Wednesday, June 20, 2012

పక్షం రోజుల బెంగాల్ పర్యటన విశేషాలు


శ్చిమ బెంగాల్ పేరెత్తగానే....కమ్యూనిస్టుల కంచుకోట అని, విప్లవం పురిటిగడ్డ అని అనిపిస్తుంది. ఒకప్పుడు నాకు అది ఆరాధ్య రాష్ట్రం. ఆ ఎర్రకోటను మమతా బెనర్జీ కూల్చేశారు, విప్లవ యోధులను ఆమె కాల్చేస్తున్నారు. బెంగాల్ పరిణామాలను చూసి...కమ్యూనిజం శకం ముగిసిందని చాలా మంది అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బెంగాల్లో ఏమి జరుగుతున్నది? అక్కడ ఇక కామ్రేడ్ల శకం ముగిసినట్లేనా? పరిశ్రమలు లేకుండా ఈ రాష్ట్రం ఎలా బతుకుతున్నది? వంటి అంశాలను స్థానికులతో చర్చించే అవకాశం కలిగింది...జూన్ మొదటి రెండు వారాలలో. 

మా గ్లోబల్ టేబుల్ టెన్నిస్ అకాడెమీ (జీ.టీ.టీ.ఏ.) లో ఆడుతున్న ఆరుగురు మెరికల్లాంటి పిల్లలకు బెంగాల్లో రెండు వారాల పాటు శిక్షణ ఇప్పించేందుకు...నేను, కోచ్ సోమనాథ్ ఘోష్ వెళ్ళాము. మాతో పాటు అకాడమీ జాయింట్ సెక్రటరీ బాలసూరి శంకర్, ఆయన భార్య మాధవీలత వచ్చారు. ఒక గాస్ పొయ్యి తీసుకుని నేనే...పిల్లలకు వండి పెట్టవచ్చని మొదట్లో అనుకున్నాను. కానీ...అది తప్పుడు అవగాహన, చారిత్రిక తప్పిదమని అక్కడి దారుణమైన వాతావరణాన్ని చూశాక తెలిసింది. ఒక ఐదు రోజుల పాటు ఉండేందుకు....శంకర్ దంపతులు వచ్చారు. కానీ...పదిహేను రోజుల పాటు మాతో వుండిపోయారు...పిల్లలకు భోజన వసతి కోసం. ఎన్నో అవాంతరాల మధ్య టూరు చక్కగా సాగింది. 

పోయేటప్పుడు రైల్లో సద్ది పప్పును, మధ్యలో వచ్చిన చక్కటి లిచీలను మోతాదుకు మించి లాగించి...కడుపు నొప్పి, విరోచనాలతో కలకత్తా నగరంలో అడుగు పెట్టాను. మా బృందం లక్ష్యం... 24 పరగణాల జిల్లా లోని నైహటి లో వున్న  రిషి బంకిం యూత్ అసోసియేషన్ వారి టీ.టీ.క్లబ్ లో ఆడేందుకు. కలకత్తా నుంచి రెండు గంటల పాటు ప్రయాణించాలి అక్కడకు చేరాలంటే. ఆ క్లబ్ చీఫ్ కోచ్ మిహిర్ ఘోష్ మార్చి లో మా ఆహ్వానం మేరకు హైదరాబాద్ వచ్చి వెళ్ళారు. ఆయన ఆహ్వానం మేరకు ఆ క్లబ్ కు వెళ్ళాము. ముందుగా...కోల్ కట  లో  మా కోచ్ సోమనాథ్ ఇంట్లో ఒక రెండు రోజులు ఉన్నాము. వారి ఆతిధ్యం మరిచిపోలేనిది. ఆయన పరిచయం చేసిన కమ్యూనిస్టు లీడర్ ఒకాయనతో సుదీర్ఘంగా మాట్లాడాను. మమత మీద కమ్యూనిస్టులు మహా కోపం తో ఉన్నారనీ... జనం మాత్రం కమ్యూనిస్టుల మీద ఇంకా కోపంగా ఉన్నారని నాకు బోధపడింది. 

ఇన్నేళ్ళ పాటు...బెంగాల్ లో పరిశ్రమలు లేకుండా చేయడం కమ్యూనిస్టులు చేసిన తప్పిదం కాదా? అన్నది నా ప్రశ్న. దాన్ని అంగీకరిస్తూనే....అక్కడ భూసేకరణ ఎంత కష్టమో ఆ నాయకుడు చెప్పారు. నందిగ్రామ్, సింగూర్ లను హాండిల్ చేయడంలో ఎర్ర సర్కార్ విఫలం కావడం మమతకు కలిసివచ్చిందని పలువురు చెప్పారు. అయితే...మమతలో వారు ఒక యోధురాలిని చూస్తున్నారు. మరొక సారి ఎన్నికలు వచ్చినా దీదీ నెగ్గుకు వస్తారని అర్థమయ్యింది. ఎందుకంటే...కమ్యూనిస్టులు చేసిన గూండాగిరీ నే తృణమూల్ కార్యకర్తలు ఇప్పుడు చేస్తున్నారని, మమత బలగం లో చాలా మంది మాజీ కామ్రేడ్లని ఒక బెంగాలి విశ్లేషించారు. నాకు బెంగాలీలు చాలా సౌమ్యంగా అనిపించారు. తలపొగరు గిత్తలు అక్కడ పెద్దగా కనిపించలేదు. రాష్ట్ర రాజధాని లో వున్న బార్ లో ఉండీలేనట్లు వున్న జనాలను చూస్తే ఆశ్చర్యమేసింది. ఇక అక్కడి ఎండ తాకిడికి తట్టుకోవడం మా వల్ల కాలేదు. హుమిడిటీ వల్ల తడిసి ముద్దయ్యాం. భానుడి ప్రతాపానికి అక్కడి రోడ్ల మీద వెళుతున్న వారు వెళుతున్నట్లు కొందరు మరణించారు. అందుకే...ఏ.సీ.గది దాటి బైటికి రాలేదు. రాష్ట్ర సమాచార మంత్రిగా పనిచేసి ఇప్పడు కలకత్తా విశ్వ విద్యాలయంలో జర్నలిజం బోధిస్తున్న ఒక ప్రొఫెసర్ తో ఫోన్ లో మాట్లాడాను. కానీ...ఆయన్ను కలవడం కుదరలేదు.  ఆయన్ను కలిస్తే మరింత సమాచారం దొరికేది. అక్కడి మీడియా రాజకీయ పోకడల మీద బ్లాగు కోసం వ్యాసం రాయాలన్న నా ప్రయత్నం ఫలించలేదు. 

నైహటి లో మాకు చౌకగా దొరకాల్సిన బస దొరకలేదు. చివరి నిమిషం లో అది రద్దయ్యింది. అందుకే...అక్కడికి పది కిలోమీటర్ల దూరంలోని శ్యాం నగర్ లో ప్రభుత్వ గెస్ట్ హౌజ్ ను అద్దెకు తీసుకున్నాం. అలా జరగడం నిజంగా మా అదృష్టం. మా విడిది పక్కన...రెండు వందల ఏళ్ళనాటి కాళీ మాత ఆలయం ఉంది. ఎదురుగా...అంత వేసవి లోనూ...హాయిగా పారుతున్న గంగా నది కనుచూపు మేర కనిపిస్తున్నది. ఆ గంగ పెద్ద మురికిగా లేదు. ఒక పూట ఒక దిశలో మరొక పూట మరొక దిశలో అది పారుతున్నట్లు మాకు అనిపించింది. వచ్చీ రాని హిందీ లో మూగ సైగలతో మా శంకర్ మొత్తం వ్యవహారాన్ని చక్క పెట్టాడు. మర్నాడు సాయంత్రం కల్లా...మా వంటలు మేము వండుకునే ఏర్పాటు జరిగింది. పూర్తిగా కొత్తదైన ఆ ప్రాంతంలో...పిల్లలకు మాకు శంకర్ దంపతులు రోజూ ఆంధ్రా భోజనం వండి పెట్టారు. మా కోసం వారు పడిన శ్రమ మరువలేనిది.  

ఉదయం...సాయంత్రం...పిల్లలను ఆ మండే ఎండలో నైహటి కి లోకల్ రైల్లో తీసుకువెళ్ళడం నా పని. టికెట్ కొనాల్సిన పనిలేదని పలువురు వారించినా....రోజూ క్యూలో నిల్చుని పిల్లలకు నాకు రైలు టికెట్స్ కొన్నాను. చాలా మంది టికెట్స్ లేకుండా వెళ్తారట. అక్కడి లావుపాటి బియ్యం వల్ల నా పొట్ట డబలయ్యింది. వీలు దొరికినప్పుడల్లా...గంగ నుంచి వస్తున్న వాటర్తో షవర్ బాత్ చేస్తే గానీ...ప్రాణం కుదుట పడలేదు. అక్కడి రాజకీయా గురించి తెలుసుకోవాలన్న సంకల్పంతో స్థానిక ఎం.ఎల్.ఏ. అర్జున్ సింగ్ (తృణమూల్) ఆఫీసుకు వెళ్లి ఆయన్ను కలిసాను. భాట్పర మునిసిపాలిటి ఛైర్మన్ కూడా అయిన ఆయన ప్రజలతో కలిసి పనిచేస్తున్నాడు. ఇక్కడి నుంచి తీసుకు వెళ్ళిన కరాచీ బేకరీ బిస్కట్ పాక్ ఒకటి ఇచ్చాను. 'మా విడిది కి వచ్చి దక్షిణాది భోజనం రుంచి చూడ కూడదూ..." అని మాట వరసకు అంతే...మర్నాడు రాత్రి డిన్నర్ కు వచ్చాడు. ప్రజల కోసం పనిచేయడమే విజయానికి మార్గమని, దీదీ  కి మంచి భవిత ఉండని చెప్పాడు. మా అమ్మ ఇచ్చిన గోంగూర పచ్చడి, మాధవీలత గారు వండిన చికెన్, బైటి నుంచి తెచ్చిన చేపల తో మంచి భోజనం పెట్టాం. మా అకాడమీ ట్రెజరర్ రేఖా రామ్దోస్ గారు కూడా వంటలో పాలు పంచుకుని మంచి చెన్నై సాంబార్ వడ్డించారు.  ఒక గంట పాటు ఆయన మాతో గడిపాడు. 

నైహటీ లో ఒకటే ఉక్కపోత. పిల్లలు ప్రాక్టిస్ సెషన్ కు కనీసం నాలుగు టీ షర్టులు మార్చుకునే వారు. అందుకే...నేను, కోచ్ సోమనాథ్ పూనుకుని బాత్రూం లో కూర్చుని రోజూ ఒక పాతిక ముఫై టీ షర్టులు ఉతికి ఆరేసే వాళ్ళం. కోచింగ్ క్యాంపులో అంతర్జాతీయ జాతీయ క్రీడాకారులతో ఆడే అవకాశం మాకు కలిగింది. పేదలను ఆదరించి ఆట నేర్పే నైహటి టీ.టీ.అకాడమీ లో సౌకర్యాలు పెద్దగా లేవు. అయినా అక్కడి నుంచి చాలా మంది నాణ్యమైన క్రీడాకారులు తయారయ్యారు. అందుకు కారణం...మిహిర్ ఘోష్ గారు. మన ఆంధ్రా కోచులకు భిన్నంగా ఆయన నయా పైసా ఆశించకుండా రోజుకు నాలుగు గంటల పాటు రైల్లో ప్రయాణించి వస్తూ పోతూ పిల్లలకు ఆట నేర్పుతున్నారు...గత పద్దెనిమిది ఏళ్ళుగా.  తాగుడుకు, వ్యర్ధ ప్రసంగాలకు, డబ్బుకు బానిసలైన కోచులకు మిహిర్ ఘోష్ ఒక గుణపాఠం.        

మిహిర్ ఘోష్ శిక్షణలో రాటు తేలుతున్న డాలీ అనే ఒక అమ్మాయిని మేము కలిసాము. చిన్నతనం లోనే తల్లిని కోల్పోయింది. రొండో పెళ్లి చేసుకుని తండ్రి వెళ్ళిపోతే...అక్కడి కాలనీ ప్రజల సహకారంతో అమ్మమ్మ ఆ పాపను పెంచుతున్నది. మేము రెండు రోజుల్లో వస్తామనగా ఆమె బర్త్ డే వచ్చింది. వెంటనే...మా కోచ్ సోమనాథ్ తన కోసం ఒక కేక్ ఆర్డర్ చేసి...అక్కడి పిల్లల సమక్షంలో కట్ చేయించాడు. బెంగాల్ కాడేట్, సబ్ జూనియర్ విభాగాలలో చాంపియన్ అయిన ఆ పాపకు ఒక ఐదు వందలు ఇచ్చి డ్రస్ కొనుక్కోమన్నాను. వద్దు అంటున్న డాలీ కళ్ళల్లో నీళ్ళు సుళ్ళు తిరిగాయి. "నువ్వు...నా కూతురు లాంటి దానివి...తీసుకో..." అని అన్నాను. భారత టేబుల్ టెన్నిస్ యవనిక మీద భావి ఆణిముత్యం డాలీ. డాలీ కే కాదు...నాకూ నాతో పాటు వున్న బృందానికి ఈ పక్షం రోజుల పర్యటన ఒక మధురానుభూతి. 

3 comments:

MARICHIKA said...

AYYA Ramu garu.. blog peremo "ap media kaburlu" ani pettaru.. appudappudu media viseshalu, eppuduu mee sonta viseshalu rastunnaru. Mee sonta dabbaku vere blog pettukuni.. ee blogni mediaku ankitam chestarani bhavistunna...
... your regular Reader
Rajesh

Ramu S said...

అయ్యా...రాజేష్ గారూ...
నమస్తే...
పేరు అలా ఉంది కానీ...నేను క్రమం తప్పకుండా నా సొంత డబ్బా వేసుకుంటాను. కొన్ని విషయాలు రికార్డు అయి పడి ఉండడానికి, వివిధ అంశాలపై నా జర్నలిస్టు మిత్రులతో నా భావాలు పంచుకోవడానికి నా బ్లాగు మంచి ఫోరం అని భావిస్తున్నాను. కేవలం మీడియా గురించే నేను రాయాలని మీరు కోరుకోకండి. అలా అనుకునేట్లయితే...ఈ బ్లాగును సందర్శించి మీ అమూల్యమైన సమయం పాడుచేసుకోకండి.
థాంక్స్
రాము

uttam said...

Sir, ramu garu exlent answer