Saturday, February 13, 2016

అరుణ్ సాగర్ గారికి ఘన వీడ్కోలు

అరుణ్ సాగర్ గారి అంత్యక్రియలు మిత్రులు, బంధువుల అశృ నియనాల మధ్య నిన్న (ఫిబ్రవరి 12, 2016) సాయంత్రం నార్నే రోడ్ లో ఉన్న 'మహా ప్రస్థానం'లో జరిగాయి. ముందుగా... ఎర్రగడ్డ లో అని, తర్వాత పంజాగుట్ట (ఒక ఛానెల్ లో వచ్చింది) అనుకుని తర్వాత ఫిల్మ్ నగర్ లోని ఈ అధునాతన శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి.

ఈ తుది వీడ్కోలు లో టీవీ -5 ఛైర్మన్ బీ ఆర్ నాయుడు, టీవీ-9 సీ ఈ ఓ రవి ప్రకాష్, మహా న్యూస్ ఎడిటర్ వెంకట్రావు, 10 టీవీ ఎం డీ వేణుగోపాల్, ఎక్స్ ప్రెస్ టీవీ హెడ్ దినేష్ ఆకుల, సీనియర్ రచయిత-నటుడు తనికెళ్ళ భరణి,  ఎడిటర్లు శ్రీనివాస్ (ఆంధ్ర జ్యోతి), కట్టా శేఖర్ రెడ్డి (నమస్తే తెలంగాణా), ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ తదితరులుపాల్గొన్నారు. పలువురు ఎడిటర్లు, చాలా మంది సీనియర్ జర్నలిస్టులు అరుణ్ సాగర్ గారి నివాసానికి వచ్చి అంతిమ నివాళి అర్పించారు. సాగర్ గారి మిత్రులు సీతారాం గారి లాంటి వాళ్ళు ఖమ్మం తదితర ప్రాంతాల నుంచి వచ్చారు. ఇది సాగర్ గారు చివరిగా అప్ డేట్ చేసిన వారి ఫేస్ బుక్ పేజీ.



ఉన్నా పోయినా పట్టించుకోని అమానుష యాజమాన్యాలు ఛానల్స్ నడుపుతున్న ఈ రోజుల్లో అరుణ్ సాగర్ గారి పట్ల టీవీ -5 యాజమాన్యం చూపిన సంస్కారం అభినందనీయం. శ్రేయ బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్ నాయుడు గారి చొరవ వల్ల భౌతికకాయాన్ని టీవీ-5 ఆఫీసు దగ్గరకు తీసుకువచ్చి అక్కడి నుంచి 'మహా ప్రస్థానం'దగ్గరకు ఊరేగింపు గా  తెచ్చారు. ఈ మధ్య కాలంలో ఏ సీనియర్ ఎడిటర్ కు దక్కని విధంగా అరుణ్ సాగర్ గారికి  అంతిమ వీడ్కోలు లభించింది. అందుకు ఆయన అర్హుడు.

అయితే...అనుకోకూడదు కానీ... మనోళ్ళ క్రమశిక్షణ లేమి అంతిమ సంస్కారం దగ్గర బాగా కనిపించింది. ఒక ముగ్గురు నలుగురు వీడియో గ్రాఫర్లు భౌతిక కాయం చుట్టూ చేరారు. ప్రశాంతంగా నివాళి అర్పించకుండా...హడావుడి చేసారు. వాటర్ బాటిల్స్ రాగానే కొంపలారిపోస్తున్నట్లు ప్రముఖ యాంకర్లు ఎగబడడం బాగోలేదు. నిజంగా వారు దాహార్తి తో ఉండి వుంటారు..

మనల్ను వీడి వెళ్ళిన మనిషి మనకు మిగిల్చిన జ్ఞాపకాలను, అనుభూతులను, విలువలను గుర్తు చేసుకుంటూ వీడ్కోలు పలకాల్సిన సమయంలో కాస్త ప్రశాంత పాటిస్తే బాగుండేది బ్రదర్స్!

0 comments:

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి