీ (అండర్ 12) లోనే కాకుండా సబ్ జూనియర్ క్యాటగిరీ (అండర్ 14) లో కూడా రాణిస్తున్నాడు. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 2 వరకూ లాల్ బహదూర్ స్టేడియం లో జరిగిన స్టేట్ ఛాంపియన్ షిప్ లో ఫిదెల్ చక్కని ప్రతిభ కనబరిచాడు. కేడెట్ విభాగంలో అద్భుతంగా ఆడి స్టేట్ ఛాంపియన్ అయ్యాడు. సబ్ జూనియర్ క్యాటగిరీ సెమీ ఫైనల్లో ప్రస్తుతం ఛాంపియన్ అయిన హరికృష్ణ పై ౩-1 లీడ్ లో ఉండి ఒత్తిడికి గురై పోగొట్టుకుని మరొక టైటిల్ కొట్టే అద్భుత అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. అది ఓడిపోయాక చాలా సేపు బాధపడ్డాడు. అప్పుడు నా ఫిలాసఫీ నూరి పోశాను: "ఫిదె...మనం నేర్చుకోవాల్సిన పాఠం విజయంలో కన్నా అపజయంలోనే ఎక్కువ ఉంటుంది. నువ్వు బాగా ఆడావు...బాధపడాల్సిన పనిలేదు..." 


బాగా ఆడటం వల్ల కేడెట్ విభాగంలో రాష్ట్ర జట్టుకు కెప్టెన్ అయ్యాడు. సబ్ జూనియర్ విభాగంలో స్టేట్ టీం లో రెండో స్థానంలో ఉన్నాడు. సబ్ జూనియర్ కన్నా పెద్దదైన జూనియర్ క్యాటగిరీలో ఐదో స్థానంలో నిలిచాడు. ఇది మామూలు విషయం కాదు. అంతేకాకుండా...హైదరాబాద్ జిల్లా తరఫున ఆడి జట్టు విజయానికి దోహదపడ్డాడు. ఇవన్నీ నాకు, హేమకు చాలా చాలా  తృప్తినిచ్చాయి. తను పడిన కష్టానికి ప్రతిఫలం ఇది. స్టేట్ ఛాంపియన్ షిప్ లో మన వాడి ప్రతిభ నచ్చి ఒక క్రీడాభిమాని తనకు ఒక బంగారు ఉంగరం బహూకరించడం విశేషం. 


చదువూ సంధ్యా మానేసి ఫిదెల్ ఇన్ని చోట్ల తిరిగి టోర్నమెంట్లు ఆడటానికి భారతీయ విద్యాభవన్ ప్రిన్సిపల్ రమాదేవి మేడమ్, తన క్లాస్ టీచర్ కామేశ్వరి మేడమ్ అందిస్తున్న సహకారం మరువలేనిది. కేవలం ఫిదెల్ క్రీడా ప్రతిభను చూసి రమాదేవి మేడమ్ అకడమిక్ ఇయర్ మధ్యలో సీటిచ్చారు. స్వయానా అధ్లెట్ కావడం వల్ల కామేశ్వరి మేడమ్ కు తల్లి తండ్రులు పడే బాధలు బాగా తెలుసు. ఆమె ప్రతిసారీ...పేరుకు పోయిన పిల్లవాడి హోం వర్క్ గురించి కాకుండా...హేమను నన్ను అభినందిస్తుంటారు. అదొక అదృష్టం.

సరే...ఇంత సహకరిస్తున్న స్కూలుకు...గెలిచిన కప్పులు, మెడల్స్ తీసుకుపోరా నాయనా...టీచర్స్ సంతోషిస్తారంటే ఫిదెల్ కు నచ్చదు. "యహ్...ఇది (అలా ప్రదర్శన చేయడం) అవసరమా?" అని ప్రశ్నిస్తాడు. అదీ నిజమే కానీ అన్నేసి రోజులు బడి ఎగ్గొడుతున్నందుకు ఇలాంటి పని చేస్తే...టీచర్లు ఆనందిస్తారని నా నమ్మకం.



అలా మొన్న శనివారం నాడు (డిసెంబర్ 3 న) ప్రిన్సిపాల్ గారికి ఫోన్ చేసి హడావుడిగా మొన్న వచ్చిన మూడు కప్పులు, మెడల్స్ తీసుకుని వెళ్లాం. వారణాసిలో జరిగిన CBSE జాతీయ స్థాయి పోటీలలో తన స్కూలు రెండో స్థానం పొందడంలో ఫిదెల్ పాత్ర ఏమిటో రమాదేవి మేడమ్ కు తెలుసు. కాబట్టి...అసెంబ్లీలో మనవాడిని పొగడ్తలతో ముంచెత్తారామె.
"స్నేహిత్ (ఫిదేల్ రఫీక్ స్నేహిత్ ) ఎవరో మీకు తెలుసా?" అని ఆమె అడిగినప్పడు..."స్నేహిత్ లాగా కావాలని మీలో ఎందరు కోరుకుంటున్నారు?" అని అడిగినప్పుడు పిల్లల స్పందన చూస్తే....కళ్లు చెమ్మగిల్లాయి. మనవాడి గురించి టీచర్స్ అంతా మంచి మాటలు చెప్పారు. పీ ఈ టీ సహా అక్కడి టీచర్లంతా వాడిని పొగుడుతుంటే ఒక పక్క పుత్రోత్సాహం కలిగినా లోపల భయమేసింది..ఎక్కడ పొగరు పెరుగుతుందో అని. ఇక నంబర్ వన్ కావాలని వారంతా అభినందించారు. చిన్న పిల్లలు వచ్చి నిండు మనసుతో ఫిదెల్ ను కలిసి కంగ్రాట్స్ చెబుతుంటే ముచ్చటగా అనిపించింది.   
ఫిదెల్ కు వచ్చిన ఉంగరాన్ని తాను ధరించి...జోక్ చేస్తున్న రమాదేవి మేడమ్ ను, రమాదేవి, కామేశ్వరి మేడమ్ లతో నేను హేమ ఫిదెల్ దిగిన ఫొటోలను ఇక్కడ మీరు చూడవచ్చు. రమాదేవి మేడమ్ ఎప్పడూ అలాగే నవ్వుతుంటారు. అదీ అలా జరిగింది...మన స్కూలు పర్యటన.

కొసమెరుపు...అదే శనివారం సాయంత్రం అనంతపురం జిల్లా కదిరి నుంచి వచ్చిన ఫోన్ నన్ను మరింత ఆనందపరిచింది. జీటీటీఏ లో కేవలం మూడు నెలల కిందటనే ఆడటం ఆరంభించిన మా అమ్మాయి మైత్రేయి గుజరాత్ లో త్వరలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయింది. గత నెలలో కరీంనగర్ లో జరిగిన పోటీల్లో గోల్డ్ మెడల్ పొందిన హైదరాబాద్ జట్టు సభ్యురాలైన మైత్రేయి....లాల్ బహదూర్ స్టేడియంలో ఇంటర్ మీడియట్ పిల్లల కోసం నిర్వహించిన పోటీలలో మూడో స్థానం పొందింది. ఆ రోజు పుత్రోత్సాహం, పుత్రికోత్సాహం కలిగిన నేను ఈ ఆనంద ఘడియలను మీతో పంచుకోకుండా ఎలా ఉండగలను? జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనేందుకు కాసేపట్లో (డిసెంబర్ 6) కొచ్చిన్ వెళుతున్న ఫిదెల్ కు, టీం కోచ్ గా వెళుతున్న సోమ్ కు మీరూ అభినందనలు తెలపండి. థాంక్స్.    

8 comments:

జ్యోతి said...

పిల్లలిద్దరికి, అమ్మానాన్నలకు కూడా మన:పూర్వక అభినందనలు..

SRAVAN BABU said...

I feel Happy for you Ramu garu!

nareshnunna said...

Like father, like son :-)
Like father, like daughter too :-) :-)

Sudha Rani Pantula said...

రాముగారు,
చాలా చాలా సంతోషంగా అనిపించింది..ఇది మీకు పర్సనల్ విషయం కావచ్చునేమో కాని కొందరు తల్లిదండ్రుల ఆటిట్యూడ్ మారడానికి ఇటువంటి పోస్టులు ఉపయోగపడతాయి. పుత్రోత్సాహం మీకు దినదిన ప్రవర్థమానం కావాలని అది ఆకాశం అంత ఎత్తుకు పోవాలని కోరుకుంటున్నాను. ఎంతసేపూ, ఐఐటీకి వెళ్తాడా, కోచింగ్ కి వెళ్తున్నాడా, ఏ రాంక్ లో ఉన్నాడు ఈ ప్రశ్నలతో చెవులు తుప్పట్టి పోయాయి. మరో రకమైన లైఫ్ కూడా ఉందని వారికోసం ఆలోచిస్తున్నందుకు మీతోపాటు , ఆ స్కూల్ ప్రిన్సిపాల్ గారు రమాదేవిగారిని కూడా అభినందిస్తున్నాను.

sunita said...

Congrats and best wishes to your son!

vin vin properties said...

Congrats Fidel and Maitreyi.

సైబర్ క్రైం సోదరులు సాదరంగా ఆహ్వానించారా లేక తమదైన శైలిలో విచారించారా ??? ... Just Kidding.

Ramu S said...

పిలుపు వచ్చినందుకు ముందు నేను విచారించా. విచారణ అయ్యాక..అయ్యో పాపం...అని వారు విచారించి ఉంటారని నేను అనుకుంటున్నాను. నికార్సయిన జర్నలిస్టుల విషయంలో వారు తమ దైన శైలి వాడరని నా నమ్మకం. ఒకవేళ వాడితే... మన ఖర్మ... అని కూర్చునే పిరికవాడినైతే...ఈ జర్నలిజం లోకి ఎందుకొస్తా? ఈ బ్లాగు ఎందుకు నిర్వహిస్తా?
సత్యమేవజయతే.
రాము

vin vin properties said...

its really serious issue.

If the cyber crime dept cant identify the True culprits and troubles innocents what would be the fate of Indian Netizens once the Central govenrment's Web monitoring programme ( Kapil Sibal's ) comes in to effect ??

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి