Monday, March 11, 2013

కూడబలుక్కుని మాట్లాడుతున్న పెసింగి భాస్కర్

మిత్రులారా... మీతో ఒక మంచి వార్తను పంచుకోవడానికి ఈ పోస్టు రాస్తున్నాను. ఈనాడు, ఈ-టీ వీ, టీ వీ -ఫైవ్, జెమిని టీ వీ లలో పదిహేను ఏళ్ళకు పైగా పనిచేసి చివరకు డెక్కన్ క్రానికల్ విజయవాడ రిపోర్టర్ ఉండగా 2009 జులై లో పెరాలిసిస్ స్ట్రోక్ తో జీవన నావ తలకిందులైన సీనియర్ జర్నలిస్టు పెసింగి భాస్కర్ క్రమంగా బాగా కోలుకుంటున్నారు. కుడి చెయ్యి, కాలూ స్వాధీనం లోకి రాకపోయినా... ఆయన కూడబలుక్కుని మాట్లాడుతున్నారు. స్ట్రోక్ వల్ల జ్ఞాపకశక్తి పోయిన ఆయన ఇప్పుడిప్పుడే మేధో పరంగా కోలుకుంటున్నారు.  కొందరు మిత్రులు, కొన్ని సంఘటనలు ఆయనకు గుర్తుకు వస్తున్నాయి.

విధి వక్రించిన ఆ రోజున ఆయన డీ సీ కోర్టు కేసు కోసం చెన్నై వెళ్లారు. అక్కడ పని చూసుకుని రైల్వే స్టేషన్ కు వచ్చారు. అక్కడ స్పృహ తప్పి పడిపోయి ఉండగా రైల్వే పోలీసులు గమనించారు. "అక్కడ అన్నం తిన్నాను. ఆ తర్వాత ఏమి జరిగిందో నాకు తెలియదు. ఒక నెలపాటు ఏమి జరిగాయో నాకు తెలియదు," అని ఒక గంట క్రితం నాతో మాట్లాడుతూ భాస్కర్ చెప్పారు. సంభాషణలో సరైన పదాలు వాడడం కోసం ఆయన కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఇంగ్లిష్ పేపర్లు బాగా కూడబలుక్కుని చదువుతున్నారు. కుడి చేయి దెబ్బ తినడం తో ఎడమ చేత్తో రాత ప్రాక్టిస్ చేస్తున్నారు. అక్షరాలు  ముత్యాల్లా  ఉన్నాయి. దటీజ్ భాస్కర్ సార్. 

నా లెక్క ప్రకారం మరొక పది, పన్నెండు నెలల్లో ఆయన పూర్తిగా కోలుకుంటారు. "నాకు ఏదో ఒకటి చేయాలన్న ఆరాటం ఉంది. ఆరాటం గా ఉంది," అని భాస్కర్ గారు అన్నారు. కొందరు మిత్రులు ఆయనకు బాగా గుర్తున్నారు. ఇద్దరం కలిసి సినిమా కు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. 
గల గలా మాట్లాడే భాస్కర్ గారిని అలా చూడడం బాధగా ఉన్నా ఆయన మనో నిబ్బరం, మేడం గారి ధైర్యం నాకు స్ఫూర్తిదాయకంగా అనిపించాయి. 

జర్నలిజంలో శిక్షణ పొంది ఈనాడు లో కొన్నేళ్ళు పనిచేసిన మేడం గారు ఇప్పుడు టీచర్ గా పనిచేస్తున్నారు. భాస్కర్ గారికి ఇలా కావడంతో వారి కుటుంబం ఒక్కసారిగా కుంగిపోయింది. హైదరాబాద్ లో ఉన్న ఫ్లాట్ అమ్మేయాల్సివచ్చింది. జర్నలిస్టు కాలనీ స్థలం కూడా ఖర్చుల ముందు నిలవ లేదు. మేడం గారి రెక్కల కష్టం మీద కుటుంబం నడుస్తున్నది. "చాలా మంది కన్నా మేము అదృష్టవంతులం సార్. మందులు, గాడ్ బ్లెస్సింగ్స్ వల్ల తొందరగా కోలుకుంటున్నారు," అని మేడం చెప్పారు. ఆమె గుండె ధైర్యానికి జోహార్లు. 

'మరి డీ సీ సహకరించలేదా?,' అని నేను భాస్కర్ గారిని అడిగాను. 'వాళ్ళు ఒక ఏడాది పాటు జీతం ఇచ్చారు. ఉద్యోగులతో పాటు ఫస్టున జీతం ఇచ్చారు' అని ఆయన చెప్పారు. ఆ తర్వాత రాజీనామా చేయమని చెప్పినట్లు మేడం తెలిపారు. తనను 'ఆంధ్రభూమి'లో  అప్లై చేయమని పరీక్ష కూడా పెట్టారట. పరీక్ష బాగా రాసారని చెబుతూనే... ఖాళీలు ఉన్నప్పుడు పిలుస్తామని చెప్పి పంపారట. అక్కడున్న శాస్త్రి గారు, బ్యూరో చీఫ్ కృష్ణారావు గారు పట్టించుకుంటారా?

ఇవ్వాళ భాస్కర్ గారిని కలవడం గమ్మత్తు గా జరిగింది. నిన్న నా మౌనవ్రతం. కొందరు ముఖ్యులతో సహా ఏ నర మానవుడు ఫోన్ చేసినా ఎత్తలేదు. కానీ భాస్కర్ గారి నంబర్ నుంచి రావడం తో వ్రతాన్ని గట్టున పెట్టి వెంటనే కాల్ తీసుకున్నాను. సార్ కాస్త స్పష్టంగా మాట్లాడే సరికి చాలా ఆనందమేసింది. రేపు వచ్చి మిమ్మల్ని కలుస్తాను... అని చెప్పాను. ఆ ప్రకారం ఇవ్వాళ వెళ్లి కలిశాను. ఈ కుటుంబానికి శుభం కలుగు గాక! 

ఆయనతో కలిసి పని చేసిన సీనియర్ మిత్రులు ఇప్పుడు టీ వీ నైన్, సాక్షి, ఈ టీ వీ లలో పెద్ద హోదాల్లో ఉన్నారు. వీరు బిజీ బీస్, బిగ్ పే పాక్స్. మనిషి బాగున్నప్పుడు హడావుడి చేయడం కాదు బ్రదర్స్... ఇలాంటి సమయంలో భాస్కర్ గారిని కలిసి మనోధైర్యం ఇవ్వండి. ఒట్టు... ఆయన మిమ్మల్ని జాబ్ అడగరు, డబ్బులు అడగరు. 
  
భాస్కర్ గారి గురించి నేను గతంలో రాసిన పోస్టు లింకు కోసం ఇక్కడ ప్రెస్ చేయండి. 

2 comments:

rammy said...

i know bhaskar working in eenadu karimnagar. i want his mobile number can u post his number

Ramesh eenadu

mediabillboard said...

అన్నగారు..కొంచెం భాస్కర్ గారి ఫొటో ఇస్తారా..?
కొందరు నాలాంటి మాజీ ఈనాడులకు గుర్తుకు వస్తారని...
ప్లీజ్..