Thursday, January 5, 2012

రోజంతా మౌనవ్రతం...నిశ్శబ్దం తో ప్రయోగం

గడిచిన ఏడాది చాలా సార్లు నేను ఆలోచించిన విషయాల్లో...మౌనవ్రతం ఒకటి. దొంగ మాటలు, చెడు ఆలోచనలు, అబద్ధాలు, కుళ్ళు, కుట్ర, స్వార్ధం వంటివి వంటబట్టించుకున్న మనుషులతో రోజూ మాట్లాడి విసుగు వచ్చింది. చాలా మందివి  డ్రామా మాటలే. మనసులో మాటలు మాట్లాడే వారు బహు అరుదు. కులం, మతం, డబ్బూ దస్కం వంటి కోణాల నుంచే సంభాషణలు. వేరే వాడి మీద ఏడవడం, ఇతరులను తిట్టడం, మన గురించి డబ్బా కొట్టుకోవడం తప్ప సంభాషణల్లో పస లేదు, పాడూ లేదు. తర్కానికి విలువే లేదు. విలువల గురించి తపించేవాడు , సమాజంలో మన పాత్ర మనం నిర్వర్తించాలని చిత్తశుద్ధితో అనుకునేవాడు కరువయ్యాడు. నీతి లేదు. అంతా మోసగాళ్ళు, గోముఖ వ్యాఘ్రాలు. దురహంకారం, పచ్చిస్వార్థం వీరి నరాల్లో పారుతున్నాయి. వీరితో సంభాషణ, సంబంధం పసలేని సుత్తి వ్యవహారం లా మారింది. దీని కోసం మనం సమయం, శక్తి వినియోగించడం వేస్ట్ కార్యక్రమం అని నేను బలంగా నమ్ముతున్నాను. 

ఇంట్లో వాళ్ళు, మంచి మిత్రులు కొందరు తప్ప బైట 98 శాతం మందితో అనవసరంగా మాట్లాడుతున్నామన్న ఫీలింగ్ నన్ను బాగా వెంటాడుతున్నది. నేను ఎంతో అద్భుతమని అనుకున్న ఒక సీనియర్ జర్నలిస్టు చెబుతున్న అబద్ధాలు, చేస్తున్న దొంగ వ్యవహారాలూ, అమానుష ధోరణి చూసాక ఇంకా జ్ఞానోదయమయ్యింది. పైగా నిశ్శబ్దం విలువ తెలుసుకోలేక పోతున్నామన్న బాధ వెంటాడుతున్నది. రెండు నాల్కలతో బతికే బతుకూ ఒక బతుకేనా అని అనిపిస్తున్నది. 


అందుకే...నెలకు ఒక్క రోజైనా మౌన వ్రతం పాటిస్తే బాగుటుందని హేమ తో అంటూ వస్తున్నాను. ఆ పని చేయడానికి ఈ రోజు (గురువారం) ఉత్తమమని మనసుకు తోచింది. అది పాటిస్తున్నాను. సైలెన్స్ కు సంబంధించి నిన్న రాత్రి నెట్ లో చాలా మెటీరియల్ చదివాను. నా నిర్ణయం మంచిదే అని బోధపడింది.

ఉదయం నుంచి ఇప్పటి వరకూ ఒక మూడు గంటలు ఇంట్లో ఎలాంటి ఆటంకం లేకుండా మౌనం సాగింది. మనసుకు  హాయిగా వుంది. ఫిదేల్ ను ఒక టోర్నమెంట్ దగ్గర దింపి ఆఫీసు కు వెళ్ళాలి. అక్కడ ఎలాంటి ఇబ్బందీ ఉండక పోవచ్చు. ఒక విజిటర్ ఉన్నారు. ఆయనతో ముక్తసరిగా పేపర్ మీద సంభాషణ జరిపి పంపాలని అనుకుంటున్నాను. 


ప్రతి నెలా ఐదో తారీఖు విధిగా మౌన వ్రతం పాటించాలని ప్రస్తుతానికి అనుకుంటున్నాను. ఉదయం ఆరు గంటల నుంచి మర్నాడు ఆరుగంటల వరకూ (అంటే ఒక ఇరవై నాలుగు గంటలు) ప్రతి నెలా ఇది సాగించాలని సంకల్పం. నా మౌనం అనుభవాలను పూసగుచ్చినట్లు మీతో పంచుకుంటాను. మొన్న జనవరి ఫస్టు కు నలభై ఏళ్ళు నిండిన నేను 2012 సంవత్సరం వైకుంఠ ఏకాదశి రోజున, అదీ ఐదో తేదీ నాడు మౌనవ్రతం మొదలు పెట్టాను. గాంధీ గారు ఇచ్చిన ప్రేరణ ఇందులో లేకపోలేదు. It is an experiment with silence. 

8 comments:

వనజ వనమాలి said...

మీరు వ్రాసుకున్న పై రెండు పేరాలు.. నా మనసులో ఉన్న మాటలు. అదే భావన. మౌన వ్రతం చాలా మంచిదండి. మీ అనుభవాలు చెప్పండి.

Anonymous said...

చాన్నాళ్ళుగా నేను ఇదే అనుకుంటున్నాను. మీ అనుభవాలు రేపు మాతో పంచుకోవడం మరిచిపోకండి.

కాముధ

Anonymous said...

మౌనం పాటించటం పూర్తిగా మీ ఇస్టం. శ్రమ ద్వారా మానవుడికి దక్కిన అద్భుతమైన స్వరాన్ని మూసి పెట్టటం భావ్యం కాదనుకుంటాను. మీ అనుభవం చదవాలని ఆశపడుతున్నాను,
కావూరి

ఎస్పీ జగదీష్ said...

తప్పకుండానండి.. మంచి నిర్ణయం... నేనూ మీ బాటలో నడవాలనుకుంటున్నాను. మీ అనుభవాలు తెలియచెయ్యండి..

buddha murali said...

మీరు వ్యక్తం చేసిన అభిప్రాయాల గురించి, మౌనం గురించి మరింత ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే ఓషో రజనీష్ తెలుగు అనువాదం జీవిత రహస్యాలు చదవండి

evadaite enti said...

silence means not only shut the mouth..total thoughts..thought provoking experiences..its a mean of meditation..so dont share your experiences here..because that thought ( now i am feeling like this..like that..so i will post my feelings on the blog..and some one may comment like this and that) forces you..and put under pressure..and threw you towards facing much noise in your mind..go on your mounavrata with an empty space in mind..

శరత్ 'కాలమ్' said...

మీరు వర్ణించినటువంటి ప్రపంచంతో మాట్లాడటమే కాదు అసలు ఆ లోకంలో వుండటమే అనవసరం అని కొందరు పెసిమిస్టులు భావిస్తుంటారు. ఆత్మహత్యలు పాల్పడేవారు కొందరు అలాగే సమర్ధించుకుంటుంటారు.

మౌనం ఉత్తమ భాష. కానివ్వండి. మీ ప్రయోగాలు మాకు తెలియజేస్తూ వుండండి.

Ramu S said...

ఎవడైతే ఏంటి గారూ...
రాతకు సంబంధించి అంత ఒత్తిడి ఏమీ లేదండీ. ఎందుకంటే...మామూలుగా మాట్టాడుతూనే కావలసిన సమాచారాన్ని నిక్షిప్తం చేసుకోవడానికి ఒక మెకానిజమ్ అబ్బింది...20 ఏళ్ల జర్నలిజం వల్ల. మీరన్నట్టు మౌనాన్ని ఒక మెడిటేషన్ లాగా చేయడం మంచిది కానీ ఒక్కసారిగా ఆ స్టేజికి వెళితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయనిపించింది. ఒకదశలో మీరన్నట్లు చేయడం పెద్ద కష్టమేమీ కాదు...
థాంక్స్...
రాము