Friday, September 12, 2014

'ఈనాడు'కు గట్టి షాక్-ఉద్యోగులకు పెద్ద ఊరట

*రంగంలోకి దిగిన తెలంగాణ లేబర్ కమిషన్ 
*బలవంతపు రాజీనామాలు చెల్లవని స్పష్టీకరణ
*వేజ్ బోర్డ్ సిఫార్సులు అమలు చేయాల్సిందేనని ఆదేశం

*బలవంతపు రాజీనామాలు నేరమని హెచ్చరిక
*70 మంది బాధిత ఉద్యోగుల సాక్ష్యం  
*"రామోజీ చేయమంటే ఇలా చేస్తున్నారా?" అని ప్రశ్న 

మీడియా చేతిలో ఉంది కదాని ఇష్టమొచ్చినట్లు ఉద్యోగులను పీకిపారేయవచ్చని అనుకున్న 'ఈనాడు' యాజమాన్యానికి తెలంగాణా ప్రభుత్వం పరోక్షంగా గట్టి షాక్ ఇచ్చింది. తమను ఉద్యోగాల నుంచి నిర్దాక్షిణ్యంగా బలవంతంగా పీకేసారని హోం మంత్రి నాయని నరసింహా రెడ్డి గారికి ప్రాసెస్ సెక్షన్ ఉద్యోగులు చేసిన ఫిర్యాదుకు స్పందిస్తూ లేబర్ కమిషనర్ శుక్రవారం నిర్వహించిన కీలక సమావేశంలో 'ఈనాడు' కు చుక్కెదురు అయ్యింది.

'ఈనాడు' చరిత్రలోనే మొట్టమొదట సారిగా... దాదాపు 70 మంది పదవీచ్యుత ఉద్యోగులు లేబర్ కమిషనర్ ముందు హాజరై తమ గోడు వెళ్లబోసుకున్నారు. అప్పారావు గారు సహా ఐదుగురు యాజమాన్య ప్రతినిధుల సమక్షంలో ఈ పంచాయితీ జరిగింది. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరున్నర వరకు ఈ సమావేశం ఆసక్తికరంగా జరిగింది. పిచ్చ పిచ్చ కారణాలతో యాజమాన్యం ఉద్యోగం నుంచి పీకేస్తే దద్దమ్మల్లాగా ఏడుస్తూ ఇంకో ఉద్యోగం చేసుకోవడం, చస్తూ బతకడం అలవాటైన తెలుగు జర్నలిస్టులకు ఈ శ్రామిక జీవులు ఎంతో స్ఫూర్తినిచ్చారు.    

"జనాలకు నీతులు చెప్పే వాళ్ళే ఇలా బెదిరించి రాజీనామాలు తీసుకుంటారా?" అని కమిషనర్ మానేజ్మెంట్ ప్రతినిధులను ప్రశ్నించినట్లు సమాచారం. వివిధ జిల్లా నుంచి వచ్చిన ఉద్యోగులు తమను ఎలా వుద్యోగం నుంచి తొలగించినదీ చెప్పారు. ఈ బలవంతపు రాజీనామాలు చెల్లవని ఆయన స్పష్టం చేసారు. ఒక ప్రశ్నకు సమాధానంగా... "ఇలా రాజీనామాలు తీసుకోవాలని మాకు మానేజ్ మెంట్ చెప్పింది," అని అప్పారావు బృందం చెప్పినట్లు తెలుస్తోంది. 'మానేజ్ మెంట్ అంటే రామోజీ రావు గారా? అని కూడా అడిగారు. "దానికి సమాధానంగా... మానేజ్ మెంట్ అని మాత్రమే చెప్పి తప్పించుకున్నారు," అని సాక్షుల్లో ఒకరు ఈ బ్లాగుకు చెప్పారు.

'ఈ రాజీనామాలు చెల్లవు. ఇలా హెరాస్ చేస్తే మాకు ఫిర్యాదు చేయవచ్చు," అని కూడా కమిషనర్ చెప్పారట. సాధ్యమైనంత త్వరగా వేజ్ బోర్డ్ సిఫార్సులు అమలు చేయాలని, ఆ తర్వాతనే 'గోల్డెన్ హ్యాండ్ షేక్' (స్వచ్ఛంద పదవీ విరమణ గురించి ప్రతిపాదించాలని కూడా హితవు పలికారు.
ఉద్యోగులు ఎక్కువైనందునే తొలగించాల్సి వస్తుందని అప్పారావు బృందం చెప్పినపుడు... అలాంటప్పుడు డిప్యుటేషన్ కింద వివిధ ప్రాంతాల నుంచి ఎందుకు తెచ్చారన్న ప్రశ్న కూడా ఎదురయ్యిందట. మెషిన్, ప్రాసెస్, పాకింగ్, సెక్యూరిటీ విభాగాల నుంచి దాదాపు ఏడువందల మందిని బలవంతంగా తొలగించినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో 'ఈనాడు' లో శ్మశాన వైరాగ్యం నెలకొంది. సీనియర్లు తీరని మనోవేదన అనుభవిస్తూ పనిచేస్తున్నారు... గత నెలన్నరగా.  
"ఇది ఒక అద్భుత విజయం. ఇప్పుడు జర్నలిస్టులను, ముఖ్యంగా సీనియర్లను, పెద్ద ఎత్తున ఇళ్ళకు పంపాలన్న యాజమాన్యం ప్లాన్ కు గండి పడినట్లే. అయితే... చట్టాలను ధిక్కరించే వారి ఎత్తుగడలు ఎలాగైనా ఉండవచ్చు, ఎవరినైనా మానేజ్ చేసే సత్తా వారికి ఉంది" అని ఒక బాధిత ఉద్యోగి అన్నారు. అది నిజమే. 
ఉద్యోగాలు పోతాయని, పోతే ఎలా? ఇదేమి దారుణం? అని ఇంటా బైటా ఏడ్చిమొత్తుకునే ఉద్యోగులు... ఎవరో తోడు వస్తారని... ఏదో మేలు చేస్తారని... భ్రమలు పెట్టుకోకుండా... అర్జెంటుగా ఏకం కావాలి. హక్కులు తెలుసుకోవడం, వాటికోసం పోరాడటం తక్షణావసరమని గ్రహించాలి. ఈ కార్మికుల ఐక్యతకు ఇంతకు మించిన అవకాశం రాదని 'ఈనాడు' ఉద్యోగులు గ్రహించి సంఘటితం అయితే వాళ్ళకే మంచిది.

3 comments:

sai krishna alapati said...

Sir ,
Telamgana government rendu channels ban chesindi kada , meru dani gurunchi emi cheppa ledu.

litho said...

నిoజగా ఇది గొప్ప విజయం. తెలుగు మీఢియ వారికి వoధనములు

Gayam said...

లేబర్ కమీషన్ మాటలు, నోటీసులు చెత్త బుట్టలోకి వెళ్లాయి

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి