Tuesday, March 5, 2013

సచిన్...సచిన్... సచిన్...

'క్రికెట్ మ్యాచ్ చూస్తావా'...అంటూ ఒక జర్నలిస్టు మిత్రుడు మొన్న రెండు కాంప్లిమెంటరీ టికెట్స్ ఇచ్చాడు. భారత్- ఆస్ట్రేలియా టెస్టు మ్యాచుకు మనం పొయ్యేది లేదని వాటిని వేరే మిత్రుడికి ఇచ్చాను. కానీ నిన్న రాత్రి ఒక ఐడియా వచ్చింది. మళ్ళీ సచిన్ టెండూల్కర్ హైదరాబాద్ లో ఆడతాడో లేదో? దేవదేవుడిగా భవిష్యత్తులో జనం చెప్పుకునే ఆటగాడిని దగ్గరి నుంచి చూసే భాగ్యాన్ని వదులుకోవడం తెలివితక్కువ తనం కాదా? అన్న సందేహాలు తెలెత్తాయి.  

టెస్టు మూడో రోజున కచ్చితంగా సచిన్ బాటింగ్ చేస్తాడన్నా గట్ ఫీలింగ్ కలిగింది క్రీడాభిమానులమయిన నాకు, నాపుత్ర రత్నానికి. ఇంకేం...మేము టికెట్లు సమర్పించిన మిత్రుడికి ఫోన్ చేశాను ఉన్నపళంగా. 'బాసూ నువ్వు వెళుతున్నావా?' అని అడిగాను. 'సెలవు లేదు...ఎవరికైనా సమర్పించి మంచి పేరు కొట్టెస్తాను..' అని చెబితే... 'బాబ్బాబు... ఆ పని మాత్రం చేయకు...చివరకు నేను, ఫిదెల్  వెళుతున్నాము..' అని వెళ్లి టికెట్స్ తెచ్చాను. 

ఈ మ్యాచు కవరేజ్ కోసం హేమ రోజూ వెళుతున్నది. నా రెండు దశాబ్దాల జర్నలిజం జీవితంలో ఒక్క ఇంటర్ నేషనల్ మ్యాచ్ అయినా కవర్ చేయాలన్న కల నెరవేరలేదు. ఇలా మ్యాచులు చూడడం తప్ప. నేను, మా వాడు పొద్దున్నే ఎనిమిది కల్లా పొట్ట నిండా తిని (అక్కడ పిజాలు, సమోసాలు, పఫ్ఫులు తప్ప ఏమీ దొరకవని తెలిసి) తొమ్మిదిన్నర కల్లా ఉప్పల్ స్టేడియం చేరుకున్నాం. 

ముందస్తుగా హేమ ఇచ్చిన సమాచారం మేరకు సెల్ ఫోన్లు ఇంట్లోనే పడేసి పోతూ పోతూ... కూర్చొని హాయిగా తినడానికని మాకు ఇష్టమైన చాక్లెట్లు కొనుక్కుని వెళ్లాం. చెకింగ్ పాయింట్లో వాళ్ళు ఆపారు. 'చాక్లెట్లు తిని లోపలకు రండి... ఏమీ తీసుకు పోనివ్వం' అని చెప్పారు మొహమాటం లేకుండా. 'పిల్లవాడి నైనా చాక్లెట్ తీసుకు రానివ్వండి...' అని మొత్తుకున్నా లాభం లేకపోయింది. మా చాక్లెట్లను విమానాశ్రయం లో బరువు ఎక్కువైతే విధి లేక పక్కన పారేసినట్లు పారేయడం ఇష్టం లేక..అక్కడే డ్యూటీ లో ఉన్న పోలీసు కు ప్రేమగా ఇచ్చాను. 

స్టేడియంలోకి ఏమీ తీసుకుపోనివ్వకపోవడం ఒక వ్యాపారపు ఎత్తుగడ. మన చాక్లెట్ మనలను చీకనివ్వకుండా...వాడు నియంత్రించేవి మాత్రమే మనం తినాలి... తూడ్త్. స్టేడియం బైట మన బట్టలు (లోదుస్తులు సహా) విప్పి.... వాడిచ్చే బట్టలతో లోపలికి  వెళ్లి మ్యాచ్ చూడాలన్న రూలు అతి త్వరలో వస్తుందన్న  అనుమానం పెనుభూతం అయ్యేలోపు పుజారా డబుల్ సెంచరీ చేశాడు. నేనూ ఆటలో నిమగ్నమయ్యాను.  

బాధ కలిగించిన విషయం ఏమిటంటే... సచిన్ ఆట చూడడం కోసం... మురళీ విజయ్ తొందరగా అవుట్ కావాలని స్టేడియం లో అంతా భావించడం. ఇదేమి ముదనస్టపు ఆలోచనో నాకు అర్థం కాలేదు. అప్పటికే 'సచిన్...సచిన్..' అని అరవడం ఆరంభించారు. మురళీ విజయ్ కి వ్యతిరేకంగా కంగారూలు ఎల్.బీ. కోసం అరిస్తే... మన క్రీడాభిమానులు 'హౌ ఈజ్ ఇట్ అంపైర్' అని ఆస్త్రేలియన్లతో గళం కలిపారు. వీళ్ళ హంగామా చూసి మా వాడు తలకాయ కొట్టుకున్నాడు. మధ్యలో ఒక 180 పెట్టి అదేదో డామినోస్ పిజా తిన్నాడు. నేనూ ఇలాగే ఆ చాక్లెట్ తినాలనుకున్నాను. లోపల చాక్లెట్స్ అమ్మరు.   సచిన్ కానీ, ధోనీ కానీ భారీ సిక్సర్ కొట్టాలనీ, అది నేరుగా తన వైపు వస్తే...తాను దాన్ని కాచ్ పట్టాలని ఉందని మా వాడు రెండు సార్లు చెప్పాడు. చిన్నప్పుడు నాకూ అదే ఆలోచన ఉండేది.  

వీళ్ళ ఏడుపు కొట్టి...ఒక రాంగ్  షాట్ కొట్టి మురళీ విజయ్ అవుట్ అయ్యాడు. జనం ఆనందించారు, వారి ఆరాధ్య దైవం సచిన్ వచ్చాడు. స్టేడియం హర్షాతిరేకాలతో దద్దరిల్లింది. జనం ఆనందానికి అవధులు లేవు. మాబ్ సైకాలజీ లో చిక్కుకున్న నాకూ సంతోషమేసింది...పొట్టి సచిన్ ను చూడగానే. భలే బాగున్నాడు. చక్కని ఆటగాడు. అంతకన్నా ముఖ్యంగా పొగరూ అహంకారం లేని మనిషని అంటారు. 

సచిన్ మోర ఎత్తగానే...అటువైపు స్టాండ్ లో ఉన్నవాళ్ళు ఆనందం తో కేకలు వేసారు. ఇటు చూడగానే... ఇటు వైపు కూర్చున్న వాళ్ళు లేచి నిలబడి కేరింతలు కొట్టారు. ఎటు చూసినా సచిన్ నామస్మరణే. ఇంత చేస్తే... మొత్తం మీద అర్థగంటలో ఒకే ఒక్క ఫోర్ కొట్టి సచిన్ అవుటై వెళ్ళిపోయాడు. జనం ఉస్సూరుమన్నారు. సచిన్ వీలు దొరికినప్పుడల్లా ఈ పై ఫోటో లో మాదిరిగా నిలబడడం... తోటి బ్యాట్స్ మెన్  భుజం తట్టి ప్రోత్సహించడం గమనించాను. 

మన జనం క్రికెట్ పిచ్చను చూసి నా మతి పోయింది. లంచ్ బ్రేక్ సమయంలో ఆస్ట్రేలియా కోచ్ లు రిజర్వ్ ఆటగాళ్లకు క్యాచ్ ల ప్రాక్టిస్ చేయించారు. వాళ్ళు బౌండరీ లైన్ దగ్గర చక్కని క్యాచ్ పట్టినా... అక్కడ ప్రాక్టిస్ లో భాగంగా ఉంచిన రబ్బర్ స్టంపును వాళ్ళు గురితప్పకుండా కొట్టినా.... సీరియస్ మ్యాచులో కొట్టినట్లు డబ్బిడి దిబ్బిడి చప్పట్లు కొట్టారు మన వాళ్ళు.

క్రికెట్ బాగుంటుందా... నువ్వు ఆడుతున్న టేబుల్ టెన్నిస్ బాగుంటుందా... అని మధ్యలో అడిగాను మా వాడిని. "టీ టీ నాకు ఇష్టం... క్రికెట్ కూడా ఇష్టమే..." అని ఆగాడు. మళ్ళీ తానే చెప్పాడు... "... క్రికెట్ లో అయితే మనీ ఎక్కువ ఉంటుంది..." అని. పన్నెండేళ్ళ ప్రాయంలో ఎంత జ్ఞానం అబ్బిందో! అని నవ్వాలో...మైదానంలో కన్నా డ్రాయింగ్ రూంలో బహు సుందరంగా క్రికెట్ మ్యాచులను, విశ్లేషణలను తెస్తూ ప్రజల పరిజ్ఞానాన్ని ఇంతలా పెంచుతున్న ఇడియట్ బాక్సు ను చూసి ఏడవాలో తెలియలేదు.  
Photo courtesy: Nareshsiva, Flickr

1 comments:

Sudhakar said...

it only shows us how much selfish our people are...deeply mudanashtapu thoughts !

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి